Pages

Wednesday 27 June 2012

రామాయణం @ కధ -92


ఈ సమయంలోనే లంకా పట్టణంలో ఉన్న ప్రజలు ఒకరితో ఒకరు " ఆ శూర్పణఖ జుట్టు తెల్లబడిపోయి వృద్ధురాలు అయిపోయింది, ఒళ్ళు ముడతలు పడిపోయింది, భయంకరమైన, వికృతమైన స్వరూపంతో ఉంటుంది, జారిపోయిన కడుపు ఉన్నది, కఠినమైన మాట కలిగినటువంటిది. అటువంటి శూర్పణఖ మన్మదుడితో సమానమైన ఆకృతి కలిగినవాడిని, అంత మధురముగా మాట్లాడగలిగినవాడిని, అటువంటి సౌందర్య రాశిని, చక్కటి నడువడి కలిగినవాడిని, సర్వ కాలముల యందు ధర్మమును అనుష్టించేవాడు అయిన రాముడిని ఏ ముఖం పెట్టుకొని కామించింది? రాముడిని పొందాలన్న కోరిక ఎలా కలిగింది? ఆ రాముడు వైముఖ్యాన్ని ప్రదర్శిస్తే, కడుపులో కక్ష పెంచుకుని సీతాపహరణానికి దారితీసేటట్టుగా రావణుడి మనస్సు వ్యగ్రత పొందేటట్టుగా ఎలా మాట్లడగలిగింది?  రావణుడు ఎంత మూర్ఖుడు, రాముడు అరణ్యంలో 14,000 మంది రాక్షసులని, ఖర-దూషణులని సంహరించాడు. అలాంటివాడితో సంధి చేసుకుందాము అన్న ఆలోచన లేకుండా శూర్పణఖ మాటలు విని సీతని అపహరించడానికి వెళ్ళాడు. 


పోని అప్పటికి రాముడు అంత పరాక్రమము ఉన్నవాడని రావణుడు తెలుసుకోలేకపోయాడు అని అనుకుందాము. కాని రాజ్యభ్రష్టుడై అన్నగారి చేత తరమబడి, ఋష్యమూక పర్వత శిఖరముల మీద కూర్చున్న సుగ్రీవుడిని రక్షించడం కోసమని ఆయనతో స్నేహాన్ని చేసుకొని, వాలిని ఒక్క బాణంతో సంహరించి, చేసుకున్న స్నేహానికి, ఒప్పందానికి నిలబడి సుగ్రీవుడిని రాజ్యమునందు ప్రతిష్టించినప్పుడైనా రావణుడి కళ్ళుతెరుచుకోలేదా.     

పోని అప్పుడు కూడా తెలుసుకోలేకపోయాడు అని అనుకుందాము. కాని విభీషణుడు ధర్మబద్ధమైన మాట చెప్పాడు ' అన్నయ్యా, నువ్వు రాముడిని నిగ్రహించలేవు, లంక అంతా నాశనమయిపోతుంది. నువ్వు చేసినది పాపపు నడువడితో కూడిన పని. నా మాట విని సీతమ్మని తీసుకెళ్ళి రాముడికి ఇచెయ్యి ' అని చెప్పాడు. విభీషణుడి మాటలు కాని రావణుడు విని ఉంటె ఇవ్వాళ లంకా పట్టణానికి ఇంతటి చేటుకాలం దాపురించేది కాదు. తోడపుట్టినవాడైన కుంభకర్ణుడు రాముడి చేతిలో చనిపోయాడు, తన కుమారులైన నరాంతకుడు, అతికాయుడు మొదలైన వారందరూ మరణించారు, మహోదర, మహాపార్షులు మొదలైనవారు మరణించారు, ఆఖరికి ఇంద్రజిత్ కూడా లక్ష్మణుడి చేతిలో మరణించాడు. ఇంతమంది చనిపోయాక కూడా వచ్చినవాడు సామాన్య నరుడు కాదన్న ఆలోచన రావణుడికి రావట్లేదే?  


