Pages

Monday, 21 May 2012

రామాయణం @ కధ -67



నమోస్తు రామాయ సలక్ష్మణాయ, దేవ్యైచ తస్యై జనకాత్మజాయై, |
నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో, నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః ||



(దీనిని రామాయణానికి ప్రార్ధనా శ్లోకంగా చెబుతారు)



" లక్ష్మణుడితో కూడుకుని ఉన్న రాముడికి నమస్కారం, జనకుని కూతురైన సీతమ్మకి నమస్కారం, రుద్రుడికి, ఇంద్రుడికి, యముడికి, వాయుదేవుడికి నమస్కారం, చంద్రుడికి, సూర్యుడికి, దేవతలందరికి నమస్కారం. నాకు సీతమ్మ తల్లి దర్శనం అయ్యేటట్టు దేవతలందరు కాటాక్షించెదరుగాక " అని నమస్కారం చేశాడు.   

అప్పుడు హనుమంతుడికి ఎదురుగా అశోకవనం కనపడింది. అప్పుడాయన ఒక ధనుస్సు నుండి విడవబడిన బాణంలా ముందుకి వెళ్ళి అశోకవనంలో దిగారు. హనుమంతుడు అక్కడున్న అన్ని చెట్ల మీదనుంచి అటూ ఇటూ దూకుతూ సీతమ్మని వెతికాడు. ఆ అశోకవనంలో రావణుడు తన తపఃశక్తితో నిర్మించిన క్రుతికమైన ఒక కొండ, ఆ కొండ మీద నుంచి ప్రవహిస్తున్న నది ఉన్నాయి. 

అలా హనుమంతుడు ఆ అశోకవనాన్ని వెతుకుతుండగా ఆయనకి దూరంగా వెయ్యి స్తంభాలతో కూడుకున్న ఒక బ్రహ్మాండమైన ప్రాసాదం కనపడింది. అది అక్కడున్న సైనికులు విశ్రాంతి తీసుకోవడం కోసం ఏర్పాటు చేసిన మంటపం, దాని మీదకి శింశుపా వృక్షం ఉంది. అప్పుడాయన ఆ శింశుపా వృక్షం మీదకి దూకి, ఆ చెట్టు కొమ్మల నుంచి కిందకి చూస్తే, చుట్టూ రాక్షస స్త్రీల మధ్యలో ఒక స్త్రి పట్టుపుట్టం కట్టుకుని ఉంది. ఆమె సీతమ్మే అయి ఉంటుందని, ఆ ఆకులని పక్కకి తోస్తూ హనుమంతుడు చూసేసరికి మట్టి పట్టిన బట్టతో, చుట్టూ అనేకమంది రాక్షస స్త్రీలతో, ఉపవాసాల చేత క్షీణించిపోయి దీనురాలిగా ఉన్న, కన్నులనిండా నీరు ఉన్న, మళ్ళి మళ్ళి వేడి నిట్టూర్పులు వదులుతున్న, శుక్ల పక్షంలో వచ్చే మొదటి చంద్రరేఖలా, ప్రయత్నపూర్వకంగా చూస్తే తప్ప తెలియని ప్రకాశంతో, పొగతో కప్పబడిన అగ్నిజ్వాలలా, నలిగిన పసుపచ్చ బట్ట కట్టుకొని, అంగారకుడి చేత పీడింపబడిన రోహిణిలా, పెరిగిన వృద్ధి తగ్గిన దానిలా, శ్రద్ధని కోల్పోయిన దానిలా, ఆశ నెరవేరని దానిలా, అవమానంతో సిగ్గుపడుతూ ఉన్న సీతమ్మని హనుమంతుడు చూశాడు. 


అలా ఉన్న సీతమ్మని చూసిన హనుమంతుడి కళ్ళ నుండి ఆనందబాష్పాలు కారాయి. అలా నల్లటి కళ్ళతో ఉన్న సీతమ్మని చూసిన హనుమకి, ఆవిడ అంగ ప్రత్యంగములయందు రాముడు జ్ఞాపకానికి వచ్చాడు ( సీతమ్మని చూడడం అంటె ప్రకృతిని చూడడం, ఆ ప్రకృతియందు పురుషుడిని{రాముడిని} చూడడం, అంటె హనుమ ఈనాడు అద్వైత దర్శనం చేశాడు). 

