Pages

Sunday 8 April 2012

రామాయణం @ కధ -30


రామస్య వచనం ష్రుత్వా భరతహ్ ప్రత్యువాచ హ |

కిం మె ధర్మాద్విహీనస్య రాజధర్మహ్ కరిశ్యతి ||


రాముడి మాటలు విన్న భరతుడు " అన్నయ్యా! నువ్వు నాకు ఇవన్నీ చెప్పినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కాని, నాకు ఎందుకు అన్నయ్యా ఈ ధర్మాలన్నీ, ఈ ధర్మాలన్నీ రాజుకి కావాలి, నేను రాజుని కాను, ఎప్పటికి రాజుని కాను. కాని అన్నయ్యా, మన వంశంలో ఉన్న సంప్రదాయం ప్రకారం, ఎవరు పెద్ద కొడుకుగా జన్మిస్తాడో, వాడు మాత్రమే పట్టాభిషేకం చేయించుకోవాలి. నాకు ఈ ధర్మం ఒక్కటే తెలుసు. నాకన్నా పెద్దవాడివి నువ్వు ఉండగా, నేను రాజధర్మాలు తెలుసుకోవలసిన అవసరం లేదు. అందుకని నేను ఎప్పుడు ఆ రాజధర్మాల్ని తెలుసుకోలేదు. నీ దెగ్గరికి ఒకరు వచ్చి అడిగితేనే నువ్వు కాదనలేవు, అలాంటిది రాజ్యం అంతా వచ్చి నిన్ను అడుగుతోంది పట్టాభిషేకం చేసుకోమని, నువ్వు వాళ్ళ కోరిక తీర్చకుండా ఎలా ఉండగలవు. అందుకని తిరిగొచ్చి పట్టాభిషేకం చేసుకో. నేను లేనప్పుడు మా అమ్మ దశరథ మహారాజుని రెండు కోరికలని అడిగింది. సత్యానికి కట్టుబడి దశరథుడు ఆ రెండు కోరికలని తీరుస్తాను అన్నాడు. అందుకని నువ్వు అరణ్యాలకి వెళ్ళావు. కాని నేను ఆ రాజ్యాన్ని తీసుకోలేదు. అదే సమయంలో మా అమ్మ విధవ అయ్యింది. ఇవ్వాళ నాన్నగారు లేరు అన్నయ్యా, నువ్వు వెళ్ళిపోవడం చేత ఇంత ఉపద్రవం వచ్చింది " అన్నాడు. 

ఈ మాట విన్న రాముడు, కూర్చున్న చోటనుంచే కింద నేల మీద పడి మూర్చపోయి, అది మట్టి అని కూడా చూడకుండా తండ్రిని తలుచుకొని ఆ మట్టిలో దొర్లుతూ ఏడుస్తున్నాడు. రాజ్యం పోయినప్పుడు కాని, అరణ్యాలకి వెళ్ళమన్నప్పుడు కాని ఏడవని రాముడు, ఇలా నేల మీద పడి వెక్కి వెక్కి ఏడుస్తుంటే సీతమ్మ, లక్ష్మణుడు గబగబా ఆయన దెగ్గరికి వచ్చారు. 

సీతె మృ్ఇతస్తె ష్వషురహ్ పిత్రా హీనొ.అసి లక్శ్మణ |
భరతొ కుహ్ఖమాచశ్టె స్వర్గతం పృ్ఇథివీపతిం ||
సీతా పురస్తాద్ర్వజతు త్వమెనామభితొ వ్రజ |
అహం పష్చాద్గమిశ్యామి గతి ర్హ్యెశా సుదారుణా ||

వాళ్ళని చూసిన రాముడు " భరతుడు ఇప్పుడే వచ్చి ఒక మాట చెప్పాడు. సీతా! మీ మామగారు మరణించారు. లక్ష్మణా, నీకు తండ్రిగారు మరణించారు. జీవితంలో ఎన్నడూ నడవకూడని నడక నడుద్దాము సీతా, బయలదేరు 
" అన్నాడు. 

(రాముడిని కన్న తండ్రిలా, ఎల్ల వేళలా కాపాడుకోడానికి లక్ష్మణుడు ఉన్నాడు, అందుకని లక్ష్మణుడితో నీ తండ్రి చనిపోయాడు అని చెప్పాడు. అలాగే, ఇంటి యజమాని మొదట నడవాలి, ఆయన వెనకాల స్త్రీ నడవాలి. ఇంటి యజమాని చనిపోతే, ఆయనకి ధర్మోదకాలు ఇవ్వడానికి వెళ్ళేటప్పుడు స్త్రీ ముందు నడుస్తుంది, అలాంటి నడకని దారుణమైన నడక అంటారు.)

