Pages

Sunday, 1 April 2012

రామాయణం @ కధ -24



సుమంత్రుడు అయోధ్యకి తిరిగివచ్చి, రాముడు సీతాలక్ష్మణ సహితుడై గంగని దాటి అరణ్యాలకి వెళ్లిపోయాడని చెప్పాడు. అప్పుడు దశరథుడు, రాముడు ఎలా ఉన్నాడని అడుగగా సుమంత్రుడు ఇలా చెప్పాడు " రాముడు మీకు నమస్కారములు చెప్పమన్నాడు, కౌసల్యని జాగ్రత్తగా చూసుకోమన్నాడు. కౌసల్య, సుమిత్ర, కైకేయల యందు తనకెటువంటి బేధభావం లేదన్నాడు. భరతుడిని కుశలమడిగాడు " అని చెప్పాడు. ఈ మాటలు విన్న దశరథుడు లక్ష్మణుడు ఏమన్నాడు అని అడిగాడు. అప్పుడా సుమంత్రుడు......


" లక్ష్మణుడు పడవెక్కుతూ, మా తండ్రి కామమునకు లొంగిపోయి, సకల సుగుణాభి రాముడిని రాజ్యం నుంచి బయటకి పంపించాడు. అందుకని ఆయనని తండ్రిగా నేను అంగీకరించడం లేదు. ఇక నుంచి దశరథుడు నాకు తండ్రి కాదు. నాకు తండ్రి కాని, తల్లి కాని, గురువు కాని, దైవం కాని, అన్న కాని, తమ్ముడు కాని, ఎవరైనా నాకు రాముడే. ఈ మాట నేను చెప్పానని దశరథుడికి చెప్పు " అన్నాడు. మరి సీతమ్మ ఎమనిందని దశరథుడు అడుగగా " సీతమ్మ పడవెక్కుతూ నా వంక చూసి నమస్కారం చేసి వెళ్ళిపోయింది " అన్నాడు. 


అప్పటికే దశరథుడు చాలా పరివేదన చెందుతున్నాడని సుమంత్రుడు గ్రహించాడు. రాజుని ఓదారుద్దామని సుమంత్రుడు ఇలా అన్నాడు. " ఏమిలేదయ్య, వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. రాముడితో పాటు సీతమ్మ సంతోషంగా నడుస్తూ, ఆ వనాలని, ఉపవనాలని అన్నిటినీ చూస్తోంది. సీతమ్మ అరణ్యంలో నడిచివెళుతుంటే, హంసలు కూడా ఆవిడలాగానే నడుద్దామని ప్రయత్నిస్తున్నాయి (ఎందుకంటే, అప్పటిదాకా తమ నడకలని చూసి అందరూ హంసనడక అంటుంటే అవి ఆనందపడేవి, కాని సీతమ్మ అరణ్యానికి వచ్చాక ఆ హంసలన్నీ నడకలు మానేసి ఒక మూల కూర్చున్నాయంట. మీరు ఎందుకు నడవడం లేదు అని ఎవరన్నా అడిగితే, అవి మాకన్నా అందంగా నడిచే ఆవిడ కొత్తగా అరణ్యానికి వచ్చింది, ఆమె నడక ముందు మా నడక ఏపాటిది అని నడవడం మానేసి ఒక మూలను కూర్చున్నాయంట). అలా నడిచిందయ్యా సీతమ్మ " అని సుమంత్రుడు అన్నాడు.


అప్పుడు కౌసల్య " ఒక స్త్రీ భర్త చేత, కొడుకు చేత, జ్ఞాతుల(బంధువులు) చేత రక్షింపబడాలి. భర్తవై కూడా నువ్వు నాకు రక్షణ ఇవ్వలేదు. నాకు ఉన్న ఒకే ఒక్క కొడుకుని నా దెగ్గర లేకుండా చేసేశావు. నాకు జ్ఞాతి అన్నవాడెవరూ దెగ్గరలో లేరు. నువ్వు చేసిన ఈ దారుణమైన పని వలన నేను నా కొడుకుకి దూరమయ్యాను. కాబట్టి నేను దిక్కులేని చావైనా చస్తాను, లేకపోతే రాముడి దెగ్గరికన్నా వెళతాను. ఇక నేను నీ ముఖం చూడను. నీ దెగ్గర ఉండను " అని అనింది.


కౌసల్య మాటలు విన్న దశరథుడు కృంగిపోయి ఇలా అన్నాడు " నేను దౌర్భాగ్యుడనే కౌసల్యా, నేను ఎందుకూ పనికిరాని వాడిని, దీనుడిని, నేను ధర్మాత్ముడిని అని కాని, మిమ్మల్ని సరిగ్గా ఒక్కనాడైనా చూశానని కాని నేను అనను. నా కంటికి నిద్ర రావడం లేదు, నోటికి తిండి సహించడం లేదు, నన్ను ఓదార్చే వాళ్ళు లేరు, నేను ఎంత బెంగ పెట్టుకున్నానో నీకేమి తెలుసు. ఓదారుస్తావని కదా నీ దెగ్గరికి వచ్చాను, పరమ సాత్వికమైన ప్రవర్తన కలిగిన నువ్వు కూడా నన్ను ఇలా పోడిచేస్తే, నేను కూడా ఈ క్షణంలోనే ప్రాణాలు విడిచిపెట్టేస్తాను కౌసల్య. నువ్వైనా కనీసం ఇలా మాట్లాడడం మానవా, నీ కాళ్ళు పట్టుకుంటాను " అని రెండు చేతులతో నమస్కారం చేశాడు.  


