Pages

Sunday, 17 June 2012

రామాయణం @ కధ -87


ఆ సమయంలోనే మహోదరుడు అనే రాక్షసుడు అక్కడికి వచ్చి " కుంభకర్ణా! రాముడు అంత బలవంతుడు అంటూనే యుద్ధానికి వెళతానంటావేంటి. ఇలాంటప్పుడు యుద్ధం చెయ్యకూడదు, మోసాన్ని ప్రయోగం చెయ్యాలి. మనం ఒక అయిదుగురము బయలుదేరి రాముడి మీదకి యుద్ధానికి వెళదాము. అయిదుగురము రాముడి చుట్టూ చేరి ఆయనని నిగ్రహించగలిగితే అదృష్టవంతులం, ఒకవేళ రాముడిని నిగ్రహించలేకపోతె రామనామాంకితమైన బాణములు మన శరీరంలో గుచ్చుకుని ఉంటాయి.అప్పుడు మనం యుద్ధ భూమిలో ఉండకుండా వెనక్కి తిరిగొచ్చి రావణుడి కాళ్ళ మీద పడదాము. అప్పుడాయన ఫలాన అయిదుగురు వెళ్ళి రాముడిని సంహరించారు అని అందరికీ చెబుతాడు. అప్పుడు రావణుడు సీత కూర్చున్న చోట ఒక సభ నిర్వహించి మనన్ని కోరికలు కోరమంటాడు. అప్పుడు మనము డబ్బు, బంగారము, వాహనాలు అడుగుదాము. అవన్నీ రావణుడు సభలో మనకి ఇస్తాడు. అప్పుడు సీత అనుకుంటుంది ' ఇంత సభ జెరుగుతుంది, బయట భేరీలు మ్రోగుతున్నాయంటే రాముడు మరణించి ఉంటాడు. ఇంక రాముడు ఎలాగూ లేడు కదా....  ' అని చాలా కాలం సుఖాలకు దూరమైన స్త్రీ కనుక రావణుడి పాన్పు ఎక్కుతుంది. అప్పుడు రావణుడి కోరిక తీరుతుంది " అన్నాడు.



అప్పుడు రావణుడు " ఈ మహోదరుడికి రాముడితో యుద్ధం అంటె భయంరా, అందుకని ఇలాంటి నాటకాలన్నీ చెబుతున్నాడు " అని అన్నాడు.

అప్పుడు కుంభకర్ణుడు " మీరెవరు రావక్కరలేదు, నేనొక్కడినే వెళతాను " అన్నాడు. 

అప్పుడు రావణుడు " నువ్వు ఒక్కడివే వెళ్ళద్దు, రాక్షస సైన్యాన్ని తీసుకొని వెళ్ళు " అని చెప్పి, కుంభకర్ణుడి మెడలో ఒక మాల వేశాడు. 

అప్పుడా కుంభకర్ణుడు మంచి ఉత్తరీయము వేసుకొని, ఒక మంచి పంచె కట్టుకొని, శూలాన్ని పట్టుకుని యుద్ధానికి బయలుదేరాడు. ఆయన వెనకాల కొన్ని లక్షల సైన్యం అనుగమించి బయలుదేరింది. 



యుద్ధ భూమిలోకి వచ్చిన కుంభకర్ణుడిని ఆ వానరాలు యంత్రము అనుకొని చూస్తున్నారు. హనుమకి, సుగ్రీవుడికి, సుషేనుడికి, గంధమాదనుడికి, నీలుడికి, మైందుడికి మొదలైన నాయకులకి వస్తున్నది యంత్రము కాదు కుంభకర్ణుడు అని తెలుసు. అందుకని వాళ్ళు పెద్ద పెద్ద పర్వతాలు, శిలలు, చెట్లు పట్టుకెళ్ళి కుంభకర్ణుడిని కొడుతున్నారు. వాళ్ళు అలా కొడుతుంటే కుంభకర్ణుడు తన శూలాన్ని ఆడిస్తూ ఆ పర్వతాలని, చెట్లని కొట్టాడు, అప్పుడవి చూర్ణమయ్యి కిందపడ్డాయి. ఆయన తన అరి చేతులతో కొడుతుంటే వేలకు వేల వానరములు మరణిస్తున్నాయి. అలా మరణించిన వానరాలని నోట్లో వేసుకుని నములుతున్నాడు. ఆయన అలా నడుస్తూ వెళుతూ ఒక చేతితో 200 మంది వానరాలని పట్టుకొని నోట్లో వేసుకునేవాడు. ఆయన నోట్లోకి వెళ్ళిన వానరాలలో కొంతమంది ఆయన చెవుల నుండి బయటకి దుకేస్తున్నారు, కొంతమంది ఆయన ముక్కులో నుండి బయటకి దుకేస్తున్నారు. అలా బయటకి వస్తున్న వాళ్ళని కుంభకర్ణుడు మళ్ళి ఏరుకొని తినేస్తున్నాడు. పెద్ద పెద్ద భల్లూకాలని పట్టుకొని కొరుక్కుని తింటున్నాడు. ఆయన శూలం పెట్టి కొడుతుంటే కొన్ని వేల వానరాలు చనిపోయాయి.




