Pages

Sunday, 27 May 2012

రామాయణం @ కధ -70


అప్పుడు హనుమంతుడు " అమ్మా! నువ్వు అపహరించబడ్డాక రాముడు జటాయువుతో మాట్లాడాడు, తరువాత జటాయువు ప్రాణములు వదిలాడు. తరువాత కబంధుడు కనబడ్డాడు, తరువాత సుగ్రీవుడి దెగ్గరికి వచ్చారు. సుగ్రీవుడితో స్నేహం చేసిన రాముడు వాలి సంహారం చేసిన తరువాత సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశారు. నిన్ను వెతకడం కోసం సుగ్రీవుడు వర్షాకాలం వెళ్ళిపోయాక వానరాలని పంపించాడు. దక్షిణ దిక్కుకి అంగదుడి నాయకత్వంలో వచ్చిన వానరములు సముద్రాన్ని చేరుకొని ఉండిపోయాయి. నన్ను హనుమ అంటారు, సంభరాసురుడు అనే రాక్షసుడిని చంపిన కేసరి నా తండ్రి, మా తల్లి అంజనా దేవి క్షేత్రాముగా వాయుదేవుడికి ఔరస పుత్రుడిని నేను. నేను నీ కుమారుడివంటి వాడను. నేను రామ దూతని తల్లి. రాముడు నీకోసం బెంగపెట్టుకుని ఉన్నాడు తల్లి, నీ జాడ తెలియగానే రాముడు వచ్చి నిన్ను రక్షిస్తాడు. నన్ను నమ్ము తల్లీ " అన్నాడు.

అప్పుడు సీతమ్మ అనింది " నువ్వు వానరుడివి, రాముడు నరుడు. నరవానరములకి స్నేహం ఎలా కుదిరింది? నా శోకము పోవాలంటె నేను రాముడి గుణములు వినాలి. నువ్వు అంత రామ బక్తుడివి అయితే రాముడు ఎలా ఉంటాడో చెప్పు? " అనింది.

రక్షితా జీవలోకస్య ధర్మస్య పరి రక్షితా
రక్షితా స్వస్య ధర్మస్య స్వజనస్య  రక్షితా ||

హనుమంతుడు అన్నాడు " రాముడంటే మూర్తీభవించిన ధర్మం, తన ధర్మాన్ని తాను రక్షించుకుంటాడు, ఇతరుల ధర్మాన్ని కూడా రక్షిస్తాడు

రామః కమల పత్రాక్షః సర్వసత్వ మనోహరః|
రూప దాక్షిణ్య సంపన్నః ప్రసూతో జనకాత్మజే ||

రాముడు పద్మముల వంటి కన్నులున్నవాడు, అన్ని ప్రాణులు ఆయనని చూసి ఆనందపడతాయి, ఆయనకి ఇవన్నీ పుట్టుకతో వచ్చాయి తల్లి

తేజసా ఆదిత్య సంకాశః క్షమయా పృథివీ సమః|
బృహస్పతి సమో బుద్ధ్యా యశసా వాసవో సమః ||

తేజస్సులో సూర్యుడితో సమానమైనవాడు, క్షమించడంలో భూమితో సమానమైనవాడు, బుద్ధియందు బృహస్పతితో సమానమైనవాడు, కీర్తినందు ఇంద్రుడితో సమానమైనవాడు. రాముడికి యజుర్వేదము, ధనుర్వేదము, వేదవేదాంగములు తెలుసు " అని చెపుతూ, రాముడి కాలిగోళ్ళ నుంచి శిరస్సు మీద ఉండే వెంట్రుకల వరకూ  ఒక్క అవయవాన్ని విడిచిపెట్టకుండా హనుమంతుడు వర్ణించాడు. ( సమయంలోనే రాముడు 96 అంగుళాలు (8 అడుగులు ) ఉంటాడని హనుమంతుడు చెప్పాడు.)

అలానే " అమ్మా! రాముడు మర్యాదా పురుషోత్తముడు. ఎవరిని, ఎప్పుడు,  లోకంలో, ఎలా కాపాడాలో తెలిసున్నవాడు, నడువడి ప్రధానమైనవాడు రాముడంటె. ఆయన కర్త, కారణమై  సమస్త జగత్తునందు నిండిపోయాడు

వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమతః|
రామనామాంకితం చేదం పశ్య దేవ్యంహుళీయకం||
ప్రత్యయార్థం తవానీతం తేన దత్తం మహాత్మనా|
సమాశ్వసిహి భద్రం తే క్షీణ దుఃఖఫలా హ్యసి||

