Pages

Wednesday, 14 March 2012

రామాయణం @ కధ -12

అయోధ్య కాండ ప్రారంభము:

అప్పుడు దశరథుడు ఇలా అన్నాడు " అయ్యయ్యో జనకా, అలా అంటావేంటి, అసలు ఇచ్చేవాడు ఉంటె కదా పుచ్చుకునేవాడు ఉండేది, పదే పదే నీ కోడలిని చేసుకో అని అంటావు. నీ కుమార్తెని నా ఇంటికి కోడలిగా ఇస్తానన్నావు, ఔదార్యం నీది, దాతవి నువ్వు, పుచ్చుకునేవాడిని నేను" అని అన్నాడు.

ఈ పూటకి ప్రయాణం చేసి అలసిపోయాము, రేపు మాట్లాడుకుందామన్నారు. దశరథుడితో పాటు వచ్చిన భరతశత్రుఘ్నులు రామలక్ష్మనులతో కలిసారు. ఇన్ని రోజులు విశ్వామిత్రుడితో సాగిన ప్రయాణం గురించి వాళ్ళ నలుగురూ సంతోషంగా మాట్లాడుకున్నారు. దశరథుడితో పాటు వశిష్ఠుడుకాత్యాయనుడుజాబాలిమార్కండేయుడుకాశ్యపుడువామనుడు మొదలైన వాళ్ళు, విశ్వామిత్రుడు, శతానందుడు మరియు మిగిలిన మహర్షులందరూ ఒకచోట చేరారు. ఇంతమంది గొప్పవాళ్ళతో ఆ రాత్రి మిథిలా నగరం వెలిగిపోయింది. 

మరుసటి రోజూ ఉదయాన్నే దశరథుడు జనకా మహారాజుతో ఇలా అన్నాడు " మహానుభావుడైన విశ్వామిత్రుడి అనుమతితో నాకు ఎంతో కాలం పురోహితుడిగా ఉంటున్న, మా వంశాభివృధిని కోరుకునే వశిష్ఠ మహర్షి మా వంశం గురించి చెప్తారు" అన్నారు.

