Pages

Monday 14 May 2012

రామాయణం @ కధ -62



స చతుర్ణాం ఉపాయానాం తృతీయం ఉపవర్ణయన్ |
భేదయామాస తాన్ సర్వాన్ వానరాన్ వాక్య సంపదా ||


సామ, దాన, బేధ, దండోపాయములలో ఈ వానరముల మీద సామము కాని, దానము కాని, దండోపాయము కాని పనికిరాదు. అందుకని వీళ్ళ మీద బేధము అనే ఉపాయమును మాత్రమే ప్రయోగించాలి అని హనుమంతుడు అనుకొని, అంగదుడితో " నాయనా అంగదా! నువ్వు చాలా గొప్పవాడివి. ఈ రాజ్యభారాన్ని అంతా వహించగలిగిన శక్తి కలిగినవాడివి. కాని ఇవ్వాళ నీ బుద్ధియందు చిన్న వైక్లవ్యం కనిపిస్తుంది. నువ్వు ప్రాయోపవేశం చేస్తాను, లేకపోతె ఈ గుహలోకి వెళ్ళిపోతాను అంటున్నావు, నీతో పాటు ఈ మిగిలిన వానరాలు కూడా అలాగే చేస్తాము అంటున్నాయి. కాని జెరగబోయే పరిణామం ఎలా ఉంటుందో నేను చెబుతాను, నువ్వు కొంచెం ఆలోచించుకో, ఆ తరువాత నిర్ణయం తీసుకో. 


ఒకవేళ మీరందరూ గుహలోకి వెళ్ళిపోయినా మీతో నేను రాను, జాంబవంతుడు రాడు, నీలుడు రాడు, సుహోత్రుడు రాడు. వెయ్యి పిడుగుల శక్తితో సమానమైన బాణములు లక్ష్మణుడి దెగ్గర చాలా ఉన్నాయి, ఒకవేళ మీరు గుహలోకి వెళ్ళినా లక్ష్మణుడి బాణాలు ఈ గుహని ముక్కలు చేస్తాయి. అప్పుడు మీరు ఎలా బ్రతుకుతారు. ఒకవేళ మీరందరూ గుహలోకి వెళ్ళినా కొంతకాలానికి మిగిలిన వానరాలకి తమ భార్యాపిల్లలు గుర్తుకొస్తారు. అప్పుడు వాళ్ళు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అప్పుడు నువ్వు బంధువు అన్నవాడు లేకుండా ఒక్కడివే అయిపోతావు, ఆనాడు ఒక చిన్న గడ్డిపరక కదిలినా నువ్వు భయపడతావు. నువ్వు అన్నట్టు సుగ్రీవుడు అసత్యవాది కాదు, ఆయన కూడా సమ్మతించాడు కనుకనే నీకు యువరాజ పట్టాభిషేకం చేశాడు. నువ్వు తిరిగొచ్చి పరిపాలన చెయ్యి. అన్నిటినీమించి సుగ్రీవుడికి సంతానం లేదు, నువ్వే ఈ రాజ్యానికి వారసుడివి. నామాట నమ్ము, సుగ్రీవుడు నీకు ఎన్నడూ అపాయం కల్పించడు. తిరిగి వెళ్ళి జెరిగిన విషయాలని సుగ్రీవుడికి చెబుదాము " అన్నాడు. 

అప్పుడు అంగదుడు " ఆనాడు మా నాన్న దుందుభిని చంపడానికని ఒక బిలంలోకి ప్రవేశించాడు. కాని సుగ్రీవుడికి రాజ్యము మీద ఉన్న కాంక్ష చేత మా నాన్న తిరిగిరాకుండా ఉండడం కోసమని ఆ బిలద్వారానికి ఒక శిలని అడ్డుపెట్టాడు. మా నాన్న బతికున్నాడని తెలిసి కూడా మా అమ్మని తన భార్యగా అనుభవించాడు. నాయందు కుమారుడన్న ప్రేమ సుగ్రీవుడికి ఎన్నడూ లేదు. నేను తిరిగొస్తే సాకు దొరికిందని నన్ను చంపుతాడు. సుగ్రీవుడి చేతిలో మరణించడం కన్నా ప్రాయోపవేశం చేసి మరణించడం నాకు ఇష్టం. మీరు వెళ్ళి నేను నా పినతండ్రికి, నా తల్లికి, నా పినతల్లికి, పెద్దలకి నమస్కారం చేశానని చెప్పండి " అని చెప్పి, ప్రాయోపవేశం చెయ్యడం కోసమని దర్భల మీద పడుకున్నాడు. 

