నా కోరిక ఏంటో నీకు చెప్తే, నువ్వు ఇలాంటి కోరిక కోరావేంటని అంటావు, కాబట్టి ముందు నా కోరికలని తీరుస్తానని ప్రమాణం చేస్తే అప్పుడు నా కోరికేంటో చెప్తాను అని కైకేయ అనింది.
అప్పుడు దశరథుడు " ఎవరిని నేను ఒక్క క్షణం చూడకపోతే నా ప్రాణాలు గాలిలో కలిసిపోతాయో, ఎవరిని విడిచి ఉండలేనో, ఎవరి మాట నా చెవిన పడకపోతే నా ప్రాణాలు ఉండవో అటువంటి రాముడి మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను కైక, నువ్వు అడిగిన కోరికలు తప్పకుండా తీరుస్తాను " అన్నాడు. అప్పుడా కైక..............
"రాజు చెప్పిన మాటని మీరు వింటున్నారు కదా ఓ రాత్రి దేవతలారా!, పగటి దేవతలారా!, గృహ దేవతలారా!, సూర్యుడా, చంద్రుడా, సమస్త దేవతలారా, భూమి, అష్టదిక్పాలకులార, మీరందరూ నా తరపున సాక్షి. నేను కోరికలు కోరిన తరువాత ఆ కోరికలు తప్పకుండా ఇస్తానని రాజు నాకు మాట ఇచ్చాడు. రాజా, జ్ఞాపకం తెచ్చుకో, ఒకనాడు శంబరాసురుడు మీదకి యుద్ధానికి వెళ్ళాము, అప్పుడు నేను నిన్ను రెండు సార్లు రక్షించాను, అప్పుడు నువ్వు నాకు రెండు వరాలిచ్చావు. ఆ రెండు వరాలని ఇప్పుడు అడుగుతున్నాను అని......
అనేనైవాభిషే కేణ భరతో మేభిషిచ్యతాం |
నవ పఞ్చ చ వర్షాణి దణ్డకారణ్యమాశ్రితః |
చీరాజినజటాధారీ రామో భవతు తాపసః |
భరతో భజతామద్య యౌవరాజ్యమకణ్టకం ||
"ఏ రాముడికి యువరాజ పట్టాభిషేకం చేద్దామని నువ్వు సమస్త సంభారములు తెచ్చి సిద్ధం చేసావో అదే ముహూర్తానికి భరతుడికి పట్టాభిషేకం చెయ్యాలి. పట్టాభిషేకం చేయించుకోవలసిన రాముడు తొమ్మిది+అయిదు సంవత్సరాలు దండకారణ్యానికి వెళ్లి నారచీర, జటలు కట్టుకొని, మాంసాహారం తినకుండా, తపస్వి లాగ బతకాలి " అని అనింది.
(త్రేతాయుగ ధర్మం ప్రకారం 14 సంవత్సరాలు రాజ్యానికి దూరమైన వ్యక్తి తిరిగి రాజు కాలేడు, అందుకని కైక రాముడిని 14 సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్ళమనింది. కాని ఎవరియందు కామ క్రోధాలు అతిగా ప్రకాశిస్తాయో, వాళ్ళని దేవతలు ఆవహించి దైవకార్య నిమిత్తము వాడుకుంటారు. అందుకే దేవతలు కైకేయని ఆవహించి ఆమెతో 14 అనిపించకుండా 9+5(నవ పఞ్చ చ వర్షాణి) అనిపించారు, కైకేయ అలా అనడం వల్ల రాముడు రావణసంహారణ అనంతరం రాజారాముడిగా పట్టాభిషేకం పొందాడు అని పెద్దలు చెప్తారు.)
అప్పటిదాకా ఎంతో సంతోషంగా ఉన్న దశరథుడు ఈ మాట వినగానే స్పృహ కోల్పోయి ఉన్న చోటనే కూలబడ్డాడు. తరవాత అక్కడినుంచి నేల మీద పడ్డాడు. ఆయన అలా పడిపోతే కైకేయ కనీసం లేపలేదు. కొంతసేపటికి తేరుకున్న దశరథుడు..................