అయోధ్య నగరాన్ని పరిపాలించిన దశరథ మహారాజుగారి పూర్వీకుల గురించి చెప్తాను అని వశిష్ఠుడు చెప్పడం మొదలుపెట్టాడు........
మొదట బ్రహ్మగారు జన్మించారు, ఆ బ్రహ్మ నుండి మరీచి జన్మించాడు, మరీచికి కాశ్యపుడు, ఆయనకి సూర్యుడు, సూర్యుడికి మనువు, మనువుకి ఇక్ష్వాకు, ఇక్ష్వాకుకి కుక్షి, కుక్షికి వికుక్షి, వికుక్షికి బాణుడు, బాణుడికి అనరణ్యుడు, అనరణ్యుడికి పృథువ, పృథువకి త్రిశంకువు, త్రిశంకువుకి ధుంధుమారుడు, ధుంధుమారుడికి మాంధాత, మాంధాతకి సుసంధి, సుసంధికి ధ్రువసంధి మరియు ప్రసేనజిత్ అని ఇద్దరు కుమారులు, పెద్దవాడైన ధ్రువసంధికి భరతుడు, భరతుడికి అసితుడు, ఈ అసితుడ వరకు రాజ్యపాలనం చేశారు, ఈ అసితుడు హైహయ, తాలజంఘాశశబింద్వ అనే వంశాల వాళ్ళతో యుద్ధంలో ఓడిపోయాడు, తరువాత ఆయన హిమాలయాల పర్వతాలకి తన ఇద్దరి భార్యలతో వెళ్ళిపోయాడు, ఇంతలో ఒక భార్య గర్భం దాల్చింది మరొక భార్యకి సంతానం కలగలేదు. వేరొక భార్యకి సంతానం కలుగుతుందని ఇంకొక భార్య ఆమెకి విష ప్రయోగం చేసింది. అప్పుడే అక్కడికి వచ్చిచ్యవన మహర్షి ఒక భార్య కడుపులో ఉన్న పిండాన్ని సంహరించడానికి రెండవ భార్య విష ప్రయోగం చేసిందని చెప్పారు. విషప్రయోగం జెరిగినా చావకుండా ఆ విషంతోనే జన్మించాడు కనుక ఆ పుట్టినవాడికి సగరుడు అని ( గరము అంటె విషం) పేరు పెట్టారు. ఆ సగర చక్రవర్తి ఇద్దరి భార్యలలో ఒక భార్య కుమారులైన 60,000 మంది సగరులని కపిలమహర్షి భస్మం చేశారు. మరొక భార్య కుమారుడు అసమంజసుడు, అసమంజసుడికి అంశుమంతుడు, అంశుమంతుడికి దిలీపుడు, దిలీపుడికి భగీరథుడు, భగీరథుడికి కాకుత్సుడు, కాకుత్సుడికి రఘువు, రఘువుకి ప్రవృద్ధుడు (ఒకసారి ఈ ప్రవృద్ధుడు ధర్మం తప్పి ప్రవర్తిస్తే వశిష్ఠుడు ఆయనని శపించాడు, అప్పుడా రాజు తిరిగి వశిష్ఠుడిని శపిద్దామనుకుంటే ఆయన భార్య అడ్డుపడి కుల గురువుని శపించద్దు అనింది, కాని అప్పటికే తన కమండలంలోని నీళ్ళు చేతిలో పోసుకున్నాడు కనుక ఆ నీళ్ళని తిరిగి తన కాళ్ళ మీద పోసుకున్నాడు, అందుకని ఆయనని కల్మషపాదుడు అని పిలిచారు), ప్రవృద్ధుడికి శంఖణుడు, శంఖణుడికి సుదర్శనుడు, సుదర్శనుడికి అగ్నివర్ణుడు, అగ్నివర్ణుడికి శీఘ్రగుడు, శీఘ్రగుడికి మరువు, మరువుకి ప్రశుశ్రుకుడు, ప్రశుశ్రుకుడికి అంబరీషుడు, అంబరీషుడికి నహుషుడు, నహుషుడికి యయాతి, యయాతికి నాభాగుడు, నభాగుడికి అజుడు, అజుడికి దశరథుడు, దశరథుడికి రామలక్ష్మణ భరతశత్రుఘ్నులు. ఇది దశరథుడి వంశం, ఈ వంశంలోని రాజులు ఎన్నో వేల వేల సంవత్సరాలు రాజ్యపాలన చేసి, యాగాలు చేసి స్వర్గానికి వెళ్ళారు" అని వశిష్ఠుడు చెప్పాడు.

ఇదంతా విన్న జనకుడు ఎంతో సంతోషించాడు. మా వంశం గురించి కూడా చెప్తానని జనకుడు చెప్పడం ప్రారంభించాడు " మా వంశంలో మొదటివాడు నిమి చక్రవర్తి, నిమికి మిథి( ఈయన నిర్మించినదే మిథిలా నగరం), మిథికి ఉదావసువు, ఉదావసువుకి నందివర్ధణుడు, నందివర్ధనుడికి సుకేతు, సుకేతుకి దేవరాతుడు, దేవరాతుడికి బృహద్రథుడు, బృహద్రథుడికి శూరుడుమహావీరుడు అని ఇద్దరు కుమారులు, మహావీరుడికి సుధృతి, సుధృతికి ధృష్టకేతువు, ధృష్టకేతువుకి హర్యశ్వుడు, హర్యశ్వుడికి మరుడు, మరుడికి ప్రతీంధకుడు, ప్రతీంధకుడికి కీర్తిరథుడు, కీర్తిరథుడికి దేవమీఢ, దేవమీఢకి విబుధుడు, విబుధుడికి మహీధ్రకుడు, మహీధ్రకుడికి కీర్తిరాతుడు, కీర్తిరాతుడికిమహారోముడు, మహారోముడికి స్వర్ణరోముడు, స్వర్ణరోముడికి హ్రస్వరోముడు, హ్రస్వరోముడికి జనకుడు మరియు కుశధ్వజుడు, జనకుడికి సీతమ్మ అయోనిజగా లభించింది, తరవాత ఊర్మిళ పుట్టింది" అని జనకుడు చెప్పుకున్నాడు.
సాంకాశ్యం అనే నగరాన్ని పరిపాలిస్తున్న తన తమ్ముడైన కుశధ్వజుడిని తీసుకురమ్మని జనకుడు ఆదేశించాడు. కుశధ్వజుడు వచ్చాక....... 