అప్పుడా మిగతా వానరాలు కూడా అంగదుడిలాగానే దర్భల మీద పడుకున్నారు. అలా కింద పడుకున్నవాళ్ళు రామ కథని గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. 

సాంపాతిః నామ నామ్నా తు చిర జీవీ విహంగమః |
భ్రాతా జటాయుషః శ్రీమాన్ ప్రఖ్యాత బల పౌరుషః ||



వీళ్ళందరూ రామ కథ చెప్పుకుంటూ ఉండగా అక్కడున్న కొండ శిఖరం మీదకి ఒక పెద్ద పక్షి వచ్చింది, కాని దానికి రెక్కలు లేవు. ఆ పక్షి ఇంతమంది వానరాలని చూసి ' ఆహా ఏమి నా అదృష్టము, ఒకడిని తింటే మిగిలిన వారు పారిపోతారు, కాని వీళ్ళు ప్రాయోపవేశం చేస్తున్నారు కనుక ఎవరూ కదలరు. మెల్లగా ఒక్కొక్కరిని తినచ్చు ' అని ఆ పక్షి అనుకుంది.

ఆ వానరాలు చెప్పుకుంటున్న రామ కథ వింటున్న ఆ పక్షి గట్టిగా ఒక మాట అనింది " నా మనస్సు కంపించి పోయేటట్టుగా, నా సోదరుడైన  జటాయువు రావణాసురుడి చేత వధింపబడ్డాడన్న మాట చెప్పినవాడు ఎవడురా ఇక్కడ. అసలు నా తమ్ముడు అక్కడికి ఎందుకు వెళ్ళాడు. దశరథ మహారాజు జటాయువుకి స్నేహితుడు, దశరథుడు ఏ కారణం చేత మరణించాడు. నా రెక్కలు కాలిపోయాయి, నా అంతట నేను మీ దెగ్గర కుర్చోలేను. ఎవరన్నా వచ్చి నన్ను దించండిరా " అనింది. 

కాని కింద పడుకున్న వానరాలు ఒకరితో ఒకరు " అదంతా ఒట్టిదే, మనన్ని తినెయ్యడానికి అలా అంటుంది. మనం అక్కడికి వెళితే అది మనల్ని తినేస్తుంది " అన్నారు.


వాళ్ళల్లో ఒకడు అన్నాడు " అది మనన్ని నిజంగా  చంపేసిందే అనుకో, మనం ప్రాయోపవేశం చేస్తున్నాము కదా మరి దానిని కిందకు  తీసుకురావటానికి భయం ఎందుకు, వెళ్ళి తీసుకురండి " అన్నాడు.

అప్పడు అంగదుడు వెళ్ళి ఆ పక్షిని తీసుకొచ్చాడు. అప్పుడా వానరాలన్నీ ఆ పక్షి చుట్టూ చేరాయి. అప్పుడాయన "అసలు మా జటాయువు ఏమయ్యాడు?" అని అడిగాడు.

అంగదుడు మళ్ళి రామ కథ చెప్పడం ప్రారంభించాడు. అంగదుడు రామ కథ మొత్తం చెప్పి ' నువ్వు ఎవరు? ' అని ఆ పక్షిని ప్రశ్నించాడు.

అప్పుడా పక్షి " సంపాతి అనబడే నేను, జటాయువు సోదరులము. సూర్యుడు ఉదయించినప్పటి నుంచి అస్తమించేలోపు ఆయనతో సమానంగా ప్రయాణం చెయ్యాలని మేము ఒకనాడు పందెం కాసుకున్నాము. అనుకున్న ప్రకారం నేను, జటాయువు సూర్యుడి వెనకాల వెళ్ళిపోతున్నాము. అలా వెళుతుండగా మిట్ట మధ్యాహ్నం వేళ మేము సూర్యుడికి దెగ్గరగా వచ్చాము. అప్పుడా సూర్యుడి వేడిని భరించలేక జటాయువు స్పృహతప్పి కిందపడి పోతున్నాడు. పెద్దవాడిని కనుక తమ్ముడిని రక్షించాలని నేను నా రెక్కలని జటాయువుకి అడ్డంగా పెట్టాను. అప్పుడా సూర్యుడి వేడికి నా రెక్కలు కాలిపోయి వింధ్య పర్వతం మీద పడిపోయాను. కాని నా తమ్ముడు ఎటు వెళ్ళిపోయాడో నాకు తెలీలేదు. మళ్ళి ఇంతకాలానికి మీవల్ల నా తమ్ముడి గురించి విన్నాను. నా తమ్ముడు చనిపోయాడన్న వార్త వినడం వల్ల నాకు చాలా బాధ కలుగుతోంది. చనిపోయిన నా తమ్ముడికి జలతర్పణ ఇవ్వాలి అనుకుంటున్నాను, కాని నేను ఎగరలేను. మీరు నన్ను తీసుకెళ్ళి ఆ సముద్ర జలాల దెగ్గర దింపండి, నేను నా తమ్ముడికి తర్పణలు ఇస్తాను " అన్నాడు. 