ఒకానొకసారి దేవతలందరూ కూడా రావణుడు చేస్తున్న ఆగడములను భరించలేక అందరూ కలిసి బ్రహ్మగారి దెగ్గరికి వెళ్ళి ' అయ్యా! రావణుడు చేస్తున్న ఆగడాలు మేము భరించలేకపోతున్నాము, నరవానరముల చేతిలో తప్ప వాడికి ఎవరి చేతిలో చావు లేదు. ఇవ్వాళ వాడి ముందుకెళ్ళి నిలబడగలిగే ధైర్యం ఎవరికీ లేదు. సముద్రం కూడా కెరటాలతో వాడి ముందు నిలబడడానికి భయపడుతుంది, సూర్యుడు గట్టిగా ప్రకాశించడం లేదు, అలా దిక్పాలకులని కూడా శాసించగలిగే స్థితిలో ఉన్నాడు. వాడి చేతిలో లోకములన్నీ పీడింపబడుతున్నాయి, మేము ఎలా జీవించాలి ' అని అడిగారు. అప్పుడు బ్రహ్మగారు ' నేను ఇవ్వాల్టి నుంచి ఒక కట్టుబాటు చేస్తున్నాను. ఈ రాక్షసులు మూడు లోకములలోనూ తిరుగుతూ ఉంటారు, ఒక చోట ఉండరు, దానివల్ల మీకు కొంత ఉపశాంతి కలుగుతుంది ' అని అన్నారు. 


దానివల్ల ఆ దేవతలు పూర్తి ఉపశాంతిని పొందకపోవడం చేత శివుడి కోసం తపస్సు చేశారు. త్రిపురములను తన కంటి మంట చేత నశింపచేసినవాడైన పరమశివుడు ఆ దేవతలయందు ప్రీతి చెంది, వాళ్ళ ముందు ప్రత్యక్షమయ్యి ' ఇంత తపస్సు కలిగిన రావణుడు మరణించడానికి కావలసిన విధంగా, సీత అన్న పేరుతో అమ్మవారు ఉదయించబోతోంది ' అని ఆరోజున శివుడు దేవతలకి వరం ఇచ్చాడు. అందుచేత రావణుడు అపహరించి తీసుకొచ్చిన ఆ మైథిలి సాక్షాత్తుగా రావణుడి ప్రాణములను తీసుకోడానికి, ఈ లంకా పట్టణాన్ని సర్వనాశనం చెయ్యడానికి, రాక్షసులందరినీ పరిమార్చడానికి కాళ రాత్రిలా వచ్చింది. ఈ విషయాన్ని రావణుడు తెలుసుకోలేక రాముడి మీదకి యుద్ధానికి వెళుతున్నాడు " అని ఆ లంకా పట్టణంలోని ప్రజలు చెప్పుకుంటున్నారు.

ఇటుపక్కన రాముడు అలసిపోయినవాడై ' ఈ రావణుడిని అసలు ఎలా సంహరించడం ' అని ఆలోచిస్తుండగా, ఆ సమయంలో దేవతలు, గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, ఋషులు మొదలైనవారందరూ ఆకాశంలో నిలబడ్డారు. అందరితోపాటుగా వారిలోకి గబగబా అగస్త్య మహర్షి వచ్చి " రామ! రామ! ఇప్పుడు నేను నీకు ఆదిత్య హృదయం ఉపదేశం చేస్తున్నాను, దీనిని నువ్వు స్వీకరించు. ఇది కాని నువ్వు పొందావ, ఇక నీకు ఏ విధమైన అలసట ఉండదు. ఈ పరమమంగళమైన ఆదిత్య హృదయాన్ని నీకు భయం కలిగినప్పుడు కాని, అరణ్యంలో ఉన్నప్పుడు కాని చదువుకో, నీకు రక్ష చేస్తుంది " అని చెప్పి  ఆదిత్య హృదయాన్ని ఉపదేశించాడు....


 ఇప్పటికి  మన పెద్దలు చెబుతారు   ఆదిత్య హృదయాన్ని మననం చేసుకుంటే సర్వ భయాలు తొలగి  జయం చేకూరుతుంది .అనారోగ్యంగా ఉనవారికి  ఆరోగ్యం చేకురును.




