Pages

Wednesday, 4 April 2012

రామాయణం @ కధ -26



ఈ మాటలు విన్న కైకేయ చాలా తేలికగా, 


యా గతిః సర్వ భూతానాం తాం గతిం తే పితా గతః |
రాజా మహాత్మా తేజస్వీ యాయజూకః సతాం గతిః ||



"చిట్టచివరికి అన్ని భూతములు ఎక్కడికి వెళ్ళిపోతాయో, మీ నాన్న కూడా అక్కడికి వెళ్ళిపోయాడు" అనింది. అప్పటిదాకా తల్లి ఒడిలో కూర్చున్న భరతుడు ఈ మాట వినగానే, ఒక మదించిన ఏనుగు నేల మీద పడినట్టు కింద పడిపోయి పొర్లి పొర్లి ఏడిచాడు.

అప్పుడా కైకేయ " ఓ రాజా! నువ్వు ఇలా నేల మీద పొర్లి ఏడవచ్చా, గొప్ప గొప్ప సభలలో కుర్చోవలసిన వాడిని ఇలా నేల మీద  పొర్లడమేమిటి, పైకి లేచి కూర్చో " అనింది.

అప్పుడు భరతుడు " అమ్మా! నాన్నగారు చిట్టచివర ఏ వ్యాధి కలిగి వెళ్ళిపోయారమ్మా, రాముడికి పట్టభిషేకమో లేక నాన్నగారు ఏదన్నా యజ్ఞం చేస్తున్నారేమో, అందుకని నన్ను తొందరగా రమ్మన్నారని వచ్చానమ్మ, నాన్నగారు వెళ్ళిపోయేటప్పుడు రాముడు పక్కనే ఉండుంటాడు. తండ్రిగారు వెళ్ళిపోతే అన్నగారు తమ్ముళ్ళకి తండ్రిలాంటి వాడని ఆర్యులు చెప్తారు కదా. అందుకని నేను ఇప్పుడు రాముడి పాదాలు పట్టుకుంటే దశరథ మహారాజుగారి పాదాలు పట్టుకున్నంత సంతోషం కలుగుతుందమ్మ. అసలు దశరథ మారాజు ఎలా చనిపోయారు, చిట్టచివర చనిపోయేముందు ఆయన ఏమన్నారో నాకు చెప్పమ్మా " అన్నాడు. 

" మీ నాన్న వెళ్ళిపోయేముందు, 'హా! రామ, హా! లక్ష్మణా, హా! సీతా' అంటూ చనిపోయాడురా, చనిపోతూ చనిపోతూ, ఈ సీతారామలక్ష్మణులు తిరిగి రాజ్యానికి వచ్చినప్పుడు వాళ్ళని చూసిన వాళ్ళు ధన్యులు, నేను వాళ్ళని చూడలేను కదా అని ఏడ్చి ఏడ్చి చనిపోయాడురా " అని కైకేయ చెప్పింది.

మరి ఆ సమయంలో సీతారామలక్ష్మణులు ఎక్కడున్నారు అని భరతుడు అడుగగా, వాళ్ళ ముగ్గురూ అరణ్యాలకి వెళ్ళిపోయారు అని కైకేయ చెప్పింది. అరణ్యాలకి ఎందుకు వెళ్ళారు అంటె, మీ నాన్న పంపించేసాడు అని చెప్పింది.


అప్పుడు భరతుడు " నాన్న ఎందుకు పంపించారమ్మ రాముడిని, రాముడు ధర్మాత్ముడు, అరణ్యాలకి పంపించాలంటే కొన్ని కారణాలు ఉంటాయి. బ్రాహ్మణుల ద్రవ్యాన్ని(సంపద) రామచంద్రమూర్తి అపహరించాడ, పరస్త్రీని దోష బుద్ధితో చూశాడ, పరకాంతని అనుభవించాడ, యజ్ఞయాగాది క్రతువులను ధ్వంసం చేశాడ, అప్పుడే పుట్టిన పిండాన్ని నశింప చేశాడ. ఇలాంటి పాపాలు చేసేవాడు రాముడు కాదె, రాముడిని అడవులకు ఎందుకు పంపించారు, రాముడితో లక్ష్మణుడు ఎందుకు వెళ్ళాడు, అసలు ఏమి జెరిగిందో నాకు యధాతధంగా చెప్పు" అన్నాడు.

