Pages

Thursday, 21 June 2012

రామాయణం @ కధ -89


ఇంద్రజిత్ బాణములు ప్రయోగించకముందే విభీషణుడు యుద్ధ భూమి నుంచి పారిపోయాడు. హనుమంతుడికి ఉన్న వరం వలన ఆయనని ఏ అస్త్రము బంధించలేదు. ఆ విభీషణుడు హనుమంతుడు కలుసుకొని " అసలు మన సైన్యంలో ఉన్న పెద్ద పెద్ద వీరులు ప్రాణాలతో ఉన్నారా, ప్రాణాలు విదిచిపెట్టేశార? " అని ఒక కాగడా పట్టుకొని ఆ యుద్ధ భూమిలో వెతికారు.( ఇంద్రజిత్ అందరినీ కనురెప్పలు కూడా తెరవడానికి వీలులేకుండా బాణాలతో కొట్టాడు) 


అలా వెతుకుతుండగా వాళ్ళకి జాంబవంతుడు కనిపించాడు, అప్పుడు విభీషణుడు " జాంబవంత! నీకు స్పృహ ఉందా, మేము మాట్లాడుతుంది నీకు అర్ధం అవుతుందా " అని అడిగాడు.

అప్పుడు జాంబవంతుడు మెల్లగా కనురెప్పలు పైకి ఎత్తి అన్నాడు " నాయనా, నీ కంఠం చేత గుర్తుపట్టానయ్య, నువ్వు విభీషణుడివి కదా. హనుమంతుడు ప్రాణాలతో ఉన్నాడా? " అని అడిగాడు. 

విభీషణుడు అన్నాడు " నువ్వు పెద్దవాడివి, వానర యోధులకందరికి కూడా నువ్వు తాతవంటి వాడివి. అటువంటి నువ్వు  రామలక్ష్మణులు బతికి ఉన్నారా అని అడగకుండా హనుమంతుడు జీవించి ఉన్నాడా అని ఎందుకు అడిగారు " అన్నాడు.

అప్పుడు జాంబవంతుడు అన్నాడు " మొత్తం వానర సైన్యం అంతా మరణించని, హనుమంతుడు ఒక్కడు బతికుంటే మళ్ళి వీళ్ళందరూ బతుకుతారు. మొత్తం వానర సైన్యం బతికి ఉండని, హనుమంతుడు ఒక్కడు చనిపోతే అందరూ చనిపోయినట్టే. హనుమ శక్తి ఏమిటో నాకు తెలుసు, హనుమ ఉన్నాడా? " అని అడిగాడు.

వెంటనే హనుమంతుడు జాంబవంతుడి పాదాలు పట్టుకొని " తాత! హనుమ నీకు నమస్కరించుచున్నాడు " అన్నాడు.

అప్పుడు జాంబవంతుడు " అందరినీ  రక్షించగలిగిన వాడివి నువ్వే. ఆలస్యం చెయ్యకుండా ఉత్తర క్షణం బయలుదేరి హిమాలయ పర్వతాలకి వెళ్ళు. అక్కడ కైలాశ పర్వతం పక్కన ఓషది పర్వతం ఒకటి ఉంది. దానిమీద ఉండే మృతసంజీవని (దీని వాసన చూస్తే చనిపోయిన వాళ్ళు బతుకుతారు) ,విశల్యకరణి (దీని వాసన చూస్తే, శరీరంలో బాణపు ములుకులు గుచ్చుకుని ఉంటె అవి కింద పడిపోతాయి), సంధానకరణి (దీని వాసన చూస్తే విరిగిపోయిన ఎముకలు అతుక్కుంటాయి), సౌవర్ణకరణి (దీని వాసన చూస్తే, ముర్చపోయిన వాళ్ళకి తెలివి వస్తుంది) అనే నాలుగు ఓషదులని తీసుకురా " అన్నాడు.

జాంబవంతుడు ఈ మాట చెప్పగానే హనుమంతుడు ఒక పర్వతాన్ని ఎక్కి, మెరుపు వెళ్లినట్టు ఆ పర్వతాన్ని తొక్కేసి ఆకాశంలోకి వెళ్ళిపోయాడు. హనుమంతుడు తీవ్రమైన వేగంతో హిమాలయ పర్వతాలని చేరుకొని, ఓషది పర్వతం ఎక్కడుందని చూస్తుండగా ఆ హిమాలయాల మీద ఆయనకి బ్రహ్మగారి ఇల్లు కనపడింది, అక్కడే పరమ శివుడు తన ధనుస్సుని పెట్టే ఒక పెద్ద అరుగు కనపడింది. అక్కడే హయగ్రీవుడిని ఆరాధన చేసే ప్రదేశం కనపడింది, సూర్య భగవానుడి కింకరులు ఉండే ప్రదేశం కనపడింది, అక్కడే ఇంద్రుడు ఉండే గృహం, కుబేరుడు ఉండే గృహం కనపడింది, అక్కడే సూర్య భగవానుడిని విశ్వకర్మ చెక్కిన వేదిక కనపడింది. 