1.తతౌ యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం
   రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం
2.దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణం
   ఉపగమ్యాబ్రవీద్రామం అగస్త్యో భగవానృషిః

ఈ రెండు  శ్లోకాలు అగస్త్యుడు శ్రీరాముడి వద్దకు వచ్చుట
అగస్త్య ఉవాచ:
3.రామరామహాబాహో శృణు గుహ్యం సనాతనం
   యేన సర్వానరీన్ వత్స సమరే విజయష్యసి
4.ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రువినాశనం
   జయావహం జపేన్నిత్యం అక్షయం పరమం శివం
5.సర్వమంగళమాంగళ్యం సర్వపాపప్రణాశనం
   చింతాశోకప్రశమనం ఆయుర్వర్ధన ముత్తమం

ఆదిత్య హృదయ పారాయణ వైశిష్టత చెప్పబడింది.
6.రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం
   పూజయస్వవివస్వంతం భాస్కరం భువనేశ్వరం
7.సర్వ దేవాత్మకో హ్యేశ తేజస్వీ రశ్మిభావనః
   ఏశ దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః
8.ఏశ బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః
   మహేంద్రో ధనదః కాలో యమస్సోమో హ్యపాంపతిః
9.పితరో వసవః సాధ్యాః అశ్వినౌ మరుతో మనుః
   వాయుః వహ్నిః ప్రజాప్రాణా ఋతు కర్తా ప్రభాకరః
10.ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్
     సువర్ణసదృశో భానుః హిరణ్యరేతా దివాకరః
11.హరిదశ్వస్సహస్రార్చిః సప్తసప్తిర్మరీచిమాన్
     తిమిరోన్మథనః శంభుస్త్వష్టా మార్తండక అంషుమాన్
12.హిరణ్యగర్భహ్ శిశిరస్తపనో భాస్కరో రవిః
     అగ్నిగర్భోఅదితేః పుత్రః శంఖః శిశిరనాశనహ్
13.వ్యోమనాథ స్తమోభెదీ ఋగ్ యజుస్సామ పారగః
     ఘన వృష్టిరపాం మిత్రో వింధ్య వీథీ ప్లవంగమః
14.ఆతపీ మండలీ మృత్యుః పింగళః సర్వతాపనః
     కవిర్విశ్వో మహాతేజా రక్తః సర్వ భవోధ్భవః
15.నక్షత్ర గ్రహతారాణాం అధిపో విశ్వ భావనః
     తెజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్నమోస్తుతే

సూర్యుడంటే బయటకు వ్యక్త మవుతున్న లోపలి ఆత్మ స్వరూపమని, బాహ్యరూపము అంత స్వరూపము ఒక్కటే.
16.నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయె నమః
     జ్యోతిర్గణాణాం పతయే దినధిపతయే నమః
17.జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః
     నమో నమస్సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః
18.నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః
     నమః పద్మ ప్రబోధాయ ప్రచండాయ నమో నమః
19.బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్యవర్చసే
     భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషె నమః

20.తమొఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయ అమితాత్మనె

     కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః

మంత్ర జపం
21.తప్త చామీక రాభాయ హరయే విష్వకర్మణే
     నమస్తమోభినిఘ్నాయ రుచయే లొకసాక్షిణే
22.నాశయత్యేష వై భూతం తదైవ సృజతి ప్రభుః
     పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః
23.ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః
     ఏష చైవాగ్నిహోత్రంచ ఫలం చైవాగ్నిహోత్రిణాం
24.వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ
     యాని కృత్యాని లోకేషు సర్వేషు పరమ ప్రభుః

