Pages

Saturday, 17 March 2012

రామాయణం @ కధ -13


అప్పుడు రాముడు ఇలా అన్నాడు " పరశురామ! నువ్వు విష్ణు చాపం ఎక్కుపెట్టు, ఎక్కుపెట్టు అని నన్ను ఒక పనికిమాలినవాడిగా ఇందాకటి నుంచి మాట్లాడుతున్నా ఎందుకు ఊరుకున్నానో తెలుసా, తండ్రిగారు పక్కనుండగా కొడుకు ఎక్కువ మాట్లాడకూడదు కనుక. నేను తప్పకుండా ఎక్కుపెడతాను " అని ఆ విష్ణు చాపాన్ని ఎక్కుపెట్టి, ఆ నారిలోకి బాణాన్ని పెట్టారు. " నీ మీదే ఈ బాణ ప్రయోగం చేసి సంహరించగలను, కాని నువ్వు బ్రాహ్మణుడివి మరియు నా గురువైన విశ్వామిత్రుడికి నీకు చుట్టరికం ఉండడం చేత నేను నిన్ను సంహరించను. కాని ఒకసారి బాణం సంధించిన తరువాత విడిచిపెట్టకుండా ఉండను, అందుకని నేను నీ గమన శక్తిని కొట్టెస్తాను " అన్నాడు.

అప్పుడు పరశురాముడు ఇలా అన్నాడు " రామ! నేను క్షత్రియులని ఓడించి సంపాదించిన భూమిని
కశ్యపుడికి దానం చేశాను, అప్పుడాయన నన్ను రాత్రి పూట ఈ భూమండలం మీద ఉండద్దు అన్నాడు. ఇప్పుడు చీకటి పడుతోంది, కావున నేను తొందరగా మహేంద్రగిరి పర్వతం మీదకి వెళ్ళాలి. నువ్వు నా గమన శక్తిని కొట్టేస్తే నేను వెళ్ళలేను, మాట తప్పిన వాడినవుతాను " అని అన్నాడు. అయితే నీ తపఃశక్తితో  సంపాదించిన తపోలోకాలు (తపస్సు) ఉన్నాయి, వాటిని కొట్టెస్తాను అన్నాడు. పరశురాముడు సరే అన్నాడు. అప్పుడు పరశురాముడు తపస్సు చేసి సంపాదించుకున్న లోకాలని రాముడు కొట్టేసాడు. వెంటనే పరశురాముడు అక్కడినుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ ఆయన, నువ్వెవరో నేను గుర్తుపట్టాను రామ, నువ్వు ఆ శ్రీమహావిష్ణువే, ఇక ఈ భూలోకంలో నా అవసరంలేదని మహేంద్రగిరి పర్వతాలవైపు వెళ్ళిపోయాడు పరశురాముడు.

దశరథుడు సంతోషంగా వాళ్ళని అయోధ్యకి తీసుకెళ్ళాడు,
కౌసల్య, సుమిత్ర, కైకేయి ఎదురొచ్చి హారతులిచ్చారు. తమ కోడళ్ళని చూసుకొని మురిసిపోయారు. అప్పుడు వాళ్ళని ఆ వంశ కులదైవాలున్న దేవతాగృహాలకి తీసుకెళ్ళి ఇక్కడ పూజ చెయ్యాలని చూపించారు. అలా ఆ నూతన దంపతులు హాయిగా క్రీడిస్తూ కాలం గడిపారు.

సీతారాముల అలా ఆనందంగా ఉండడానికి కారణాన్ని వాల్మీకి మహర్షి ఈ క్రింది శ్లోకంలో చెప్పారు..........



