Pages

Sunday 22 April 2012

రామాయణం @ కధ -43


రావణుడు, మారీచుడు ఇద్దరూ కలిసి రాముడున్న ఆశ్రమం దెగ్గర రథంలో దిగారు.


అప్పుడా మారీచుడు ఒక అందమైన జింకగా మారిపోయాడు. దాని ఒళ్ళంతా బంగారు రంగులో ఉంది, దానిమీద ఎక్కడ చూసినా వెండి చుక్కలు ఉన్నాయి. ఇంద్రనీలము ప్రకాశించినట్టు దాని కొమ్ములు ప్రకాశిస్తున్నాయి. సగం నల్లకలువ రంగులో, సగం ఎర్రకలువ రంగులో ఆ జింక యొక్క ముఖం ఉంది. దాని కడుపు ముత్యాలు మెరిసినట్టు మెరుస్తుంది. సన్నని కాళ్ళతో ఉంది. సృష్టిలో ఇప్పటి వరకూ ఎవరూ ఎరుగని రూపాన్ని మారీచుడు పొంది, గంతులేసుకుంటూ ఆశ్రమంలోకి ప్రవేశించాడు. అక్కడున్నటువంటి లేత చిగుళ్ళని తింటూ, అటూ ఇటూ పరుగులు తీస్తూ, అక్కడున్న మృగాల దెగ్గరికి వెళుతూ, మళ్ళి తిరిగి వస్తూ ఒక జింక ప్రవర్తించినట్టు ప్రవర్తించడానికి ప్రయత్నిస్తున్నాడు. 


కాని మారీచుడు మిగతా మృగాల దెగ్గరికి వెళ్లేసరికి, అవి ఈయనని రాక్షసుడిగా కనిపెట్టి దిక్కులు పట్టి పారిపోయాయి. అదే సమయంలో సీతమ్మ పువ్వులు కొయ్యడాని కని అటుగా వెళ్ళింది. ఆవిడ కర్ణికారవ వృక్షం యొక్క పూవులు కోస్తుంటే, ఆవిడకి అభిముఖంగా వచ్చి మారీచుడు నిలబడ్డాడు. ఆ జింకని చూసిన సీతమ్మ పొంగిపోయి " రామా! లక్ష్మణా! మీరు మీ ఆయుధములను ధరించి గబగబా రండి " అనింది. రామలక్ష్మణులు వచ్చాక, సీతమ్మ వాళ్ళతో " ఎదురుగా ఉన్న ఆ మృగాన్ని చూశార, ఎంత అందంగా ఉందో. సృష్టిలో ఇలాంటి మృగాన్ని నేను ఇప్పటివరకు చూడలేదు. ఆ బంగారు రంగు చర్మము, వెండి చుక్కలు.............." అని సీతమ్మ ఆ మృగాన్ని గూర్చి వర్ణించబోతుండగా, వెంటనే లక్ష్మణుడు ఇలా అన్నాడు.....


శంకమానః తు తం దృష్ట్వా లక్ష్మణో రామం అబ్రవీత్ |
తం ఏవ ఏనం అహం మన్యే మారీచం రాక్షసం మృగం ||

" అన్నయ్యా, ఇది మృగం కాదు, ఇది మారీచుడు. ఈ సృష్టిలో ఎక్కడా ఇటువంటి జింక లేదు. ఈ మారీచుడు ఇలా కామరూపాన్ని పొంది, వేటకి వచ్చిన ఎందరో రాజులని ఆకర్షించి, భుజించాడు. నామాట నమ్ము, ఇది కచ్ఛితంగా మారీచుడి మాయ " అన్నాడు.

అప్పుడు సీతమ్మ లక్ష్మణుడిని ఇంక మాట్లాడవద్దు అన్నట్టు వారించి రాముడితో " ఆర్యపుత్రా! నా మనస్సుని ఈ మృగం హరిస్తోంది, నాకు ఆడుకోవడానికి ఆ మృగాన్ని తెచ్చి ఇవ్వండి. చంద్రుడు అరణ్యాన్ని ప్రకాశింప చేసినట్టు, ఒంటి మీద రాత్నాలాంటి చుక్కలతో ఈ జింక అరణ్యాన్ని ప్రకాశింపచేస్తుంది. మనం కట్టుకున్న ఆశ్రమంలో ఎన్నో మృగాలు ఉన్నాయి, వాటితో పాటు ఈ జింక కూడా ఉంటె నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. ఆహా, ఏమి లక్ష్మీ స్వరూపం, ఏమి అందం, ఏమి ప్రకాశం, మీరు ఎలాగన్నా సరే ఆ మృగాన్ని పట్టి నాకు ఇవ్వండి. ఇంక కొంతకాలంలో ఈ అరణ్యవాసం పూర్తయిపోయి మనం అంతఃపురానికి వెళ్ళి పోతాము. అప్పుడు ఈ మృగాన్ని తీసుకొనివెళదాము. ఈ మృగం భవిష్యత్తులో అంతఃపురాన్ని శోభింపచేస్తుంది. మనం అంతఃపురానికి వెళ్ళగానే భరతుడు ఈ మృగాన్ని చూసి ' అబ్బ, ఏమి మృగం వదిన ' అంటాడు, అత్తగార్లు అందరూ చూసి ' అబ్బ, ఏమి మృగం ' అంటారు. అందుకని మీరు దాన్ని జీవించి ఉండగానన్నా పట్టుకురండి, లేకపోతే చంపైనా తీసుకురండి. మీరు ఒకవేళ దాన్ని చంపి తీసుకువస్తే, దాని చర్మాన్ని ఒలుచుకొని, లేత పచ్చగడ్డి మీద ఈ జింక చర్మాన్ని పరుచుకొని దాని మీద కూర్చుంటే, ఎంతబాగుంటుందో. రామ! నేను స్త్రీని కావడం చేత, ఏదన్నా కోరిక కలిగేటప్పటికి భావంలో వ్యగ్రత ఏర్పడుతుంది. ' ఎలాగైనా నా కోరిక తీర్చవలసిందే ' అని మంకుపట్టు పట్టినట్టు మాట్లాడాన. అలా మాట్లాడితే ఏమి అనుకోకండి  " అనింది.   

