Pages

Tuesday, 3 April 2012

రామాయణం @ కధ -25


అక్కడే కూర్చున్న కౌసల్యా సుమిత్ర, దశరథుడు మూర్చపోయాడనుకున్నారు. వాళ్ళు అక్కడే పడుకొని నిద్రపోయారు. మరునాడు ఉదయం వంది మాగధులు వచ్చి స్తోత్రం చేశారు, కాని మహారాజు ఎంతసేపటికి మేల్కొనక  పోయేసరికి అక్కడే నిద్రిస్తున్న కౌసల్యని అడిగారు, ప్రభువు కదలడం లేదని. అప్పుడు కౌసల్య పరదాలను తొలగించి లోపలికి వెళ్ళి చూసేసరికి దశరథుడు మరణించి ఉన్నాడు. 

దశరథుడు మరణించాడన్న విషయం తెలుసుకున్న ఆయన భార్యలందరూ అంతఃపురంలో క్రౌంచ పక్షులు లాగ బిగ్గరగా ఏడ్చారు. కౌసల్య దుఃఖానికి అంతులేకుండా పోయింది. నలుగురు కుమారులు ఉన్నప్పటికీ అంచేష్టి సంస్కారం నిర్వహించడానికి ఒక్క కుమారుడు కూడా అందుబాటులో లేని కారణం చేత దశరథుడి శరీరాన్ని తైల ద్రోణిలొ(రాసాయనములలో శరీరాన్ని నిలువ చేసే పద్ధతి, అందులో అలా పెడితే శరీరం పాడవదు) పెట్టారు. ఆ రోజు అందరూ జెరిగినటువంటి ఈ హఠాత్ పరిణామానికి బాధపడుతూ ఉన్నారు. ఆ రాత్రి గడిచిన తరువాత మరునాడు ఉదయం మహర్షులందరూ కూడా సభా మంటపానికి చేరారు. 

మార్కణ్డేయో అథ మౌద్గల్యో వామదేవః చ కాశ్యపః |
కాత్యయనో గౌతమః చ జాబాలిః చ మహా యశాః ||
ఏతే ద్విజాః సహ అమాత్యైః పృథగ్ వాచం ఉదీరయన్ |
వశిష్ఠం ఏవ అభిముఖాః శ్రేష్ఠః రాజ పురోహితం ||

ఆ సభలో మార్కండేయుడుమౌద్గల్యుడువామదేవుడుకాశ్యపుడుకాత్యయనుడుగౌతముడుజాబాలి మొదలైన మహర్షులందరూ సమావేశమయ్యారు. ఆ మహర్షులందరూ వశిష్ఠుడితో ఇలా అన్నారు " మహానుభావ! ఒక్క రోజు రాత్రి రాజు లేకుండా రాజ్యం గడవవలసి వస్తే 100 సంవత్సరాలు గడిచినట్టు ఉంది. రాజు లేకుండా రాజ్యం ఉండకూడదు. రాజులేని రాజ్యం మీద శత్రువుల దృష్టి పడడం ఒక్కటే కాదు, మెరుపులతో కూడిన వర్షం పడదు, రాజ్యంలోని ఏ కుటుంబంలొ కూడా భర్త మాట భార్య వినదు, ఎక్కడా యజ్ఞయాగాది క్రతువులు చెయ్యరు, ఒకవేళ జెరిగినా దక్షిణలు ఇవ్వరు, ఎక్కడా కూడా పురాణాలు, కావ్యములు మొదలైన వాటిలో ఉండేటటువంటి విశేషములను వివరించడానికి పండితులైన వారు ముందుకి రారు, యుక్త వయస్సులో ఉన్నటువంటి కన్యలు గొప్ప గొప్ప బంగారు ఆభరణములను ధరించి సాయంత్రం పూట సంతోషంగా ఉద్యానవనాలలోకి వెళ్ళి పూవులని కోసుకుంటూ ఆనందంగా కూర్చొని మాట్లాడుకునేటటువంటి పరిస్థితి ఉండదు,  ఆడపిల్ల కనబడితే వేధించుకు తినేటటువంటి దుష్ట చూపు కలిగినటువంటి, మనుష్య రూపమైన, యవ్వనంలో ఉన్న మృగాలు బయలుదేరతాయి, తపస్సు చేసుకునేటటువంటి ఋషులు తమ కడుపుని నింపుకోవడం కోసం గ్రామములలోకి రారు, వర్తకులు తమ సంపదని ఎక్కడో దాచుకున్నా కూడా బిక్కు బిక్కు మంటూ బతకవలసిన రోజులు వస్తాయి, ఇది నా భూమి, ఇది నా పొలము అని చెప్పగలిగే వాడు ఉండడు, అన్నిటినీ మించి ప్రజలలో నిస్పృహ, నిరాశ చోటుచేసుకుంటాయి.

