Pages

Thursday, 5 April 2012

రామాయణం @ కధ -27


అప్పుడు కౌసల్య " నాయనా నువ్వు ఎటువంటి వాడివో నాకు తెలుసు, కాని పుత్రుడు దూరంగా వెళ్ళిపోయాడన్న బాధతో అలా మాట్లాడాను " అని భరతుడిని తన ఒడిలో కుర్చోపెట్టుకుంది. ఆ రాత్రంతా భరతుడు ఏడుస్తూనే గడిపాడు. 

తెల్లవారగానే వశిష్ఠుడు మొదలైన మహర్షులు వచ్చి " నీ తండ్రి శరీరం తైల ద్రోణిలొ ఉండిపోయింది. ఆయనకి అంచేష్టి సంస్కారం చెయ్యకపోతే ఉత్తమగతులు కలగవు, కావున ఆ పనియందు దృష్టి పెట్టు "  అన్నారు.

అప్పుడా దశరథ మహారాజు పార్థివ శరీరాన్ని తైల ద్రోణి నుంచి పైకి తీసి బయట పెట్టారు. అందరూ వచ్చి చూశారు. అక్కడినుంచి ఆయనని శిబికలోకి పెట్టారు. తరువాత ఆ శిబికతో శరీరాన్ని చితి మీద పెట్టారు. భరతడు, శత్రుఘ్నుడు అగ్నిహోత్రం తీసుకొచ్చి వెలిగించారు. తరువాత అందరూ సరయు నదికి వెళ్ళి స్నానం చేశారు (ఆ కాలంలో ఇక్ష్వాకు వంశంలో ఆడవారు కూడా చితి దెగ్గరికి వచ్చేవారు). రెండు మూడు రోజుల తరువాత కొన్ని లక్షల గోవుల్ని, బంగారాన్ని దానం చేశారు. అందరికి భోజనాలు పెట్టారు, 13వ రోజున అసౌచం తీరిపోయాక మంత్రులందరూ కలిసి భరతుడి దెగ్గరికి వెళ్ళి సింహాసనం ఖాళీగా ఉండకూడదు, మీ తండ్రిగారి కోరిక ప్రకారం నువ్వు ఈ రాజ్యాన్ని పరిపాలించు అన్నారు.

అప్పుడు భరతుడు పట్టాభిషేకానికి తీసుకువచ్చిన సంభారములన్నిటికి ఒకసారి ప్రదక్షిణం చేసి, 

రామః పూర్వో హి నో భ్రాతా భవిష్యతి మహీ పతిః |  
అహం తు అరణ్యే వత్స్యామి వర్షాణి నవ పంచ చ ||



" నాకు ముందు పుట్టిన రాముడు ఈ  అభిషేక సంభారములతో యువరాజ పట్టాభిషేకం చేసుకోవాలి, సింహాసనం మీద కూర్చొని రాజ్యం పరిపాలించాలి, కాని మా నాన్నగారి ఆజ్ఞ ప్రకారం 14 సంవత్సరాలు దండకారణ్యంలో ఉన్నాడు. రాముడికి నాకు తేడా లేదు, రాముడి బదులు నేను 14 సంవత్సరములు అరణ్యవాసం చేస్తాను, రాముడు వచ్చి పట్టాభిషేకం చేసుకుంటాడు. అందుకని మీరందరూ వెళ్ళి మంచి వడ్రంగులని, శిల్పులని తీసుకువచ్చి, రాజ్యంనుంచి రాముడు దండకారణ్యంలో ఎక్కడున్నాడో అక్కడివరకు దారి చెయ్యండి. నాతో పాటు అయోధ్యా అంతా కదిలి వెళ్ళిపోవాలి, ఇంతమంది అడిగితే రాముడు కాదనలేడు. కావున ఇంతమంది వెళ్ళడానికి తగిన ఏర్పాట్లు చెయ్యండి " అన్నాడు.

ఈ వార్త అయోధ్యలోని ప్రతివారికి చేరింది, అందరూ ఆ వార్త విని మురిసిపోయారు. 

