Pages

Wednesday, 9 May 2012

రామాయణం @ కధ -57



పతి హీనా తు యా నారీ కామం భవతు పుత్రిణీ |
ధన ధాన్య సమృద్ధా అపి విధవా ఇతి ఉచ్యతే జనైః ||




మాటవినే కొడుకులు ఎంత మంది ఉన్నా, అపారమైన ఐశ్వర్యం ఉన్నా, నేను గొప్ప పండితురాలినైనా, నువ్వు వెళ్ళిపోవడం వల్ల లోకం నన్ను చూడగానే మాత్రం విధవ అనే అంటుంది " అనింది.

అప్పుడు సుగ్రీవుడు రాముడితో " నువ్వు చేసిన ప్రతిజ్ఞకి అనుగుణంగా వాలిని సంహరించావు. అన్నని చంపమని నేను నిన్ను అడిగాను, నేను దుర్మార్గుడిని. ఇప్పుడు నాకు తెలుస్తుంది నేను ఎంత అకృత్యం చేశానో అని. అన్నయ్య బతికి ఉన్నంతకాలం, అన్నయ్య పెట్టిన కష్టాలు తట్టుకోలేక, అన్నయ్య పొతే బాగుండు, పొతే బాగుండు అని నిన్ను తీసుకొచ్చి బాణం వెయ్యమన్నాను. అన్నయ్య భూమి మీద పడిపోయాక, అన్నయ్య అంటె ఏమిటో నాకు అర్ధం అవుతుంది రామ. 

నేను వాలి మీదకి యుద్ధానికి వెళితే, నన్ను కొట్టి, ఇంకొక్క గుద్దు గుద్దితే నేను చచ్చిపోతాను అన్నంతగా అలిసిపోయాక, ' ఇంకెప్పుడూ ఇలాంటి పని చెయ్యకే, పో ' అని వెళ్ళిపోయేవాడు, కాని నన్ను చంపేవాడు కాదు. ఒక తల్లి బిడ్డలమని నన్ను ఎన్నడూ వాలి చంపలేదు. నేను చచ్చిపోతానని వాలి నన్ను అన్నిసార్లు వదిలేశాడు, కాని నేను వాలిని చంపించేసాను. నీతో వాలిని చంపమని చెప్పినప్పుడు నాకు ఈ బాధ తెలియలేదు, కాని జెరిగినప్పుడు తెలుస్తుంది. అందుకని నాకు ఈ రాజ్యం వద్దు రామ. 

పెద్ద చెట్టు కొమ్మని విరిచి తీసుకొచ్చి, దానితో నన్ను కొట్టి, ఇంక నేను ఆ దెబ్బలు తట్టుకోలేక పడిపోతే, ' ఇంకెప్పుడూ ఇలాంటి తప్పు పనులు చెయ్యకు, పో ' అనేవాడు. ఇవ్వాళ నన్ను అలా అనే అన్నయ్య ఎక్కడి నుంచి వస్తాడు. ఇక నేను ఉండను, నేను అగ్నిలోకి వెళ్ళిపోతాను. రామ! మిగిలిన ఈ వానరులు నీకు సీతాన్వేషణలో సహాయం చేస్తారు " అన్నాడు.


