Pages

Wednesday 2 May 2012

రామాయణం @ కధ -49


పూర్వజో అపి ఉక్త మాత్రః తు లక్ష్మణేన సుభాషితం |
సార గ్రాహీ మహాసారం ప్రతిజగ్రాహ రాఘవః ||

అవతలివారు చెప్పిన దానిలోని సారమును గ్రహించి, తన స్వరూపమును దిద్దుకోగలిగిన గొప్ప శక్తి కలిగిన రాముడు, లక్ష్మణుడు చెప్పిన మాటలని విని తన కోపాన్ని విడిచిపెట్టి " తమ్ముడా! నువ్వు చెప్పిన మాట యదార్ధం రా. కాని నన్ను అనుగమించి వచ్చిన సీత కనపడకపోతే నేను బతకలేను. ఈ పర్వత గుహలలో ఎన్నో గుహలు, పొదలు ఉన్నాయి. సీత వాటిల్లో ఎక్కడన్నా ఉందేమో వెతుకుదాము " అని రామలక్ష్మణులు ముందుకి బయలుదేరారు.


అలా ముందుకు వెళ్ళిన వాళ్ళకి ఒంటినిండా రక్తంతో తడిసిపోయి, ముక్కుకి రక్తంతో, రెక్కలు తెగిపోయి, ఒక పక్కకి కూర్చుని ఉన్న జటాయువు కనపడింది. అప్పుడు రాముడు ' రాక్షస రూపంలో ఉన్నవాడు ఈ పక్షి రూపాన్ని పొందాడు. నేను, లక్ష్మణుడు వెళ్ళగానే సీతని ఈ పక్షే తినేసింది. దీనిని నేను నమ్మాను, ఇప్పుడిది నాకు ప్రమాదం తెచ్చింది. అందుకని ఇప్పుడు నేను ఈ జటాయువు యొక్క శరీరాన్ని చీల్చేస్తాను' అని మనసులో అనుకొని, కొదండంలో బాణాన్ని సంధించి జటాయువు వైపు పరుగులు తీశాడు.



అప్పుడు జటాయువు " రామ! నువ్వు ఏ  ఓషధిని గూర్చి ఈ అరణ్యంలో వెతుకుతున్నావో, అటువంటి ఓషధీ స్వరూపమైన సీతమ్మని, నా ప్రాణాలని పట్టుకుపోయినవాడు రావణాసురుడయ్యా. నువ్వు, లక్ష్మణుడు లేని సమయంలో రావణాసురుడు సీతమ్మని అపహరించి తీసుకుపోయాడు. సీతమ్మని అపహరిస్తుంటే రావణాసురిడితో యుద్ధం చేశానయ్యా, నా శక్తి మేర  అడ్డుపడ్డాను. రావణుడి రథాన్ని, సారధిని, ధ్వజాన్ని పడగొట్టాను, కాని వాడిని నిగ్రహించలేకపోయాను. ఆకాశమార్గంలో సీతమ్మని ఎత్తుకుపోతూ ధూళిని, మేఘాల్ని సృష్టి చేశాడు, ఖడ్గంతో నా రెక్కలని కోసేశాడు, నా కాళ్ళు నరికేశాడు, అందుకని నేను ఏమి చెయ్యలేకపోయాను. రామ! నేను చచ్చిపోయానయ్య, ఇంకొక్కసారి నన్ను చంపకు " అన్నాడు.





జటాయువు మాటలు విన్న రాముడు, ఆ కొదండంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి జటాయువుని గట్టిగా కౌగలించుకుని ఏడిచాడు. ఆయన అలా ఏడుస్తున్నప్పుడు ఆ కోదండం చేతినుండి విడిపోయి కింద పడిపోయింది. రాముడితో పాటు లక్ష్మణుడు కూడా జటాయువు మీద పడి ఏడిచాడు. 

