నాకు ఆ సీతని చూడగానే, ఈమె మా అన్నయ్యకి భార్య అయితే ఎంత బాగుంటుందో అనిపించింది. అందుకని నేను సీతని తేవడానికి ప్రయత్నిస్తే, ఆ లక్ష్మణుడు నా ముక్కు ,చెవులు కోసేశాడు అన్నయ్యా. నువ్వు కాని సీతని చూస్తే, మన్మధ బాణాలకి వసుడవయిపోతావు. నిజంగా నీకు సీతని భార్యని చేసుకోవాలని ఉంటె, ఇంక ఆలోచించకుండ వెంటనే బయలుదేరు. నువ్వు సీతని నీదిగా అనుభవించు, అడ్డొచ్చిన రాముడిని సంహరించు " అనింది.
అప్పుడాయన ఆ ఆశ్రమంలోకి వెళ్ళి చూడగా, అందులో నారచీర కట్టుకొని, జటలు వేసుకొని, నియమముతో ఆహారాన్ని తింటున్నటువంటివాడై, ఒకప్పుడు రాక్షసుడైనటువంటి మారీచుడు కనబడ్డాడు. అప్పుడా రావణాసురుడు " ఓ మారీచా! నేను ఇప్పుడు చాలా కష్టంలో ఉన్నాను. నీవంటి మహాత్ముడు కాకపోతే నాకు ఎవరు ఉపకారం చేస్తారు. నువ్వు నాకు తప్పకుండా ఉపకారం చెయ్యాలి. నీకు తెలుసు కదా, జనస్థానంలో 14,000 రాక్షసులను నియమించి మునుల యొక్క ధర్మాల్ని, యజ్ఞాలని నాశనం చెయ్యమని చెప్పాను. నేను చెప్పిన పనులని వాళ్ళు ఎంతో శ్రద్ధా భక్తులతో ఆచరిస్తుండగా ఎక్కడినుంచో రాముడు వచ్చి ఖరుడిని, దూషనుడిని, త్రిశిరస్కుడిని, మహాకపాలుడిని మరియు 14,000 రాక్షసులను ఒక్కడే చంపేశాడు. నా మనస్సుకి ఎంత బాధగా ఉందో తెలుసా. రాముడు కర్కశుడు, తీక్ష్ణ స్వభావం ఉన్నవాడు, మూర్ఖుడు, లుబ్ధుడు, ఇంద్రియాలని జయించనివాడు, ధర్మాన్ని విడిచిపెట్టినవాడు, అన్ని ప్రాణులను భయపెట్టేవాడు, దశరథుడికి అసహ్యం వేసి రాముడిని అరణ్యాలకి వెళ్ళగొట్టాడు, అందుకని నేను రాముడిని బాధపెట్టాలని అనుకుంటున్నాను. ఏ పాపం ఎరుగని పిచ్చి తల్లి నా చెల్లి శూర్పణఖ ముక్కు చెవులు కోసేశాడు. నన్ను ఇంత బాధపెట్టిన రాముడిని బాధపెట్టడానికి ఆయన భార్య అయిన సీతని అపహరించి తీసుకొద్దామని అనుకుంటున్నాను. రాముడితో యుద్ధం చేసి సీతని తీసుకురావడమనేది చాలా కష్టంతో కూడుకున్న పని, అందుకని ఏ యుద్ధమూ చెయ్యకుండా పని జెరిగిపోయే ఉపాయం ఒకటి నేను ఆలోచించాను. ఇప్పుడది నీకు చెబుతాను విను. నీకు సమస్త మాయలు తెలుసు కనుక, నువ్వు బంగారు లేడిగా మారిపో. నీ ఒంటిమీద వెండి చుక్కలు ఉండాలి, ఇంతకుముందు ఎవ్వరూ చూడని కొమ్ములు ఉండాలి. నువ్వు సీత కంటపడేటట్టుగా ఆశ్రమంలో పరిగెత్తు, అటూ ఇటూ ఆడు. అప్పుడు సీత నిన్ను చూసి, ఆ మృగం కావాలి అని అడుగుతుంది. సీత కోరిక తీర్చడం కోసం రాముడు నీ వెనకాల వస్తాడు, అప్పుడు నువ్వు అదృశ్యమవుతూ కనబడుతూ రాముడిని చాలా దూరం తీసుకుపో, అలా కొంత దూరం వెళ్ళాక హా! సీత, హా! లక్ష్మణా అని రాముడి కంఠంతో అరువు. రాముడికి కష్టం వచ్చిందనుకొని సీత లక్ష్మణుడిని పంపిస్తుంది. అప్పుడు నేను వెళ్ళి సీతని, రాహువు చంద్రుడిని ఎత్తుకొచ్చినట్టు ఎత్తుకొస్తాను. అందుకని నువ్వు బంగారు జింకగా మారిపో " అన్నాడు.
ఈ మాటలు విన్న మహాత్ముడైన మారీచుడు, దేవతలు కనురెప్ప వెయ్యకుండా ఎలా నిలుచుంటారో అలా నిలుచుండిపోయాడు. శవం నిలబడితే ఎలా ఉంటుందో అలా నిలబడ్డాడు. తరువాత ఆయన అన్నాడు.....