అప్పుడు రాముడు మందాకినీ నదిలో స్నానం చేసి, దక్షిణ దిక్కుకి తిరిగి దశరథుడికి జలతర్పణలు సమర్పించాడు. తరువాత లక్ష్మణుడిని పిలిచి, పర్ణశాలలో ఉన్నటువంటి గార కాయలని బద్దలు కొట్టి, ఉండ చేసి, రేగు పిండితో కలిపి తీసుకురమ్మన్నాడు. అలాగే దర్భల యొక్క కొసలు దక్షిణ దిక్కుకి ఉండేటట్టు పరవమని, వాటి మీద పిడచలు పెట్టాడు ( తాను ఏది తింటున్నాడో, అదే పితృదేవతలకి తద్దినం నాడు పెట్టాలి). 


అలా దశరథుడికి తద్దినం పెట్టాక, నలుగురూ వచ్చి కూర్చున్నారు. అప్పుడు భరతుడు" అన్నయ్యా! నేను ఎప్పుడూ రాజ్యం కోరుకోలేదు. మా అమ్మ అడిగిందన్న మాట నాకు తెలీదు. నాకు ఈ రాజ్యం అక్కరలేదు. ఈ రాజ్యాన్ని నువ్వు మాత్రమే భరించగలవు, నేను భరించలేను, అందుకనే ఇంతమంది పౌరులు, జానపదులు మొదలైన వారు వచ్చారు. కనుక, దయచేసి ఈ రాజ్యాన్ని స్వీకరించు " అన్నాడు. 

" మనం ఎక్కడ ఉండాలో నిర్ణయించాల్సిన వాడు మన తండ్రిగారు. ఆయన నన్ను 14 సంవత్సరాలు అరణ్యవాసం చెయ్యమన్నారు, నిన్ను రాజ్యం తీసుకోమన్నారు. నీకు ఇచ్చినది నువ్వు తీసుకో, నాకు ఇచ్చినది నేను తీసుకుంటాను. అంతేకాని తండ్రిగారు ఇచ్చినదాన్ని తారుమారు చేసే అధికారం మనకి లేదు " అని రాముడు అన్నాడు.

ఆ రోజు రాత్రికి అందరూ పడుకున్నారు, మరునాడు ఉదయం లేచి అందరూ నిశబ్దంగా కూర్చొని ఉన్నారు. ఈలోగా వశిష్ఠుడు కౌసల్య, సుమిత్ర, కైకేయలతో ఆ ప్రాంతానికి చేరుకున్నాడు ( రాముడిని చేరుకోవాలనే తొందరలో, భరతుడు మిగతా పరివార జనులకంటే ముందు వచ్చాడు). అప్పుడు కౌసల్య ఆ మందాకినీ నది ఒడ్డున ఉన్నటువంటి గార పిండి, రేగు పిండి ముద్దలని చూసి, రాముడు వీటిని తద్దినంలో పెట్టాడంటే, రాముడు ఇవ్వాళ వీటిని తిని బతుకుతున్నాడని బాధపడింది. 

అందరూ అక్కడికి చేరుకున్నాక, భరతుడు లేచి " అన్నయ్యా! ఏ రాజ్యాన్ని మా అమ్మ నాకు ఇవ్వాలనుకుందో, ఆ రాజ్యాన్ని నేను నీకు ఇచ్చేస్తున్నాను. గాడిద, గుర్రం నాలుగు కాళ్ళ జంతువులు, ఒకే అరణ్యంలో ఉంటాయి. అలా ఉన్నంత మాత్రాన గుర్రం నడక గాడిదకి వస్తుందా. మనిద్దరమూ దశరథ మహారాజు కుమారులమే, కాని రాజ్య నిర్వహణలో నీకున్న శక్తి నాకు ఎలా వస్తుంది. అందుకని ఈ రాజ్యభారాన్ని నువ్వే స్వీకరించు " అన్నాడు. 

