Pages

Thursday 24 May 2012

రామాయణం @ కధ -72



హనుమంతుడు సీతమ్మ దెగ్గర సెలవు తీసుకొని ఉత్తర దిక్కుకి వచ్చి " లంకా పట్టణానికి రావడమూ అయిపోయింది, సీతమ్మ తల్లి దర్శనం చెయ్యడమూ అయిపోయింది. ఆ రావణుడికి ఒక మాట చెబుదాము, ఏమన్నా ప్రయోజనం ఉంటుందేమో. కాని దర్శనం ఇవ్వమని అడిగితే వాడు ఎలాగు ఇవ్వడు, అందుకని వీడికి అత్యంత ప్రియమైన ఈ ప్రమదా వనాన్ని(అశోక వనం) నాశనం చేస్తే వాడే నన్ను పిలుస్తాడు " అని అనుకొని, భీమరూపుడై ఆ అశోక వనం మీద ఎగిరాడు. అప్పుడాయన తొడల వేగానికి అక్కడున్న చెట్లు విరిగిపోయాయి. అలాగే హనుమ చేసిన మహా నాదానికి అక్కడున్న పక్షులు గుండెలు బద్దలై కిందపడిపోయాయి. ఆయన అక్కడున్న సరోవరారo లోని నీళ్ళని బయటకి తోసేశాడు. 


అలా హనుమ చేస్తున్న విధ్వంసానికి అక్కడున్న రాక్షసులు ఉలిక్కిపడి లేచారు. 

అక్కడున్న రాక్షస స్త్రీలు సీతమ్మ దెగ్గరికి వచ్చి " ఈ కోతి చాలా చిన్నగా ఉన్నప్పుడు ఈ చెట్టు మీద కూర్చుని ఉండడం చూశాము. ఆ కోతి నీ దెగ్గరికి వచ్చి కిచకిచలాడినట్టు మాకు అనుమానం, ఆ కోతి ఎవరు? " అని అడిగారు.

అప్పుడు సీతమ్మ అనింది " పాము కాళ్ళు పాముకి తెలియాలి. ఆయన రాక్షసుడో, వేరొకడో తెలుసుకునే శక్తి నాకెక్కడ ఉంది. ఆయనెవరో మీకే తెలియాలి, నాకు తెలియదు " అనింది. 


అప్పుడా రాక్షస స్త్రీలు పరుగు పరుగున రావణుడి దెగ్గరికి వెళ్ళి " ఎక్కడనుంచి వచ్చిందో కాని మహా వానరము ఒకటి వచ్చింది. అది ఇంద్రుడి దూతో, కుబేరుడి దూతో, విష్ణువు దూతో, యముడి దూతో మాకు తెలీదు. అది అశోక వనం అంతటినీ నాశనం చేసింది, కాని సీత కూర్చున్న శింశుపా వృక్షాన్ని మాత్రం అది వదిలిపెట్టేసింది. అలసట చేత వదిలిపెట్టిందో, కావాలని వదిలిపెట్టిందో తెలీదు. అలసట అని అనుకోడానికి వీలులేదు, ఎందుకంటే ఇంత అశోక వనాన్ని నాశనం చేసిన వానరానికి శింశుపా వృక్షాన్ని నాశనం చెయ్యడం పెద్ద లెక్కా, అది కావాలనే వదిలిపెట్టింది. నువ్వు ఏ కాంత మీదైతే నీ మనస్సుని, కామాన్ని ఉంచావొ, ఆ సీతతో ఈ వానరం మాట్లాడింది " అని చెప్పారు. 

అప్పుడు రావణుడికి ఎక్కడలేని కోపం వచ్చి 80,000 రాక్షస కింకరులని పిలిచి " మీరందరూ వెళ్ళి ఆ మహా వానరాన్ని పట్టి బంధించండి, లేకపోతె సంహరించండి " అని చెప్పి పంపించాడు.

జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః|
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః||
దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్ట కర్మణః|
హనుమాన్ శత్రుసైన్యానాం నిహన్తా మారుతాత్మజః||
న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్|
శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః||
అర్ధయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీమ్|
సమృద్ధార్ధో గమిష్యామి మిషతాం సర్వరక్షసామ్||

(ఈ శ్లోకాలని జయ మంత్రము అంటారు)

ఆ సమయంలో హనుమంతుడు అక్కడ ఉన్న తోరణం మీద కూర్చుని ఈ జయ మంత్ర శ్లోకాలని చెప్పాడు " రాముడులక్ష్మణుడు విశేషమైన బలంతో వర్ధిల్లుతున్నారు. ఆ రాముడి చేత రక్షింపబడిన వానర రాజైన సుగ్రీవుడు జయము చేత శోభిల్లుతున్నాడు. అటువంటి రాముడికి దాసానుదాసుడిని నేను. నా పేరు హనుమ, నేను యుద్ధంలో వేరుగా ఆయుధములు వాడను, ఈ రావణుడి సైన్యాన్ని నా అరికాళ్ళ కింద పెట్టి తోక్కేస్తాను, నా పిడి గుద్దులతో చంపేస్తాను, పెద్ద పెద్ద చెట్లతోరాళ్ళతో కొడతాను. వెయ్యిమంది రావణాసురులు నా భుజాల కింద ఒక కీటకంతో సమానం. నన్ను ఆపగలిగేవాడు ఈ లంకా పట్టణంలో లేడు. సీతమ్మకి నమస్కరించి ఎలా వచ్చానో అలా ఈ సముద్రాన్ని దాటి వెళ్ళిపోతాను, నన్ను పట్టగలిగే మొగాడు ఈ లంకా పట్టణంలో లేడు " అని జయ మంత్రాన్ని చెప్పాడు.

అప్పుడా 80,000 కింకరుల మూక హనుమంతుడి మీదకి రకరకములైన ఆయుధములను వేశారు. చండ ప్రచండుడైన హనుమంతుడు ఆ తోరణానికి ఉన్న ఇనుప పరిఘని ఒకదాన్ని పీకి వాళ్ళందరినీ దానితో కొట్టాడు. కళ్ళు మూసి తెరిసే లోగా అక్కడ ఆ రాక్షసుల మాంసపు ముద్దలురక్తపు మరకలతో ఆ ప్రాంతం నిండిపోయింది. మళ్ళి ఆయన తోరణం ఎక్కి కూర్చున్నాడు, అప్పుడాయనకి దూరంగా వెయ్యి స్తంభాల తోటి ఒక ప్రాసాదం కనపడింది. అప్పుడాయన ఆ ప్రాసాదం మీదకి ఎక్కి నిలబడి ఒక పెద్ద నాదం చేశాడు. ఆ నాదం వినేసరికి లంకా పట్టణంలో కొన్ని వేలమంది గుండెలు బద్దలయ్యి, చెవుల వెంటముక్కుల వెంట రక్తం కారి చనిపోయారు. అప్పుడాయన తొడలు కొట్టాడు, ఆ శబ్దానికి కొంతమంది రాక్షసులు చనిపోయారు. తరువాత ఆ ప్రాసాదానికి మధ్యలో ఉన్న బంగారు స్తంభాన్ని పీకి గాలిలో గిరగిర తిప్పితే, ఆ వేగానికి అందులోనుంచి అగ్ని పుట్టి ఆ ప్రాసాదం అంతా కాలిపోయింది. ఆ ప్రాసాదానికి కాపలా ఉన్న 100 మంది రాక్షసులని కూడా కొట్టి చంపేశాడు. 

