Pages

Tuesday, 29 May 2012

రామాయణం @ కధ -74


అప్పుడు కొంతమంది రాక్షసులు పరిగెత్తుకుంటూ సీతమ్మ దెగ్గరికి వెళ్ళి " నీతో కిచకిచలాడిన ఎర్రమూతి కోతి తోకకి రావణుడు నిప్పు పెట్టించాడు " అన్నారు.

సీతమ్మ వెంటనే అగ్నిదేవుడికి ప్రార్ధన చేసి " నేను సర్వకాలముల యందు రాముడికే సేవ చేసిన దాననయితే, రాముడినే మనసులో పెట్టుకున్న దాననయితే, నాకు భాగ్యవిశేషం మిగిలి ఉంటె, రాముడికి నామీద ప్రేమ ఉంటె, సుగ్రీవుడు నన్ను తీసుకెళ్ళి రాముడితో కలపడం యదార్ధమయితే, హనుమ యొక్క తోకకి నిక్షేపింపబడిన అగ్ని చల్లబడుగాక " అనింది.

వెంటనే హనుమ తోకకి ఉన్న అగ్ని వెన్నముద్దలా చల్లగా అయిపోయింది. అప్పుడాయన అనుకున్నాడు' అవునులే నేను వస్తుంటే మైనాకుడు నాకు ఆతిధ్యం ఇచ్చాడు, సముద్రుడు నమస్కారం చేశాడు. రాముడి పేరు, సీతమ్మ పేరు చెబితే ప్రకృతిలో ఉపకరించనిది ఏముంటుంది. 


నా తండ్రి వాయుదేవుడికి అగ్నిదేవుడు స్నేహితుడు, అందుకని నాకు ఇలా ఉపకారం చేస్తున్నాడు ' అని అనుకుని, ' ఈ లంకా పట్టణాన్ని కాల్చి అగ్నిదేవుడికి సంతర్పణ చేసి వెళ్ళిపోతాను ' అనుకొని, మొదట ప్రహస్తుడి ఇంట్లో నిప్పు పెట్టాడు. అలా అన్ని ఇళ్ళ మీదకి దూకుతూ నిప్పు పెడుతూ వెళ్ళిపోయాడు. రావణుడి ప్రవర్తన వల్ల ఇంతకాలం కడుపుమండిపోయి ఉన్న దిక్పాలకులు అవకాశం దొరికిందని ఆనందపడ్డారు. హనుమ అలా నిప్పు పెట్టగానే అగ్ని దేవుడు కాల్చేస్తున్నాడు, వాయుదేవుడు వేగంగా వీచి అగ్నిని పట్టుకెళ్ళి అన్ని ఇళ్ళమీద వేసేశాడు. కొన్ని చోట్ల ఆకుపచ్చగా, కొన్ని చోట్ల పచ్చగా, కొన్ని చోట్ల ఎర్రగా ఆ లంక అంతా కాలిపోతుంది. ఆ లంకలో అందరూ " హా తాత, హా పుత్ర, హా తల్లి " అని అరుచుకుంటూ దిక్కులుపట్టి పరుగులు తీశారు. అప్పుడు హనుమంతుడు సంతోషంగా వెళ్ళి త్రికూటాచల పర్వతం మీద నిలబడి చూసేసరికి, ఎదురుగా లంక లంకంతా కాలిపోతూ కనిపించింది. 


అప్పుడాయన " అరరే ఎంతపని చేశాను. అగ్నిని తీసుకెళ్ళి నీళ్ళల్లో పడేసినట్టు కోపాన్ని విడిచిపెట్టినవాడు ధన్యుడు. పాము కుబుసాన్ని విడిచినట్టు కోపాన్ని విడిచిపెట్టడం మానేసి లంకని కాల్చేశాను. ఈ లంకలో సీతమ్మ కూడా కాలిపోయి ఉంటుంది. ఏ సీతమ్మ తేజస్సు చేత నా తోకని అగ్ని కాల్చలేదొ, అటువంటి సీతమ్మని అగ్ని కాలుస్తుంద . సీతమ్మే అగ్ని, అగ్నిని అగ్ని కాలుస్తుంద " అని అనుకున్నాడు. 