( ఈ శ్లోకాలు పరమ పావనమైనవి, వీటిని సుందరకాండలో మంత్రం అంటారు. సీతమ్మకి ఉన్న బాధని హనుమ ఈ మాటల చేత పోగొట్టాడు, 10 నెలల తరువాత సీతమ్మ ఈ మాటలు విని ఆనందపడింది)


అమ్మా! నేను వానరుడిని, రాముడి పలుకున వచ్చిన రామదూతని. రామ రామనామాంకితమైన ఉంగరాన్ని నీకు తీసుకొచ్చాను, నీకు నమ్మకం కలగడం కోసమని రాముడు దీనిని నాకిచ్చి పంపించాడు.  ఉంగరాన్ని తీసుకున్నాక ఇవ్వాల్టితో నీ కష్టాలన్నీ పోయాయి, ఇక నువ్వు ఉపశాంతిని పొందుతావు " అన్నాడు.

హనుమంతుడు ఇచ్చిన  ఉంగరాన్ని ముట్టుకోగానే సీతమ్మ సిగ్గుపడింది. రాముడినే చూసినంత ఆనందాన్ని సీతమ్మ పొందినదై,  ఉంగరాన్ని కన్నులకి అద్దుకొని పరవశించిపోయింది.

హనుమంతుడు ఇచ్చిన ఉంగరాన్ని తీసుకున్న సీతమ్మ " నాయన హనుమ! లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, కౌసల్య, సుమిత్ర, కైకేయి, కోసల దేశంలో ఉన్న సమస్త జనులు, సుగ్రీవుడు, వానరములు కుశలమే కదా " అని పలు ప్రశ్నలు అగిగాక, " రాముడికి నా కన్నా ఎక్కువైనవారు ఎవరూ లేరు, నేను పక్కన లేకపోవడం వల్ల రాముడు తాను ఎలా ప్రవర్తించాలొ అలా ప్రవర్తించడంలొ వైక్లవ్యాన్ని పొందలేదు కదా?. రాముడు కేవలము తన పౌరుషము మీదనే ఆధారపడి, దైవమును తిరస్కరించి తిరుగుతున్నాడ, లేక తన పౌరుషాన్ని పూర్తిగా విడిచిపెట్టి కేవలం భగవంతుడిని మాత్రమే విశ్వసించి తిరుగుతున్నాడ? రాముడికి నేను జ్ఞాపకం ఉన్నాన, నన్ను తలుచుకుంటున్నాడ. రావణుడిని, రాక్షసులని నిగ్రహించాలంటే రాముడు అక్కడినుండి అస్త్రప్రయోగం  చెయ్యలేడా? రాముడు అస్త్రప్రయోగం చెయ్యకుండా నాయందు ఎందుకు ఉపేక్ష వహించాడు? నాకు రావణుడు 12 నెలల గడువు ఇచ్చాడు, అందులో 10 నెలల కాలం పూర్తయిపోయింది. ఇంక 2నెలలు మాత్రమే వాడు నన్ను బతకనిస్తాడు. కాని నేను ఒక నెల మాత్రమే బతికి ఉంటాను.  ఒక నెల లోపల రాముడు వచ్చి నన్ను విడిపిస్తే సరి, ఒకవేళ రాముడు రాకపోతే నేను ప్రాణములను విడిచిపెట్టేస్తాను. నేను ఇంక ఒక నెల మాత్రమే జీవించి ఉంటాను అని రాముడికి నివేదించు " అనింది

సీతమ్మ అలా బాధపడుతూ చెప్పిన మాటలని విన్న హనుమంతుడు శిరస్సు మీద చేతులు పెట్టుకొని " ఎందుకమ్మా అలా ఖేద పడతావు. మలయము, వింధ్యము, మేరు మొదలైన పర్వతముల మీద ఒట్టు పెట్టి చెబుతున్నాను, మా వానరములు తినే కందమూలముల మీద ఒట్టు పెట్టి చెబుతున్నాను, రాముడు నీయందు విశేషమైన ప్రేమతొ ఉన్నాడు. ఆయన ఎంతగా తపిస్తుంటాడంటె, ఎక్కడైనా ఒక అందమైన పద్మము కనపడితే '  సీత,  సీత' అంటున్నాడు. వానప్రస్థులలాగ రాముడు కూడా సూర్యాస్తమం అయ్యాక సాధ్వికమైన ఆహారాన్ని తీసుకుంటున్నాడు. నిరంతరము నీ గురించే ధ్యానము చేస్తున్నాడు, ప్రతిక్షణం శోకిస్తూనే ఉన్నాడు. రాముడు ప్రస్రవణ పర్వతం గుహలో పడుకుని ఉన్నప్పుడు ఆయన ఒంటి మీద నుంచి తేళ్ళు, జర్రులు, పాములు పాకినా కాని ఆయనకి స్పృహ ఉండడం లేదు. 100 యాగములు చేసి ఐరావతం మీద కూర్చున్న ఇంద్రుడి దెగ్గర సచీదేవి ఉన్నట్టు, ప్రస్రవణ పర్వత గుహలో కూర్చున్న రాముడి దెగ్గరికి నిన్ను తీసుకెళ్ళి దింపుతానమ్మా. యజ్ఞంలో వేసిన హవిస్సుని హవ్యవాహనుడైన అగ్నిదేవుడ ఎంత పరమ పవిత్రంగా తీసుకెళతాడొ, అలా నిన్ను తీసుకెళ్ళి రాముడి పాదాల దెగ్గర పెడతాను. అమ్మా! నువ్వు వచ్చి నా వీపు మీద కుర్చో " అన్నాడు

