Pages

Monday 23 April 2012

రామాయణం @ కధ -44


న సస్ తస్య స్వరో వ్యక్తం న కశ్చిత్ అపి దైవతః |
గంధర్వ నగర ప్రఖ్యా మాయా తస్య చ రక్షసః ||


నేను యదార్ధం చెబుతున్నాను, అది అసలు మా అన్నయ్య అరుపే కాదు. మాయావి అయినవాడు నిర్మించిన గంధర్వ నగరం ఎలా ఉంటుందో, అలా మా అన్నయ్య కంఠంతో చనిపోయేముందు ఒక మాయావి అరిచాడు. మా అన్నయ్య కంఠం అక్కడ పూర్తిగా రాలేదు. నన్ను దూరంగా పంపితే నువ్వు ప్రమాదంలోకి వెళతావు. అందుకని నువ్వు బెంగ పెట్టుకోకు. నువ్వు అలా చూస్తూ ఉండు, అన్నయ్య కోదండం పట్టుకొని వచ్చేస్తాడు. ఆ మాయ మృగం చర్మంతో వస్తాడు. అన్నయ్య వెళ్ళేముందు, వదినని నీకు అప్పజెప్పి వెళుతున్నాను ప్రతి క్షణాన్ని సంకిస్తూ నువ్వు వదిన పక్కనే ఉండు అన్నాడు. నేను ఇప్పుడు నిన్ను వదిలి వెళితే, అన్నయ్యకి ఇచ్చిన మాట తప్పినవాడిని అవుతాను. ధర్మం తప్పిపోతానని నిలుచున్నాను తప్ప నేను అన్యబుద్ధి కలిగిన వాడిని కాదు వదినా. నన్ను క్షమించు. అన్నయ్య మాట మీద నేను నిలబడేటట్టు అనుగ్రహించు. నిన్నగాక మొన్న ఖర దూషణులతో కలిపి 14,000 మంది రాక్షసులని అన్నయ్య చంపాడు. అన్నయ్య మీద రాక్షసులు పగబట్టి ఉన్నారు. అందుచేత ఎలాగైనా మనకి ఉపద్రవం తేవాలని మాయా స్వరూపంతో ఇవ్వాళ ప్రవర్తించారు. నా మాట నమ్ము, ఆ అరుపులని నమ్మకు " అన్నాడు.


అప్పుడు సీతమ్మ " నాకు అర్ధమయ్యిందిరా మహా పాపి! కృరాత్ముడా! నువ్వు ఎందుకు వచ్చావో నాకు తెలియదని అనుకోకు. రాముడు మరణించాడన్న మాటని ద్రువపరుచుకోడానికి ఇక్కడ నిలుచున్నావు. నన్ను పొందడం కోసమే నువ్వు రాముడి వెనకాల వచ్చావు, నిన్ను భరతుడే పంపించాడు. మీ ఇద్దరూ కలిసి కుట్ర చేశారు. కాని నువ్వు ఒక విషయం తెలుసుకో, ఇదీ ప రశ్యాముడైన రాముడు పడిపోయాక నేను నిన్ను కన్నెత్తి కూడా చూడను. నేను వెళ్ళమన్నా వెళ్ళకుండా, రాముడు ప్రాణాపాయంలో ఉంటె నువ్వు నా దెగ్గర నిలబడి మాట్లాడుతున్నావు కనుక, నీ ఎదుటనే విషం తాగి శరీరాన్ని విడిచిపెట్టేస్తాను " అనింది.



అప్పుడు లక్ష్మణుడు " ఎంత ప్రమాదం తెచ్చావు వదిన ఇవ్వాళ. నేను ఇక్కడ నిలబడితే నీ ప్రాణాలు తీసుకుంటావు, నేను వెళ్ళిపోతే నీకు ప్రమాదం వస్తుంది " అని అన్నాక రెండుచేతులతో సీతమ్మ పాదాలు పట్టుకొని " వదినా! నువ్వు ఇవ్వాళ ఒక సామాన్యమైన స్త్రీ మాట్లాడినట్టు మాట్లాడావు, నువ్వు నన్ను ఇన్ని మాటలు అన్నావు, కాని నేను మాత్రం ఒక్కదానికి కూడా జవాబు చెప్పను. ఆ మాటలకి ఏమి చెప్పుకొని జవాబు చెప్పను. నేను నిన్ను ఎన్నడూ ఆ భావనతో చూడలేదు. అటువంటి నన్ను ఇన్ని మాటలు అన్నావు, భరతుడిని కూడా కలిపావు. ఎన్ని మాటలు చెబితే నేను తిరిగి నీ మాటలకి జవాబు చెప్పగలను. అందుకని నేను ఏ ఒక్క మాటకి జవాబు చెప్పను. నువ్వు వదినవి, పెద్దదానివి, అనడానికి నీకు అర్హత ఉంది. కాని నన్ను ఇన్నిమాటలు అని దూరంగా పంపించడం వలన ఫలితాన్ని మాత్రం నువ్వు పొందుతావు.