ఇంతలో అటుగా వెళుతున్న చారణులు(భూమికి దెగ్గరగా ఆకాశంలొ ఎగురుతూ శుభవార్తలు చెప్పే దేవ గాయకులు) " ఏమి ఆశ్చర్యం, ఇవ్వాళ ఒక వానరుడైన హనుమ 100 యోజనముల సముద్రాన్ని దాటి లంకా పట్టణాన్ని అగ్నికి ఆహుతి చేశాడు. ఆ లంక అంతా కాలిపోతుంది, కాని శింశుపా వృక్షము, ఆ వృక్షము కింద కూర్చున్న సీతమ్మకి ఎటువంటి అపకారము జెరగలేదు. అలాగే విభీషణుడి ఇల్లుకి కూడా ఏమి జెరగలేదు " అన్నారు.

అప్పుడు హనుమంతుడు శింశుపా వృక్షం కిందన కూర్చున్న సీతమ్మ దెగ్గరికి వచ్చి" అమ్మా లంకంతా కాల్చేశాను. రావణుడికి చెప్పవలసిన మాట చెప్పేశాను, నువ్వేమి బెంగపెట్టుకోకు. వాడు ఇప్పటికే భయంతో సగం చచ్చిపోయాడు. రాముడి కోసం వాడిని వదిలేశాను, లేకపోతె వాడి పది తలకాయలు గిల్లేసేవాడిని. అమ్మా! నేను బయలుదేరతాను, తొందరలోనే నీకు పట్టాభిషేకం జెరుగుతుంది, శోకమునకు గురికాకు " అని సీతమ్మతో చెప్పి ఒక్క దూకు దూకి ఆకాశంలోకి ఎగిరి నల్లటి వనాలతో, ఎర్రటి మచ్చలు కలిగిన ఏనుగులతో ఉన్న అరిష్టం అనే పర్వతం మీద దిగి, అక్కడినుంచి బయలుదేరాడు. హనుమ ఆ పర్వతం మీద నుంచి ఎగిరేసరికి అది భూమిలోకి నొక్కుకుపోయింది. 

ఆకాశంలోని మేఘాల్ని తాగుతున్నాడ, అన్నట్టుగా ఎగురుకుంటూ వెళ్ళి ఉత్తర దిక్కున హనుమ కోసం ఎదురుచూస్తున్న వానరముల దెగ్గరికి చేరుకోగానే ఒక పెద్ద నాదం చేశాడు. అక్కడున్న వానరాలు ' ఆకాశం బద్దలయ్యిందా ' అనుకున్నారు. అప్పుడు వాళ్ళందరూ జాంబవంతుడి దెగ్గరికి వచ్చి " తాత, అంత పెద్ద అరుపు వినిపిస్తోంది, అది హనుమదేనా? " అన్నారు.

జాంబవంతుడు అన్నాడు " అది కచ్చితంగా హనుమే. హనుమకి ఒక కార్యం చెబితే అవ్వకపోవడం అన్నది ఉండదు. తాను వెళ్ళిన పని అయ్యింది కాబట్టే ఇంత పెద్ద మహానాదం చేశాడు " అన్నాడు.

