Pages

Thursday, 26 April 2012

రామాయణం @ కధ -48భూతాని రాక్షసేంద్రేణ వధ అర్హేణ హృతాం అపి |
న తాం శశంసూ రామాయ తథా గోదావరీ నదీ ||
అక్కడున్న పంచభూతాలు జెరిగినది చూసాయి, కాని చెపుదాము అంటె, రావణుడు గుర్తుకు వచ్చి భయపడ్డాయి. అప్పుడా పంచభూతాలు గోదావరితో " గోదావరి! సీతమ్మని రావణుడు ఎత్తుకుపోయిన సంగతి చెప్పెయ్యి. రాముడి బాధ చూడలేకపోతున్నాము " అన్నాయి. కాని రావణుడి దుష్ట చేష్టితములు, భయంకరమైన స్వరూపం, వాడి పనులు జ్ఞాపకం వచ్చి గోదావరి నోరు విప్పలేదు, నిజం చెప్పలేదు. అక్కడున్న మృగాలు జెరిగినదాన్ని చెబుదాము అనుకున్నాయి, కాని అవి మాట్లాడలేవు కనుక ఆకాశం వైపు చూస్తూ, సీతమ్మని రావణుడు ఎత్తుకుపోయిన దక్షిణ దిక్కు వైపు పరుగులు తీశాయి. 


మృగాలన్నీ దక్షిణ దిక్కుకి పరుగులు తీయడాన్ని చూసిన లక్ష్మణుడు "అన్నయ్యా!  ప్రమాదం వచ్చి జంతువులన్నీ అటు పరిగెత్తడం లేదు. అవి కొంత దూరం పరిగెడుతున్నాయి, ఆగుతున్నాయి, వెనక్కి తిరుగుతున్నాయి, 'మాకు చెప్పడం రాదు, నీకు అర్ధం అవ్వడం లేదా, మా వెంట రా' అని పిలుస్తున్నట్టుగా మన వంక చూసి ఏడుస్తున్నాయి, మళ్ళి పరిగెడుతున్నాయి, ఆకాశం వంక చూస్తున్నాయి. బహుశా సీతమ్మని ఎవరో అపహరించి ఇటూ వైపు తీసుకెళ్ళారేమో అన్నయ్యా, మనకి ఆనవాలు దొరుకుతుంది, ఈ మృగాల వెనకాల వెళదాము " అన్నాడు. 


అప్పుడు రామలక్ష్మణులు ఇద్దరూ ఆ మృగాల వెనుక పరుగు తీసారు. అక్కడ వాళ్ళకి సీతమ్మ తలలో పెట్టుకున్న పూలదండ కింద పడిపోయి కనపడింది. అప్పుడు రాముడు " మారీచుడు వచ్చేముందు నేనే సీత తలలోపూలదండ పెట్టాను. ఎవడో దురాత్ముడు సీతని భక్షించి ఉంటాడు. చూశావ ఇక్కడ భూషణములు కింద పడిపోయి ఉన్నాయి, రక్త బిందువులు కనపడుతున్నాయి, అంటె ఎవరో సీతని తినేశారు. ఇక్కడ ఒక పెద్ద రథం విరిగిపోయి కనపడుతుంది, ఎవరిదో గొప్ప ధనుస్సు విరిగి కింద పడిపోయి ఉంది, ఎవరో ఒక సారధి కూడా కింద పడిపోయి ఉన్నాడు, పిశాచ ముఖాలతో ఉన్న గాడిదలు కింద పడిపోయి ఉన్నాయి. ఎవరో ఇద్దరు రాక్షసులు సీత కోసం యుద్ధం చేసుకున్నారు. ఆ యుద్ధంలో గెలిచినవాడు సీతని తీసుకెళ్ళి తినేశాడు.  

సీత ఏ ధర్మాన్ని పాటించిందో, ఆ ధర్మం సీతని కాపాడలేదు.ఎవడు పరాక్రమము ఉన్నా మృదువుగా ప్రవర్తిస్తాడో, వాడిని లోకం చేతకానివాడు అంటుంది. లక్ష్మణా! ఇప్పుడు చూపిస్తాను నా ప్రతాపము ఏమిటో. ఈ పర్వతం ముందు నిలబడి 'సీత ఎక్కడుంది' అని అడిగితే, నాతో వెటకారమాడి నేను మాట్లాడిన మాటనే మళ్ళి ప్రతిధ్వనిగా పైకి పంపింది. ఇప్పుడే ఈ పర్వతాన్ని నాశనం చేసేస్తాను, నాకున్న అస్త్ర-శస్త్రములన్నిటిని ప్రయోగించి సూర్య చంద్రులని గతిలేకుండా చేస్తాను, ఆకాశాన్ని బాణాలతో కప్పేస్తాను, దేవతలు ఎవరూ తిరగడానికి వీలులేకుండా చేసేస్తాను, నదులలో, సముద్రాలలో ఉన్న నీటిని ఇంకింప చేసేస్తాను, భూమి మీద అగ్నిహోత్రాన్ని పుట్టిస్తాను, నా బాణాలతో భూమిని బద్దలుకొడతాను, రాక్షసులు అనే వాళ్ళు ఈ బ్రహ్మాండాల్లో ఎక్కడా లేకుండా చేస్తాను, నా క్రోధం అంటె ఎలా ఉంటుందో ఈ దేవతలు చూస్తారు, మూడులోకాలని లయం చేసేస్తాను. సీత ఎక్కడున్నా, బతికున్నా మరణించినా, దేవతలు తీసుకువచ్చి నా పాదములకి నమస్కరించి ప్రార్ధన చేస్తే వదిలిపెడతాను, లేకపోతె ఇవ్వాళతో ఈ బ్రహ్మండాలని నాశనం చేసేస్తాను. వృద్ధాప్యం రాకుండా, మృత్యువు రాకుండా ఎవడూ ఎలా నిరోధించుకోలేడో, అలా క్రోధముర్తి అయిన నా ముందు నిలబడడానికి దేవతలకి కూడా ధైర్యం చాలదు. పడగోట్టేస్తున్నాను లక్ష్మణా......" అని కోదండాన్ని తీసి చేతిలో పట్టుకున్నాడు. 


అప్పుడు లక్ష్మణుడు పరుగు పరుగున వచ్చి, అంజలి ఘటించి " అన్నయ్యా! నువ్వు సర్వభూత హితేరతుడివి అన్న పేరు తెచ్చుకున్నవాడివి. అటువంటివాడివి నువ్వు క్రోధమునకు వశమయిపోయి మూడులోకాలని కాల్చేస్తే, ఇంక లోకంలో శాంతి అన్న మాటకి అర్ధం ఎక్కడుంది అన్నయ్యా. ఎవడో ఒక దుర్మార్గుడు తప్పు చేశాడని, వాడిని నిగ్రహించడం మానేసి లోకాలన్నిటిని బాధపెడతావ అన్నయ్యా. నీ క్రోధాన్ని కొంచెం వెనక్కి తగ్గించు. రాజు ప్రశాంత మూర్తుడై తగినంత శిక్ష వెయ్యాలి, అంతేకాని ఎవడో ఏదో తప్పు చేశాడని లోకాన్ని ఇలా పీడిస్తావ. అన్నయ్యా! ఇక్కడ ఇద్దరు యుద్ధం చెయ్యలేదు. ఎవడొ ఒకడే రాక్షసుడు వచ్చాడు. ఆ రాక్షసుడు ఇక్కడ తన రథాన్ని పోగొట్టుకుని, సీతమ్మని ఆకాశ మార్గంలో తీసుకెళ్ళాడు. అందుకే మృగాలు ఆకాశం వంక చూస్తూ పరిగెడుతున్నాయి. అన్నయ్యా! నీకు అంజలి ఘటించి, నీ పాదములకు నమస్కరించి అడుగుతున్నాను, నువ్వు శాంతించు. రాముడే ఆగ్రహాన్ని పొందితే, ఇక లోకాలు నిలపడలేవు. నువ్వు ఏ ఋషులని గౌరవిస్తావో ఆ ఋషుల యొక్క అనుగ్రహంతో, వారి మాట సాయంతో, నీ పక్కన నేనుండగా, సీతమ్మని అన్వేషించి ఎక్కడ ఉన్నా పట్టుకుందాము. అంత సాదుధర్మంతో నువ్వు అన్వేషించిననాడు కూడా సీతమ్మ నీకు లభించకపోతే, ఆనాడు నువ్వు కోదండం పట్టుకొని లోకాలన్నిటిని లయం చేసెయ్యి. కాని ఈలోగా నీకు ఉపకారం తప్పక జెరిగి తీరుతుంది. నీకు ఋషులు, పంచభూతాలు, దేవతలు సహకరిస్తారు. ఇంత ధర్మమూర్తివైన నీకు సహకరించని భూతము ఈ బ్రహ్మండములలో ఉండదు. నువ్వు సీతమ్మని పొందుతావు, ఇది సత్యం, సత్యం, సత్యం. నేను నీ పక్కన ఉండగా నువ్వు ఇంత క్రోధమూర్తివి కాకు. నువ్వు శాంతిని పొందు " అన్నాడు. 


లక్ష్మణమూర్తి మాటల చేత శాంతిని పొందినవాడై, రాముడు తూణీరం నుండి బాణాన్ని తీయకుండా ఆగిపోయాడు. 

శాంతించిన రాముడితో లక్ష్మణుడు " అన్నయ్యా! చూశావ లోకం యొక్క పోకడ ఎలా ఉంటుందో. కష్టాలు అనేవి ఒక్కరికే కాదు, గతంలో కూడా కష్టపడినవారు ఎందరో ఉన్నారు. నహుషుని కుమారుడైన యయాతి ఎంత కష్టపడ్డాడో జ్ఞాపకం ఉందా. ( ఎన్నో కష్టాలు పడి, ఎంతో గొప్పగా జీవించిన యయాతి చనిపోయాక స్వర్గానికి వెళ్ళాడు. అప్పుడు దేవేంద్రుడు యయాతిని ఒక ప్రశ్న అడిగాడు, అదేంటంటే " యయాతి! నీ రాజ్యంలో అసత్యం చెప్పని వాడు ఎవరు? " అని అడిగాడు. తాను ఎన్నడూ అసత్యం చెప్పలేదు కనుక ఆ యయాతి ఎంతో వినయంగా " నేను ఎన్నడూ అసత్యం పలకలేదు " అన్నాడు. " నీ వైపుకి చూపించి, ఒక విషయాన్ని నీ అంతట నువ్వు పొగుడుకున్నావు కనుక నువ్వు మహా పాపత్ముడివి. అందుచేత నీకు స్వర్గలోక ప్రవేశం కుదరదు " అని చెప్పి దేవేంద్రుడు యయాతిని కిందకి తోసేశాడు.)  జీవితకాలం కష్టపడిన యయాతి, ఒక్క మాటకి, అది కూడా దేవేంద్రుడు అడిగితే చెప్పిన జవాబుకి, స్వర్గము నుండి పతనమై భూమి మీద పడిపోయాడు.    

