Pages

Wednesday 11 April 2012

రామాయణం @ కధ -33


" రామ! నాకు తెలుసు నువ్వు వస్తున్నావని. నేను నా తపఃశక్తితో ఇంద్రలోకాన్ని,బ్రహ్మలోకాన్నిగెలిచాను, అందుకని నన్ను తీసుకెళ్ళడానికి ఇంద్రుడు స్వయంగా వచ్చి, నన్ను రమ్మన్నాడు. కాని నేను, నాకు ప్రియమైన అతిధి వచ్చాడు, అతనికి ఆతిధ్యం ఇచ్చాక వస్తాను అన్నాను. రామ! నేను నా తపఃశక్తితో గెలుచుకున్న లోకాలని నీకు ధారపోసేస్తాను, యధేచ్చగా సీతాలక్ష్మణులతో కలిసి విహరించు " అని శరభంగుడు అన్నాడు.


ఈ మాటలు విన్న రాముడు " మహానుభావ! మీరు తపస్సు చేసి నాకు ధారపొయ్యడమేమిటి. నాకు ఎక్కడ ఆశ్రమం కట్టుకోవాలో చెప్పండి చాలు, అక్కడ నేను తపస్సు చేసుకుంటాను " అన్నాడు.

రాముడి మాటలకు సంతోషించిన శరభంగుడు " ఇక్కడికి దెగ్గరలో సుతీక్ష్ణుడు అనే మహర్షి ఉన్నారు, నువ్వు ఆయనని దర్శించు. రామ! నీకు ఒక విచిత్రమైన కార్యం చూపిస్తాను, అలా నిలబడి చూడు. నా శరీరం జర్జరీభూతం( ముసలిదయిపోయి ముడతలు పడిపోయింది) అయిపోయింది, కనుక ఈ శరీరాన్ని అగ్నిలో కాలుస్తాను " అని చెప్పి, ఆ అగ్నిహోత్రంలో నెయ్యి వేసి, తన శరీరాన్ని ఆ అగ్నిలో వేశాడు. 


తస్య రోమాణి కేశాం చ తదా వహ్నిః మహాత్మనః |
జీర్ణం త్వచం తద్ అస్థీని యత్ చ మాంసం చ శోణితం ||


ఈ సన్నివేశాన్ని చూసిన సీతారామలక్ష్మణులు ఆశ్చర్యంతో అలా ఉండిపోయారు. ఆ అగ్నిలో శరభంగుడి వెంట్రుకలు, శరీరం, రక్తం, ఎముకలు కాలిపోయాయి. తరువాత ఆ శరభంగుడు ఆ అగ్ని నుండి కౌమారంతో ఉన్న శరీరంతో బయటకి వచ్చి ఋషులు, నిత్యాగ్నిహోత్రులు పొందే లోకాలని దాటి బ్రహ్మలోకంలోకి వెళ్ళిపోయాడు. 


బ్రహ్మలోకంలో సింహాసనం మీద కూర్చుని ఉన్న బ్రహ్మగారు లేచి " మహానుభావ! శరభంగ, స్వాగతం, సుస్వాగతం " అన్నారు. అలా శరభంగుడు ఉత్కృష్టమైన ఆ బ్రహ్మ లోకాన్ని చేరుకున్నాడు.


శరభంగుడు వెళ్ళిపోయాక ఆ ఆశ్రమంలో ఉన్నటువంటి వైఖానసులు (విఖనస మహర్షి యొక్క సంప్రదాయంలో ఉండేవాళ్ళు), చెట్లనుంచి కింద పడినటువంటి ఎండుటాకులను తినేవాళ్ళు, సూర్య కిరణాలని, చంద్ర కిరణాలని తినేవాళ్ళు, గాలిని తినేవాళ్ళు, కేవలం నీరు తాగి బతికేవాళ్ళు, నిలబడే నిద్రపోయేవాళ్ళు, చెట్టుమీదనే ఉండి  తపస్సు చేసుకునేవాళ్ళు, ఎప్పుడూ దర్భల మీదనే ఉండేవాళ్ళు, ఇలా రకరకములైన నియమములతో తపస్సు చేసుకుంటూ ఆ శరభంగముని ఆశ్రమంలో ఉండేవారు. 