రాజ్యం భ్రష్టం వనే వాసః సీతా నష్టా మృతే ద్విజః |
ఈదృశీ ఇయం మమా లక్ష్మీః నిర్దహేత్ అపి పావకం ||

అప్పుడు రాముడు " నాకు రాజ్యం పోయింది, అరణ్యానికి వచ్చాను, సీతని పోగొట్టుకున్నాను, నమ్మిన స్నేహితుడైన జటాయువు మరణిస్తున్నాడు. ఇవ్వాళ నేను పొందుతున్న శోకానికి అగ్నిని తీసుకొచ్చి అక్కడ పెడితే, ఆ అగ్నిని నా శోకం కాల్చేస్తుంది.  అంత శోకంలో నేను ఉన్నాను లక్ష్మణా! " అన్నాడు. అలాగే " జటాయు! నాకోసం నువ్వు ఇంత కష్టపడ్డావు. ఒక్కసారి చెప్పు ఆ రావణుడు ఎక్కడ ఉంటాడు, అతని పౌరుష పరాక్రమాలు ఎటువంటివి, సీతని ఎటువైపుకి తీసుకెళ్ళాడు, ఏ రాజ్యాన్ని పరిపాలిస్తాడు, అతని స్వరూపం ఏమిటి. నాకు చెప్పు " అన్నాడు.



అప్పుడా జటాయువు " ఆ రావణుడు సీతమ్మని అపహరించి, మేఘములను, ధూళిని సృష్టించి, సీతమ్మని తన ఒడిలో కూర్చోపెట్టుకుని, ఆకాశ మార్గంలో దక్షిణ దిక్కుకి తీసుకెళ్ళిపోయాడు. ఇంతకన్నా చెప్పాలని ఉంది కాని, నా రెక్కలు తెగిపోవడం వలన, నా కళ్ళు కనపడడం మానేశాయి. నా నోటి వెంట మాట రావడంలేదు. నువ్వు మాట్లాడుతున్నది వినపడడం లేదు. నాలొ ఉన్న భావాలని చెప్పగలుగుతున్నానో, చెప్పలేకపోతున్నానో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. అన్నిటినీ మించి ఈ అరణ్యం అంతా నాకు బంగారంగా కనపడుతుంది. వింద అనే ముహూర్తంలో రావణుడు దొంగిలించాడు కనుక, నీ వస్తువు నీకు దొరుకుతుంది. ఆ ముహూర్తంలో దొంగలించబడ్డ వస్తువుని తిరిగి యజమాని పొందుతాడు. నువ్వు సీతమ్మని పొందుతావు, మీ ఇద్దరికీ పట్టాభిషేకం అవుతుంది, నువ్వు చాలా కాలం రాజ్యపాలన చేస్తావయ్య...." అని చెబుతుండగా ఆయన నోటి నుండి రక్తంతో కూడిన మాంసం ముద్దని కక్కి, తన చిట్టచివర ప్రాణాలని కూడా లాగి " ఆ రావణాసురుడి తండ్రి విశ్రవసో బ్రహ్మ, ఆయన తమ్ముడు కుబేరుడు....." అని చెప్పి, శిరస్సు పక్కకి పడిపోగా, ఆ జటాయువు మరణించాడు.





అప్పుడు రాముడు " చూశావ లక్ష్మణా! రావణుడు సీతని బలవంతంగా అపహరించుకు పోతుంటే, తన ప్రాణాలను అడ్డుపెట్టి ఈ పక్షి సీతని కాపాడే ప్రయత్నం చేసింది. మనం ఆలోచించి చూస్తే, ధర్మాన్ని పాటించేవారు, శూరులైన వారు, శరణాగతి చేసిన వారిని రక్షించేవారు మనుష్యులలోనే కాదు, జంతువులలో కూడా ఉన్నారు. సీతని అపహరించారు అన్న సంగతి తెలుసుకున్నప్పుడు నేను పొందిన దుఖం కన్నా, ఒక పక్షి నాకు ఉపకారం చెయ్యడం కోసమని తన ప్రాణాలు వదిలేసిందని తెలుసుకొని నేను ఇవ్వాళ ఎక్కువ దుఖం పొందుతున్నాను. నాయనా లక్ష్మణా! దశరథ మహారాజు మనకి ఎలా గౌరవించ దగ్గవాడో, ఆయనకి స్నేహితుడైన జటాయువు కూడా మనకి గౌరవింపదగ్గవాడు. ఆనాడు నేను తండ్రిగారికి ఎలా అంచేష్టి సంస్కారం చేశానో, జటాయువుకి ఇవ్వాళ అలా చెయ్యాలని అనుకుంటున్నాను.