ప్రియా తు సీతా రామస్య దారాః పితృ కృతా ఇతి | 
గుణాత్ రూప గుణాత్ చ అపి ప్రీతిః భూయో అభివర్ధతే ||

రాముడికి సీతమ్మ అంటె చాలా ఇష్టమంట, ఎందుకు ఇష్టమంటే, మా తండ్రిగారు నాకు తగిన భార్య అని నిర్ణయం చేశారు, అందుకు ఇష్టమట. అలాగే అపారమైన సౌందర్యంతో ఆకట్టుకుంది, అలాగే అపారమైన సంస్కారము, గుణములు ఉన్నాయట.

సీతారాములు కొంతకాలం సంసారం చేశాక, సీతమ్మ తాను ఏమి అనుకుంటుందో నోరు విప్పి చెప్పేది కాదట, అలాగే రాముడు ఏమనుకుంటున్నాడో సీతమ్మకి నోరు విప్పి చెప్పేవాడు కాదట, హృదయాలతో నిశబ్ధంగా మాట్లాడుకునేవాళ్ళట. తన తండ్రిగారు నిర్ణయించిన భార్య అని రాముడు సీతమ్మని ప్రేమించాడంట, కాని సీతమ్మ మాత్రం ఈయన నాకు భర్త అని ప్రేమించిందంట. 

అలా ఆనందంగా కాలం గడిచిపోతుంది.................. 

దశరథుడి కుమారుల పెళ్ళికి, భరతుడి మేనమామ అయిన యుధాజిత్ కూడా వచ్చాడు. అసలు ఆయన భరతుడిని కొన్ని రోజుల కోసం తన ఇంటికి తీసుకువెళదామని వచ్చాడు. కాని అప్పటికే భరతుడు మిథిలకి బయలుదేరాడని తెలుసుకొని ఆయన కూడా మిథిలకి పయనమయ్యాడు. రామలక్ష్మణ భరతశత్రుఘ్నుల వివాహాన్ని కన్నులార చూసి, వాళ్ళతోపాటే అయోధ్యకి వచ్చాడు. కొంతకాలం అయ్యాక యుధాజిత్ భరతుడిని తన ఇంటికి తీసుకెళ్ళాడు, భరతుడు తనతో పాటు శత్రుఘ్నుడిని కూడా తీసుకు వెళ్ళాడు. అక్కడ వాళ్ళు ఎన్ని భోగాలని అనుభవించినా ఎల్లప్పుడూ తమ తండ్రి అయిన దశరథ మహారాజుని తలుచుకునేవారు. 

దశరథ మహారాజుకి తన నలుగురు కుమారులు నాలుగు చేతులవంటివారు, ఆయనకి ఒక కొడుకు మీద ప్రేమ ఎక్కువ, మరొక కొడుకు మీద ప్రేమ తక్కువ అనేది లేదు. నలుగురిని సమానమైన దృష్టితో చేసేవారు. కాని ఆయనకి రాముడంటే అమితమైన ప్రీతి, ఎందుకంటే..... 