రాజా సత్యం చ ధర్మశ్చ రాజా కులవతాం కులం |  
రాజా మాతా పితా చైవ రాజా హితకరో నృణాం ||

రాజె సత్యం, రాజె ధర్మం, రాజె తల్లి, రాజె తండ్రి, రాజె దైవం, రాజె సమస్తం. అందుచేత సింహాసనం ఖాళీగా ఉండడానికి వీలులేదు. యముడు ప్రాణాలు తీస్తాడు, వాయువు గాలి వీచేటట్టు చేస్తాడు, వరుణుడు వర్షం కురిపిస్తాడు, కాని అష్టదిక్పాలకుల సమస్త విధులను రాజు నిర్వహిస్తాడు. ప్రజలు సంతోషంగా బతికేటట్టు, అన్నం తినగలిగేటట్టు, ఎవరి వృత్తియందు వారు సక్రమంగా ప్రవర్తించేటట్టు రాజు చెయ్యగలడు. అందుకని తొందరగా ఇక్ష్వాకువంశ సంజాతుడైన వారికి పట్టాభిషేకం చెయ్యవలసింది " అని ఆ మహర్షులు అన్నారు. 

అప్పుడు వశిష్ఠుడు " ఇందులో మీరు కాని నేను కాని ఆలోచించాల్సిన విషయం ఏమి లేదు. ఎందుకంటే, దశరథుడు వెళ్ళిపోతూ ఒక నిర్ణయం చేసి వెళ్ళిపోయాడు, భరతుడికి ఈ రాజ్యం దక్కాలని రాముడు అరణ్యవాసం చెయ్యాలని నిర్ణయించాడు. ఆ కారణం చేత భరతుడిని పిలిపించి ఈ సింహాసనం మీద కూర్చోబెట్టి పట్టాభిషేకం చెయ్యాలి. కాని భరతుడు తన తాతగారైన కైకేయ రాజు దెగ్గర ఉన్నాడు, ఆ రాజ్యం చాలా దూరంలో ఉంది కనుక, చాలా వేగంగా అశ్వముల మీద వెళ్ళగలిగే దూతలని పంపుదాము " అని అన్నాడు.