అప్పుడు రాముడు లక్ష్మణుడి వంక చూసి " లక్ష్మణా! మీ వదిన ఈ 13 సంవత్సరాల అరణ్యవాసంలో ఏమి అడగలేదు. మొట్టమొదటి సారి ఈ జింకని అడుగుతుంది. ఆ మృగం పట్ల ఎంత వ్యామోహాన్ని పెంచుకుందొ మీ వదిన మాటలలో స్పష్టంగా అర్ధమవుతోంది. ఆమె ఇంతగా ఈ మృగాన్ని అడుగుతుంటే, తీసుకురాను అని నేను ఎలా అనగలను. అందుకని నేను ఆ మృగాన్ని పట్టుకొని తీసుకువస్తాను. ఒకవేళ నేను దాన్ని ప్రాణాలతో తీసుకురాలేకపోతే, దాని శరీరాన్ని అయినా తీసుకువస్తాను. మీ వదిన చెప్పినట్టు ఇలాంటి మృగాన్ని నేను ఎక్కడా చూడలేదు. ఇలాంటివి నాకు తెలిసి రెండే ఉన్నాయి, ఒకటి చంద్రుడిలో ఉంది, ఇది భూమి మీద ఉంది ( దీని అర్ధం ఏంటంటే, చంద్రుడిలో ఎటువంటి మృగం ఉండదు, అలాగే భూమి మీద ఇది ఉందంటే, ఈ రెండూ మాయె అని అర్ధం). ఒకవేళ నువ్వు చెప్పినట్టు ఆ మృగం మారీచుడె అయితే నేను వాడిని సంహరిస్తాను. లక్ష్మణా! చాలా జాగ్రత్త సుమా. ప్రతి క్షణమూ నువ్వు శంకిస్తూనె ఉండాలి. నువ్వు మరియు జటాయువు సీతని జాగ్రత్తగా కాపాడండి " అని చెప్పి, రాముడు ఆ మృగాన్ని పట్టుకోవడానికని దాని వెనకాల వెళ్ళాడు. 

జింక రూపంలో ఉన్న మారీచుడు ముందు పరిగెడుతున్నాడు, వెనకాల రాముడు పరిగెడుతున్నాడు. ఆ మారీచుడు కనపడినట్టు కనపడి మాయమవుతూ, మందలలో కలిసిపోతూ అటూ ఇటూ పరుగులు తీస్తున్నాడు. మారీచుడు రాముడికి ఒక్కొక్కసారి ఇక్కడే కనపడుతున్నాడు, కాని రాముడు అక్కడికి వెళ్ళేసరికి అక్కడెక్కడో దూరంగా కనపడతాడు. సరే అని రాముడు అక్కడిదాకా పరుగు తీసి వెళ్ళేసరికి అంతర్ధానమయిపోతున్నాడు. అలా రాముడిని పరిగెత్తించి పరిగెత్తించి ఆ అరణ్యంలోకి చాలా దూరంగా తీసుకుపోయాడు. అప్పుడిక రాముడు పరిగెత్తలేక అలసిపోయి ఒక చెట్టుకింద కూర్చున్నాడు. అప్పుడు దూరంగా, మృగాల యొక్క మందలో చెవులు అటూ ఇటూ తిప్పుతూ ఆ మృగం మళ్ళి కనపడింది. ఈ మృగాన్ని పట్టుకోవడానికి ఇక పరిగెత్తడం అనవసరమని రాముడు అనుకొని, ఒక త్రాచుపాములాంటి బాణాన్ని కొదండానికి సంధించి, బ్రహ్మగారి చేత నిర్మింపబడిన బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి, ఆ మృగం వైపు గురి చూసి బాణాన్ని విడిచిపెట్టాడు. ఆ బ్రహ్మాస్త్రం నిప్పులు కక్కుతూ మారీచుడి మీద పడింది. అప్పుడా మారీచుడు రాముడి స్వరంతో గట్టిగా " హా! సీతహా! లక్ష్మణా " అని అరిచాడు. ఆనకట్ట పగిలి అందులోనుంచి నీరు బయటకి వస్తే ఎలా ఉంటుందో, అలా మారీచుడి శరీరం నుండి నెత్తురు బయటకి ప్రవహిస్తుండగా ఆ మారీచుడు భూమి మీద తన నిజస్వరూపంతో పడిపోయాడు. 



