భగవాన్ తత్ర విశ్వాత్మా శంభుః ఏకాదశ ఆత్మకః |
బ్రహ్మా వసతి దేవేశో బ్రహ్మ ఋషి పరివారితః ||
అక్కడ శంకరుడు 11 రుద్రులుగా వచ్చి కూర్చుంటాడు. ఆ పక్కనే బ్రహ్మగారు వేదాన్ని బ్రహ్మర్షులకి చెప్తుంటాడు. ఇక అది దాటి ఏ ప్రాణి వెళ్ళలేదు. మీరు అక్కడిదాకా వెళ్ళి సీతమ్మని వెతకండి. ఒక నెల సమయంలో సీతమ్మ జాడ కనిపెట్టండి " అని చెప్పాడు.
తరువాత సుగ్రీవుడు హనుమంతుడితో " హనుమా! నీకున్న పరాక్రమము, నీకున్న తేజస్సు, నీకున్న వేగము, నీకున్న బుద్ధి ఈ భూమండలంలో ఏ ప్రాణికి లేవు. నీ తండ్రి వాయుదేవుడికి ఎటువంటి గమన శక్తి ఉందో నీకు అటువంటి గమన శక్తి ఉంది. అందుకని నేను నీ మీదే ఆశ పెట్టుకుంటున్నాను, ఎలాగైనా సీతమ్మ జాడ నువ్వు కనిపెట్టాలి " అన్నాడు.
ఇన్ని కోట్ల వానరాలు ఉండగా సుగ్రీవుడు కేవలం హనుమంతుడితో ఇలా చెప్పడం వల్ల రాముడికి హనుమంతుడి మీద నమ్మకం ఏర్పడింది. అప్పుడాయన హనుంతుడితో " నాయనా! నువ్వు సీత దెగ్గరికి వెళ్ళగానే వానర రూపంలో ఉన్న నిన్ను చూసి రాక్షసుడు అనుకొని బెంగపెట్టుకుంటుందేమో. అందుకని నీకు ఈ ఉంగరం ఇస్తున్నాను, ఈ ఉంగరాన్ని సీతకి చూపిస్తే ఆమె సమాస్వాసం పొందుతుంది " అని హనుమంతుడికి రాముడు తన ఉంగరాన్ని ఇచ్చాడు.
అప్పుడు హనుమంతుడు ఆ ఉంగరాన్ని తన తల మీద పెట్టుకొని, రాముడికి సాష్టాంగ నమస్కారం చేసి బయలుదేరడానికి సిధ్దపడ్డాడు. సుగ్రీవుడు వానరులందరినీ " బయలుదేరండి " అని ఆదేశించాడు.
అప్పుడు ఆ వానరాలు చాలా సంతోషంగా కేకలు వేశారు. వాళ్ళల్లో ఒకడు ' ఒరేయ్! మీరందరూ ఎందుకురా నేనొక్కడినే సీతమ్మ జాడ కనిపెట్టేస్తాను ' అని అంటున్నాడు. మరొకడు ' నేను భూమిని చీల్చేస్తానురా ' అని అంటున్నాడు. ఇంకొకడు ' నేను సముద్రాల్ని కలిపెస్తాను ' అని, మరొకడు ' నేను పర్వతాలని కుదిపెస్తాను ' అని అంటున్నాడు. ' నేను వెళ్ళిన త్రోవలో ఇక చెట్లు ఉండవు, నా తొడల వేగానికి విరిచేస్తాను రా ' అని ఒకడు అంటున్నాడు. ' మీరందరూ విశ్రాంతి తీసుకొండిరా, ఆ పది తలల పురుగుని తీసుకొచ్చి రాముడి పాదాల దెగ్గర పడేస్తాను ' అని ఒకడు అంటున్నాడు. అలా అందరూ తొడలు కొట్టుకుంటూ, తోకలకి ముద్దులు పెట్టుకుంటూ, పైకి కిందకి ఎగురుతూ సంతోషపడిపోతున్నారు. అలా అందరూ సుగ్రీవుడి ఆజ్ఞ ప్రకారం నాలు దిక్కులకి వెళ్ళిపోయారు.