అలాగే మన గురువుగారైన వశిష్ఠుడికి నూరుగురు కుమారులు జన్మించారు. వాళ్ళల్లో ఒక్కడు కూడా భ్రష్టుడు కాదు, అందరూ తండ్రిమాట వినేవారే. అటువంటి నూరుగురు కుమారులు తండ్రిని గౌరవించి మాట్లాడిన పాపానికి ఒకే రోజూ శాపానికి గురై శరీరాలని వదిలేశారు. అంత కష్టమొచ్చినా మన గురువు గారు బెంగపెట్టుకోలేదు. మనం రోజూ చూసే భూమికి ఎంతో ఓర్పు ఉంది, ఎంతోమందిని భరిస్తుంది. ఈ భూమి ఎప్పటినుంచో ఉంది. ఇటువంటి భూమి కూడా ఒక్కొక్కనాడు పాపభారాన్ని మోయలేక కదులుతుంది. అంత గొప్ప భూమికి కూడా కష్టమొచ్చి కదులుతుంది. ఆకాశంలో ఉన్న సూర్యచంద్రులిద్దరు మహాబలం కలిగినవారు, వాళ్ళిద్దరి చేత ఈ లోకములన్ని ప్రకాశిస్తున్నాయి. అటువంటి సూర్యచంద్రులని పాప గ్రహాలైన  రాహు కేతువులు గ్రహణ సమయంలో గ్రహిస్తునారు, మళ్ళి విడిచిపెడుతున్నారు. మనిషికి జీవితంలో కష్టం వచ్చిననాడు, ఆ కష్టాన్ని తట్టుకొని నిలబడిననాడు కదా, అప్పుడు కూడా ధర్మం విడిచిపెట్టకుండా ఉన్ననాడు కదా వాడిలో ఉన్నటువంటి సౌశీల్యం ప్రకాశించేది. అందుకని అన్నయ్యా, దయ చేసి నీ కోపాన్ని విడిచిపెట్టు. నువ్వు జ్ఞానివి అన్నయ్యా, నీకు సమస్తం తెలుసు. కాని నిప్పుని బూది కప్పినట్టు, నీలో ఉన్న జ్ఞానాన్ని శోకం కప్పింది. అందువలన నువ్వు కోపానికి వశుడవయ్యావు. నీకు చెప్పగలిగిన వాడిని అని నేను నీకు చెప్పడంలేదు, నేను కేవలం నీ మీద కప్పబడ్డ శోకం అనే దాన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నాను, అంతే " అన్నాడు. 

Wednesday, 25 April 2012

రామాయణం @ కధ -47ఏతౌ పాదౌ మయా స్నిగ్ధౌ శిరోభిః పరిపీడితౌ 
ప్రసాదం కురు మే క్షిప్రం వశ్యో దాసో అహం అస్మి తే ||


ఏడుస్తూ ఉన్న సీతమ్మని చూసిన ఆ రావణుడు " నీ పాదాలు పట్టుకుంటున్నాను సీతా, నా కోరిక తీర్చి నన్ను అనుగ్రహించు " అన్నాడు. ( రావణుడు తెలిసి పట్టుకున్నా తెలియక పట్టుకున్నా, శిరస్సు వంచి సీతమ్మ పాదాలు పట్టుకున్నాడు కనుక, సీతమ్మని ఇన్ని మాటలు అన్నా కొంతకాలమైనా బతికాడు.)


అప్పుడు సీతమ్మ, తనకి రావణుడికి మధ్యలో ఒక గడ్డిపరకని పెట్టి " రాముడు ధర్మాత్ముడు, దీర్ఘమైన బాహువులు ఉన్నవాడు, విశాలమైన కన్నులున్నవాడు, ఆయన నా భర్త, నా దైవం. ఇక్ష్వాకు కులంలో పుట్టి, సింహం వంటి మూపు ఉండి, లక్ష్మణుడిని తమ్ముడిగా కలిగిన రాముడి చేతిలో ప్రాణములు పోగొట్టుకోడానికి సిద్ధంగా ఉండు రావణా. నువ్వే కనుక రాముడి సన్నిధిలో నన్ను ఇలా అవమానించి ఉంటె, ఈ పాటికి నువ్వు ఖరుడి పక్కన పడుకొని ఉండేవాడివిరా. నీ ఆయువు అయిపోతుంది, నీ ఐశ్వర్యము పోతుంది, నీ ఓపిక అయిపోతుంది, నీ ఇంద్రియాలు కూడా పతనమయిపోతాయి, నీ లంకా పట్టణం విధవగా నిలబడడానికి సిద్ధంగా ఉంది, ఇవన్నీ నువ్వు చేసిన పని వల్ల భవిష్యత్తులో జెరగబోతున్నాయి. నీటి మీద పట్టే నాచుని తినే నీటికాకిని, నిరంతరం రాజహంసతో కలిసి క్రీడించడానికి అలవాటుపడిన హంస చూస్తుందా. రాముడిని చూసిన కన్నులతో నిన్ను నేను చూడనురా పాపి, అవతలకి పో " అనింది.

ఈ మాటలకి ఆగ్రహించిన రావణుడు " నీకు 12 నెలలు సమయం ఇస్తున్నాను. ఈలోగా నీ అంతట నువ్వు బుద్ధి మార్చుకొని నా పాన్పు చేరితే బతికిపోతావు. అలాకాకపోతే 12 నెలల తరువాత నిన్ను నాకు అల్పాహారంగా పెడతారు " అని చెప్పి, భయంకరమైన స్వరూపం కలిగిన రాక్షస స్త్రీలని పిలిచి " ఈమెని అశోక వనానికి తీసుకువెళ్ళండి. ఆమె చుట్టూ మీరు భయంకరమైన స్వరూపాలతో నిలబడి, బతికీ బతకడానికి కావలసిన ఆహారాన్ని, నీళ్ళని ఇస్తూ, శూలాలలాంటి మాటలతో ఈ సీతని భయపెట్టి నా దారికి తీసుకురండి. ఇక తీసుకువెళ్ళండి " అన్నాడు. 


వికృత నేత్రములు కలిగిన ఆ రాక్షస స్త్రీలు చుట్టూ నిలబడి భయపెడుతుంటే, అశోక వనంలో శోకంతో ఏడుస్తూ ఆ సీతమ్మ ఉంది. 

ఇటుపక్క రామచంద్రమూర్తి మాంసం పట్టుకుని వస్తుంటే, విచిత్రంగా వెనకనుంచి ఒక నక్క కూత వినబడింది. అలాగే రాముడిని దీనంగా చూస్తూ అక్కడున్న మృగాలన్నీ ఎడమ వైపు నుండి ప్రదక్షిణంగా తిరిగాయి. ఈ శకునాలని చూసిన రాముడు, సీతమ్మకి ఏదో జెరిగిందని భావించి గబగబా వస్తుండగా ఆయనకి ఎదురగా లక్ష్మణుడు వచ్చాడు. లక్ష్మణుడిని చూడగానే రాముడి పైప్రాణాలు పైనే ఎగిరిపోయాయి. 


అప్పుడాయన లక్ష్మణుడితో " సీతని వదిలి ఎందుకు వచ్చావు. సీత ప్రమాదంలో ఉందని నేను అనుకుంటున్నాను. సీత క్షేమంగా ఉంటుందా? బతికి ఉంటుందా? నాకు నమ్మకం లేదు. ఎందుకంటే నేను ఖర దూషణులని సంహరించాక రాక్షసులు నా మీద పగబట్టారు. మారీచుడు మరణిస్తూ 'హా సీతా! హా లక్ష్మణా!' అన్నాడు. సీత నిన్ను నిగ్రహించి పంపి ఉంటుంది, అందుకని నువ్వు వచ్చావు. నువ్వు వచ్చేశాక సీతని ఆ రాక్షసులు అపహరించడమైనా జెరిగుంటుంది, లేదా ఆమె కుత్తుక కోసి, ఆమెని తినెయ్యడం అయినా జెరిగుంటుంది. ఏదో ప్రమాదకరమైన పని జెరిగుంటుంది. లక్ష్మణా! నువ్వు ఇలా వస్తావని నేను ఊహించలేదు. నువ్వు రాకుండా ఉండి ఉండవలసింది. ఈ ముఖం పెట్టుకొని నేను అయోధ్యకి ఎలా వెళ్ళను. అందరూ వచ్చి సీతమ్మ ఏది అని అడిగితే, నేను ఏమని చెప్పుకోను. అరణ్యవాసానికి తనని అనుగమించి వచ్చిన సీతమ్మని రక్షించుకోలేని పరాక్రమహీనుడు రాముడు, అని అందరూ చెప్పుకుంటుంటే, ఆ మాటలు విని నేను ఎలా బతకను. నేను అసలు వెనక్కి రానే రాను. సీత ఆశ్రమంలో కనపడకపోతే నా ప్రాణాలు విడిచిపెట్టేస్తాను.  

ఏ సీత యొక్క ఓదార్పు చేత 13 సంవత్సరాల అరణ్యవాసాన్ని క్షణములా గడిపానో, ఆ సీత నా కంట పడనప్పుడు నాకు రాజ్యం అక్కరలేదు, అంతఃపుర భోగములు అక్కరలేదు. నువ్వు అయోధ్యకి వెళ్ళి, నేను చెప్పానని చెప్పి, భరతుడిని పట్టాభిషేకం చేసుకొని రాజ్యం ఏలమన్నానని చెప్పు. నా తల్లి కౌసల్యని సేవించు. నేను అయోధ్యకి తిరిగొస్తే, జనకుడు నన్ను చూసి ' రామ! నీకు కన్యాదానం చేశాను కదా, ఏదయ్యా సీతమ్మ' అని అడుగుతారు, అప్పుడు నేను జనకుడి ముఖాన్ని ఏ ముఖంతో చూడను. సీతని వదిలి రావద్దని నేను నిన్ను ఆజ్ఞాపించాను. కాని నా ఆజ్ఞని పాటించకుండా సీతని వదిలి నువ్వు ఒక్కడివీ ఎందుకు వచ్చావు " అంటాడు.

అప్పుడు లక్ష్మణుడు " అన్నయ్య! నా అంత నేనుగా రాలేదు, సీతమ్మని విడిచిపెట్టి రాలేదు. నీ మాటని పాటిద్దామని ప్రతిక్షణం సీతమ్మ దెగ్గరే ఉండి జాగ్రత్తగా కాపు కాశాను. 

ఆర్యేణ ఏవ పరిక్రుష్టం - పరాక్రుష్టం - హా సీతే లక్ష్మణ ఇతి చ |
పరిత్రాహి ఇతి యత్ వాక్యం మైథిల్యాః తత్ శ్రుతిం గతం ||   

కాని ఎప్పుడైతే అరణ్యంలోనుంచి నీ గొంతుతో 'హా సీతా! హా లక్ష్మణా' అన్న మాటలు సీతమ్మ విన్నదో, నీయందు ఉన్నటువంటి అపారమైన ప్రేమ చేత భయవిహ్వల అయిపోయింది. అప్పుడు సీతమ్మ ఏడుస్తూ, లక్ష్మణా వెళ్ళు, అని నన్ను ఒకటికి పదిమార్లు తొందరచేసింది. కాని మా అన్నయ్య అలా నీచంగా రక్షించండి అని ఒక్కనాటికి అరవడు, ఇది రాక్షస మాయ అని సీతమ్మకి చెప్పాను. కాని 'నువ్వు భరతుడితో కలిసి కుట్ర చేసి, నన్ను పొందడానికి రాముడి వెనకాల అరణ్యవాసానికి వచ్చావు' అని సీతమ్మ నన్ను ఒక కఠినమైన మాట అంటె, నేను ఇంక తట్టుకోలేక బయలుదేరి వచ్చేశాను. నాయందు ఏ దోషము లేదన్నయ్య, నన్ను మన్నించు " అన్నాడు.  