సుగ్రీవుడు అలా ఏడుస్తుంటే చూడలేక రాముడు ఏడిచాడు. తార వాలిని కౌగలించుకొని ఎడుద్దాము అంటె, రాముడి బాణం వాలి గుండెలకి గుచ్చుకొని ఉంది. అప్పుడు నలుడు వచ్చి ఆ బాణాన్ని తీసేసాడు. అప్పుడా తార భర్త యొక్క శరీరం దెగ్గర ఏడిచాక, రాముడి దెగ్గరికి వచ్చి " రామ! నీగురించి ఊహించడం ఎవరి శక్యం కాదు. నువ్వు అపారమైన కీర్తికి నిలయమైన వాడివి. భూమికి ఎంత ఓర్పు ఉందో, రామ! నీకు అంత ఓర్పు ఉంది. నువ్వు విశాలమైన నేత్రములు కలిగినటువంటివాడివి. నీ చేతిలో పట్టుకున్న కోదండం, నీ అవయవముల అందమైన పొందిక, దానిలో ఉన్న కాంతి చూసిన తరువాత నువ్వు అందరివంటి మనుష్యుడవి కావని నేను గుర్తించాను. ప్రపంచంలో అన్నిటికన్నా గొప్ప దానం, భార్యా దానం. నేను లేకపోతె వాలి అక్కడ కూడా సంతోషాన్ని పొందలేడు. అందుకని వాలిని ఏ బాణంతో కొట్టావో, నన్ను కూడా ఆ బాణంతో కొట్టు, నేనూ వాలి దెగ్గరికి వెళ్ళిపోతాను " అనింది. 


అప్పుడు రాముడు " నువ్వు అలా శోకించకూడదమ్మా. కాలం అనేది ఒక బలమైన స్వరూపం, అది పాపపున్న్యలకి ఫలితాన్ని ఇస్తుంది. ఇక్కడ వాలి శరీరం ఇలా పడి ఉండగా మీరందరు ఇలా మాట్లాడకూడదు. జెరగవలసిన క్రతువుని చూడండి " అన్నాడు.

తరువాత వాలి శరీరాన్ని అగ్నికి ఆహుతి చేశారు. 


తదనంతరం సుగ్రీవుడు, హనుమంతుడు మొదలైన వానరములు రాముడి దెగ్గర కూర్చున్నారు. అప్పుడు హనుమంతుడు " ఇంతగొప్ప రాజ్యాన్ని సుగ్రీవుడు పొందేతట్టుగా నువ్వు అనుగ్రహించావు. అందుకని నువ్వు ఒక్కసారి కిష్కిందా నగరానికి వస్తే నీకు అనేకమైన రత్నములను బహూకరించి, నీ పాదాలకి నమస్కరించి సుగ్రీవుడు కృతకృత్యుడు అవుతాడు " అని అన్నాడు. 

అప్పుడు రాముడు " 14 సంవత్సరాలు తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం అరణ్యంలో ఉంటాను. నేను గ్రామంలో కాని, నగరంలో కాని ప్రవేశించి నిద్రపోను. పెద్దవాడైన వాలి యొక్క కొడుకైన అంగదుడు యోగ్యుడు, మీరు అతనికి యువరాజ పట్టాభిషేకం చెయ్యండి. సుగ్రీవుడికి రాజ్య పట్టాభిషేకం చెయ్యండి. మీరందరు సంతోషంగా కిష్కిందలో ఉండండి. ఈ వర్షాకాలంలో రావణుడిని వెతుకుతూ వెళ్ళడం కష్టం. సుగ్రీవా! పట్టాభిషేకం చేసుకొని 4 నెలలు యదేచ్ఛగా సుఖాలు అనుభవించు. కొండల మీద తిరిగి ఎన్నాళ్ళ నుంచి కష్టపడ్డావో. 4 నెలల తరువాత కార్తీక మాసం వచినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. అంతవరకు నేను ఊరి బయట ప్రస్రవణ పర్వత గుహలో ఉంటాను " అని చెప్పి సుగ్రీవుడిని పంపించాడు. 


కిష్కిందకి వెళ్ళాక సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశారు. సుగ్రీవుడు మళ్ళి తారని పొందాడు. అలా తార, రుమలతో బయట వర్షాలు పడుతుండగా సుగ్రీవుడు ఆనందంగా కాలం గడపసాగాడు.

