Pages

Tuesday, 24 April 2012

రామాయణం @ కధ -46


అప్పుడా జటాయువు ఒంట్లోనుంచి నది ప్రవహించినట్టు రక్తం ప్రవహించింది. అప్పుడా జటాయువు అదుపు తప్పి ఒక చెట్టు దెగ్గర పడిపోయాడు. తనకోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడ్డ ఆ జటాయువుని చూసి సీతమ్మ పరుగు పరుగున వెళ్ళి ఆ జటాయువుని కౌగలించుకుని ఏడిచింది. సీతమ్మ నగలన్నీ కింద పడిపోయాయి, జుట్టంతా విరజిమ్ముకు పోయింది. అటువంటి స్థితిలో ఏకధారగా ఏడుస్తున్న సేతమ్మని చూసి రావణుడు " జటాయువు కోసం ఏడుస్తావే, రా " అని సీతమ్మ వెనక రావణుడు పరుగుతీసాడు. అప్పుడు సీతమ్మ జటాయువుని వదిలి అక్కడున్న లతలని, చెట్లని కౌగిలించుకుంది. 





అప్పుడా రావణుడు అక్కడికి వెళ్ళి " చెట్లని, లతలని కౌగలించుకుంటావే, రా " అని, ఆవిడ జుట్టు పట్టుకొని వెనక్కి ఈడ్చేశాడు.




రావణుడు సీతమ్మని అలా నేల మీద ఈడ్చుకుపోతుంటే సూర్యుడు, చంద్రుడు చూసి సిగ్గుతో మేఘాల చాటుకి వెళ్ళిపోతే, ప్రపంచాన్నంతటిని అకారణంగా చీకటి ఆవరించింది. సత్యలోకంలో కూర్చున్న బ్రహ్మగారు ఉలిక్కిపడ్డారు. అప్పుడాయన తన దివ్య నేత్రంతో చూసి" ఒరేయ్, నువ్వు చేసిన తపస్సుకి చావడానికి కావలసినంత పాపం ఇవ్వాళ మూటకట్టుకున్నావురా " అన్నారు. 

రావణుడు సీతమ్మ జుట్టు పట్టి, ఈడ్చుకొని తెచ్చి, తన తొడల మీద కూర్చోపెట్టుకుని ఆకాశంలోకి ఎగిరిపోయాడు. అటూ ఇటూ తన్నుకుంటున్న సీతమ్మని 20 చేతులతో ఓడిసిపట్టుకున్న రావణాసురుడిని చూసి ఋషులు, ఈ కళ్ళతో ఇటువంటి దృశ్యాన్ని చూడవలసి వచ్చిందని బాధపడ్డారు, అలాగే రావణ సంహారం అవుతుందని సంతోషించారు. 

ఆకాశంలో వెళ్ళిపోతున్న సీతమ్మ ఆభరణాలు కిందపడిపోయాయి, ఆవిడ జుట్టు విడిపోయి చల్లుకుపోయింది, తిలకం పక్కకి తొలగిపోయింది. అలా ఆకాశంలో వెళ్ళిపోతున్న సీతమ్మకి ఒక పర్వత శిఖరం మీద  5 వానరాలు కనబడ్డాయి. వీళ్ళు నా సమాచారాన్ని రాముడికి అందజేస్తారు అనుకొని, తాను కట్టుకున్న వస్త్రం నుండి ఒక ఖండాన్ని చింపి, అందులో తాను ధరించిన నగలని మూటకట్టి ఆ 5 వానరముల మధ్యలో పడేటట్టు విడిచింది. సీతమ్మని తీసుకుపోతున్నాను అన్న ఆనందంలో రావణుడు ఈ విషయాన్ని గమనించలేదు. రెప్ప వెయ్యకుండా ఆ 5 వానరాలు ఈ దృశ్యాన్ని చూశారు.



త్వయా ఏవ నూనం దుష్టాత్మన్ భీరుణా హర్తుం ఇచ్ఛతా |
మమ అపవాహితో భర్తా మృగ రూపేణ మాయయా ||