తేషామపి మహాతేజా రామో రతికరః పితుః |
స్వయంభూరివ భూతానాం బభూవ గుణవత్తరః ||

రాముడికి ఉన్న గుణముల చేత, దశరథుడికి రాముడంటే కొంచెం ప్రేమ ఎక్కువ. రాముడికి ఉన్న గొప్ప గుణాలు ఏంటంటే, ఎప్పుడూ ప్రశాంతంగా, నిర్మలంగా ఉంటాడు( ప్రాణుల్లో కొన్నిటికి పుట్టుకతో చెవి వినపడక పోవచ్చు, కన్ను చూడలేక పోవచ్చు, నోటితో మాట్లాడలేక పోవచ్చు, కాలు-చెయ్యి పని చేయకపోవచ్చు, కాని పుట్టుకతో చెడ్డ మనస్సుతో ఎవడూ పుట్టడు, మన మనసుని మనం మార్చుకోగలము, అలా మార్చుకోలేకపోతే అది మన తప్పే, అనవసరమైన విషయాల గురించి ఆలోచించకుండా ఉంటె అందరూ ప్రశాంత చిత్తంగా ఉండగలము), ఎప్పుడూ మృదువుగా, మధురంగా మాట్లాడతాడు, అవతలివాడు వెర్రికేకలు వేస్తే, ఉద్రేకంగా మాట్లాడితే రాముడు మాత్రం మౌనంగానే ఉండేవాడు, వాదనలు చేసేవాడు కాదు, అవతలివాడు తనకి వంద అపకారాలు చెసినవాడైన కాని, తనకి ఒకసారి అనుకోకుండా ఉపకారం చేస్తే మాత్రం, రాముడు అతను చేసిన ఉపకారాన్ని గుర్తుకుతెచ్చుకొని ఆనందపడతాడు(అవతలి వ్యక్తిలో తప్పులు వెతికేవాడు కాదు), బుద్ధిమంతుడు, ముందు తనే పలకరించేవాడు, అలా కాకుండా ఎవరన్నా తనని ముందుగా పలకరిస్తే, అయ్యో! నేను వాళ్ళని పలకరించలేకపోయానే అని బెంగ పడేవాడు, అందుకని అందరినీ ముందు తనే ప్రేమగా పలకరించేవాడు, ఆయన పరాక్రమవంతులకు పరాక్రమవంతుడు అయినప్పటికీ నేను ఇంతటివాడిని అని ఎప్పుడూ అనుకోడు, తనకన్నా పెద్దవాళ్ళని ఎల్లప్పుడూ గౌరవించేవాడు, ఎప్పుడూ ధర్మ విరుద్ధమైన మాట మాట్లాడేవాడుకాదు, శ్రేయస్కరము కాని పని చేసేవాడు కాదు(మనం ఏదన్నా పని చేసేముందు, మన లోపలి బుద్ధి మనం చేస్తున్న పని మంచిదో కాదో చెప్తుంది, కాని మన మనసు ఆ మాట వినదు, అది ఈ పని చెయ్యద్దు అని అనదు, అదేమంటుందంటే, అందరు చేస్తున్నారు, మడి కట్టుకుని కూర్చుంటే ఎందుకూ పనికిరాము, ఈ మాత్రానికే ఏమి కొంపలు మునిగిపోవు, ఆ పని చేసింది నేనే అని నేను స్వయంగా చెప్పేదాకా ఎవడికి తెలీదు అని పలురకాలుగా మభ్యపెట్టి, ఇంద్రియాలకి లొంగి, శ్రేయస్కరము కాని పని చేయిస్తుంది. కాని రాముడు మనసుకి లొంగి శ్రేయస్కరము కాని పనిని ఎన్నడూ చేసేవాడు కాదు), అలాగే...... 

ధర్మకామార్థతత్త్వజ్ఞః స్మృతిమాన్ ప్రతిభానవాన్ |
లౌకికే సమయాచారే కృతకల్పో విశారదః ||

గురువులు చెప్పిన విషయాలని అవసరమైనప్పుడు స్మరించగలిగే నేర్పు ఉందట, సమయస్పూర్తితో మాట్లాడగలిగే నేర్పు ఉందట, ఆచారాలని పెద్దలు ఎలా పాటించేవారో అలా పాటించేవాడు. ప్రాజ్ఞులైనవారిని, సత్పురుషులని ఎలా రక్షించాలో తెలిసున్నవాడు, ఎవరిని ఎక్కడ ఉంచాలో, ఎవరిని ఎలా నియమించాలో, ఎలా ఆర్జించాలో, ఎలా ఖర్చుపెట్టాలో తెలిసున్నవాడు. సంగీత, శిల్ప, నృత్యములందు ఆరితేరినవాడు. అలాగే లొంగనటువంటి గుర్రాలని, ఏనుగుల్ని లొంగతీసుకుని వాటిమీద స్వారి చెయ్యగలిగే శక్తి ఉన్నవాడు, ప్రపంచంలో ఉన్న అతికొద్దిమంది అతిరథులలో శ్రేష్టుడైనవాడు, ఎన్ని అస్త్ర-శస్త్రాలు తెలిసినా నిష్కారణంగా బాణ ప్రయోగం చెయ్యనివాడు. 

