Pages

Thursday, 10 May 2012

రామాయణం @ కధ -59



సర్వథా ప్రణయాత్ క్రుద్ధో రాఘవో న అత్ర సంశయః |
భ్రాతరం సంప్రహితవాన్ లక్ష్మణం లక్ష్మి వర్ధనం ||



అప్పుడు హనుమంతుడు అన్నాడు " సుగ్రీవా! నీకు ఇంకా బోధ పడలేదు. నీయందు రాముడికి ఉన్నది ప్రతీకారేచ్ఛ కోపం కాదు, ఆయనకి నీయందున్నది ప్రేమతో కూడిన కోపం. నువ్వు నీ భార్యలతో ఉన్నావు, రాజ్యాన్ని పొందావు, వేళ దాటిపోయినా సుఖాలు అనుభవిస్తున్నావు. కాని రాముడికి భార్య లేదు, రాజ్యం లేదు, నీకు ఉపకారం చేశాడు, నీకు సమయం ఇచ్చాడు, నగరానికి కూడా రాకుండా బయట ఒక గుహలో పడుకుంటున్నాడు. ఇంతకాలం ఎదురు చూశాడు, కాని నీ నుండి సహకారం లభించకపోవడం వలన బాధపడ్డాడు. కాబట్టి ఆ బాధలోనుండి వచ్చే మాట నువ్వు వినడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది. కాని, నువ్వు వినడానికి కష్టంగా ఉందని కాదు వినవలసింది, అవతలివాడి కష్టం ఎంతుంటే ఆ మాట వచ్చిందో నువ్వు గమనించాలి. నువ్వు బాగా తప్పతాగి ఉన్నావు కాబట్టి ' రాముడు నన్ను ఇంతమాట అంటాడ ' అని వినవద్దు. ఇప్పుడు లక్ష్మణుడు కోపంగా మాట్లాడితే, అంజలి ఘటించి విను తప్ప కోపగించుకోమాకు " అన్నాడు. 


బయట లక్ష్మణుడు నిలబడి ఉండగా, లోపలినుండి స్త్రీల ఆభరణముల, కంకణముల, వడ్డాణముల శబ్దములు వినపడ్డాయి. అప్పుడు లక్ష్మణుడు సిగ్గుపడి లోపలికి వెళ్ళలేదు, కాని లోపలినుండి వస్తున్న కోపాన్ని ఆపుకోలేక ఒక్కసారి తన వింటినారి యొక్క ఠంకార ధ్వని చేశాడు. పిడుగు పడినట్టు వచ్చిన ఆ శబ్దానికి లోపల భార్యలతో పడుకుని ఉన్న సుగ్రీవుడు ఒక్కసారి ఎగిరి గంతేసి ఓ ఆసనంలో కూర్చున్నాడు. ఆ సమయంలో సుగ్రీవుడి ఒంటి మీద ఉన్న ఆభరణాలు అటు ఇటు తొలిగిపోయాయి. ఒక కోతి తన పిల్లని పట్టుకున్నట్టు, సుగ్రీవుడు రుమని తన ఒళ్లో పెట్టుకొని ఆ ఆసనంలో కూర్చున్నాడు. పైకి నిలబడలేక అటు ఇటు తూలుతున్న సుగ్రీవుడికి వెంటనే వాలి చెప్పిన మాట గుర్తుకు వచ్చి తారని పిలిచాడు. 

అప్పుడు సుగ్రీవుడు తారతో " తార! ఇప్పుడు లక్ష్మణుడితో మాట్లాడగలిగిన దానివి నువ్వు ఒక్కదానివే. ఎలాగోలా నువ్వే బయటకి వెళ్ళి లక్ష్మణుడితో మాట్లాడు. లక్ష్మణుడు ఎప్పుడూ ధర్మం తప్పడు. నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నవో అలాగే బయటకి వెళ్ళు ( ఆ సమయంలో తార కూడా మద్యం సేవించి తూలుతూ ఉంది, ఆమె ఒంటిమీద గుడ్డ సరిగ్గా లేదు, ఆభరణాలు సరిగ్గా లేవు ). నిన్ను అలా చూడగానే అంత కోపంతో ఉన్న లక్ష్మణుడు కూడా తల దించేసుకుంటాడు. ఎందుకంటే స్త్రీలతో అమర్యాదగా మాట్లాడడం కాని, స్త్రీతో గట్టిగా మాట్లాడడం కాని, స్త్రీ జోలికి వెళ్ళడం కాని ఇక్ష్వాకు వంశీయులు చెయ్యరు. నువ్వు నీ మాటలతో లక్ష్మణుడిని ప్రసన్నుడిని చెయ్యి, అప్పుడు నేను మెల్లగా బయటకి వస్తాను " అన్నాడు.