తరువాత ఆయన ఆ ఓషది పర్వతం కోసం వెతికాడు. 

ఓషది పర్వతంలోని ఓషదులు తమని ఎవరో తీసుకుపోడానికి వస్తున్నారని, అవి తమ ప్రకాశాన్ని తగ్గించేసి లోపలికి అణిగిపోయాయి.


ఆ  ఓషదులను చూసిన హనుమంతుడు " ఆ  ఓషదులని నాకు కనపడకుండా దాస్తార, రామ కార్యానికి సాయం చెయ్యరా " అని ఆ పర్వత శిఖరాన్ని పీకి, చేతితో పట్టుకొని వాయు వేగంతో ఆ శిఖరాన్ని తీసుకొచ్చి యుద్ధ భూమిలో పెట్టాడు.


వాల్మీకి రామాయణం లో ఇలా ఉండగా మన అందరికి తెలిసిన కధ ప్రకారం చూస్తే ఇంద్రజిత్ లక్ష్మనుడిని ఒకడినే కొట్టేసి వెళ్ళిపోవటం హనుమంతుడు సంజీవని తెసుకోచి లక్ష్మణుడికి ముర్చాను తెరచుట అని మనకు తెలుసు .ఇప్పుడు మనం కధ  ప్రకారం చేపుకుండం.



అలా పెట్టేసరికి వాటి వాసనలు పీల్చిన ఇన్ని కోట్ల వానరాలు పైకి లేచిపోయాయి, రామలక్ష్మణులు పైకి లేచారు. 

అప్పుడు హనుమంతుడు ఆ పర్వతాన్ని తీసుకెళ్ళి ఆ హిమాలయ పర్వతాల దెగ్గర పెట్టి వచ్చేశాడు. 

అప్పుడు సుగ్రీవుడు అన్నాడు " మనన్ని బ్రహ్మాస్త్ర బంధనం చేసి వెళ్ళిన ఇంద్రజిత్ కి బుద్ధి రావాలి. అందుకని మీరందరూ ఒకసారి ఎగిరి లంకలోకి దూరిపోండి, కాగడాలు పట్టుకొని లంకనంతా కాల్చెయ్యండి " అన్నాడు.

సుగ్రీవుడు అలా అనంగానే ఇన్ని కోట్ల వానరాలు లంక యొక్క అంతఃపురాల మీద పడిపోయి రావణ అంతఃపురంతో సహా అన్ని ఇళ్ళని అగ్నికి ఆహుతి చేశారు. ఆ ఇళ్ళల్లో ఉన్న రకరకాల వస్త్రాలు, బంగారు పాత్రలు, ముత్యాలు, రత్నాలు మొదలైనవన్నీ కాలిపోయాయి. బాలురు, వృద్ధులు మినహాయించి లంకలో ఉన్న మిగిలిన మూలబలంలోని రాక్షసులు చాలామంది కాలిపోయారు. ఇదేసమయంలో రామచంద్రమూర్తి క్రుద్ధుడై ధనుష్టంకారం చేశాడు. ఒకపక్క ధనుష్టంకారం, ఒకపక్క వానర ఘోష, ఒకపక్క రాక్షసుల అరుపులు, ఒకపక్క రామ బాణ పరంపర వచ్చి లంకా పట్టణ ప్రాసాదముల మీద పడిపోతుంది. ఎక్కడా చూసినా అరుపులతో పరిస్థితి ఘోరంగా ఉంది.   


అప్పుడు రావణుడు కుంభకర్ణుడి కుమారులైన కుంభుడునికుంభుడిని యుద్ధానికి పంపాడు. వాళ్ళతో పాటు ప్రజంఘుడుమకరాక్షుడు అనే తన కుమారుడిని యుద్ధానికి పంపాడు. 

అప్పుడు సుగ్రీవుడు కుంభుడిని, హనుమంతుడు నికుంభుడిని, అంగదుడు ప్రజంఘుడిని, రాముడు మకరాక్షుడిని సంహరించారు. 

