Pages

Tuesday, 8 May 2012

రామాయణం @ కధ -56

                                         


ధర్మం అర్థం చ కామం చ సమయం చ అపి లౌకికం |
అవిజ్ఞాయ కథం బాల్యాత్ మాం ఇహ అద్య విగర్హసే ||




అప్పుడు రాముడు " నీకు అసలు ధర్మం గురించి కాని, అర్ధం గురించి కాని, కామం గురించి కాని తెలుసా? నువ్వు అజ్ఞానివి. బాలుడు ఎలా ప్రవర్తిస్తాడో నువ్వు అలా ప్రవర్తించే వాడివి, నీకు ఏమి తెలుసని నామీద ఇన్ని ఆరోపణలు చేశావు. నువ్వు అజ్ఞానివి కావడం వలన నీకు తెలియకపోతే, ఆచారం తెలిసినవారిని, పెద్దలైన వారిని ఆశ్రయించి నువ్వు కనుక్కోవాలి. నువ్వు అవేమి తెలుసుకోకుండా నా గురించి అడుగుతున్నావు. ఇక్ష్వాకుల యొక్క రాజ్యంలోకి ఈ భాగం కూడా వస్తుంది. ఆ ఇక్ష్వాకు వంశంలో పుట్టిన భరతుడు ఇప్పుడు రాజ్యం చేస్తున్నాడు. ఇక్ష్వాకు వంశంవారు రాజ్యం చేస్తుండగా ధర్మాధర్మములు జెరిగిన చోట నిగ్రహించే అధికారం మాకు ఉంటుంది. నీకు కామం తప్ప వేరొకటి తెలియదు, అందుచేత నీకు ధర్మాధర్మ విచక్షణ చేసే అధికారం లేదు. జన్మనిచ్చిన తండ్రి, పెద్ద అన్నగారు, చదువు నేర్పిన గురువు, ఈ ముగ్గురూ తండ్రులతో సమానం. అలాగే తనకి జన్మించిన కుమారుడు, తోడబుట్టిన తమ్ముడు, తన దెగ్గర విద్య నేర్చుకున్న శిష్యుడు, ఈ ముగ్గురూ కుమారులతో సమానము.  


నీ తండ్రి మరణించడం చేత, నువ్వు పెద్దవాడివి అవడం చేత నువ్వు తండ్రితో సమానము. నీ తమ్ముడు సుగ్రీవుడు నీకు కొడుకుతో  సమానం , ఆయన భార్య అయిన  రుమ నీకు కోడలితో సమానము. కాని సుగ్రీవుడు బతికి ఉన్నాడని తెలిసి, కోడలితో సమానమైన రుమని నువ్వు అనుభవించి, నీ భార్యగా కామ సుఖాలని పొందుతున్నావు ( వాలి బిలంలో ఉండిపోయినప్పుడు, వాలి మరణించాడు అనుకొని సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశారు. అప్పుడు సుగ్రీవుడు వాలి భార్య అయిన తారని తన భార్యగా అనుభవించాడు. మరి సుగ్రీవుడు చేసింది దోషం కాదా? ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏమిటంటే, సంధ్యావందనం చేసే వానర జాతికి, రాజ్యపాలన చేసే వానర జాతికి, మంత్రులచేత సేవింపబడే వానర జాతికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ జాతిలోని స్త్రీలు తమ భర్త మరణిస్తే మరిదిని పునర్వివాహం చేసుకొని, వారితో ఉండచ్చు. ఆనాడు వాలి చనిపోయాడనుకొని తార సుగ్రీవుడిని వివాహమాడింది. కనుక సుగ్రీవుడితో ఆనాడు తార ఉండడం ధర్మం తప్పడం కాదు. కాని సుగ్రీవుడు బతికే ఉన్నాడని తెలిసి కూడా ఆయన భార్యతో కామ సుఖాలని అనుభవించడం వాలి యొక్క దోషం. ఈ నియమం కేవలం పైన చెప్పిన వానర జాతికి మాత్రమే, మనుష్యులకి కాదు. అలాగే వాలికి రెండు శక్తులు ఉన్నాయి. ఒకటి, ఇంద్రుడు ఇచ్చిన మాలని మెడలో వేసుకుంటే, వాలి అపారమైన ఉత్సాహంతో ఉంటాడు. రెండు, ఎవరన్నా వాలికి ఎదురుగా వెళితే, వాళ్ళ శక్తిలో సగం శక్తిని ఈయన లాగేసుకుంటాడు, ఇది బ్రహ్మగారు వాలికి ఇచ్చిన వరం. అలాగే వాలికి రావణాసురుడికి స్నేహం ఉంది, వాళ్ళిద్దరూ ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. దాని ప్రకారం వాలి అనుభవించే స్త్రీని రావణుడు అనుభవించచ్చు, వాలికి శత్రువు రావణుడికి శత్రువే........అలా కొన్ని విషయాలలో ఒప్పందం కుదుర్చుకున్నారు ).