 
అప్పుడా కైకేయ ఎంతో సంతోషపడిపోతూ " నీకోసమే నేను ఇదంతా చేశాను. దశరథుడు రాముడికి పట్టాభిషేకం చెద్దామనుకున్నాడు. నువ్వు చెప్పిన దోషాలు రాముడి యందు ఉంటాయ, పరకాంతని అనుభవించడం ఏమిటిరా, రాముడు పరకాంతని కన్నెత్తి చూడడు, అంతటి ధర్మాత్ముడు. కాని నీకు రాజ్యం దక్కాలని నేనే దశరథుడిని రెండు వరాలు అడిగాను. 14 సంవత్సరాలు రాముడిని దండకారణ్యానికి పంపించమన్నాను, నీకు పట్టాభిషేకం చెయ్యమన్నాను. సత్యపాశములకు బద్ధుడైన నీతండ్రి అంగీకరించాడు. అందువలన రాముడు దండకారణ్యానికి వెళ్ళిపోయాడన్న బెంగ చేత రెండు మూడు రోజులలోనే కృంగి కృశించి నశించిపోయాడురా. ఇప్పుడు ఈ రాజ్యంలో నిన్ను ఎదిరించగలిగే వాళ్ళు ఎవరూ లేరు. మీ నాన్నగారి శరీరం ఇంట్లోనే ఉండిపోయింది, దాన్ని తొందరగా తీసుకెళ్ళి ప్రేతకార్యం పూర్తి చేసేసి, చక్కగా వశిష్ఠుడితో మాట్లాడి నువ్వు పట్టాభిషేకం చేయించుకో, నాకు చూడాలని ఉంది " అనింది.

ఈ మాటలు విన్న భరతుడు కైకేయ వంక విచిత్రంగా చూసి " అమ్మా! నువ్వు ఇటువంటి దారుణమైన పని చేస్తావని నేను ఎన్నడూ ఊహించలేదు. నేను నీతో మాట్లాడేటప్పుడు ఏనాడైనా నాకు రాజ్యం పట్ల కోరిక ఉందని కాని, రాముడు నాకు కంటకంగా మారుతాడని కాని నీతో చెప్పాన. నిన్ను ఎవరు అడగమన్నారు రాజ్యాన్ని, నీకు మించిన భారాన్ని నెత్తి మీద వేసుకున్నావు, ఇక్ష్వాకు వంశంలో కాళరాత్రి ప్రవేశించినట్టు ప్రవేశించావు,  నువ్వు నాకు తల్లివి కావు, నేను నీకు కొడుకుని కాదు, నేను నిన్ను అమ్మగా విడిచిపెడుతున్నాను. ఇప్పుడే నా మొలకి ఉన్న కత్తి తీసి నీ కుత్తుక కత్తిరించాలి, కాని నిన్ను చంపేస్తే, తల్లిని చంపినవాడు భరతుడు అని రాముడు నాతో మాట్లాడడు. రాముడు మాట్లాడడన్న బెంగ చేత నిన్ను వదిలేస్తున్నాను. రాముడు కౌసల్యని ఎలా చూశాడో, నిన్ను అలానే చూశాడు. ఈ ఇక్ష్వాకు వంశంలో రాజ్యాన్ని ఎప్పుడూ పెద్దవాడు మాత్రమే అనుభవించాలి. నేను రాజ్యాన్ని అంగీకరిస్తానని ఎలా అనుకున్నావు. దశరథ మహారాజు కూడా రాముడి సహకారం తీసుకొని ఈ రాజ్యాన్ని పరిపాలించాడు. నువ్వు చేసిన ఈ పాపకృత్యానికి ఇవ్వాళ మూడు దుష్కరమైన విషయాలు జెరిగాయి, నా తండ్రి శరీరాన్ని విడిచిపెట్టాడు, ధర్మమూర్తి అయిన రాముడు 14సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు, ఏ పాపం ఎరుగని నా మీద, భరతుడికి రాజకాంక్ష ఉందన్న అపవాదు పడింది. నేను ఎంతమందికి చెప్పుకుంటే నా మీద పడ్డ అపవాదు పోతుంది, నువ్వు తల్లివి కాదు, నాకు అపవాదు తెచ్చిన దౌర్భాగ్యురాలివి.

