Pages

Monday 7 May 2012

రామాయణం @ కధ -54



సముద్రాత్ పశ్చిమాత్ పూర్వం దక్షిణాద్ అపి చ ఉత్తరం |
క్రామతి అనుదితే సూర్యే వాలీ వ్యపగత క్లమః ||


అప్పుడు సుగ్రీవుడు " రామ తొందరపడకు, నీకు ఒక విషయం చెబుతాను విను. సూర్యోదయానికి ముందరే వాలి నిద్రలేస్తాడు. అప్పుడు తన అంతఃపురం నుంచి ఒక్కసారి ఎగిరి తూర్పు సముద్ర తీరం దెగ్గర దిగుతాడు. అక్కడ సంధ్యావందనం చేసి ఒకే దూకులో పశ్చిమ సముద్రతీరం దెగ్గర దిగుతాడు. మళ్ళి అక్కడ సంధ్యావందనం చేసి ఒకే దూకులో ఉత్తర సముద్రతీరం దెగ్గర దిగుతాడు. మళ్ళి అక్కడ సంధ్యావందనం చేసి ఒకే దూకులో దక్షిణ దిక్కుకి దూకుతాడు. ఇలా నాలుగు సముద్రాల దెగ్గర సూర్యుడు ఉదయించేలోపు సంధ్యావందనం చేస్తాడు. దానితో పాటు నీకు ఇంకొక విషయం చెబుతాను రామ " అని రాముడిని తీసుకువెళ్ళి ఒక పర్వతాన్ని చూపించి,  "చూశావ ఈ పర్వతాలు. వాటికి ఎంత పెద్ద శిఖరాలు ఉన్నాయో చూశావ. వాలి సంధ్యావందనం చేశాక ఇంటికి వెళ్ళి కొన్ని పాలు తాగి మళ్ళి ఈ అరణ్యానికి వస్తాడు. ఇక్కడ ఉన్న ఈ పర్వత శిఖరాలని ఊపి విరగ్గొడతాడు. అప్పుడు వాటిని గాలిలోకి విసిరి బంతులు పట్టుకున్నట్టు పట్టుకుంటాడు " అని చెప్పి, రాముడిని మరొక్క ప్రదేశానికి తీసుకువెళ్ళి, 



" పూర్వం దుందుభి అని ఒక రాక్షసుడు ఉండేవాడు. వాడికి ఒంట్లో బలం ఉందన్న పొగరు చేత ఒకరోజు సముద్రుడి దెగ్గరికి వెళ్ళి తనతో యుద్ధం చెయ్యమన్నాడు. నీతో నాకు యుద్ధం ఏమిటి, నీ బలం ఎక్కడ నా బలం ఎక్కడ. నేను నీతో యుద్ధ చెయ్యలేను అని సముద్రుడు అన్నాడు. అప్పుడా దుందుభి ' నువ్వు నాతో యుద్ధం చెయ్యలేనంటె నేను నిన్ను వదలను, నాతో యుద్ధం చెయ్యగలిగిన వాడిని నాకు చూపించు ' అన్నాడు. అప్పుడా సముద్రుడు ' హిమవంతుడని ఉత్తర భారతదేశంలో ఒక పెద్ద పర్వతం ఉంది, అది మంచు పర్వతం. ఆయన కూతురు పార్వతీ దేవి, ఆ పార్వతీ దేవిని పరమశివుడికి ఇచ్చి వివాహం చేశారు. ఆయన మీద గొప్ప గొప్ప అరణ్యాలు, గుహలు ఉన్నాయి. నువ్వు ఆ హిమవంతుడితో యుద్ధం చెయ్యి ' అన్నాడు. 

