Pages

Thursday, 31 May 2012

రామాయణం @ కధ -76


అటుపక్క లంకలో మంత్రులతో కూర్చుని దీనంగా తల దించుకుని రావణుడు ఉన్నాడు. అప్పుడాయన వాళ్ళతో " జెరగకూడని పని జెరిగిపోయింది. నేను సీతని అపహరించిన విషయం మీ అందరికి తెలుసు కదా. రాముడు నా మీదకి యుద్ధానికి వస్తున్నాడు. నిన్న హనుమంతుడు ఒక్కడే వచ్చి ఈ లంకా పట్టణాన్ని ఎంత పీడించాడొ మీరు చూశారు. ఈ మాట చెప్పడానికి నాకు చాలా సిగ్గుగా ఉంది. రాముడు సముద్ర తీరానికి వచ్చేశాడు, ఎలాగోలా సముద్రాన్ని దాటుతాడు (తన గూఢచారుల వల్ల రాముడు సముద్ర తీరానికి వచ్చాడని రావణుడు తెలుసుకున్నాడు). అప్పుడు మనం రామలక్ష్మణులతోవానరములతో యుద్ధం చెయ్యాల్సి ఉంటుంది. మీరందరూ కలిసికట్టుగా నాకు ఒక ఆలోచన చెప్పండి. మంత్రులందరూ ఎకాభిప్రాయంగా చెప్పిన మాట, ఉత్తమమైన మాటమంత్రులు తమలో తాము విభేదించుకుని, తమ విభేదాలు పక్కకి పెట్టి కలిసి ఒక్కటిగా చెప్పిన మాట, మధ్యమమైన మాట. మంత్రులు విడిపోయి, ఎవరిమానన వాళ్ళు తలోమాట చెబితే, అది అధమమైన మాట. అందుకని నాకు ఒక మంచి మాట చెప్పండి " అన్నాడు.


అప్పుడా మంత్రులన్నారు " ప్రభు! మీరు దేనికింత బెంగ పెట్టుకుంటున్నారు. మీరు ఒకనాడు హిమాలయాలలో ఉన్న మీ అన్న కుబేరుడితో యుద్ధం చేసి, ఆయనని ఓడించి పుష్పక విమానం ఎత్తుకొచ్చారు. ఆయన ఉన్న ఇంట్లో నుంచి ఆయనని తరిమేసి ఈ లంకా పట్టణాన్ని మీదిగా స్వాధీనం చేసుకున్నారు. నీ చెల్లెలైన కుంభీనస యొక్క భర్త అయిన మధువుని ఓడించి అక్కడి నుంచి తెచ్చుకోవలసిన వస్తువులన్నీ తెచ్చుకున్నారు. పాతాళ లోకంలోకి వెళ్ళి అక్కడున్న నాగులనితక్షకి, జటి మొదలైన వాళ్ళని ఓడించి అపారమైన కీర్తి గడించారు. అక్కడి నుంచి దేవలోకానికి వెళ్ళి దేవేంద్రుడిని ఓడించారు. తరువాత యమలోకానికి వెళ్ళి యముడిని ఓడించారు, యముడు మిమ్మల్ని చూసి పారిపోయాడు. ఇంతమందిని కొట్టిన మీరు ఎందుకు భయపడుతున్నారు. మీ దెగ్గర ఇంద్రజిత్ ఉన్నాడు, ఇంద్రజిత్ ముందు ఆ రాజకుమారులు ఎంత " అన్నారు.

ఇంతలో మంత్రులలో ఒకడైన ప్రహస్తుడు లేచి " రావణ! నువ్వు భయపడవద్దు, నేను ఒక్కడిని యుద్ధానికి వెళితే చాలు. ఆ రామలక్ష్మణులిద్దరిని సంహరించి వస్తాను. నిన్నటి రోజున ప్రమత్తంగా ఉండడం వలన ఆ వానరాన్ని పట్టుకోలేకపోయాము " అన్నాడు.

అప్పుడు దుర్ముఖుడు అనే మంత్రి అక్కడికి రక్తంతో తడిసిన పరిఘని పట్టుకొచ్చి " నేను ఒక్కడినే వెళ్ళి ఈ పరిఘతో వాళ్ళని కొట్టి వచ్చేస్తాను " అన్నాడు.

అప్పుడు వజ్రదంష్ట్రుడు " రాముడిని మోసం చేసి గెలిచే ఒక గొప్ప ప్రణాలిక నీకు చెబుతాను. మన దెగ్గర కామరూపులైన రాక్షసులు ఉన్నారు. వాళ్ళందరినీ భరతుడి సైన్యంలా రూపం మార్చమని చెప్పి రాముడి దెగ్గరికి పంపి ' అయోధ్యలో ముఖ్యమైన పని వచ్చింది, భరతుడు చాలా కష్టంలో ఉన్నాడు, అందుకని నిన్ను తొందరగా రమ్మన్నాడు ' అని రాముడితో చెబుతారు. భరతుడి మీద ఉన్న ప్రేమ చేత రాముడు వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు. ఆ సమయంలో మన సైన్యం సముద్రాన్ని దాటి రాముడిని కొట్టేస్తుంది, అప్పుడు వానరులందరూ దిక్కులు పట్టి పారిపోతారు. మీరు అనుజ్ఞ ఇవ్వండి, ఒక్క నిమిషంలో వెళ్ళిపోతాము " అన్నాడు. 