ఆ ముందు రోజు భరతుడు శత్రుఘ్నుడు ఇలా మాట్లాడుకుంటున్నారు " అసలు ఇంత జెరుగుతుంటే లక్ష్మణుడు ఎందుకు ఊరుకున్నాడు, మూర్ఖురాలై మా అమ్మా కైకేయ రెండు వరాలు అడిగి ఉండవచ్చు, సత్యపాశములచేత బందింపబడ్డ దశరథ మహారాజు ఆ రెండు వరాలని కైకేయకి ఇచ్చి ఉండవచ్చు, కాని రామలక్ష్మణులు దశరథుడిని నిగ్రహించి రాజ్యం ఎందుకు తీసుకోలేదు, మా అమ్మకి ఎందుకు బుద్ధి చెప్పలేదు " అని వారు మాట్లాడుకుంటుండగా, అటువైపు నుంచి మంథర వచ్చింది. కైకేయ ఇచ్చిన ఆభరణములతో ఆ మంథర వెళుతుండగా చూసిన భటులు ఆమెని పట్టుకొని అసలు రామలక్ష్మణులు అరణ్యాలకి వెళ్ళడానికి కారణం ఈ మంథర అని చెప్పారు. అప్పుడు శత్రుఘ్నుడు ఆగ్రహంతో తన కత్తిని తీసి ఆ మంథరని ఈడ్చుకుంటూ భరతుడి దెగ్గరికి తీసుకొచ్చాడు. ఆ సమయంలో శత్రుఘ్నుడి భీకరమైన స్వరూపాన్ని చూసి కైకేయ మరియు సుమిత్ర యొక్క అంతఃపురాలలోని జనాలు పారిపోయారు. ఇప్పుడు భరత శత్రుఘ్నులని ఆపగలిగేది కౌసల్య ఒక్కత్తే అని, అందరూ కౌసల్య మందిరానికి పరుగుతీసారు. ఆ మంథరని శత్రుఘ్నుడు పొడవబోతుండగా, అప్పుడే కైకేయ అక్కడికి వచ్చి నిలబడింది.

హన్యాం అహం ఇమాం పాపాం కైకేయీం దుష్ట చారిణీం |
యది మాం ధార్మికో రామః న అసూయేన్ మాతృ ఘాతకం ||

అప్పుడు భరతుడు " అయ్యయ్యో శత్రుఘ్ను, ఆ మంథరని చంపుతానంటావేంటి. ఈ మంథర మాటలు విని ఇంత ఉపద్రవం తీసుకొచ్చింది ఆ కైకేయి. నాకు ఆవిడని చంపెయ్యాలని ఉంది, కాని ఎందుకు చంపడం లేదో తెలుసా, ఆమెని చంపేస్తే మాతృఘాతకుడు అని రాముడు నాతో మాట్లాడడు. దాన్నే వదిలేశాక దీన్ని వదిలెయ్యడం పెద్ద లెక్కా. దీన్ని చంపినా, స్త్రీని చంపిన వాళ్ళు అని, రేపు మనం అరణ్యానికి వెళ్ళినప్పుడు రాముడు ముఖం పక్కకి తిప్పుకుంటాడు. రాముడిని చూడకుండా మనం ఉండలేము, అందుకని దాన్ని వదిలెయ్యి " అన్నాడు. 

భరతస్య వచః శ్రుత్వా శత్రుఘ్నః లక్ష్మణ అనుజః | 
న్యవర్తత తతః రోషాత్ తాం ముమోచ చ మంథరాం ||

అప్పుడు లక్ష్మణుడి తమ్ముడైన శత్రుఘ్నుడు, భరతుడి మాట విని, తన మనస్సు మార్చుకొని మంథరని విడిచిపెట్టాడు. 

మరునాడు ఉదయం వశిష్ఠుడు సామంత రాజులతో, పురోహితులతో, అందరితో గొప్ప సభ ఏర్పాటు చేశారు. తరువాత భరతుడు కూడా వచ్చాడు. అప్పుడు వశిష్ఠుడు " నాయనా! నీ తండ్రి అయిన దశరథ మహారాజుగారు ఈ రాజ్యాన్ని నువ్వు అనుభవించాలని నిర్ణయం చేసి వెళ్ళిపోయారు. ఆయన ఉన్నంతకాలం ధర్మబద్ధంగా పరిపాలన చేశారు. చంద్రుడిని వెన్నెల ఎలా విడిచిపెట్టదో, అలా పుత్రధర్మాన్ని విడిచిపెట్టకుండా రాముడు అడవికి వెళ్ళాడు. అందుకని నువ్వు కూడా నీ ధర్మాన్ని పాటించాలి. కావున నువ్వు పట్టాభిషేకం చేసుకోవడం ధర్మం. అందుకని జలకలశములు తెప్పించాను, భద్రపీఠం ఏర్పాటు చెయ్యబడింది, ఉత్తమాశ్వాలని, గజాలని తీసుకొచ్చాము, కావున నువ్వు కూర్చొని పట్టాభిషేకం చేయించుకో " అన్నాడు.