రావణుడి చేత ఎత్తుకుపోబడుతున్న సీతమ్మ ఇలా అనింది " నువ్వు మాయా మృగాన్ని సృష్టించి, నా భర్త నా నుంచి చాలా దూరంగా వెళ్ళాలన్న దుష్టసంకల్పంతో ఆ మృగాన్ని ఆశ్రమంలోకి పంపించి, ఒక్కత్తిగా ఉన్న నన్ను అపహరించావు. ఇది ఒక గొప్ప కార్యమని ఎవరూ అనరు. అలాగే ఇది యాద్రుచ్చికముగా జెరిగిన సంఘటన కాదు. ఇలా జెరగాలని నువ్వు ముందుగానే ప్రణాళిక రచించావు. ఇలా చెయ్యడం నీ పరాక్రమానికి కాని, నీ తపస్సుకి కాని, ఒకనాడు నువ్వు జీవించిన జీవితానికి కాని ఏవిధంగా నిదర్శనంగా నిలబడుతుంది. ఒక పరస్త్రీని ఎత్తుకొచ్చి నేను గొప్పవాడిని అని చెప్పుకుంటున్నావు, ఇలా చెప్పుకోడానికి నీకు సిగ్గువెయ్యడం లేదా. నువ్వు నిజంగా అంత గొప్పవాడివి అయితే, రాముడు లేనప్పుడు నన్ను ఎందుకు తీసుకొచ్చావు, రాముడు ఉండగా ఎందుకు రాలేకపోయవు. నువ్వు చేసిన పని పెద్దలైనవారు, వీరులైనవారు అంగీకరించేటటువంటి పని కాదు. నన్ను ముట్టుకోవడం, నన్ను అనుభవించడం నువ్వు ఒక్కనాటికి చెయ్యగలిగే పని కాదు. కాని నన్ను ముట్టుకొని తేవడం వలన, నీ శరీరం పడిపోయాక నరకానికి తీసుకువెళ్ళి, చీము నెత్తురుతో ఉండే అసిపత్రవనంలొ పడేస్తారు, అలాగే ఘోరమైన వైతరణి నదిలో పడేస్తారు. ఇప్పుడు నన్ను పట్టుకున్నానని సంతోషపడుతున్నావు, రేపు నువ్వు చచ్చాక నరకంలో ఒంటి నిండా శూలాలుండే శాల్మలీ వృక్షాన్ని కూడా గట్టిగా పట్టుకుంటావు. నిన్ను పాశములతో కట్టేసి కాలము లాక్కొనిపోతుందిరా. నువ్వు ఎప్పుడైతే మహాత్ముడైన రాముడితో వైరం పెట్టుకున్నావో, ఆనాడే నీ జీవితంలో సుఖం అనేది పోయింది, నువ్వు మరణించడం తధ్యం " అనింది.

సీతమ్మ చెప్పిన మాటలని ఆ రావణుడు విని, గాలికి వదిలేశాడు. తరువాత వారు సముద్రాన్ని దాటి, మయుడు మాయతో నిర్మించిన గంధర్వ నగరంలా ఉండే లంకా పట్టణాన్ని చేరి, తన అంతఃపురం దెగ్గర దిగాడు. 



అబ్రవీత్ చ దశగ్రీవః పిశాచీః ఘోర దర్శనాః |
యథా న ఏనాం పుమాన్ స్త్రీ వా సీతాం పశ్యతి అసమ్మతః ||



తరువాత భయంకరమైన ముఖాలు ఉన్నటువంటి పిశాచ స్త్రీలని పిలిచి " ఈ సీత అంతఃపురంలో ఉంటుంది, నా అనుమతి లేకుండా ఏ స్త్రీ కాని, పురుషుడు కాని సీతని చూడడానికి వీలులేదు. నేను మిమ్మల్ని ఎవన్నా రత్నాలు కాని, ఆభరణములు కాని, వస్త్రములు కాని తీసుకురండి అంటె, వేరొకరి అనుమతి లేకుండా నాకు తెచ్చి ఎలా ఇస్తారో, అలాగే ఈ సీత మణులు కాని, మాణిక్యములు కాని, ఆభరణములు కాని, వస్త్రములు కాని అడిగితే, ఎవరి అనుమతి అవసరం లేకుండా వెంటనే తీసుకొచ్చి ఇవ్వండి. ఈ సీతతో ఎవరూ మాట్లాడకూడదు. ఒకవేళ ఎవరన్నా మాట్లాడుతున్నప్పుడు తెలిసి కాని, తెలియక కాని సీత యొక్క మనస్సు నొచ్చుకుందా, ఇక వారి జీవితము అక్కడితో సమాప్తము " అని వాళ్ళతో చెప్పి, తాను చేసిన ఈ పనికి చాలా ఆనందపడినవాడై అంతఃపురం నుంచి బయటకివెళ్ళి, నరమంసాన్ని తినడానికి అలవాటు పడిన కొంతమంది రాక్షసులని పిలిచి " నేను చెప్పే మాటలని జాగ్రత్తగా వినండి. ఒకప్పుడు జనస్థానంలొ ఖర దూషణుల నాయకత్వంలో 14,000 మంది రాక్షసులు ఉండేవారు. ఇప్పుడు ఆ రాక్షసులందరూ రాముడి చేతిలో నిహతులయిపోయారు, ఆ జనస్థానం ఖాళీ అయిపోయింది. అప్పటినుంచీ నా కడుపు ఉడికిపోతుంది. ఆ రాముడిని చంపే వరకు నాకు నిద్ర పట్టదు. అందుకని మీరు ఉత్తరక్షణం బయలుదేరి అక్కడికి వెళ్ళండి, పరమ ధైర్యంగా ఉండండి. అక్కడ ఏమి జెరిగినా వెంటనే నాకు చెప్పండి " అన్నాడు.

రావణుడి ఆజ్ఞ ప్రకారం ఆ రాక్షసులు జనస్థానానికి బయలుదేరారు. అప్పుడు రావణుడు అక్కడినుంచి బయలుదేరి అంతఃపురానికి వచ్చి, సీతని తెచ్చానని మనసులో చాలా ఆనందపడ్డాడు. 



