అప్పుడు రావణుడు ఆ సారణుడిని ఆపి " నీకు ఎంత సంతోషంగా ఉందిరా వాళ్ళ గురించి చెప్పడం అంటె. నా అన్నం తిని వాళ్ళని పొగుడుతావ. ఇంకొకళ్ళు అయితే ఇప్పుడే పీకలు తీయించేవాడిని, కాని మీరు నాకు గతంలో చాలా ఉపకారాలు చేశారు కనుక వదిలేస్తున్నాను. ఇంకెప్పుడన్నా మీ ముఖాలు నాకు కనపడితే మీ పీకలు ఎగిరిపోతాయి, పోండి ఇక్కడినుంచి " అని, మళ్ళి శార్దూలుడిని పిలిచి " ఈ సారి నువ్వు వెళ్ళి గూఢచర్యం చేసి, ఎవడు ఏ వంశానికి చెందినవాడు, ఎవడు ఎవడి పుత్రుడు, రాముడు ఆహారం ఎక్కడ తింటాడు, ఎక్కడ పడుకుంటాడు, పక్కన ఎవరుంటారు, ఎవరు రక్షిస్తూ ఉంటారు మొదలైన ఈ విషయాలని కనిపెట్టి రా " అన్నాడు.
తరువాత రావణుడు విద్యుజిహ్వుడిని పిలిచి " నువ్వు నాకు ఒక ఉపకారం చెయ్యాలి. నువ్వు గొప్ప మాయాజాలం ఉన్నవాడివి. రాముడి శరీరం నుండి శిరస్సు విడిపోతే ఆ శిరస్సు ఎలా ఉంటుందో ముమ్మూర్తులా అటువంటి శిరస్సు తయారు చెయ్యాలి. రాముడి చేతిలో ఎటువంటి కోదండం ఉంటుందో అటువంటి కోదండాన్ని సృష్టించాలి. అలాగే రాముడి బాణాలు, అక్షయ తుణీరాలు ఎలా ఉంటాయో అటువంటివి సృష్టించాలి " అన్నాడు.
కొంతసేపటికి ఆయన అశోక వనానికి వెళ్ళి " సీత! నా భర్త అంత గొప్పవాడు అని గొప్పగా చెప్పావు కదా, ఆ రాముడు వానరములతో కలిసి సముద్రానికి సేతువు కట్టి దాటాడు. రాముడు దక్షిణ తీరంలో లంకకి సమీపంగా పడుకొని ఉండగా, ప్రహస్తుడి నాయకత్వంలో సైన్యం వెళ్ళి ఆదమరచి నిద్రిస్తున్న రాముడి శిరస్సుని శరీరం నుండి వేరు చేశారు. నిద్రపోతున్న వానరముల మీద మా సైన్యం దాడి చేసి అందరినీ సంహరించారు. హనుమంతుడు దవడల నుండి రక్తం కక్కుతూ చనిపోయాడు. రాముడి శిరస్సు వేరవడం చూసి లక్ష్మణుడు దిక్కులుపట్టి పారిపోయాడు. జాంబవంతుడు, సుషేణుడు, గంధమాదనుడు, శతబలి, అంగదుడు మొదలైన వీరులందరూ మరణించారు. మిగిలిన వానరాలని సముద్రంలోకి తోసేసారు. లక్ష్మణుడు మాత్రం కొంతమంది వానరములతో కలిసి పారిపోయాడు. ఇదుగో నీ భర్త శిరస్సు చూసుకుని సంతోషించు " అని చెప్పాక, అక్కడున్న ఒక రాక్షస స్త్రీని పిలిచి " రాత్రి ప్రహస్తుడు రాముడి శిరస్సుని వేరు చేసి తీసుకొచ్చాడు. విద్యుజిహ్వుడిని ఆ శిరస్సు తీసుకు రమ్మన్నానని చెప్పండి " అన్నాడు.