అప్పుడు భరతుడు శత్రుఘ్నుడి వంక చూసి "నాకు ఈ రాజ్యము అక్కరలేదు, నేను దీన్ని ఎప్పుడూ కోరుకోలేదు " అని, ఆ నిండు సభలో అందరి ముందు చంటి పిల్లాడు వెక్కి వెక్కి ఏడ్చినట్టు ఏడ్చాడు. 

తరువాత భరతుడు వశిష్ఠుడితో " నువ్వు ఇది చెయ్యవలసిన పనేనా వశిష్ఠ. నేను వేదం చదువుకున్నాను, నేను దశరథ మహారాజుకి పుట్టానయ్య, నాకు ధర్మం తెలుసు, వేరొకడి రాజ్యాన్ని అపహరించే దొంగగా చూస్తున్నావా నన్ను ఇవ్వాళ, ఈ రాజ్యం రాముడిది, నువ్వు ఎవరు ఇవ్వడానికి, నేను ఎవరు పుచ్చుకోవడానికి. ఈ రాజ్యమునకు, నాకు, అందరికి ఆయనొక్కడే రాజు" అని భరతుడు అనేసరికి వశిష్ఠుడు మనస్సులో పొంగిపోయాడు. 

ఈ మాట విన్నవాళ్ళందరూ సంతోషపడిపోయి "  సంతోషం భరతా, ఇక్ష్వాకు వంశంలో ఎటువంటి పిల్లలు పుట్టాలో అటువంటి పిల్లలు పుట్టారు. ఒకడిని మించిన శీలం మరొకడిది. ఇలాంటి పిల్లల్ని చూసిన మేము అదృష్టవంతులం " అన్నారు.


అప్పుడు భరతుడు " నేను నిన్ననే ఆదేశించాను, కొంతమంది పరివారం అప్పుడే బయలుదేరి రాముడున్న అరణ్యానికి మార్గం చేస్తున్నారు. మనందరం బయలుదేరి, రాముడి దర్శనం చేసుకోని, ఆయనని వెనక్కి తీసుకువద్దాము " అన్నాడు.



అందరూ రాముడిని చేరుకోవడం కోసమని అయోధ్య నుంచి బయలుదేరారు. కాని, అందరి కంటే ముందు కైకేయ బయలుదేరింది. తాను ఎవరికోసమైతే ఈ పని చేసిందో, ఆ భరతుడే తనని కాదన్నప్పుడు ఆమెను ఆవహించిన మొహం పోయింది. తన తప్పుని తెలుసుకుంది. అలా కొన్ని లక్షల సైన్యంతో బయలుదేరి వాళ్ళు గంగా నదిని చేరుకున్నారు. అప్పుడు ఆ నిషాద రాజైన గుహుడు వాళ్ళని చేసేసరికి, ఒక పెద్ద సముద్రము వచ్చినట్టు, కోవిదార వృక్షము చిహ్నముగా ఉన్నటువంటి  సైన్యం వచ్చి నిలబడింది.


అప్పుడు గుహుడు తన బంధువులని, సైన్యాన్ని, యువకులని పిలిచి " భరతుడు ఇంత సైన్యంతో వచ్చాడంటే, కచ్చితంగా మనందరినీ చంపడం కోసమైనా వచ్చి ఉండాలి, లేదా 14 సంవత్సరాల తరువాత రాముడు తిరిగి వస్తే ఆయన పరాక్రమము ముందు నిలబడలేనని, ఇదే అదునుగా ఒక్కడె ఉన్న రాముడిని, లక్ష్మణుడిని సంహరించడం కోసమైనా వచ్చి ఉండాలి. రాముడు నాకు పరమ మిత్రుడు, ఆయనని మనం రక్షించుకోవాలి. ఇంత పెద్ద సైన్యాన్ని మనం ఎదిరించలేము, కాకపోతే మన సహాయం లేకుండా వీళ్ళు ఎవరు గంగని దాటలేరు. అందుకని 500 పడవలని ఈ సైన్యం అంతా వెళ్ళడానికి సిద్ధం చెయ్యండి. మీరందరూ కూడా ఒక్కొక్క పడవలో 100 మంది చొప్పున కవచాలు కట్టుకొని, ఆయుధాలు పట్టుకొని నిలబడండి. నేను ఏమి ఎరుగని వాడిలా భరతుడి దెగ్గరికి వెళ్ళి, నువ్వు రాముడిని కలుసుకోడానికి వెళుతున్నావ, రాముడిని సంహరించడానికి వెళుతున్నావ అని అడుగుతాను. ఒకవేళ రాముడిని సంహరించడానికే భరతుడు వచ్చి ఉంటె, పడవలలో గంగని దాటిస్తామని చెప్పి, పడవ ఎక్కించి, గంగ మధ్యలో ముంచేద్దాము. ఒకవేళ రాముడిని కలుసుకోవడానికే భరతుడు వచ్చి ఉంటె, రాముడు ఎక్కడున్నాడో చెప్పి, వాళ్ళతో నేను కూడా వెళతాను " అన్నాడు. 

