Pages

Sunday, 4 March 2012

రామాయణం @ కధ -5


అలా వాళ్ళు ప్రయాణిస్తూ శోణానది ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు, ఆ ప్రాంతం ఫలాలు, పుష్పాలతొ చాలా శోభాయమానంగా కనబడింది. ఈ ప్రాంతం ఇంత ఆనందంగా, అందంగా ఉండడానికి కారణమేంటని రాముడు అడగగా విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు " పూర్వకాలంలొ బ్రహ్మ కుమారుడైన కుశుడు రాజ్యపాలన చేసేవాడు. ఆయనకి కుశాంబుడుకుశనాభుడుఅధూర్తరజసుడువసురాజుఅనే నలుగురు కుమారులు కలిగారు. ఆ నలుగురు యవ్వనవంతులయ్యాక కుశుడు వాళ్ళని పిలిచి, " మీరు నలుగురూ నాలుగు నగరాలని నిర్మాణం చెయ్యండి, వాటిని మీరు ధార్మికంగా పరిపాలన చెయ్యండి " అని ఆదేశించాడు. అప్పుడు వాళ్ళు కౌశాంబీమహోదయముధర్మారణ్యము,గిరివ్రజపురము అనే నాలుగు నగరాలని నిర్మించుకొని పరిపాలించారు. ప్రస్తుతం మనం ఉన్నది గిరివ్రజపురములొ. ఈ పట్టణాన్ని వసురాజు నిర్మించాడు. ఈ నగరం 5 పర్వతాల మధ్యలొ ఉంది, శోణానది ఈ 5  పర్వతాల మధ్యలొ ప్రవహిస్తుంది, అందుకే ఇక్కడి ప్రాంతం సస్యశ్యామలంగా ఉంటుంది. 


కుశుడి రెండవ కుమారుడైన కుశనాభుడికి 100 మంది కుమార్తెలు కలిగారు. వాళ్ళందరుకుడా ఘ్రుతాచి అనే అప్సరసకి, కుశనాభుడికి జన్మించారు. వాళ్ళందరూ విశేషమైన సౌందర్య రాసులు, మెరుపుతీగల వలె చాలా అందంగా ఉండేవారు. ఒకనాడు ఆ కుశనాభుడి కుమార్తెలు కొండ మీదకి వెళ్లి పాటలు పాడుకుంటూ, వీణలు వాయిస్తూ సంతోషంగా ఉన్న సమయంలొ అక్కడికివాయుదేవుడు వచ్చాడు. వాయువు వాళ్ళని చూసి మీరు చాలా అందంగా ఉన్నారు, కాని మీరు మనుషులు కావడం చేత మీరు ఇలా యవ్వనంలొ ఎంతోకాలం ఉండలేరు, కొంత కాలానికి మీ యవ్వనంతొ పాటు మీ అందం కూడా నశిస్తుంది, కాబట్టి మీరు నన్ను పెళ్లి చేసుకోండి, నన్ను పెళ్ళిచేసుకుంటె మీరు కూడా నిత్య యవ్వనంలొ ఉంటారు అని ప్రలోభ పెట్టాలని ప్రయత్నించాడు. వెంటనే ఆ 100 కన్యలు ఏక కంఠంతో.........

కుశనాభ సుతాః దేవం సమస్తా సుర సత్తమ |
స్థానాత్ చ్యావయితుం దేవం రక్షామః తు తపో వయం ||
మా భూత్ స కాలో దుర్మేధః పితరం సత్య వాదినం |
అవమన్యస్వ స్వ ధర్మేణ స్వయం వరం ఉపాస్మహే ||
పితా హి ప్రభుర్ అస్మాకం దైవతం పరమం చ సః |
యస్య నో దాస్యతి పితా స నో భర్తా భవిష్యతి ||

మాదెగ్గర అపారమైన తపఃశక్తి ఉంది, కావున మమ్మల్ని మేము రక్షించుకోగలము, మేము తలుచుకుంటె నువ్వు గర్వంగా చెప్పుకుంటున్న నీ దేవతాస్థానం నుంచి నిన్ను తొలగించగలము. మాకు పెళ్ళంటూ జెరిగితె, అది ధర్మాత్ముడైన మా తండ్రిగారు ఎవరిని చూపించి చేసుకోమంటె వాళ్లనే చేసుకుంటాము కాని మా అంతట మేము నిర్ణయించుకోము, ఈ దేశంలొ ఏ స్త్రీ తన తండ్రిని కాదని సొంతంగా తన భర్తని నిర్ణయించుకునే రోజు రాకూడదు అని ఆ కన్యలందరూ ఏక కంఠంతొ చెప్పారు. వారి మాటలకు ఆగ్రహించిన వాయుదేవుడు ఆ నూరుగురు కన్యల శరీరములలోకి ప్రవేశించి వారి అవయవములందు సంకోచత్వం కల్పించాడు, దానివల్ల వారందరూ అవయవముల పటుత్వం కోల్పోయారు.

