విశేషమైన కామమును పురుషునియందు పొందిన స్త్రీ యుక్తాయుక్తములను మరిచి, నోరు తెరిచి అడిగినప్పుడు ఆమెని నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తే, ఆమె మనస్సు భాదపడుతుంది. ఒక ఆడదాని మనస్సుని బాధపెట్టేటట్టు మాట్లాడకూడదు కనుక, కాసేపు అటూ ఇటూ తిప్పితే ఆమెకి విసుగొచ్చి వెళ్ళిపోతుందని అనుకొని, చిన్న చిరునవ్వుతో రాముడు ఇలా అన్నాడు " నాకు వివాహం అయ్యిపోయిందమ్మ, నా భార్య మీద నాక చాలా ప్రేమ ఉంది. ఆవిడని విడిచిపెట్టి నేను నిన్ను ఎలా స్వీకరిస్తాను. రెండవ భార్యగా ఉండడానికి ఆడవారు ఇష్టపడరు. అందుకని అన్నివిధాల నాలా ఉన్న, తేజస్సు కలిగిన, చాలాకాలంగా స్త్రీ సుఖానికి దూరంగా ఉన్నవాడైన నా తమ్ముడు కోరుకుంటే, ఆయనకి భార్యగా ఉండు " అన్నాడు.
అప్పుడా శూర్పణఖ లక్ష్మణుడి దెగ్గరికి వెళ్ళి " నీకు తగినటువంటి భార్యని నేను, నువ్వు ఎంత కాంతిగా ఉంటావో నేనూ అంతే కాంతిగా ఉంటాను. నువ్వు అందంగా యవ్వనంలో ఉన్నావు, నేనూ అందంగా యవ్వనంలో ఉన్నాను. అందుకని మనిద్దరమూ సంతోషంగా కాలం గడుపుదాము, నన్ను స్వీకరించు " అనింది.
అప్పుడు లక్ష్మణుడు " నేనే ఓ దాసుడిని, మరి నన్ను కట్టుకుంటే నువ్వు దాసివి అవుతావు. కాబట్టి నన్ను కాదు మా అన్నగారినే అడుగు. నీలాంటి అందగత్తెని చూశాక మా అన్నయ్య వృద్ధురాలు అయిన మా వదినతో ఎలా ఉంటాడు. ఆమెని వదిలేసి నీతోనే ఉంటాడు, అందుకని మా అన్నగారినే అడుగు " అని పరిహాసం ఆడాడు.
లక్ష్మణుడు ఆడిన పరిహాసాన్ని నిజమే అనుకొన్న శూర్పణఖ సీతమ్మని చంపేద్దామని ఆమె మీద భయంకరమైన స్వరూపంతో పడింది. శూర్పణఖ అలా మీద పడబోతుంటే భయపడిపోయిన సీతమ్మ జింకలా వెనక్కి వెళ్ళింది. అప్పుడు రాముడు లక్ష్మణుడితో " చూశావ లక్ష్మణా! ఇలాంటి అనార్యురాలితో పరిహాసం ఆడకూడదు. నువ్వు చెప్పింది నిజమే అనుకొని ఆమె సీతని చంపేద్దామని అనుకొంది. తాను అందగత్తెని అన్న భావన కలుగుతోంది కనుక, స్త్రీ కనుక, కాళ్ళు కాని చేతులు కాని తీసేస్తే అంగవైకల్యం వస్తుంది కనుక, అందం అంతా ముఖాన్ని చూసే అనుకుంటోంది కనుక, ఆమె ముక్కు, చెవులు కోసెయ్యి " అన్నాడు.
అప్పుడు లక్ష్మణుడు ఒక ఖడ్గాన్ని తీసుకొని శూర్పణఖ యొక్క ముక్కు, చెవులని కోసేసాడు. కోసేయబడ్డ ముక్కు, చెవులతో శూర్పణఖ గట్టిగా అరుస్తూ
ఆ వనంలోనే ఉన్నటువంటి తన అన్నగార్లైన ఖర దూషణులు దెగ్గరికి వెళ్ళి కిందపడింది. అప్పుడు ఖరుడు " ఇదేమిటి ఇలా ముక్కు, చెవులు కోయించుకున్నావు. తన పక్కన నిశబ్దంగా వెళ్ళిపోతున్న త్రాచుని గోళ్ళతో గీరినవాడు ఎవడు, నిన్ను ముట్టుకున్న వాడు ఎవడు. వాడు ఈ పృథ్విలో ఎక్కడున్నా బతకడు. నా బాణముల చేత వాడి రక్తాన్ని బయటకి తీస్తాను. ఇప్పుడే చెప్పు, వాడు ఎక్కడున్నాడు " అని అడిగాడు.
