Pages

Tuesday, 22 May 2012

రామాయణం @ కధ -68


ఎందుకు ఇలా ఒంటి జెడ వేసుకొని, మలినమైన బట్ట కట్టుకొని, భూమి మీద పొడుకుని ఉపవాసాలు చేస్తూ ఉంటావు. నా అంతఃపురంలో ఎన్ని రకాల వంటలు ఉన్నాయో, ఆభరణములు ఉన్నాయో, వస్త్రములు ఉన్నాయో చూడు.



7000 మంది  ఉత్తమకాంతలు నీకు దాసీ జనంగా వస్తారు. ఆ రాముడు దీనుడు, అడవులు పట్టి తిరుగుతున్నాడు, అసలు ఉన్నాడో లేదో కూడా తెలీదు. దేవతలు కూడా నన్ను ఏమి చెయ్యలేరు, అలాంటిది ఒక నరుడు ఈ 100 యోజనముల సముద్రాన్ని దాటి వస్తాడని నువ్వు ఎలా అనుకుంటున్నావు. నువ్వు హాయిగా తాగు, తిరుగు, కావలసినది అనుభవించు, ఆభరణాలు పెట్టుకో, నాతో రమించు. నాకున్న ఐశ్వర్యం అంతా నీ ఐశ్వర్యమే, నీ బంధువులని పిలిచి ఈ ఐశ్వర్యాన్ని వాళ్ళకి ఇవ్వు " అన్నాడు.




రావణుడి మాటలను విన్న సీతమ్మ శుద్ధమైన నవ్వు నవ్వి, ఒక గడ్డిపరకని తనకి రావణుడికి మధ్యలో పెట్టి " రావణా! నీ మనస్సు నీవారి యందు పెట్టుకో. నీకు అనేకమంది భార్యలు ఉన్నారు, వాళ్ళతో సుఖంగా ఉండు, పరాయి వాళ్ళ భార్యల గురించి ఆశపడకు. ఒంట్లో ఓపిక ఉంటె ఎలాగన్నా బతకవచ్చు, కాని చనిపోవడం నీ చేతులలో లేదు. నువ్వు సుఖంగా బతకాలన్న, చనిపోవాలన్న నీకు రామానుగ్రహం కావాలి. ఒంట్లో ఓపిక ఉందని పాపం చేస్తున్నావు, కాని ఆ పాపాన్ని అనుభవించవలసిననాడు బాధపడతావు. నన్ను తీసుకెళ్ళి రాముడికి అప్పగించి సంతోషంగా జీవించు, శరణు అన్నవాడిని రాముడు ఏమి చెయ్యడు. ' నేను సీతని తీసుకొచ్చాను ' అంటావేంటి, నీ జీవితంలో నువ్వు నన్ను తేలేవు. సూర్యుడి నుంచి సుర్యుడి కాంతిని వేరు చేసి తేగలవా, వజ్రం నుంచి వజ్రం యొక్క ప్రభని వేరు చేసి తేగలవా, పువ్వు నుంచి పువ్వు యొక్క వాసనని వేరు చేసి తేగలవా, ఇవన్నీ ఎలా తీసుకురాలేవో అలా రాముడి నుండి నన్ను తీసుకురాలేవు. మరి నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అని అంటావేమో, ఇదంతా నిన్ను చంపడానికి బ్రహ్మగారు వేసిన ప్రాతిపదిక. 

ఒక పతివ్రత అయిన స్త్రీని అపహరించి చెయ్యరాని పాపం చేశావు, ఇక నీ పాపం పోదు. దీనికి ఒకటే మార్గం, నన్ను తీసుకెళ్ళి రాముడికి అప్పగించు, బతికిపోతావు. నేను నిన్ను ఇప్పుడే నా తపఃశక్తి చేత బూడిద చెయ్యగలను, కాని నన్ను రాముడు వచ్చి రక్షిస్తాడన్న కారణం చేత ఆగిపోయాను. అసలు ఈ ఊరిలో ధర్మం అనేది చెప్పేవారు లేరా? ఒకవేళ ఎవరన్నా చెప్పినా నువ్వు వినవా? ఒకవేళ విన్నా దానిని ఆచరించవా? " అని ప్రశ్నించింది.