అప్పుడు నికుంభుడు(కుంభకర్ణుడి కుమారుడు) అన్నాడు " దీనికింత మోసం ఎందుకు, నేను వెళ్ళి వాళ్ళని చంపేసి, రామలక్ష్మణులని తినేసి వస్తాను " అన్నాడు.


అప్పుడు విభీషణుడు " 3 విషయాలున్న శత్రువు విషయంలోనే యుద్ధానికి సిద్ధపడాలి. ఆ రాజు ఏమర పాటుతో ఉంటె యుద్ధానికి వెళ్ళడం తేలిక, మరొక శత్రువుతో పీడింపబడుతున్న రాజు మీదకి వెళ్ళడం తేలిక, దైవము ప్రతికూలంగా ఉన్న రాజుమీదకి వెళ్ళడం తేలిక. ఈ మూడు లోపాలు ఉన్న రాజు మీదకి దండయాత్ర చెయ్యడం తేలిక. కాని, మీరందరూ రాముడిని చంపేస్తాము, కొట్టేస్తాము అని ఎగురుతున్నారే, రాముడంటె అంత చేతకాని వాడిలా కనపడుతున్నాడ. రాముడు ఇవ్వాళ యుద్ధానికి వచ్చాడు, అప్రమత్తుడై ఉన్నాడు, దైవము ఆయన పట్ల అనుకూలించి ఉంది. మీరు భరతుడి సైన్యం వేషాలు కట్టుకొని వెళితే తెలుసుకోలేనంత మూర్ఖుడు కాదు. నదులకు(తూర్పు దిక్కుకి ప్రవహించేవాటిని నదులు అంటారు), నదములకు(పశ్చిమ దిక్కుకి ప్రవహించేవాటిని నదములు అంటారు) భర్త అయిన సముద్రాన్ని దాటి ఈవలి ఒడ్డుకి నిన్న హనుమ వచ్చి లంకా పట్టణం అంతటినీ కాల్చేశారు. మరి నిన్న మీరు హనుమని ఎందుకు పట్టుకోలేకపోయారు? ఇన్ని కోట్లమంది ఇక్కడికి వచ్చినవాడిని పట్టుకోలేకపోయారు. మీరందరూ ఇవ్వాళ ప్రభువు దెగ్గర నిలబడి నేను కొట్టేస్తాను, నేను చంపేస్తాను, నేను తినేస్తాను అంటున్నారు. ఇవి మంత్రులు చెప్పవలసిన మాటలేనా? మీ మాటలకి ఆలోచన కాని, విచక్షణ కాని ఉందా. యుద్ధానికి వెళ్ళేముందు శత్రుసైన్యం యొక్క బలం ఎంత ఉంది అని జాగ్రత్తగ అంచనా వెయ్యాలి. అందులో పక్షపాత బుద్ధి ఉండకూడదు. శత్రువుకి మనకన్నా ఎక్కువ బలం ఉంటె వేరొక మార్గాన్ని ఆలోచించాలి, శత్రువు కన్నా మనకే ఎక్కువ బలం ఉంటె, ఆనాడు యుద్ధానికి వెళ్ళాలి. అసలు శత్రువు బలం ఏమిటో, ఎంత మంది వస్తున్నారో, ఎవరు ఎటువంటి వారో మీరు అంచనా వేశార?

మీరు ఒక్కసారి ఆలోచించండి, రాముడు యుద్ధానికి రావలసిన అవసరం ఏమిటి? రాముడి భార్య అయిన సీతమ్మని మా అన్న రావణుడు ఎత్తుకొచ్చి అశోక వనంలో పెట్టాడు. అందుకని రాముడు తన భార్యని విడిపించుకోవడానికని యుద్ధానికి వస్తున్నాడు. ధర్మం రాముడి పట్ల ఉంది, ధర్మం ఎక్కడుంటె దేవతలు అక్కడ ఉంటారు, కావున దేవతల అనుగ్రహం రాముడికి ఉంటుంది. మీరు రాముడి మీదకి యుద్ధానికి వెళదామని ఎలా అనుకుంటున్నారు. ఏ రకంగా చూసినా రాముడిదే పైచేయి. లంకకి, రాక్షసులకి, రావణుడికి ఉపద్రవం రాకూడదు అనుకుంటె, ఏ సీతమ్మ కారణంగా ఇటువంటి కలహం వస్తోందో, ఆ సీతమ్మని రాముడికి అప్పగిస్తే రాముడు యుద్ధానికి రాడు. తప్పు చేసింది మనం, ఆ తప్పుని సమర్ధించుకోడానికి ఇన్ని కోట్ల మందిని ఫణంగా పెట్టడం మంచిది కాదు. నా మాట విని సీతమ్మని ఇచ్చెయ్యండి " అన్నాడు.