సూర్యుడు గురించి శ్లోక మంత్రాలు
25.ఏనమాపత్సు కృత్ శ్రేషు కాంతారేషు భయేషు చ
     కీర్తయన్ పురుషః కశ్చిన్ నావసీదతి రాఘవః
26.పూజయస్వైనమేకాగ్రో దేవదేవం జగత్పతిం
     ఏతత్ త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి
27.అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి
     ఏవముక్త్వా తదాగస్త్యో జగామ చ యథాగతం
28.ఏతత్ శృత్వా మహాతెజా నష్టశొకొభవత్తదా
     ధారయామాస సుప్రీతొ రాఘవహ్ ప్రయతాత్మవాన్
29.ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వా తు పరం హర్షమవాప్తవాన్
     త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్
30.రావణం ప్రేక్ష్య హ్రుష్టాత్మా యుద్ధాయ సముపాగమత్
     సర్వ యత్నేన మహతా వధె తస్య ధృతోభవత్

పారాయణ వల్ల కలిగే ఫలం, పారాయణ చేయ వలసిన విధానం
31.అథ రవి రవదన్నిరీక్ష్య రామం
     ముదితమనాః పరమం ప్రహృష్యమానః
     నిశిచరపతి సంక్షయం విదిత్వా
     సురగణమధ్యగతో వచస్త్వరేతి

సూర్యభగవనుడు శ్రీ రాముడు విజయాన్ని పొందేటట్లు అశీర్వదించడం

Tuesday 26 June 2012

రామాయణం @ కధ -91


ఇంద్రజిత్ మరణించాడన్న వార్త విన్న రావణుడు కూర్చున్న తల్పం మీద నుండి కిందపడి దీర్ఘమూర్చని పొందాడు. తరువాత ఆయన అన్నాడు " నా కుమారుడు ఇంద్రజిత్ ఎవరి చేత సంహరింపబడనివాడు, ఇవ్వాళ ఇంత దారుణంగా మరణించాడు. ఇంక నాకీ జీవితం ఎందుకు. అసలు ఇన్ని ఉపద్రవాలకి కారణం అయిన సీతని సంహరించేస్తాను " అని ఒక పెద్ద కత్తి పట్టుకుని బయలుదేరాడు. ఆగ్రహంతో తన వైపుకి వస్తున్న రావణుడిని చూసి సీతమ్మ ఒణికిపోయింది. రావణుడు సీతమ్మని చంపుదామను కునేసరికి మహాపార్షుడు అక్కడికి వచ్చి అన్నాడు " ఇంత బతుకు బతికి, ఇంత చదువు చదివి, ఇంత మందిని ఓడించి, ఇంత మందీ చచ్చిపోయాక ఒక ఆడదాన్ని కూడా రావణుడు చంపాడన్న అపకీర్తిని మూటకట్టు కుంటావ రావణా. నువ్వు మగాడివైతే యుద్ధం చేసి రాముడిని చంపు, అంతేకాని ఆడదాని మీద ఎందుకు నీ ప్రతాపం " అన్నాడు. 


అప్పుడు రావణుడు " రేపు అమావాస్య, రేపు రాముడితో యుద్ధం చేస్తాను " అని అంతఃపురానికి వచ్చేశాడు. 

మరునాడు రావణుడు విరూపాక్షుడుమహోదరుడుమహాపార్షుడు మొదలైన రాక్షస వీరులతో యుద్ధానికి వచ్చాడు. 

ఆ యుద్ధంలో విరూపాక్షుడిని, మహోదరుడిని సుగ్రీవుడు చంపాడు, మహాపార్షుడిని అంగదుడు చంపాడు. 

అప్పుడు రాముడు మండలాకారంగా తన ధనుస్సుని పట్టుకొని బాణాలు వేస్తుంటే, లోపలినుంచి కోరికలు పుట్టిస్తున్న జీవాత్మ ఎలా కనపడదో, అలా బాణపు దెబ్బలు తగులుతున్నాయి, ఏనుగుల తొండాలు తెగిపోతున్నాయి, గుర్రాలు కాళ్ళు తెగి పడిపోతున్నాయి, లక్షల రాక్షస సైన్యం పడిపోతుంది కాని రాముడు మాత్రం కనపడడం లేదు. ఆ సమయంలో రాముడు అగ్ని చక్రం తిరిగినట్టు తిరుగుతూ, మండలాకారంగా(వృత్తాకారంలో) ధనుస్సుని పట్టుకుని తిరుగుతూ కొన్ని కోట్ల రాక్షసులని కొట్టాడు. 