అమ్మా! నీకు ఒక విషయం చెప్తాను, ఒకానొకనాడు ఆకాశంలో కామధేనువైన సురభి వెళ్ళిపోతుండగా, భూమండలం మీద ఒక రైతు విపరీతమైన ఎండలో, శోషించిపోతున్న రెండు ఎద్దులని నాగలికి కట్టి, డొక్కలతో పొడుస్తూ సేద్యం చేయిస్తుంటే సురభి కన్నులవెంట నీరు కార్చింది (ఈ భూమండలం మీద ఉన్న ఆవులు, ఎద్దులు ఆ సురభి యొక్క సంతానమే). దేవేంద్రుడు ఐరావతం మీద వెళుతుండగా, ఆయన చేతి మీద సురభి కన్నీటి చుక్కలు పడ్డాయి. దివ్యపరిమళం కలిగిన కన్నీటి బిందువులు ఎవరివా అని ఇంద్రుడు పైకి చూసేసరికి, సురభి ఏడుస్తూ కనిపించింది. వెంటనే ఇంద్రుడు ఐరావతం దిగి అమ్మా! ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు, అప్పుడా సురభి " నాకు కొన్ని కోట్ల మంది బిడ్డలు ఉండచ్చు, ఈ భూమండలంలో ఉన్న ఆవులు, ఎద్దులు నా శరీరం నుంచి వచ్చినవే. ఇంతమంది బిడ్డలు ఉన్నా, ఈ రెండు ఎద్దులని రైతు పొడుస్తూ, ఎండలో సేద్యం చేయిస్తుంటే, నా బిడ్డలని ఇంత కష్టపెడుతున్నాడని దుఖం ఆగక ఏడిచాను " అని, కోట్ల మంది బిడ్డలు కలిగిన సురభి అనింది. మరి ఒక్కగానొక్క కుమారుడు అమ్మా కౌసల్యకి, లేకలేక పుట్టినవాడు, ధర్మాత్ముడు, అటువంటి వాడిని 14 సంవత్సరాలు అరణ్యాలకి పంపావె, కొడుకు పక్కన లేడని, భర్త మరణించాడని కౌసల్య ఎంత ఏడుస్తుందో ఆలోచించావా. నువ్వు చెప్తే రాజ్యాన్ని ఎలుతాననుకున్నావా, ఒక్కనాటికి అది జెరగదు. ఇక నువ్వు బతికుండడం అనవసరం. వెంటనే అంతఃపురానికి వెళ్ళి ఉరివేసుకో, అదొక్కటే నీకు ప్రాయశ్చిత్తం " అని భరతుడు అన్నాడు. 