సులభాః పురుషా రాజన్ సతతం ప్రియ వాదినః |
అప్రియస్య చ పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః ||
" రావణా! మన మనస్సుకి ఇష్టమయ్యేటట్టు మాట్లాడేవాళ్ళు చాలామంది దొరుకుతారు, కాని వాళ్ళు మనన్ని అభ్యున్నతి వైపుకి నడిపించేటట్టుగా మాట్లాడేవారు కాదు. కొంతమంది మాట్లాడితే అప్రియంగా మాట్లాడినట్టు ఉంటుంది, కాని ఆ మాటలలో అవతలివారి అభ్యున్నతిని గూర్చిన మాటలు ఉంటాయి. అలా మనకి మంచి చెప్పేవాడు దొరకడు, ఒకవేళ అలాంటివాడు దొరికినా వినేవాడు దొరకడు. నీకు ఎవరో గూఢచారులు చెబితే రాముడి గురించి విన్నావు. ఆ గూఢచారి పరమ దుర్మార్గుడు, నీ మీద కక్షకట్టి నీ ప్రాణములు తియ్యాలని చూస్తున్నాడు. అందుకని నీకు అన్నీ అసత్యములు చెప్పాడు. నువ్వు ఇప్పటిదాకా రాముడి గురించి చెప్పినవన్నీ అబద్ధాలు. రాముడు మహా ధర్మాత్ముడు, మహేంద్రుడికి, వరుణుడికి ఎటువంటి పరాక్రమము ఉంటుందో రాముడికి అలాంటి పరాక్రమము ఉంది. అందరూ వచ్చి రాజ్యం తీసుకో అని అడిగినా, తన తండ్రిని సత్యమునందు నిలబెట్టడం కొసమని రాముడు అరణ్యాలకి వచ్చాడు. నీ మాటలు వింటుంటే నాకు ఒక అనుమానము వస్తుంది, సీతమ్మ మానవ స్త్రీ కాదు, నిన్ను చంపడానికని, రాక్షస కులాన్ని నాశనం చెయ్యడానికని భూమిమీదకి వచ్చిన దేవతా స్త్రీ. నీకు పుట్టిన ఈ నీచమైన కోరిక వలన నువ్వు నశించిపోతావు, నీతోపాటుగా లంకా పట్టణం నశించిపోతుంది, రాక్షసులందరూ భూమిమీద పడి నశించిపోతారు. నీకు ఎవరో అబద్ధాలు చెప్పారు, ఆ మాటలు విని అన్నీ నీకు తెలుసనుకొని ఆ మాటలు ఇంకొకరికి చెబుతున్నావు. నువ్వు రాజువి, ఇంత చపలబుద్ధితో ఉండకూడదు.
రామో విగ్రహవాన్ ధర్మః సాధుః సత్య పరాక్రమః |
రాజా సర్వస్య లోకస్య దేవానాం ఇవ వాసవః ||
రాజా సర్వస్య లోకస్య దేవానాం ఇవ వాసవః ||
ప్రపంచంలో ఉన్న ధర్మాన్ని తీసుకొచ్చి ఒకచోట పోసి, దానికి ప్రాణం పోస్తే, ఆయనే రాముడు. సత్యమే పరాక్రమముగా కలిగినవాడు. రాముడు ఈ లోకములన్నిటికి రాజు. అటువంటి రాముడి జోలికి వెళితే నువ్వు నాశనమయిపోతావు. నీకు తెలియక సీతమ్మని తీసుకొస్తాను అంటున్నావు, ఆమె బూది కప్పిన నిప్పు, తన తేజస్సుతో తనని రక్షించుకోగలదు. ఆమె కారణజన్మురాలు. రాముడి యొక్క కోదండం నీడలో రక్షింపబడుతున్న సీతమ్మని అపహరించి తేవడం నీ తరం కాదు రావణ! ఆవిడని అపహరించడానికి నీ శక్తి సరిపోదు.
జీవితం చ సుఖం చైవ రాజ్యం చైవ సుదుర్లభం |
యత్ ఇచ్ఛసి చిరం భోక్తుం మా కృథా రామ విప్రియం ||
యత్ ఇచ్ఛసి చిరం భోక్తుం మా కృథా రామ విప్రియం ||
నీకు రాజ్యం ఉంది, నిన్ను కామించన భార్యలు కొన్ని వేల మంది ఉన్నారు. వాళ్ళతో నువ్వు హాయిగా జీవితాన్ని గడపాలి అనుకుంటే, రాముడి పట్ల అప్రియాన్ని మాత్రం చెయ్యకు. నీకు ఒక విషయం చెబుతాను గుర్తుపెట్టుకో, నేను కూడా ఒకప్పుడు నీలాగే విర్రవీగాను. ఆ రోజుల్లో నేను నల్లటి శరీరంతో ఉండి, బంగారు కుండలాలు పెట్టుకొని, వర గర్వంతో మదించి ఉండేవాడిని. ఆ సమయంలో విశ్వామిత్రుడంతటివాడు యాగం చేస్తుంటే, నేను ఆ యాగాన్ని ధ్వంసం చేశాను. అప్పుడు విశ్వామిత్రుడు అయోధ్య నుంచి రాముడిని, లక్ష్మణుడిని తీసుకొచ్చాడు. అప్పుడు వాళ్ళిద్దరూ యాగం చుట్టూ తిరుగుతూ ఆ యాగాన్ని రక్షిస్తున్నారు. యాగం చివరికి వచ్చాక ఆ యాగాన్ని ధ్వంసం చెయ్యాలనుకొని నేను ఆకాశ మార్గంలో వచ్చి చూశాను. ఇప్పుడు నీకెంత పొగరుందో, అప్పుడు నాకంత పొగరుండేది.
No comments:
Post a Comment