అప్పుడు రాముడు " ఒక మహాసముద్రంలో రెండు పుల్లలు కొట్టుకొని వెళ్ళిపోతున్నాయి. అవి కొంత కాలం కలిసి నీళల్లో తేలుతూ వెళతాయి. అవే పుల్లలు ఆ ప్రవాహంలో ఏదో ఒక రోజు విడిపోక తప్పదు. మన జీవితాలు కూడా అంతే. మనం ఎందులోనుంచి ఒకడిగా వచ్చామో, మళ్ళి అందులోకి ఒక్కడిగానే వెళ్ళిపోతాము. తోడుగా వచ్చేవాళ్ళు ఎవరూ ఉండరు. ఇది తెలుసు కాబట్టే దశరథ మహారాజు యజ్ఞయాగాది క్రతువులు చేసి పుణ్యాన్ని మూటకట్టుకొని స్వర్గానికి వెళ్ళిపోయారు. తండ్రిగారు ఒక మాట చెప్పి వెళ్ళిపోయారు, దాని ప్రకారం ఈ రాజ్యాన్ని నువ్వు తీసుకోవాలి " అన్నాడు.

అప్పుడు భరతుడు " అన్నయ్యా! నేను నా తల్లిని చంపుదాము అని అనుకున్నాను. అమ్మని చంపితే నువ్వు నాతో మాట్లాడవని నేను చంపలేదు. సభాముఖంగా నాన్నగారిని నేను ఎప్పుడూ నిందించలేదు. మరణకాలం దెగ్గర పడిపోతుంటే బుద్ధి విపరీతత్వాన్ని పొందుతుంది, బహుశా దశరథ మహారాజుకి కూడా అలా విపరీత బుద్ధి పుట్టడం వల్ల ఆయన ఒక పొరపాటు పని చేశారు. ఇక్ష్వాకు వంశం యొక్క సంప్రదాయం ప్రకారం పెద్దవాడు పరిపాలించవలసిన రాజ్యాన్ని ధర్మం తప్పి నాకు ఇచ్చారు. ఒకవేళ తండ్రిగారు ఏదన్నా చెయ్యరాని పని చేస్తే, కుమారుడు దానిని దిద్దాలి. అందుకని నువ్వు ఆ పొరపాటుని దిద్దాలి. అలాగే క్షత్రియుడికి రాజ్యపాలనం చెయ్యవలసిన ధర్మం ఉంది, కాని నువ్వు రాజ్యపాలనం మానేసి తాపసి వృత్తిని అవలంబించావు " అన్నాడు. 

రామభరతుల మధ్య జెరుగుతున్న ఈ ధర్మ సంభాషణని వినడానికి దేవతలు, మహర్షులు మొదలైన వారు వచ్చి నిలబడ్డారు. 

ఈ మాటలు విన్న రాముడు " దశరథ మహారాజు కైకేయని వివాహం చేసుకునే ముందు, మీ తాతగారైన కైకేయ రాజుకి ఒక మాట ఇచ్చారు. కైకేయ కడుపున ఎవరు పుడతారో వాళ్ళకి రాజ్యం ఇస్తానని నాన్నగారు ప్రమాణం చేశారు. ఈ విషయం వశిష్ఠుడికి, సుమంత్రుడికి తెలుసు. ఈ విషయం తెలిసిన కైకేయ రాజు, వశిష్ఠుడు, సుమంత్రుడు ఊరుకున్నారు. మీ అమ్మ రెండు వరాలు అడిగింది, మళ్ళి ఆ రెండు వారాలకి దశరథుడు బద్ధుడయ్యాడు. అందుకని ఎటునుంచి చూసినా రాజ్యం నీకే వస్తుంది, తండ్రిగారు చేసిన దానిలో పొరపాటు ఉంటె నేను దిద్దాలి, కాని అందులో పొరపాటు లేదు. మనం పుట్టక ముందే నాన్నగారు రాజ్యాన్ని నీకు ఇచ్చారు. కనుక నువ్వు రాజ్యాన్ని తీసుకోవాలి. 



త్వం రాజా భవ భరత స్వయం నరాణాం |
వన్యానాం అహం అపి రాజ రాణ్ మృ్ఇగాణాం || 



నువ్వు అయోధ్యా పట్టణానికి వెళ్ళిపో, నరులకందరికి నువ్వు రాజుగా ఉండి శ్వేత ఛత్రం కింద కూర్చొని పరిపాలన చెయ్యి. నేను అరణ్యాలకి వెళ్ళి చెట్టుకింద కూర్చొని మృగాలని నేను పరిపాలిస్తాను. అందుకని, భరత నువ్వు వెళ్ళిపో " అన్నాడు. 