అశ్రు పూర్ణ ముఖీం దీనాం శోక భార అవపీడితాం |
వాయు వేగైః ఇవ ఆక్రాంతాం మజ్జంతీం నావం అర్ణవే ||



ఆ అంతఃపురంలో కళ్ళనిండా ఏడుస్తూ, చెంపల మీద ఆ కన్నీళ్ళు కారుతూ, అత్యంత దీనంగా, శోకం చేత పీడింపబడి, పెను తుఫానులో చిక్కుకొని మునిగిపోతున్న నౌకలోని వారు ఎటువంటి దిగ్భ్రాంతికి లోనవుతారో, అటువంటి దిగ్భ్రాంతి స్థితిలో సీతమ్మ ఉంది. వేటకుక్కల మధ్య చిక్కుకొని ఉన్న లేడి పిల్ల ఎలా భయపడుతూ ఉంటుందో, అలా సీతమ్మ తల దించుకుని ఏడుస్తూ ఉంది. 

అలా ఏడుస్తున్న సీతమ్మని రావణాసురుడు బలవంతంగా రెక్కపట్టి పైకి తీసుకువెళ్ళి, తాను కట్టుకున్న అంతఃపురాన్ని, వజ్రాలతో నిర్మించిన గవాక్షాలని, దిగుడు బావులని, సరోవరాలని, తన పుష్పక విమానాన్ని, బంగారంతో తాపడం చెయ్యబడ్డ స్తంభాలని, ఆసనాలని, శయనాలని మొదలైనవాటిని సీతమ్మకి చూపించాడు. అలా తన ఐశ్వర్యాన్ని సీతమ్మకి ప్రదర్శించాక " ఈ లంకలో ఉన్న బాలురని, వృద్ధులని లెక్కనుంచి మినహాయిస్తే, 32 కోట్ల మంది రాక్షసులు నా ఆధీనంలో ఉన్నారు. ఇందులో నేను లేచేసరికి నా వెంట పరుగు తీసేవారు 1000 మంది ఉంటారు. నాకు కొన్ని వందల మంది భార్యలు ఉన్నారు, వీరందరూ నన్ను కోరి వచ్చినవారే. ఓ ప్రియురాల! నీకు నేను ఇస్తున్న గొప్ప వరం ఏంటో తెలుసా, నాకున్న భార్యలందరికీ నువ్వు అధినాయకురాలివై నాకు భార్యగా ఉండు, నాయందు మనస్సు ఉంచు. సముద్రానికి 100 యోజనముల దూరంలో నిర్మింపబడిన నగరం ఈ కాంచన లంక. దీన్ని దేవతలు కాని, దానవులు కాని, గంధర్వులు కాని, యక్షులు కాని, నాగులు కాని, పక్షులు కాని కన్నెత్తి చూడలేరు. ఇటువంటి లంకా పట్టణానికి నువ్వు చేరుకున్నాక నిన్ను చూసేవాడు ఎవరు, తీసుకెళ్ళే వాడు ఎవరు? 

రాజ్య భ్రష్టేన దీనేన తాపసేన పదాతినా |
కిం కరిష్యసి రామేణ మానుషేణ అల్ప తేజసా ||



ఇంకా రాముడు, రాముడు అంటావేంటి. ఆ రాముడు అల్పాయుర్దాయం కలిగినవాడు, రాజ్యభ్రష్టుడు, దీనుడు, అరణ్యములను పట్టి తిరుగుతున్నాడు, రాముడు కేవలం మనిషి, అటువంటి రాముడితో నీకేమి పని. నీకు తగినవాడిని నేను, అందుకని నన్ను భర్తగా స్వీకరించి ఆనందంగా, సంతోషంగా తిరుగు. హాయిగా నాతో కలిసి సింహాసనం మీద కూర్చో, మళ్ళి పట్టాభిషేకం చేసుకుందాము. ఆ పట్టాభిషేకము చేసినప్పుడు మీద పడినటువంటి జలములతో తడిసి, నాతో కలిసి సకల ఆనందములు అనుభవించు. నువ్వు నీ జీవితంలో ఏదో గొప్ప పాపం చేసుంటావు, ఆ పాపం వలన ఇన్నాళ్ళు వనవాసం చేశావు, రాముడికి భార్యగా ఉండిపోయావు. నువ్వు చేసిన పుణ్యం వలన నాదెగ్గరికి వచ్చావు. నువ్వు ఈ అందమైన మాలలు వేసుకొని చక్కగా అలంకరించుకో, మనమిద్దరమూ పుష్పక విమానంలో విహారం చేద్దాము " అన్నాడు.

ఏ ముఖాన్ని చూసి ఆ రావణుడు ఇలా హద్దులు మీరి మాట్లాడుతున్నాడో, ఆ ముఖాన్ని తన ఉత్తరీయంతో కప్పుకొని, సీతమ్మ తల్లి కళ్ళు ఒత్తుకుంటూ ఏడ్చింది. 

No comments:

Post a Comment