ఇన్ని గుణములతో అందరినీ సంతోషింప చెయ్యగలిగేవాడు కనుక రాముడంటె దశరథుడికి అంత ప్రీతి.

ఒకనాడు దశరథుడు,..........నాకు అంతరిక్షంలో మరియు భూమి మీద ఉత్పాతములు (తోకచుక్కలు, గులకరాళ్ళవర్షం మొదలైనవి) కనిపిస్తున్నాయి. నాకు వృద్ధాప్యం వస్తోంది, ఇంక నేను ఎంతోకాలం బ్రతకను. అందుకని నాకు ప్రియాతిప్రియమైన, సకలగుణాభిరాముడికి తొందరగా యువరాజ్య పట్టాభిషేకం చేసేస్తే ప్రజలందరూ సంతోషంగా ఉంటారు అని ఆలోచించి దశరథ మహారాజు తన మంత్రులని, ఇతర రాజులని, ప్రభుత్వ ఉద్యోగులని, జానపదులని, అయోధ్యా పట్టణవాసులని మొదలైనవారందరిని పిలిచి పెద్ద సమావేశం ఏర్పాటు చేశారు. రాముడికి తొందర తొందరగా యువరాజ్య పట్టాభిషేకం చెయ్యాలనే తొందరలో కైకేయ రాజుకి, జనక మహారాజుకి కబురు పంపలేదు. దశరథ మహారాజు కూర్చున్నాక, అందరూ తమకి ఏర్పాటు చేసిన స్థానాలలో కూర్చున్నారు. అప్పుడు దశరథుడు ఇలా అన్నాడు..........

ఇదం శరీరం కృత్స్నస్య లోకస్య చరతా హితం |
పాణ్దురస్యాతపత్రస్య చ్ఛాయాయాం జరితం మయా ||

ఈ తెల్లటి గొడుగు కింద కొన్ని వేల సంవత్సరాల నుంచి కూర్చున్నాను. ఈ తెల్లటి గొడుగు కింద కూర్చుని ఉండగానే నా శరీరానికి వృద్ధాప్యం వచ్చేసింది. ఇప్పుడు నా శరీరం విశ్రాంతిని కోరుకుంటుంది, అందుకని మూడులోకాలని శాసించగలిగే శక్తివంతుడైన నా పెద్ద కుమారుడు రాముడికి యువరాజ్య పట్టాభిషేకం చేద్దామని అనుకుంటున్నాను, కాని నా అంతట నేను తీసుకున్న నిర్ణయం కచ్చితంగా ఉండకపోవచ్చు. రాముడు నా పెద్ద కుమారుడన్న పక్షపాత బుద్ధితో నేను ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చు. నేను న్యాయాన్యాయ విచారణ చేసి ఉండకపోవచ్చు. ఈ సింహాసనం మీద కూర్చునేవాడు ఈ రాజ్యాన్ని ధర్మబద్ధంగా పాలించాలి, ప్రజలని తన బిడ్డలుగా చూసుకోవాలి, రాముడు పట్టాభిషేకానికి అర్హుడు అని నేను అనుకుంటున్నాను, కాని రాముడు అలాంటివాడో కాదో మీరు విచారించండి, నిస్పక్షపాతంగా రాగద్వేషాలు లేకుండా ఆలోచించి నిర్ణయించండి, మీరందరూ కూడా రాముడు పట్టాభిషేకానికి అర్హుడు అని అనుకుంటే పట్టాభిషేకం చేస్తాను, మీరందరూ బాగా ఆలోచించి మీ నిర్ణయాన్ని చెప్పండి అన్నాడు.  

No comments:

Post a Comment