శరభంగుడు వెళ్ళిపోయాక ఆ మహర్షులందరూ రాముడి చుట్టూ చేరి " రామ! ఇక్కడ తపస్సు చేసుకుంటున్న మమ్మల్ని రాక్షసులు ఇబ్బంది పెడుతున్నారు. మేము సంపాదించుకున్న తపఃశక్తితో రాక్షసులని నిగ్రహించగలము, కాని మేము జితఃక్రోధులం, కోపాన్ని జయించినవాళ్ళము. ఆ రాక్షసులు అజ్ఞానంతో ఈ శరీరాన్ని బాధ పెడుతుంటారు. మేము వారి అజ్ఞానాన్ని మన్నించాము. మేము ఎప్పుడూ మా తపఃశక్తిని మాకోసం ఉపయోగించలేదు. నువ్వు మాకు తల్లిలాంటి వాడివి, మేము నీ కడుపులో ఉన్న పిండంలాంటి వాళ్ళము, మాకు ఒకరికి చెప్పుకోవడం కూడా చేతకాదు, నువ్వు క్షత్రియుడవి కనుక మమ్మల్ని రక్షించడం నీ ధర్మం, నీ దెగ్గర ధర్మం పుష్కలంగా ఉంది, నీకు సత్యం యొక్క, ధర్మం యొక్క స్వరూపం తెలుసు, సత్యధర్మములను రెండిటినీ అనుష్టానము చెయ్యడము తెలుసు. తల్లి బిడ్డలని రక్షించినట్టు, రాజు అరణ్యాలలో ఉన్న ఋషులని రక్షించాలి. అందుకని నీకు చెప్పుకుంటున్నాము రామ.

ఏహి పశ్య శరీరాణి మునీనాం భావిత ఆత్మనాం |
హతానాం రాక్షసైః ఘోరైః బహూనాం బహుధా వనే ||

ఎవ్వరి జోలికి వెళ్ళకుండా, కూర్చుని తపస్సు చేసుకుంటున్న ఎంతమంది మునులను ఆ రాక్షసులు చంపారో ఒకసారి వచ్చిచూడు రామ, చిత్రకూట పర్వతాల మీద, దండకారణ్యంలో, మందాకినీ నది ఒడ్డున ఉండేటటువంటి ఎందరో మహర్షులను ఆ రాక్షసులు చంపేసారు. అందుకని నీ ముందు నిలబడి, రెండు చేతులతో నీకు దండం పెట్టి, నీకు శరణాగతి చేస్తున్నాము రామ, మమ్మల్ని రక్షిస్తావ?" అని ఆ ఋషులు రాముడిని అడిగారు. 

ఆ ఋషుల యొక్క ప్రార్ధనలని విన్న రాముడు " మీరు నన్ను ఆజ్ఞాపించాలి, అంతేకాని మీరు నన్ను ఎప్పుడూ కూడా అలా శరణాగతి చెయ్యకూడదు. ఇప్పటికే నేను చాలా సిగ్గుపడుతున్నాను, నాకు తెలియలేదు మీరు ఇంత కష్టపడుతున్నారని. ఈ అరణ్యాలలో తపస్సు చేసుకునేటటువంటి ఋషులని ఇక నేను రక్షిస్తాను, మీరు నా శక్తిని, నా తమ్ముడి శక్తిని చూస్తారు " అన్నాడు. 

తరువాత రాముడు ఆ మహర్షులందరితో కలిసి సుతీక్ష్ణుడి ఆశ్రమానికి బయలుదేరారు. 


వీళ్ళు అక్కడికి వెళ్లేసరికి ఆ సుతీక్ష్ణ మహర్షి కళ్ళు మూసుకొని తపస్సు చేసుకుంటూ ఉన్నారు. ఆయన ఆశ్రమం అంతా శోభాయమానంగా ఉంది. అప్పుడు రాముడు సీతాలక్ష్మణసహితుడై లోపలికి వెళ్ళి సుతీక్ష్ణ మహర్షి దెగ్గర కూర్చుని " మహాత్మా! నన్ను రాముడు అంటారు, ఒకసారి మీరు నన్ను చూసి, నాతో మాట్లాడవలసింది అని అభ్యర్దిస్తున్నాను " అని అన్నాడు. 

కళ్ళు తెరిచిన ఆ సుతీక్ష్ణుడు ఇలా అన్నాడు " రామ! దేవేంద్రుడు నా దెగ్గరికి వచ్చి, నేను చేసిన తపస్సు చేత నేను లోకములన్నిటిని గెలిచాను కనుక నన్ను ఊర్ధలోకములకు తీసుకువెళతాను అని రథం ఎక్కమన్నాడు. చిత్రకూట పర్వతం మీద నివాసం ఉంటున్న రాముడిని దర్శించుకొని, ఆయనకి ఆతిధ్యం ఇచ్చి వస్తానని చెప్పాను. అందుచేత నేను నీ దర్శనం కోసమే వేచి ఉన్నాను రామ " అన్నాడు. 