ఈ మాటలు విన్న రావణుడికి ఆగ్రహం వచ్చి " ఏ స్త్రీ యందు విశేషమైన కామం ఉంటుందో ఆ స్త్రీ యందు ఉపేక్షించే స్వభావం కూడా ఉంటుంది. నన్ను చూసి ఇంతమంది స్త్రీలు కామించి వెంటపడ్డారు. నీకు ఐశ్వర్యం ఇస్తాను, సింహాసనం మీద కుర్చోపెడతాను, నా పాన్పు చేరు అంటె ఇంత అమర్యాదగా మాట్లాడుతున్నావు, నీకు నా గొప్పతనం ఏంటో తెలియడం లేదు " అని చెప్పి, అక్కడున్న రాక్షస స్త్రీలను పిలిచి " ఈమెయందు సామమును, దానమును, బేధమును ప్రయోగించండి అని నేకు మీకు చెప్పాను, కాని ఈమె లొంగలేదు, 10 నెలల సమయం అయిపోయింది. ఇంకా 2 నెలల సమయం మాత్రమే ఉంది, ఆ సమయంలో సీత నా పాన్పు తనంతట తాను చేరితే సరి, లేకపోతె మీరు సీతని దండించండి " అన్నాడు.

( ఇంట్లో తనని ప్రేమించి, అనుగమించే భార్య ఉన్నాకూడా, ఆ భార్య యందు మనస్సు ఉంచకుండా పర స్త్రీ యందు మనస్సు ఉంచుకొని, పర స్త్రి తో సంగమించిన పురుషుడికి ఆ దోషం పోవాలంటె, 6 నెలలపాటు తిరిగిన వీధి తిరగకుండా, మిట్టమధ్యానం వేళ, చీకటి పడ్డాక, పాత్ర పట్టుకొని ఇళ్ళ ముందుకి వెళ్ళి' నాయందు మనస్సున్న ఆరోగ్యవంతురాలైన భార్య ఇంట్లో ఉండగా వేరొక స్త్రీతో సంగమించిన మహాపాతకుడిని. నేను ఆ పాప విముక్తుడిని అవ్వాలి, అందుకని మీ చేతితో ఇంత అన్నం తీసుకొచ్చి పడెయ్యండమ్మా ' అని ముష్టి ఎత్తుకున్న అన్నం తింటే వాడి పాపం పోతుంది. ఇది పురుషులకి, వర్తిస్తుంది, స్త్రీలకి వర్తిస్తుంది.)

అప్పుడు రావణుడి భార్య అయిన ధాన్యమాలిని రావణుడిని గట్టిగా కౌగలించుకొని " నీయందు మనస్సున్న స్త్రీతో భోగిస్తే అది ఆనందము, నీయందు మనస్సులేని స్త్రీతో ఎందుకు ఈ భోగము. మనము క్రీడిద్దాము పద " అనేసరికి ఆ రావణుడు నవ్వుకుంటూ తన భార్యలతో వెనక్కి వెళ్ళిపోయాడు.


అప్పుడు అక్కడున్న వికృత రూపములు కలిగిన రాక్షస స్త్రీలు సీతమ్మ చుట్టూ చేరి " సీత! దేనికైనా ఇంత అతి పనికిరాదు. రావణుడు అంటె సామాన్యుడు కాదు, బ్రహ్మ కుమారులలో నాలుగో ప్రజాపతి అయిన  పులస్త్యబ్రహ్మ యొక్క కుమారుడైన విశ్రవసోబ్రహ్మ యొక్క కుమారుడు రావణబ్రహ్మ. సాక్షాత్తు బ్రహ్మగారికి మునిమనవడు. లోకంలో అందరినీ జయించాడు, బ్రహ్మగారిని గూర్చి తపస్సు చేశాడు, ఎన్నో గొప్ప వరములను పొందాడు. అలాంటి రావణుడితో హాయిగా భోగం అనుభవించకుండా ఏమిటి ఈ మూర్ఖత్వం. పోనిలె మెల్లగా మనస్సు మార్చుకుంటావు అని ఇంతకాలం చూశాము, కాని మనస్సు మార్చుకోకుండా ఇలా ఉంటావేంటి, ఎంత చెప్పాలి నీకు " అని గద్దించారు. 


