Pages

Tuesday, 17 April 2012

రామాయణం @ కధ -39


అర్థ అధిక ముహూర్తేన రామేణ నిశితైః శరైః |
చతుర్ దశ సహస్రాణి రక్ష్సాం కామ రూపిణాం |
ఖర దూషణ ముఖ్యానాం నిహతాని మహామృధే ||

రాముడు ఆ 14,000 మంది రాక్షసులని ఒక గంటా 12 నిమిషాల్లో సంహరించాడు. ఆయన తిరిగి వెనక్కి వస్తుంటే పైనుండి పుష్పవృష్టి కురిసింది. అక్కడున్న ఋషులందరూ ఎంతో సంతోషించారు. అప్పటిదాకా ఏమి జెరుగుతోందో అని కంగారుపడుతూ చూస్తున్న సీతమ్మ ఒక్కసారి పరుగుపరుగున వచ్చి రాముడిని ముందునుంచి గట్టిగా కౌగలించుకుంది. పూర్ణచంద్రుడిలా వెలిగిపోతున్న ముఖంతో సీతమ్మ రాముడిని పక్కన నుంచి, వెనక నుంచి, మళ్ళి మళ్ళి కౌగలించుకుంది. 

అన్నయ్య చేసిన శత్రు సంహారానికి లక్ష్మణుడు పొంగిపోయాడు. చంద్రుడి వంటి ముఖంతో సీతమ్మ కౌగలించుకునేసరికి రాముడు తన కష్టాన్నంతా మరిచిపోయాడు. అప్పుడు వాళ్ళంతా ఆనందంగా పర్ణశాలలోకి వెళ్ళారు.



రాముడు ఖర దూషణులని సంహరించాదాన్ని తెలియచేయటానికి అకంపనుడు అనే రాక్షసుడు చూసి లంకా పట్టణానికి చేరుకున్నాడు. అక్కడాయన రావణుడి పాదముల మీద పడి, రాముడు ఖర దూషణులను ఎలా సంహరించాడో వివరించాడు. ఆగ్రహించిన రావణుడు " అసలు ఆ రాముడు ఎవరు, దండకారణ్యంలో ఎందుకున్నాడు, వారితో ఉన్న ఆ స్త్రీ పేరేమి, అసలు 14,000 రాక్షసులని రాముడు ఒక్కడే ఎందుకు సంహరించాడు. నాకు కారణం చెప్పు " అన్నాడు.

అప్పుడు అకంపనుడు " రాముడు సామాన్యమైన వ్యక్తి కాదు, దశరథుడి కుమారుడు, విశేషమైన తేజస్సు కలిగినవాడు. ఆయన తమ్ముడు లక్ష్మణుడు, రాముడికి బహిప్రాణంగా సంచరిస్తూ ఉంటాడు, ఆయన రాముడికి కుడిభుజం లాంటివాడు, సర్వకాలములయందు రాముడిని కాపాడుకోవడమే తన కర్తవ్యంగా పెట్టుకున్నాడు. రాముడు తన ధర్మపత్ని అయిన సీతతో కలిసి 14 సంవత్సరాలు అరణ్యవాసం చెయ్యడానికి దండకారణ్యానికి ప్రవేశించాడు. తాపసులైన ఋషులు రాక్షసుల చేత తాము పొందుతున్న బాధలని రాముడికి చెప్పుకుంటె, మీకు శత్రువులైన రాక్షసులు నాకూ శత్రువులే కనుక వారిని సంహరిస్తాను అని ఆ ఋషులకి మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారం రాక్షస సంహారం చేసి దండకారణ్యంలో ఎక్కడా రాక్షసులు లేనటువంటి పరిస్థితిని కల్పించాడు. ఆ రాముడు తన బాణముల చేత ఈ భూమిని కృంగేటట్టు చెయ్యగలడు, కృంగిపోతున్న భూమిని నిలబడేటట్టు చెయ్యగలడు, సముద్రాలని క్షోభింప చెయ్యగలడు, పర్వతాలని కదపగలడు " అని అకంపనుడు విశేషంగా రాముడి పరాక్రమాన్ని వర్ణించాడు.