అప్పుడు విద్యుజిహ్వుడు తీసుకొచ్చిన రామ శిరస్సుని, బాణాలని, కోదండాన్ని అక్కడ పెట్టారు. వాటిని చూడగానే సీతమ్మ నేల మీద పడి మూర్చపోయింది. అప్పుడు రావణుడు ఆ కోదండాన్ని, బాణాలని సీతమ్మ దెగ్గరికి విసిరేసి " సీత! ఇప్పటికైనా నువ్వు నా పాన్పు చేరుతావ " అన్నాడు.
అప్పుడు సీతమ్మ ఆ శిరస్సుని పట్టుకొని రాముడిదో కాదో అని అవలోకనం చేసి చూసింది. అది యధాతధంగా రాముడి శిరస్సులా ఉంది. అప్పుడు సీతమ్మ అనింది " రామ! నాకు చాలా సౌభాగ్యము ఉందని, నువ్వు దీర్ఘాయిష్మంతుడవని పెద్దలు, జ్యోతిష్కులు చెప్పారు. ఇవ్వాళ ఆ జ్యోతిష్కులు చెప్పిన మాట అబద్ధమయ్యింది. నువ్వు గొప్ప యజ్ఞాగ్నితొ అంతిమ సంస్కారం జెరుపు కోవలసినవాడివి, కాని ఇవ్వాళ దిక్కు లేకుండా యుద్ధ భూమిలో పడిపోయి ఉంటె క్రూరమృగాలు నీ శరీరాన్ని తినేస్తు ఉంటుంటాయి. భార్యయందు దోషం ఉంటె, భార్య ప్రవర్తన యందు విశేషమైన వైక్లవ్యం ఉంటె భర్త వెళ్ళిపోతాడని శాస్త్రం చెబుతుంది. నాయందు ఏ దోషముందని నాకన్నా ముందు వెళ్ళిపోయావు రామ " అని సీతమ్మ ఏడ్చింది.
సీతమ్మ అలా ఏడుస్తుంటే చిరునవ్వులు చిందిస్తున్న రావణుడిని చూసి ఆమె అనింది " ఇప్పటికైనా నా శిరస్సుని రాముడి శిరస్సుతోటి, నా కాయాన్ని రాముడి కాయంతోటి కలిపి అంచేస్టి సంస్కారం పూర్తిచెయ్యి. ఈ ఒక్క కోరిక తీర్చు " అని సీతమ్మ అనింది.
అదృష్టవశాత్తు అదే సమయంలో అక్కడికి ఒక భటుడు వచ్చి " మహారాజ! మీకోసం ప్రహస్తుడు ఎంతో ఆదుర్తాతో ఎదురుచూస్తున్నాడు. మీరు వెంటనే సభకి రావలసింది " అన్నాడు.
వెంటనే రావణుడు అక్కడినుంచి వెళ్ళిపోయాడు, రావణుడు వెళ్ళగానే ఆ శిరస్సు, ధనుర్-బాణములు అదృశ్యమయ్యాయి. ఏడుస్తున్న సీతమ్మ దెగ్గరికి విభీషణుడి భార్య అయిన సరమ వచ్చి " నువ్వు శోకించకమ్మా, నాకు అపారమైన శక్తి ఉంది. నేను ఆకాశంలో నిలబడినప్పుడు ఎవ్వరికీ కనపడను. నేను రాముడిని చూశాను, ఆయన గుండ్రమైన బాహువులతో ఆ వానర సైన్యాన్ని కాపాడుతూ ఆవలి ఒడ్డున ఉన్నాడు. అంత అప్రమత్తంగా రాముడు నిద్రపోతాడ?, రాక్షసులు రాముడిని సంహరించగలరా? ఇంద్రుడు దేవతలని రక్షిస్తున్నట్టు, రాముడు వానరములని రక్షిస్తుంటాడు. నేను ఇప్పుడే చూసి వచ్చాను ఇది విద్యుజిహ్వుడి మాయ. అందుకనే రావణుడు వెళ్ళగానే ఇక్కడున్న శిరస్సు అంతర్దానమయ్యి పోయింది. రావణుడి మాయలు నమ్మకు, ఉపశాంతిని పొందు " అనింది.