వదిన నాతో అన్న మాటలని నేను అన్నయ్యతో చెప్పలేను కనుక, ఓ వనదేవతలార! మీరు నాకు సాక్ష్యంగా ఉండండి. నేను ఇప్పుడు వదినని వెళ్ళడంలో ఉన్న న్యాయాన్ని వనదేవతలు గ్రహించెదరుగాక. వదినా! నేను రాముడి దెగ్గరికి వెళుతున్నాను, నిన్ను ఈ వనదేవతలు రక్షించాలని కోరుకుంటున్నాను " అని వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి సీతమ్మ పాదాల వంక చూసి శిరస్సు వంచి నమస్కరిస్తూ " అమ్మా! నేను మళ్ళి తిరిగొచ్చి, మా అన్నయ్య నీ పక్కన నిలుచుంటే, మా అన్నయ్య పాదాలకి నీ పాదాలకి కలిపి నమస్కరించే అదృష్టం నాకు దొరుకుతుందా...." అన్నాడు. 

అప్పుడు సీతమ్మ " పాపిష్ఠివాడ, నువ్వు ఇంకా వెళ్ళకుండా నిలుచుంటే నీకు దక్కుతానని అనుకుంటున్నావేమో. నా పాదంతో కూడా నిన్ను తాకను. నువ్వు వెళ్ళకపోతే ఇప్పుడే విషం తాగన్నా, అగ్నిలో దూకన్నా, గోదావరిలో దూకన్నా, ఉరి వేసుకొని అయినా చనిపోతాను. కదులుతావ కదలవా " అని సీతమ్మ తన కడుపు మీద బాదుకొని ఏడ్చింది. 

అప్పుడా లక్ష్మణుడు సీతమ్మకి ప్రదక్షిణం చేసి ఏడుస్తూ వెళ్ళిపోయాడు. 

అప్పటిదాకా రథంలో ఉన్న రావణుడు, లక్ష్మణుడు కంటికి కనపడనంత దూరానికి వెళ్ళాక, ఆ రథం నుండి కిందకి దిగి కామరూపాన్ని దాల్చాడు. మృదువైన కాషాయ వస్త్రాలని ధరించి, ఒక పిలక పెట్టుకుని, యజ్ఞోపవీతం వేసుకుని, ఎడమ భుజానికి కమండలాన్ని ధరించి, రాశిభూతమైన తేజస్సుతో పరివ్రాజక(సాధువు) వేషాన్ని ధరించి ఆశ్రమం వైపు వెళ్ళాడు. రావణాసురుడు మారువేషంలో వస్తున్నాడని అక్కడున్నటువంటి చెట్లు కనిపెట్టి కదలడం మానేసి అలా నిలబడిపోయాయి. అప్పటిదాకా చక్కగా వీచిన గాలి రావణుడిని చూడగానే మందంగా వీచింది. రావణుడు తన ఎర్రటి కళ్ళతో చూసేసరికి, అప్పటిదాకా ఉరకలు వేసిన గోదావరి చప్పుడు చెయ్యకుండా చాలా నెమ్మదిగా ప్రవహించింది.