అప్పుడాయన కొంత మాంసము, పుష్పములు, ధాన్యములు, కందమూలములు, తేనె పట్టుకొని భరతుడు విడిది చేసిన గృహం దెగ్గరికి వెళ్ళాడు. గుహుడు రావడాన్ని చూసిన సుమంత్రుడు లోపలికి వెళ్ళి భరతుడితో " భరతా! నువ్వు రాముడు ఎక్కడున్నాడో అని వెతుకుతున్నావు కదా, రాముడు ఎక్కడున్నాడో గుహుడికి తెలుస్తుంది. రాముడికి గుహుడి మీద అపారమైన ప్రేమ, అలాగే గుహుడికి రాముడి మీద అపారమైన భక్తి " అని చెప్పగానే భరతుడు గుహుడిని లోపలికి ప్రవేశపెట్టమన్నాడు. 

యదా తుష్టః తు భరతః రామస్య ఇహ భవిష్యతి |
సా ఇయం స్వస్తిమయీ సేనా గంగాం అద్య తరిష్యతి || 

లోపలికి వెళ్ళిన గుహుడు తాను తీసుకువచ్చిన వాటిని అక్కడ పెట్టి "నువ్వు ఈ రాజ్యాన్ని దశరథ మహారాజుగారి వల్ల పొందావు, ఇంకా నీ తృప్తి తీరక రాముడిని చంపుదామని వచ్చావ, లేకపోతే రాముడిని కలుసుకుందామని వచ్చావ, నాకు మనస్సులో శంకగా ఉంది. నిజం చెప్పు భరతా, ఎందుకు వచ్చావు ఇక్కడికి " అని అడిగాడు.

అప్పుడు భరతుడు " నువ్వు అన్నమాట వలన నాకు బాధ కలిగినా, నీ అమాయకత్వం నాకు తెలుస్తోంది. నేను ఈ గంగ దాటి భారద్వాజ ఆశ్రమానికి వెళ్ళి, ఆ ఆశ్రమం దెగ్గరలో ఉన్న రాముడిని కలుసుకోవాలని అనుకుంటున్నాను " అన్నాడు.

" సరే నువ్వు రాముడిని కలుసుకోవాలని వచ్చావు, మరి నీ వెనకాల ఇంత సైన్యం ఎందుకు వచ్చింది " అని గుహుడు భరతుడిని ప్రశ్నించాడు.

అప్పుడు భరతుడు ఆకాశమంత నిర్మలమైన మనసుతో " ఒక తమ్ముడు ఒక అన్నగారిని రాజ్యం కోసం చంపేటటువంటి దురాలోచన ఎన్నడూ రాకుండు  గాక, ఒక తమ్ముడు అన్నగారి గురించి ఎప్పుడన్నా ఆలోచిస్తే, అన్నగారి కాళ్ళుపట్టి నమస్కరించడానికి మాత్రమే ఆలోచించేటటువంటి సౌజన్యము నిలబడుగాక " అన్నాడు.


ఈ మాటలు విన్న గుహుడు " ఇక్ష్వాకు వంశంలో పుట్టిన నీకే చెల్లిందయ్యా ఈ మాట చెప్పడం. నాకు చాలా సంతోషంగా ఉంది. మీ ఇద్దరూ కలిస్తే, చూసి మురిసిపోవాలని ఉంది, దెగ్గరుండి గంగని దాటించి నేను మీతో వస్తాను. రాముడు ఇక్కడే పడుకొని వెళ్ళాడు, నన్ను తన తల మీద మర్రి పాలు పోయమన్నాడు, జటలు ధరించి, నార చీరలు కట్టుకొని వెళ్ళాడయ్యా  రాముడు " అని అన్నాడు.