వీర్య శుల్కాం మమ సుతాం సీతాం సుర సుత ఉపమాం |
ద్వితీయాం ఊర్మిలాం చైవ త్రిః వదామి న సంశయః ||


నా ఇద్దరు కుమార్తెలైన సీతమ్మని, ఊర్మిళని నీ కుమారులైన రామలక్ష్మణులకు ఇచ్చి వివాహం చెయ్యాలని అనుకుంటున్నాను, అలాగే నా తమ్ముడి కుమార్తెలైన  శ్రుతకీర్తిని శత్రుఘ్నుడికి ,మాండవిని భరతుడికి ఇచ్చి వివాహం చెయ్యాలని అనుకుంటున్నాను అని జనకుడు దశరథుడితో అన్నాడు. దశరథుడు సంతోషంగా ఒప్పుకున్నాడు. తరువాత దశరథుడిని తన ఇద్దరు కుమారులతో మిథిలా నగరంలో గోదానము, పితృకార్యము చెయ్యమన్నాడు. 

నేటికి రెండు రోజుల తరువాత ఉత్తర ఫాల్గుని నక్షత్రంతో కూడి భగుడు అధిష్టాన దేవతగా ఉండగా వివాహం చేద్దామని ఋషులు నిర్ణయించారు.

దశరథుడు గోదానము, పితృకార్యము మొదలైన కర్మలను పూర్తిచేసాడు. తరువాత ఆయన నాలుగు లక్షల గోవులు, (బంగారు కొమ్ములు కలిగినవి) ఒక్కో కుమారుడితో లక్ష గోవుల్ని దానం చేయించాడు. అలాగే బ్రాహ్మణులకి బంగారము, వెండి దానం చేశాడు. వశిష్ఠుడిని, విశ్వామిత్రుడిని పిలిచి వివాహానికి కావలసిన అగ్నివేది సిద్ధం చెయ్యమన్నారు.
దశరథ మహారాజు కన్యాదానం పుచ్చుకోడానికి బయట ఉండి జనక మహారాజుకి కబురు చేశారు. 
మిమ్మల్ని అక్కడెవరన్నా ద్వారపాలకులు ఆపుతున్నారా, దశరథుడి ఇంటికి జనకుడి ఇంటికి తేడా లేదు, మీరు తిన్నగా వచ్చేయండని జనకుడన్నాడు.
అగ్నివేది సిద్ధం చేశాక, అందులో అగ్నిహొత్రాన్ని నిక్షేపించారు, అక్షతలని సమాహొరణం చేయించారు, గంధ పుష్పాలని వేశారు. జనక మహారాజు ఆ అగ్నిహొత్రం దెగ్గర నిలబడ్డారు, రాముడు కూడా వచ్చి ఆ అగ్నిహొత్రం దెగ్గర నిలుచుని ఉండగా సీతమ్మని తీసుకొచ్చారు. అప్పుడు జనకుడు రాముడితో ఇలా అన్నాడు.................. 

ఇయం సీతా మమ సుతా సహ ధర్మ చరీ తవ |
ప్రతీచ్ఛ చ ఏనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణినా |
పతివ్రతా మహభాగా ఛాయ ఇవ అనుగతా సదా ||


రామయ్యా! నీకు సీత ఎవరో తెలీదు కదా, ఇదుగో ఈమే సీత, ఈమె నా కూతురు. నేను నీకు ఈమెని కామ పత్నిగా ఇవ్వడంలేదు, నీతోపాటు ధర్మంలో అనువర్తించడానికని ఈ పిల్లని ఇస్తున్నాను, అందుకని ధర్మపత్నిగా స్వీకరించు రామ. ఆడపిల్ల తండ్రిని కదా, అందుకని ఆనందంలో ఇన్ని మాటలు అనేశాను, కాబట్టి నన్ను క్షమించు, ఈమెని నువ్వు పుచ్చుకో, నీ చేతితో మా అమ్మాయి అరచేతిని బాగా రాసి పట్టుకో (సూర్యవంశం వాళ్ళకి అరచేతిని అరచేతితో రాసి పట్టుకుంటే సుముహుర్తం, మనం జీలకర్ర-బెల్లం పెడతాం సుముహుర్తానికి), ఈ క్షణం నుంచి మా అమ్మాయి ఏది చేసినా అది, నా భర్త అని నీ కోసమే చేస్తుంది. రామ! మాది విదేహ వంశం, మాకు దేహము నందు భ్రాంతి ఉండదు, నా కూతురిని అలా పెంచాను. ఒక ఏడాది తరువాత నా కూతురు నీతో కలిసి పుట్టింటికి వచ్చినప్పుడు నేను నేర్పిన సంప్రదాయాన్ని మరిచిపోతే, అది నీ వల్లే రామ, ఎందుకంటే నేను నేర్పినదాన్ని భర్త ఉద్ధరించాలి, ఆ ఉద్ధరించడంలో పొరపాటు వస్తే అది నీదే అవుతుంది, ఆమె నిన్ను నీడలా అనుగమిస్తుంది. [ఇదంతా పై శ్లోకం యొక్క రహస్యార్ధం.]