అప్పుడు రాముడు సుగ్రీవుడితో " ఇన్ని దిక్కులలో ఉన్న విశేషాలు నీకు ఎలా తెలుసయ్య సుగ్రీవా? " అన్నాడు.
సుగ్రీవుడు అన్నాడు " నన్ను చంపుతానని వాలి వెంటపడితే ఈ భూమి చుట్టూ తిరిగాను, ఇవన్నీ అప్పుడు చూశాను. నేను ఎక్కడికి వెళ్ళినా వాలి నావెంట పడ్డాడు. ఆఖరికి హనుమంతుడు వాలికి ఉన్న శాపం గురించి చెబితే అప్పుడు ఋష్యమూక పర్వతం మీద కూర్చున్నాను " అన్నాడు.
అలా వానరాలన్నీ నాలుగు దిక్కులకి వెళ్ళడం వల్ల రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు సంతోషించారు.
సుగ్రీవుడి ఆజ్ఞ ప్రకారం 4 దిక్కులకి వెళ్ళిన వానరములలో 3 దిక్కులకి వెళ్ళిన వానరములు నెల రోజుల తరువాత వెనక్కి తిరిగి వచ్చేశాయి. వాళ్ళు అన్ని ప్రాంతాలని వెతికినా సీతమ్మ జాడ ఎక్కడా కనపడలేదు.
దక్షిణ దిక్కుకి వెళ్ళిన వానరములు వింధ్య పర్వతం దెగ్గరికి వెళ్ళి, ఆ పర్వతంలో ఉన్న చెట్లని, గుహలని, సరస్సులని, మార్గమధ్యంలో ఉన్న నదులని, పట్టణాలని, గ్రామాలని అన్వేషిస్తూ వెళుతున్నారు. అలా కొంతదూరం వెళ్ళాక నిర్జనమైన అరణ్యానికి చేరుకున్నారు. అక్కడ చెట్లకి ఒక పండు లేదు, ఆకులు లేవు, ఒక జంతువు కూడా కనబడడం లేదు. అక్కడ తినడానికి కనీసం మూలములు కూడా కనపడలేదు. ఒకప్పుడు కణ్డువు అనే మహర్షి ఈ అరణ్య ప్రాంతంలో ఉండేవారు. ఆయన తపఃశక్తికి దేవతలు కూడా భయపడేవారు. అటువంటి సమయంలో కణ్డువ మహర్షి కుమారుడు ఈ అరణ్యంలో శరీరాన్ని విడిచిపెట్టాడు. అప్పుడు కణ్డువ మహర్షికి ఈ అరణ్యంపట్ల ఒక రకమైన ఖేదం ఏర్పడి ఈ అరణ్యంలో మనుష్యులు కాని, పక్షులు కాని, చెట్లు కాని, జంతువులు కాని ఏమి ఉండవు అని శపించారు.
వాళ్ళు ఆ అరణ్యాన్ని దాటి ముందుకి వెళ్ళగా, ఒక గుహ నుండి భయంకరమైన ఆకారం కలిగిన రాక్షసుడు బయటకి వచ్చి వానరాల మీదకి పరుగులు తీశాడు. ఆ రాక్షసుడిని చూసి దేవతలు కూడా భయపడతారు. అలా వస్తున్న రాక్షసుడిని చూసిన అంగదుడు వస్తున్నది రావణుడే అనుకొని, తన శక్తినంతా కూడబెట్టి అరిచేతితో ఒక దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బకి రాక్షసుడి నవరంధ్రముల నుండి రక్తము కారి కిందపడిపోయి మరణించాడు. అప్పుడు వారు ఆ రాక్షసుడు ఉన్నటువంటి గుహని వెతికారు, కాని ఎక్కడా సీతమ్మ జాడ కనపడలేదు.