ఆ దృశ్యాన్ని చూశిన రాముడికి వెంటనే సీతమ్మ గుర్తుకు వచ్చింది, లక్ష్మణుడి మాట గుర్తుకువచ్చింది. సీతకి ఎటువంటి ఉపద్రవం రాలేదు కాదా అని బెంగ పెట్టుకొని, అక్కడున్నటువంటి రెండు మృగాలని సంహరించి, వాటి మాంసాన్ని తీసుకొని గబగబా ఆశ్రమం వైపు బయలుదేరాడు. ఇంతలో మారీచుడు అన్నటువంటి ' హా! సీత, హా! లక్ష్మణా ' అనే కేక సీతమ్మ చెవిన పడింది. అప్పుడు సీతమ్మ లక్ష్మణుడిని పిలిచి " చూడవయ్యా మీ అన్నగారు ఏదో ఉపద్రవంలో ఉన్నారు. ' హా! సీత, హా! లక్ష్మణా' అని ఒక పెద్ద కేక వేశారు. బలిష్టమైన ఎద్దుని సింహం లాగుకొని పోతుంటే ఆ ఎద్దు ఎలా అరుస్తుందో, ఇవ్వాళ మీ అన్నగారు అలా అరుస్తున్నారు. నాకు చాలా బెంగగా ఉంది, నువ్వు వెంటనే బయలుదేరి అరణ్యంలోకి వెళ్ళు " అని అనింది. 

అప్పుడు లక్ష్మణుడు " వదినా! నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు, అన్నయ్యకి ఏ ప్రమాదము రాదు " అని అన్నాడు.

తన భర్త ప్రమాదంలో ఉన్నాడేమో అన్న బెంగతో ఉన్న సీతమ్మ లక్ష్మణుడి మాటలకి ఆగ్రహించి " నాకు ఇప్పుడు అర్ధమయ్యింది నువ్వు ఎందుకు వచ్చావో. నువ్వు మీ అన్నకి తమ్ముడివి కావు, నువ్వు మీ అన్న పాలిట పరమ శత్రువువి. అందుకే మీ అన్న ప్రమాదంలో ఉంటె నువ్వు ఇంత సంతోషంగా కుర్చోగలుగుతున్నావు. నువ్వు ఇంతకాలం రాముడి వెనకాల ఉండడానికి కారణం నా మీద నీకు కోరిక ఉండడమే. అందుకే, రాముడికి ప్రమాదం వస్తే నన్ను పొందాలని వెనకాలే వచ్చావు. నీ ముఖంలో ఒక గొప్ప నమ్మకం, హాయి కనపడుతున్నాయి. శత్రువు చేతిలో దెబ్బతిన్న రాముడి గొంతు విని ఇంత హాయిగా కూర్చున్నావు. ఈ క్షణం కోసమే నువ్వు 13 సంవత్సరాల నుంచి నిరీక్షిస్తున్నావు. మహాపాపి! ఎంత ద్రోహబుద్ధితో వచ్చావురా. నువ్వు రాముడిని విడిచిపెట్టి ఉండలేక, రాముడికి సేవ చెయ్యడానికే వచ్చినవాడివి అయితే, రాముడు అరణ్యంలో ' హా! సీత, హా! లక్ష్మణా ' అని అరిస్తే నువ్వు ఇంత హాయిగా కుర్చోగాలవా, నాతో కూడా చెప్పకుండా అన్నగారిని కాపాడడం కోసం పరుగెత్తేవాడివి. బహుశా భరతుడే నిన్ను పంపాడేమో, మీ ఇద్దరు కలిసి కుట్ర చేశారు " అనింది.

తన రెండుచేతులతో సీతమ్మకి అంజలి ఘటించి లక్ష్మణుడు ఇలా అన్నాడు " దేవతలు, దానవులు, గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, ఈ బ్రహ్మాండంలో ఉన్న వారంతా  ఒకపక్క, మా అన్నయ్య ఒక పక్క ఉన్నా ఆయనని ఎవరూ నిగ్రహించలేరు. అన్నయ్య పరాక్రమమేమిటో నాకు తెలుసు. వదినా! ఎవరో అరిస్తే నువ్వు బెంగ పెట్టుకొని మాట్లాడుతున్నావు, అరిచినది మయా మారీచుడు, అన్నయ్య అరవలేదు. నామాట నమ్ము. 


No comments:

Post a Comment