అప్పుడా దుందుభి హిమవంత పర్వతం దెగ్గరికి వెళ్ళి ఆ పర్వత శిఖరాలని పీకేసి ముక్కలు చేస్తున్నాడు. దుందుభి చేస్తున్న అల్లరికి హిమవంతుడు పరుగు పరుగున వచ్చాడు. అప్పుడా దుందుభి హిమవంతుడిని యుద్ధానికి రమ్మన్నాడు, నాకు ఎవరితోనూ యుద్ధం చెయ్యాలని లేదు, నేను యుద్ధం చెయ్యను అని హిమవంతుడు అన్నాడు. అప్పుడా దుందుభి ' నువ్వు కూడా ఇలాగంటే ఎలా. సముద్రుడు కూడా నీలాగే యుద్ధం చెయ్యనన్నాడు. పోనీ నాతో యుద్ధం చేసేవాడి పేరు చెప్పు ' అన్నాడు. అప్పుడు హిమవంతుడు ' నీ ఒంటి తీట తీర్చగలిగినవాడు ఒకడున్నాడు. కిష్కిందా రాజ్యాన్ని ఏలే వాలి ఉన్నాడు. మంచి బలవంతుడు. ఆయన నీతో యుద్ధం చేస్తాడు ' అని చెప్పాడు. 



అప్పుడా దుందుభి సంతోషంగా కిష్కిందకి వెళ్ళి, అక్కడున్న చెట్లని విరిచి, ఆ కిష్కింద ద్వారాన్ని పగులగొట్టి పెద్ద అల్లరి చేశాడు. భార్యలతో కామమోహితుడై రమిస్తున్న వాలి ఈ అల్లరికి బయటకి వచ్చాడు. ఆ దుందుభి వాలిని చూసి ' ఛి, భార్యలతో కామం అనుభవిస్తున్నావా. నా కోపాన్ని రేపటిదాకా ఆపుకుంటాను. పో, నీ భార్యలతో కామం అనుభవించు. నువ్వు ఈ రాత్రి నీ భార్యలతో హాయిగా భోగం అనుభవించు, నీకు స్నేహితులైన వారిని పిలిచి వారికి కానుకలు ఇవ్వు, నీతో సమానమైన వాడికి పట్టాభిషేకం చేసెయ్యి. తాగి ఉన్నవాడిని, కామం అనుభవిస్తున్న వాడిని, అప్రమత్తంగా లేనివాడిని, యుద్ధం నుంచి పారిపోతున్నవాడిని, ఆయుధం లేనివాడిని చంపితే పసిపిల్లాడిని చంపిన పాపం వస్తుంది, అందుకని నేను నిన్ను వదిలేస్తున్నాను. ఎలాగోలా ఈ రాత్రికి ఇక్కడ కూర్చొని ఉంటాను. రేపు పొద్దున్న రా, నిన్ను చంపి అవతల పడేస్తాను ' అన్నాడు.

అప్పుడా వాలి ' నువ్వు నా గురించి అంతగా బెంగ పెట్టుకోమాకు. నేను తాగి ఉన్నా కూడా, అది వీరరసం తాగినవాడితో సమానం, రా యుద్ధానికి ' అని, అడ్డువచ్చిన భార్యలని పక్కకు తోసేసి దుందుభి మీదకి యుద్ధానికి వెళ్ళాడు. ఇంద్రుడు ఇచ్చిన మాలని వాలి తన మెడలో వేసుకుని దుందుభి తల మీద ఒక్క గుద్దు గుద్దాడు. ఆ దెబ్బకి దుందుభి ముక్కు నుండి, చెవుల నుండి రక్తం కారి కిందపడిపోయాడు. ఆ హొరాహొరి యుద్ధంలో వాలి దుందుభిని సంహరించాడు. అప్పుడాయన ఆ దుందుభి శరీరాన్ని గిరగిర తిప్పుతూ విసిరేశాడు. అప్పుడది గాలిలో యోజన దూరం ఎగురుకుంటూ వెళ్ళి మతంగ మహర్షి ఆశ్రమం దెగ్గర పడింది. అలా పడిపోవడంలో ఆశ్రమం అంతా రక్తంతో  తడిసిపోయింది. అప్పుడా మతంగ మహర్షి బయటకి వచ్చి దివ్య దృష్టితో చూసి ' ఎవడురా ఒళ్ళు కొవ్వెక్కి దుందుభి కళేబరాన్ని ఇటు విసిరినవాడు, ఈ శరీరాన్ని విసిరిన దౌర్భాగ్యుడు ఇక్కడికి వస్తే వాడి తల వెయ్యి వ్రక్కలయ్యి మరణిస్తాడు 'అని చెప్పి, ' ఇక్కడ మీరందరూ మీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు. వాలికి సంబంధించినవాడు ఎవడైనా సరే ఇక్కడి చెట్లని పాడుచేస్తూ తిరిగితే, రేపటి తరువాత వాళ్ళు మరణిస్తారని శపిస్తాను. నేను శపించే లోపల మీ అంతట మీరు ఇక్కడి నుండి వెళ్ళిపొండి ' అన్నాడు.  