" అయితే నేను ఇప్పుడే వెళ్ళి ఆ రామలక్ష్మణులని సంహరిస్తాను " అని రావణాసురుడు అన్నాడు.

అప్పుడు అకంపనుడు " మీరు తొందరపడి వెళ్ళవద్దు, ఎందుకంటే విశేషమైన వేగం కలిగిన ప్రవాహంలోకి ప్రవేశించడం మంచిది కాదు. ఆయన ముందు మీరు నిలబడలేరు. రాముడిని సంహరించాలంటే ఒక్కటే ఒక్క మార్గం ఉంది, రాముడి భార్య అయిన సీత చాలా అందంగా ఉంటుంది. ఆ సీతతో అందంలో సమానమైన వాళ్ళు గంధర్వలులలో కాని, యక్షులలో కాని, కిన్నెరులలో కాని, రాక్షసులలో కాని, మనుష్యులలో కాని లేరు. అందుకని రాముడు లేని సమయం చూసి సీతని అపహరించి తీసుకొచ్చి నీ భార్యని చేసుకో. సీత పక్కన లేకపోతే రాముడు జీవించలేడు. సీతని పోగొట్టుకున్న రాముడు తనంతటతానుగా ప్రాణములను విడిచిపెడతాడు. అందుచేత నువ్వు ఈ కపటోపాయంతో రామవధకి పూనుకో " అన్నాడు.   

రావణుడు వెంటనే బయలుదేరి మారీచ ఆశ్రమానికి వెళ్ళి" నాకు ఒక ముఖ్యమైన పని పడింది, నువ్వు మాయలు తెలిసినవాడివి. అందుకని సీతాపహరణంలో నాకు ఉపకారం చెయ్యి " అని అడిగాడు.


ఈ మాటలు విన్న మారీచుడు " నీకు అసలు ఎవడు చెప్పాడు సీతాపహరణం చెయ్యమని. బహుశా నిన్ను సంహరించడం కోసమని నీ శత్రువు ఎవడో నీకు సలహాలు చెప్పేవాడిగా మాటువేసి ఉన్నాడు. వాడు నిన్నే కాదు సమస్త దానవ కులాన్ని నాశనం చెయ్యాలని ప్రతిజ్ఞ చేశాడు, ఆ ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడానికి వాడు నీకు రాముడితో వైరం పెట్టాడు. రాముడితో వైరం పెట్టుకున్నవాడు ఎవడూ జీవించడు, రాముడి శక్తి సామర్ధ్యాలు ఏమిటో నాకు తెలుసు. నా మాట విని సీతాపహరణం చెయ్యకు " అన్నాడు.

" నువ్వు ఇంతగా చెప్తున్నావు కనుక నేను సీతాపహరణం చెయ్యను " అని రావణుడు వెనక్కి వెళ్ళిపోయాడు. 



అకంపనుడు వెళ్ళిపోయిన తరువాత శూర్పణఖ లంకా పట్టణంలోకి ప్రవేశించింది. ఇంద్రుడి చుట్టూ దేవతలు సభలో కూర్చున్నట్టు, ఆ రావణుడి చుట్టూ మంత్రులు కూర్చొని ఉన్నారు. ఆ రావణుడు దేవతల చేత, గంధర్వుల చేత, యక్షుల చేత, కింపురుషుల చేత సంహరింపబడడు. ఆ సభలో నోరు తెరుచుకొని ఉన్న రావణాసురుడిని చూస్తే, నోరు తెరిచి మీదకి వస్తున్న యమధర్మరాజు జ్ఞాపకం వస్తాడు. 

No comments:

Post a Comment