అప్పుడు రాముడు " నువ్వు ఎన్నయినా చెప్పు లక్ష్మణా, సీతని ఒక్కదాన్ని అరణ్యంలో విడిచిపెట్టి నువ్వు ఇలా రాకూడదు. నా మాటగా రాక్షసుడి మాట వినపడితే, సీత నిన్ను ఒకమాట అని ఉండవచ్చు, అంతమాత్రాన సీతని విడిచి వచేస్తావ. ఇప్పుడు సీత ఎంత ప్రమాదంలో ఉందో. నువ్వు కోపానికి లోనయ్యావు, అందుకని సీతని విడిచిపెట్టి వచ్చేశావు. ఇప్పుడు నేను ఏమి చెయ్యను......." అని అంటూ ఆ పర్ణశాల ఉండే ప్రదేశానికి చేరుకున్నారు. 


రాముడు ఆ పర్ణశాలలో అంతా చూశాడు, కాని సీతమ్మ ఎక్కడా కనపడలేదు. అప్పుడాయన ఆ చుట్టుపక్కల అంతా వెతికాడు, దెగ్గరలో ఉన్న పర్వతాలకి వెళ్ళాడు, నదుల దెగ్గరికి వెళ్ళి చూశాడు, అక్కడే ఉన్న జింకల దెగ్గరికి వెళ్ళాడు, పెద్ద పులుల్ని, చెట్లని అడిగాడు. అలా ఏనుగు దెగ్గరికి వెళ్ళి " ఓ ఏనుగా! నీ తొండం ఎలా ఉంటుందో సీత జెడ కూడా అలానే ఉంటుంది, నీకు తెలిసుంటుంది సీత ఎక్కడుందో, నాకు చెప్పవా " అన్నాడు. దెగ్గర ఉన్న చెట్ల దెగ్గరికి వెళ్ళి " సీత ఎక్కడుందో మీకు తెలిసుంటుంది, నాకు నిజం చెప్పరా " అన్నాడు. అక్కడే ఉన్న జింకల దెగ్గరికి వెళ్ళి " సీత మీతో ఆడుకునేది కాదా, సీతకి ప్రమాదం జెరిగినప్పుడు మీకు తెలిసి ఉంటుంది. నాకు సీత ఎక్కడ ఉందో చెబుతారా " అన్నాడు. అలాగే అక్కడ కూర్చొని ఏడుస్తూ " అయ్యో, రాక్షసులు వచ్చి సీత యొక్క పీక నులిమేసి, ఆమె రక్తాన్ని తాగేసి, మాంసాన్ని భక్షిస్తుంటే, 'హా! రామ, హా! రామ' అని అరిచి ఉంటుంది. ఎంత అస్త్ర-శస్త్ర సంపద తెలిసి మాత్రం నేను ఏమి చెయ్యగలిగాను, సీతని కాపాడుకోలేకపోయాను " అని ఏడుస్తున్నాడు.రాముడి బాధని చూసి లక్ష్మణుడు " అన్నయ్యా! బెంగ పెట్టుకోకు, వదిన గోదావరి తీరానికి నీళ్ళు తేవడానికి వెళ్ళి ఉంటుంది. అందుకని నేను గోదావరి తీరానికి వెళ్ళి చూసి వస్తాను " అని చెప్పి లక్ష్మణుడు గోదావరి తీరానికి వెళ్ళాడు. తిరిగొచ్చిన లక్ష్మణుడు " సీతమ్మ ఎక్కడా కనపడలేదు " అన్నాడు. అప్పుడు రాముడు పరిగెత్తుకుంటూ గోదావరి నది దెగ్గరికి వెళ్ళి " గోదావరి! నిజం చెప్పు. ఎక్కడుంది సీత. నీకు తెలిసే ఉంటుంది. నువ్వు ఈ ప్రాంతం అంతా ప్రవహిస్తున్నావు, కనుక నాకు సీత ఎక్కడుందో చెప్పు " అన్నాడు. 

Tuesday, 24 April 2012

రామాయణం @ కధ -46


అప్పుడా జటాయువు ఒంట్లోనుంచి నది ప్రవహించినట్టు రక్తం ప్రవహించింది. అప్పుడా జటాయువు అదుపు తప్పి ఒక చెట్టు దెగ్గర పడిపోయాడు. తనకోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడ్డ ఆ జటాయువుని చూసి సీతమ్మ పరుగు పరుగున వెళ్ళి ఆ జటాయువుని కౌగలించుకుని ఏడిచింది. సీతమ్మ నగలన్నీ కింద పడిపోయాయి, జుట్టంతా విరజిమ్ముకు పోయింది. అటువంటి స్థితిలో ఏకధారగా ఏడుస్తున్న సేతమ్మని చూసి రావణుడు " జటాయువు కోసం ఏడుస్తావే, రా " అని సీతమ్మ వెనక రావణుడు పరుగుతీసాడు. అప్పుడు సీతమ్మ జటాయువుని వదిలి అక్కడున్న లతలని, చెట్లని కౌగిలించుకుంది. 

అప్పుడా రావణుడు అక్కడికి వెళ్ళి " చెట్లని, లతలని కౌగలించుకుంటావే, రా " అని, ఆవిడ జుట్టు పట్టుకొని వెనక్కి ఈడ్చేశాడు.
రావణుడు సీతమ్మని అలా నేల మీద ఈడ్చుకుపోతుంటే సూర్యుడు, చంద్రుడు చూసి సిగ్గుతో మేఘాల చాటుకి వెళ్ళిపోతే, ప్రపంచాన్నంతటిని అకారణంగా చీకటి ఆవరించింది. సత్యలోకంలో కూర్చున్న బ్రహ్మగారు ఉలిక్కిపడ్డారు. అప్పుడాయన తన దివ్య నేత్రంతో చూసి" ఒరేయ్, నువ్వు చేసిన తపస్సుకి చావడానికి కావలసినంత పాపం ఇవ్వాళ మూటకట్టుకున్నావురా " అన్నారు. 

రావణుడు సీతమ్మ జుట్టు పట్టి, ఈడ్చుకొని తెచ్చి, తన తొడల మీద కూర్చోపెట్టుకుని ఆకాశంలోకి ఎగిరిపోయాడు. అటూ ఇటూ తన్నుకుంటున్న సీతమ్మని 20 చేతులతో ఓడిసిపట్టుకున్న రావణాసురుడిని చూసి ఋషులు, ఈ కళ్ళతో ఇటువంటి దృశ్యాన్ని చూడవలసి వచ్చిందని బాధపడ్డారు, అలాగే రావణ సంహారం అవుతుందని సంతోషించారు. 

ఆకాశంలో వెళ్ళిపోతున్న సీతమ్మ ఆభరణాలు కిందపడిపోయాయి, ఆవిడ జుట్టు విడిపోయి చల్లుకుపోయింది, తిలకం పక్కకి తొలగిపోయింది. అలా ఆకాశంలో వెళ్ళిపోతున్న సీతమ్మకి ఒక పర్వత శిఖరం మీద  5 వానరాలు కనబడ్డాయి. వీళ్ళు నా సమాచారాన్ని రాముడికి అందజేస్తారు అనుకొని, తాను కట్టుకున్న వస్త్రం నుండి ఒక ఖండాన్ని చింపి, అందులో తాను ధరించిన నగలని మూటకట్టి ఆ 5 వానరముల మధ్యలో పడేటట్టు విడిచింది. సీతమ్మని తీసుకుపోతున్నాను అన్న ఆనందంలో రావణుడు ఈ విషయాన్ని గమనించలేదు. రెప్ప వెయ్యకుండా ఆ 5 వానరాలు ఈ దృశ్యాన్ని చూశారు.త్వయా ఏవ నూనం దుష్టాత్మన్ భీరుణా హర్తుం ఇచ్ఛతా |
మమ అపవాహితో భర్తా మృగ రూపేణ మాయయా ||


రావణుడి చేత ఎత్తుకుపోబడుతున్న సీతమ్మ ఇలా అనింది " నువ్వు మాయా మృగాన్ని సృష్టించి, నా భర్త నా నుంచి చాలా దూరంగా వెళ్ళాలన్న దుష్టసంకల్పంతో ఆ మృగాన్ని ఆశ్రమంలోకి పంపించి, ఒక్కత్తిగా ఉన్న నన్ను అపహరించావు. ఇది ఒక గొప్ప కార్యమని ఎవరూ అనరు. అలాగే ఇది యాద్రుచ్చికముగా జెరిగిన సంఘటన కాదు. ఇలా జెరగాలని నువ్వు ముందుగానే ప్రణాళిక రచించావు. ఇలా చెయ్యడం నీ పరాక్రమానికి కాని, నీ తపస్సుకి కాని, ఒకనాడు నువ్వు జీవించిన జీవితానికి కాని ఏవిధంగా నిదర్శనంగా నిలబడుతుంది. ఒక పరస్త్రీని ఎత్తుకొచ్చి నేను గొప్పవాడిని అని చెప్పుకుంటున్నావు, ఇలా చెప్పుకోడానికి నీకు సిగ్గువెయ్యడం లేదా. నువ్వు నిజంగా అంత గొప్పవాడివి అయితే, రాముడు లేనప్పుడు నన్ను ఎందుకు తీసుకొచ్చావు, రాముడు ఉండగా ఎందుకు రాలేకపోయవు. నువ్వు చేసిన పని పెద్దలైనవారు, వీరులైనవారు అంగీకరించేటటువంటి పని కాదు. నన్ను ముట్టుకోవడం, నన్ను అనుభవించడం నువ్వు ఒక్కనాటికి చెయ్యగలిగే పని కాదు. కాని నన్ను ముట్టుకొని తేవడం వలన, నీ శరీరం పడిపోయాక నరకానికి తీసుకువెళ్ళి, చీము నెత్తురుతో ఉండే అసిపత్రవనంలొ పడేస్తారు, అలాగే ఘోరమైన వైతరణి నదిలో పడేస్తారు. ఇప్పుడు నన్ను పట్టుకున్నానని సంతోషపడుతున్నావు, రేపు నువ్వు చచ్చాక నరకంలో ఒంటి నిండా శూలాలుండే శాల్మలీ వృక్షాన్ని కూడా గట్టిగా పట్టుకుంటావు. నిన్ను పాశములతో కట్టేసి కాలము లాక్కొనిపోతుందిరా. నువ్వు ఎప్పుడైతే మహాత్ముడైన రాముడితో వైరం పెట్టుకున్నావో, ఆనాడే నీ జీవితంలో సుఖం అనేది పోయింది, నువ్వు మరణించడం తధ్యం " అనింది.