అప్పుడు అక్కడున్నటువంటి వానరాలు ఆ పర్వతాన్ని ఖాళీ చేసి వాలి దెగ్గరికి పారిపోయి మతంగ మహర్షి యొక్క శాపం గురించి వివరించారు. అందుకని వాలి ఈ పర్వతం వైపు కనీసం చూడను కూడా చూడడు. నేను బతకాలంటే ఈ బ్రహ్మాండంలో వాలి రాని ప్రదేశం ఇదే, అందుకని నేను ఇక్కడ ఉంటున్నాను. ఇంతకీ నేను నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకోచ్చానో తెలుసా, అదిగో అక్కడ ఎదురుగుండా కనపడుతుందే పెద్ద తెల్లటి పర్వతం లాంటిది, అదే దుందుభి యొక్క కాయం. ఆ అస్థిపంజరం ఇప్పుడు పర్వతంలా అయిపోయింది " అన్నాడు.

అప్పుడు సుగ్రీవుడు " రామ! నేను ఇలా అంటున్నానని ఏమి అనుకోవద్దు. మా వాలి పౌరుష పరాక్రమాలు అంటె ఏమిటో విన్నావు కదా. ఇది విన్న తరువాత కూడా నువ్వు వాలిని చంపగలను అని అనుకుంటున్నావా? చంపగలిగే ధైర్యం ఉందా? వాలి ఎన్నడూ ఎవరి చేత ఒడింపబడినవాడు కాదు, జీవితంలో ఓటమి అన్నది తెలీదు వాలికి. వాలి పేరు చెబితేనే పారిపోతారు. 15 సంవత్సరాలు రాత్రి-పగలు గోలభుడు అనే గంధర్వుడితో యుద్ధం చేసి ఆయనకి సంహరించాడు. నీను ఇంకొక విషయం చూపిస్తాను, ఇక్కడ 7 సాల వృక్షములు వరుసగా ఉన్నాయి కదా. మా వాలి రోజూ సంధ్యావందనం అయ్యాక ఇక్కడికి వచ్చి ఈ పెద్ద సాల వృక్షాన్ని చేతులతో కదుపుతాడు. ఆ కుదుపుకి లేత చిగురుటాకులు కూడా రాలిపోయి ఆ చెట్టు మోడుగా నిలబడుతుంది. వాలి బలం గురించి విన్నాక కూడా నీకు వాలిని చంపగలను అన్న ధైర్యం ఉందా రామ? " అన్నాడు.

సుగ్రీవుడు చెప్పిన మాటలు విన్న లక్ష్మణుడు ఒక చిన్న నవ్వు నవ్వి " మీ వాలి చాలా గొప్పవాడు అని చెబుతున్నావు కదా. వాలిని మా అన్నయ్య చంపగలడు, అని ఏమి చేస్తే నువ్వు నమ్ముతావు " అని అడిగాడు.

అప్పుడా సుగ్రీవుడు " మా వాలి ఈ ఏడు చెట్లని కుదిపెయ్యగలడు. రాముడు పోని అంత చెయ్యక్కరలేదు, బాణం పెట్టి ఒక సాల వృక్షాన్ని కొడితే నేను నమ్ముతాను. ఆనాడు దుందుభి యొక్క శరీరాన్ని మా అన్నయ్య విసిరేస్తే అది యోజనం దూరం వెళ్ళి పడింది. రాముడిని ఈ అస్థిపంజరాన్ని తన కాలితో తన్నమనండి, 200 ధనుస్సుల దూరం కాని రాముడు తంతే నేను నమ్ముతాను " అని లక్ష్మణుడితో అన్నాడు.