విభీషణుడు చెప్పిన మంచి మాటలు చెవికి ఎక్కని రావణుడు తన మంత్రులని ఆ సభ నుండి వెళ్ళమని చెప్పి, తాను కూడా వెళ్ళిపోయాడు. 


విభీషణుడు మరునాడు ఉదయం రావణుడు ఉన్న గృహానికి వెళ్ళాడు. అక్కడ కొన్ని వేల మంది స్త్రీలు ఉన్నారు, బ్రాహ్మణులు స్వస్తి వాచకాలు చెబుతున్నారు, పూజలు, అగ్నికార్యాలు జెరుగుతున్నాయి. రావణుడు ఒక మంచి తల్పం మీద కూర్చుని ఉండగా విభీషణుడు అక్కడికి తల వంచి నమస్కరిస్తూ వెళ్ళి " అన్నయ్య! నిన్న నీకు సభలో కొన్ని విషయాలు చెబుతుంటే వెళ్ళిపోయావు కదా. నీకు కొన్ని విషయాలు ఆంతరముగా చెబుదాము అనుకున్నాను. ఎందుకంటే, ఈ విషయాలు లంకలో అందరికీ తెలుసు. నీ మంత్రులకి కూడా తెలుసు. కాని నీకు భయపడి ఎవరూ నీతో చెప్పడం లేదు. నేను కూడా చెప్పకపోతె నా అన్నని రక్షించుకోనివాడిని అవుతానని, నీ మీద ప్రేమ చేత చెప్పడానికి వచ్చాను. 

నువ్వు ఏనాడైతే సీతమ్మని అపహరించి లంకకి తీసుకోచ్చావో, ఆనాటి నుంచి నాకు కొన్ని దుర్నిమిత్తములు కనపడుతున్నాయి. ఎప్పుడైనా హోమం చేద్దామని నాలుగు పుల్లలు ఆ హోమగుండంలో వేస్తే, ప్రారంభం నుంచి కూడా అగ్ని పెద్దగా పైకి రావడం లేదు, పొగ చుట్టుముట్టి ఉంటోంది. అన్ని హోమగుండాలలోని అగ్ని కూడా పొగతోనే ఉంటుంది, నిప్పురవ్వలు బయటకి కనపడుతున్నాయి. అగ్నిశాలలోకి, వేదశాలలోకి, పూజా గృహంలోకి విశేషంగా పాములు వస్తున్నాయి. అన్నిటినీ మించి తెల్లవారుజామున హోమం చేద్దామని పాయసం కాని, తేనె కాని పెట్టుకుంటె, వాటినిండా చీమలు పట్టి ఉంటున్నాయి. ఇవన్నీ కూడా అమంగళకరమైన శకునములు

ఆవు పాలు తీసుకొచ్చి పెట్టగానే అవి విరిగి పోతున్నాయి. ఏనుగులకు మదజలాలు కారకుండా అలా నిలబడి ఉంటున్నాయి. గుర్రాలు ఉత్సాహంగా సకిలించడం లేదు, దీనంగా సకిలిస్తూ కన్నుల వెంట నీరు కారుస్తున్నాయి. గాడిదలు, కంచర గాడిదలు, ఒంటెలు మొదలైన జంతువుల మీద ఉన్న వెంట్రుకలు తమంతట తాముగా ఊడి పడిపోతున్నాయి. పశు వైద్యులని తీసుకొచ్చి వాటికి వైద్యం చేయించినా, ఈ జాతి మృగాల మీద వెంట్రుకలు నిలబడడం లేదు. కాకులు గుంపులు గుంపులుగా వచ్చి ఇళ్ళ మీద కూర్చుని అదే పనిగా అరుస్తున్నాయి. ప్రతిరోజు గ్రద్దలు ఇళ్ళ మీద కూర్చుంటున్నాయి. అరణ్యంలో ఉండే నక్కలు పగటివేళ, రాత్రివేళ ఊరి పోలిమేరలకొచ్చి పెద్దగా ఏడుస్తూ అరుస్తున్నాయి. క్రూరమైన మృగాలు భయంకరమైన ధ్వనులు చేస్తున్నాయి. అందుకని సీతమ్మని తీసుకెళ్ళి మనం రాముడికి అప్పచెప్పేద్దాము " అన్నాడు.

అప్పుడు రావణుడు విభీషణుడి వంక కోపంగా చూసి " ఇవన్నీ నీకు ఎక్కడ కనపడుతున్నాయి రా. నాకు ఎక్కడా కనపడడం లేదు. రాముడు యుద్ధానికి దేవేంద్రుడిని తీసుకొచ్చినా సరే, సీతని ఇవ్వను. ఇక నువ్వు వెళ్ళవచ్చు " అన్నాడు. విభీషణుడు తల వంచుకొని వెళ్ళిపోయాడు. 

తన మనస్సు నిరంతరము పరకాంత యందు ఉండుట చేత, సోదరుడు చెప్పిన మంచి మాట వినకపోవడము చేత రావణాసురుడు రోజురోజుకి కృశించిపోవుచున్నాడు. 

No comments:

Post a Comment