అలా ఆ రావణుడు సీతమ్మ దెగ్గరికి వెళ్ళి " నువ్వు పచ్చని పట్టుచీర కట్టుకొని, పద్మం వంటి ముఖంతో, పద్మములవంటి చేతులతో, పద్మాలలాంటి పాదాలతో ఉన్నావు. నువ్వు భూమి మీద యదేచ్ఛగా తిరగడానికి వచ్చిన రతీదేవివా. నీ ముఖం ఎంత అందంగా ఉంది, నీ కళ్ళు ఎంత అందంగా ఉన్నాయి.........." అంటూ సీతమ్మని కేశములనుండి పాదముల వరకూ ఏ అవయవాన్ని వదలకుండా అంగాంగ వర్ణన చేశాడు. అలాగే " చాలా వేగంగా ప్రవహిస్తున్న నది ఒడ్డుని విరిచినట్టు, నువ్వు నా మనస్సుని విరిచేస్తున్నావు. యక్ష, కిన్నెర, గంధర్వ స్త్రీలలో నీవంటి స్త్రీని నేను ఎక్కడా చూడలేదు. ఇంత అందమైన దానివి ఈ అరణ్యంలో ఎందుకున్నావు? అయ్యయ్యో ఇది చాలా క్రూరమృగాలు ఉండే అరణ్యం, ఇక్కడ రాక్షసులు కామరూపాలలో తిరుగుతుంటారు, నువ్వు తొందరగా ఇక్కడినుంచి వెళ్ళిపో. నువ్వు మంచి మంచి నగరాలలో, పట్టణాలలో ఉండాలి, అక్కడ ఉండి సుఖాలు అనుభవించాలి. నువ్వు శ్రేష్టమైన మాలికలు, హారాలు వేసుకోవాలి, మంచి బట్టలు కట్టుకోవాలి, అన్నిటితో పాటు నీకు మంచి భర్త ఉండాలి " అన్నాడు. ( ఒక ఆడదాన్ని అనుభవించాలనే బుద్ధితో ఆమె దెగ్గరికి వచ్చి, ఆమె అందాన్ని పొగుడుతూ, తనని తాను పొగుడుకుంటూ, ప్రేమ అనే అందమైన భావాన్ని అడ్డుపెట్టుకుని మాట్లాడే వాళ్ళలాగ ఆనాడు రావణుడు మాట్లాడాడు.)  




కాని సీతమ్మ తల్లి మనస్సు రాముడి మీదనే ఉండిపోవడం వలన, రావణుడి నీచపు మాటలని ఆమె సరిగ్గా పట్టించుకోలేదు. కాని ఇంటికొచ్చిన అతిథికి ఎంత గౌరవంగా పూజ చేస్తారో, అలా ఆ భిక్షుని రూపంలో ఉన్న రావణుడికి ఆసనం ఇచ్చి కూర్చోబెట్టింది. ఆయనకి అర్ఘ్య పాద్యములు ఇచ్చింది. 

సీతాపహరణం ద్వారా తనని తాను చంపుకోడానికి సిధ్దపడుతున్న రావణాసురుడికి సమస్తమైన అతిథి పూజ సీతమ్మ చేస్తుంది అని వాల్మీకి మహర్షి అన్నారు.


అప్పుడా సీతమ్మ " నా పేరు సీత, నేను జనక మహారాజు కూతురిని. రాముడి ఇల్లాలిని. నేను ఇక్ష్వాకువంశంలో పుట్టిన రాముడిని పెళ్ళి చేసుకున్న తరువాత మనుషులు అనుభవించే భోగములన్నిటిని అనుభవించాను( సీతమ్మ తనని తాను జగన్మాతగా రావణుడికి పరోక్షంగా చెప్పింది). కైకమ్మ కోరిక మేరకు 14 సంవత్సరాలు అరణ్యవాసం చెయ్యడానికి రాముడు అరణ్యాలకి వచ్చాడు. ఆయన తమ్ముడైన లక్ష్మణుడు సర్వకాలములయందు మాకు సేవ చేస్తుంటాడు.

మమ భర్తా మహాతేజా వయసా పంచ వింశకః ||
అష్టా దశ హి వర్షాణి మమ జన్మని గణ్యతే ||

అరణ్యవాసానికి వచ్చేటప్పటికి నాకు 18 సంవత్సరాలు, రాముడికి 25 సంవత్సరాలు  " అని చెప్పి  " ఓ బ్రాహ్మణుడా! నువ్వు ఒక్కడివి ఈ అరణ్యంలో ఎందుకు తిరుగుతున్నావు, నీ గోత్రం ఏమిటి, నువ్వు ఎవరు " అని అడిగింది. 