తరువాత వశిష్ఠుడు సిద్ధార్థుడుజయంతుడువిజయుడుఅశోకుడు అనే నలుగురు దూతలని సిద్ధం చేసి కైకేయ రాజ్యానికి వెళ్ళి ఆ కైకేయ రాజుకి విశేషమైన ధనాన్ని బహుమతిగా ఇవ్వమన్నాడు. కాని అక్కడ మీరు రాముడు అరణ్యాలకి వెళ్లినట్టు కాని, దశరథ మహారాజు మరణించినట్టు కాని ఎవరికీ చెప్పవద్దు అన్నాడు. భరతుడిని నేను కుశలం అడిగానని చెప్పి, ఒక్క క్షణం ఆలస్యం కాకుండా అయోధ్యా నగరాన్ని చేరుకోవాలని నేను ఆజ్ఞాపించానని చెప్పి తీసుకురండి అన్నాడు. అప్పుడా దూతలు మార్గమధ్యంలో తినడానికి కావలసిన ఆహార సంభారములని సమకూర్చుకొని అడ్డదారిలో బయలుదేరారు. వాళ్ళు రాజభక్తి కలిగిన వారు కనుక, వెళ్ళే దారిలో కంటికి తృప్తినిచ్చే విషయాలు కనిపించినా ఆగకుండా వెళ్ళారు. అలా వారు అయోధ్య నుండి పడమటికి బయలుదేరి అపరతాలము అనే పర్వతాన్ని దాటి, మాలినీ నది తీరం గుండా ప్రయాణం చేసి, ప్రలంబ పర్వతానికి ఉత్తరం వైపు తిరిగి, అక్కడినుంచి పశ్చిమాభి ముఖంగా ప్రయాణం చేసి, హస్తిన నగరాన్ని సమీపించి, అక్కడ ప్రవహిస్తున్న గంగా నదిని దాటి, మళ్ళి పశ్చిమాభి ముఖంగా తిరిగి, అక్కడినుంచి కురు దేశంలో ఉండేటటువంటి జాఙ్గలం అనే గ్రామంలోకి వెళ్ళి, అక్కడినుంచి పాంచాల రాజ్యాన్ని చేరి, శరదండముఅనే నదిని దాటి, పశ్చిమాభి ముఖంగా ప్రయాణం చేసి, నికూలవృక్షము అనే మహా వృక్షాన్ని చేరి, అక్కడినుంచి కులింగ పట్టణం చేరుకొని అక్కడినుంచి అభికాలము అనే గ్రామాన్ని చేరుకొని, తరువాత ఇక్షుమతి నదిని దాటి, బాహ్లిక దేశాన్ని చేరుకొని, దాని మధ్యలోనుంచి బయలుదేరి సుదామము అనే విష్ణు పధాన్ని చేరుకొని, అక్కడినుంచి విపాశా నదిని దాటి, శాల్మలీ వృక్షము అనే గొప్ప ప్రాంతాన్ని చేరుకొని, అక్కడినుంచి బయలుదేరి రాత్రికి గిరివ్రజాన్ని(గిరివ్రజం కైకేయ రాజ్యానికి రాజధాని) చేరుకున్నారు. తెల్లవారాక భరతుడి దర్శనం కోసం లోపలికి ప్రవేశించారు.


అదే రోజు తెల్లవారుతుండగా భరతుడికి పీడకల వచ్చింది. తెల్లవారే సరికి ఆయన మనస్సులో స్వస్థత లేదు, అందువలన ఆయన కాంతి తగ్గిపోయి చాలా తేజోవిహీనంగా ఉన్నాడు. ఆయన మిత్రులు ఇది గమనించి అడుగగా, భరతుడు ఇలా చెప్పాడు " నాకు తెల్లవారుజామున ఒక కల వచ్చింది. ఆ కలలో మా తండ్రిగారైన దశరథ మహారాజు ఒక పర్వతం మీద నిలబడ్డారు. ఆయన అక్కడినుంచి కిందపడిపోయారు. పడిపోతున్నప్పుడు తిన్నగా వెళ్ళి పేడతో ఉన్న ఒక పెద్ద బిలంలో పడిపోయారు. అందులో తేలుతూ నూనెని దోసిళ్ళలో పోసుకొని తాగుతున్నారు, తరువాత ఆ నూనెని ఒంటి నిండా పూసుకున్నారు. తరువాత ఆయన తన తలని కిందకి వాల్చేసి ఉండగా నేను ఒక ఆశ్చర్య విషయాన్ని స్వప్నంలొ చూశాను. సముద్రం అంతా ఎండిపోయి భూమి అయిపోయింది. ఆకాశంలో ఉన్న చంద్రుడు భూమి మీద పడిపోయాడు. ఈ భూమండలం అంతా బద్దలయిపోయింది. అనుకోకుండా చీకటి ఏర్పడింది. రాజు ఎక్కే భద్రగాజానికి ఉండే దంతం విరిగిపోయింది. హోమంలొ ఉన్న అగ్ని ఒక్కసారి ఆగిపోయింది. దానితోపాటు మా తండ్రిగారు ఒక ఇనుప పీట మీద కూర్చుని, ఎర్రటి వస్త్రాన్ని కట్టుకొని, ఎర్ర చందనం రాసుకొని, ఎర్రటి మాలలు వేసుకొని పూజ చేసుకుంటున్నారు. అటువంటి సమయంలో ఎక్కడినుంచో నల్లటి ఎర్రటి రంగు వస్త్రములు కట్టుకున్న స్త్రీలు వచ్చి వికృతంగా నవ్వుతున్నారు. అప్పుడు మా నాన్నగారు గాడిదలు పూన్చిన రథం ఎక్కారు. అప్పుడు ఈ స్త్రీలు ఆయన మెడలో పాశాలు వేసి, ఆయనని ఆ రథాన్ని దక్షిణ దిక్కుకి ఈడ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇలా తెల్లవారుజామున ఎవరు గాడిదల రథం మీద కూర్చున్నట్టు కనపడ్డాడో, వాడు చితి మీద పడుకొని ఉండగా, ఆ శరీరం కాలిపోతున్నటువంటి ధూమాన్ని కొద్దిరోజులలోనే చూడవలసి వస్తుంది. అందుచేత నాకు నా తండ్రిగారి మీద బెంగ పట్టుకుంది, దానితో పాటుగా నా మీద నాకు ఎందుకో అసహ్యం వేస్తుంది. ఇవన్నీ చూస్తుంటే ఏదో ప్రమాదం జెరిగిందని నాకు అనిపిస్తుంది " అని అన్నాడు. 