ఈ వార్త విన్న రావణుడు విశేషమైన శోకాన్ని పొంది, మళ్ళి ఇంద్రజిత్ ని పిలిచి యుద్ధానికి వెళ్ళమన్నాడు. 

ఆ ఇంద్రజిత్ మళ్ళి అదృశ్యమయిపోయి బాణ పరంపరతో వానరాలని కొట్టడం మొదలుపెట్టాడు.    

అప్పుడు లక్ష్మణుడు రాముడితో " అన్నయ్య! వీడు ఎన్నోసార్లు యుద్ధానికి వస్తున్నాడు. నువ్వు నాకు అనుమతిని ఇవ్వు, సమస్త రాక్షసజాతి నశించిపోవాలని సంకల్పించి, అభిమంత్రించి బ్రహ్మాస్త్రాన్ని విడిచిపెట్టేస్తాను " అన్నాడు.

రాముడన్నాడు " పారిపోతున్నవాడిని, ప్రమత్తుడై ఉన్నవాడిని, కనపడకుండా మాయా యుద్ధం చేస్తున్నవాడిని, వెన్ను చూపి పారిపోతున్నవాడిని, శరణాగతి చేసినవాడిని కొట్టకూడదు. పైగా బ్రహ్మాస్త్రం వేస్తే సమస్త భూమండలం క్షోభిస్తుంది. అందుకని ఒక్కడిని సంహరించడం కోసం అలాంటి అస్త్ర ప్రయోగం చెయ్యకూడదు. మనం అదును చూసి, వాడు ఎటువైపు తిరుగుతున్నాడో, బాణాలు ఎటువైపు నుండి వస్తున్నాయో చాలా నిశితంగా పరిశీలించు. ఇవ్వాళ వాడు ఎక్కడో అక్కడ దొరకకపోడు, అప్పుడు తీవ్రమైన వేగం కలిగిన బాణములతో ఇంద్రజిత్ ని కొట్టి భూమి మీద పడేస్తాను. లక్ష్మణా! ఇది నా ప్రతిజ్ఞ " అన్నాడు.

రాముడి మాటలను విన్న ఇంద్రజిత్ అనుకున్నాడు ' ఈ రామలక్ష్మణులు నన్ను కనిపెట్టి కొట్టడానికి సిద్ధపడుతున్నారు. కాబట్టి నేను ఏదో ఒక మోసం చేసి, రామలక్ష్మణుల దృష్టిని నా నుంచి మరల్చాలి ' అనుకుని ఆలోచించాడు. అప్పుడాయన వెంటనే సీతమ్మని మాయ చేత సృష్టించి తన రథంలొ కుర్చోపెట్టాడు. 



ఆయనకి ఎదురుగా హనుమంతుడు ఒక పర్వతాన్ని పట్టుకొని వస్తున్నాడు. అప్పుడా ఇంద్రజిత్ తన రథంలో ఉన్న మాయా సీత చెంపల మీద ఎడాపెడా కొట్టాడు. వాడు అలా కొడుతుంటే ఆవిడ ' హా రామ, హా రామ ' అని ఏడుస్తోంది. అలా ఏడుస్తున్న సీతమ్మని చూసిన హనుమంతుడు తట్టుకోలేక ఆ పర్వతాన్ని కిందపడేసి, ఏడుస్తూ " దుర్మార్గుడా, ఆమె మహా పతివ్రత, రామ కాంత. సీతమ్మని అలా కొడతావ, నాశనమయిపోతావురా నువ్వు, నేను, సుగ్రీవుడు నిన్ను విడిచిపెట్టము, నీ శిరస్సు గిల్లేస్తాను. సీతమ్మని వదులు " అని హనుమంతుడు బాధతో ఏడుస్తూ అరిచాడు. 

అప్పుడు ఇంద్రజిత్ అన్నాడు " ఆమె స్త్రీ కావచ్చు, ఇంకొకరు కావచ్చు. కాని మాకు దుఃఖాన్ని కల్పించింది కాబట్టి ఈమెని మాత్రం నేను విడిచిపెట్టను " అని చెప్పి ఒక ఖడ్గాన్ని తీసుకొని ఆమె శరీరాన్ని చీరేశాడు. అప్పుడా మాయా సీత మరణించి ఆ రథంలో పడిపోయింది. తరువాత ఇంద్రజిత్ ఆ రథంతో వెళ్ళిపోయాడు. 

No comments:

Post a Comment