అప్పుడు సీతమ్మ అనింది " ఐశ్వర్యం ఉంటె భర్తగా చూడడం, రాజ్యం ఉంటె భర్తగా చూడడం, ఒంట్లో ఓపిక ఉంటె భర్తగా చూడడం నాకు తెలియదు. ఆయన దీనుడు కావచ్చు, రాజ్యహీనుడు కావచ్చు, కాని నా భర్త నాకు గురువు, సమస్తంసూర్యుడి భార్య అయిన సువర్చల సూర్యుడిని ఎలా అనుగమిస్తుందో, వశిష్ఠుడిని అరుంధతి ఎలా అనుగమిస్తుందో, సచీదేవి ఇంద్రుడిని ఎలా అనుగమిస్తుందో, రోహిణి చంద్రుడిని ఎలా అనుగమిస్తుందో, లోపాముద్ర అగస్త్యుడిని ఎలా అనుగమిస్తుందో, సుకన్య చ్యవన మహర్షిని ఎలా అనుగమిస్తుందో, సావిత్రి సత్యవంతుడిని ఎలా అనుగమిస్తుందో, శ్రీమతి కపిలుడిని ఎలా అనుగమిస్తుందో నేను కూడా అలా రాముడిని అనువర్తిస్తాను. మీరు నన్ను చంపి, నా శరీరాన్ని ముక్కలు చేసి తినెయ్యండి, నేను మాత్రం రాముడిని తప్ప వేరొకడిని కన్నెత్తి కూడా చూడను. రావణుడిని నా ఎడమ కాలితో కూడా ముట్టుకోను. మీరు నాకు ఇలాంటి మాటలు చెప్పకూడదు, నేను వినకూడదు " అనింది.

అప్పుడు హరిజట అనే రాక్షస స్త్రీ లేచి " ఈమెని రావణుడు అపహరించి తీసుకొచ్చి ఇక్కడ పెట్టినప్పటినుంచి నా నోటి వెంట లాలాజలం కారిపోతుంది. ఈమెని ఎప్పుడెప్పుడు తిందామా అని చూస్తున్నాను " అనింది.  

ఈ మాటలు విన్న ఏకజట అనే రాక్షస స్త్రీ లేచి అనింది " నేను బయట పడితే ఎవరన్నా ఈ విషయం చెప్పేస్తారేమో అని భయపడ్డాను. కాని హరిజట బయటపడింది కాబట్టి చెప్తున్నాను, ఆకలితో ఉన్నవాడు ఎదురుగా భోజనాన్ని పెట్టుకుని తినకుండా ఎలా నిగ్రహించుకొని ఉంటాడో, అలా నేను కూడా ఈ నరకాంతని ఎదురుగా పెట్టుకొని తినకుండా నిగ్రహించుకొని ఉన్నాను. ప్రభువు ఎలాగు అనుమతి ఇచ్చాడు కదా ఈమెని దండించమని, కాబట్టి ఈమె పీక పిసికేసి తినేద్దాము. ఈమె హృదయమునకు కిందన ఉండే భాగము, గుండె, మెదడు నాది " అనింది.

అప్పుడు మిగతా రాక్షస స్త్రీలు, నావి కాళ్ళు, నావి తొడలు, నావి చేతులు అని వాటాలు వేసుకున్నారు. 

తరువాత అజముఖి అనే స్త్రీ అనింది " ఈమెని అందరమూ సరిసమానంగా వాటాలు వేసుకుందాము. తొందరగా కల్లు తీసుకురండి. ఈమెని తింటూ, కల్లు తాగుతూనికుంబిలా నాట్యం చేద్దాము" అనింది.

అప్పుడు సీతమ్మ ఏడుస్తూ " ఇక్కడ మరణిద్దామన్నా కూడా నాకు స్వేఛ్చ లేదు " అని అనుకొని, ఆ రాక్షస స్త్రీలని చూసి భయపడుతూ కూర్చున్న చోట నుంచి లేచి శింశుపా వృక్షం మొదటికి వెళ్ళి కూర్చుంది. 