అక్కడున్న వానరాలకి వచ్చింది యంత్రము కాదు రాక్షసుడే అని తెలిసిపోయింది. అప్పుడు వాళ్ళు చనిపోయిన వాళ్ళ మీద నుంచి, పడిపోయిన వాళ్ళ మీద నుంచి దూకుకుంటూ పారిపోయారు. కొంతమంది చెట్లు ఎక్కేశారు, కొంతమంది పర్వత గుహలలో దాక్కున్నారు, కొంతమంది సముద్రంలో దూకేశారు, కొంతమంది సేతువు ఎక్కి పారిపోయారు. 

అప్పుడు అంగదుడు వాళ్ళందరి దెగ్గరికి వెళ్ళి అన్నాడు " ఏరా మీరందరూ ఇలా పారిపోతున్నారు కదా, రేపు ఇంటికి వెళ్ళాక మీ భార్యలు మిమ్మల్ని అడిగితే ఏమి చెబుతారు. యుద్ధ భూమిలో కుంభకర్ణుడిని చూసి పారిపోయి వచ్చామని చెబుతార. మీ పౌరుషం ఏమయ్యింది " అని అందరినీ వెనక్కి తీసుకువస్తున్నాడు.  

ఇంతలో నీలుడుఋషభుడు, గంధమాధనుడుసుగ్రీవుడు మొదలైనవారు కుంభకర్ణుడి దెగ్గరికి వెళ్ళారు. అప్పుడా కుంభకర్ణుడు ఓ ఇద్దరిని చేతితో పట్టుకుని నలిపాడు. అప్పుడు వాళ్ళ నోట్లో నుంచి, ముక్కులో నుంచి, కళ్ళల్లో నుంచి, చెవులలో నుంచి రక్తం వరదలై పారింది. తరువాత వాళ్ళని అవతలికి విసిరేశాడు. కాని వాళ్ళు చాలా దేహ ధారుడ్యంబలము ఉన్నవాళ్లు కనుక కిందపడి మూర్చపోయారు. తరువాత ఆ కుంభకర్ణుడు కొంతమందిని పాదాలతో తన్నాడు, కొంతమందిని మోకాళ్ళతో పొడిచాడు. ఈలోగా సుగ్రీవుడు ఒక పెద్ద పర్వత శిఖరాన్ని తీసుకొచ్చి ఆయన మీద పడేశాడు. అది ఆ కుంభకర్ణుడి శరీరానికి తగిలి చూర్ణమయ్యి కిందపడిపోయింది. అప్పుడాయన తన శూలంతొ సుగ్రీవుడిని కొట్టాడు, ఆ దెబ్బకి సుగ్రీవుడు మూర్చపోయి కిందపడిపోయాడు, కాని మళ్ళి స్పృహ వచ్చి పైకి లెగబోతుంటే కుంభకర్ణుడు అన్నాడు " సుగ్రీవ! నీ జన్మ ఎటువంటిదో నీకు జ్ఞాపకం ఉందా, నువ్వు ఋక్షరజస్సు కొడుకువి(బ్రహ్మగారి కొడుకైన ఋక్షరజస్సు ఒకనాడు తెలియక శాపం ఉన్న ఒక సరస్సులొ స్నానం చేశాడు. అలా స్నానం చేసేసరికి ఆయన ఒక అప్సరస అయ్యాడు. అప్పుడు సూర్యుడు, ఇంద్రుడు ఆ అప్సరస యుక్క తలోచెయ్యి పట్టుకున్నారు. అప్పుడు వాళ్ళిద్దరి వీర్యము స్కలనమయ్యింది. ఇంద్రుడు తన వీర్యాన్ని ఆ అప్సరస యొక్క వాల భాగము నందు విడిచిపెట్టాడు. సూర్యుడు తన వీర్యాన్ని ఆమె కం భాగమునందు విడిచిపెట్టాడు. ఆ కంభాగమునుండి సుగ్రీవుడు, వాల భాగమునుండి వాలి పుట్టారు. ఆ తరువాత బ్రహ్మగారు ఆ అప్సరసని తీసుకెళ్ళి ఇంకొక తటాకంలో స్నానం చేయించాడు, అప్పుడాయన మళ్ళి తన వానర రూపాన్ని పొందాడు). నేను నిన్ను విడిచిపెడతాన...." అని శూలం పట్టుకొని సుగ్రీవుడిని గట్టిగా కొట్టాడు. ఆ సుగ్రీవుడు రక్తం  కక్కుతూ కిందపడిపోయాడు. 