శరభంగ మహర్షి చెపినట్టు సుతీక్ష్ణుడు కూడా రాముడికి తాను తపస్సు చేత గెలుచుకున్న లోకాలని ధారపోస్తాను అన్నాడు. 

అప్పుడు రాముడు " మీరు సంపాదించుకున్న లోకములలో నేను విహరించడం కాదు, నా అంతట నేను కూడా తపస్సు చేసి సంపాదించుకుంటాను. అందుకని నేను తపస్సు చేసుకోవడానికి అనువైన స్థలాన్ని నాకు చూపించండి " అన్నాడు. 

"అయితే ఇక్కడ దెగ్గరలో చాలా ఆశ్రమాలు ఉన్నాయి, నువ్వు వాటన్నిటిని చుసిరా. నువ్వు వాటిని చూసి వచ్చాక చెబుతాను " అని సుతీక్ష్ణుడు అన్నాడు.

" నాకు కూడా ఆ ఆశ్రమాలన్నిటిని చూడాలని ఉంది, అందుకని ఆ ఆశ్రమాలన్నిటిని చూసి అందులో ఉన్న ఋషుల యొక్క ఆశీర్వచనాలు పొంది వస్తాను " అని రాముడు అన్నాడు.

ఆ రోజూ రాత్రికి సుతీక్ష్ణుడి ఆశ్రమంలో విశ్రాంతి తీసుకున్నారు. మరునాడు ఉదయం స్నానం చేసి, సంధ్యావందనం చేసి సుతీక్ష్ణుడి ఆశీర్వాదం తీసుకుందామని రాముడు ఆయన దెగ్గరికి వచ్చాడు. అప్పుడా సుతీక్ష్ణ మహర్షి " రామ! నువ్వు ఇక్కడే ఉండి నీ తపస్సుని యదేచ్ఛగా ఆచరించు, ఇక్కడ ఏవిధమైన ప్రమాదము ఉండదు, కాని ఇక్కడికి మృగములు వస్తుంటాయి, అవి వచ్చినప్పుడు కొంత పరాకుతో ఉంటే చాలు " అన్నాడు.

అప్పుడు రాముడన్నాడు " మృగాలని చూస్తే ధనుస్సు పట్టుకోవడం నా అలవాటు, ఋషులు ఉండే ప్రాంతానికి మృగాలు వస్తే, ఆశ్రమాన్ని రక్షించడం కోసం నేను కోదండం పట్టుకొని బాణ ప్రయోగం చేస్తాను. అప్పుడు పారిపోతున్న ఆ మృగాలని చూసి బ్రహ్మజ్ఞానంతో ఉన్న మీకు జాలి కలగచ్చు, అందువలన బాణ ప్రయోగం చేసిన నేను మీకు కంటకుడిగా కనపడవచ్చు. అందుకని నేను ఇక్కడ ఉండకూడదు. నాకు వేరు ఆశ్రమం కావాలి, అందుకని మీరు నాకు ఒక ఆశ్రమం నిర్మించికోడానికి యోగ్యమైన ప్రదేశాన్ని నిర్ణయించండి. ఈలోగా నేను మిగిలిన తాపసుల ఆశ్రమాలని దర్శించుకొని వస్తాను " అన్నాడు.

" అయితే నువ్వు అన్ని ఆశ్రమాలని దర్శించుకొని మళ్ళి ఇక్కడికి రా, అప్పుడు చెప్తాను " అని  సుతీక్ష్ణుడు రాముడితో అన్నాడు.


సీతమ్మ ఇచ్చిన కోదండాలని ధరించిన రామలక్ష్మణులు, సీతమ్మతో కలిసి బయలుదేరారు. ఆ సమయంలో సీతమ్మ రాముడితో ఇలా అనింది " నేను పెద్దల దెగ్గర విన్నాను, ధర్మాన్ని చాలా సూక్ష్మబుద్ధితో అనుష్ఠానం చెయ్యాలి అని. మీరు ధర్మాచరణ కోసమని, తండ్రికి ఇచ్చిన మాట కోసమని అరణ్యానికి వచ్చి ఒక తాపసిలా జీవిస్తాను అన్నారు కదా. కాని మనిషికి కామము చేత మూడు దుర్గుణములు కలుగుతాయి, అందులో మొదటిది అసత్యము పలకడం, మీరు ఎన్నడూ అసత్యము చెప్పరు, ఇక ముందు కూడా అసత్యము చెప్పరని నాకు తెలుసు. ఇక రెండవది పరస్త్రీ వాంఛ, నేను మీ భార్యని, నాకు తెలుసు మీరు ఎన్నడూ పర స్త్రీని అటువంటి భావనతో చూడరని. మూడవది ఏంటంటే..... 

No comments:

Post a Comment