హనుమని అంత దూరంలో చూడగానే వానరులంతా పరుగులు తీశారు, అప్పుడు హనుమంతుడు" చూడబడెను సీతమ్మ " అని ఒక పెద్ద కేక వేసి మహేంద్రగిరి పర్వతం మీద దిగారు. అప్పుడు జాంబవంతుడు, అంగదుడు, గంధమాదనుడు మొదలైనవారు తప్ప మిగిలిన వానరములన్నీ తమ తోకల్ని కర్రలలా నిలువుగా పెట్టి, ఆ తోకల్ని చేతులతో పట్టుకుని హనుమ దిగిన కొండ ఎక్కి, ఆయనని ముట్టుకొని పారిపోతున్నారు. అప్పుడు హనుమంతుడు గుహలో ఉన్న అంగదుడు మొదలైన వారికి తన ప్రయాణం గురించి చెప్పాడు. " నిజంగా ఆ రావణుడికి ఎంత తపఃశక్తి ఉందో, సీతమ్మని ముట్టుకుని కూడా వాడు బూడిద కాలేదు. కాని సీతమ్మ పాతివ్రత్యం చేత రావణుడు ఎప్పుడో మరణించాడు, రాముడు నిమిత్తంగా వెళ్ళి బాణం వేసి చంపడమే " అన్నాడు.

అప్పుడు అంగదుడు " అంతా తెలిసిపోయింది కదా, ఇంక రాముడికి చెప్పడం ఎందుకు. ఇలాగె వెళ్ళిపోయి ఆ రావణుడిని సంహరించి, సీతమ్మని తీసుకొచ్చి రాముడికి ఇచ్చేద్దాము " అన్నాడు. 

అప్పుడు జాంబవంతుడు " తప్పు, అలా చెయ్యకూడదు, పెద్దలు చెప్పినట్టు చెయ్యాలి తప్ప స్వతంత్రంగా చెయ్యకూడదు. ఈ విషయాలని రాముడికి చెప్పి రాముడు ఎలా చెబితే అలా చేద్దాము " అన్నాడు. 

అప్పుడు వాళ్ళందరూ ముందుకి బయలుదేరారు. అలా వాళ్ళు వెళుతుండగా వాళ్ళకి మధువనం కనపడింది. ఆ మధువానాన్ని దదిముఖుడనే వానరుడు రక్షిస్తూ ఉంటాడు. ఆ మధువనంలోని చెట్ల నిండా తేనె పట్లు ఉన్నాయి. అక్కడంతా పువ్వుల నుండి తీసిన మధువు, పళ్ళనుండి తీసిన మధువు, రకరకాలైన మధువు పాత్రలలో పెట్టి ఉంది. ఆ వానరములన్నీ అంగదుడి దెగ్గరికి వెళ్ళి " ఆ మధువనంలోని మధువుని తాగుదాము " అన్నారు. అంగదుడు సరే అనేసరికి అందరూ లోపలికి వెళ్ళి తెనేపట్లు పిండేసుకుని తేనె తాగేశారు, అక్కడున్న పాత్రలలోని మధువు తాగేశారు, అక్కడున్న చెట్లకి ఉన్న పళ్ళని తినేశారు. వారందరూ విపరీతంగా తేనె తాగడం వలన మత్తెక్కి, కొంత మంది చెట్లకింద కూర్చుని పాటలు పాడడం మొదలుపెట్టారు, పాటలు పాడుతున్నవారి వీపు మీద కొంతమంది గుద్దుతున్నారు, కొంతమంది నాట్యాలు చేస్తున్నారు, కొంతమంది కనపడ్డవారికి నమస్కారం చేసుకుంటూ వెళుతున్నారు, కొంతమంది పళ్ళు బయట పెట్టి నవ్వుతున్నారు, కొంతమంది అటూ ఇటూ నడుస్తున్నారు, కొంతమంది చెట్ల మీద నుంచి కింద పడిపోతున్నారు, కొంతమంది నిష్కారణంగా ఏడుస్తున్నారు

ఆ వానరాలు చేస్తున్న అల్లరికి దదిముఖుడి సైన్యం వస్తే, వాళ్ళని చావగొట్టి తమ వెనుక భాగాలు చూపించారు. ఆ తరువాత వచ్చిన దదిముఖుడిని కూడా చావగొట్టారు. అప్పుడాయన ఏడుస్తూ సుగ్రీవుడి దెగ్గరికి వెళ్ళి జెరిగిన విషయం అంతా చెప్పాడు. దదిముఖుడు సుగ్రీవుడితో వానర బాషలో ఏడుస్తూ మాట్లాడుతున్నాడు, మధ్య మధ్యలో హనుమ అంటున్నాడు. దదిముఖుడి మాటలు వింటున్న సుగ్రీవుడి తోక పెరుగుతుంది(వానరాలు ఏదన్నా సంతోషకరమైన వార్త వింటె తోకలు పెంచుతారు). ఒకపక్క దదిముఖుడు ఏడుస్తుంటే సుగ్రీవుడు తోక పెంచడం గమనించిన లక్ష్మణుడు కంగారుగా " అసలు ఏమయ్యింది " అన్నాడు. 