అప్పుడు హనుమంతుడు ఆ కుంభకర్ణుడి చేతిలో ఉన్న శూలాన్ని లాక్కుని తన తొడకేసి కొట్టి వంచేశాడు. అప్పుడా కుంభకర్ణుడు హనుమంతుడిని ఒక దెబ్బ కొట్టాడు, ఆ దెబ్బకి హనుమంతుడు నోటి వెంట రక్తం కక్కుతూ విచలితుడై పడిపోయాడు. తరువాత ఆ కుంభకర్ణుడు కిందపడిపోయి ఉన్న సుగ్రీవుడిని తన సంకలో పెట్టుకొని తిరిగి లంకలోకి వెళ్ళిపోదామని బయలుదేరాడు. ఆ సమయంలో హనుమంతుడు చూసి అనుకున్నాడు ' నాకు ప్రభువు అయినవాడిని శత్రువు అపహరిస్తుండగా సేవకుడనైన నేను వెళ్ళి ఆయనని రక్షిస్తే, అది ప్రభువుకి అమర్యాద. సుగ్రీవుడికే తెలివొస్తుంది, వేచి చూద్దాము " అని హనుమంతుడు అనుకున్నాడు. 

ఈలోగా ఆ లంకలో ఉన్న రాక్షస స్త్రీలకి సుగ్రీవుడిని తీసుకువస్తున్న కుంభకర్ణుడిని చూసి చాలా సంతోషం కలిగింది. వాళ్ళు అంతఃపుర గోపురముల మీదనుంచి, మేడల మీద నుంచి చందన ద్రవాలని కుంభకర్ణుడి మీద పోశారు. సువాసనతో కూడిన గంధపు నీళ్ళు మీద పడేసరికి సుగ్రీవుడికి తెలివొచ్చి వెంటనే కుంభకర్ణుడి చెవులు, ముక్కు కొరికేశాడు. తరువాత ఆయన డొక్కల్ని తన గోళ్ళతో చీల్చేశాడు. అలా చీల్చేసేసరికి బాధతో కుంభకర్ణుడు సుగ్రీవుడిని వదిలేశాడు. సుగ్రీవుడు వెంటనే ఆకాశానికి ఎగిరి వెళ్ళిపోయాడు.  




ఇంక ఆ కుంభకర్ణుడు కోపంతో మళ్ళి యుద్ధ భూమిలోకి వచ్చాడు. ఆయనకి కోపం ఎక్కువ అవ్వడంతో వానరులతో, భల్లూకాలతో కలిపి రాక్షసులని కూడా నోట్లో వేసుకుని తినేశాడు. ఇంక ఆ సమయంలో లక్ష్మణుడు ఆ కుంభకర్ణుడి మీద బాణ ప్రయోగం చేశాడు. లక్ష్మణుడు ఎన్ని బాణములు వేసినా అవి కుంభకర్ణుడికి తగిలి కిందపడిపోతున్నాయి. అప్పుడాయన లక్ష్మణుడితో " ఏమో అనుకున్నాను కాని నువ్వు బాగానే యుద్ధం చేస్తున్నావు. కాని పిల్లాడివి నీతో నాకు యుద్ధం ఏమిటి, నిన్ను చంపితే లాభం ఏమిటి. నేను రాముడిని చంపి వెళ్ళిపోతాను. నన్ను విడిచిపెట్టు, నేను రాముడి దెగ్గరి వెళతాను " అన్నాడు. 

లక్ష్మణుడు కొట్టిన బాణాలకి, సుగ్రీవుడు కొరికిన దానికి ఆ కుంభకర్ణుడి శరీరం నుండి రక్తం  కారుతోంది. అప్పుడు లక్ష్మణుడు అన్నాడు " వీడు ఇలా నిలబడి నడిచినంతసేపు అందరినీ చంపేస్తాడు. వీడు కిందపడిపోతే గొడవ వదిలిపోతుంది. అందుకని మొత్తం వానర సైన్యం అంతా ఎగిరి వెళ్ళి వాడి మీద కూర్చోండి. అప్పుడా బరువుకి వాడు కిందపడిపోతాడు " అన్నాడు.

No comments:

Post a Comment