అందుకని లక్ష్మణా! అక్కడ ఏనుగులు చెట్లని ఒరుసుకుంటూ వెళ్ళినప్పుడు, ఆ చెట్ల యొక్క ఎండుకర్రలు కిందపడతాయి, నువ్వు వెళ్ళి ఆ కర్రలని పట్టుకురా. అప్పుడు మనం ఈ జటాయువు శరీరాన్ని చితి మీద పెడదాము. ఆయన శరీరాన్ని అగ్నిలో కాల్చాక, రోహి మాంసాన్ని పిండంగా పెడదాము " అన్నాడు. (రోహి అనేది ఒక మృగం పేరు, జటాయువు మాంసం తింటాడు కనుక ఆయనకి ఆ మృగ మాంసంతో పిండం పెట్టారు). 

ఆ జటాయువుకి పిండాలు పెట్టాక గోదావరి నదికి వెళ్ళి ఉదకక్రియలు చేసి " నాచేత సంస్కరింపబడుతున్న ఓ జటాయువా! నేను నీకు అనుజ్ఞ ఇస్తున్నాను, నీకు ఇష్టం వచ్చిన ఉత్తమలోకాలకి వెళ్ళు" అని రాముడు అన్నాడు. తరువాత నదిలో జలతర్పణ చేశారు.

జటాయువు ఉత్తమలోకాలని పొందాడు అని వాల్మీకి మహర్షి చెప్పారు. 

తరువాత రామలక్ష్మణులు అక్కడినుంచి బయలుదేరి క్రౌంచారణ్యం లోకి ప్రవేశించారు. అతి భయంకరంగా ఉండే ఆ క్రౌంచారణ్యాన్ని రామలక్ష్మణులు దాటి కొంత దూరం వెళ్ళాక ఒక చీకటి గుహ కనబడింది. ఆ చీకటి గుహ దెగ్గర అలికిడి, చప్పుడు వినబడ్డాయి. అంతలోనే ఎక్కడినుంచో ఒక భయంకరమైన రాక్షస స్త్రీ పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆమె పేరు అయోముఖి. కడుపు కిందకి జారిపోయి, వికృతమైన రూపంతో ఉన్న ఆ అయోముఖికి లక్ష్మణుడి మీద వ్యామోహం పుట్టింది. అప్పుడామె పరుగు పరుగున వచ్చి లక్ష్మణుడిని పట్టుకొని " నువ్వు చాలా బాగున్నావు, మంచి యవ్వనంలో ఉన్నావు. మనిద్దరమూ ఈ పర్వాతాల మీద తిరుగుతూ క్రీడిద్దాము " అనింది. 


లక్ష్మణుడు వెంటనే తన ఖడ్గాన్ని తీసి ఆవిడ ముక్కుని, చెవులని, స్తనాలని నరికేశాడు. అప్పుడా అయోముఖ రక్తం కారుతుండగా ఏడుస్తూ, గుండెలు బాదుకుంటూ ఆ గుహలోకి పారిపోయింది. 

తరువాత వారు అక్కడినుండి కొంతదూరం ప్రయాణించాక, లక్ష్మణుడు రాముడితో ఇలా అన్నాడు " అన్నయ్యా! చాలా దుర్నిమిత్తాలు కనపడుతున్నాయి. ఏదో తీవ్రమైన భయం వేస్తుంది. ఇక్కడ  వంజులకం అనే పక్షి కూస్తోంది, ఈ పక్షి కూత ఎవరికి వినపడుతుందో వారికి జయం కలుగుతుంది, కాని పరమ దారుణమైన యుద్ధం జెరుగుతుంది........" అని చెపుతుండగా ఒక పెద్ద శబ్దం వినపడింది.