సుగ్రీవుడి చేత అనుభవించిన సుఖం వల్ల, తాగిన మద్యం వల్ల తార కనుగుడ్లు ఎర్రగా అయ్యి తిరుగుడు పడుతున్నాయి. ఒక చోట స్థిరంగా నిలబడలేక అటు ఇటు తూలిపోతుంది. ఆమె వేసుకున్న వడ్డాణం కిందకి జారిపోయింది, పైకి కనపడకూడని హారాలు పైకి కనపడుతూ జారిపోయి ఉన్నాయి, ఒంటి మీద బట్ట కూడా జారిపోయింది. లక్ష్మణుడి కోపం తగ్గించడానికి అలా ఉన్న తార బయటకి వచ్చి లక్ష్మణుడికి కనపడింది. 



స తాం సమీక్ష్య ఏవ హరి ఈశ పత్నీం తస్థౌ ఉదాసీనతయా మహాత్మా |
అవాఙ్ముఖో ఆభూత్ మనుజేంద్ర పుత్రః స్త్రీ సన్నికర్షాత్ వినివృత్త కోపం ||



ఎప్పుడైతే తన దెగ్గరికి ఆ సుగ్రీవుడి భార్య అటువంటి స్వరూపంతో వచ్చిందో, 14 సంవత్సరముల నుండి భార్యకి దూరంగా ఉన్న లక్ష్మణుడు, యవ్వనంలో ఉన్న లక్ష్మణుడు, కోపంతో ఉన్న లక్ష్మణుడు ఏ భావము లేనివాడిగా నిలబడ్డాడు. అప్పటివరకూ కోపంతో బుసలు కొడుతూ ఉన్న లక్ష్మణుడు ఆమెని చూడగానే భూమి వంక చూస్తూ, ఆమెతో మాట్లాడవలసి వస్తుందేమో అని వెంటనే తన కోపాన్ని విడిచిపెట్టేసాడు


అప్పుడు తార " లక్ష్మణా! ఎందుకయ్యా అంత కోపంగా ఉన్నావు. నీకు ఇంత కోపం తెప్పించడానికి సాహసించిన వాళ్ళు ఎవరు. ఎండిపోయిన చెట్లతో కూడిన వనాన్ని దావాగ్ని దహించేస్తుంటే, దానికి ఎదురు వెళ్ళగల మొనగాడు ఎవడయ్యా " అనింది.

అప్పుడు లక్ష్మణుడు " నీ భర్త యొక్క ప్రవర్తన ఆయన భార్యవైన నీకు తెలియడం లేదా. నీ భర్త ధర్మాన్ని పక్కన పెట్టేసి కేవలం కామము నందే కాలాన్ని గడుపుతున్నాడు. ( మనకి ధర్మ, అర్ధ, కామ, మోక్షాలు అని 4 పురుషార్ధాలు ఉంటాయి. ధర్మబద్ధమైన అర్ధము ( కష్టపడి సంపాదించినది), ధర్మబద్ధమైన కామము ( కేవలం తన భార్య అందే కామసుఖాన్ని అనుభవించడం) వలన మోక్షం వైపు అడుగులు వేస్తాము. ధర్మాన్ని పక్కన పెట్టి మనం ఎంత డబ్బు సంపాదించినా, ఎన్ని సుఖాలు అనుభవించినా ప్రమాదమే వస్తుంది ). మిత్రుడికి ఇచ్చిన మాట తప్పాడు. 4 నెలల సమయం గడిచిపోయింది. 



