సీతారామలక్ష్మణులు సుతీక్ష్ణుడి దెగ్గర ఆశీర్వాదం తీసుకొని ముందుకి బయలుదేరారు. వారు అగస్త్య భ్రాత మహర్షి ఆశ్రమానికి చాలా దెగ్గరగా వచ్చాక రాముడు లక్ష్మణుడితో " లక్ష్మణా! ఈ ఆశ్రమాన్ని అగస్త్య భ్రాత ఆశ్రమం అని ఎందుకు పిలుస్తారో తెలుసా? ఈ ఆశ్రమం వెనుక ఒక కథ ఉంది. అదేంటంటే..............పూర్వం ఇక్కడ ఇల్వలుడు, వాతాపి అనే ఇద్దరు రాక్షసులు ఉండేవారు. ఇల్వలుడు బ్రాహ్మణ రూపం దాల్చేవాడు, వాతాపి ఒక గొర్రె రూపం దాల్చేవాడు. వారు అలా కనబడ్డ బ్రాహ్మణుల దెగ్గరికి వెళ్ళి, ' అయ్యా, రేపు మా తండ్రిగారి ఆబ్దికము, తద్దినం పెట్టాలి కనుక మీరు భోక్తగా రండి ' అనేవారు. అప్పుడా ఇల్వలుడు గొర్రె రూపంలో ఉన్న తన తమ్ముడైన వాతాపిని చంపి, ఆ మాంసాన్ని వచ్చిన బ్రాహ్మణుడి విస్తట్లో వేసేవాడు( త్రేతాయుగ ధర్మం ప్రకారం తండ్రిగారికి పెట్టె తద్దిన భోజనంలో మాంసం వండేవారు, ఆ మాంసాన్ని బ్రాహ్మణులు తినేవారు). ఆ బ్రాహ్మణుడు మాంసాన్ని తిన్న తరువాత హస్తోదకం వేసి ' వాతాపి! రా........' అనేవాడు. అప్పుడా వాతాపి ఆ బ్రాహ్మణుడి శరీరాన్ని చీల్చుకొని బయటకి వచ్చేవాడు. అప్పుడు వాళ్ళిద్దరూ ఆ బ్రాహ్మణుడి శరీరాన్ని భుజించేవారు.
ఇలా చాలాకాలం, చాలా మందిని వారు సంహరించారు. ఒకనాడు అటుగా వెళుతున్న అగస్త్య మహర్షిని కూడా మిగతా బ్రాహ్మణుల్ని పిలిచినట్టు పిలిచారు. అగస్త్యడు త్రికాలవేది కనుక వీళ్ళు చేస్తున్న మోసాన్ని గ్రహించాడు. ఇల్వలుడు పిలిచేసరికి, అగస్త్య మహర్షి వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేశాడు. భోజనం చేశాక తన కడుపు మీద చెయ్యి వేసి, 'జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం' అన్నారు. ఇది తెలియని ఇల్వలుడు హస్తోదకం పోసి 'వాతాపి! రా.....' అన్నాడు.
కుతో నిష్క్రమితుం శక్తిర్ మయా జీర్ణస్య రక్షసః | భ్రాతుః తే మేష రూపస్య గతస్య యమ సాదనం ||
" నీ తమ్ముడిని జీర్ణం చేసుకొని యమలోకానికి పంపించేసానురా " అని అగస్త్య మహర్షి ఇల్వలుడితో అన్నారు.
ఆగ్రహించిన ఇల్వలుడు ఘోరమైన రూపాన్ని దాల్చి అగస్త్య మహర్షి మీద పడ్డాడు. అప్పుడు అగస్త్యుడు ఒక హుంకారం చేసేసరికి ఆ ఇల్వలుడు బూడిదై పడిపోయాడు. ఆ వాతాపిని, ఇల్వలుడిని అగస్త్య మహర్షి సంహరించిన ప్రదేశమే ఈ అగస్త్య భ్రాత యొక్క ఆశ్రమం లక్ష్మణా " అని రాముడు అన్నాడు.