ఇంతలో త్రిజట అనే రాక్షస స్త్రీ లేచి " ఇప్పుడే తెల్లవారుజామున నాకు ఒక కల వచ్చింది. వెయ్యి హంసలు మోస్తున్న ఒక శిబిక మీద తెల్లటి వస్త్రములను ధరించి, మెడలో తెల్లటి పుష్పమాలికలు వేసుకుని రామచంద్రమూర్తి లక్ష్మణుడితో కలిసి ఆకాశంలో వచ్చారు. అప్పుడు వాళ్ళు నాలుగు దంతములు కలిగిన ఏనుగు మీద దిగారు. ఆ ఏనుగు తెల్లగా ఉన్న ఒక పర్వతం దెగ్గరికి వెళ్ళింది, ఆ పర్వతం మీద సీతమ్మ పచ్చటి పట్టు పుట్టం కట్టుకుని ఉంది. రాముడు సీతమ్మకి తన చెయ్యి ఇచ్చి ఏనుగు మీదకి ఎక్కించుకున్నాడు. అప్పుడు వాళ్ళు వృషభములు పూన్చిన రథంలోకి మారారు. ఆ రథం వెళ్ళిపోతున్నప్పుడు సీతమ్మ సూర్యచంద్రులిద్దరిని తన చేతితో నిమిరింది. తరువాత వాళ్ళందరూ పుష్పక విమానంలో ఉత్తర దిక్కుకి వెళ్ళిపోయారు. 

పాల సముద్రం మధ్యలో ఒక కొండ ఉంది, ఆ కొండ మీద హేమసింహాసనం ఉంది, ఆ సింహాసనం మీద రాముడు కూర్చుని ఉన్నాడు, ఆయన ఎడమ తొడ మీద సీతమ్మ కూర్చుని ఉంది. అలా ఉన్న రాముడికి దేవతలు పట్టాభిషేకం చేశారు. నాకు ఆ సమయంలో రాముడు రెండు చేతులతో కనపడలేదు, ఈ సమస్త బ్రహ్మాండములు ఎవరిలోనుంచి వస్తున్నాయో, ఎవరివల్ల నిలబడుతున్నాయో, ఎవరిలోకి లయమయిపోతున్నాయో అటువంటి పరబ్రహ్మ స్వరూపంగా, నాలుగు చేతులతో ఉన్న శ్రీ మహావిష్ణువుగా సాక్షాత్కరించాడు. 

ఇక్కడ లంకా పట్టణంలో రావణాసురుడు మాత్రం గాడిదలు పూన్చిన రథం ఎక్కి, ఎర్రటి వస్త్రములు ధరించి, నూనె తాగుతూ ఉన్నాడు. ఆ రథం దక్షిణ దిక్కుగా వెళ్ళిపోయింది. కొంతదూరం వెళ్ళాక ఆ రథం నుండి దక్షిణ దిక్కుకి తల ఉండేలా కింద పడిపోయాడు. తరువాత పైకి లేచి మెడలో గన్నేరు పూల మాలలు వేసుకొని పిచ్చి పిచ్చిగా అరుస్తూ, నాట్యం చేస్తూ పరిగెత్తి ఒక కంపుకొట్టే మురికి గుంటలో పడిపోయాడు. అప్పుడు వికటాట్టహాసం చేస్తూ, ఎర్రటి వస్త్రములు ధరించి, బోడి గుండుతో ఉన్న ఒక స్త్రీ పాశం వేసి రావణుడిని బయటకి లాగింది. అప్పుడామె రావణుడిని పశువుని తీసుకెళ్ళినట్టు దక్షిణ దిక్కుకి తీసుకువెళ్ళింది. ఆవిడ వెనకాల చప్పట్లు కొడుతూ, నాట్యం చేస్తూ రావణుడు వెళ్ళిపోయాడు. వాళ్ళ వెనకాల కుంభకర్ణుడు, ఇంద్రజిత్ మొదలైనవారు ఒంటె, మొసలి మొదలైన వాహనములను ఎక్కి దక్షిణ దిక్కుకి వెళ్ళిపోయారు. 

No comments:

Post a Comment