"ఎంతమాట అన్నావు కైక. జీవితంలో ఇటువంటి మాట వినవలసి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. రాముడు నీకు చేసిన అపకారమేమిటి. రాముడు ఎన్నడూ కౌసల్యని ఒక్కదాన్నే మా అమ్మ అని సేవ చెయ్యలేదు, కౌసల్యని చూసినట్టే నిన్ను, సుమిత్రని చూశాడు. ఎన్నడూ మాట తప్పలేదు రాముడు. రాముడి గురించి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు ఈ కోసల దేశంలో ఎవరూ లేరు. నీ దెగ్గరికి ఎప్పుడు వచ్చినా రాముడికి పట్టాభిషేకం చెయ్యాలి, నాకు భరతుడికి రాముడికి తేడా లేదు అనే దానివి కదా, మరి ఇప్పుడు నువ్వు ఎవరి చెప్పుడు మాటలు విని ఇలా మాట్లాడుతున్నావు. గురువులకి ఎంతో సేవ చేసిన నా రాముడు హాయిగా హంసతూలికా పాన్పులమీద నిదురించవలసిన వాడిని నువ్వు ఎందుకని తపస్వి లాగ జెటలు కట్టుకొని అడవుల్లో దొరికే తేనె, కందమూలాలు తిని, చెట్ల కింద పడుకొమ్మని కోరుకున్నావు. ఇదంతా ఊహించి నేను బతకగలనా. నేను ఇప్పుడు జీవితంలో చిట్టచివరి దశకి వచ్చాను కైక, అందుకని రాముడిని విడిచిపెట్టి నేను ఉండలేను, కావాలంటే కౌసల్యని వదిలిపెట్టమను, సుమిత్రని వదిలిపెట్టమను, నా ప్రాణాలే వదిలెయ్యమను, నన్ను సింహాసనం మీద నుంచి దిగిపొమ్మను, ఈ కోరికలన్నీ తీరుస్తాను. నీ పాదములు పట్టి ప్రార్ధిస్తున్నాను కైక, రాముడిని పధ్నాలుగు ఏళ్ళు పంపించెయ్యమని అనద్దు.
రాముడిని నేను పంపించేస్తే, సీతమ్మ నా దెగ్గరకు వచ్చి, మామగారు నా భర్త ఏ తప్పు చేసాడని ఆయనని అడవులకు పంపించారు అని ఏడుస్తూ నన్ను ప్రశ్నిస్తే, నేను ఏ సమాధానం చెప్పగలను. రాముడే కనుక అడవులకు వెళితే నేను బతకలేను, శవమై కిందపడతాను, నువ్వు వైధవ్యాన్ని పొంది దిక్కులేని దానివి అవుతావు. కావున నన్ను, నీ మంగళ్యాన్ని కాపాడుకో. రాముడు భరతుడికి ఏ అపకారము చెయ్యడు. నిన్ను కన్నతల్లిని చూసినట్టు చూస్తాడు. నీకు ఎవరో లేనిపోని విషయాలు నూరిపోశారు. నేనే కనుక రాముడిని అడవులకు పంపితే, ఏ తప్పు చెయ్యని రాముడిని అడవులకు ఎలా పంపగలిగావు, నిన్ను మేము ఎలా నమ్మము అని సుమిత్ర అంటుంది, అప్పుడు నేను ఏ సమాధానం చెప్పను. అరవై వేల సంవత్సరాలు రాజ్యపాలనం చేసిన నేను బయటికి వెళుతుంటే, పట్టపగలు సురాపానం చేసిన బ్రాహ్మణుడు నా పక్కన వెళుతూ, యవ్వనంలో ఉన భార్య మాటకోసం ధర్మాత్ముడైన కొడుకుని అడవికి పంపించి బతుకుతున్నవాడు ఈ దశరథుడని దెప్పిపొడుస్తాడు. ఆనాడు నేను బతికినా చనిపోయినట్టే, నాకు అటువంటి అపకీర్తి తేవద్దు. నన్ను ఒక తల్లి-బిడ్డని చూసినట్టు, ఒక అక్క-చెల్లెలు అన్నదమ్ములని చూసినట్టు, ఒక దాసి యజమానిని చూసినట్టు చూసింది కౌసల్య. అపారమైన సుగుణాభి రాముడికి తల్లి అయ్యింది కౌసల్య, అయినా నేను కౌసల్యని ఒక్కనాడు సత్కరించలేదు. ఎందుకో సత్కరించలేదో తెలుసా, నీకు కోపంవస్తుందని సత్కరించలేదు. నేను ఎన్నడూ వారి గృహాలకి వెళ్ళలేదు, కేవలం నీయందే ప్రీతి పెట్టుకొని బ్రతికాను. నేను వృధ్యాప్యంలోకి వెళుతున్నాను కనుక ఎక్కువ కాలం బతకలేను అందుకని రాముడికి పట్టాభిషేకం చెయ్యడానికి ఒప్పుకున్నాను.