సీతమ్మని అలా చూసిన హనుమంతుడు అనుకున్నాడు " మా రాముడి గుండె చాలా గట్టిది, ఎవ్వరూ చెయ్యలేని పని రాముడు చేశాడని ఇప్పుడు నేను గుర్తించాను. అదేంటంటే, పది నెలలనుంచి ఈ సీతమ్మ రాముడి పేరు చెప్పుకుంటూ, తపస్సు చేసుకుంటూ, రాముడి గురించి శోకిస్తూ ఇక్కడ ఉంటె, అటువంటి భార్యకి దూరంగా ఉండి కూడా 10 నెలల నుంచి ప్రాణాలు నిలబెట్టుకొని ఉన్నాడు, కనుక రాముడు ఎవ్వరూ చెయ్యలేని పని చేశాడు. రాముడి మనస్సు సీతమ్మ దెగ్గర ఉంది, సీతమ్మ మనస్సు రాముడి దెగ్గర ఉంది, అందుకని ఇద్దరూ ఒకరికి ఒకరు దూరంగా ఉండి కూడా ఇంత కాలం బతకగలిగారు. మూడు లోకములలో ఉండే ఐశ్వర్యాన్ని అంతా తీసుకొచ్చి ఒకపక్క పెట్టి, మరోపక్క సీతమ్మని పెడితే, సీతమ్మ యొక్క వైభవంలో 16వ వంతుతో కూడా ఆ ఐశ్వర్యము, వైభవము సరితూగదు. నల్లటి జుట్టుతో, ఎర్రటి పెదవితో, సన్నటి నడుముతో, పద్మములవంటి కన్నులతో ఆ తల్లి శింశుపా వృక్షం కింద కూర్చుని ఉంది. గురువుల చేత శిక్షింపబడిన బుద్ధి కలిగిన లక్ష్మణుడి చేత ఆరాధింపబడే సీతమ్మ, పెద్దలచే పొగడబడే సీతమ్మ, లక్ష్మణుడి గురువైన రాముడి యొక్క ఇల్లాలైన సీతమ్మ, ముందు రాముడు వెనుక లక్ష్మణుడు ఉండగా మధ్యలో నడవవలసిన సీతమ్మ, దశరథుడి పెద్ద కోడలైన సీతమ్మ, జనకుడి కూతురైన సీతమ్మ ఇవ్వాళ చుట్టూ రాక్షస స్త్రీలు ఉండగా, పది నెలల నుండి ఒకే వస్త్రాన్ని కట్టుకొని పడి ఉందంటే, 

యది సీతాపి దుఃఖార్తా కాలోహి దురతిక్రమః|

ఈ కాలం అన్నది ఏదన్నా చెయ్యగలదు, ఈ కాలాన్ని ఎవరూ అతిక్రమించలేరు. 

ఈ సీతమ్మ కోసమే 14,000 రాక్షసులు మరియు ఎంతో మంది రాక్షసులు చనిపోయారు. ఈ తల్లి కారణంగానే సుగ్రీవుడు పట్టాభిషేకం పొందాడు, వాలి తెగటారిపోయాడు. నువ్వు ఇక్కడ కూర్చున్నావు కాని, నీ వల్ల అక్కడ ఎంత కథ నడుస్తుందో తెలుసా అమ్మ. నీకు నీ అమ్మ(భూదేవి) పోలిక వచ్చిందమ్మా, అందుకే నీకు ఇంత ఓర్పు ఉంది, రామలక్ష్మణుల చేత రక్షింపబడవలసిన తల్లివి, ఇలా వికృతమైన రాక్షస స్త్రీల మధ్యన చెట్టుకింద కూర్చున్నావ అమ్మ. శీలంవయస్సునడువడి,వంశాలుశరీరాలు అనే ఈ అయిదు లక్షణాలలో(వివాహం చేసేముందు వధువు,  వరుడు ఈ 5 లక్షణాలలో సరిపోతారో లేదో చూడాలి) నువ్వు రాముడికి తగినదానివి, మా సీతమ్మ ముందు పాపాత్ముడైన రావణుడు నిలుచున్నా ఆమె కళ్ళు ఎప్పుడూ నల్లగానే, శాంతంగా ఉంటాయి. కాని రాముడి కళ్ళు కోపంతో అప్పుడప్పుడు ఎరుపెక్కుతాయి " అని అనుకున్నాడు.