అప్పడు రాముడు " సరేనయ్యా అలాగే చేస్తాను. నీకు నమ్మకం కలిగించడం కోసం నువ్వు చెప్పిన పని తప్పకుండా చేస్తాను " అన్నాడు.



రాఘవో దుందుభేః కాయం పాద అంగుష్ఠేన లీలయా |
తోలయిత్వా మహాబాహుః చిక్షేప దశ యోజనం ||




సుగ్రీవుడు చెప్పినట్టుగా రాముడు ఆ దుందుభి కళేబరాన్ని తన బొటను వేలితో తంతే అది 10 యోజనాల దూరం వెళ్ళి పడింది. అప్పుడు రాముడు సుగ్రీవుడి వంక నమ్మకం కుదిరిందా అన్నట్టు చూశాడు. కాని సుగ్రీవుడు " ఆనాడు వాలి ఈ కళేబరాన్ని విసిరినప్పుడు ఇది రక్తమాంసాలతో పచ్చిగా, చాలా బరువుగా ఉంది. అప్పటికే మా అన్నయ్య ఈ దుందుభితో చాలాసేపు యుద్ధం చేసి ఉన్నాడు, దానికి తోడు తాగి ఉన్నాడు, తన భార్యలతో రమిస్తూ బయటకి వచ్చాడు, కావున అనేకరకములుగా బడలిపోయిన శరీరంతో ఉన్నాడు. కాని రాముడు చాలా ఉత్సాహంగా ఉన్నాడు, మద్యాన్ని సేవించి లేడు, పరీక్షకి నిలబడుతున్నాను అనే పూనికతో ఉన్నాడు. ఆనాడు మా అన్నయ్య విసిరింది ఒక పచ్చి శరీరం, అది ఒక యోజనం వెళ్ళి పడింది. ఈనాడు రాముడు తన్నింది ఎండిపోయిన కళేబరం, దానిని 10 యోజనాలు తన్నడంలో పెద్ద గొప్పేముంది. ఆ సాల వృక్షాన్ని కూడా కొట్టమను, అప్పుడు నాకు కొంత నమ్మకం కలుగుతుంది. అప్పుడు మనం వాలిని సంహరించడానికి వెళదాము " అన్నాడు. 




అప్పుడు రాముడు ఒక బంగారు బాణాన్ని చేతితో పట్టుకొని, వింటినారికి సంధించి, గురి చూసి ఆ 7 సాల వృక్షముల వైపు విడిచిపెట్టాడు. కనురెప్ప మూసి తెరిచే లోపల ఆ బాణం 7 సాల వృక్షాలనీ పడగొట్టేసి, ఎదురుగా ఉన్నటువంటి పర్వత శిఖరాన్ని తొలిచేసి, భూమిలో పాతాళ లోకం వరకూ వెళ్ళి, మళ్ళి తిరిగొచ్చి రాముడి యొక్క అమ్ములపొదిలో కూర్చుండిపోయింది. 


రాముడి శక్తి ఏమిటో చూశిన సుగ్రీవుడు వెంటనే రాముడి పాదాలకి తన శిరస్సు తగిలేటట్టు పడిపోయాడు. అప్పుడాయన కిరీటం రాముడి పాదాల మీద పడిపోయింది. అప్పుడా సుగ్రీవుడు " రామ! నీ బాణానికి ఉన్న వేగం ఇంద్రుడి బాణానికి కూడా లేదు. నేను ఏమో అనుకున్నాను, ఇంక వాలి ఏమిటి. నువ్వు బాణ ప్రయోగం చేస్తే వజ్రాయుధం పట్టుకున్న ఇంద్రుడి శిరస్సు కూడా కింద పడిపోతుంది. నీ బాణానికి ఉన్న వేగం సామాన్యమైనది కాదు, వాలి దెగ్గరికి వెళదాము పద " అన్నాడు.

"తప్పకుండా సుగ్రీవ, బయలుదేరదాము", అని అందరూ బయలుదేరారు. ముందు సుగ్రీవుడు వేగంగా వెళుతున్నాడు, ఆయన వెనకాల రామలక్ష్మణులు, సుగ్రీవుడి మంత్రులైన హనుమంతుడు,నీలుడునలుడు మొదలైన వారు వెళుతున్నారు. 

No comments:

Post a Comment