తరవాత ఆ కన్యలందరూ కుశనాభుడి దెగ్గరికి వెళ్లి జెరిగినది చెప్పారు. అప్పుడు ఆ కుశనాభుడు తన కుమార్తెలను చూసి, " అమ్మా! మీకు ఈ స్థితి కల్పించిన ఆ వాయుదేవుడిని మీరు శపించలేదు, ఓర్పువహించారు, నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అని...............

క్షమా దానం క్షమా సత్యం క్షమా యజ్ఞః చ పుత్రికాః |
క్షమా యశః క్షమా ధర్మః క్షమాయాం విష్ఠితం జగత్ ||
స్త్రీకి ఉండవలసిన ఆభరణం ఓర్పు. అమ్మా! నూరుగురు కలిసి ఒకేసారి అంత ఓర్పు పట్టారు, మీలో ఒక్కరికి కూడా కోపం రాలేదు, అందం అంటె ఇది. ఓర్పె దానం, అన్నిటికన్నా గొప్ప కీర్తి ఓర్పె, ఓర్పుకి మించిన యజ్ఞం లేదు,  ఓర్పుని మించిన సత్యం లేదు, ఓర్పుని మించిన ధర్మం లేదు, ఆ ఓర్పు వల్లనె ఈ భూమి నిలబడుతోంది " అని చెప్పాడు. 

అదే సమయంలొ చూళి అనే ఒక మహర్షికి, ఊర్మిళ కుమార్తె అయిన సోమద అనే గంధర్వ స్త్రీఉపచారాలు చేసేది. అలా చాలాకాలం ఉపచారం చేశాక ఒకనాడు ఆ మహర్షి ఆమెతొ....... నేను నీకు ఏమిచెయ్యగలను అని అడిగారు. అప్పుడామె.......నేను ఎవరికీ భార్యని కాను, కాని అపారమైన తపఃశ్శక్తి, బ్రహ్మతేజస్సు కలిగిన నీ వలన, శారీరిక సంపర్కం లేకుండా, మానసికమైన తపఃఫలంతో నాకు కుమారుడు కావాలి అని అడిగింది. అప్పుడు ఆ చూళి మహర్షి సంకల్పం చేసి బ్రహ్మదత్తుడుఅనే మానస పుత్రుడిని సోమదకి ప్రసాదించారు. పుట్టుక చేత బ్రహ్మజ్ఞాని అయిన బ్రహ్మదత్తుడు,కాపిల్యము అనే నగరంలొ ఉండేవాడు. కుశనాభుడు తన నూరుగురు కుమార్తెలని ఆ బ్రహ్మదత్తుడికి ఇచ్చి వివాహం జెరిపించాడు. బ్రహ్మదత్తుడితో వివాహం అవుతుంటె ఒక్కొక్కరి అంగవైకల్యం పోయి, వాళ్ళు మళ్ళి పూర్వ సౌందర్యాన్ని పొందారు. అప్పుడు సోమద వచ్చి తన కోడళ్ళ ఒక్కొక్కరి చేతిని పట్టుకొని కుశనాభుడిని పొగిడింది" అని విశ్వామిత్రుడు రాముడికి చెప్పాడు.

ఈ వృత్తాంత్తం విన్నాక అందరూ ముందుకి బయలుదేరారు. అలా ముందుకు వెళ్ళిన వాళ్ళు గంగా నదిని సమీపించారు, అందరూ గంగని చూడగానె ఎంతో సంతోషించారు. అక్కడున్న మహర్షులు మొదలగువారు ఆ గంగలో తమ పితృదేవతలకి తర్పణం సమర్పించి, అగ్నిహొత్రం చేసి ఒడ్డున కూర్చొని, మిగిలిన హవిస్సుని అమృతంగా భావించి తిన్నారు. అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు...." కుశనాభుడికి నూరుగురు కుమార్తెలు ఉన్నారు, కాని కుమారులు లేరు. తనకి కుమారులు కలగడం కోసం పుత్రకామేష్టి యాగం ప్రారంభించాడు, ఆ యాగం జెరుగుతుండగా కుశనాభుడి తండ్రైన కుశమహారాజు అక్కడికి వచ్చి నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది, గాధిఅనేవాడు నీకు కొడుకుగా జన్మించి మన వంశ పేరు నిలబెడతాడు" అన్నాడు. 

నేను ఆ గాధి యొక్క కుమారుడినే రామా అని విశ్వామిత్రుడు రాముడితో చెప్పాడు.