ఇంతలో అయోధ్య నుంచి వచ్చిన దూతలు లోపలికి వచ్చారు. వాళ్ళని చూసిన భరతుడు.....

ఆర్యా చ ధర్మ నిరతా ధర్మజ్ఞా ధర్మ దర్శినీ |
అరోగా చ అపి కౌసల్యా మాతా రామస్య ధీమతః ||

" సర్వకాలముల యందు ధర్మాన్ని మాత్రమే అనుష్టానము చేస్తూ, ధర్మం వంక చూస్తూ, ధర్మం తెలిసినటువంటి రామ మాత అయిన కౌసల్య ఏ ప్రమాదం లేకుండా ఆరోగ్యంగా ఉందా. శత్రుఘ్నడికి, లక్ష్మణుడికి తల్లి అయిన సుమిత్ర ఏ రోగం లేకుండా ఆరోగ్యంగా ఉందా. 


ఆత్మ కామా సదా చణ్డీ క్రోధనా ప్రాజ్ఞ మానినీ |
అరోగా చ అపి కైకేయీ మాతా మే కిం ఉవాచ హ ||

మా అమ్మ కైక ఎప్పుడూ కోరికలతో తిరుగుతూ ఉంటుంది, చాలా కోపంతో ఉంటుంది, అటువంటి కైకేయకి ఎటువంటి అనారోగ్యం లేదుకదా. దశరథుడు, రామలక్ష్మణులు కుశలంగా ఉన్నారా " అని అడిగాడు.


అప్పుడా దూతలు " నువ్వు ఎవరెవరు కుశలంగా ఉండాలని కోరుకున్నావో, వాళ్ళంతా కుశలంగా ఉన్నారు. నిన్ను తొందరలో లక్ష్మి వరించబోతోంది, నువ్వు ఉత్తరక్షణం బయలుదేరి రావాలని వశిష్ఠుడు ఆదేశించాడని " చెప్పారు.


అప్పుడు భరతుడు తన తాతగారైన కైకేయ రాజు( ఆయన అసలు పేరు ఆశ్వపతి) దెగ్గరికి వెళ్ళి, తన తిరుగు ప్రయాణానికి అనుమతి తీసుకున్నాడు. అప్పుడా కైకేయ రాజు భరతుడికి ఏనుగులు, మృగ చర్మాలు, 2000 బంగారు హారాలు, 1600 గుర్రాలు బహూకరించాడు. మేనమామైన యుధాజిత్, ఐరావతం యొక్క వంశంలో జన్మించిన ఏనుగుల్ని, కంచర గాడిదలని, వేట కుక్కలని బహూకరించాడు. తన బహుమానలన్నిటిని వెనుక పరివారానికి అప్పగించి తాను మాత్రం తొందరగా వెళ్ళాలని కొంతమందితొ కలిసి అయోధ్యకి బయలుదేరాడు భరతుడు. దూతలు అసలు విషయం చెప్పలేదు కనుక, ఆయన వాళ్ళు వచ్చిన మార్గంలో వెళ్ళలేదు. 