తన ఇంటి గుట్టుని రాముడికి చెప్పి ఇంతమంది రాక్షసుల మరణానికి కారణమైనవాడు ఆ విభీషణుడు ' అనుకొని, రావణుడు శక్తి అనే అస్త్రాన్ని విభీషణుడి మీదకి ప్రయోగించబోతుండగా, లక్ష్మణుడు బాణములతో ఆయన చేతిని కొట్టాడు. ఆగ్రహించిన రావణుడు ఆ శక్తిని లక్ష్మణుడి మీద ప్రయోగించాడు, అప్పుడా శక్తి లక్ష్మణుడి వక్షస్థలం నుండి దూసుకుపోయింది. వెంటనే ఆయన మూర్చపోయి కిందపడిపోయాడు. అప్పుడు హనుమంతుడు లక్ష్మణుడిని ఎత్తి తీసుకెళ్ళి రాముడి దెగ్గర పెట్టాడు. 

అప్పుడు రాముడన్నాడు " నా చేతిలో నుంచి ధనుస్సు జారిపోతోంది, మంత్రములు జ్ఞాపకానికి రావడం లేదు. ఏ దేశానికి వెళ్ళినా భార్య దొరుకుతుంది, ఏ దేశానికి వెళ్ళినా బంధువులు దొరుకుతారు, కాని తోడపుట్టినవాడు మాత్రం జీవితంలో ఒక్కసారే వస్తాడు " అని బాధపడ్డాడు.



అప్పుడు హనుమంతుడు " రామ! నువ్వు బెంగపెట్టుకోకు, లక్ష్మణుడిని ఎలా బతికించుకోవాలో నాకు తెలుసు " అని మళ్ళి ఆకాశంలోకి ఎగిరి, హిమాలయ పర్వతాలని చేరుకొని అక్కడున్న ఓషధ పర్వతాన్ని తీసుకొచ్చాడు. అప్పుడు సుషేణుడు ఆ ఓషదులని లక్ష్మణుడి ముక్కులో పిండాడు, ఆ  ఓషదుల వాసన తగలగానే లక్ష్మణుడు మళ్ళి పైకి లేచాడు. 

"ఇంక నేను యుద్ధం చేస్తాను ఈ రావణుడితో " అని రాముడు ముందుకి బయలుదేరాడు. ఆ సమయంలో ఆ యుద్ధాన్ని ఆకాశంలో నుండి చూస్తున్న దేవతలు ' దుర్మార్గుడు, దుష్టుడు అయిన రావణుడు రథంలో ఉండి యుద్ధం చేస్తున్నాడు, మహానుభావుడైన రాముడు భూమి మీద నుండి యుద్ధం చేస్తున్నాడు ' అని అనుకున్నారు. అప్పుడు ఇంద్రుడు తన సారధి అయిన  మాతలిని రాముడికి సహాయం చెయ్యమని చెప్పి తన రథం ఇచ్చి పంపించాడు.


అప్పుడా మాతలి రాముడితో అన్నాడు " రామ! ఇంద్రుడు ఈ రథాన్ని పంపించాడు. దీనికి ఆకుపచ్చని గుర్రాలు కట్టి ఉంటాయి. పూర్తిగా కాల్చిన బంగారంతో ఈ రథం నిర్మింపబడినది. ఇందులో అక్షయబాణ తూణీరాలు, ఇంద్రుడు పట్టుకునే గొప్ప ధనుస్సు ఉన్నాయి. మీరు ఈ రథాన్ని ఎక్కండి, నేను మీకు సారధ్యం చేస్తాను. శ్రీ మహావిష్ణువుని గరుడుడు వహించినట్టు నేను మీకు సారధ్యం చేస్తాను. మీకు ఇవ్వమని చెప్పి ఇంద్రుడు ఈ  శక్తి అనే ఆయుధాన్ని ఇచ్చాడు, మీరు దీన్ని స్వీకరించండి " అన్నాడు.