ఆ రాముడే అరణ్యాలకి వెళ్ళిననాడు నేను మరణిస్తాను, నేను మరణించానని తెలిసి కౌసల్య కూడా మరణిస్తుంది, నేనూ కౌసల్య మరణించాక ఈ రాజ్యం సంతోషంగా ఉండలేదు. నువ్వు భరతుడికి రాజ్యం ఇవ్వాలని చూస్తున్నావు, కాని భరతుడు రాజ్యం తీసుకుంటాడని నేనూ అనుకోను. చిట్టచివరికి అందరిచేత అపవాదు పొందిన దానివై, దిక్కులేని దానివై, నీ బాధ చెప్పుకోడానికి భర్త లేక విధవవైపోతావు. రాముడిని అడవులకు పంపితే నేను చనిపోతాను. నేను చనిపోయాక స్వర్గానికి వెళితే, అక్కడున్న ఋషులు, మహర్షులు నన్ను పిలిచి రాముడెలా ఉన్నాడని ఆడితే నేను ఏమి చెప్పగలను. నువ్వెవడివి నాన్న నన్ను అడవులకు పంపించడానికి అని నన్ను రాముడు ఖైదు చేస్తే, నేను చాలా సంతోషపడిపోతాను. కాని నా రాముడు అలా చెయ్యడు, నాన్న! నువ్వు చెప్పావు అందుకని నేను అరణ్యాలకి వెళుతున్నాను అని అంటాడు, అది నేను తట్టుకోలేను, రాముడు అరణ్యాలలో కష్టాలు పడుతుంటే నేను ఇక్కడ సుఖంగా ఎలా ఉండగలను. నిజంగా రాముడు అరణ్యాలకి వెళ్ళిపోవడం భరతుడి కోరికే అయితే, నా శరీరం పడిపోయాక నాకు తర్పణ పెట్టకూడదు, ఉదకక్రియ చెయ్యకూడదు, నువ్వు నా శవాన్ని ముట్టుకోకూడదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు, నీ రెండు కోరికలని ఉపసంహరించుకో, నేను అడుగుతున్నానని కాదు, ఒక ముసలివాడు, ఎందుకూ పనికిరాని వాడు అడుగుతున్నాడని నాకు నువ్వు బిక్ష పెట్టు, రాముడిని చూస్తూ చనిపోయే అదృష్టాన్ని నాకు ఇవ్వు ", దశరథుడు అలా చెప్పుతూ కైకేయ పాదాల మీద పడబోగా, తన పాదాల మీద పడుతున్నాడని తెలిసి కైకేయ పక్కకు జెరగగా, దశరథుడి శిరస్సు నేలకు తగిలి, స్పృహ కోల్పోయి పక్కుకు దొర్లి పడిపోయాడు.
కొంతసేపటికి దశరథుడికి తెలివి వచ్చాక కైకేయ ఇలా అనింది " ఏమయ్యా! ఇక్ష్వాకువంశములొ జన్మించానంటావు, సత్య-ధర్మములు పాటిస్తున్నానంటావు, రెండు వరాలు ఇచ్చానన్నావు, ఆ రెండు వరాలు నేను అడిగే సరికి నీకింత కష్టం కలిగిందా. ఎవరైనా వచ్చి రాముడేడని అడిగితే దండకారణ్యానికి పంపించానని చెప్పలేను అని అంటున్నావు కదా, మరి ఆనాడు నేను నీకు రెండుసార్లు ప్రాణబిక్ష పెడితే బతికినవాడివి, అలాంటి బతుకిచ్చిన కైకేయకి రెండు వరాలివ్వడం మానేసి అమాయకురాలిని చేసి వంచించినవాడ అని లోకం పిలవదా. వరాలు ఇవ్వడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నావు.