ఆయన బయలుదేరి సుదామహ్లాదినిశతద్రువు, శిలావాహ అనే నాలుగు నదులను దాటాడు. అక్కడినుంచి శల్య కర్తన నగరాన్ని, చైత్ర రథం నగరాన్ని దాటాడు. సరస్వతి, గంగా నదులను దాటాడు. తరువాత వీరమత్సాం అనే దేశానికి వచ్చాడు, కులింగ నదిని దాటాడు, తరువాత మహారణ్యంలోకి ప్రవేశించాడు, అక్కడినుంచి భాగీరథీ నదిని దాటాడు, తరువాత ప్రాగ్వాటము అనే పట్టణానికి చేరుకున్నాడు, తరువాత కుటికోష్ఠికము అనే నదిని దాటాడు, అక్కడి నుంచి ధర్మవర్ధనముతోరణమువరూథి అనే గ్రామాలు దాటాడు, తరువాత ఉజ్జహాసం అనే నగరంలోకి వచ్చాడు, తదనంతరం సరస్వతి తీర్థం అనే గ్రామాన్ని దాటాడు, అక్కడ ఉత్తానికా అనే నదిని దాటాడు, అక్కడినుంచి హస్తిపృష్ఠికము అనే గ్రామంలోకి ప్రవేశించి కుటికా నదిని దాటాడు, తరువాత కపివతీ అనే పట్టణానికి చేరుకున్నాడు, అక్కడినుంచి ఏకశాల అనే గ్రామానికి వచ్చాడు, తరువాత  స్థాణుమతీ అనే ఊరిని దాటాడు, తరువాత గోమతీ అనే నదిని దాటి ఒక రాత్రంతా ప్రయాణం చేసి అయోధ్యా పట్టణానికి చేరుకున్నాడు. తన తాతగారి దెగ్గరినుండి బయలుదేరి అయోధ్యకి రావడానికి భరతుడికి 8 రాత్రుళ్ళు పట్టాయి. ఆయన అయోధ్యకి రాగానే అక్కడున్న ప్రజల పరిస్థితిని చూసేసరికి ఆయన మనస్సు మరింత  బరువయ్యింది. భరతుడిని చూడగానే అందరూ తలుపులు మూసేసి లోపలికి వెళ్ళిపోతున్నారు. ఎవరూ సంతోషంగా కనపడలేదు. 


అప్పుడాయన తిన్నగా దశరథ మహారాజు మందిరానికి వెళ్ళాడు. దశరథుడి కోసం అన్ని గదులు వెతికాడు, అక్కడున్న వారెవరూ సంతోషంగా లేరు. రాజు ఇక్కడ లేకపోతే మా అమ్మ కైకేయ మందిరంలో ఉంటాడని, గబగబా కైక మందిరంలోకి వెళ్ళాడు. అక్కడున్న కైకేయకి నమస్కారం చేశాడు. అప్పుడా కైకేయ భరతుడిని సంతోషంగా తన పక్కన కూర్చోపెట్టుకొని " చాలా సంతోషంగా గడిపావ, అందరూ ఆనందంగా ఉన్నారా, అక్కడి విశేషాలు ఏంటో నాకు చెప్పు " అని అనింది.


అప్పుడు భరతుడు " అమ్మ! నాకు ఇక్కడికి రావడానికి 8 రాత్రుళ్ళు పట్టింది, అక్కడ అందరూ బాగానే ఉన్నారు కాని, నా తండ్రిగారైన దశరథ మహారాజుగారి పాదాలకి నమస్కారం చెయ్యాలని నా మనస్సు కోరుకుంటుంది, నీ మందిరంలోని ఈ తల్పం మీద వారు పడుకొని ఉండేవారు కదా, వారు ఇప్పుడు ఇక్కడ లేరు. అమ్మా! తండ్రిగారు కౌసల్య మందిరంలో ఉన్నారా " అని అడిగాడు. 

No comments:

Post a Comment