అలా వారు ఎన్ని ప్రాంతాలని వెతికినా ఏమి ప్రయోజనం లేకపోయింది. వాళ్ళకి ఎక్కడా నీరు, ఆహారము దొరకలేదు, దాంతో వాళ్ళకి విపరీతంగా ఆకలి వేసింది. అప్పుడు వాళ్ళు తడిరెక్కలతో ఎక్కడి నుంచన్నా పక్షులు వస్తున్నాయేమో అని వెతుకుతున్నారు. అప్పుడు వాళ్ళకి ఒక బిలం నుండి తడి రెక్కలతో పక్షులు రావడం కనపడింది, వాటి వెనకాల కొన్ని జంతువులు తడి శరీరాలతో బయటకి వస్తున్నాయి. అప్పుడా వానరాలు గడ్డితో, లతలతో కప్పబడి ఉన్న ఆ బిలంలోకి ప్రవేశించారు. లోపలికి వెళితే అంతా చీకటిగా ఉంది, అందుకని ఆ వానరాలు ఒకరి చేతులని ఒకరు పట్టుకొని మెల్లగా లోపలికి వెళ్ళారు.
తీరా లోపలికి వెళ్ళి చూస్తే, అక్కడ లేని వృక్షం లేదు, అక్కడ లేని లత లేదు, చెట్లన్నీ పండ్లతో, పుష్పాలతో పరమ శోభితంగా ఉన్నాయి. ఆ చెట్లకి పెద్ద పెద్ద తేనెపట్లు ఉన్నాయి, అక్కడున్న సరోవరాలలో బంగారంతో చెయ్యబడ్డ తామరపువ్వులు వికసించి ఉన్నాయి. ఆ బంగారు పువ్వు నుండి పడిన పుప్పుడి చేత ఆ సరస్సులలోని నీరు చాలా తీయగా ఉంది. అక్కడ అంతస్తులతో కూడిన మేడలు ఉన్నాయి, ఒక అంతస్తు బంగారంతో, మరొక అంతస్తు వెండితో, మరొక అంతస్తు బంగారంతో, అలా అంతస్తులన్ని బంగారం, వెండితో తాపడం చెయ్యబడి ఉన్నాయి. ఎక్కడ చూసినా వజ్రాలు పొదగబడ్డ బంగారు శయనాలు, ఆసనాలు ఉన్నాయి. ఆ వానరాలు ఈ ప్రాంతాన్ని చూసి ఆశ్చర్యపోయారు. అక్కడ సరోవరాలలో ఉన్న నీటిని తాగి దాహం తీర్చుకున్నారు.
అప్పుడు వాళ్ళకి కొద్ది దూరంలోనే ఒక స్త్రీ కనబడింది. ఆ స్త్రీ కృష్ణాజినం కట్టుకొని, నారచీర కట్టుకొని, తేజస్సుతో, తపోశక్తితో మెరిసిపోతూ ఉంది. ఆ తల్లి దెగ్గరికి ఈ వానరాలు వెళ్ళి నమస్కరించి " మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. బయట నుంచి చూస్తే చిన్న బిలంలా ఉంది, లోపలికి వస్తే ఇంత అద్భుతంగా ఉంది. అసలు ఈ గుహ ఎవరిది, ఈ మేడలు ఎవరివి. మాకు చాలా చిత్రంగా ఉంది " అన్నారు.