ఈ మాటలు విన్న కైకేయ మీద పిడుగు పడినట్టు అయ్యింది, భరతుడు వేసిన కేకలకి మంత్రులందరూ చుట్టూ చేరారు. ఈ కేకలు విన్న కౌసల్య, భరతుడు వచ్చాడని గ్రహించి, భరతుడిని చూద్దామని సుమిత్రతో కలిసి బయలుదేరింది. ఇక నేను ఈ కైకేయ మందిరంలో ఉండనని, భరతుడు కౌసల్య మందిరానికి బయలుదేరాడు. భరతుడి వెంట శత్రుఘ్నుడు వెళ్ళాడు. అటువేపు నుంచి కౌసల్య, సుమిత్రతో భరతుడికి ఎదురురాగా, భరతుడు కౌసల్య పాదాల మీద పడి ఎడిచాడు. అప్పుడు కౌసల్య భరతుడిని పైకి లేపి " రాజ్యం కావాలని కోరుకున్నావు కదా, మీ అమ్మ నీ కోరిక తీర్చింది. నువ్వు లేనప్పుడు రెండు వరాలు అడిగింది. నా కొడుకు అడవులని పట్టి వెళ్ళిపోయాడు. నీకు ఎటువంటి కంటకం లేదు. హాయిగా ఈ రాజ్యాన్ని ఏలుకో. నాకు ఒక్క ఉపకారం చెయ్యి. నా భర్త మరణించాడు, ఇక ఈ రాజ్యంలో నా అన్నవారు ఎవరూ లేరు, అందుకని నన్ను అరణ్యంలో ఉన్న నా కుమారుడి దెగ్గర దిగబెట్టు " అని అనింది.


భరతుడు కౌసల్య కాళ్ళు గట్టిగా పట్టుకొని " అమ్మా! నువ్వు కూడా నన్ను అలా అనుకున్నావ. నా గురించి నీకు తెలుసు కదా, నేను అటువంటి బుద్ధి ఉన్నవాడినా? నాకు నిజంగా రాముడు అరణ్యాలకి వెళ్ళి పోతున్నాడన్న విషయం తెలిసుంటే, నేను రాజ్యం కోరుకున్నవాడినైతే, ఇటువంటి మహా పాపములు చేసిన వాడినవుదునుగాక " అని కొన్ని పాపాలు చెప్పాడు భరతుడు. అవి ఏంటంటే " గురువుల చేత సమస్తమైన విద్యలు తెలుసుకొని కూడా, ఆ విద్యలు ఆచరించనటువంటి కృతజ్ఞుడనవుదునుగాక, నిద్రపోతున్న ఆవుని కాని, ఎద్దుని కాని తన్నినవాడికి, సేవకుల చేత చాలా కష్టమైన పని చేయించుకొని, ఆ పనికి తగిన వేతనము ఇవ్వని వాడికి, ఇంట్లో సౌందర్యవతియై తనని అనువర్తించే భార్య ఉండగా, ఆ భార్యతో క్రిడించకుండా పర భార్యలయందు దృష్టి కలిగిన వాడికి, రుతుస్నానం చేసిన భార్య ఇంట ఉండగా, అటువంటి భార్యతో సంగమించనటువంటి వాడికి, ఇంట్లో మిగతా కుటుంబ సభ్యులకి పెట్టకుండా మధుర పదార్ధాన్ని తానొక్కడే తిన్నవాడికి, అందరూ తాగే నీళ్ళల్లో విషం కలిపిన వాడికి, విషం, లోహం అమ్ముకున్నవాడికి, యుక్త వయస్సు వచ్చిన తరువాత కూడా వివాహం చేసుకోనటువంటివాడికి, ఋషుల, పితృదేవతల, దేవతల రుణాన్ని తీర్చుకోవడం కోసమని, వివాహం చేసుకొని సంతానం కననటువంటివాడికి, అన్నిటినీమించి ప్రజల దెగ్గర పన్ను తీసుకొని, తిరిగి ఆ ప్రజలకి కావలసిన సదుపాయాలని కల్పించనటువంటి రాజుకి, కొత్తగా ఈనినటువంటి పశువు యొక్క దూడ మళ్ళి పాలు తాగడానికి వస్తే, ఆ పొదుగులో పాలు ఉంచకుండా, ఆ పాలతో జున్ను వండుకొని తిన్నవాడికి, సూర్యుడికి, చంద్రుడికి ఎదురుగా నిలిచి మలమూత్రములు విసర్జన చేసినవాడికి, ఇళ్ళు తగలబెట్టినవాడికి ఎటువంటి పాపము వస్తుందో, నాకు అటువంటి పాపము వస్తుంది " అని అన్నాడు. 

No comments:

Post a Comment