అందుచేత ఒక మామగారు కోడలితో కామభోగాన్ని అనుభవిస్తే ఎంత దోషమో, అంత దోషాన్ని నువ్వు చేశావు. ధర్మ శాస్త్రంలో దీనికి మరణశిక్ష తప్ప వేరొక శిక్ష లేదు. అందుకని నేను నిన్ను చంపవలసి వచ్చింది. నువ్వు ప్రభువువి, మంత్రుల చేత సేవింప బడుతున్నవాడివి, సంధ్యావందనం చేస్తున్నవాడివి. నువ్వు ధర్మం తప్పితే నీ వెనుక ఉన్నవారు కూడా ధర్మం తప్పుతారు. నేను క్షత్రియుడని కనుక నిన్ను శిక్షించవలసిన అవసరం నాకు ఉంది. ఇది తప్పు అని తెలిసికూడా నేను నిన్ను శిక్షించకపోతే, నువ్వు చేసిన పాపం నాకు వస్తుంది. ఈ పాపం అవతలవాడు చేశాడని ప్రభువైన వాడికి తెలిసి వాడిని శిక్షిస్తే, వాడి పాపం పోతుంది. కాని ప్రభువు అలా శిక్షించకపోతే ఆ పాపం రాజుకి వెళుతుంది. అందుకే మా వంశంలో ఇంతకు పూర్వం మాంధాత అనే రాజు ఒక శ్రమణికుడు ఇటువంటి దోషం చేస్తే శిక్ష వేశాడు. ఇంక నాతో ఎందుకు స్నేహం చెయ్యలేదు, నాతో స్నేహం చేసి ఉంటె సీతమ్మని తీసుకు వచ్చేవాడిని అన్నావు కదా, నీలాంటి అధర్మాత్ముడితో నేను స్నేహం చెయ్యను. నన్ను చెట్టు చాటు నుండి చంపావు, వేరొకడితో యుద్ధం చేస్తుంటే కొట్టావు, అది దోషం కాదా? అని నన్ను అడిగావు, దానికి నేను సమాధానం చెబుతాను విను.  

తప్పు చేసినవాడిని రాజు శిక్షిస్తే వాడి పాపం ఇక్కడితో పోతుంది. నేను నిన్ను చంపడం వల్ల నువ్వు ఏ పాపము లేని స్థితికి వచ్చావు, నీ పాపం ఇక్కడితో పోయింది, అందుకని నువ్వు ఉత్తమలోకాలకి వెళ్ళిపోతావు. 

న మే తత్ర మనస్తాపో న మన్యుః హరిపుంగవ |
వాగురాభిః చ పాశైః చ కూటైః చ వివిధైః నరాః ||

నేను మానవుడిని, నువ్వు వానరానివి. నేను మనిషిని, నువ్వు జంతువువి. క్షత్రియుడు, మాంసం తినేవాడు, ధర్మాన్ని నిలబెట్టవలసినవాడు ఒక మృగాన్ని కొట్టవలసి వస్తే, తాను చాటున ఉండి కొట్టచ్చు, వల  వేసి పట్టుకోవచ్చు, పాశం వేసి పట్టుకొని కొట్టచ్చు, అది అప్రమత్తంగా ఉన్నప్పుడు కొట్టచ్చు, అది పడుకొని ఉన్నప్పుడు కొట్టచ్చు, నిలబడి ఉన్నప్పుడు కొట్టచ్చు, పారిపోతున్నప్పుడు కొట్టచ్చు, ఎప్పుడైనా కొట్టచ్చు, కాని ఆ మృగం వేరొక స్త్రీ మృగంతో సంగమిస్తున్నప్పుడు మాత్రం బాణ ప్రయోగం చెయ్యకూడదు. నువ్వు మైధున లక్షణంతో లేవు, అందుకని నిన్ను కొట్టాను. నేను నరుడిని కనుక మృగానివైన నిన్ను ఎలా కొట్టినా నాకు పాపం రాదని తెలిసి కొట్టాను. కాని నువ్వు చనిపోయే ముందు రోషం కలిగి నన్ను ప్రశ్నించావు. నాయందు ఎటువంటి దోషము లేదు " అని రామచంద్రమూర్తి సమాధానమిచ్చారు. 