ఆ రాత్రి భరతుడు రాముడి గురించి ఆలోచిస్తూ, తన వల్ల రాముడు ఇన్ని కష్టాలు పడుతున్నాడని బాధపడుతూ ఉండడం వలన నిద్రపట్టక గుహుడిని పిలిచి, నాకు రాముడి గురించి ఏదైనా చెప్పు అని అడిగాడు. అప్పుడా గుహుడు " రాముడు ఇక్కడికి వచ్చి ఇంగుది వృక్షం కింద కూర్చున్నాడు. అప్పుడు నేను ఆయనకి అన్నము, కందమూలాలు, తేనె మొదలైనవి తీసుకువెళ్ళాను, అప్పుడు రాముడు ' నేను క్షత్రియుడిని, ఒకరికి మేము ఇవ్వాలి, ఇతరుల దెగ్గర మేము తీసుకోకూడదు, మా తండ్రిగారికి ఇష్టమైన ఆ గుర్రాలకి కొంచెం దాణ పెట్టు. ఆ గంగ నుంచి కొన్ని నీళ్ళు తీసుకురా, అవి తాగి పడుకుంటానయ్యా ' అన్నాడు. అప్పుడు నేను గంగ నుంచి కొన్ని నీళ్ళు తీసుకువచ్చి వాళ్ళకి ఇచ్చాను. సీతారాములు తాగగా మిగిలిన నీళ్ళని లక్ష్మణుడు కళ్ళకి అద్దుకొని తాగాడు. అప్పుడు నేను రాముడిని లోపల హంసతూలికా తల్పం మీద పడుకోమనగా, ఆయన, నేను ఇప్పుడు ఒక తాపసిలాగ బతకాలి అని చెప్పి, లక్ష్మణుడు తీసుకొచ్చిన దర్భగడ్డి  మీద పడుకున్నాడు. రాముడు పడుకోయేముందు, లక్ష్మణుడు సీతారాముల పాదములు కడిగి, తడిగుడ్డతో తుడిచాడు. అప్పుడు సీతమ్మ రాముడి భుజాన్ని తలగడగా చేసుకొని పడుకుంది. నేను కాపలా కాస్తాను నువ్వు పడుకో లక్ష్మణా అంటె, ఆయన నన్ను, ఎలా పడుకోమంటావు గుహా ఇంత దారుణమైన దృశ్యం చూశాక, అని నీ తమ్ముడు లక్ష్మణుడు ఏడిచాడయ్యా. ఇదుగో ఈ గడ్డి మీదే సీతారాములు పడుకున్నారు " అని గుహుడు సీతారాములు పడుకున్న గడ్డిని భరతుడికి చూపించాడు. 



అప్పుడు భరతుడు, సీతారాములు పడుకున్న ఆ గడ్డి దెగ్గరికి వెళ్ళి చూడగా, ఒకవైపు గట్టిగా ఒత్తుకొని, గడ్డి భూమిలోకి నొక్కుకొని ఉంది. ఇది రాముడు పడుకున్న చోటని భరతుడు గ్రహించాడు. 


మన్యే సాభరణా సుప్తా సీతా అస్మిన్ శయనే తదా |
తత్ర తత్ర హి దృశ్యంతే సక్తాః కనక బిందవః ||



అలాగే, సీతమ్మ పడుకున్న వైపు బంగారు రవ్వలు పడిఉన్నాయి. సీతమ్మ కట్టుకున్న పట్టుచీర కొంగు యొక్క దారములు ఆ గడ్డికి చుట్టుకొని ఉన్నాయి. ఎక్కడో రాజభవానాల్లో పడుకోవలసిన సీతారాములు, ఇంతమంది ఆటవికులు చూస్తుండగా గడ్డి మీద పడుకోవలసి వచ్చిందని, దీనికంతటికి తనే కారణమని భరతుడు నేలమీద పడి మూర్చపోయాడు.

తరువాత భరతుడు " ఈ క్షణం నుంచి 14 సంవత్సరాల పాటు నేను కూడా పట్టుబట్ట కట్టను. నార చీరలే కట్టుకుంటాను, జటలు ధరిస్తాను. నేను కూడా కందమూలములు, తేనె తింటాను " అని ప్రతిజ్ఞ చేశాడు. వెంటనే నార చీరలు ధరించి, భరతుడు ఆ రాత్రికి రాముడు పడుకున్న చోటనే పక్కన భూమి మీద పడుకున్నాడు.

No comments:

Post a Comment