Pages

Saturday, 26 May 2012

రామాయణం @ కధ -71


అప్పుడు సీతమ్మ అనింది " ఒకానొకప్పుడు అరణ్యవాసం చేస్తున్నప్పుడు చిత్రకూట శిఖరాల మీద ఆశ్రమాన్ని నిర్మించుకుని అక్కడున్న తపోభూములలో నేను, రాముడు విహరిస్తూ ఉండేవాళ్ళము. అటువంటి సమయంలో ఈశాన్య పర్వతానికి పక్కన ఉన్న ఒక చిన్న పర్వతం మీద మేము విహరిస్తున్నాము. అప్పుడు రామడు అక్కడున్న కొలనులోని నీళ్ళల్లో ఆడుకొని, తడిబట్టలతో పరిగెత్తుకుంటూ నా దెగ్గరికి వచ్చి నా పక్కన కూర్చున్నాడు. (రాముడికి రావణుడికి అప్పటి వరకూ ఎటువంటి శత్రుత్వం లేదు. ఇంకా కొన్ని సంవత్సరాలలో అరణ్యవాసం పూర్తయ్యి రాముడు అయోధ్యకి వెళ్ళిపోతాడు. అవతార ప్రయోజనం కోసం రావణుడు సీతమ్మని ఎలాగు అపహరిస్తాడు, కాని సీతమ్మకి ఏదన్నా అపకారం జెరిగితే రాముడు ఎలా స్పందిస్తాడో చూద్దామని దేవతలు ఇంద్రుడి కొడుకైన  కాకసురుడిని పంపారు. ఆ కాకాసురుడు కాకి రూపంలో పర్వతం మీద ఉంటాడు) ఆ సమయంలో నేను కొన్ని మాంసపు ఒరుగులు(వడియాలు) అక్కడ ఎండపెట్టాను. నా పక్కన కూర్చున్న రాముడు సంతోషంగా నాతో మాట్లాడుతున్నాడు. 



అప్పుడు కాకసురుడనే కాకి అక్కడికి వచ్చి ఆ ఒరుగులని తినడం ప్రారంభించింది. అప్పుడు నేను ఒక మట్టిగడ్డని తీసి ఆ కాకి మీదకి విసిరాను. అప్పుడా పక్షి నా వక్షస్థలం మీద వాలి, తన ముక్కుతో గాడి వేసి నా మాంసం పీకింది. ఆ బాధలో నేను గిలగిలలాడడం వలన నా వడ్డాణం జారింది, నేను ఆ వడ్డాణాన్ని తీసి కాకి మీదకి విసరబోతే రాముడు నన్ను చూసి నవ్వి ' సీత! కాకి మీదకి బంగారు వడ్డాణం విసురుతావ ' అన్నాడు. తరువాత నేను ఆ బాధని ఓర్చుకొని రాముడి ఒడిలో తల పెట్టుకొని నిద్రపోయాను. నేను అలా రాముడి ఒడిలో తల పెట్టుకొని ఉన్నంత సేపు ఆ కాకి రాలేదు. మళ్ళి కొంతసేపటికి నేను నిద్రలేచాను, అప్పుడు రాముడు నా ఒడిలో తల పెట్టుకొని నిద్రపోతున్నాడు. అప్పుడు మళ్ళి ఆ కాకసురుడనే కాకి నా వక్షస్థలం మీద కూర్చుని, మళ్ళి గట్టిగా నా శరీరంలోకి పొడిచి నా మాంసాన్ని తినింది. అప్పుడు నా శరీరం నుండి రక్తం కారి రాముడి నుదిటి మీద పడింది. అప్పుడు రాముడు లేచి ఇంత రక్తం ఎక్కడిది అని చేసేసరికి, వక్షస్థలం నుండి రక్తం  కారుతూ, ఏడుస్తూ నేను కనపడ్డాను. అప్పుడాయన నోటినుండి అప్రయత్నంగా ఒక మాట వచ్చింది ' ఎవడురా అయిదు తలల పాముతో ఆటలాడినవాడు ' అని గద్దించాడు. (సీతమ్మని పంచముఖ గాయత్రిగా రాముడు ఆనాడు లోకానికి చెప్పాడు) అప్పుడాయన చుట్టూ చూసేసరికి ముక్కుకి రక్తంతోమాంసం ముక్కతోకాళ్ళకి నెత్తురుతో ఒక కాకి కనపడింది. 