అప్పుడు దశరథ మహారాజు మంత్రి అయిన జాబాలి లేచి " నేను ఇందాకటినుంచి నీ మాటలు వింటున్నాను రామ. చాలా చిత్రమైన మాటలు మాట్లాడుతున్నావు. నిన్ను కనేటప్పుడు దశరథుడికి తెలుసా నువ్వు ఇలా పుడతావని. దశరథుడు కాముకతతో తన వీర్యాన్ని అయన భార్య అయిన కౌసల్య యందు ప్రవేశపెట్టాడు. కౌసల్య కూడా కాముకతతో దశరథ మహారాజు దెగ్గర నుంచి వీర్యాన్ని పుచ్చుకొని, ఆ శుక్లాన్ని తన శోణితంతో కలిపింది. అప్పుడు ప్రకృతి సిద్ధంగా గర్భం ఏర్పడింది. అందులోనుంచి నువ్వు పుట్టావు. తల్లేమిటి తండ్రేమిటి, నువ్వు పెంచుకున్నావు ఈ పిచ్చి భక్తి. పుట్టిన ప్రతి ప్రాణి తనంతట తాను వెళ్ళిపోతుంది, అప్పుడు ఈ అమ్మతనాలు, నాన్నతనాలు ఏమి ఉండవు. చనిపోయిన వాళ్ళని పట్టుకొని ఏడిస్తే వాళ్ళు మాట్లాడుతున్నార. వెళ్ళిపోయిన వాడి మాటకి కూడా గౌరవమేమిటి. వాళ్ళతో పాటే ఆ మాట కూడా వెళ్ళిపోతుంది. ఇంకా సత్యము, ధర్మము అంటావేంటి. అసలు ఇవన్నీ ఎందుకోచ్చాయో నేను చెప్పనా రామ, ఏదో రకంగా ఇలాంటి పుస్తకాలు రాసేస్తే డబ్బున్న వారి దెగ్గర దానాలు, ధర్మాలు కొట్టేయచ్చని కొంతమంది ఇలాంటి ధర్మాల్ని రాశారు. అసలు నిజంగా పితృకార్యాలు, తద్దినాలు లేవు, అన్నీ ఒట్టిదే. పక్క ఊరిలో ఉన్నవాడికి ఇక్కడ అన్నం పెడితే, వాడి ఆకలి తీరదు కాని, చనిపోయి ఎక్కడో ఉన్న మీ నాన్నకి ఇక్కడ తద్దినం పెడితే ఆకలి తీరుతుందా, ఎవడు చెప్పాడు ఇవన్నీ. హాయిగా ఉన్న దానిని అనుభవించు " అన్నాడు.

ఈ మాటలు విన్న రాముడు ఎరుపెక్కిన కళ్ళతో " జాబాలి! నువ్వు చెప్పిందే సత్యమైతే, నిజమైతే, అసలు జీవకోటికి ప్రవర్తన అనేది ఉండడు. ఎవడి ఇష్టం వచ్చినట్టు వాడు ప్రవర్తించచ్చు. ఒకడి ప్రవర్తనని బట్టి వాడు ఎటువంటివాడో నిర్ణయిస్తారు పెద్దలు. ఆ ప్రవర్తన వేదమునకు అనుగుణంగా ఉండాలి. ఆ వేదము అపౌరుషేయము. వేదం ఏమి చెప్పిందో అది చెయ్యాలి. ఈ కంటితో చూసినవి సత్యాలు కావు, ఈ బుద్ధికి పుట్టినవన్ని సత్యాలు కావు, మన సంప్రదాయంలో వేదమే సత్యం. ఇహలోకంలో యజ్ఞయాగాది క్రతువులు చేసిన మహా పురుషులు, 100 క్రతువులు చేస్తే ఇంద్ర పదవిని పొందారు. ఇక్కడ పుణ్యాలు చేసినవారు ఊర్థలోకాలు పొందారు. ఇక్కడ పాపాలు చేసినవారు హీనయోనులలోకి వెళ్ళిపోయారు. ఇక్కడ తద్దినం పెడితే, సూక్ష్మ శరీరంతో మూడు తరాల వరకు పితృ లోకంలో ఉన్నవాడికి కడుపు నిండుతోందని వేదం చెబుతోంది. నీలాంటి నాస్తికుడిని( దేవుడు లేడన్నవాడు నాస్తికుడు కాదు, నాకు వేదం ప్రమాణం కాదన్నవాడు నాస్తికుడు), ప్రవర్తన తెలియనివాడిని.

No comments:

Post a Comment