ఎప్పుడైతే సీతమ్మ పడిపోయిందో అప్పుడు హనుమంతుడు యుద్ధం మానేసి, ఏడుస్తూ, పెద్ద పెద్ద కేకలు వేస్తూ " ఇంకా ఈ యుద్ధం ఎవరి కోసం చేస్తారురా. ఏ తల్లిని రక్షించడానికి యుద్ధానికి వచ్చామో ఆ తల్లిని సంహరించాడు. ఇంక నేను యుద్ధం చెయ్యను " అని ఏడుస్తూ రాముడి దెగ్గరికి వెళ్ళి " రామ! దుర్మార్గుడైన ఇంద్రజిత్ వానరులందరూ చూస్తుండగా సీతమ్మని తీసుకొచ్చి, సంహరించి తీసుకెళ్ళిపోయాడు. ఇంక సీతమ్మ లేదు " అని చెప్పాడు.
ఈ మాటలు విన్న రాముడు మూర్చపోయి కిందపడిపోయాడు.
తరువాత వాళ్ళు రాముడి ముఖం మీద కొన్ని నీళ్ళు పోసి ఆయనని లేపారు.
అప్పుడు లక్ష్మణుడు అన్నాడు " అన్నయ్యా! నువ్వు ధర్మము ధర్మము ధర్మము అని ఇన్నాళ్ళు పట్టుకు తిరిగావు. ఆ ధర్మం నీకు ఏ ఫలితాన్ని ఇచ్చింది. నువ్వు పట్టుకున్న ధర్మం వల్ల రాజ్య భ్రష్ట్రుడివి అయ్యావు, నువ్వు పట్టుకున్న ధర్మం వల్ల తండ్రిగారు మరణించారు, నువ్వు పట్టుకున్న ధర్మం వల్ల సీతమ్మ అపహరింపబడింది, నువ్వు పట్టుకున్న ధర్మం వల్ల జటాయువు మరణించాడు, నువ్వు పట్టుకున్న ధర్మం వల్ల 14 సంవత్సరాలుగా అరణ్యాలలో తిరుగుతున్నావు. ధర్మాన్ని విడిచిపెట్టిన రావణుడు అంతఃపురంలో కులుకుతున్నాడు, సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నాడు. అధర్మంతో ఉన్నవాడు అంత సంతోషంగా ఉన్నాడు, ధర్మంతో ఉన్న నువ్వు ఇంత కష్టంలో ఉన్నావు. ఇంకా ధర్మము ధర్మము అని ఎందుకంటావు అన్నయ్యా, ఆ ధర్మాన్ని విడిచిపెట్టు. మనం కూడా అధర్మాన్నే స్వీకరిద్దాము " అన్నాడు.
వెంటనే విభీషణుడు పరుగు పరుగున వచ్చి " ఎంత మాటన్నావు లక్ష్మణా, సీతమ్మని ఇంద్రజిత్ సంహరిస్తే రావణుడు ఊరుకుంటాడనుకున్నావ? ఎంతోమంది చెప్పినా సీతమ్మని విడిచిపెట్టనివాడు ఇంద్రజిత్ సీతమ్మని చంపితే ఊరుకుంటాడ. ఆ ఇంద్రజిత్ మహా మాయావి, మీరు అంతలోనే వాడి మాయ మరిచిపోయారు. వాడు మాయా సీతని సంహరించి తీసుకుపోయాడు. వాడు ఇప్పుడు ఏం చేస్తుంటాడో తెలుసా. పెద్ద ఊడలు దిగిపోయిన మర్రి చెట్టు ఒకటి ఉంది, దాని చుట్టూ చాలా చీకటిగా ఉంటుంది. వాడు అక్కడికి వెళ్ళి నికుంభిలా హోమం చేస్తాడు. అక్కడ వాడు నికుంభిలా దేవతని ఉద్దేశించి హోమాన్ని పూర్తి చేసి, వాడి గుర్రాల మీద, ఆయుధముల మీద ఆ అక్షతలని చల్లుకొని యుద్ధ రంగంలోకి వస్తే దేవేంద్రుడు కూడా వాడితో యుద్ధం చెయ్యలేడు. సీతమ్మ చనిపోయింది అనుకుని మీరు ఇక్కడ ఏడుస్తున్నారు, కాని వాడు అక్కడ హోమం చేస్తుంటాడు. రామ! నన్ను అనుగ్రహించు, నాతో లక్ష్మణుడిని తీసుకెళ్ళి ఆ హోమం పూర్తవకుండానే వాడిని సంహరిస్తాను " అన్నాడు.