సంపాతి కోరిక మేరకు వాళ్ళు ఆయనని సముద్ర తీరానికి తీసుకువెళ్ళారు, ఆయన అక్కడ జటాయువుకి తర్పణలు సమర్పించాడు. 



మళ్ళి వెనక్కి తిరిగొచ్చాక ఆ వానరాలు సంపాతితో " జటాయువు రామకార్యంలో సహాయం చేశాడు, నువ్వు కూడా రామకార్యంలో ఏమన్నా సహాయం చెయ్యగలవా. నీకు సీతమ్మ జాడ ఏమన్నా తెలుసా " అని అడిగారు.

నిర్దగ్ధ పక్షో గృధ్రో అహం గత వీర్యః ప్లవం గమాః |
వాఙ్ మాత్రేణ తు రామస్య కరిష్యే సాహ్యం ఉత్తమం ||

అప్పుడా సంపాతి " రెక్కలు కాలిపోయాయి నాకు, ఇవ్వాళ ఇలా పడి ఉన్నాను, ఇంతకన్నా ఏమి చెయ్యగలను. కాని రామకార్యానికి నేను మాట మాత్రం సహాయం చేస్తాను. సీతమ్మని రావణుడు ఆకాశ మార్గంలో తీసుకెళుతున్నప్పుడు ఆమె ఆభారణాలని కొంగుకి చుట్టి విడిచిపెట్టడం నేను చూశాను. ఆ రావణాసురుడు విశ్రవసోబ్రహ్మ యొక్క కుమారుడు, సాక్షాత్తు కుబేరుడి తమ్ముడు. ఆయన లంకా నగరానికి అధినేత. ఈ సముద్రానికి దక్షిణ దిక్కున 100 యోజనముల అవతల లంక ఉంటుంది. ఆ లంకలో ఎక్కడ చూసినా బంగారు స్తంభములతో నిర్మింపబడ్డ భవనాలు ఉంటాయి. అటువంటి లంకా నగరంలో దీనురాలైపచ్చని పట్టు పుట్టం కట్టుకుని, ఏడుస్తూ, చుట్టూ రాక్షస స్త్రీలు ఉండగా సీతమ్మ ఉంది. నాకు ఇవన్నీ ఎలా తెలుసని అడుగుతారేమో, నేను ఇక్కడే కూర్చుని సీతమ్మని చూడగలను. నేను దివ్య దృష్టితో చూడగలను, మాకు ఆ శక్తి ఉంది. ఎందుకంటే, భూమి నుండి ఆకాశానికి కొన్ని అంతరములు ఉన్నాయి. మొదటి అంతరములో తమ కాళ్ళ దెగ్గర ఉన్న ధాన్యాన్ని ఏరుకొని తినే కులింగములు అనే పక్షులు ఎగురుతాయి. రెండవ అంతరంలో చెట్ల మీద ఉండే ఫలాలని తినే పక్షులు ఎగురుతాయి. మూడవ అంతరంలో భాసములుక్రౌంచములు ఎగురుతాయి. నాలుగవ అంతరంలో డేగలు ఎగురుతాయి. అయిదవ అంతరంలో గ్రద్దలు ఎగురుతాయి. ఆరవ అంతరంలో హంసలు ఎగురుతాయి. ఏడవ అంతరంలో వినతా పుత్రులమైన వైనతేయులము కాబట్టి  మేము ఎగురుతాము. అందుకని మేము తినే తిండి చేత, సహజంగా మేము జన్మించిన జాతి చేత 100 యోజనముల అవతల ఉన్న విషయాన్ని కూడా ఇక్కడే ఉండి చూడగల దృష్టిశక్తి మా కంటికి ఉంటుంది. 

అదుగో దూరంగా లంకా పట్టణంలో, అశోక వనంలో సీతమ్మ కూర్చుని ఉండడం నాకు కనిపిస్తుంది. మీలో ఎవరైనా సాహసం చేసి 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళగలిగిన వాడు ఉంటె, సీతమ్మ యొక్క దర్శనం చెయ్యవచ్చు

No comments:

Post a Comment