Pages

Sunday, 11 March 2012

రామాయణం @ కధ -9


ఇన్ని సంవత్సరాలుగా ఈ ఆశ్రమాన్ని పోషించాను, ఇవ్వాళ నీ ఆవేశానికి ఈ ఆశ్రమాన్ని బూడిద చేశావు అని వశిష్ఠుడు తన బ్రహ్మదండం పట్టుకొని కింద కూర్చున్నారు. ఆయన ఆ బ్రహ్మదండాన్ని అలా పట్టుకుని ఉంటె అది ఎలా ఉందంటే, సమస్తలోకాలని శాసించగలిగే యమదండాన్ని పట్టుకున్న యముడిలా పట్టుకున్నారు. మండుతున్న నిప్పు మీద నీళ్ళు పడితే ఎలా చల్లారిపోతుందో, అలా ఆ ఆగ్నేయాస్త్రం చల్లారిపోయి ఆ బ్రహ్మదండంలోకి వెళ్ళిపోయింది. 

తను అంత తపస్సు చేసి ప్రయోగించిన అస్త్రాన్ని వశిష్ఠుడు కనీసం వేరొక అస్త్రాన్ని ప్రయోగించి ఆపలేదు, కేవలం తన బ్రహ్మదండాన్ని అడ్డుపెట్టి ఆపేసరికి విశ్వామిత్రుడికి కోపం బాగా పెరిగిపోయింది.అప్పుడాయన ఒకేసారి వారుణాస్త్రంఇంద్రాస్త్రంపాశుపతాస్త్రంఇషీకాస్త్రంమానవాస్త్రంగాంధర్వాస్త్రంబ్రహ్మపాశంకాలపాశంవారుణపాశంపినాకాస్త్రంక్రౌంచాస్త్రంధర్మచక్రంకాలచక్రంవిష్ణుచక్రంత్రిశూలంకాపాలం అనే కంకణం, రకరకాల పిడుగులుకంకాలంముసలం, పెద్ద పెద్ద గధలు మొదలైన రకరకాల అస్త్రాలని వశిష్ఠుడి మీద వేశాడు. 
కాని ఆయన వేసినవన్ని వశిష్ఠుడి బ్రహ్మదండంలోకి వెళ్ళిపోయాయి. 

ఇక తనదెగ్గర ఉన్న ఒకేఒక అస్త్రమైన బ్రహ్మాస్త్రాన్ని వెయ్యడానికని ఆ మంత్రాలని స్మరిస్తుండగా సముద్రాలు పొంగాయి, పర్వతాలు బద్దలయ్యాయి, ప్రపంచంలో ఉన్న అన్ని ప్రాణులు ఒక్కసారి మనస్సులో క్షోభ పొందాయి. అంతటి శక్తివంతమైన ఆ బ్రహ్మాస్త్రాన్ని విశ్వామిత్రుడు అభిమంత్రించి వదిలాడు. ఇప్పటిదాకా ఎంతోమంది గొప్పవాళ్ళని మట్టుపెట్టిన ఆ బ్రహ్మాస్త్రం నిశబ్ధంగా ఆయన బ్రహ్మదండంలోకి వెళ్ళిపోయింది. అప్పుడు విశ్వామిత్రుడు.........

ధిక్ బలం క్షత్రియ బలం బ్రహ్మ తేజో బలం బలం | 
ఏకేన బ్రహ్మ దణ్డేన సర్వ అస్త్రాణి హతాని మే ||

ఛి! ఆ బ్రహ్మర్షి బలం ముందు ఈ క్షత్రియ బలం ఎందుకు పనికొస్తుంది. ఎన్నో అస్త్రాలని నేర్చుకున్నాను, అన్నీ ప్రయోగించాను. కాని ఆయన ఒక కర్రముక్క పట్టుకొని నా అస్త్రాలన్నిటిని మింగేసారు, అని ఆ రథం దిగి వెళ్ళిపోయాడు. వశిష్ఠుడు బ్రహ్మర్షి కనుక నేను ఆయనని ఓడించలేకపోయాను, కాబట్టి నేనూ బ్రహ్మర్షిని అవుతానని ఆ విశ్వామిత్రుడు దక్షిణ దిక్కుకి వెళ్ళాడు. అక్కడికి ఆయన తన పెద్ద భార్యతో వెళ్ళి 1000 సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేశాడు. ఈ కాలంలోనే ఆయనకి హవిష్పందుడు, మధుష్యందుడు, దృఢనేత్రుడు, మహారథుడు అని నలుగురు కుమారులు పుట్టారు. ఆయన తపస్సుకి సంతోషించిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఇలా అన్నారు " నువ్వు చేసిన ఈ తపస్సు చేత రాజర్షి లోకాలని గెలిచావు, ఇవ్వాళ నుంచి నిన్ను విశ్వామిత్ర మహారాజు అని కాకుండా రాజర్షి విశ్వామిత్రుడు అని పిలుస్తారు " అని చెప్పారు. ఇన్ని సంవత్సరాలు తపస్సు చేస్తే రాజర్షిని అయ్యాను, ఇంక బ్రహ్మర్షిని ఎప్పుడవుతానో అని విశ్వామిత్రుడు దిగులుపడ్డాడు. 


