Pages

Thursday, 7 June 2012

రామాయణం @ కధ -80


"మీరందరూ ఈ సేతువు మీద ప్రయాణం చేసి ఆవలికి ఒడ్డుకి  చెరుకోండి " అని రాముడు అన్నాడు.


ఇప్పుడు ఆనవాలుగా మిగిలిన రామసేతువు  





అప్పుడా వానరములలో కొంతమంది సేతువు మీద నడవకుండా సేతువు యొక్క అంచుల మీద నడిచేవారు. కొంతమంది సముద్రంలోకి దూకి మళ్ళి సేతువు ఎక్కి వెళ్ళేవారు. ఇంకొంతమంది సముద్రంలో ఈదుకుంటూ వచ్చారు. కొంతమంది ఒక పెద్ద చెట్టుని పెకలించి సముద్రంలో పడేసి, దాని మీద కూర్చుని తోసుకుంటూ వచ్చేవారు. ఆ రోజున సముద్ర ఘోష గొప్పదా వానర ఘోష గొప్పదా అంటె, ఎవరూ చెప్పలేకపోయారు, అంతగా అల్లరి చేసుకుంటూ వెళ్ళారు. ఎన్నిరోజులైనా ఆ సైన్యం లంకా పట్టణానికి వస్తూనే ఉంది. చివరికి అన్ని కోట్ల వానర సైన్యం లంకని చేరుకుంది. 





అప్పుడు రాముడు సుగ్రీవుడిని, విభీషణుడిని పిలిచి " మనం అవతల ఒడ్డున ఉండగా సుకుడన్నవాడు రాయబారం చెయ్యడానికి వచ్చాడు కదా, వాడు ఎక్కడున్నాడు " అని అడిగాడు. 



అప్పుడు ఆ సుకుడిని తీసుకొచ్చి రాముడి ముందు ప్రవేశపెట్టారు. అప్పుడు రాముడు " నువ్వు ఎందుకొచ్చావు" అని అడిగాడు.


సుకుడన్నాడు " బుద్ధిహీనుడైన రావణుడు మీ బలాన్ని చూసి రాయబారం చెప్పమన్నాడు, ఇందులో నా తప్పు లేదు. నీ వంటి ప్రాజ్ఞుడు రాయబారిని చంపడు " అన్నాడు.

అప్పుడు రాముడు ఒక చిరునవ్వు నవ్వి " నువ్వు అన్నీ చూశావ? " అని అడిగాడు. అప్పుడా సుకుడు " ఇంకా చూడలేదు " అన్నాడు.

" విభీషణ! వీడిని తీసుకెళ్ళి దెగ్గరుండి మన సైన్యం అంతా ఒకసారి చూపించు. చూపించాక వీడిని వదిలెయ్యండి, వెళ్ళిపోతాడు " అన్నాడు.

ఆ సుకుడు వానర సైన్యం అంతా చూశాక రావణుడి దెగ్గరికి వెళ్ళాడు. అప్పుడు రావణుడు " రెక్కలు విరిగిపోయాయే " అని సుకుడిని చూసి ఎకిలించాడు. 



సుకుడన్నాడు " నీలాంటి దుర్మార్గుడు కాదు రాముడు. ఆయన నన్ను ప్రాణాలతో విడిచిపెడితే వాళ్ళ సైన్యాన్ని చూసి వచ్చాను. ఆ సైన్యం సామాన్యమైన సైన్యం కాదు, అందులో అరవీర భయంకరులైన వానరులు ఉన్నారు. వాళ్ళు సముద్రాన్ని దాటి వచ్చేశారు. వాళ్ళందరూ నిన్ను మట్టుపెట్టకముందే నా మాట విని సీతమ్మని విడిచిపెట్టవయ్యా. వానరులందరినీ గరుడ వ్యూహంగా నిలుచోబెట్టారు. శిరస్థానం దెగ్గర రాముడు, లక్ష్మణుడు నిలబడ్డారు. హృదయ స్థానమునందు అంగదుడు నిలబడ్డాడు. కుడి వైపున ఋషభుడు, ఎడమ వైపున గంధమాదనుడు, వెనుక భాగము నందు సుగ్రీవుడు నిలబడ్డారు. అలా కొన్ని కోట్ల కోట్ల వానరాలని నిలబెట్టారు " అన్నాడు.  