స పితా మమ కాకుత్స్థ గాధిః పరమ ధార్మికః |
కుశ వంశ ప్రసూతో అస్మి కౌశికో రఘునందన ||
అప్పుడు విశ్వామిత్రుడు..... " నేను కుశ వంశంలో జన్మించాను కాబట్టి నన్ను కౌశికుడు అని అంటారు. నా అక్క పేరు సత్యవతి, ఆమె భర్త పేరు ఋచకుడు. కొంతకాలానికి మా బావగారు శరీరం విడిచిపెట్టారు. అప్పుడు మా అక్క ఉండలేక సశరీరంగా బావతో స్వర్గానికి వెళ్ళిపోయింది. మా అక్కకౌశికి అనే నదిగా హిమాలయాల మీద ప్రవహిస్తుంది. అందుకే నేను ఎక్కువగా హిమాలయాల మీద, మా అక్కకి దెగ్గరగా ఉంటాను. ఇప్పుడు ఈ సిద్ధాశ్రమానికి యాగం చెయ్యడానికి వచ్చాను, నీ తేజస్సు చేత రక్షింపబడ్డాను " అని  రాముడితొ చెప్పాడు.

అక్కడే ఉన్న ఋషులు  అప్పుడు.........

విశేషేణ భవాన్ ఏవ విశ్వామిత్ర మహాయశః |
కౌశికీ సరితాం శ్రేష్ఠః కుల ఉద్యోతకరీ తవ ||

నీవంటి వాడు పుట్టడం చేత నీ వంశం ధన్యమయ్యింది, మీ అక్కగారి వల్ల మీ వంశం పరమ పావనం అయ్యింది అని అన్నారు. 

అప్పుడు రాముడు గంగకి త్రిపథగ అన్న నామం ఎలా వచ్చిందొ చెప్పమన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పసాగాడు...... " పూర్వకాలంలొ హిమవంతుడు అనే పర్వత రాజు, ఆయన భార్య మనోరమ ఉండేవాళ్ళు. వాళ్ళ పెద్ద కుమార్తె గంగ, రెండవ కుమార్తె ఉమ. స్వేచ్ఛగా ప్రవాహించగలిగే గుణమున్న గంగని స్వర్గలోకానికి పంపిస్తే ఆ నదీ జలాలని ఉపయోగించుకొని మేము తరిస్తామని దేవతలు హిమవంతుడిని అడుగగా, దేవకార్యము కనుక హిమవంతుడు సరే అన్నాడు. అలా దేవనదిగా గంగ స్వర్గంలొ ప్రవహించేది. ఆయన రెండవ కుమార్తె తన తపస్సు చేత కాముడిని దహించిన శివుడికి అర్ధాంగి అయ్యి, హైమవతిగా తన తండ్రి పేరు నిలబెట్టింది. పరమ పావని అయిన గంగ ఒకనాడు భూలోకానికి తేవబడి పాతాళానికి చేరింది, 3 లోకములలొ ప్రవహించినది కనుక గంగని త్రిపథగ అని పిలుస్తారు" అని విశ్వామిత్రుడు చెప్పాడు.

మీరు విషయాలని మనస్సుకి అతుక్కున్నేటట్టు చెప్పగలరు, కావున నదులన్నిటిలోకి పరమ పవిత్రమైనది, మనుష్యుల పాపములు హరించగలిగినది అయిన గంగని గూర్చి మాకు ఇంకా విస్తారంగా చెప్పవలసిందిగా రాముడు విశ్వామిత్రుడిని ప్రార్ధించాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు...." పార్వతి పరమేశ్వరులు కైలాసంలో 100 దివ్య సంవత్సరాలు క్రీడించారు. ఈ విషయం విన్న దేవతలకి ఆశ్చర్యమేసింది, పార్వతీదేవి - శంకరుడి తేజస్సులు అసామాన్యమైనవి, కాబట్టి వాళ్ళ కలయిక వల్ల జన్మించే భూతాన్ని మనం తట్టుకోలేము అని అనుకున్నారు. ఈ దేవతలంతా బయలుదేరి కైలసానికి వెళ్ళి శంకరుడిని ప్రార్ధించారు. అప్పుడు శంకరుడు బయటకి వచ్చాడు. అప్పుడు వాళ్ళు ఆయనతో, స్వామీ!  మీరు పార్వతీదేవితో 100 దివ్యసంవత్సరాల నుంచి క్రీడిస్తున్నారు, మీ తేజస్సు కనుక వేరొక ప్రాణి రూపంలో వస్తే, మేము ఎవరము దానిని తట్టుకోలేము, కావున మీరు మీ తేజస్సుని మీలోనే పెట్టుకొని పార్వతీదేవితో తపస్సు చేసుకోండి అన్నారు.