" ఏమిలేదయ్య, దక్షిణ దిక్కుకి వెళ్ళిన వానరాలు మధువానాన్ని నాశనం చేశాయంట. దక్షిణ దిక్కుకి వెళ్ళిన హనుమంతుడు తప్పకుండా సీతమ్మ దర్శనం చేసుంటాడు " అని లక్ష్మణుడితో అని, " వాళ్ళందరినీ వెంటనే ఇక్కడికి రమ్మను " అని సుగ్రీవుడు దదిముఖుడితో అన్నాడు. 

దదిముఖుడు ఆ వానరాలకి " సుగ్రీవుడు రమ్మంటున్నాడు " అని చెప్పగానే అందరూ ఆకాశంలోకి ఎగిరిపోయి కిష్కిందకి చేరిపోయారు. వాళ్ళందరూ రాముడి దెగ్గరికి వెళ్ళి " రావణుడు సీతమ్మని లంకలో శింశుపా వృక్షం కింద ఉంచాడు. సీతమ్మ చాలా బాధ పడుతుంది, మనం తొందరగా వెళ్ళి తీసుకొచ్చెయ్యాలి " అన్నారు. 

అప్పుడు రాముడు " సీత నాయందు ఎలా ఉంది? " అని అడిగాడు.

అప్పటిదాకా రాముడి చుట్టూ ఉన్న వానరాలు, ఈ ప్రశ్నకి హనుమంతుడే సమాధానం చెప్పగలడు అని ఆయనకి దారిచ్చాయి. అప్పుడు హనుమంతుడు దక్షిణ దిక్కుకి నమస్కరించి " సీతమ్మ తపస్సుని పాటిస్తుంది, నీయందు పరిపూర్ణమైన ప్రేమతో ఉంది " అని, సీతమ్మ చెప్పిన ఆనవాళ్ళన్ని చెప్పి చూడామణిని ఇచ్చి " సీతమ్మ కేవలం ఒక నెల మాత్రమే ప్రాణాలని నిలబెట్టు కుంటానంది, మనం తొందరగా బయలుదేరి వెళ్ళి రావణుడిని సంహరించి, సీతమ్మని తీసుకురావాలి " అన్నాడు.


అప్పుడు రాముడు " సీత జాడ తెలిశాక నేను ఒక్క రోజు కూడా ఉండలేను " అని ఏడ్చి, సీత ఎలా ఉందని అడిగిగాడు. అప్పుడు హనుమంతుడు సీతమ్మ యొక్క సౌశీల్యాన్ని, పాతివ్రత్యాన్ని వివరించి " నీకు సుగ్రీవుడికి కలిగిన స్నేహం చేత అమ్మ ఎంతో ప్రీతిని పొందింది. సుగ్రీవుడిని, మిగిలిన వానరములని కుశలమడిగింది. శోకముర్తి అయిన సీతమ్మ తల్లిని నా మాటల చేత ఊరడించాను, నా మాటల చేత ఊరడింపబడిన సీతమ్మ ఇవ్వాళ శోకమును వదిలిపెట్టి తన కోసం నువ్వు శోకిస్తున్నావని మాత్రమే శోకిస్తోంది " అని చెప్పాడు.  

అలా హనుమంతుడు తన వాక్ వైభవంతో సీత రాములని సంతోషపెట్టాడు.
                                                   
                                      సుందరకాండ   సమాప్తం 

No comments:

Post a Comment