ఈ వృత్తాంతం విన్నాక అందరూ ఆ ఆశ్రమంలోనికి వెళ్ళారు. వాళ్ళకి అగస్త్య భ్రాత ఎదురొచ్చి లోపలికి ఆహ్వానించాడు, అర్ఘ్య పాద్యాలు ఇచ్చాడు, కందమూలాలు, తేనె పెట్టాడు. ఆ రాత్రికి సీతారామలక్ష్మణులు ఆ ఆశ్రమంలో పడుకున్నారు. మరునాడు లేచి అగస్త్య మహర్షి ఆశ్రమానికి దారి చెప్పవలసింది అని అడుగగా " అదిగొ మీకు కనపడుతున్న ఆ చెట్లకి ప్రదక్షిణ చేసి దక్షిణ వైపుకి వెళితే మీకు అగస్త్య మహర్షి ఆశ్రమం కనపడుతోంది " అని అగస్త్య భ్రాత మహర్షి చెప్పరు.
అగస్త్య మహర్షి యొక్క గొప్పతనం ఏంటంటే, ఆయన ఆశ్రమంలో దేవతలకి స్థానాలు ఉన్నాయి( అంటె ఆయన ఆశ్రమానికి దేవతలు వచ్చి, తమ తమ స్థానాలలో కూర్చొని అగస్త్యుడిని పూజించి వెళ్ళేవారు. అక్కడ శివ స్థానం తప్ప మిగిలిన అన్ని దేవతలకి స్థానాలు ఉన్నాయి, అగస్త్యుడు శివుడిని పూజించేవాడు). ఆయన ఆశ్రమంలో తపస్సు చేసుకునే ఋషులు దివ్య విమానాలలో ఊర్ధలోకాలకి వెళ్ళిపోయేవారు. ఆ ఆశ్రమంలోకి అసత్యం చెప్పేవాడు కాని, క్రూరమైన బుద్ధి ఉన్నవాడు కాని, వంచన చేసేవాడు కాని, మరొకరిని పీడించే స్వభావం ఉన్నవాడు కాని, ఎప్పుడూ కోరికలతో ఉండేవాడు కాని ఆ ఆశ్రమంలోకి వెళ్ళి కూర్చోవడం అనేది జెరగదు.
సీతారామలక్ష్మణులు ఆ అగస్త్య ఆశ్రమానికి చేరుకునేసరికి, ఆ ఆశ్రమంలో ఎక్కడా చూసిన తడి బట్టలు, నార చీరలు, యజ్ఞయాగాది క్రతువులు చేసుకునే అగ్నివేదికలు, పవిత్రమైన పదార్ధాలు, పుష్పమాలికలు మొదలైనవాటితో ఆ ఆశ్రమం రంజిల్లుతోంది. అప్పుడు రాముడు లక్ష్మణుడిని పిలిచి " లక్ష్మణా! నేను సీతతో కలిసి బయట నిల్చుని ఉంటాను. నువ్వు లోపలికి వెళ్ళి, రాముడు సీతమ్మతో, లక్ష్మణుడితో మీ ఆశ్రమానికి వచ్చాడు, ఆయన అగస్త్య మహర్షి దర్శనం చేసుకోవాలని అనుకుంటున్నారు. దర్శనం చేసుకోవడానికి అనుగ్రహిస్తార " అని కబురు చెయ్యి అన్నాడు.
లక్ష్మణుడు ఆశ్రమంలోనికి వెళ్ళి ఒక ముని కుమారిడితో తన ప్రార్ధన నివేదించాడు. అప్పుడా ముని కుమారుడు అగస్త్య మహర్షితో ఈ విషయం చెప్పగా " నేను ఎప్పటినుంచో సీతారాములని, లక్ష్మణుడిని చూడాలని అనుకుంటున్నాను. నువ్వు, రాముడు రాగానే నా దెగ్గరికి తీసుకురాకుండా, నా దెగ్గరికి వచ్చి ఈ మాటలు చెప్పి ఎందుకు కాలాన్ని వృధా చేశావు, వెంటనే వెళ్ళి సీతరాములని ప్రవేశపెట్టు " అని అగస్త్యుడు అన్నాడు.
అప్పుడు సీతారామలక్ష్మణులు అగస్త్యుడు ఉండేటటువంటి గదిలోకి వెళుతుండగా కార్తికేయుడు,వరుణుడు, కుబేరుడు, సోముడు, బ్రహ్మ, విష్ణువు, మహేంద్రుడు, వాయువు మొదలైనవారి స్థానములు ఉన్నాయి. ఆ స్థానములలో వారు కూర్చొని అగస్త్యుడిని ఆరాధన చేసి వెళుతుంటారు. అప్పుడు అగస్త్యుడు కోటిసూర్యుల తేజస్సుతో ఆ గదినుండి బయటకి వచ్చారు.