 ఈ శబ్దం ఏమిటి అని రామలక్ష్మణులు చూసేసరికి, సృష్టిలో కనీ వినీ ఎరుగనటువంటి రూపం వాళ్ళకి కనపడింది. దానికి తలకాయ, కాళ్ళు లేవు. కేవలం గుండెల దెగ్గరినుంచి నడుము కిందభాగం వరకు మాత్రమే దాని శరీరం ఉంది. అందులోనే ఒక పెద్ద నోరు, కన్ను ఉన్నాయి. ఆ కన్ను దూరంగా ఉన్న వస్తువులని కూడా చూస్తుంది. దానికి యోజనం పొడవున్న చేతులు ఉన్నాయి. అది నడవలేదు కనుక, ఆ చేతులతో అడవిలో తడిమి, దొరికిన దాన్ని తిని బతుకుతుంది. ఆ వింత స్వరూపాన్ని చూసి, అసలు ఇదేమిటిరా ఇలా ఉంది అని వాళ్ళు అనుకుంటున్నారు, ఇంతలోనే అది తన రెండు చేతులతో రామలక్ష్మణులను పట్టేసుకుంది. అప్పుడది "  నేను రాక్షసుడిని, నన్నుకబంధుడు అని అంటారు. అరణ్యానికి వచ్చి ఇటువైపునకు ఎందుకు వచ్చారు, ఇప్పుడు నేను మీ ఇద్దరినీ తినేస్తాను " అని అంటూ వాళ్ళని దెగ్గరిగా తీసుకునే ప్రయత్నంలో ఉండగా, లక్ష్మణుడు రాముడితో " మనం వీడిని ఉపేక్షిస్తే వీడు మనిద్దరినీ మింగేస్తాడు, అందుకని వీడి చేతులని ఖండించేద్దాము " అన్నాడు.   

అప్పుడు లక్ష్మణుడు ఎడమ బాహువుని, రాముడు కుడి బాహువుని నరికేశారు. అప్పుడా కబంధుడు " మీరు ఇద్దరు ఎవరు? " అని అడిగాడు. 

"ఈయనని రాముడు అంటారు, దశరరథుడి కుమారుడు, తండ్రి మాటకి కట్టుబడి 14 సంవత్సరాలు అరణ్యవాసానికి వచ్చాడు. ఈయన భార్య అయిన సీతమ్మని ఎవరో అపహరించారు. సీతమ్మని వెతుక్కుంటూ మేము ఈ మార్గంలో వచ్చాము. అసలు నువ్వు ఎవరు? నువ్వు ఇలా ఉన్నవేంటి? నీలాంటి రక్షాసుడిని మేము ఎప్పుడూ చూడలేదు " అని లక్ష్మణుడు అన్నాడు.

అప్పుడా కబంధుడు " నేను మీకు నా కథ చెబుతాను, కాని మీరు నాకు ఒక ఉపకారం చెయ్యాలి. అదేంటంటే, ఒక పెద్ద గొయ్య తీసి, లేకపోతె ఒక చితి పేర్చి, దానిమీద నన్ను పడుకోబెట్టి కాల్చెయ్యండి " అన్నాడు. " సరే, నువ్వు కోరినట్టే నిన్ను కల్చేస్తాములే కాని, సీతమ్మని ఎవరో రాక్షసుడు అపహరించాడు. నువ్వూ రాక్షసుడివి కదా, నీకేమన్నా తెలుసా " అని రామలక్ష్మణులు అడిగారు. 

అప్పుడా కబంధుడు " మీకు ఆ విషయాన్ని ఈ శరీరంతో చెప్పలేను. నన్ను కాల్చేస్తే, నాకు నా పూర్వ శరీరం వచ్చేస్తుంది. అప్పుడు ఆ శరీరంతో చెబుతాను. ఈ శరీరానికి అన్నీ జ్ఞాపకం లేవు, కాని ఆ శరీరానికి అన్నీ తెలుసు. కనుక నన్ను కాల్చెయ్యండి " అన్నాడు.

"కాలుస్తాములే కాని, నువ్వు అసలు ఎవరు, ఇలా ఎందుకు ఉన్నావు" అని రామలక్ష్మణులు అడిగారు.  

No comments:

Post a Comment