అదే కాలంలొ ఇక్ష్వాకు వంశంలో త్రిశంకు అనే రాజు పరిపాలన చేసేవాడు. ఆయనకి శరీరం మీద ఉన్న వ్యామోహం వలన స్వర్గానికి శరీరంతో వెళ్ళాలన్న కోరిక పుట్టింది. వెంటనే కులగురువైన వశిష్ఠుడికి తన కోరిక చెప్పాడు. నువ్వు ఎంత గొప్ప రాజువైనా కాని, ఎంత గొప్ప యాగాలన్నా చెయ్యి, కాని శరీరంతో స్వర్గానికి వెళ్ళడమనేది ధర్మశాస్త్రంలో లేదు. ఎవరి శరీరమైన కొంత కాలానికి పడిపోవాల్సిందే, అది పడిపోయిన తరవాతే స్వర్గలోక ప్రవేశం. కావున శరీరంతో స్వర్గానికి వెళ్ళడం అనేది జెరగదు అన్నాడు వశిష్ఠుడు. అప్పుడా త్రిశంకుడు వశిష్ఠుడి నూరుగురు కుమారుల దెగ్గరికి వెళ్ళి జెరిగినది చెప్పాడు. మా తండ్రిగారు కుదరదన్నారు, ఆయనకి అన్నీ తెలుసు, అయినా స్వర్గానికి శరీరంతో ఎవరూ వెళ్ళలేరు, అది జెరిగేపనికాదన్నారు ఆ నూరుగురు కుమారులు.


అయితే నేను వేరొక గురువుని వెతుక్కుంటాను అన్నాడు ఆ త్రిశంకుడు. నువ్వు నీ గురువు మాట వినలేదు, ఆయన పుత్రులమైన మా మాట వినలేదు, ఇప్పుడు వేరొక గురువుని వెతుకుతాను అంటున్నావు, నీకు ఇలాంటి దుర్బుద్ధి పుట్టింది కనుక నువ్వు చణ్డాలుడివి అవుతావని శపించారు.

మరుసటి రోజు ఆ  త్రిశంకుడు నిద్రలేవగానే ఆయన ముఖంలోని కాంతి పోయి నల్లగా అయ్యాడు, ఆయన వేసుకొన్న బంగారు ఆభరణాలన్ని ఇనుమ ఆభరణాలయ్యాయి, జుట్టు, కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఆయనని చూసిన ఆ మందిరంలోని వాళ్ళు, ఇతర మంత్రులు అందరూ పారిపోయారు. ఆ రూపంతో అలా తిరుగుతూ చివరికి విశ్వామిత్రుడిని ఆశ్రయించాడు. 

వశిష్ఠుడిని ఎలాగు అస్త్రాలతో ఓడించలేకపోయాను, వశిష్ఠుడు చెయ్యలేనన్నది విశ్వామిత్రుడు చేశాడు అని లోకం అనుకోవాలని, కనుక ఆ త్రిశంకుడి కోరిక తీరుస్తానన్నాడు విశ్వామిత్రుడు. అప్పుడాయన తన శిష్యుల్ని, కొడుకుల్ని పిలిచి.......మీరు ఈ బ్రహ్మాండం అంతా తిరిగండి, వశిష్ఠుడు చెయ్యలేని యాగం విశ్వామిత్రుడు చేస్తున్నాడు, త్రిశంకుడిని సశరీరంగా స్వర్గానికి పంపిస్తున్నాడు అని చెప్పి బ్రాహ్మణుల్ని, ఋషుల్ని తీసుకురండి. ఎవరన్నా ఆ యాగం చెయ్యలేరు, మేము రాము అంటె, వాళ్ళ వివరాలు తీసుకోండని చెప్పాడు. విశ్వామిత్రుడికి భయపడి అందరూ వచ్చారు. తరువాత ఆయన కొడుకులు వచ్చి వశిష్ఠ మహర్షి కొడుకులు ఈ యాగానికి రామన్నారు, అలాగే మహోదయుడనే బ్రాహ్మణుడు కూడా రానన్నాడు, కాని ఆయన ఒక మాటన్నాడు, అదేంటంటే, యాగం చేస్తున్నవాడు ఒక క్షత్రియుడు, యాగం చేయిస్తున్నవాడు ఒక చణ్డాలుడు, ఇలాంటప్పుడు దేవతలు హవిస్సులని ఎలా తీసుకుంటారు, అసలు సశరీరంగా స్వర్గానికి పంపవచ్చని వేదంలో ఎక్కడా లేదు, అందుకని రానన్నాడు అని చెప్పారు.  

విశ్వామిత్రుడికి ఎక్కడలేని కోపం వచ్చి, వశిష్ఠ మహర్షి కొడుకులని, మహోదయుడిని, మీరు భస్మరాశులై పడిపోయి నరకానికి వెళతారు, ఆ తరవాత 700 జన్మలపాటు శవ మాంసం తిని బతుకుతారు, ఆ తరవాత ముష్టికులన్న పేరుతో పుట్టి, కొన్ని జన్మల పాటు కుక్క మాంసం తిని బతుకుతారు. ఆ మహోదయుడు సర్వలోకాలలోని  జనాలచేత ద్వేషింపపడి నిషాదుడై బతుకుతాడని శపించాడు. 