న చింతయతి రాజ్యార్థం సః అస్మాన్ శోక పరాయణాన్ |
స అమాత్య పరిషత్ తారే కామం ఏవ ఉపసేవతే ||



రాజన్నవాడు అనుభవించాల్సింది కేవలం కామము ఒక్కటే కాదు. రాజు మొట్టమొదట మంత్రి పరిషత్తుతో కూడి సమాలోచన చేసి రాజ్యకార్య నిర్వహణ చెయ్యాలి. ఇవన్నీ నీ భర్త చేస్తున్నాడా?. వర్షాకాలంలో వెతకడానికి కష్టంగా ఉంటుంది కాబట్టి ఈ నాలుగు నెలలు సుఖములను అనుభవించి నాలుగు నెలల తరువాత స్నేహితుడికి ఇచ్చిన మాట ప్రకారం సహాయం చెయ్యమంటే, ఇచ్చిన సమయం గడిచిపోయినా ఇంకా కామసుఖాలని అనుభవిస్తూ ఉన్న సుగ్రీవుడిది దోషం కాదా?. ఇవ్వాళ నీ భర్త నిరంతర మధ్యపానం చేస్తుండడం వలన ఆయన బుద్ధియందు వైక్లవ్యం ఏర్పడింది. అందుచేత ఆ మధ్యపానమునందు రమిస్తున్న సుగ్రీవుడు పురుషార్ధము లయందు చెడిపోయాడు " అన్నాడు.

అప్పుడు తార " నాయనా! ఇది కోపగించవలసిన కాలం కాదయ్యా. ఎవరో బయటివాళ్ళు చెడిపోతే నువ్వు కోపంతో గట్టిగా కేకలు వెయ్యచ్చు, నిగ్రహించచ్చు, చంపచ్చు. కాని ఇవ్వాళ నీ అన్నతో సమానమైన సుగ్రీవుడు కామానికి బానిస అయ్యాడు. అటువంటి సుగ్రీవుడి మీద నీకు ఇంత కోపం తగదయ్యా. 'సుగ్రీవుడిది దోషము' అని నువ్వు చెప్పినది పరమ యదార్ధము. నువ్వు గుణములు ఉన్నవాడివి కనుక సుగ్రీవుడిని క్షమించవయ్య. లక్ష్మణా! నువ్వు చాలా గుణాలు ఉన్నవాడివి, అందుకే నీకు ఇంత శాస్త్ర మర్యాద తెలుసు. నా భర్త చాలా అల్పమైన గుణములు ఉన్నవాడు, అందుకని కామమునకు లొంగిపోయాడు. మరి నువ్వు కోపమునకు లొంగిపోతున్నావేమయ్యా? 

లక్ష్మణా! నువ్వు ప్రత్యేకించి ఇక్కడికి వచ్చి అరుస్తున్నావు కాని, రాముడు బాణం వేస్తే ఆ ప్రభావం ఎలా వుంటుందో నాకు తెలుసు, సుగ్రీవుడు ఎంత విలువైన కాలాన్ని చేజార్చుకున్నాడో నాకు తెలుసు, దానివల్ల రాముడు ఎంత బాధపడుతున్నాడో నాకు తెలుసు. ఈ మూడు తప్పులు జెరిగాయి కనుక మీకు ఉపకారం ఎలా చెయ్యాలో కూడా నాకు తెలుసు. మన్మధుడి బాణాలు ఎంత తీవ్రంగా ఉంటాయో, ఆ బాణాల దెబ్బకి కామానికి ఎంత తొందరగా పడిపోతారో నాకు తెలుసు. ఏ కాముని బాణాల దెబ్బకి సుగ్రీవుడు ఇలా ఉన్నాడో నాకు తెలుసు, ఆ సుగ్రీవుడు ఎవరి పొందుయందు సంతోషంగా ఉన్నాడో నాకు తెలుసు. శత్రువులని చంపే ఓ లక్ష్మణా! ఇవ్వాళ సుగ్రీవుడు తన ఇంద్రియాలకి లొంగిపోయాడు. అంతేకాని ఆయనకి రాముడి మీద ఎటువంటి ద్వేషభావము లేదు, అందుకని నువ్వు ఆయనని క్షమించి తీరాలి.