వాళ్ళు చెప్పినదానికి శంకరుడు సరే అన్నాడు, కాని ఇప్పటికే రేతస్థానము నుంచి నా తేజస్సు కదిలింది, ఇప్పుడు దాన్ని ఎవరు భరిస్తారు, దాన్ని ఎక్కడ వదిలిపెట్టను అని శంకరుడు అడిగాడు. అప్పుడు ఆ దేవతలు.....

యత్ తేజః క్షుభితం హి అద్య తద్ ధరా ధారయిష్యతి |

మీ తేజస్సుని భూమి భరిస్తుంది, కావున భూమి మీద వదిలిపెట్టండి అన్నారు. శంకరుడు అలానే భూమి మీద తన తేజస్సుని వదిలిపెట్టాడు. వదిలిన ఆ తేజస్సు భూమి అంతా వ్యాపించింది. ఇంతలో పార్వతీదేవి బయటకి వచ్చి, నాకు బిడ్డ పుట్టకుండా చేసి మీరు శంకర తేజస్సుని భూమి మీద పతనం చేశారు. కావున.....

అపత్యం స్వేషు దారేషు న ఉత్పదయితుం అర్హథ |
అద్య ప్రభృతి యుష్మాకం అప్రజాః సంతు పత్నయః ||
ఏవం ఉక్త్వా సురాన్ సర్వాన్ శశాప పృథివీం అపి |
అవనే న ఏక రూపా త్వం బహు భార్యా భవిష్యసి ||
న చ పుత్ర కృతాం ప్రీతిం మత్ క్రోధ కలుషీకృతా |
ప్రాప్స్యసి త్వం సుదుర్మేధే మమ పుత్రం అనిచ్ఛతీ ||

మీ దేవతలు అందరూ వచ్చి నాకు బిడ్డలు కలగకుండా చేశారు కాబట్టి మీకెవరికీ మీ భార్యలందు బిడ్డలు పుట్టరు. నా భర్త అయిన శంకరుడి తేజస్సుని భరించడానికి భూమి ఒప్పుకుంది కాబట్టి, ఇకనుంచి భూమి అనేక రూపాలు పొందుతుంది, ఒకే కాలంలో భూమికి అనేక భర్తలుంటారు, భూమి తన కొడుకుల వలన సిగ్గుతో తల వంచుకుంటుందని శపించింది. ఇది విన్న దేవతలు తలలు వంచుకొని తమ తమ స్థానాలకి వెళ్ళిపోయారు.

వ్యాపించిన ఆ శంకరుడి తేజస్సుని భూమి కూడా తట్టుకోలేకపోయింది. అప్పుడు దేవతలు అగ్నిదేవుడిని వాయువుతో కలిసి ఈ రుద్ర తేజస్సుని తనయందు పెట్టుకోమన్నారు. అప్పుడు అగ్ని ఆ తేజస్సుని తనలో పెట్టుకున్నాడు. 

పార్వతి సమేతంగా హిమాలయాలకు వెలుట

శంకరుడు పార్వతీదేవితో తపస్సు చేసుకోడానికి పశ్చిమ దిక్కుకి వెళ్ళిపోయాడు. అదే సమయంలోతారకాసురుడు అనే రాక్షసుడు, తను పార్వతీ పరమేశ్వరుల బిడ్డడి చేతిలోనే చనిపోయేటట్టు వరం పొందాడు. ఇది తెలిసిన దేవతలకి ఏమి చెయ్యాలో తెలీక బ్రహ్మగారి దెగ్గరికి వెళ్లారు. అప్పుడు బ్రహ్మగారు ఆలోచించి, హిమవంతుడు - మనోరమల కుమార్తెలైన గంగా - పార్వతులకి తేడా లేదు, కావున పార్వతీదేవి అక్క అయిన గంగలో ఈ తేజస్సుని విడిచిపెడితే, పార్వతీదేవికి కోపం రాదు. కాబట్టి ఆ శివ తేజస్సుని గంగలో విడిచిపెట్టమన్నారు. అప్పుడా దేవతలు గంగమ్మ దెగ్గరికి వెళ్ళి, దేవకార్య నిమిత్తము నువ్వు అగ్ని దెగ్గరనుంచి శివ తేజస్సుని స్వీకరించి గర్భం ధరించాలి అన్నారు. దేవతా కార్యము కనుక గంగ సరే అన్నది. అప్పుడు గంగ ఒక అందమైన స్త్రీ రూపం దాల్చి ఆ తేజస్సుని అగ్ని నుండి స్వీకరించింది. శివ తేజస్సు గంగలో ప్రవేశించగానే గంగ కేకలేసింది. ఈ తేజస్సుని నేను భరించలేను, నన్ను ఏమి చెయ్యమంటారు అని అడిగింది. అప్పుడు అగ్నిదేవుడు చెప్పిన విధంగా గంగ ఆ తేజస్సుని కైలాస పర్వతం పక్కనున్న భూమి మీద వదిలింది. 

No comments:

Post a Comment