అప్పుడా స్త్రీ " పూర్వం దానవ రాజు దెగ్గర మయుడనే శిల్పి ఉండేవాడు. ఆ మయుడికి అనేక మాయా శక్తులు ఉన్నాయి. ఆయన బంగారంతో ఈ ప్రాంతాన్ని నిర్మించాడు. ఆ మయుడు బ్రహ్మని గూర్చి1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. మయుడి తపస్సుకి ప్రీతి చెందిన బ్రహ్మదేవుడు ఆయనకి విశేషమైన వరాలని ఇచ్చాడు. తదనంతరం శుక్రాచార్యుల యొక్క ధనమంతా తీసుకొచ్చి మయుడికి ఇచ్చారు. కాని ఆ మయుడు హేమ అనే అప్సరస స్త్రీ యందు మనస్సు పెట్టుకున్నాడని తెలిసి, ఇంద్రుడు ఆయనని తన వజ్రాయుధంతో సంహరించాడు. మయుడు హేమ అనే అప్సరస స్త్రీ యందు మనస్సు పెట్టుకున్నాడు కనుక, ఈ గుహలో ఉన్న సమస్త ఐశ్వర్యము కూడా హేమకి చెందుతుందని బ్రహ్మగారు తీర్పు ఇచ్చారు. అప్పుడా హేమ ఈ ఐశ్వర్యానికి కాపలాగ ఉండడానికి నన్ను నియమించింది. నేను మేరుసావర్ణి యొక్క కుమార్తెని, నా పేరు స్వయంప్రభ. నాకు స్నేహితురాలైన హేమ నృత్యము నందు, సంగీతము నందు ప్రావీణ్యము కలిగిన స్త్రి. ఆమె నన్ను పిలిచి ఈ ఐశ్వర్యాన్ని, గుహని కాపాడమని అడిగింది. స్నేహము మీద ఉన్న అనురక్తి చేత నేను ఈ గుహని కాపాడుతూ ఉంటాను. మిమ్మల్ని చూస్తుంటే బాగా అలసిపోయినట్టున్నారు కనుక మీకు కావలసిన కందమూలాలని, ఫలాలని ఆరగించండి. నీళ్ళు, తేనె కావలసినంత తాగి విశ్రాంతి తీసుకోండి. విశ్రమించిన తరువాత మీరు ఎవరో, ఇక్కడికి ఎందుకు వచ్చారో నాకు చెప్పండి " అనింది.
అప్పుడా వానరాలు కడుపునిండా కావలసిన పదార్ధాలని తిని విశ్రమించారు. అప్పుడు హనుమంతుడు స్వయంప్రభతో " దశరథ మహారాజు కుమారుడైన రాముడు తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం తన భార్య అయిన సీతమ్మతో, తమ్ముడైన లక్ష్మణుడితో కలిసి అరణ్యవాసానికి వచ్చాడు. కాని సీతమ్మని రావణాసురుడనే రాక్షసుడు అపహరించాడు. అపహరింపబడ్డ సీతమ్మని వెతుకుతూ వాళ్ళు కిష్కిందకి చేరుకున్నారు. అక్కడ వారు సుగ్రీవుడితో మైత్రి కుదుర్చుకున్నారు. సుగ్రీవుడు రాముడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం నాలుగు దిక్కులకి వానరాలని పంపించాడు, సీతమ్మని వెతకడం కోసం. దక్షిణ దిక్కుకి యువరాజైన అంగదుడి నాయకత్వంలో వచ్చిన వానర సమూహములో నేను ఒకడిని, నన్ను హనుమ అంటారు. సీతమ్మ జాడ కనిపెట్టడం కోసం వెతుకుతున్న మాకు ఎక్కడా ఆహారం, నీరు దొరకలేదు. అటువంటి సమయంలో తడి రెక్కలతో పక్షులు ఈ గుహ నుండి బయటకి రావడం చూశాము. ఇక్కడ నీళ్ళు దొరుకుతాయనే ఆశతో మేము ఈ గుహలోకి ప్రవేశించాము. సీతమ్మ జాడ మాకు చెప్పగలవా " అని అడిగాడు.