అప్పుడాయన " మా వానరములలో 10 ఏనుగుల బలం కలిగినవారు, 100 ఏనుగుల బలం కలిగినవారు, 1000 ఏనుగుల బలం కలిగినవారు, 10,000 ఏనుగుల బలం కలిగినవారు, అంతకన్నా ఎక్కువ బలం కలిగినవారు ఉన్నారు. భూమికి అడ్డంగా ఎగరగలిగేవాళ్ళు, నిలువుగా ఎగరగలిగేవాళ్ళు ఈ భూమండలం అంతటా సీతమ్మ కోసం అన్వేషిస్తున్నారు, వాళ్ళెవరూ మిమ్మల్ని విడిచిపెట్టరు. సుగ్రీవుడే బయలుదేరి లంకలో అడుగుపెట్టిననాడు, ఈ లంక లేదు, మీరు లేరు, ఆ రావణుడు లేడు. ధర్మాత్ముడైన రాముడితో వైరం పెట్టుకున్న కారణం చేత మీరందరూ మడిసిపోతారు " అని చెప్పి మళ్ళి తోరణం మీదకి వచ్చి జయ మంత్రం చెప్పాడు. 


80,000 మంది చనిపోయారన్న విషయం తెలుసుకున్న రావణుడు  ప్రహస్తుడి కుమారుడైన జంబుమాలిని పంపాడు. గాడిదలు పూన్చిన రథం ఎక్కి జంబుమాలి యుద్ధానికి వచ్చాడు. అప్పుడు హనుమంతుడు ఆ జంబుమాలి మీదకి ఒక పెద్ద రాయిని విసిరాడు. బాణములతో జంబుమాలి ఆ రాయిని కొట్టి ముక్కలు చేశాడు. తరువాత హనుమంతుడు ఒక సాల వృక్షాన్ని పీకి విసిరాడు, కాని ఆ చెట్టు మీద పడకముందే దానిని జంబుమాలి ఖండ ఖండములుగా కొట్టాడు. తరువాత ఆ జంబుమాలి హనుమంతుడి నుదుటి మీద, వక్షస్థలం మీద బాణములతో కొట్టాడు, ఆ దెబ్బలకి ఆయన శరీరం నుండి రక్తం కారింది. హనుమంతుడు మళ్ళి ఒక పరిఘని పీకి, గిరగిర తిప్పుతూ పిడుగు వచ్చి పడినట్టు ఆకాశంలోకి ఎగిరి వాడిమీద పడి ఆ పరిఘతో కొట్టాడు. ఆ దెబ్బకి జంబుమాలి రథం, శిరస్సు, చేతులు, గాడిదలు మొదలైనవి ఏమి కనపడలేదు. మళ్ళి ఆయన తోరణం ఎక్కి జయ మంత్రం చెప్పడం ప్రారంభించాడు. అక్కడున్న రాక్షసులందరినీ కాళ్ళ కింద పెట్టి తొక్కేశాడు, మోకాళ్ళతో కుమ్మేశాడు, చేతులతో గుద్దేసి అక్కడున్న రాక్షసులందరినీ సంహరించాడు. 

"జంబుమాలి, జంబుమాలి వెనక వెళ్ళిన సైన్యము అంతా మరణించారు " అని రావణుడికి కబురు వెళ్ళింది. అప్పుడు రావణుడు తన  7 మంత్రుల కొడుకులని హనుమ పైకి యుద్ధానికి పంపించాడు. వాళ్ళు అన్ని వైపుల నుండి హనుమ మీదకి బాణ ప్రయోగం చేశారు. అప్పుడు హనుమంతుడు తన శరీరాన్ని పెద్దగా పెంచేసి ఆకాశంలోకి ఎగిరి ఒక్కసారి కింద పడిపోయాడు. ఆయన కింద పడిపోయి చాలా మంది చనిపోయారు, మిగిలిన వారి గుండెల్ని తన గోళ్ళతో గిల్లేసి చంపేశాడు. కొంతమందిని పళ్ళతో కొరికి చంపేశాడు. అప్పుడా ప్రాంతం తెగిపోయిన తలలతో, చచ్చిపోయిన ఏనుగులతో, పచ్చడై పోయిన శరీరాలతో, విరిగిపోయిన రథాలతో ఉంది. 

No comments:

Post a Comment