మహర్షయో ధర్మ తపోభిరామాః కామా అనుకామాః ప్రతి బద్ధ మోహాః |
అయం ప్రకృత్యా చపలః కపిః తు కథం న సజ్జేత సుఖేషు రాజా ||



ఏమయ్యా లక్ష్మణా, నేను కొత్తగా చెప్పాల, నీకు తెలీదా, సంసారాన్ని విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళి తపస్సు చేసుకునే మహర్షులు ఇంద్రుడు పంపిన అప్సరసలని చూసి కామానికి లొంగి తమ తపస్సులను భ్రష్టు పట్టించుకున్నవారు చాలామంది ఉన్నారు. అంత గొప్ప మహర్షులే కామానికి లొంగిపోయినప్పుడు, చపల బుద్ధి కలిగిన వానరుడు కామంతో చెయ్యవలసిన పనిని కొన్ని రోజులు మరిచిపోవడం పెద్ద విషయమా. సుగ్రీవుడు ఇంతగా కామానికి లొంగిపోయినప్పటికీ కూడా, మీకు ఇచ్చిన మాటని నెరవేర్చడానికి ఎప్పుడో ప్రయత్నాలు ప్రారంభించాడు. 

లక్ష్మణా! ఇక్కడే నిలబడి ఉన్నావు, నువ్వు అంతఃపురంలోకి రాకూడదా, నువ్వేమన్నా పరాయివాడివా. సుగ్రీవుడు పడుకున్న మందిరంలోకి వస్తే అంతఃపుర కాంతలు కనిపిస్తారని సందేహిస్తున్నావా. మిత్రుడైన వాడు, అన్యభావన లేకుండా మిత్రుడితో మాట్లాడేవాడు, చారిత్రం ఉన్నవాడు, నడువడి ఉన్నవాడు అంతఃపురంలోకి రావచ్చయ్యా. ఏమి దోషంలేదు, లోపలికి రా " అనింది. 

బంగారు కన్నుతో మెరిసిపోతున్న సుగ్రీవుడు, తన తొడ మీద రుమని కూర్చోపెట్టుకొని గట్టిగా కౌగలించుకొని ఉన్నాడు. తెర తీసుకొని లక్ష్మణుడు లోపలికి రాగానే సుగ్రీవుడికి తన దోషం జ్ఞాపకం వచ్చి గబ్బుక్కున ఎగిరి లక్ష్మణుడి దెగ్గర వాలి, శిరస్సు వంచి అంజలి ఘటించాడు. 

కాని సుగ్రీవుడి చూడగానే లక్ష్మణుడికి కోపం వచ్చి " సుగ్రీవా! రాజన్నవాడు ఉత్తమమైన అభిజనంతో కూడి ఉండాలి, జాలి కలిగినవాడై ఉండాలి, ఇంద్రియములను గెలిచినవాడై ఉండాలి, చేసిన ఉపకారాన్ని మరిచిపోనివాడై ఉండాలి, మాట తప్పనివాడై ఉండాలి. అటువంటివాడిని ఈలోకం రాజని గౌరవిస్తుంది. మిత్రుడి దెగ్గర సహాయం పొంది, ఆ మిత్రుడికి తిరిగి ఉపకారం చెయ్యనివాడిని ఈ లోకం క్రూరుడు అని పిలుస్తుంది. 



శతం అశ్వ అనృతే హంతి సహస్రం తు గవ అనృతే |
ఆత్మానం స్వ జనం హంతి పురుషః పురుష అనృతే ||



ఎవడైనా గుర్రం విషయంలో అసత్యం చెబితే ( అంటె ఎవరికన్నా గుర్రం ఇస్తానని చెప్పి ఇవ్వకుండా ఉండడం), నూరు గుర్రాలని చంపిన పాపం వస్తుంది. ఆవు విషయంలో అసత్యం చెబితే, వెయ్యి ఆవుల్ని చంపిన పాపం వస్తుంది. అలాగే, ఉపకారం చేస్తానని చెప్పి ఆ మాటకి కట్టుబడనివాడు తన బందువులందరిని చంపి, వారిని తినేసి, తనని తాను చంపుకున్నవాడితో సమానమవుతాడయ్య సుగ్రీవా. ఒకరి దెగ్గరికి వెళ్ళి ' అయ్యా మీరు నాకు ఉపకారం చెయ్యండి, నేను మీకు ప్రత్యుపకారం చేస్తాను ' అని మాట పుచ్చుకొని, వారి దెగ్గరినుండి ఉపకారం పొందేసి, దాని ఫలితాన్ని అనుభవిస్తూ, తాను ఇచ్చిన మాట మరిచిపోయినవాడిని లోకం అంతా కలిసి చంపేస్తుంది.