అప్పుడా రావణుడు " సీత! నా పేరు రావణాసురుడు. నన్ను చూస్తే దేవతలు, గంధర్వులు, అందరూ భయపడిపోతారు. పట్టుబట్ట కట్టుకుని ఇంత అందంగా ఉన్న నీ స్వరూపాన్ని చూసిన దెగ్గరి నుంచీ, ఎందరో భార్యలు ఉన్నా ఆ భార్యలతో క్రీడించినప్పుడు నాకు సుఖం కలగడంలేదు, అందుకని నీకోసం వచ్చాను. నువ్వు నాతో వస్తే, నిన్ను పట్టమహిషిని చేస్తాను. నువ్వు నా భార్యవి అయితే, 5000 మంది దాసీలు నీకు సేవ చేస్తారు, సమస్త లోకంలో ఉన్న ఐశ్వర్యాన్ని తీసుకొచ్చి నీకు ఇచ్చేస్తాను " అన్నాడు.

రావణుడి నీచమైన మాటలు విన్న సీతమ్మ " రావణా! నీకు తెలియక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావురా. మహా సముద్రాన్ని, పర్వతాన్ని కదపడం ఎలా చేతకాదో, అలా మహానుభావుడు, సర్వలక్షణ సంపన్నుడు, ధర్మాత్ముడు, పూర్ణచంద్రుని వంటి ముఖము కలిగినవాడు, జితేంద్రియుడు, సింహంలాంటి బాహువులు కలిగినవాడు, మదించిన ఏనుగులా నడవగలిగినవాడు అయిన నా భర్త రామచంద్రుని అనుసరించి ప్రవర్తిస్తానే తప్ప, నీవంటి దిక్కుమాలినవాడు ఐశ్వర్యం గురించి మాట్లాడితే వచ్చేటటువంటి స్త్రీని కాదు. ఒక నక్క సింహాన్ని ఎలా చూడలేదో, నువ్వు నన్ను అలా చూడలేవు. సూర్యకాంతిని దెగ్గరికి వెళ్ళి ఎలా ముట్టుకోలేమో, నువ్వు నన్ను అలా పొందలేవు. నువ్వు పాము యొక్క కోర పీకడానికి ప్రయత్నిస్తున్నావు. కంట్లో సూది పెట్టి నలక తీసుకున్నవాడు ఎంత అజ్ఞానో, పెద్ద రాయిని మెడకి చుట్టుకుని సముద్రాన్ని ఈదుదాం అనుకున్నవాడు ఎంత అజ్ఞానో, సూర్య చంద్రులని చేతితో పట్టుకుని ఇంటికి తీసుకువెళదాము అనుకున్నవాడు ఎంత అజ్ఞానో, ఇనుప కొనలున్న శూలం మీద నడుద్దాము అనుకున్నవాడు ఎంత అజ్ఞానో, నువ్వు అంత అజ్ఞానివి. సీసానికి బంగారానికి, గంధపు నీటికి బురదకి, ఏనుగుకి పిల్లికి, కాకికి గరుగ్మంతుడికి, నీటి కాకికి నెమలికి, హంసకి ఒక చిన్న పిట్టకి ఎంత తేడా ఉంటుందో, రాముడికి నీకు అంత తేడా ఉంది " అని అనింది.

అప్పుడా రావణుడు " నేను సాక్షాత్తు కుబేరుడి తమ్ముడిని, ఒకానొకప్పుడు కుబేరుడి మీద కోపం వచ్చి యుద్ధం చేసి, ఆ కుబేరుడిని లంకా పట్టణం నుంచి వెళ్ళగొట్టాను. ఆయన ఉత్తర దిక్కుకి వెళ్ళిపోయాడు. మళ్ళి ఉత్తర దిక్కుకి వెళ్ళి మా అన్నయ్యని చావగొట్టి పుష్పక విమానం తెచ్చుకున్నాను. నాకు కాని కోపం వచ్చి కనుబొమ్మలని ముడేస్తే, ఇంద్రుడు దేవతలతో సహా పారిపోతాడు. దశరథుడి చేత వెళ్ళగొట్టబడి, రాజ్యం లేక, అరణ్యాలలో తిరుగుతున్న ఆ రాముడిని నమ్ముకుంటావేంటి. నా దెగ్గరున్న ఐశ్వర్యాన్ని చూసి నా భార్యవి అవ్వు. నేను చిటికిన వేలితో చేసే యుద్ధానికి రాముడు సరిపోడు. ఏమి చెప్పమంటావు నీ అదృష్టం, నా కన్ను నీ మీద పడింది, నన్ను నువ్వు పొందు " అని గర్వంగా అన్నాడు.

No comments:

Post a Comment