" నువ్వు చెప్పినది నిజమైతే రావణుడు ఇప్పుడు ఏమి చేస్తున్నాడో చూసి, నాకు చెప్పు " అని సీతమ్మ సరమతో అనింది.
అప్పుడు సరమ రావణుడి అంతఃపురానికి వెళ్ళి, కొంతసేపటికి తిరిగొచ్చి " ఇప్పుడే నేను విని వచ్చాను, రావణుడి తల్లి కైకసి, ఒక వృద్ధుడైన మంత్రి రావణుడికి నచ్చచెప్పారు. ' ఏది ఏమైనా సీతని విడిచిపెట్టడం జెరగదు ' అని రావణుడు అన్నాడు. రాముడితో యుద్ధం చెయ్యడానికి కారణం చెప్పకుండా సైన్యాన్ని పిలవమన్నాడు. రాక్షసుల కోలాహలం గట్టిగా వినపడుతోంది. మేరు పర్వత శిఖరాల చుట్టూ తన గుర్రముల మీద ఎక్కి తిరిగే సూర్యనారాయణమూర్తిని ఉపాసన చెయ్యి, నీకు సమస్త శుభములు కలుగుతాయి " అని చెప్పింది.
సరమ మాటలకి సీతమ్మ ఉపశాంతిని పొందింది.
ఈలోగా మాల్యవంతుడు(తాత వరస) రావణుడి దెగ్గరికి వచ్చి " సృష్టిలో ధర్మం ఎప్పుడూ కూడా దేవతల వైపు ఉంటుంది, అధర్మం అసురుల వైపు ఉంటుంది. అధర్మపక్షం ధర్మపక్షం చేత ఓడింపబడుతుంది. నువ్వు సీతమ్మని అపహరించి తెచ్చినప్పటినుంచి దుర్నిమిత్తములు కనపడుతున్నాయి, అందుకని మనం ఓడిపోక తప్పదు. నువ్వు సీతమ్మని తెచ్చినప్పటి నుంచి, తెల్లటి రెక్కలు ఉండి ఎర్రటి పాదాలతో ఉండే పావురాలు అరుస్తూ గోల చేస్తున్నాయి, ఇంట్లో పెంచుకునే చిలకలు, గోరింకలు మంచి మాటలు చెప్పడం మానేసి వీచి-కూచి మాటలు చెబుతున్నాయి, ఎక్కడి నుంచో క్రూరమైన పక్షులు వచ్చి వీటితో యుద్ధం చేస్తున్నాయి, ఏ ఇంటిముందు చూసినా నల్లనివాడు, బోడి గుండువాడు, ఎర్రటి వస్త్రములు కట్టుకున్నవాడు ఉదయము సాయంకాలము ఇళ్ళల్లోకి తొంగిచూస్తున్నట్టు కనపడుతోంది. వచ్చినవాడు సామాన్యుడు కాదు, శ్రీ మహావిష్ణువు వచ్చాడు, సీతమ్మని రాముడికి అప్పగించి సంధి చేసుకుని బతికిపో, నా మాట విని యుద్ధం చెయ్యకు " అన్నాడు.
అప్పుడు రావణుడు " చేతిలో పద్మము లేని లక్ష్మీదేవి ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా ఉన్న సీతని నేను వదులుతాన, రాముడు గొప్పవాడే కావచ్చు కాని నేను కూడా సురాసురులని ఓడించాను. అందరూ నాకు నీతులు చెబుతున్నారు కాని నన్ను ప్రోత్సహించే వాడు కనపడడం లేదు. మీరందరూ బుద్ధిహీనులు. తాత! నువ్వే కాదు, ఒకవేళ బాణం పెట్టి నా శరీరాన్ని రెండుగా చీల్చినా, కత్తి పెట్టి నా శరీరాన్ని రెండుగా నరికేసినా ఆ రెండు ముక్కలు మాత్రం ముందుకి వంగవు, వెనక్కే పడిపోతాయి. ఒకరిమాట వినడం నాకు చేతకాదు, ఇది నా స్వభావం " అని చెప్పాడు.