రాముడు మాటలు విన్న వాలి తన రెండు చేతులతో రాముడికి నమస్కారం పెట్టి " మహానుభావ! ధర్మాత్మ! రామచంద్ర! నువ్వు చెప్పినది పరమయదార్ధము. దోషం నాయందే ఉంది. నువ్వు నన్ను చంపడంలో కాని, నాయందు దోషం ఉన్నదీ అని చెప్పడంలోకాని కించిత్ సందేహం లేదు. నువ్వు ధర్మాధర్మ విచక్షణ చేత, నీకు ఉన్న జ్ఞానం చేత, పూర్వాపరములను బాగా పరిశీలించిన మీదట, ఏమిచెయ్యాలో నిర్ణయించుకుని, నిర్ణయించుకున్నదానిని అమలుచేసి, అమలుచేసిన దానిమీద స్థిరంగా నిలబడగల వ్యక్తిత్వం ఉన్నవాడివి, అటువంటి నిన్ను చూసి పొంగిపోతున్నాను. ఇటువంటి నీ చేతిలో మరణమైనా నాకు స్వర్గమే రామ " అన్నాడు.

న చ ఆత్మానం అహం శోచే న తారాం న అపి బాంధవాన్ |
యథా పుత్రం గుణశ్రేష్ఠం అంగదం కనకాంగదం ||

కిందపడిపోయిన వాలి అన్నాడు " రామ! నేను నా ప్రాణములు పోతున్నాయి అని బాధపడడం లేదు, తార గురించి విలపించడం లేదు, కాని నా ప్రియాతిప్రియమైన కుమారుడు అంగదుడు సుఖాలకి అలవాటుపడి బతికినవాడు, ఈ ఒక్క కొడుకు భవిష్యత్తు ఏమవుతుందా అని బెంగపడుతున్నాను. నా కొడుకు యొక్క శ్రేయస్సుని, అభివృద్ధిని నువ్వే సర్వకాలముల యందు చూడాలి రామ " అన్నాడు.

అప్పుడు రాముడు " దండించవలసిన నేరము ఏదన్నా ఒకటి చేయబడినప్పుడు, ఆ దండనని అవతలి వ్యక్తి ప్రభుత్వం నుంచి కాని, రాజు నుండి కాని పొందితే, వాడి పాపం అక్కడితో పోతుంది. ఒకవేళ దండన పొందకపోతే ఆ పాపం ఫలితాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. అందుచేత, వాలి నువ్వు అదృష్టవంతుడివి. నువ్వు చేసిన మహా పాపానికి ఎప్పుడైతే శిక్ష అనుభవించావో, అప్పుడే నీయందు ఉన్న దోషం పోయింది. అందుకని ఇప్పుడు నువ్వు శరీరాన్ని విడిచిపెట్టాక స్వర్గలోకాన్ని పొందడానికి నీకెటువంటి ప్రతిబంధకం ఉండదు. ఇప్పుడు అంగదుడు నిన్ను ఎలా చుసేవాడో, నీ తరవాత సుగ్రీవుడి యందు, నాయందు అలాగే ఉంటాడు. పిన తండ్రి వల్ల నీ కుమారుడికి సమస్య వస్తుందని అనుకోమాకు, అప్పుడు కూడా నీ బిడ్డని తండ్రిగా కాపాడడానికి నేను ఉన్నాను " అన్నాడు.

అలా వాలి కిందపడిపోయి ఉండడం వల్ల చుట్టూ ఉన్న వానరాలు పరుగులు తీశాయి. జెరుగుతున్న ఈ గందరగోళం విన్న తార బయటకి వచ్చి " మీరందరూ ఇలా ఎందుకు పరిగెడుతున్నారు " అని అడిగింది. 

అప్పుడు ఆ వానరాలు " రాముడికి, వాలికి యుద్ధం జెరిగింది. వాలి పెద్ద పెద్ద చెట్లని, పర్వతాలని తీసుకొచ్చి రాముడి మీదకి విసిరాడు. ఇంద్రుడి చేతిలో ఉన్న వజ్రాయుద్ధం లాంటి బాణాలతో రాముడు ఆ చెట్లని, పర్వతాలని కొట్టేసాడు. ఆ యుద్ధంలో ఆఖరున రాముడు వాలిమీద బాణమేసి కొట్టేసాడు, అందుకని నీ కొడుకుని రక్షించుకో, పారిపో " అన్నారు. 

( ఇదే లోకం యొక్క పోకడ అంటె. గొంతు మారుతున్న కొద్దీ నిజం అంతర్ధానమవుతుంది. )

అప్పుడు తార " భర్తపోయిన తరువాత నాకెందుకు ఈ రాజ్యము, ఈ కొడుకు " అని వాలి దెగ్గరికి పరిగెత్తింది. 