అప్పుడు రాముడు లక్ష్మణుడిని ఆశీర్వదించి, హనుమ మొదలైన వీరుల్ని సాయంగా పంపారు.
విభీషణుడు లక్ష్మణుడిని ఇంద్రజిత్ హోమం చేసుకునే చోటుకి తీసుకెళ్ళాడు. వాళ్ళు అక్కడికి వెళ్ళేసరికి ఇంద్రజిత్ ఆ హోమం చెయ్యడం కోసం సిధ్దపడుతున్నాడు. తన హోమాన్ని ఎవరూ పాడుచెయ్యకుండా చుట్టూ సైన్యాన్ని కాపు పెట్టాడు.
అప్పుడు విభీషణుడు " లక్ష్మణా! నువ్వు ఒకపక్క నుంచి సైన్యాన్ని బాణాలతో కొట్టి కాకావికలం చెయ్యి, అప్పుడు ఇంద్రజిత్ కనపడతాడు. అదే సమయంలో హనుమ వెళ్ళి రాక్షస సైన్యాన్ని తుదముట్టించెయ్యాలి. అంతమంది అక్కడ పడిపోతుంటే వాడు అక్కడ కూర్చుని హోమం చెయ్యలేడు. కాబట్టి రథం ఎక్కి వస్తాడు, అప్పుడు నువ్వు వాడిని కొట్టాలి " అన్నాడు.
వెంటనే లక్ష్మణుడు బాణ ప్రయోగం చేశాడు. అప్పుడా సైన్యం పక్కకి తప్పుకుంది, వాళ్ళు పక్కకి తప్పుకోగానే ఆ మర్రి చెట్టు కనపడింది. వెంటనే హనుమంతుడు అరవీరభయంకరుడై ఆ రాక్షసులని మర్దించేశాడు. హనుమ ప్రతాపం ముందు ఆ రాక్షస సైన్యం నిలబడలేక పెద్ద హాహాకారాలు చేశారు. ఆ హాహాకారాలు విన్న ఇంద్రజిత్ హోమాన్ని ఆపి ' ముందు హనుమంతుడిని సంహరించి, అప్పుడు హోమం చేస్తాను ' అని అనుకొని రథం ఎక్కాడు. అప్పుడాయన ఒక బ్రహ్మాండమైన అస్త్రాన్ని హనుమంతుడి మీద ప్రయోగిద్దామని ఆ అస్త్రాన్ని అభిమంత్రిస్తుండగా లక్ష్మణుడు ధనుష్టంకారం చేశాడు. ఆ టంకారానికి ఇంద్రజిత్ లక్ష్మణుడి వైపు చూశాడు.
అప్పుడు లక్ష్మణుడు " దుర్మార్గుడా, హనుమతో యుద్ధం ఎందుకు, నీతో యుద్ధం చెయ్యడానికి నేను వచ్చాను. పౌరుషం ఉంటె నాతో యుద్ధం చెయ్యి " అన్నాడు.
అప్పుడు ఇంద్రజిత్ " ఇంతకముందు నిన్ను రెండు మూడుసార్లు కొట్టాను, అయినా బుద్ధి లేకుండా మళ్ళి వచ్చావు. చూడు నీకు ఎటువంటి యుద్ధం చూపిస్తానో ఇవ్వాళ " అని ఇద్దరూ యుద్ధం మొదలుపెట్టారు.