అటుపక్క రాముడు లంకా పట్టణాన్ని చూద్దామని సువేల పర్వత ఎక్కాడు. అప్పుడే ఎదురుగా ఉన్న అంతఃపురంలోకి రావణుడు విశేషమైన మాలలు, వస్త్రాలు వేసుకుని బయటకి వచ్చాడు.
అలా వస్తున్న రావణుడిని చూసిన సుగ్రీవుడు ఆగ్రహించి ఒక్క దూకు దూకి రావణుడి మీద పడ్డాడు. ఇద్దరూ పోడుచుకున్నారు, కొట్టుకున్నారు, రక్తాలు కారేటట్టు గుద్దుకున్నారు. ఇంతలో రావణుడు మాయలు ప్రదర్శించడం మొదలుపెట్టాడు. వీడు మాయా యుద్ధం చేస్తున్నాడని సుగ్రీవుడు ఎగిరి మళ్ళి రాముడి పక్కకి వచ్చేశాడు. అప్పుడు రాముడన్నాడు " సుగ్రీవ! ఇలా నువ్వు వెళ్ళిపోయావె, నీకు ఏదన్నా అయితే నాకు సీత ఎందుకు, లక్ష్మణుడు ఎందుకు, భరతుడు ఎందుకు, శత్రుఘ్నుడు ఎందుకు. నేను మనస్సులో ఎమనుకున్నానో తెలుసా, ఒకవేళ రావణుడి చేతిలో నీకు జెరగరానిది జెరిగితే, ఈ రావణుడిని ఇక్కడే చంపేసి, విభీషణుడికి పట్టాభిషేకం చేసేసి, లక్ష్మణుడిని వెనక్కి పంపి భరతుడిని రాజ్యం ఏలుకోమని చెప్పి, నేను కూడా శరీరాన్ని ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోదామనుకున్నాను. నువ్వు లేకుండా నేను ఒక్కడినీ మాత్రం వెనెక్కి వెళ్ళకూడదని నిశ్చయించుకున్నాను. ఇంకెప్పుడూ ఇలాంటి సాహసాలు చెయ్యకు " అన్నాడు.
అలా వస్తున్న రావణుడిని చూసిన సుగ్రీవుడు ఆగ్రహించి ఒక్క దూకు దూకి రావణుడి మీద పడ్డాడు. ఇద్దరూ పోడుచుకున్నారు, కొట్టుకున్నారు, రక్తాలు కారేటట్టు గుద్దుకున్నారు. ఇంతలో రావణుడు మాయలు ప్రదర్శించడం మొదలుపెట్టాడు. వీడు మాయా యుద్ధం చేస్తున్నాడని సుగ్రీవుడు ఎగిరి మళ్ళి రాముడి పక్కకి వచ్చేశాడు. అప్పుడు రాముడన్నాడు " సుగ్రీవ! ఇలా నువ్వు వెళ్ళిపోయావె, నీకు ఏదన్నా అయితే నాకు సీత ఎందుకు, లక్ష్మణుడు ఎందుకు, భరతుడు ఎందుకు, శత్రుఘ్నుడు ఎందుకు. నేను మనస్సులో ఎమనుకున్నానో తెలుసా, ఒకవేళ రావణుడి చేతిలో నీకు జెరగరానిది జెరిగితే, ఈ రావణుడిని ఇక్కడే చంపేసి, విభీషణుడికి పట్టాభిషేకం చేసేసి, లక్ష్మణుడిని వెనక్కి పంపి భరతుడిని రాజ్యం ఏలుకోమని చెప్పి, నేను కూడా శరీరాన్ని ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోదామనుకున్నాను. నువ్వు లేకుండా నేను ఒక్కడినీ మాత్రం వెనెక్కి వెళ్ళకూడదని నిశ్చయించుకున్నాను. ఇంకెప్పుడూ ఇలాంటి సాహసాలు చెయ్యకు " అన్నాడు.