సీతమ్మ చెప్పిన మాటలని ఆ రావణుడు విని, గాలికి వదిలేశాడు. తరువాత వారు సముద్రాన్ని దాటి, మయుడు మాయతో నిర్మించిన గంధర్వ నగరంలా ఉండే లంకా పట్టణాన్ని చేరి, తన అంతఃపురం దెగ్గర దిగాడు. అబ్రవీత్ చ దశగ్రీవః పిశాచీః ఘోర దర్శనాః |
యథా న ఏనాం పుమాన్ స్త్రీ వా సీతాం పశ్యతి అసమ్మతః ||తరువాత భయంకరమైన ముఖాలు ఉన్నటువంటి పిశాచ స్త్రీలని పిలిచి " ఈ సీత అంతఃపురంలో ఉంటుంది, నా అనుమతి లేకుండా ఏ స్త్రీ కాని, పురుషుడు కాని సీతని చూడడానికి వీలులేదు. నేను మిమ్మల్ని ఎవన్నా రత్నాలు కాని, ఆభరణములు కాని, వస్త్రములు కాని తీసుకురండి అంటె, వేరొకరి అనుమతి లేకుండా నాకు తెచ్చి ఎలా ఇస్తారో, అలాగే ఈ సీత మణులు కాని, మాణిక్యములు కాని, ఆభరణములు కాని, వస్త్రములు కాని అడిగితే, ఎవరి అనుమతి అవసరం లేకుండా వెంటనే తీసుకొచ్చి ఇవ్వండి. ఈ సీతతో ఎవరూ మాట్లాడకూడదు. ఒకవేళ ఎవరన్నా మాట్లాడుతున్నప్పుడు తెలిసి కాని, తెలియక కాని సీత యొక్క మనస్సు నొచ్చుకుందా, ఇక వారి జీవితము అక్కడితో సమాప్తము " అని వాళ్ళతో చెప్పి, తాను చేసిన ఈ పనికి చాలా ఆనందపడినవాడై అంతఃపురం నుంచి బయటకివెళ్ళి, నరమంసాన్ని తినడానికి అలవాటు పడిన కొంతమంది రాక్షసులని పిలిచి " నేను చెప్పే మాటలని జాగ్రత్తగా వినండి. ఒకప్పుడు జనస్థానంలొ ఖర దూషణుల నాయకత్వంలో 14,000 మంది రాక్షసులు ఉండేవారు. ఇప్పుడు ఆ రాక్షసులందరూ రాముడి చేతిలో నిహతులయిపోయారు, ఆ జనస్థానం ఖాళీ అయిపోయింది. అప్పటినుంచీ నా కడుపు ఉడికిపోతుంది. ఆ రాముడిని చంపే వరకు నాకు నిద్ర పట్టదు. అందుకని మీరు ఉత్తరక్షణం బయలుదేరి అక్కడికి వెళ్ళండి, పరమ ధైర్యంగా ఉండండి. అక్కడ ఏమి జెరిగినా వెంటనే నాకు చెప్పండి " అన్నాడు.

రావణుడి ఆజ్ఞ ప్రకారం ఆ రాక్షసులు జనస్థానానికి బయలుదేరారు. అప్పుడు రావణుడు అక్కడినుంచి బయలుదేరి అంతఃపురానికి వచ్చి, సీతని తెచ్చానని మనసులో చాలా ఆనందపడ్డాడు. అశ్రు పూర్ణ ముఖీం దీనాం శోక భార అవపీడితాం |
వాయు వేగైః ఇవ ఆక్రాంతాం మజ్జంతీం నావం అర్ణవే ||ఆ అంతఃపురంలో కళ్ళనిండా ఏడుస్తూ, చెంపల మీద ఆ కన్నీళ్ళు కారుతూ, అత్యంత దీనంగా, శోకం చేత పీడింపబడి, పెను తుఫానులో చిక్కుకొని మునిగిపోతున్న నౌకలోని వారు ఎటువంటి దిగ్భ్రాంతికి లోనవుతారో, అటువంటి దిగ్భ్రాంతి స్థితిలో సీతమ్మ ఉంది. వేటకుక్కల మధ్య చిక్కుకొని ఉన్న లేడి పిల్ల ఎలా భయపడుతూ ఉంటుందో, అలా సీతమ్మ తల దించుకుని ఏడుస్తూ ఉంది. 

అలా ఏడుస్తున్న సీతమ్మని రావణాసురుడు బలవంతంగా రెక్కపట్టి పైకి తీసుకువెళ్ళి, తాను కట్టుకున్న అంతఃపురాన్ని, వజ్రాలతో నిర్మించిన గవాక్షాలని, దిగుడు బావులని, సరోవరాలని, తన పుష్పక విమానాన్ని, బంగారంతో తాపడం చెయ్యబడ్డ స్తంభాలని, ఆసనాలని, శయనాలని మొదలైనవాటిని సీతమ్మకి చూపించాడు. అలా తన ఐశ్వర్యాన్ని సీతమ్మకి ప్రదర్శించాక " ఈ లంకలో ఉన్న బాలురని, వృద్ధులని లెక్కనుంచి మినహాయిస్తే, 32 కోట్ల మంది రాక్షసులు నా ఆధీనంలో ఉన్నారు. ఇందులో నేను లేచేసరికి నా వెంట పరుగు తీసేవారు 1000 మంది ఉంటారు. నాకు కొన్ని వందల మంది భార్యలు ఉన్నారు, వీరందరూ నన్ను కోరి వచ్చినవారే. ఓ ప్రియురాల! నీకు నేను ఇస్తున్న గొప్ప వరం ఏంటో తెలుసా, నాకున్న భార్యలందరికీ నువ్వు అధినాయకురాలివై నాకు భార్యగా ఉండు, నాయందు మనస్సు ఉంచు. సముద్రానికి 100 యోజనముల దూరంలో నిర్మింపబడిన నగరం ఈ కాంచన లంక. దీన్ని దేవతలు కాని, దానవులు కాని, గంధర్వులు కాని, యక్షులు కాని, నాగులు కాని, పక్షులు కాని కన్నెత్తి చూడలేరు. ఇటువంటి లంకా పట్టణానికి నువ్వు చేరుకున్నాక నిన్ను చూసేవాడు ఎవరు, తీసుకెళ్ళే వాడు ఎవరు? 

రాజ్య భ్రష్టేన దీనేన తాపసేన పదాతినా |
కిం కరిష్యసి రామేణ మానుషేణ అల్ప తేజసా ||ఇంకా రాముడు, రాముడు అంటావేంటి. ఆ రాముడు అల్పాయుర్దాయం కలిగినవాడు, రాజ్యభ్రష్టుడు, దీనుడు, అరణ్యములను పట్టి తిరుగుతున్నాడు, రాముడు కేవలం మనిషి, అటువంటి రాముడితో నీకేమి పని. నీకు తగినవాడిని నేను, అందుకని నన్ను భర్తగా స్వీకరించి ఆనందంగా, సంతోషంగా తిరుగు. హాయిగా నాతో కలిసి సింహాసనం మీద కూర్చో, మళ్ళి పట్టాభిషేకం చేసుకుందాము. ఆ పట్టాభిషేకము చేసినప్పుడు మీద పడినటువంటి జలములతో తడిసి, నాతో కలిసి సకల ఆనందములు అనుభవించు. నువ్వు నీ జీవితంలో ఏదో గొప్ప పాపం చేసుంటావు, ఆ పాపం వలన ఇన్నాళ్ళు వనవాసం చేశావు, రాముడికి భార్యగా ఉండిపోయావు. నువ్వు చేసిన పుణ్యం వలన నాదెగ్గరికి వచ్చావు. నువ్వు ఈ అందమైన మాలలు వేసుకొని చక్కగా అలంకరించుకో, మనమిద్దరమూ పుష్పక విమానంలో విహారం చేద్దాము " అన్నాడు.

ఏ ముఖాన్ని చూసి ఆ రావణుడు ఇలా హద్దులు మీరి మాట్లాడుతున్నాడో, ఆ ముఖాన్ని తన ఉత్తరీయంతో కప్పుకొని, సీతమ్మ తల్లి కళ్ళు ఒత్తుకుంటూ ఏడ్చింది. 

Monday, 23 April 2012

రామాయణం @ కధ -45అప్పుడు సీతమ్మ " కుబేరుడి తమ్ముడిని అంటావు, పది మంది నిలేదీసేటట్టుగా ఇలా ప్రవర్తించడానికి నీకు సిగ్గువెయ్యటం లేదా. ఎందుకురా ఈ ప్రవర్తన నీకు. పద్దాక రాముడు పనికిమాలినవాడు అంటున్నావు, మరి ఆయన లేనప్పుడు నన్ను తీసుకువెళ్ళాలని ఎందుకు ప్రయత్నిస్తున్నావు. రాముడు వచ్చేవరకు అలా నిలబడు చూద్దాము " అనింది.


అప్పుడు ఆ రావణుడు తన శరీరాన్ని పర్వతమంత పెంచి, తన నిజస్వరూపాన్ని బయటపెట్టాడు. ధనుర్బాణాలతో, కుండలాలతో మెరిసిపోతున్నాడు, ఆకాశం నుండి దిగి వచ్చిన నల్లటి మబ్బులా ఉన్నాడు. అప్పుడాయన " నాతో సమానమైన వాడు ఎక్కడుంటాడు, నిన్ను ఇప్పుడు ఎలా తీసుకెళ్ళిపోతానో చూడు " అని, అపారమైన కామంతో కన్ను మిన్ను కానక, భయపడుతున్న సీతమ్మ దెగ్గరికి వచ్చి తన ఎడమ చేతితో సీతమ్మ తల్లి జుట్టు గట్టిగా పట్టుకొని, కుడి చేతిని సీతమ్మ తొడల కింద పెట్టి, ఆవిడని పైకి ఎత్తాడు. పైకి ఎత్తి ఆశ్రమం బయటకి వచ్చాడు. అప్పటివరకూ ఎవరికీ కనపడకుండా అదృశ్యంగా ఉన్న ఆ బంగారు రథం ఒక్కసారి ప్రత్యక్షమయ్యి భూమి మీదకి దిగింది. 


ఆడ త్రాచుపాము కొట్టుకున్నట్టు కొట్టుకుంటున్న సీతమ్మని పరుషమైన మాటలతో భయపెడుతూ, రథంలో బలవంతంగా తన తొడల మీద కుర్చోపెట్టుకున్నాడు. అప్పుడాయన రథాన్ని బయలుదేరు అనేసరికి, ఆ రథం బయలుదేరింది. ఆకాశమార్గంలో వెళుతున్న ఆ రథం నుండి సీతమ్మ " రామ, రామ, మీరు ఎక్కడో అరణ్యంలో దూరంగా ఉండిపోయారు. నా కేక మీకు ఎలా వినబడుతుంది. ఈ దుష్టాత్ముడు నన్ను ఎత్తుకుపోతున్నాడు. ధర్మం కోసమని జీవితాన్ని, రాజ్యాన్ని త్యాగం చేసిన ఓ రామ! నీ భార్యని ఇవ్వాళ ఒక రాక్షసుడు అపహరిస్తున్నాడు. ఈ విషయం మీకు తెలియదు కాదా. లక్ష్మణా! సర్వకాలముల యందు రాముడిని అనుసరించి ఉండేటటువంటివాడ, నన్ను రావణాసురుడు ఎత్తుకుపోతున్నాడన్న విషయం నీకు తెలియదు కాదా. రక్షించండి, రక్షించండి " అని పెద్దగా కేకలు వేస్తూ సీతమ్మ ఏడుస్తోంది. అలాగే " ఓ మృగాల్లారా, ఓ పక్షుల్లారా, ఓ పర్వతాల్లారా, ఓ భూమి, ఓ గోదావరీ మీ అందరూ దయచేసి వినండి. నన్ను రావణాసురుడు అపహరించాడన్న వార్త రాముడికి తెలియచెయ్యండి " అని ఏడుస్తూ ఆ తల్లి రావణుడి తొడ నుంచి తప్పుకోవడానికి ప్రయత్నిస్తుంటే, 20 బాహువులతో(చేతులతో) ఆడ త్రాచుని నొక్కినట్టు నొక్కి తన తోడ మీద కుర్చోపెట్టుకున్నాడు. 