అప్పుడా తార వాలితో " నేను నీకు చెప్పిన మాటలు నువ్వు వినలేదు, ఇప్పుడు ఈ పరిస్థితిని తెచ్చుకున్నావు. సుగ్రీవుడి భార్యని అపహరించి తెచ్చావు, కామమునకు లోంగావు " అని చెప్పి, కొన ఊపిరితో ఉన్న వాలిని చూసి విలపించింది. తండ్రి మరణిస్తున్నాడని అంగదుడు నేల మీద పడి భోరున ఏడుస్తున్నాడు. 

అప్పుడు వాలి సుగ్రీవుడితో " సుగ్రీవా! నా దోషాలని లెక్కపెట్టకయ్యా. కాలం బలవత్తరమైన స్వరూపంతో తన ఫలితాన్ని ఇవ్వడానికి నా బుద్ధిని మొహపెట్టి, నీతో నాకు వైరం వచ్చేటట్టు చేసింది. ఈ ఫలితాన్ని అనుభవించడం కోసమని నీ నుండి నన్ను దూరం చేసింది. అన్నదమ్ములమైన మనిద్దరమూ కలిసి ఏకాకాలము నందు సుఖం అనుభవించేటట్టు భగవంతుడు రాయలేదురా సుగ్రీవా. నేను వెళ్ళిపోయే సమయం ఆసన్నమయ్యింది, నీకు ఒక్క మాట చెప్పుకుంటాను సుగ్రీవ, ఇది మాత్రం జాగ్రత్తగా విను. నాకు ఒక్కడే కొడుకు అంగదుడు, వాడు ఇవ్వాళ నాకోసం భూమి మీద పడి కొట్టుకుంటున్నాడు. వాడు సుఖంతో పెరిగాడు, వాడికి కష్టాలు తెలియవు. నేను వెళ్ళిపోయాక వాడికి సుఖాలు ఉండవు కదా. నీ దెగ్గర, పిన్ని దెగ్గర ఎలా ఉండాలో వాడికి తెలియదు కదా. తార బతుకుతుందో లేదో నాకు తెలియదు. అందుకని నా కొడుకుని జాగ్రత్తగా చూడు, వాడికి నువ్వే రక్షకుడివి. తారకి ఒక గొప్ప శక్తి ఉంది సుగ్రీవా. ఎప్పుడైనా ఒక గొప్ప ఉత్పాతం వస్తే, అప్పుడు మనం ఏమిచెయ్యాలో నిర్ణయించుకోలేని స్థితి వస్తే, సూక్ష్మ బుద్ధితో ఆలోచించి చెప్పగలిగిన ప్రజ్ఞ తార సొత్తు. ఒకవేళ అలాంటి పరిస్థితి ఏర్పడితే తార సహాయం తీసుకో. నువ్వు ఎప్పుడైనా కాని రాముడిని అవమానించావ, రాముడి పని చెయ్యడంలో ఆలస్యం చేశావ, నేను వెళ్ళిన మార్గంలో నువ్వు కూడా వచ్చేస్తావు సుగ్రీవా. అందుకని జాగ్రత్తగా ఉండు.  

నాయనా సుగ్రీవ, నా తండ్రి అయిన మహేంద్రుడు ఇచ్చిన మాల నా మెడలో ఉంది, నా ప్రాణం కాని వెళ్ళిపోతే, ఈ శరీరం శవం అయిపోతుంది, అప్పుడీ మాల అపవిత్రం అవుతుంది. ఈ మాల జయాన్ని తీసుకొస్తుంది అందుకని నీకు ఇస్తున్నాను, తీసుకో " అని ఆ మాలని సుగ్రీవుడికి ఇచ్చి ప్రాణములను వదిలేశాడు. 


అప్పుడు తార అనింది " ఎప్పుడూ నీ నోటివెంట ఒక మాట వచ్చేది. ' సుగ్రీవుడా, వాడిని చితక్కొట్టేస్తాను ' అనేవాడివి. చూశావ దైవ విధి అంటె ఎలా ఉంటుందో, ఇవ్వాళ ఆ సుగ్రీవుడు నిన్ను కొట్టేశాడు. ఒంట్లో బలం ఉందని లేచింది మొదలు సంధ్యావందనానికి నాలుగు సముద్రాలు దూకావు. ఇంటికొచ్చి మళ్ళి ఎవరినో కొట్టడానికి వెళ్ళేవాడివి. నీతో యుద్ధం చేసిన ఎందరో వీరులని ఇలా భూమి మీద పడుకోపెట్టావు, ఇవ్వాళ నువ్వు కూడా అలా పడుకున్నావు. శూరుడన్న వాడికి పిల్లని ఇస్తే, ఆమెకి హఠాత్తుగా వైధవ్యం వస్తుంది. అందుకని శూరుడికి ఎవరూ పిల్లని ఇవ్వద్దు.

No comments:

Post a Comment