రాముడు ఆ రథానికి నమస్కరించి దానిలోకి ఎక్కాడు. అప్పుడు రాముడికి రావణుడికి చండప్రచండమైన యుద్ధం జెరిగింది. రాముడి బాణాల వేగాన్ని తట్టుకోలేక ఆ రావణుడు వెనక్కి వెళ్ళాడు. వాళ్ళిద్దరికీ యుద్ధం జెరుగుతుండగా ఆకాశం అంతా చీకటిగా అయిపోయింది. పగటి వేళలో వాళ్ళిద్దరి బాణ పరంపర ఆకాశాన్ని కప్పేసింది. అప్పుడు రాముడన్నాడు " ఇంక మీరెవ్వరు యుద్ధం చెయ్యకండి, అలా నిలబడి చూడండి. రావణుడో రాముడో తేలిపోవాలి " అన్నాడు. 

అటుపక్క రాక్షసులు, ఇటుపక్క వానరాలు నిలబడిపోయి రామ-రావణ యుద్ధాన్ని చూస్తున్నాయి. రావణుడు 20 చేతులతో ఆయుధాలని రాముడి మీదకి ప్రయోగిస్తున్నాడు. ఆ సమయంలో రావణుడు శక్తి అనే అస్తాన్ని రాముడి మీదకి విడిచిపెట్టాడు. అప్పుడు రాముడనుకున్నాడు ' ఈ రథం ఎక్కాక, లక్ష్మణుడు బతికాక, నాకు విపరీతమైన ఆనందం కలుగుతోంది. అన్ని అస్త్ర-సస్త్రాలు నాకు జ్ఞాపకానికి వస్తున్నాయి. ఉత్సాహం పొటమరిస్తోంది ' అనుకొని, ఇంద్రుడు ఇచ్చిన శక్తిని ప్రయోగించాడు. ఇద్దరి యొక్క శక్తులు ఆకాశంలో కొట్టుకొని నిర్వీర్యం అయ్యి కిందపడి పోయాయి. ఆ తరువాత రాముడు వేసిన బాణాలని రావణుడు తట్టుకోలేకపోయాడు, ఆయన చేతిలోని ధనుస్సు విరిగిపోయింది. అటువంటి సమయంలో రావణుడి సారధి ఆయన రథాన్ని యుద్ధభూమి నుండి దూరంగా తీసుకెళ్ళిపోయాడు. 



అప్పుడు రావణుడు ఆ సారధితో " ఛి నీచుడ! నా జీవితంలో లేదు ఇటువంటి అప్రతిష్ట. యుద్ధభూమిలో ఉండగా నా తలలు తెగిపోయినా పరవాలేదు, కాని నువ్వు రథాన్ని చాటుకి తీసుకొచ్చి దాచావు. నువ్వు శత్రువుల దెగ్గర లంచం తీసుకున్నావు కనుకనే ఇలాంటి పని చేశావు, నిజం చెప్పు? " అన్నాడు.

అప్పుడా సారధి " మీ దెగ్గర ఇంత కాలం పని చేశాను. ఇప్పుడు ఒకరి దెగ్గర లంచం తీసుకొని మిమ్మల్ని అవమానించవలసిన అగత్యం నాకు లేదు. నేను శాస్త్రం తెలియనివాడిని కాదు, మర్యాద తెలియనివాడిని కాదు, రధికుడు రథంలో ఉండగా ఎలా నడపాలో తెలియని భ్రష్టుడిని కాదు. నేను ఎంతో కాలంగా మీ ఉప్పు తిన్నాను, మీ యందు కృతజ్ఞుడనై ఉన్నాను. ద్వంద యుద్ధం జెరుగుతున్నప్పుడు సమయోచితంగా అవసరాన్ని బట్టి రథాన్ని దెగ్గరికి తీసుకెళ్ళాలి, దూరంగా కూడా తీసుకెళ్ళాలి, గుర్రాలు అలసిపోతున్నాయేమో చూసుకోవాలి, వెనుకన ఉన్న రథియొక్క పరిస్థితిని గమనించుకోవాలి. రాముడి బాణపు వేడి చేత గుర్రాలు శోషించిపోయాయి, తిరిగి ఆయుధాన్ని ప్రయోగించలేని నీరస స్థితిని మీరు పొందుతున్నారు. అప్పుడు రథికుడిని రక్షించుకోవలసిన బాధ్యత సారధికి ఉంది, అందుకని నేను రథాన్ని వెనక్కి తెచ్చాను. అంతేకాని ఒకరి దెగ్గర లంచం తీసుకొని మిమ్మల్ని తేవలసిన అవసరం నాకు లేదు, మీ సేవలో ధన్యుడను అవ్వడానికి నీతికి కట్టబడిన సారధిని నేను " అన్నాడు.