హనుమంతుడు సీతమ్మని అలా చూస్తుండగా, మెల్లగా తెల్లవారింది. తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో ఆ లంకా పట్టణంలో బ్రహ్మరాక్షసులు(యజ్ఞ యాగాది క్రతువులని నిర్వహించేటప్పుడు సరైన దృష్టి లేకుండా, పక్షపాత బుద్ధితో మంత్రాన్ని ఎవరైతే పలుకుతారో, వారు ఉత్తర జన్మలలో బ్రహ్మరాక్షసులుగా పుడతారు) వేద మంత్రాలను పఠింస్తుండగా, మంగళవాయిద్యాలు వినపడుతుండగా రావణుడు నిద్రలేచాడు. రావణుడు నిద్రలేస్తూ, జారుతున్న వస్త్రాన్ని గట్టిగా బిగించుకున్నాడు. ఆ సమయంలో ఆయనకి సీతమ్మ గుర్తుకు వచ్చి విశేషమైన కామం కలిగింది. ఆయన వెంటనే ఉత్తమమైన ఆభరణములని ధరించి, స్నానం కూడా చెయ్యకుండా అశోకవనానికి బయలుదేరాడు. రాత్రి రావణుడితో క్రీడించిన కాంతలు కూడా ఆయన వెనకాల బయలుదేరారు. ఆ స్త్రీలలో ఒక స్త్రీ రావణుడి కోసం బంగారు పాత్రలో మద్యాన్ని పట్టుకొని వెళ్ళింది , ఇంకొక స్త్రీ రావణుడు ఉమ్మి వెయ్యడం కోసమని ఒక పాత్ర పట్టుకొని వెళ్ళింది , కొంతమంది ఆయనకి గొడుగు పట్టారు. ఆయన వెనకాల కొంతమంది మంగళవాయిద్యాలు మ్రోగిస్తూ వస్తున్నారు, అలాగే కొంతమంది రాక్షసులు కత్తులు పట్టుకొని వచ్చారు. ఇంతమంది పరివారంతో కలిసి దీనురాలైన ఒక స్త్రీ పట్ల తన కామాన్ని అభివ్యక్తం చెయ్యడానికి తెల్లవారుజామున రావణుడు బయలుదేరాడు. 

అప్పటివరకూ శింశుపా వృక్షం కింద కూర్చుని రాముడిని తలుచుకుంటూ ఉన్న సీతమ్మ రావణుడు రావడాన్ని గమనించి, ఇటువంటి దుర్మార్గుడికి శరీరంలో ఏ అవయవములు కనపడితే ఏ ప్రమాదమో అని, స్త్రీ అవయవములు ఏవి కనపడితే పురుషుడు ఉద్రేకం చెందుతాడో అటువంటి అవయవములు కనపడకుండా జాగ్రత్తపడి, తన తొడలతో, చేతులతో శరీరాన్ని ముడుచుకొని కూర్చుంది. అలా ఉన్న సీతమ్మ తగ్గిపోయిన పూజలా, అపవాదాన్ని భరిస్తున్న దానిలా, శ్రద్ధ నశించిపోయిన దానిలా, యజ్ఞ వేదిలో చల్లారిపోతున్న దానిలా ఉంది. అలా ఉన్న సీతమ్మ దెగ్గరికి తెల్లటి పాలనురుగు లాంటి వస్త్రం ధరించి రావణుడు వచ్చాడు. అప్పుడాయన తేజస్సుని చూడలేక హనుమంతుడు కొంచెం వెనక కొమ్మలలోకి వెళ్ళి, ఆకులని అడ్డు పెట్టుకొని రావణుడిని చూశాడు. 


రావణుడు సీతమ్మతో " సీత! నీకు అందమైన స్తనములు ఉన్నాయి, ఏనుగు తొండాల్లాంటి తొడలు ఉన్నాయి. పిరికిదాన! నీకు ఎందుకు భయం, ఇక్కడ ఎవరున్నారు, ఇక్కడున్న వాళ్ళందరూ రాక్షసులే, నేను రాక్షసుడినే. ఈ 100 యోజనముల సముద్రాన్ని దాటి ఎవ్వరూ రాలేరు. నేను అన్ని లోకాలని ఓడించాను. నా వైపు కన్నెత్తి చూసేవాడు ఎవ్వడూ లేడు, ఇక్కడ తప్పు చెయ్యడానికి భయపడతావు ఎందుకు. ఎవరన్నా ఉత్తమమైన స్త్రీలు కనపడితే వాళ్ళని తీసుకొచ్చి మాదిగా అనుభవించడం రాక్షసుల ధర్మం. నేను రాక్షసుడిని, నేను నా ధర్మాన్ని పాటించాను. ఏదో నేను తప్పు చేసినట్టు చుస్తావేంటి. మనిషికి శరీరంలో యవ్వనం అనేది కొంతకాలం మాత్రమే ఉంటుంది, నువ్వు యవ్వనంలో ఉన్నావు కాబట్టి నేను నిన్ను కామించాను, నువ్వు ఇలాగె చెట్టు కింద కూర్చొని ఉపవాసం చేస్తే నీ యవ్వనం వెళ్ళిపోతుంది, అప్పుడు నేను నిన్ను కన్నెత్తి కూడా చూడను. యవ్వనంలో ఉన్నప్పుడే భోగం అనుభవించాలి. నేను నిన్ను పొందాలి అని అనుకుని ఉండుంటే అది నాకు క్షణంలో పని, కాని నేను నిన్ను బలవంతంగా పొందను. నీఅంతట నువ్వు నా పాన్పు చేరాలి. 

No comments:

Post a Comment