న ఏషా హి సా స్త్రీ భవతి శ్లాఘనీయేన ధీమతా |
ఉభయోః లోకయోః వీర పత్యా యా సంప్రసాద్యతే ||



కౌసల్య పరుగు పరుగున వచ్చి ఆయన పాదాల వద్ద కూర్చుని, ఆయన రెండు చేతులు తన తల మీద పెట్టుకుని " మహా ధర్మాత్ముడైన భర్త, భార్య దెగ్గర ఇలా రెండు చేతులు పెట్టి, నిన్ను బతిమాలుతున్నాను అన్నాడంటే, ఆ స్త్రీ జీవితంలో అటువంటి దుర్దినం ఇంక వేరొకటి ఉండదు. కొడుకు వెళ్ళిపోయాడన్న ఆక్రోశంలో ఇలా మాట్లాడాను. నన్ను క్షమించు " అని ఆయన కాళ్ళ మీద పడిపోయింది.




తరువాత కౌసల్య దేవి దశరథుడిని తీసుకెళ్ళి మంచం మీద పడుకోబెట్టింది. అప్పుడాయన కౌసల్య, కౌసల్య అని కలవరించగా కౌసల్య, సుమిత్ర ఇద్దరూ వచ్చి ఆయన పక్కన కూర్చున్నాక దశరథుడు " నేను ఎందుకింత బాధ పడుతున్నానో నాకు ఇప్పుడు అర్థమయ్యింది. పాలు తాగుతున్న పిల్లలకి, తల్లుల యొక్క స్తన్యములు కత్తి పెట్టి నరికేసుంటాను, అందుకని నేను ఇంత బాధ పడుతున్నాను అన్నావు కదా, నీది కాదు దోషం. నాకు ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది, నీకు ఒక విషయం చెప్తాను జాగ్రత్తగా విను. నేను యవ్వనంలో ఉన్నప్పుడు ఒకసారి వేటాడాలని అనిపించింది. అప్పుడు బాగా వర్షం పడి భూమి అంతా తడిగా ఉంది. ఇప్పుడు క్రూరమృగాలు తప్పకుండా నీళ్ళు తాగడానికి బయటకి వస్తాయని, ఆ రోజూ రాత్రంతా ధనుస్సుకి బాణాన్ని సంధించి కూర్చున్నాను. తెల్లవారే వరకు ఏ మృగము వచ్చినట్టు నాకు కనపడలేదు. తెల్లవారుతుండగా నాకు గుడగుడ శబ్దం వినిపించింది, కాని అప్పటికి ఇంకా చీకటిగానే ఉంది, ఏనుగు తొండంపెట్టి నీళ్ళు తాగుతుందని గ్రహించాను. నాకు  శబ్దవేధీ విద్య తెలుసు. అందుకని శబ్దాన్ని బట్టి ఏనుగు యొక్క కుంభస్థలం మీద బాణ ప్రయోగం చెయ్యాలనుకొని చీకట్లో బాణ ప్రయోగం చేశాను. ఏనుగు యొక్క ఘీంకారం వినిపిస్తుందని అనుకున్నాను, కాని నాకు ఒక మనిషి ఆర్తనాదాలు వినపడ్డాయి. నేను భయపడి అక్కడికి వెళ్ళి చూసేసరికి, నేను విడిచిపెట్టిన బాణం గుండెల్లో గుచ్చుకొని ఒక ముని కుమారుడు ఆ నది ఒడ్డున పడి తన్నుకుంటున్నాడు. నేను భయపడుతూ అతని దెగ్గరికి వెళ్ళగా, అతను నేను ముని కుమారుడిని, తపస్సు చేసుకుంటున్నాను, తల్లిదండ్రులని పోషించుకుంటున్నాను. ఇటువంటి నన్ను నిష్కారణంగా బాణం పెట్టి ఎందుకు కొట్టావు అని అడిగాడు. అప్పుడు నేను, నిన్ను కొట్టాలని కొట్టలేదు, నీరు తాగుతున్న శబ్దానికి ఏనుగనుకుని బాణం విడిచిపెట్టాను. నా దురదృష్టం ఆ బాణం నీకు తగిలిందని భయపడుతూ నిలబడ్డాను. 