తరువాత రావణుడు సుకసారణులు అనే మరో ఇద్దరు గూఢచారులని పిలిచి వానర సైన్యాన్ని చూసి, ఎంత సైన్యం ఉందో లెక్కపెట్టి రమ్మన్నాడు. ఆ ఇద్దరు గూఢచారులు ప్రచ్ఛన్న రూపాలలో ఆకాశంలో ఉండి వానర సైన్యం ఎంత ఉందో అని చూస్తుండగా విభీషణుడు వాళ్ళని పసిగట్టి రాముడి దెగ్గరికి తీసుకెళ్ళి " వీళ్ళు దుర్మార్గులు, అందుకని వీళ్ళని బంధించి తీసుకొచ్చాను " అన్నాడు. ఇంతకముందు సుకుడితో ఎలా మాట్లాడాడో అలానే ఈ ఇద్దరు గూఢచారులతో రాముడు మాట్లాడి, విభీషణుడితో వాళ్ళని పంపించి సైన్యాన్ని చూడమన్నాడు. 

సుక సారణులు వానర సైన్యాన్ని చూసి, రావణుడికి ఆ సైన్యం గురించి వివరించారు. అప్పుడు రావణుడు " వాళ్ళందరూ 100 యోజనాల సముద్రాన్ని దాటి వచ్చేశారు అంటున్నారు కదా, వాళ్ళని ఒకసారి నాకు చూపించండి " అన్నాడు.

అప్పుడు రావణుడు సుక సారణులతో కలిసి ఒక ప్రాసాదం ఎక్కి " వాళ్ళలో ఎవరు ఎవరో నాకు చెప్పు " అన్నాడు.

అప్పుడు సారణుడు అన్నాడు " రావణ! అక్కడ చూడు, అక్కడున్నాడే ఆయన ధూమ్రుడు. ఆ ధూమ్రుడి తమ్ముడే జాంబవంతుడు. ఆయన అపారమైన పరాక్రమము ఉన్నవాడు, కొన్ని కోట్ల వానరములతో యుద్ధానికి వచ్చాడు. వాడు గట్టిగా పెద్ద పెద్ద కేకలు వేస్తే వాడి నోట్లోనుంచి వచ్చే నాదానికి శత్రువుల గుండెలు బద్దలయిపోతాయి. వాళ్ళకి వేరె ఆయుధములు అక్కరలేదు, వాళ్ళకి గోళ్ళు, కోరలు ఆయుధములు. పళ్ళతో కొరుకుతారు, మోచేతులతో పొడుస్తారు, చెట్లు పెకలిస్తారు, పర్వత శిఖరాలని ఊపుతారు, పెద్ద పెద్ద శిలలని విసురుతారు. ఒక్కొక్కడిది 10 ఏనుగుల బలం, కొంతమందిది 100 ఏనుగుల బలం, 1000 ఏనుగుల బలం, లక్ష ఏనుగుల బలం, కొంత మందిది ఎంత బలమో చెప్పడం కుదరదు. ఇందులో ఇంకా ఆశ్చర్యమైనవాడు ఇంకోడు ఉన్నాడు, ఆయన అడుగు తీసి అడుగు వేస్తే యోజనం దూరం పడుతుంది అడుగు. ఆయనంత విశాలమైన శరీరం ఉన్నవాడు ఈ భూమిలో లేడు. అదిగో ఎదురుగా కనపడుతున్నది ఆయనే. ఆయన పేరు పనసుడు4యోజనముల విశాలమైన శరీరాన్ని పొంది ఉంటాడు. అదిగో ఆయన పక్కన కనపడుతున్నవాడు సుగ్రీవుడు36 కోట్ల వానరములు సర్వకాలములయందు ఆయన చుట్టూ ఉంటాయి. గద ఎత్తి ' రారా రావణ ' అని ఆయన అక్కడ అరుస్తుంటే ఇక్కడ లంకలో ప్రాసాదములు కదులుతున్నాయి. ఇన్ని కోట్ల వానరాలకు ఆయన అధినాదుడు, ఆయన ఆజ్ఞకి తిరుగులేదు. ఆయన కిష్కిందని రాజధానిగా చేసుకొని పరిపాలిస్తాడు. ఈయన కన్నా బలవంతుడైన ఈయన అన్న వాలిని రాముడు ఒక్క బాణంతో కొట్టి చంపేశాడు. వాలి మెడలో ఉండే మహేంద్ర మాల ఇప్పుడు సుగ్రీవుడి మెడలో ఉంది. 