తరువాత అంగదుడిని పిలిచి రావణుడి దెగ్గరికి రాయబారానికి పంపారు. రాముడు అంగదుడితో " నువ్వు ఎందరో మహర్షులని బాధలు పెట్టావు, ఎందరో స్త్రీలని అపహరించావు. నువ్వు చేసిన పాపాలకి దండన విధించడానికి, నా భార్యని కూడా అపహరించావు కనుక నీయందు దోషమున్నది కనుక, నిన్ను నేను సంహరించవచ్చు కనుక, ఇవ్వాళ లంకా పట్టణానికి వచ్చాను. ఏ దేవర్షులని, రాజులని నిష్కారణంగా వధించి పంపించావో ఆ మార్గంలోనే నిన్ను పంపిస్తాను. అంతఃపురం విడిచి బయటకి రా " అని రాముడు అంగదుడితొ చెప్పాడు.
అంగదుడు వెంటనే వెళ్ళి రావణుడితొ ఈ మాటలు చెప్పాడు. ఆ మాటలు విన్న రావణుడు ఆగ్రహించి తన సైనికులతో అంగదుడిని పట్టుకోమని చెప్పాడు. ఆ సైనికులు అంగదుడిని పట్టుకోగా, అంగదుడు ఆ సైనికులతో సహా పైకి ఎగిరి ఒళ్ళు దులుపుకున్నాడు, అప్పుడా సైనికులందరూ కింద పడిపోయారు. అంగదుడు వెళ్ళిపోతూ రావణుడి అంతఃపుర ప్రాసాదాన్ని ఒక్క తన్ను తన్నాడు, ఆ దెబ్బకి ఆ ప్రాసాదం ఊడి కదిలిపోయింది.
రావణుడు వెంటనే ద్వారాలన్నీ మూయించేసాడు. యుద్ధం ప్రారంభం అవుతుంది అందరూ సిద్ధంకండి అన్నాడు. తూర్పు దిక్కుకి సర్వసైన్యదికారి అయిన ప్రహస్తుడిని మోహరించాడు, దక్షిణ దిక్కుకి మహోదర, మహోపార్షులని నియమించాడు, పశ్చిన దిక్కుకి ఇంద్రజిత్ ని పెట్టాడు, ఉత్తర దిక్కుకి సుక సారణులని పెట్టి, నేను మీతో యుద్ధానికి వస్తాను అన్నాడు. ఇదంతా చూసిన విభీషణుడి గూఢచారులు విషయాన్ని వెనక్కి వెళ్ళి చెప్పారు.
అప్పుడు రాముడు " తూర్పు దిక్కున ఉన్న ప్రహస్తుడిని మన సర్వసైన్యాధికారి అయిన నీలుడు ఎదుర్కొంటాడు. దక్షిణ దిక్కున ఉన్న మహోదర, మహోపార్షులని యువరాజైన అంగదుడు ఎదుర్కొంటాడు. పశ్చిమ దిక్కున ఉన్న ఇంద్రజిత్ ని హనుమంతుడు ఎదుర్కొంటాడు. ఉత్తర దిక్కున ఉన్న సుక సారణులకి నాయకత్వం వహించి రావణుడు ఉన్నాడు కనుక లక్ష్మణుడితో కలిసి నేనే వెళ్ళి ఎదుర్కొంటాను. నాలుగు దిక్కులా యుద్ధం ప్రారంభం అవుతోంది, బయలుదేరండి " అన్నాడు.
No comments:
Post a Comment