బ్రహ్మఘ్నే చ ఏవ సురాపే చ చౌరే భగ్న వ్రతే తథా |  
నిష్కృతిర్ విహితా సద్భిః కృతఘ్నే న అస్తి నిష్కృతిః ||



బ్రహ్మహత్య చేసిన వాడికి, మధ్యపానం చేసిన వాడికి, దొంగతనం చేసిన వాడికి, ఒక వ్రతం చేస్తాను అని చెయ్యడం మానేసిన వాడికి ప్రాయశ్చిత్తం ఉండచ్చు, కాని క్రుతఘ్నుడికి ప్రాయశ్చిత్తం లేదు. నువ్వు రాముడికి ఉపకారం చేస్తానని ఒప్పుకున్నావు, కాని ప్రత్యుపకారం చెయ్యలేదు. నీ ప్రవర్తన చూసి మా అన్నయ్య నిన్ను మంచివాడు అనుకున్నాడు, కాని నువ్వు కప్పలా అరుస్తున్న పామువని మా అన్నయ్య కనిపెట్టలేక పోయాడయ్యా. నువ్వు మా అన్నయ్యకి చేసిన దోషానికి నిన్ను ఇప్పుడే చంపేస్తాను. నీ మాట మీద నువ్వు నిలబడు, లేకపోతె వాలి వెళ్ళిన దారిలో వెళ్ళిపోవలసి ఉంటుంది " అని లక్ష్మణుడు అన్నాడు.


లక్ష్మణుడు మాట్లాడుతున్నంతసేపు నక్షత్రముల మధ్యలో ఉన్న చంద్రుడిలా సుగ్రీవుడు తన భార్యల మధ్యలో చేతులు కట్టుకొని నిలబడిపోయి ఉన్నాడు.     

అప్పుడు తార " లక్ష్మణా! నీ నోటి వెంట సుగ్రీవుడి గురించి ఇటువంటి మాటలు రాకూడదు. సుగ్రీవుడు కుటిలుడు కాదు, అసత్యవాది కాదు, ఇంద్రియ నిగ్రహం లేనివాడు కాదు, శఠుడు కాదు. రాముడు చేసిన ఉపకారాన్ని సుగ్రీవుడు ఎన్నడూ మరిచిపోలేదు. రాముడు చేసిన ఉపకారం వల్లనే సుగ్రీవుడు ఈనాడు ఇంత గొప్ప రాజ్యాన్ని, ఐశ్వర్యాన్ని, రుమని, నన్ను పొందగలిగాడు. చాలా కాలం సుఖాలకి దూరంగా ఉండడం వలన సుగ్రీవుడు ఈనాడు సమయాన్ని మరిచిపోయాడు. ఏమయ్యా, నా భర్తేన అలా మరిచిపోయినవాడు? విశ్వామిత్రుడంతటివాడు కూడా కామానికి లొంగి సమయాన్ని మరిచిపోయాడు కదా. ఏ రుమ యందు, ఏ రాజ్యమునందు, నా యందు ఆనందముతో సుగ్రీవుడు ఈనాడు సమయాన్ని మరిచిపోయాడో, అదే సుగ్రీవుడు రామకార్యం కోసం అవసరమైతే నన్ను, రుమని, రాజ్యాన్ని వదిలేస్తాడు. రావణుడు యుద్ధంలో నిహతుడవుతాడు. చంద్రుడితో రోహిణి కలిసినట్టు, కొద్దికాలంలోనే సీతమ్మ రాముడితో కలవడం సుగ్రీవుడు చూస్తాడు. 

No comments:

Post a Comment