అందరూ కలిసి యాగం మొదలుపెట్టారు, యాగాగ్నిలో హవిస్సులు తీసుకోవడానికి ఏ దేవతా రాలేదు. ఎవరూ రాకపోయేసరికి విశ్వామిత్రుడికి ఆగ్రహం వచ్చి తన తపఃశక్తితొ త్రిశంకుడికి  పైకి పంపాడు. త్రిశంకుడు ఆకాశమార్గంలో ప్రయాణిస్తూ స్వర్గలోకం వైపు దూసుకుపోతున్నాడు. ఈ విషయం దేవేంద్రుడికి తెలిసి ఆయన.......


త్రిశంకో గచ్ఛ భూయః త్వం న అసి స్వర్గ కృత ఆలయః ||

త్రిశంకా, నువ్వు గురు శాపానికి గురయ్యావు, నీకు స్వర్గలోక ప్రవేశం లేదు అని, తలక్రిందులుగా కిందకిపో అన్నాడు. ఆ త్రిశంకుడు అలా తలక్రిందులుగా భూమి మీదకి తోసేయబడ్డాడు. కిందకి పడిపోతు ఆయన విశ్వామిత్రుడిని ప్రార్ధించగా, విశ్వామిత్రుడు మిగిలిన తపఃశక్తితో దక్షిణ దిక్కున నక్షత్ర మండలాన్ని సృష్టించాడు, సప్తర్షులని సృష్టించాడు. కాని దేవతలు అప్పటికి కూడా రాకపోయేసరికి, దేవతలని కూడా సృష్టిద్దామని అనుకుంటుండగా దేవతలందరూ వచ్చారు.



మహానుభావ! శాంతించు. ఎంత తపఃశక్తి ఉంటె మాత్రం ఇలా వేరె స్వర్గాన్ని సృష్టిస్తావ, మీకు శాస్త్రం తెలుసు, సశరీరంగా ఎవరిని స్వర్గానికి పంపలేము. మీలాంటివారు చెయ్యవలసిన పని కాదు అన్నారు. మీరు మీ తపఃశక్తిని ధారపోసి సృష్టించిన ఆ నక్షత్ర మండలం జ్యోతిష్య చక్రానికి అవతల ఉంటుంది, అందులో ఈ త్రిశంకుడు తిరగబడి ఉంటాడు అని వరం ఇచ్చారు దేవతలు. శాంతించిన విశ్వామిత్రుడు సరే అన్నాడు. తనకి ఇక్కడ మనస్సాంతి లేదని, ప్రశాంతంగా తపస్సు చేసుకోవడానికి ఆయన  పశ్చిమ దిక్కుకి వెళ్ళారు. 

పశ్చిమ దిక్కున విశ్వామిత్రుడు మహొగ్రమైన తపస్సు చెయ్యడం మొదలుపెట్టాడు. అదే కాలంలో అయోధ్య నగరాన్ని అంబరీషుడనే రాజు పరిపాలన చేస్తుండేవాడు. ఆయన అశ్వమేథ యాగం చేసి వదిలిపెట్టిన గుర్రాన్ని ఇంద్రుడు తీసుకెళ్ళిపోయాడు. అశ్వం దొరకకపోతే తనకి మంచి జెరగదు అని మహర్షులు చెప్పారు. కాని అశ్వానికి  బదులుగా ఒక మనుష్యుడిని తీసుకువస్తే యాగాన్ని పూర్తిచెయ్యచ్చు అన్నారు. అది కూడా న్యాయంగా తీసుకురావాలన్నారు. 

ఒక మనిషిని తీసుకురావడం కోసం అంబరీషుడు బయలుదేరగా ఒక చోట, భృగుతుంగమనే ఒక పర్వత శిఖరం మీద, ఋచీకుడనే ఒక ఋషి భార్య పిల్లలతో కూర్చుని ఉన్నాడు. అప్పుడు ఆ అంబరీషుడు వాళ్ళ దెగ్గరికి వెళ్ళి తన యాగాశ్వం అపహరణకి గురైనందుకుగాను నాకు ఒక యాగపశువు కావాలి, మీకు ఉన్న పిల్లలలో ఒకడిని ఇచ్చి నన్ను అనుగ్రహించండి అన్నాడు. అప్పుడా ఋచీకుడు ఇలా అన్నాడు "  పెద్దకొడుకు ధర్మసంతానం( పూర్వ జన్మలలో చేసుకున్న పుణ్య ఫలితాన్ని పెద్ద కొడుకుగా ఇస్తారు) కావున నేను వాడిని ఇవ్వలేను, శాస్త్రం ప్రకారం చిట్టచివరి వాడిని ఇస్తే ఐశ్వర్యం పోతుందన్నారు. అప్పుడా మధ్య కొడుకైన  శునఃశేపుడు అంబరీషుడితో వస్తానన్నాడు. 

No comments:

Post a Comment