అప్పుడా ముని కుమారుడు నన్ను చూసి, నువ్వు భయపడమాకు, నా పేరు శ్రవణకుమారుడు అని పరిచయం  చేసుకొని నీకు బ్రహ్మహత్యా దోషం లేదు, ఎందుకంటే నా తండ్రి వైశ్యుడు, నా తల్లి శూద్ర స్త్రీ, కాబట్టి శపించే అధికారం నాకు లేదు. కాని నా తల్లిదండ్రులిద్దరూ అంధులు ,వృద్దులు కావున వారు నడవలేరు కాబట్టి నేను వారిని  కావడిలో మోస్తూ సంచరిస్తూ ఉంటాను. రోజూ నేను గ్రంధ పఠనం చేస్తే, వారు వింటూ  కాలం గడుపుతారు. వారు అరణ్యంలో కూర్చుని ఉన్నారు. నేనే వారికి ఆహారం, నీరు తీసుకెళుతుంటాను. ఇప్పుడు వాళ్ళు మహా దాహంతో ఉన్నారు, అందుకనే నేను ఇక్కడికి వచ్చాను. నువ్వు ఈ నీళ్ళు పట్టుకెళ్ళి నా తల్లిదండ్రులకు ఇవ్వు. ఈ బాణపు ములుకు నాలో ఉన్నందున నేను ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను, కనుక నువ్వు ఈ బాణం తీసెయ్యి అన్నాడు. 


తీసేస్తే అతను చనిపోతాడు, తీయకపోతే అతను ఆ బాధ తట్టుకోలేక పోతున్నాడు, అందుకని అతను బాధ పడడం ఇష్టం లేక బాణం తీసేసాను. ఆ పిల్లవాడు వెంటనే మరణించాడు. అప్పుడు నేను ఆ నీటి కుండ పట్టుకొని అతని తల్లిదండ్రుల దెగ్గరికి వెళ్ళాను. నా అడుగుల శబ్దం విన్న ఆ అంధులైన తల్లిదండ్రులు, నాయనా ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు, మీ అమ్మ నీ కోసం బెంగ పెట్టుకుంది, అని ఆ ముని కుమారుడి తండ్రి అడిగితే నేను వారికి  ముందుగా నీళ్లు అందించి ఉన్నది ఉన్నట్టు చెప్పాను. నా వల్ల పొరపాటు జెరిగింది, మీ కుమారుడిని నేనే సంహరించాను అని చెప్పాను. అప్పుడాయన నన్ను తన కుమారుడి కళేబరాన్ని చూపించమన్నాడు. నేను వాళ్ళని అక్కడికి తీసుకువెళ్లగా వాళ్ళు తమ కుమారుడి శవం మీద పడి రోదించారు. తరవాత ఆ తండ్రి నావంక తిరిగి, నేను ఎలాగైతే ఇప్పుడు నా కుమారుడి మీద పడి 'హా! కుమారా, హా! కుమారా' అని పుత్రశోకంతో ప్రాణాలు విడిచిపెడుతున్నానో, నువ్వు కూడా అలాగే ఏడుస్తూ 'హా! కుమారా' అంటూ ప్రాణాలు విడిచిపెడతావు అని నన్ను శపించాడు. 

ఈలోగ స్వర్గలోకం నుండి ఇంద్రుడు వచ్చి, నువ్వు తల్లిదండ్రులకి చేసిన సేవకి నిన్ను స్వర్గానికి తీసుకు వెళతానని, ఆ ముని కుమారుడిని తన రథంలొ తీసుకెళ్ళాడు. ఆ పిల్లవాడిని విడిచి ఉండలేక ఆ వృద్ధ దంపతులు ఇద్దరూ ప్రాణాలు విడిచిపెట్టారు. అప్పుడు నాకు తెలియలేదు కౌసల్య, 'హా! కుమారా' అంటూ మరణించడం ఎంత కష్టమో అని. నేను చేసిన పాపం నన్ను వెంటాడింది. నా చెవులు కూడా వినపడడంలేదు. నా కళ్ళు కనబడడం లేదు. నాకు జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోతుంది. అంతా భ్రాంతిలాగ ఉంది. ఎవరో దూతలు వచ్చి నా ప్రాణాలని లాగేస్తున్నారు. రాముడిని చూసే అదృష్టం నాకు ఇంక లేదు. నేను ఏ తప్పు చెయ్యలేదు, నన్ను మన్నించు. కౌసల్యా, సుమిత్రా, రామా......రామా........." అని ఆ దశరథ మహారాజు ప్రాణాలు విడిచిపెట్టాడు.

1 comment:

  1. మీ బ్లాగుకు రావాడం ఇదే మొదటిసారి. చాలా టపాలు చదివాను.. ఇంకా చదవాల్సినవి చాలా ఉన్నాయి.

    రామాయణం చెప్పినంతకాలం, విన్నంతకాలం, చదివినంతకాలం ఈ ప్రపంచంలో ధార్మికత మనగాలుగుతుందని ప్రతీతి. అలాంటి రామాయణాన్ని అతి ఓపికగా చిత్రాలను సేకరించి, సరళమైన భాషలో, కళ్ళకు కట్టినట్టు బ్లాగులో రాస్తున్నందుకు ధన్యవాదాలు హరిత కుమార్ గారు.
    శ్రీరామచంద్రకృపాకటాక్షసిద్ధిరస్తు!

    ReplyDelete