నీ వంశంలోని వాళ్ళు ఉత్తమ గతులకి వెళ్ళాలా, ఒకనాడు డేగ రూపంలో ఉన్న ఇంద్రుడు పావురం రూపంలో ఉన్న అగ్నిని తరుముతూ రాజు దెగ్గరికి వచ్చారు. ఆ పావురం రాజు కాళ్ళ మీద పడితే, రాజు ఆ పావురానికి శరణిచ్చాడు. ఆ పావురానికి శరణిచ్చావు బాగానే ఉంది, మరి నా ఆహారం సంగతేంటని అడిగాడు డేగ రూపంలో ఉన్న ఇంద్రుడు, ఆ రాజు యొక్క ధర్మనిష్ఠ తెలుసుకుందామని. నీకు పావురం మాంసం కావాలి కనుక ఆ మాంసం నేనిస్తాను అని, పావురాన్ని తక్కెటలో ఒక పక్క పెట్టి, మరొకపక్క తన శరీరం నుండి కోసిన కొంత మాంసాన్ని పెట్టి, ఆ మాంసాన్ని ఇచ్చినవాడు నీ వంశంలో పుట్టిన శిబి చక్రవర్తి. అలాగే ఒకనాడు అలర్కుడి దెగ్గరికి ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి నిలబడితే, నీకేమి కావాలో కోరుకోమన్నాడు రాజు. అయితే నీ కళ్ళని ఇచ్చేస్తావ అన్నాడు ఆ బ్రాహ్మణుడు. ఇస్తానన్నాడు కాబట్టి తన రెండు కళ్ళని తీసి ఇచ్చాడు అలర్కుడు. అలాంటి వంశంలో పుట్టి రెండు వరాలు భార్యకి ఇస్తానని చెప్పి ఇవ్వకుండా తప్పించుకు తిరగడానికి నీకు సిగ్గుగా లేదా.
దుర్మతే! ధర్మాన్ని వదిలేసి, రాముడికి పట్టాభిషేకం చేసేసి నువ్వు కౌసల్యతో రోజూ కులుకుదామని అనుకుంటున్నావా. నీ బతుకేంటో నాకు తెలీదనుకున్నావా. నాకు రెండు వరాలు ఇచ్చి తీరాల్సిందే. నువ్వు రాముడికి పట్టాభిషేకం చేస్తే, కౌసల్య రాజమాత అయితే, నేను కౌసల్యకి నమస్కారం చేస్తానని అనుకుంటున్నావా, ఒక్కనాటికి అది జెరగదు. నేను ప్రాణాలైనా విడిచిపెడతాను కాని ఒక్కనాటికి కౌసల్యకి నమస్కారం చెయ్యను. నా రెండు వరాలు నాకు ఇవ్వాల్సిందే " అని అనింది.
అప్పుడు దశరథుడు " ఒకవేళ ఇదే నీ పట్టుదల అయితే, నువ్వు నేలమీద పడి ముక్కలయిపో, నువ్వు నిలువునా మండిపో, సర్వనాశనమయిపో నీ కోరిక మాత్రం నేను తీర్చను, ఎందుకంటే నువ్వు ధర్మబద్ధమైన కోరిక కోరలేదు. లోకమంతా ఎవరిని రాజుగా కోరుకుంటుందో, ఎవరిమీద లోకమంతా ఒక అపవాదు వెయ్యలేదో అటువంటి మహాత్ముడిని ఎటువంటి కారణం లేకుండా అరణ్యాలకి పంపమంటున్నావు. నువ్వు నాశనమయిపోయినా సరే, నేను మాత్రం నీ కోరిక తీర్చను " అన్నాడు.
అలా కైకేయతో ఏడ్చి ఏడ్చి మాట్లాడుతూ దశరథుడు అప్పటికి 15 సార్లు స్పృహతప్పాడు. అలా ఏడుస్తూ కైకేయతో......
"రాముడు దండకారణ్యానికి వెళితే ఎంత కష్టమొస్తోందో,ప్రజలు ఎంత తల్లడిల్లిపోతారో నువ్వు ఊహించలేకపోతున్నావు. నేను అదృష్టవంతుడిని అయితే, అసలు రాముడిని అరణ్యాలకి వెళ్ళు అన్న మాట అనకుండా ఇప్పుడే మరణించాలని కోరుకుంటున్నాను. మరొక్కసారి నీ పాదాలు పట్టుకుంటాను " అని మళ్ళి కైకేయ పాదాల మీద పడబోగా, ఆవిడ మళ్ళి తప్పుకుని ఇలా అనింది............
No comments:
Post a Comment