అలా రావణుడు సీతమ్మతో వెళ్ళిపోతుంటే, అక్కడే చెట్టు మీద కూర్చొని ఉన్న వృద్ధుడైన జటాయువు కనబడ్డాడు. అప్పటికి ఆయనకి 60,000 సంవత్సరాలు. అప్పుడా జటాయువు" దుష్టుడైన ఓ రావణా! నువ్వు చెయ్యకూడని పని చేస్తున్నావు. ధర్మం ఆచరించడం కోసమని రాజ్యాన్ని విడిచిపెట్టి, అరణ్యాలకి వచ్చి తాపసిలా జీవిస్తున్న రాముడి ఇల్లాలిని అపహరిస్తున్నావు. దీనిచేత నువ్వు ప్రమాదాన్ని తెచ్చుకుంటావు. ఇప్పటికైనా నీ బుద్ధి మార్చుకో. రాజ్యంలో పరిపాలింపబడుతున్న ప్రజలకి ధర్మంలో కాని, అర్ధంలో కాని, కామంలో కాని ఎలా ప్రవర్తించాలి అని అనుమానమొస్తే, తమ రాజు ఎలా ప్రవర్తిస్తున్నాడో చూసి, వాళ్ళు అలాగే బ్రతుకుతారు. రాజె ధర్మం తప్పిపోతే ప్రజలు కూడా ధర్మం తప్పిపోతారు. పనికిమాలినవాడికి స్వర్గానికి వెళ్ళడం కోసం విమానం ఇచ్చినట్టు, నీకు రాజ్యం ఇచ్చినవాడు ఎవడురా? నిన్ను రాజుని చేసినవాడు ఎవడురా? నేను వృద్ధుడిని, నాకు కవచం లేదు, రథం లేదు. నువ్వేమో యువకుడివి, కవచం కట్టుకున్నావు, చేతిలో ధనుర్బాణాలు ఉన్నాయి, రథం మీద ఉన్నావు. అలాగని నిన్ను విడిచిపెడతాను అనుకున్నావ. నా ప్రాణములు ఉన్నంతవరకూ నువ్వు సీతమ్మని తీసుకెళ్ళకుండా నిగ్రహిస్తాను. నా పౌరుష పరాక్రమాలు అంటె ఏంటో చూద్దువు " అని పెద్ద పెద్ద రెక్కల ఊపుతూ రావణుడి మీదకి యుద్ధానికి వెళ్ళాడు. 


తన మీదకి జటాయువు యుద్ధానికి వస్తున్నాడని ఆగ్రహించిన రావణుడు, ఆయన మీదకి కొన్ని వేల బాణములు వేశాడు. ఆ బాణాలు జటాయువు ఒంటి నిండా గుచ్చుకున్నా, ఆయన తన రెక్కలని విదిల్చి ఆ బాణాలని కింద పడేసాడు. తరువాత ఆయన తన రెక్కలని అల్లారుస్తూ ఆ రథాన్ని కొట్టి, రావణుడిని తన ముక్కుతో కుమ్మాడు. ఆ దెబ్బలకి రావణుడి కోదండం విరిగిపోయి, బాణాలు కింద పడిపోయాయి. మళ్ళి ఆ జటాయువు తన రెక్కలతో కొట్టేసరికి ఆ రథం కింద పడిపోయింది.


అప్పుడాయన తన వాడి ముక్కుతోరథసారధి శిరస్సుని కోసేసాడు. తన కాళ్ళ గోళ్ళతో ఆ రథానికి ఉన్న పిశాచాల్లాంటి గాడిదలని సంహరించాడు. అప్పుడు రావణుడు సీతమ్మతో కిందపడిపోయాడు. అలా పడిపోతు పడిపోతూ ఆ రావణుడు సీతమ్మని ఎడమ చంకలో దూర్చి పట్టుకున్నాడు. 

ఇది చూశిన జటాయువుకి ఎక్కడలేని కోపం వచ్చి రావణుడి 10 ఎడమ చేతులని తన ముక్కుతో నరికేశాడు. నరకబడ్డ 10 చేతులతో సహా సీతమ్మ కిందపడిపోయింది.  రావణుడికి మళ్ళి ఆ 10 చేతులు పుట్టాయి. అప్పుడా రావణుడు ఒక పెద్ద ఖడ్గాన్ని పట్టుకొని తన మీదకి వస్తున్న జటాయువు యొక్క రెండు రెక్కలని, కాళ్ళని నరికేశాడు.

రామాయణం @ కధ -44


న సస్ తస్య స్వరో వ్యక్తం న కశ్చిత్ అపి దైవతః |
గంధర్వ నగర ప్రఖ్యా మాయా తస్య చ రక్షసః ||


నేను యదార్ధం చెబుతున్నాను, అది అసలు మా అన్నయ్య అరుపే కాదు. మాయావి అయినవాడు నిర్మించిన గంధర్వ నగరం ఎలా ఉంటుందో, అలా మా అన్నయ్య కంఠంతో చనిపోయేముందు ఒక మాయావి అరిచాడు. మా అన్నయ్య కంఠం అక్కడ పూర్తిగా రాలేదు. నన్ను దూరంగా పంపితే నువ్వు ప్రమాదంలోకి వెళతావు. అందుకని నువ్వు బెంగ పెట్టుకోకు. నువ్వు అలా చూస్తూ ఉండు, అన్నయ్య కోదండం పట్టుకొని వచ్చేస్తాడు. ఆ మాయ మృగం చర్మంతో వస్తాడు. అన్నయ్య వెళ్ళేముందు, వదినని నీకు అప్పజెప్పి వెళుతున్నాను ప్రతి క్షణాన్ని సంకిస్తూ నువ్వు వదిన పక్కనే ఉండు అన్నాడు. నేను ఇప్పుడు నిన్ను వదిలి వెళితే, అన్నయ్యకి ఇచ్చిన మాట తప్పినవాడిని అవుతాను. ధర్మం తప్పిపోతానని నిలుచున్నాను తప్ప నేను అన్యబుద్ధి కలిగిన వాడిని కాదు వదినా. నన్ను క్షమించు. అన్నయ్య మాట మీద నేను నిలబడేటట్టు అనుగ్రహించు. నిన్నగాక మొన్న ఖర దూషణులతో కలిపి 14,000 మంది రాక్షసులని అన్నయ్య చంపాడు. అన్నయ్య మీద రాక్షసులు పగబట్టి ఉన్నారు. అందుచేత ఎలాగైనా మనకి ఉపద్రవం తేవాలని మాయా స్వరూపంతో ఇవ్వాళ ప్రవర్తించారు. నా మాట నమ్ము, ఆ అరుపులని నమ్మకు " అన్నాడు.


అప్పుడు సీతమ్మ " నాకు అర్ధమయ్యిందిరా మహా పాపి! కృరాత్ముడా! నువ్వు ఎందుకు వచ్చావో నాకు తెలియదని అనుకోకు. రాముడు మరణించాడన్న మాటని ద్రువపరుచుకోడానికి ఇక్కడ నిలుచున్నావు. నన్ను పొందడం కోసమే నువ్వు రాముడి వెనకాల వచ్చావు, నిన్ను భరతుడే పంపించాడు. మీ ఇద్దరూ కలిసి కుట్ర చేశారు. కాని నువ్వు ఒక విషయం తెలుసుకో, ఇదీ ప రశ్యాముడైన రాముడు పడిపోయాక నేను నిన్ను కన్నెత్తి కూడా చూడను. నేను వెళ్ళమన్నా వెళ్ళకుండా, రాముడు ప్రాణాపాయంలో ఉంటె నువ్వు నా దెగ్గర నిలబడి మాట్లాడుతున్నావు కనుక, నీ ఎదుటనే విషం తాగి శరీరాన్ని విడిచిపెట్టేస్తాను " అనింది.అప్పుడు లక్ష్మణుడు " ఎంత ప్రమాదం తెచ్చావు వదిన ఇవ్వాళ. నేను ఇక్కడ నిలబడితే నీ ప్రాణాలు తీసుకుంటావు, నేను వెళ్ళిపోతే నీకు ప్రమాదం వస్తుంది " అని అన్నాక రెండుచేతులతో సీతమ్మ పాదాలు పట్టుకొని " వదినా! నువ్వు ఇవ్వాళ ఒక సామాన్యమైన స్త్రీ మాట్లాడినట్టు మాట్లాడావు, నువ్వు నన్ను ఇన్ని మాటలు అన్నావు, కాని నేను మాత్రం ఒక్కదానికి కూడా జవాబు చెప్పను. ఆ మాటలకి ఏమి చెప్పుకొని జవాబు చెప్పను. నేను నిన్ను ఎన్నడూ ఆ భావనతో చూడలేదు. అటువంటి నన్ను ఇన్ని మాటలు అన్నావు, భరతుడిని కూడా కలిపావు. ఎన్ని మాటలు చెబితే నేను తిరిగి నీ మాటలకి జవాబు చెప్పగలను. అందుకని నేను ఏ ఒక్క మాటకి జవాబు చెప్పను. నువ్వు వదినవి, పెద్దదానివి, అనడానికి నీకు అర్హత ఉంది. కాని నన్ను ఇన్నిమాటలు అని దూరంగా పంపించడం వలన ఫలితాన్ని మాత్రం నువ్వు పొందుతావు.

వదిన నాతో అన్న మాటలని నేను అన్నయ్యతో చెప్పలేను కనుక, ఓ వనదేవతలార! మీరు నాకు సాక్ష్యంగా ఉండండి. నేను ఇప్పుడు వదినని వెళ్ళడంలో ఉన్న న్యాయాన్ని వనదేవతలు గ్రహించెదరుగాక. వదినా! నేను రాముడి దెగ్గరికి వెళుతున్నాను, నిన్ను ఈ వనదేవతలు రక్షించాలని కోరుకుంటున్నాను " అని వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి సీతమ్మ పాదాల వంక చూసి శిరస్సు వంచి నమస్కరిస్తూ " అమ్మా! నేను మళ్ళి తిరిగొచ్చి, మా అన్నయ్య నీ పక్కన నిలుచుంటే, మా అన్నయ్య పాదాలకి నీ పాదాలకి కలిపి నమస్కరించే అదృష్టం నాకు దొరుకుతుందా...." అన్నాడు. 

అప్పుడు సీతమ్మ " పాపిష్ఠివాడ, నువ్వు ఇంకా వెళ్ళకుండా నిలుచుంటే నీకు దక్కుతానని అనుకుంటున్నావేమో. నా పాదంతో కూడా నిన్ను తాకను. నువ్వు వెళ్ళకపోతే ఇప్పుడే విషం తాగన్నా, అగ్నిలో దూకన్నా, గోదావరిలో దూకన్నా, ఉరి వేసుకొని అయినా చనిపోతాను. కదులుతావ కదలవా " అని సీతమ్మ తన కడుపు మీద బాదుకొని ఏడ్చింది. 

అప్పుడా లక్ష్మణుడు సీతమ్మకి ప్రదక్షిణం చేసి ఏడుస్తూ వెళ్ళిపోయాడు. 

అప్పటిదాకా రథంలో ఉన్న రావణుడు, లక్ష్మణుడు కంటికి కనపడనంత దూరానికి వెళ్ళాక, ఆ రథం నుండి కిందకి దిగి కామరూపాన్ని దాల్చాడు. మృదువైన కాషాయ వస్త్రాలని ధరించి, ఒక పిలక పెట్టుకుని, యజ్ఞోపవీతం వేసుకుని, ఎడమ భుజానికి కమండలాన్ని ధరించి, రాశిభూతమైన తేజస్సుతో పరివ్రాజక(సాధువు) వేషాన్ని ధరించి ఆశ్రమం వైపు వెళ్ళాడు. రావణాసురుడు మారువేషంలో వస్తున్నాడని అక్కడున్నటువంటి చెట్లు కనిపెట్టి కదలడం మానేసి అలా నిలబడిపోయాయి. అప్పటిదాకా చక్కగా వీచిన గాలి రావణుడిని చూడగానే మందంగా వీచింది. రావణుడు తన ఎర్రటి కళ్ళతో చూసేసరికి, అప్పటిదాకా ఉరకలు వేసిన గోదావరి చప్పుడు చెయ్యకుండా చాలా నెమ్మదిగా ప్రవహించింది.