బాల ఇంద్రగోప్తా అంతర చిత్రితేన విభాతి భూమిః నవ శాద్వలేన | 
గాత్ర అనుపృక్తేన శుక ప్రభేణ నారీ ఇవ లాక్ష ఉక్షిత కంబలేన ||

ఆ వర్షాకాలాన్నీ చూసి రాముడన్నాడు " ఈ వర్షాకాలంలో వర్షాలు విశేషంగా పడడం వలన భూమి మీద గడ్డి బాగా పెరిగింది. అందువలన భూమి అంతా ఆకుపచ్చగా ఉంది. ఆ ఆకుపచ్చ భూమి మీద ఎర్రటి ఇంద్రగోప పురుగులు అక్కడక్కడ తిరుగుతున్నాయి. భూదేవి ఎర్రటి చుక్కలు కలిగిన ఆకుపచ్చ చీర కట్టుకుందా అన్నట్టుగా ఉంది ఆ దృశ్యం. నదులన్నీ నీళ్ళతో ప్రవహిస్తున్నాయి, మేఘాలు కురుస్తున్నాయి, ఏనుగులు పెద్ద శబ్దాలు చేస్తున్నాయి, వనాల యొక్క మధ్య భాగాలు ప్రకాశిస్తున్నాయి. భార్యలు పక్కన లేనివారు ధ్యానం చేస్తున్నారు, వర్షం పడుతుంటే నెమళ్ళు నాట్యం చేస్తున్నాయి, వానరములన్నీ చాలా సంతోషంగా ఉన్నాయి. ఆకాశంలో వెళుతున్న ఆ మబ్బులు యుద్ధానికి వెళుతున్న రథాలలా ఉన్నాయి, మెరుపులు ఆ రథానికి కట్టిన పతాకాలలా ఉన్నాయి, ఆ మబ్బులు వస్తుంటే గాలికి దుమ్ము రేగిపోతుంది. ఇవన్నీ చూస్తుంటే నాకేమి జ్ఞాపకం వస్తుందో తెలుసా లక్ష్మణా. ఎప్పుడెప్పుడు రావణాసురిడి మీద యుద్ధం చేద్దామా అని పొంగిపోతున్నటువంటి వానరుల యొక్క శక్తి జ్ఞాపకం వస్తుంది. 

మార్గ అనుగః శైల వన అనుసారీ సంప్రస్థితో మేఘ రవం నిశమ్య |  
యుద్ధ అభికామః ప్రతినాద శంకీ మత్తో గజేంద్రః ప్రతిసంనివృత్తః ||

ఒక పెద్ద మదగజం ఆ వర్షంలో తడుస్తూ హాయిగా పడుకొని ఉంది. ఇంతలో పిడుగు పడినట్టు ఒక మేఘం పెద్ద శబ్దం చేసింది. ఆ శబ్దాన్ని విన్న ఏనుగు ' ఆహా, ఇంకొక మదగజం కూడ ఎక్కడో అరుస్తుంది, దాని మదం అణిచేస్తాను ' అనుకొని, తన తొండాన్ని పైకెత్తి పెద్దగా ఘీంకరిస్తూ ఆ శబ్దం వినపడ్డ వైపుకి బయలుదేరింది. కొంతదూరం వెళ్ళాక మళ్ళి ఆ మేఘం శబ్దం చేసింది. ' ఓహొ, మేఘమా ఉరుము తున్నది. మరొక మదగజం కాదన్నమాట ' అని తన తొండాన్ని దింపేసి మెల్లగా వెనక్కి నడుచుకుంటూ వచ్చి, తాను ముందు పడుకున్న చోటనే పడుకుంది. రంగురంగుల కప్పలు, తోకలున్న కప్పలు, పొడుగు కప్పలు అలా రకరకాల కప్పలు ఇప్పటిదాకా ఎక్కడున్నాయో తెలీదు, కాని ఎప్పుడైతే మేఘం నుంచి పడిన వర్షధారలు ఈ కప్పలని కొట్టాయో, ఆ కప్పలన్నీ బెకబెక అనే ఒకేరకమైన శబ్దం చేశాయి. ఈ వర్షాలు పడే కాలంలోనే సామవేదాన్ని నేర్చుకునేవారికి పాఠం ప్రారంభిస్తారు.

No comments:

Post a Comment