కాని హనుమంతుడు అప్పటిదాక చాలా చిన్నగా ఉండడం వలన, సీతమ్మ హనుమని చూసి ఫక్కున నవ్వి " ఎంతమాట అన్నావోయి హనుమ. నువ్వే ఇంత స్వరూపం,  వీపు మీద నేను కూర్చోన, నన్ను  సముద్రాన్ని దాటించి తీసుకెళతావ. నీ వానర బుద్ధిని బయటపెట్టావు కదా " అనింది.


సీతమ్మ మాటకి అలిగిన హనుమంతుడు తన స్వరూపాన్ని సీతమ్మకి చూపించాలి అనుకొని, మేరు పర్వత శిఖరాలు ఆకాశాన్ని చుంబిస్తున్నట్టు ఎలా ఉంటాయో, అలా పర్వత స్వరూపాన్ని పొందాడు. అప్పుడు హనుమంతుడు పెద్ద పాదాలతొ, బలిసిన తొడలతొ, సన్నటి నడుముతొ, విశాలమైన వక్షస్థలంతొ, శంఖం లాంటి కంఠంతొ, కాల్చిన పెనంలాంటి ముఖంతో, పచ్చటి కన్నులతో, పెద్ద శిరోజములతొ, పరిఘలవంటి భుజములతొ నిలబడ్డాడు

హనుమంతుడిని అలా చూసిన సీతమ్మ  ఆశ్చర్యపోయి " నాయనా! నాకు తెలుసు నువ్వు ఎవరివో. 100 యోజనముల సముద్రాన్ని దాటి వచ్చినప్పుడే నువ్వు ఎవరో గుర్తించాను. ఇలా రాగలిగిన శక్తి గరుగ్మంతుడికి ఉంది, నీ తండ్రి వాయుదేవుడికి ఉంది, నీకు ఉంది. నువ్వు ఇంత సమర్ధుడవు కాకపోతె రాముడు నిన్ను నా దెగ్గరికి పంపరు. నేను నీ వీపు మీద కూర్చుని ఆవలి ఒడ్డుకి వచ్చేటప్పుడు నేను సముద్రంలో పడిపోవచ్చు, లేకపోతె రాక్షసులు నీ దారికి అడ్డురావచ్చు, అప్పుడు నీకు వాళ్ళకి యుద్ధం జెరగచ్చు.  సమయంలో నువ్వు వాళ్ళతో యుద్ధం చేస్తావ లేక నన్ను కాపాడుకుంటావ. ఒకవేళ  కారణం చేతనైనా నేను మళ్ళి రాక్షసులకి దొరికితే రావణుడు నన్ను ఎవరికీ తెలియని ప్రదేశంలో దాచివేయవచ్చు. అందుచేత నేను నీ వీపు మీద కూర్చుని ఆవలి ఒడ్డుకి రావడం కుదరదు. అమ్మా! నేను యుద్ధం చెయ్యగలను, నిన్ను క్షేమంగా రాముడి దెగ్గరికి తీసుకువెళతాను అని అంటావేమో, నేను స్పృహలో ఉండగా, తెలిసి తెలిసి రాముడిని తప్ప వేరొక పురుషుడిని నా చేతితో స్పృశించను. రాముడే వచ్చి రావణుడిని సంహరించి నా చెయ్యి పట్టుకొని  సముద్రాన్ని దాటించాలి " ఆనింది.


అప్పుడు హనుమంతుడు " ఒక నరకాంతగా ఉండి ఇన్ని కష్టాలు పడుతూ, ఇటువంటప్పుడు కూడా ' నేను రాను ' అనడం నీకే చెల్లింది తల్లి. నువ్వు నా వీపు మీద కూర్చుని రాను అంటున్నావు కదా, పోని రాముడి దెగ్గరికి నేను వెళ్ళి విజ్ఞాపన చెయ్యడానికి ఏదన్నా ఒక అభిజ్ఞానాన్ని కటాక్షించు తల్లి " అన్నాడు.

No comments:

Post a Comment