అలా ఆ రావణుడు సీతమ్మ దెగ్గరికి వెళ్ళి " నువ్వు పచ్చని పట్టుచీర కట్టుకొని, పద్మం వంటి ముఖంతో, పద్మములవంటి చేతులతో, పద్మాలలాంటి పాదాలతో ఉన్నావు. నువ్వు భూమి మీద యదేచ్ఛగా తిరగడానికి వచ్చిన రతీదేవివా. నీ ముఖం ఎంత అందంగా ఉంది, నీ కళ్ళు ఎంత అందంగా ఉన్నాయి.........." అంటూ సీతమ్మని కేశములనుండి పాదముల వరకూ ఏ అవయవాన్ని వదలకుండా అంగాంగ వర్ణన చేశాడు. అలాగే " చాలా వేగంగా ప్రవహిస్తున్న నది ఒడ్డుని విరిచినట్టు, నువ్వు నా మనస్సుని విరిచేస్తున్నావు. యక్ష, కిన్నెర, గంధర్వ స్త్రీలలో నీవంటి స్త్రీని నేను ఎక్కడా చూడలేదు. ఇంత అందమైన దానివి ఈ అరణ్యంలో ఎందుకున్నావు? అయ్యయ్యో ఇది చాలా క్రూరమృగాలు ఉండే అరణ్యం, ఇక్కడ రాక్షసులు కామరూపాలలో తిరుగుతుంటారు, నువ్వు తొందరగా ఇక్కడినుంచి వెళ్ళిపో. నువ్వు మంచి మంచి నగరాలలో, పట్టణాలలో ఉండాలి, అక్కడ ఉండి సుఖాలు అనుభవించాలి. నువ్వు శ్రేష్టమైన మాలికలు, హారాలు వేసుకోవాలి, మంచి బట్టలు కట్టుకోవాలి, అన్నిటితో పాటు నీకు మంచి భర్త ఉండాలి " అన్నాడు. ( ఒక ఆడదాన్ని అనుభవించాలనే బుద్ధితో ఆమె దెగ్గరికి వచ్చి, ఆమె అందాన్ని పొగుడుతూ, తనని తాను పొగుడుకుంటూ, ప్రేమ అనే అందమైన భావాన్ని అడ్డుపెట్టుకుని మాట్లాడే వాళ్ళలాగ ఆనాడు రావణుడు మాట్లాడాడు.)  
కాని సీతమ్మ తల్లి మనస్సు రాముడి మీదనే ఉండిపోవడం వలన, రావణుడి నీచపు మాటలని ఆమె సరిగ్గా పట్టించుకోలేదు. కాని ఇంటికొచ్చిన అతిథికి ఎంత గౌరవంగా పూజ చేస్తారో, అలా ఆ భిక్షుని రూపంలో ఉన్న రావణుడికి ఆసనం ఇచ్చి కూర్చోబెట్టింది. ఆయనకి అర్ఘ్య పాద్యములు ఇచ్చింది. 

సీతాపహరణం ద్వారా తనని తాను చంపుకోడానికి సిధ్దపడుతున్న రావణాసురుడికి సమస్తమైన అతిథి పూజ సీతమ్మ చేస్తుంది అని వాల్మీకి మహర్షి అన్నారు.


అప్పుడా సీతమ్మ " నా పేరు సీత, నేను జనక మహారాజు కూతురిని. రాముడి ఇల్లాలిని. నేను ఇక్ష్వాకువంశంలో పుట్టిన రాముడిని పెళ్ళి చేసుకున్న తరువాత మనుషులు అనుభవించే భోగములన్నిటిని అనుభవించాను( సీతమ్మ తనని తాను జగన్మాతగా రావణుడికి పరోక్షంగా చెప్పింది). కైకమ్మ కోరిక మేరకు 14 సంవత్సరాలు అరణ్యవాసం చెయ్యడానికి రాముడు అరణ్యాలకి వచ్చాడు. ఆయన తమ్ముడైన లక్ష్మణుడు సర్వకాలములయందు మాకు సేవ చేస్తుంటాడు.

మమ భర్తా మహాతేజా వయసా పంచ వింశకః ||
అష్టా దశ హి వర్షాణి మమ జన్మని గణ్యతే ||

అరణ్యవాసానికి వచ్చేటప్పటికి నాకు 18 సంవత్సరాలు, రాముడికి 25 సంవత్సరాలు  " అని చెప్పి  " ఓ బ్రాహ్మణుడా! నువ్వు ఒక్కడివి ఈ అరణ్యంలో ఎందుకు తిరుగుతున్నావు, నీ గోత్రం ఏమిటి, నువ్వు ఎవరు " అని అడిగింది. 

అప్పుడా రావణుడు " సీత! నా పేరు రావణాసురుడు. నన్ను చూస్తే దేవతలు, గంధర్వులు, అందరూ భయపడిపోతారు. పట్టుబట్ట కట్టుకుని ఇంత అందంగా ఉన్న నీ స్వరూపాన్ని చూసిన దెగ్గరి నుంచీ, ఎందరో భార్యలు ఉన్నా ఆ భార్యలతో క్రీడించినప్పుడు నాకు సుఖం కలగడంలేదు, అందుకని నీకోసం వచ్చాను. నువ్వు నాతో వస్తే, నిన్ను పట్టమహిషిని చేస్తాను. నువ్వు నా భార్యవి అయితే, 5000 మంది దాసీలు నీకు సేవ చేస్తారు, సమస్త లోకంలో ఉన్న ఐశ్వర్యాన్ని తీసుకొచ్చి నీకు ఇచ్చేస్తాను " అన్నాడు.

రావణుడి నీచమైన మాటలు విన్న సీతమ్మ " రావణా! నీకు తెలియక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావురా. మహా సముద్రాన్ని, పర్వతాన్ని కదపడం ఎలా చేతకాదో, అలా మహానుభావుడు, సర్వలక్షణ సంపన్నుడు, ధర్మాత్ముడు, పూర్ణచంద్రుని వంటి ముఖము కలిగినవాడు, జితేంద్రియుడు, సింహంలాంటి బాహువులు కలిగినవాడు, మదించిన ఏనుగులా నడవగలిగినవాడు అయిన నా భర్త రామచంద్రుని అనుసరించి ప్రవర్తిస్తానే తప్ప, నీవంటి దిక్కుమాలినవాడు ఐశ్వర్యం గురించి మాట్లాడితే వచ్చేటటువంటి స్త్రీని కాదు. ఒక నక్క సింహాన్ని ఎలా చూడలేదో, నువ్వు నన్ను అలా చూడలేవు. సూర్యకాంతిని దెగ్గరికి వెళ్ళి ఎలా ముట్టుకోలేమో, నువ్వు నన్ను అలా పొందలేవు. నువ్వు పాము యొక్క కోర పీకడానికి ప్రయత్నిస్తున్నావు. కంట్లో సూది పెట్టి నలక తీసుకున్నవాడు ఎంత అజ్ఞానో, పెద్ద రాయిని మెడకి చుట్టుకుని సముద్రాన్ని ఈదుదాం అనుకున్నవాడు ఎంత అజ్ఞానో, సూర్య చంద్రులని చేతితో పట్టుకుని ఇంటికి తీసుకువెళదాము అనుకున్నవాడు ఎంత అజ్ఞానో, ఇనుప కొనలున్న శూలం మీద నడుద్దాము అనుకున్నవాడు ఎంత అజ్ఞానో, నువ్వు అంత అజ్ఞానివి. సీసానికి బంగారానికి, గంధపు నీటికి బురదకి, ఏనుగుకి పిల్లికి, కాకికి గరుగ్మంతుడికి, నీటి కాకికి నెమలికి, హంసకి ఒక చిన్న పిట్టకి ఎంత తేడా ఉంటుందో, రాముడికి నీకు అంత తేడా ఉంది " అని అనింది.

అప్పుడా రావణుడు " నేను సాక్షాత్తు కుబేరుడి తమ్ముడిని, ఒకానొకప్పుడు కుబేరుడి మీద కోపం వచ్చి యుద్ధం చేసి, ఆ కుబేరుడిని లంకా పట్టణం నుంచి వెళ్ళగొట్టాను. ఆయన ఉత్తర దిక్కుకి వెళ్ళిపోయాడు. మళ్ళి ఉత్తర దిక్కుకి వెళ్ళి మా అన్నయ్యని చావగొట్టి పుష్పక విమానం తెచ్చుకున్నాను. నాకు కాని కోపం వచ్చి కనుబొమ్మలని ముడేస్తే, ఇంద్రుడు దేవతలతో సహా పారిపోతాడు. దశరథుడి చేత వెళ్ళగొట్టబడి, రాజ్యం లేక, అరణ్యాలలో తిరుగుతున్న ఆ రాముడిని నమ్ముకుంటావేంటి. నా దెగ్గరున్న ఐశ్వర్యాన్ని చూసి నా భార్యవి అవ్వు. నేను చిటికిన వేలితో చేసే యుద్ధానికి రాముడు సరిపోడు. ఏమి చెప్పమంటావు నీ అదృష్టం, నా కన్ను నీ మీద పడింది, నన్ను నువ్వు పొందు " అని గర్వంగా అన్నాడు.

Sunday, 22 April 2012

రామాయణం @ కధ -43


రావణుడు, మారీచుడు ఇద్దరూ కలిసి రాముడున్న ఆశ్రమం దెగ్గర రథంలో దిగారు.


అప్పుడా మారీచుడు ఒక అందమైన జింకగా మారిపోయాడు. దాని ఒళ్ళంతా బంగారు రంగులో ఉంది, దానిమీద ఎక్కడ చూసినా వెండి చుక్కలు ఉన్నాయి. ఇంద్రనీలము ప్రకాశించినట్టు దాని కొమ్ములు ప్రకాశిస్తున్నాయి. సగం నల్లకలువ రంగులో, సగం ఎర్రకలువ రంగులో ఆ జింక యొక్క ముఖం ఉంది. దాని కడుపు ముత్యాలు మెరిసినట్టు మెరుస్తుంది. సన్నని కాళ్ళతో ఉంది. సృష్టిలో ఇప్పటి వరకూ ఎవరూ ఎరుగని రూపాన్ని మారీచుడు పొంది, గంతులేసుకుంటూ ఆశ్రమంలోకి ప్రవేశించాడు. అక్కడున్నటువంటి లేత చిగుళ్ళని తింటూ, అటూ ఇటూ పరుగులు తీస్తూ, అక్కడున్న మృగాల దెగ్గరికి వెళుతూ, మళ్ళి తిరిగి వస్తూ ఒక జింక ప్రవర్తించినట్టు ప్రవర్తించడానికి ప్రయత్నిస్తున్నాడు. 


కాని మారీచుడు మిగతా మృగాల దెగ్గరికి వెళ్లేసరికి, అవి ఈయనని రాక్షసుడిగా కనిపెట్టి దిక్కులు పట్టి పారిపోయాయి. అదే సమయంలో సీతమ్మ పువ్వులు కొయ్యడాని కని అటుగా వెళ్ళింది. ఆవిడ కర్ణికారవ వృక్షం యొక్క పూవులు కోస్తుంటే, ఆవిడకి అభిముఖంగా వచ్చి మారీచుడు నిలబడ్డాడు. ఆ జింకని చూసిన సీతమ్మ పొంగిపోయి " రామా! లక్ష్మణా! మీరు మీ ఆయుధములను ధరించి గబగబా రండి " అనింది. రామలక్ష్మణులు వచ్చాక, సీతమ్మ వాళ్ళతో " ఎదురుగా ఉన్న ఆ మృగాన్ని చూశార, ఎంత అందంగా ఉందో. సృష్టిలో ఇలాంటి మృగాన్ని నేను ఇప్పటివరకు చూడలేదు. ఆ బంగారు రంగు చర్మము, వెండి చుక్కలు.............." అని సీతమ్మ ఆ మృగాన్ని గూర్చి వర్ణించబోతుండగా, వెంటనే లక్ష్మణుడు ఇలా అన్నాడు.....