ఏవం ఉక్త్వా మహాబాహుః అగస్త్యం సూర్య వర్చసం |
జగ్రాహ ఆపతత్ తస్య పాదౌ చ రఘునందన ||
అభివాద్య తు ధర్మాత్మా తస్థౌ రామః కృతాంజలిః |
సీతయా సహ వైదేహ్యా తదా రామః స లక్ష్మణః ||
సూర్యుడిలా వెలిగిపోతున్న ఆ అగస్త్యుడిని చూడగానే రాముడు గబగబా వెళ్ళి తన రెండు చేతులతో అగస్త్య మహర్షి యొక్క పాదములను పట్టుకొని నమస్కారం చేశాడు. సీతమ్మ లక్ష్మణుడు ఆయనని చూస్తూ అంజలి ఘటిస్తూ నిలబడిపోయారు.
అప్పుడు అగస్త్య మహర్షి రాముడికి అర్ఘ్య పాద్యాలు ఇచ్చి, తాను అగ్నికార్యాన్ని పూర్తి చేసి వస్తానని చెప్పి, రాముడిని కూర్చోమన్నారు. కొంతసేపటికి బయటకి వచ్చిన అగస్త్యుడు " నువ్వు వచ్చినప్పుడు నేను గదిలో అగ్నిశాలలో ఎందుకున్నానో తెలుసా రామా?, అగ్నికార్యం జెరిగేటప్పుడు అతిథి వస్తే, ముందు అగ్నికార్యాన్ని పూర్తిచెయ్యాలి, తరువాత అతిథిని పూజించాలి. ఇలాంటి ధర్మాన్ని పాటించనివాడు పై లోకాల్లో తన మాంసాన్ని తానే తింటాడు.
రామా! నువ్వు లోకములన్నిటిని పాలించగల రాజువి, ఇవ్వాళ మాకు ప్రియమైన అతిధిగా లభించావు, అందుకని నిన్ను పూజించాను " అని రాముడికి వానప్రస్థులకి పెట్టె బోజనాన్ని పెట్టారు. తరువాత ఆయన రాముడికి విష్ణు ధనుస్సుని, బ్రహ్మగారు ఇచ్చిన సూర్య తేజస్సు కలిగిన బాణాన్ని, ఇంద్రుడు ఇచ్చిన రెండు అక్షయబాణ తూణీరములు, ఒక బ్రహ్మాండమైన పిడి కలిగిన ఖడ్గాన్ని ఇచ్చి, వీటి ద్వారా జయాన్ని పొందు అని ఆశీర్వదించారు.
" స్వామీ! మేము ఎక్కడ ఆశ్రమాన్ని కట్టుకోము " అని రాముడు అడుగగా, " నిన్ను నేను నాతోపాటే ఈ ఆశ్రమంలోనే ఉండు అని అనాలని అనుకున్నాను, కాని నా తపఃశక్తి చేత నేను నీ మనసులో ఉన్న కోరికని దర్శించాను, నీ కోరిక ఏమిటో నాకు అర్ధమయ్యింది. అందుకని రామా! ఇక్కడికి దెగ్గరిలో పంచవటి అనే గొప్ప వనం ఉంది, అక్కడ గోదావరి ప్రవహిస్తూ ఉంటుంది. కావున అక్కడ నువ్వు ఆశ్రమాన్ని నిర్మించుకో, అప్పుడు నీ కోరిక తీరుతుంది. ఎవ్వరూ చెయ్యలేని పని చేసింది సీతమ్మ, నువ్వు ఆమెని భద్రంగా కాపాడుకో " అన్నారు.
సీతారామలక్ష్మణులు అగస్త్య మహర్షి దెగ్గర సెలవు తీసుకొని, ఆయన చెప్పిన విధంగా పంచవటికి బయలుదేరారు. వారు అలా వెళుతుండగా ఒక చెట్టు మీద పెద్ద పక్షి ఒకటి వాళ్ళకి కనబడింది. ఆ పక్షి రాముడిని చూసి, నేను మీతో వస్తాను అనింది. అప్పుడు రాముడు " నువ్వు ఎవరు " అని అడుగగా, ఆ పక్షి ఇలా చెప్పసాగింది.......