అప్పుడా స్వయంప్రభ " ఈ గుహలోకి మృగములు తప్ప మిగిలినవి ఎవన్నా ప్రవేశిస్తే, ప్రాణాలతో బయటకి వెళ్ళడం కుదరదు. కాని మిమ్మల్ని చూస్తే జాలేస్తుంది, అందుకని మీ అందరినీ నా తపఃశక్తి చేత బయటకి పంపిస్తాను. మీరు కళ్ళు మూసుకొని, కళ్ళ మీద చేతులు పెట్టుకోండి " అనింది.
అప్పుడా వానరాలు మృదువైన కనురెప్పల్ని మూసి, తమ మృదువైన చేతులతో ఆ కన్నులని మూసుకున్నారు. మళ్ళి ఉత్తర క్షణంలో కనులు తెరిచేసరికి వాళ్ళందరూ వింధ్య పర్వతం మీద ఉన్నారు. ఆ ప్రాంతంలోని చెట్లు పువ్వులతో, పండ్లతో శోభిల్లుతుంది. అప్పుడా స్వయంప్రభ " మీరు ఈ గుహలో 4 నెలలపాటు ఉండిపోయారు " అని చెప్పి గుహలోకి వెళ్ళిపోయింది. ( ఆ గుహలో వానరాలు గడిపింది కొంత సమయమే అయినా, ఆ గుహలో ఉన్నంత సేపు వాళ్ళకి కాలం తెలీలేదు.)
అప్పుడు అంగదుడు " మనం ఆశ్వయుజ మాసంలో బయలుదేరాము. కాని ఇప్పుడు వసంత కాలం వచ్చింది. మనని ఒక నెలలోపు తిరిగి వచ్చెయ్యమని సుగ్రీవుడు చెప్పాడు. కాని మనం కొన్ని నెలలు దాటిపోయాము. ఆలస్యం అయితే అయ్యింది కాని ఇందులో సీతమ్మ జాడ తెలిసినవాడు ఎవడన్నా ఉన్నాడా?, ఎవడూ లేడు. సుగ్రీవుడు చాలా క్రోధ స్వరూపుడు, సుగ్రీవుడు ఎలాంటివాడో నాకు తెలుసు. ఆయన నన్ను ఇష్టంగా యువరాజుని చెయ్యలేదు, రాముడు చెయ్యమన్నాడని నన్ను యువరాజుని చేశాడు. నేనంటే ఆయనకి చాలా కడుపుమంట. ఇప్పుడు నేను వెనక్కి వెళితే శత్రుత్వం తీర్చోకోవడానికి మంచి అవకాశం దొరికిందని మనందరి కుత్తుకలు కత్తిరిస్తాడు. అందుకని మనం అక్కడికి వెళ్ళద్దు, ఇక్కడే ప్రాయోపవేశం (దర్భలని దక్షిణ దిక్కుకి ఉండేలా పరుచుకొని, తూర్పు దిక్కుకి తిరిగి ఆచమనం చేసి దానిమీద పడుకుంటారు. అప్పుడు అటుగా వెళుతున్న ఏ ప్రాణి అయినా వాళ్ళని తినచ్చు) చేసి చనిపోదాము. నేను వెనక్కి రాను " అన్నాడు.
అప్పుడు మిగిలిన వానరాలన్నీ అంగదుడి బాధ చూడలేక కళ్ళు తుడుచుకొని, మనమూ ఇక్కడ ప్రాయోపవేశం చేసేద్దాము అన్నాయి.
అప్పుడు వాళ్ళల్లో ఒకడైన తారుడు అన్నాడు " అంగదుడు చెప్పిన మాట నిజమే, మనం ఇక్కడ ప్రాయోపవేశం చేసేసి చనిపోదాము. లేదా నాకు ఒక ఆలోచన వస్తుంది, మనం ఆ స్వయంప్రభ గుహలోకి వెళ్ళిపోదాము. అందులో బోలెడన్ని చెట్లు, ఫలాలు, తేనె ఉన్నాయి. అవి తింటూ మనం అందులోనే ఉండిపోవచ్చు " అన్నాడు.
No comments:
Post a Comment