శంకమానః తు తం దృష్ట్వా లక్ష్మణో రామం అబ్రవీత్ |
తం ఏవ ఏనం అహం మన్యే మారీచం రాక్షసం మృగం ||

" అన్నయ్యా, ఇది మృగం కాదు, ఇది మారీచుడు. ఈ సృష్టిలో ఎక్కడా ఇటువంటి జింక లేదు. ఈ మారీచుడు ఇలా కామరూపాన్ని పొంది, వేటకి వచ్చిన ఎందరో రాజులని ఆకర్షించి, భుజించాడు. నామాట నమ్ము, ఇది కచ్ఛితంగా మారీచుడి మాయ " అన్నాడు.

అప్పుడు సీతమ్మ లక్ష్మణుడిని ఇంక మాట్లాడవద్దు అన్నట్టు వారించి రాముడితో " ఆర్యపుత్రా! నా మనస్సుని ఈ మృగం హరిస్తోంది, నాకు ఆడుకోవడానికి ఆ మృగాన్ని తెచ్చి ఇవ్వండి. చంద్రుడు అరణ్యాన్ని ప్రకాశింప చేసినట్టు, ఒంటి మీద రాత్నాలాంటి చుక్కలతో ఈ జింక అరణ్యాన్ని ప్రకాశింపచేస్తుంది. మనం కట్టుకున్న ఆశ్రమంలో ఎన్నో మృగాలు ఉన్నాయి, వాటితో పాటు ఈ జింక కూడా ఉంటె నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. ఆహా, ఏమి లక్ష్మీ స్వరూపం, ఏమి అందం, ఏమి ప్రకాశం, మీరు ఎలాగన్నా సరే ఆ మృగాన్ని పట్టి నాకు ఇవ్వండి. ఇంక కొంతకాలంలో ఈ అరణ్యవాసం పూర్తయిపోయి మనం అంతఃపురానికి వెళ్ళి పోతాము. అప్పుడు ఈ మృగాన్ని తీసుకొనివెళదాము. ఈ మృగం భవిష్యత్తులో అంతఃపురాన్ని శోభింపచేస్తుంది. మనం అంతఃపురానికి వెళ్ళగానే భరతుడు ఈ మృగాన్ని చూసి ' అబ్బ, ఏమి మృగం వదిన ' అంటాడు, అత్తగార్లు అందరూ చూసి ' అబ్బ, ఏమి మృగం ' అంటారు. అందుకని మీరు దాన్ని జీవించి ఉండగానన్నా పట్టుకురండి, లేకపోతే చంపైనా తీసుకురండి. మీరు ఒకవేళ దాన్ని చంపి తీసుకువస్తే, దాని చర్మాన్ని ఒలుచుకొని, లేత పచ్చగడ్డి మీద ఈ జింక చర్మాన్ని పరుచుకొని దాని మీద కూర్చుంటే, ఎంతబాగుంటుందో. రామ! నేను స్త్రీని కావడం చేత, ఏదన్నా కోరిక కలిగేటప్పటికి భావంలో వ్యగ్రత ఏర్పడుతుంది. ' ఎలాగైనా నా కోరిక తీర్చవలసిందే ' అని మంకుపట్టు పట్టినట్టు మాట్లాడాన. అలా మాట్లాడితే ఏమి అనుకోకండి  " అనింది.   

అప్పుడు రాముడు లక్ష్మణుడి వంక చూసి " లక్ష్మణా! మీ వదిన ఈ 13 సంవత్సరాల అరణ్యవాసంలో ఏమి అడగలేదు. మొట్టమొదటి సారి ఈ జింకని అడుగుతుంది. ఆ మృగం పట్ల ఎంత వ్యామోహాన్ని పెంచుకుందొ మీ వదిన మాటలలో స్పష్టంగా అర్ధమవుతోంది. ఆమె ఇంతగా ఈ మృగాన్ని అడుగుతుంటే, తీసుకురాను అని నేను ఎలా అనగలను. అందుకని నేను ఆ మృగాన్ని పట్టుకొని తీసుకువస్తాను. ఒకవేళ నేను దాన్ని ప్రాణాలతో తీసుకురాలేకపోతే, దాని శరీరాన్ని అయినా తీసుకువస్తాను. మీ వదిన చెప్పినట్టు ఇలాంటి మృగాన్ని నేను ఎక్కడా చూడలేదు. ఇలాంటివి నాకు తెలిసి రెండే ఉన్నాయి, ఒకటి చంద్రుడిలో ఉంది, ఇది భూమి మీద ఉంది ( దీని అర్ధం ఏంటంటే, చంద్రుడిలో ఎటువంటి మృగం ఉండదు, అలాగే భూమి మీద ఇది ఉందంటే, ఈ రెండూ మాయె అని అర్ధం). ఒకవేళ నువ్వు చెప్పినట్టు ఆ మృగం మారీచుడె అయితే నేను వాడిని సంహరిస్తాను. లక్ష్మణా! చాలా జాగ్రత్త సుమా. ప్రతి క్షణమూ నువ్వు శంకిస్తూనె ఉండాలి. నువ్వు మరియు జటాయువు సీతని జాగ్రత్తగా కాపాడండి " అని చెప్పి, రాముడు ఆ మృగాన్ని పట్టుకోవడానికని దాని వెనకాల వెళ్ళాడు. 

జింక రూపంలో ఉన్న మారీచుడు ముందు పరిగెడుతున్నాడు, వెనకాల రాముడు పరిగెడుతున్నాడు. ఆ మారీచుడు కనపడినట్టు కనపడి మాయమవుతూ, మందలలో కలిసిపోతూ అటూ ఇటూ పరుగులు తీస్తున్నాడు. మారీచుడు రాముడికి ఒక్కొక్కసారి ఇక్కడే కనపడుతున్నాడు, కాని రాముడు అక్కడికి వెళ్ళేసరికి అక్కడెక్కడో దూరంగా కనపడతాడు. సరే అని రాముడు అక్కడిదాకా పరుగు తీసి వెళ్ళేసరికి అంతర్ధానమయిపోతున్నాడు. అలా రాముడిని పరిగెత్తించి పరిగెత్తించి ఆ అరణ్యంలోకి చాలా దూరంగా తీసుకుపోయాడు. అప్పుడిక రాముడు పరిగెత్తలేక అలసిపోయి ఒక చెట్టుకింద కూర్చున్నాడు. అప్పుడు దూరంగా, మృగాల యొక్క మందలో చెవులు అటూ ఇటూ తిప్పుతూ ఆ మృగం మళ్ళి కనపడింది. ఈ మృగాన్ని పట్టుకోవడానికి ఇక పరిగెత్తడం అనవసరమని రాముడు అనుకొని, ఒక త్రాచుపాములాంటి బాణాన్ని కొదండానికి సంధించి, బ్రహ్మగారి చేత నిర్మింపబడిన బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి, ఆ మృగం వైపు గురి చూసి బాణాన్ని విడిచిపెట్టాడు. ఆ బ్రహ్మాస్త్రం నిప్పులు కక్కుతూ మారీచుడి మీద పడింది. అప్పుడా మారీచుడు రాముడి స్వరంతో గట్టిగా " హా! సీతహా! లక్ష్మణా " అని అరిచాడు. ఆనకట్ట పగిలి అందులోనుంచి నీరు బయటకి వస్తే ఎలా ఉంటుందో, అలా మారీచుడి శరీరం నుండి నెత్తురు బయటకి ప్రవహిస్తుండగా ఆ మారీచుడు భూమి మీద తన నిజస్వరూపంతో పడిపోయాడు. ఆ దృశ్యాన్ని చూశిన రాముడికి వెంటనే సీతమ్మ గుర్తుకు వచ్చింది, లక్ష్మణుడి మాట గుర్తుకువచ్చింది. సీతకి ఎటువంటి ఉపద్రవం రాలేదు కాదా అని బెంగ పెట్టుకొని, అక్కడున్నటువంటి రెండు మృగాలని సంహరించి, వాటి మాంసాన్ని తీసుకొని గబగబా ఆశ్రమం వైపు బయలుదేరాడు. ఇంతలో మారీచుడు అన్నటువంటి ' హా! సీత, హా! లక్ష్మణా ' అనే కేక సీతమ్మ చెవిన పడింది. అప్పుడు సీతమ్మ లక్ష్మణుడిని పిలిచి " చూడవయ్యా మీ అన్నగారు ఏదో ఉపద్రవంలో ఉన్నారు. ' హా! సీత, హా! లక్ష్మణా' అని ఒక పెద్ద కేక వేశారు. బలిష్టమైన ఎద్దుని సింహం లాగుకొని పోతుంటే ఆ ఎద్దు ఎలా అరుస్తుందో, ఇవ్వాళ మీ అన్నగారు అలా అరుస్తున్నారు. నాకు చాలా బెంగగా ఉంది, నువ్వు వెంటనే బయలుదేరి అరణ్యంలోకి వెళ్ళు " అని అనింది. 

అప్పుడు లక్ష్మణుడు " వదినా! నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు, అన్నయ్యకి ఏ ప్రమాదము రాదు " అని అన్నాడు.

తన భర్త ప్రమాదంలో ఉన్నాడేమో అన్న బెంగతో ఉన్న సీతమ్మ లక్ష్మణుడి మాటలకి ఆగ్రహించి " నాకు ఇప్పుడు అర్ధమయ్యింది నువ్వు ఎందుకు వచ్చావో. నువ్వు మీ అన్నకి తమ్ముడివి కావు, నువ్వు మీ అన్న పాలిట పరమ శత్రువువి. అందుకే మీ అన్న ప్రమాదంలో ఉంటె నువ్వు ఇంత సంతోషంగా కుర్చోగలుగుతున్నావు. నువ్వు ఇంతకాలం రాముడి వెనకాల ఉండడానికి కారణం నా మీద నీకు కోరిక ఉండడమే. అందుకే, రాముడికి ప్రమాదం వస్తే నన్ను పొందాలని వెనకాలే వచ్చావు. నీ ముఖంలో ఒక గొప్ప నమ్మకం, హాయి కనపడుతున్నాయి. శత్రువు చేతిలో దెబ్బతిన్న రాముడి గొంతు విని ఇంత హాయిగా కూర్చున్నావు. ఈ క్షణం కోసమే నువ్వు 13 సంవత్సరాల నుంచి నిరీక్షిస్తున్నావు. మహాపాపి! ఎంత ద్రోహబుద్ధితో వచ్చావురా. నువ్వు రాముడిని విడిచిపెట్టి ఉండలేక, రాముడికి సేవ చెయ్యడానికే వచ్చినవాడివి అయితే, రాముడు అరణ్యంలో ' హా! సీత, హా! లక్ష్మణా ' అని అరిస్తే నువ్వు ఇంత హాయిగా కుర్చోగాలవా, నాతో కూడా చెప్పకుండా అన్నగారిని కాపాడడం కోసం పరుగెత్తేవాడివి. బహుశా భరతుడే నిన్ను పంపాడేమో, మీ ఇద్దరు కలిసి కుట్ర చేశారు " అనింది.