" నేను మీ నాన్నగారైన దశరథ మహారాజుకి స్నేహితుడిని. ప్రజాపతులలో చిట్ట చివరివాడు కశ్యప ప్రజాపతి. ఆయన దక్ష ప్రజాపతి యొక్క 60 కుమార్తెలలో 8 మందిని వివాహం చేసుకున్నాడు. ఆ ఎనిమిదిమందే అదితి, దితి, ధనువు, కాళిక, తామ్ర, క్రోధవశ, మను, అనలా. అప్పుడు కశ్యపుడు తన 8 మంది భార్యలని పిలిచి " మీరు క్షేత్రములు కనుక, నా యొక్క తేజస్సు చేత, నాతో సమానులైన వారిని కనండి " అన్నాడు. ఆయన మాటలని కొంతమంది భార్యలు విన్నారు, కొంతమంది వినలేదు.
అదితికి 12 మంది ఆదిత్యులు, 8 పశువులు , 11 రుద్రులు, ఇద్దరు అశ్వినులు జన్మించారు. అలా మొత్తం 33 దేవతలు అదితికి జన్మించారు. దితికి దైత్యులు జన్మించారు. ధనువుకి హయగ్రీవుడు జన్మించాడు. ఈ ముగ్గురు భార్యలు కశ్యప ప్రజాపతి మాట విన్నారు.
కశ్యపుడి మాట వినని భార్యలైన కాళికకి నరకుడు, కాలకుడు అనే ఇద్దరు జన్మించారు. తామ్రకి క్రౌంచి, భాసి, శ్యేని, ధృతరాష్ట్రీ, శుకి అనే 5 కన్యలు జన్మించారు. మళ్ళి క్రౌంచికి గుడ్లగూబలు పుట్టాయి. భాసికి భాస పక్షులు పుట్టాయి. శ్యేనికి డేగలు, గ్రద్దలు పుట్టాయి. ధృతరాష్ట్రీకి హంసలు, చక్రవాకములు పుట్టాయి. శుకికి నత్త అనే పిల్ల పుట్టింది. నతకి వినత అనే పిల్ల పుట్టింది. ఆ వినతకి గరుడుడు, అరుణుడు అనే ఇద్దరు పుట్టారు. నేను ఆ అరుణుడి కుమారుడిని, నా పేరు జటాయువు, నా అన్నగారి పేరు సంపాతి.
అలాగే క్రోధవశకి మృగీ, మృగమంద, హరి, భద్రమద, మాతంగి, శార్దూలి, శ్వేత, సురభి, సురస, కద్రువ అనే 10 మంది ఆడపిల్లలు పుట్టారు. మృగికి లేళ్ళు పుట్టాయి, మృగమందకి ఎలుగుబంట్లు పుట్టాయి, హరికి సింహాలు, బలమైన వానరాలు పుట్టాయి, భద్రమదకి ఇరావతి అనే పిల్ల పుట్టింది, ఆ ఇరావతికి ఐరావతం పుట్టింది, మాతంగికి ఏనుగులు పుట్టాయి, శార్దూలికి కొండముచ్చులు, పులులు పుట్టాయి, శ్వేతకి దిగ్గజాలు పుట్టాయి, సురభికి రోహిణి, గోవులు, గంధర్వులు మొదలైనవి పుట్టాయి. సురసకి అనేక పడగలు కలిగిన నాగపాములు పుట్టాయి, కద్రువకి సాధారణమైన సర్పములు పుట్టాయి.
రామా! ఇంతకీ ఇవన్నీ నీకు ఎందుకు చెప్పానో తెలుసా, కనబడేటటువంటి ఈ పక్షులు, మృగాలు, పశువులు అన్ని కశ్యప ప్రజాపతి సంతానం నుంచి వచ్చినవే " అని అన్నాడు ఆ జటాయువు.
ఇదంతా విన్న రామచంద్రమూర్తి జటాయువుని తమతో పాటే ఉండమన్నాడు. అక్కడినుంచి అందరూ పంచవటికి పయనమయ్యారు.
No comments:
Post a Comment