అప్పుడా శూర్పణఖ ఇలా చెప్పింది " ఇక్కడికి దెగ్గరలో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, నార చీరలు కట్టుకున్నారు, మంచి యవ్వనంలో ఉన్నారు, కందమూలాలు తింటూ తాపసులుగా ఉంటున్నారు, ధర్మంతో ప్రవర్తిస్తున్నారు, దశరథ మహారాజు కొడుకులమని చెప్పారు, వాళ్ళ పేర్లు రామ లక్ష్మణులు, వాళ్ళని చూస్తుంటే గంధర్వులు అనాలో, రాజకుమారులు అనాలో నాకు తెలియడం లేదు, అంత అందంగా ఉన్నారు, వారు ఒక చక్కటి ఆశ్రమాన్ని నిర్మించుకుని అక్కడ ఉంటున్నారు. కాని వాళ్ళ మధ్యలో ఒక అందమైన స్త్రీ ఉంది, ఆమె కారణంగానే నా ముక్కు చెవులు కోసేసారు. అన్నయ్యా! నాకు ఒక్కటే కోరిక ఉంది. నువ్వు ఆ రాముడిని సంహరించాలి. ఆయనలో నుంచి నురగతోటి, బుడగలతోటి వేడి నెత్తురు బయటకి వస్తుంటే, ఆ నెత్తురుని నా దోసిళ్ళతో పట్టుకొని తాగాలని ఉంది, కనుక నా కోరిక తీరుస్తావా " అనింది.
" అయ్యయ్యో, నువ్వు కోరిక అడగడం నేను తీర్చకపోవడమా, తప్పకుండా తీరుస్తాను " అని ఖరుడు అన్నాడు.
తరువాత 14 మంది సైన్యాధిపతులని పిలిచి " మీరు వెంటనే బయలుదేరి వెళ్ళండి, శూర్పణఖ మీకు ఒక ఆశ్రమానికి దారి చూపిస్తుంది. అక్కడ మీరు రామలక్ష్మణులు ఇద్దరినీ సంహరించండి. వాళ్ళని చంపాక ఇక్కడికి తీసుకురండి, మా చెల్లి వాళ్ళ రక్తాన్ని తాగుతుంది " అన్నాడు.
తాపసులైన ఆ రామలక్ష్మణులని చంపడం చాలా తేలికని భావించి ఆ 14 మంది పెద్ద పెద్ద కేకలు వేసుకుంటూ ఆశ్రమానికి చేరుకున్నారు. అప్పుడు శూర్పణఖ వాళ్ళకి రామ లక్ష్మణులని చూపించింది. వెంటనే ఈ 14 మంది శూలాలు, కత్తులు, పరిఘలు మొదలైన ఆయుధాలని పట్టుకొని రామలక్ష్మణుల మీదకి పరుగుతీసారు. అప్పుడు రాముడు " లక్ష్మణా! నువ్వు సీతమ్మ పక్కన నిలబడు, నేను వీళ్ళ సంగతి చూస్తాను " అన్నాడు.
ఇంద్రుడి చేతినుండి వజ్రాయుధం విడువబడినట్టు, రాముడు బాణములను తన ధనుస్సుకి సంధించి విడిచిపెట్టాడు. రాముడు వదిలిన ఆ బాణాలు వాళ్ళ గుండెలకి ఉన్న కవచాలని పగలగొట్టి, వాళ్ళ గుండెల్ని చీల్చుకుంటూ భూమిలో గుచ్చుకున్నాయి. ఆ 14 మంది పెద్ద పెద్ద కేకలు వేస్తూ, నెత్తురోడుతూ నేల మీద పడి మరణించారు.
www.askruchulu.blogspot.com
www.askruchulu.blogspot.com
No comments:
Post a Comment