లక్ష్మణుడి పక్కన ఉన్న విభీషణుడిని ఇంద్రజిత్ చూసి అన్నాడు " నువ్వు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగావు, నువ్వు స్వయానా నా తండ్రికి తమ్ముడివి, నాకు పినతండ్రివి. నీ కొడుకు వరసైన నన్ను చంపడానికి ఇవ్వాళ శత్రువులతో చేతులు కలిపావే నీకు ఇలా చెయ్యడానికి సిగ్గుగా లేదా. శత్రువులతో చేతులు కలిపి తనవారిని చంపినవాడు చివరికి ఆ శత్రువుల చేతులలోనే చనిపోతాడు " అన్నాడు.
విభీషణుడు అన్నాడు " నీ తండ్రి యందు, నీ యందు పాపం ఉంది కనుక నేను మిమ్మల్ని విడిచి ధర్మాత్ముడైన రాముడి పక్కకి వచ్చాను " అన్నాడు.
అప్పుడు ఇంద్రజిత్ కి లక్ష్మణుడికి ఘోరమైన యుధం జెరిగింది. ఇద్దరూ ఒకరిని ఒకరు బాణాలతో కొట్టుకున్నారు. లక్ష్మణుడు వేసిన బాణాలకి ఇంద్రజిత్ యొక్క ధనుస్సు ముక్కలయి పోయింది. తరువాత ఇంద్రజిత్ బాణాలతో లక్ష్మణుడి కవచాన్ని పగలగొట్టాడు. ఇద్దరూ సింహాలలా యుద్ధం చేశారు. విభీషణుడు ఆ రాక్షసుల మీద బాణాలని వేసి వాళ్ళని సంహరించాడు.
ఇంద్రజిత్ కి లక్ష్మణుడికి 3 రోజుల పాటు భయంకరమైన యుద్ధం జెరిగింది. ఆఖరికి ఇంద్రజిత్ యొక్క సారధిని లక్ష్మణుడు కొట్టాడు. అప్పుడా ఇంద్రజిత్ ఒక చేతితో సారధ్యం చేస్తూ లక్ష్మణుడితో యుద్ధం చేశాడు. అప్పుడు నలుగురు వానర వీరులు ఆ రథం యొక్క గుర్రాలని కిందకి లాగేసి ఆ రథాన్ని నాశనం చేశారు.
లక్ష్మణుడు ఎన్ని అస్త్రాలని వేసినా ఇంద్రజిత్ సంహరింపబడక పోయేసరికి విభీషణుడు అన్నాడు " ఆ ఇంద్రజిత్ పౌరుషం పెరిగిపోతుంది. ఏదో ఒకటి చేసి ఆ ఇంద్రజిత్ ని సంహరించు " అన్నాడు.
ధర్మాత్మా సత్య సంధశ్చ రామో దాశరథిర్యది
పౌరుషే చా అప్రతిద్వంద్వః తదైనం జహి రావణిమ్
అప్పుడు లక్ష్మణుడు రెండు కోరలు కలిగిన సర్పంలాంటి ఒక బాణాన్ని తీసి, వింటినారికి తొడిగి " మా అన్న రాముడు ధర్మాత్ముడైతే, సత్యసంధుడైతే, దశరథుడి కొడుకే అయితే, పౌరుషం ఉన్నవాడే అయితే నా ఎదురుగా నిలబడిన ప్రతిద్వంది అయిన ఇంద్రజిత్ నిగ్రహింపబడుగాక " అని బాణ ప్రయోగం చేశాడు. ఆ బాణం వెళ్ళి ఇంద్రజిత్ కంఠానికి తగలగానే ఆయన శిరస్సు శరీరం నుండి విడిపోయి కింద పడిపోయింది. ఇంద్రజిత్ మరణించాడు.
No comments:
Post a Comment