అదిగో అటు చూడు, ఆయన కేసరి, హనుమ యొక్క తండ్రి. ఆయన మేరు పర్వత శిఖరాల మీద తిరుగుతుంటాడు, కొన్ని లక్షల సైన్యంతో యుద్ధానికి వచ్చాడు. ఆయనది సామాన్యమైన శక్తి కాదు. ఆ పక్కన ఉన్న గంధమాధనుడి శక్తి అంత ఇంత అని చెప్పడానికి కుదరదు. అక్కడున్న వానరములలో కొంతమంది బంగారు రంగులో మెరుస్తూ ఉంటారు, కొంతమంది కాటుక కొండల్లా ఉంటారు, కొంతమంది భయంకరమైన దంతాలతో ఉంటారు, కొంతమంది తోకలు పొడుగ్గా ఉంటాయి, కొంతమంది ఎర్రగా, కొంతమంది పచ్చగా ఉంటారు. అక్కడున్న గుహల నిండా, పర్వతాల నిండా వాళ్ళే, సముద్రం మీద వాళ్ళే, ఆ వారధి మీద వాళ్ళే, లంకా పట్టణం చుట్టూ వానరాలే. ఈ వానరాలే కాకుండా ఇంకా వానరాలు వస్తూనే ఉన్నాయి వారధి దాటుతూ. లంకా పట్టణం చుట్టూ ఉన్న వనాలలొ ఉన్న ప్రతి చెట్టు మీద భల్లూకాలు ఉన్నాయి, ఈ  భల్లూకాలన్నిటికి జాంబవంతుడు నాయకుడు. ఇంకా గవయుడు,గయుడుగవాక్షుడు కోటి ఏనుగుల బలం ఉన్నవారు. నీ మీదకి ఇవ్వాళ ఎంత సైన్యం యుద్ధానికి వచ్చిందో చెబుతాను విను, పది పదివేలయితే ఒక లక్ష , పది లక్షలయితే పదిలక్షలు, పది పదిలక్షలు అయితే ఒక కోటి, లక్ష కోట్లయితే ఒక సంకువు, వెయ్యి సంకువులు ఒక మహా సంకువు, వెయ్యి మహా సంకువులు ఒక వృందము, వెయ్యి వృందములు ఒక మహా వృందము, వెయ్యి మహా వృందములు ఒక పద్మము, వెయ్యి పద్మములు ఒక మహా పద్మము, వెయ్యి మహా పద్మములు ఒక ఖర్వము, వెయ్యి ఖర్వములుమహా ఖర్వము, వెయ్యి మహా ఖర్వములు ఒక సముద్రము, వెయ్యి సముద్రములు ఒక ఓధము, వెయ్యి ఓధములు ఒక మహా ఓధము (10,00,00,00,00,00,00,00,00,00,00,00,00,00,00,00,00,00,00,00,000).ఇటువంటి మహా ఓధములు ఎన్నున్నాయో చెప్పడం కుదరదు. 

అదుగో అక్కడ మధ్యలో నిలబడినవాడు హనుమ, ఆయన బంగారు శరీరంతో మెరిసిపోతుంటాడు. ఆయనకి బ్రహ్మగారి వరం ఉంది, ఏ అస్త్ర-శస్త్రములకి ఆయన కట్టుబడదు. ఆయన పక్కన నీలమైన శరీరంతో, పద్మాలవంటి కన్నులతో, ఎడమ చేతితో కోదండం పట్టుకుని, సాముద్రిక శాస్త్రంలో ఎలా ఉండాలని చెప్పబడిందో అలా పోతపోసిన సౌందర్యంతో ఉన్నాడే, ఆయనే రాముడు. ఆయన పరమ ధర్మాత్ముడు, పితృవాక్య పరిపాలకుడు. ఆ రాముడి బహి ప్రాణం లక్ష్మణుడు, కంటిని కనురెప్ప కాపాడినట్టు ఆయన నిరంతరం అన్నని కాపాడుతూ ఉంటాడు. రామతుల్యమైన పరాక్రమము ఉన్నవాడు. రాముడికి ఎన్ని అస్త్ర-శస్త్రములు తెలుసో లక్ష్మణుడికి కూడా అన్ని అస్త్ర-శస్త్రములు తెలుసు " అని పొంగిపోతూ ఆ రామ సైన్యం గురించి రావణుడికి చెబుతున్నాడు. 

No comments:

Post a Comment