అప్పుడు రాముడు అక్కడ ఉన్న ఒక దర్భని(గడ్డిని) తీసి, దాని మీద బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి (మంత్ర పూరితమైన అస్త్రాలని ప్రయోగించేటప్పుడు బాణాలె అవసరంలేదు, దేనిమీదన్నా ఆ మంత్రాన్ని అభిమంత్రించి ప్రయోగించచ్చు) విడిచిపెట్టాడు. అప్పుడా బ్రహ్మాస్త్రం కాకిని తరిమింది, ఆ కాకి మూడు లోకములు తిరిగి అందరి దెగ్గరికి వెళ్ళింది, కాని అందరూ ' రాముడు చంపుతానని అస్త్ర ప్రయోగం చేస్తే మేము రక్షించలేము, నువ్వు వెళ్ళిపో ' అన్నారు. ఆ కాకి అన్ని చోట్లకి తిరిగి తిరిగి రాముడున్న చోటకి వచ్చి నమస్కారం చేస్తూ పడిపోయింది (మంత్రంతో అభిమంత్రించిన అస్త్రానికి ఒక మర్యాద ఉంటుంది. వెన్ను చూపించి పారిపోతున్నవాడిని ఆ అస్త్రం కొట్టదు, ఎదురుతిరిగి యుద్ధం చేసినవాడినే అది కొడుతుంది. కాకాసురుడు ఆ బ్రహ్మాస్త్రానికి ఎదురుతిరగకుండా వెన్ను చూపించి పారిపోతున్నాడు కనుక అది ఆయనని సంహరించలేదు). 

రాముడు ఆ కాకిని చూసి ' నా దెగ్గరికి వచ్చి పడిపోయావు కనుక నువ్వు నాకు శరణాగతి చేసినట్టె. అందుకని నేను నిన్ను విడిచిపెడుతున్నాను. కాని ఒకసారి బ్రహ్మాస్త్రం వేసిన తరువాత ప్రాణములతో సమానమైన దానిని ఇచ్చెయ్యాలి, మరి నువ్వు ఏమిస్తావు ' అని ఆ కాకసురుడిని రాముడు అడిగాడు. 

అప్పుడా కాకాసురుడు తన కుడి కన్నుని బ్రహ్మాస్త్రానికి ఆహారంగా వేసి రాముడికి నమస్కారం చేసి, దశరథుడికి నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. ఆనాడు ఒక కాకి మీద బ్రహ్మాస్త్రం వేసిన రాముడు ఇవ్వాళ ఎందుకు ఊరుకున్నాడో ఆలోచించమని ఒకసారి రాముడికి చెప్పు " అని సీతమ్మ కాకాసుర వృత్తాంతాన్ని హనుమకి చెప్పింది.


తరువాత సీతమ్మ అనింది " శత్రువులను సంహరించగలిగిన సమర్ధత కలిగిన ఓ హనుమా! నా వల్ల చిన్నదో పెద్దదో ఒక పొరపాటు జెరిగి ఉంటుంది. మా అత్తగారు కౌసల్య దేవి లోకము నంతటిని రక్షించే కొడుకుని కనింది, ఆ రాముడి పాదాలకు సాంజలి బంధకంగా నమస్కరించానని చెప్పు. దశరథ మహారాజు మరణించినా కూడా రాముడు ఆ బాధని పొందలేదు అంటె లక్ష్మణుడు పక్కన ఉండడమే కారణం. వదినని తల్లిలా చూసే స్వభావం ఉన్నవాడు లక్ష్మణుడు. లక్ష్మణుడు నాకు కొడుకుతో సమానమైనవాడు, ఆ లక్ష్మణుడిని కుశలమడిగానని చెప్పు. సుగ్రీవుడిని కుశలమడిగానని చెప్పు. హనుమా! నీ యొక్క వాక్కుల ద్వారా రామచంద్రమూర్తి మనస్సులో నాయందు ఉన్నటువంటి ప్రేమని ఉద్దీపింప చేసి నన్ను తొందరలో తీసుకువెళ్లేటట్టు చెయ్యి " అనింది.



అప్పుడు హనుమంతుడు " అమ్మా! కాకాసుర వృత్తాంతం చెప్పావు, దీనితో పాటుగా ఇంకొక అభిజ్ఞానాన్ని ఇస్తావా, తీసుకువెళతాను " అన్నాడు.