తన రెండుచేతులతో సీతమ్మకి అంజలి ఘటించి లక్ష్మణుడు ఇలా అన్నాడు " దేవతలు, దానవులు, గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, ఈ బ్రహ్మాండంలో ఉన్న వారంతా  ఒకపక్క, మా అన్నయ్య ఒక పక్క ఉన్నా ఆయనని ఎవరూ నిగ్రహించలేరు. అన్నయ్య పరాక్రమమేమిటో నాకు తెలుసు. వదినా! ఎవరో అరిస్తే నువ్వు బెంగ పెట్టుకొని మాట్లాడుతున్నావు, అరిచినది మయా మారీచుడు, అన్నయ్య అరవలేదు. నామాట నమ్ము. 


Saturday, 21 April 2012

రామాయణం @ కధ -42


అజాత వ్యంజనః శ్రీమాన్ బాలః శ్యామః శుభేక్షణః |
ఏక వస్త్ర ధరో ధన్వీ శిఖీ కనక మాలయా ||


నేను కిందకి చూసేసరికి, మెడలో ఒక బంగారు గొలుసు వేసుకుని, మీసాలు సరిగ్గా రాని, పద్మముల వంటి కన్నులున్న, ఒక్క వస్త్రం కట్టుకుని, చేతిలో కోదండం పట్టుకొని, పిలక పెట్టుకొని ఉన్నవాడిని చూశాను. విశ్వామిత్రుడు వెళ్ళి ఈ పిల్లవాడినా తీసుకొచ్చింది, వీడా నన్ను చంపేవాడు అని, నువ్వు ఇప్పుడు ఎలా అనుకున్నావో నేను కూడా అప్పుడు అలానే అనుకున్నాను. బాలచంద్రుడి వంటి ముఖంతో ఉన్న ఆ రాముడు నన్ను ఏమి చేస్తాడులే అని నేను ఆ యాగ గుండంలో రక్తాన్ని వర్షించాను. అప్పుడు రాముడు నన్ను ఒక బాణం పెట్టి కొడితే నేను 100 యోజనముల అవతల సముద్రంలో పడిపోయాను. కొంతకాలానికి నాకు తెలివి వచ్చింది. అప్పటినుంచి నాకు రాముడన్నా, రామబాణం అన్నా హడల్. 


పాములున్న సరోవరంలోకి చేరిన చేపలు ఎలా నశించిపోతాయో, తాను ధర్మంగా బతుకుతున్నా, అధర్మాత్ముడితో స్నేహంపెట్టుకున్నవాడు కూడా అలానే నశించిపోతాడు. అందుకని నీతో స్నేహం పెట్టుకోవడానికి నాకు భయంగా ఉంది. అసలు నీకు పరుల భార్యలని తెచ్చుకోవాలనే కోరిక ఏమిటి? నీకు ఉన్నటువంటి వేల భార్యలతో సుఖంగా ఉండలేవా? ఇప్పటిదాకా బాగానే ఉన్న నీకు ఇటువంటి పాడు బుద్ధి ఎందుకు కలిగింది? రాముడి జోలికి వెళ్ళమాకు నాశనమయిపోతావు.ఆనాడు రాముడి బాణపు దెబ్బ తిన్నాక కొంతకాలానికి నాకు మళ్ళి అహంకారం పుట్టుకొచ్చింది. రాముడు మళ్ళి కనబడడులే అని ఒక పెద్ద మృగ రూపం పొందాను. నాకున్న పాత స్నేహితులిద్దరితో కలిసి తాపసులని చంపి, వారిని భక్షిద్దామని మేము బయలుదేరాము. అలా కొన్ని ఆశ్రమాల మీద దాడి చేసి, అక్కడున్న తాపసులని భుజించాము. తరువాత మేము అలా తిరుగుతుండగా నాకు నారచీర కట్టుకుని, జటలు వేసుకుని, సీతమ్మతో, లక్ష్మణుడితో కలిసి కోదండం పట్టుకుని ఉన్న రాముడు కనిపించాడు. అయితే రాముడు మారిపోయాడు, ఇప్పుడాయన ఒక తాపసి కనుక నేను తినేయ్యచ్చు అనుకొని, నా స్నేహితులిద్దరిని ప్రోత్సహించి రాముడి మీదకి పంపాను. అప్పుడు రాముడు వాళ్ళిద్దరిని రెండు బాణములతో సంహరించాడు. నేను కనపడితే రాముడు నన్ను చంపెస్తాడని, ఆయనకి కనపడకుండా పారిపోయి వచ్చేసాను. అప్పటినుంచీ నాకు నిద్రలో రాముడు కోదండం పట్టుకొని కనపడుతున్నాడు, నేను ఉలిక్కిపడి లేచిపోతుంటాను. అందుకని ఇక చంపడాలు మానేసి, నారచీర కట్టుకుని, శాఖాహారం తింటూ, తపస్సు చేసుకుంటున్నాను.

అలా నేను ఏ కందమూలాలో తెచ్చుకుందామని బయటకి వస్తే, ప్రతి కొమ్మ మీద, కాయ మీద, గడ్డిపరక మీద, భూమి మీద, నీటి మీద, ప్రతీ చోట నన్ను చంపడానికి యముడు వచ్చినట్టు రాముడు కనపడుతుంటాడు. అందుకని నేను బయటకి కూడా వెళ్ళడం లేదు. నాకు ఇప్పుడు కన్ను మూసినా, తెరిచినా రాముడే కనపడుతున్నాడు. నాకు అంతా రామమయమై కనపడుతుంటే, నేను ఎవరిని బాధపెట్టను, ఎవరి జోలికి వెళ్ళను? రావణా! ఇవ్వాళ నా పరిస్థితి ఏంటో తెలుసా, నా దెగ్గరికి ఎవరన్నా వచ్చి రథము అని అందామనో, లేకపోతే రత్నము అని అందామనో, 'ర' అని పలుకగానే, వారు తరువాత 'మ' అంటారేమో అని నేను పారిపోతున్నాను. నీ తీట తీరక యుద్ధం చేస్తాను అంటె, యుద్ధం చేసుకో, నా మాటలు విని నీ కోరిక తీరిపోతే ఎలా వచ్చావో అలా వెళ్ళిపో. ఈ రెండిటిలో ఏదో ఒకటి చెయ్యి, ఇందులోకి నన్ను మాత్రం లాగకు. 

ప్రతీసారి మా చెల్లి ముక్కు చెవులు కోసేసాడు అంటున్నావు కదా, అసలు మీ చెల్లి ఏమి చేసిందని ఆవిడ ముక్కు చెవులు కోసేసారో అని మీరెవరన్నా అడిగార. ఇలా అడగకుండా వెళ్ళిన ఆ ఖరుడు మరణించాడు. నువ్వు కూడా అదే మార్గంలో వెళ్ళిపోతున్నావు. నామాట విని ఇటువంటి పనులు చెయ్యకు " అని మారీచుడు అన్నాడు. మారీచుడు చెప్పిన మంచి మాటలు తలకి ఎక్కకపోవటం వలన రావణుడు ఇలా అన్నాడు " అన్ని గొప్పలు చెబుతావేంటి రాముడి గురించి, రాముడు కేవలం ఒక మనిషి, నాదెగ్గర రాముడిని పొగడద్దు, నా నిర్ణయం మారదు. ఖరుడు వెళ్ళిన మార్గంలోనే రాముడిని కూడా పంపుతాను. నీ సహాయంతోనే సీతని ఎత్తుకొస్తాను. నేను నిన్ను సీతని అపహరించడం కోసమని జింక వేషం వెయ్యమన్నాను. అంతేకాని ఇందులో అపాయం ఉందా లేదా అని నేను నిన్ను అడగలేదు. ఇవన్నీ నిన్ను ఎవడు చెప్పమన్నాడు. నువ్వు పరిధిని మించి మాట్లాడుతున్నావు. ప్రభువు నీ దెగ్గరికి వచ్చి మాట్లాడుతుంటే, అడిగిన ప్రశ్నకి అంజలి ఘటించి జవాబు చెప్పడం నీ బాధ్యత, ఇక అంతకన్నా ఎక్కువ మాట్లాడకూడదు. రాజు అగ్ని, ఇంద్రుడు, సోముడు, వరుణుడు, యముడు అనే 5 రూపాలలో ఉంటాడు. నువ్వు నా మాట వింటే, నేను నీ పట్ల సౌమ్యంగా ఉంటాను, కాదంటే నేను నీకు యముడిని అవుతాను. నేను చెప్పినట్టు నువ్వు వెంటనే బంగారు లేడిగా మారి బయలుదేరు. జింకగా వెళితే రాముడి చేతిలో చస్తావో లేదో అన్నది అనుమానమే, కాని వెళ్ళనంటే మాత్రం నేను నిన్ను చంపేస్తాను " అన్నాడు.

అప్పుడు మారీచుడు " రాజు తప్పు త్రోవలో నడుస్తుంటే, మంత్రులైన వారు చుట్టూ చేరి నిగ్రహించాలి, అలా నిగ్రహించని మంత్రులు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. రాజ్యపాలన నిర్వహిస్తున్నవాడిని పాశములతో పట్టే స్థితిలో మంత్రులు లేకపోతే, ఆ మంత్రులకి మరణశిక్ష విధించాలి. రాజె ధర్మం, రాజె జయం, రాజు వల్లనే లోకానికి రక్షణ. ఆ రాజు ధర్మం తప్పిననాడు లోకంలో రక్షణ ఉండదు, ఆ రాజుని ఆశ్రయించిన వారెవరూ బ్రతకరు. 

స్వామినా ప్రతికూలేన ప్రజాః తీక్ష్ణేన రావణ |
రక్ష్యమాణా న వర్ధంతే మేషా గోమాయునా యథా ||

రాజన్నవాడు ప్రజల వెనకాల ఎలా ఉండాలంటే, కొడుకుల వెనక తండ్రిలా ఉండాలి. అలా ఉండనివాడు ఆవుల వెనకాల వచ్చిన నక్కలాంటి వాడు. అలాంటివాడి వలన ఆ ప్రజలకి భద్రత ఉండదు. నీలాంటి దుర్మార్గుడు రాజుగా ఉన్న ఆ రాజ్యంతో పాటు, ఆ రాక్షసులూ నశించిపోతారు. నీకు పుట్టిన ఈ నీచమైన కోరిక వలన నీ సైన్యం కూడా నశించిపోతుంది. రాముడు చూస్తుండగా సీతమ్మని తీసుకురాలేవని తెలిసి, రాముడు లేనప్పుడు సీతమ్మని అపహరించాలని ప్రయత్నం చేస్తున్నావు. నీకు తెలుసు నువ్వు పిరికివాడివని, యుద్ధంలో నిలబడలేవని. నువ్వు నా ప్రభువువి కనుక, నా కొనప్రాణం వరకూ నువ్వు చెప్పిన పనిని చెయ్యడానికి ప్రయత్నిస్తాను, కాని సీతమ్మ కంటే ముందు నన్ను రాముడు చూస్తే, నా పని అయిపోయినట్టే. రాముడిని చూసి నేను ఒక్కడినే చనిపోతాను, ఆ తరువాత సీతమ్మని తెచ్చి, నువ్వు సకల బంధుపరివారంతో చనిపోతావు. ఎప్పుడైతే ఈ పని చేస్తాను అన్నానో, అప్పుడే నా ప్రాణాలు పోయాయి, ఇప్పుడు నీ ముందు ఉన్నది మారీచుడు అనే బొమ్మ, ఆ బొమ్మని నీకు నచ్చినట్టు వాడుకో. నీకు ఎంత చెప్పినా నువ్వు వినడంలేదు కనుక నీ కోరిక తీర్చే ప్రయత్నం చేస్తాను, పద " అని అన్నాడు.