అలాగే లక్ష్మణుడికి ఊర్మిళతోను, భరతుడికి మాండవితోను, శత్రుఘ్నుడికి శృతకీర్తితోను వివాహం జెరిపించారు. 



అలా వివాహం జెరగగానే, దివ్యదుందుభిలు మ్రోగాయి, పైనుండి పుష్పాలు పడ్డాయి. దేవతలందరూ సంతోషించారు. ఆ రోజూ జెరిగిన సీతారాముల కల్యాణానికి సమస్త లోకాలు సంతోషించాయి. 

మరునాడు ఉదయం విశ్వామిత్రుడు అందరిని ఆశీర్వదించి ఉత్తర దిక్కుకి వెళ్ళిపోయారు. జనక మహారాజు కానుకగా ఏనుగులు, గుర్రాలు, వస్త్రాలు, ముత్యాలు, పగడాలు మొదలైనవి ఇచ్చాడు. అందరూ కలిసి అయోధ్య నగరం వైపుకి పయనమయ్యారు. 

అప్పుడు అనుకోకుండా ఆకాశంలో పక్షులు భయంకరంగా కూస్తున్నాయి, నిష్కారణంగా దిక్కులలో చీకటి కమ్ముతోంది, మంగళ ప్రదమైన వృక్షాలు నేలమీద పడుతున్నాయి, కాని మృగాలు మాత్రం ప్రదక్షిణంగా తిరుగుతున్నాయి. ఇదంతా చూసిన దశరథుడికి భయం వేసి, ఏమి జెరుగుతోందని వశిష్ఠుడిని అడిగాడు. ఆ శకునములను గమనించిన వశిష్ఠుడు, ఏదో దైవీసంబంధమైన విపత్తు వస్తోంది, కాని మృగములు ప్రదక్షిణగా తిరుగుతున్నాయి కనుక నువ్వు ఆ విపత్తుని అధిగమిస్తావన్నారు. 


ఇంతలోపే ప్రళయకాల రుద్రుడు వచ్చినట్టు విష్ణు చాపాన్ని పట్టుకొని పరశురాముడు వచ్చి, నేను ఈ రోజే విన్నాను, శివ ధనుస్సుని విరిచావంట, నీ గురించి విన్నాను రామ, ఏమిటి నీ గొప్పతనం, నువ్వు అంతటివాడివైతే ఈ విష్ణు చాపాన్ని ఎక్కుపెట్టి బాణాన్ని నారిలో సంధించు అన్నారు. ఈ మాటలు విన్న దశరథుడు హడలిపోయి, పరుగెత్తుకుంటూ పరశురాముడి దెగ్గరికి వచ్చి.......

మహానుభావ! ఈ భూమండలం మీద ఉన్న క్షత్రియులపై 21 సార్లు దండయాత్ర చేశావు, క్షత్రియులందరినీ సంహరించావు. ఇవ్వాళ హిమాలయాల మీద తపస్సు చేసుకుంటున్నావు. లేకలేక నాకు పిల్లలు పుట్టారు. వివాహాలు చేసుకొని ఇంటికి వెళుతున్నారు. నన్ను క్షమించు అని దశరథుడు ప్రాధేయపడ్డా పరశురాముడు రాముడినే పిలిచి విష్ణు చాపాన్ని ఎక్కుపెట్టమన్నాడు. 

No comments:

Post a Comment