అప్పుడు సీతమ్మ తన పవిట కొంగుకి కట్టి ఉన్న మూటని విప్పి, అందులో ఉన్న చూడామణిని ఇచ్చింది. (చూడమణి సముద్రజలాల నుండి పైకి వచ్చింది. దానిని దేవేంద్రుడు జనకుడికి ఒక యాగంలో బహూకరించాడు) ఈ చూడామణిని వివాహ సమయంలో నా శిరస్సుయందు మా అమ్మ అలంకరించింది. నువ్వు దీనిని రాముడికి ఇవ్వు, అప్పుడు రాముడికి ఏకకాలంలో ముగ్గురు జ్ఞాపకానికి వస్తారు, మా అమ్మ, దశరథుడు, నేను రాముడికి జ్ఞాపకం వస్తాము " అనింది.

హనుమంతుడు ఆ చూడామణిని కన్నులకి అద్దుకుని, రాముడు ఇచ్చిన ఉంగరాన్ని ఎలా భద్రపరుచుకున్నాడో, అలా చూడామణిని కూడా జాగ్రత్తగా భద్రపరుచుకున్నాడు. సీతమ్మ ఆభరణం చేతిలో పడగానే ఆయనకి విశేషమైన శక్తి, ధైర్యం కలిగింది. 

మళ్ళి సీతమ్మ అనింది " ఒకనాడు నేను రాముడితో కలిసి విహరిస్తున్న సమయంలో నా నొసటన పెట్టుకున్న తిలకం మరుగునపడింది. అప్పుడు రాముడు అక్కడున్న ఒక కుంకుమ శిలని అరగదీసి నా బుగ్గ మీద చుక్క పెట్టాడు. ఈ విషయాన్ని కూడా రాముడికి జ్ఞాపకం చెయ్యి " అనింది.


అప్పుడు హనుమంతుడు " నేను బయలుదేరతాను " అంటె, " నాయన!  10 నెలల నుంచి ఇక్కడ ఉంటున్నాను, కాని ఒక్కనాడు రామనామం వినలేదు. ఇన్నాళ్ళకి నువ్వు వచ్చి రామ కథ చెప్పావు. నా మనస్సు పొంగిపోయింది. అంత తొందరగా నువ్వు వెళ్ళిపోతాను అంటె నాకు చాలా బెంగగా ఉంది. ఎక్కడైనా ఒక రహస్యమైన ప్రదేశంలో ఇవ్వాళ ఉండి, రేపు నాకు కనపడి మళ్ళి ఒక్కసారి ఆ రామకథ నాకు చెప్పవయ్యా. ఇవ్వాల్టికి ఉండిపోవా హనుమా " అని, ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోతున్న కొడుకుని కన్నతల్లి అడిగినట్టు సీతమ్మ హనుమంతుడిని అడిగింది. 

అప్పుడు హనుమంతుడు అన్నాడు " అమ్మ! నువ్వు బెంగపడవద్దు. రాముడు కూడా నీమీద బెంగ పెట్టుకుని శోకిస్తున్నాడు " అన్నాడు.  

అప్పుడు సీతమ్మ " నువ్వు చెప్పిన మాట నాకు మళ్ళి శోకం కలిగిస్తోంది. రాముడు నాకోసం శోకిస్తున్నాడన్న మాట చాలా బాధగా ఉంది. హనుమ! నువ్వు వస్తావు, గరుగ్మంతుడు వస్తాడు, వాయుదేవుడు వస్తాడు 100 యోజనముల సముద్రాన్ని దాటి. ఇంక ఎవరూ ఇక్కడికి రాలేరు, మరి రావణ సంహారం ఎలా జెరుగుతుంది? " అనింది.

మత్‌ విశిష్టాహ్‌ చ తుల్యాహ్‌ చ సంతి తత్ర వన ఒకసహ్‌ |
మత్తహ్‌ ప్రత్యవరహ్‌ కశ్చిన్‌ న అస్తి సుగ్రీవ సన్నిధౌ || 

హనుమంతుడు అన్నాడు " సుగ్రీవుడి దెగ్గర నాతో సమానమైన బలం ఉన్నవాళ్లు ఉన్నారు, నాకన్నా అధికమైన బలం ఉన్నవాళ్లు ఉన్నారు, కాని నాకన్నా తక్కువ బలం ఉన్నవాడు సుగ్రీవుడి దెగ్గర లేడమ్మా. (ఈ మాట హనుమంతుడి వినయానికి నిదర్సనం) నేను వెళ్ళి రాముడికి చెప్పి తొందరలోనే వానర సైన్యంతో లంకా పట్టణానికి వచ్చి, రావణుడిని సంహరిస్తాము " అన్నాడు.

No comments:

Post a Comment