అప్పుడు రావణుడు " నేను నిన్ను ఎన్ని మాటలు అన్ననురా సారధి. నువ్వు ఉత్తమ సేవకుడివి " అని చెప్పి, తన చేతి కున్న స్వర్ణ కంకణాన్ని తీసి సారధికి ఇచ్చాడు.

Friday 22 June 2012

రామాయణం @ కధ -90



ఎప్పుడైతే సీతమ్మ పడిపోయిందో అప్పుడు హనుమంతుడు యుద్ధం మానేసి, ఏడుస్తూ, పెద్ద పెద్ద కేకలు వేస్తూ " ఇంకా ఈ యుద్ధం ఎవరి కోసం చేస్తారురా. ఏ తల్లిని రక్షించడానికి యుద్ధానికి వచ్చామో ఆ తల్లిని సంహరించాడు. ఇంక నేను యుద్ధం చెయ్యను " అని ఏడుస్తూ రాముడి దెగ్గరికి వెళ్ళి " రామ! దుర్మార్గుడైన ఇంద్రజిత్ వానరులందరూ చూస్తుండగా సీతమ్మని తీసుకొచ్చి, సంహరించి తీసుకెళ్ళిపోయాడు. ఇంక సీతమ్మ లేదు " అని చెప్పాడు.



ఈ మాటలు విన్న రాముడు మూర్చపోయి కిందపడిపోయాడు. 

తరువాత వాళ్ళు రాముడి ముఖం మీద కొన్ని నీళ్ళు పోసి ఆయనని లేపారు. 

అప్పుడు లక్ష్మణుడు అన్నాడు " అన్నయ్యా! నువ్వు ధర్మము ధర్మము ధర్మము అని ఇన్నాళ్ళు పట్టుకు తిరిగావు. ఆ ధర్మం నీకు ఏ ఫలితాన్ని ఇచ్చింది. నువ్వు పట్టుకున్న ధర్మం వల్ల రాజ్య భ్రష్ట్రుడివి అయ్యావు, నువ్వు పట్టుకున్న ధర్మం వల్ల తండ్రిగారు మరణించారు, నువ్వు పట్టుకున్న ధర్మం వల్ల సీతమ్మ అపహరింపబడింది, నువ్వు పట్టుకున్న ధర్మం వల్ల జటాయువు మరణించాడు, నువ్వు పట్టుకున్న ధర్మం వల్ల 14 సంవత్సరాలుగా అరణ్యాలలో తిరుగుతున్నావు. ధర్మాన్ని విడిచిపెట్టిన రావణుడు అంతఃపురంలో కులుకుతున్నాడు, సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నాడు. అధర్మంతో ఉన్నవాడు అంత సంతోషంగా ఉన్నాడు, ధర్మంతో ఉన్న నువ్వు ఇంత కష్టంలో ఉన్నావు. ఇంకా ధర్మము ధర్మము అని ఎందుకంటావు అన్నయ్యా, ఆ ధర్మాన్ని విడిచిపెట్టు. మనం కూడా అధర్మాన్నే స్వీకరిద్దాము " అన్నాడు.

వెంటనే విభీషణుడు పరుగు పరుగున వచ్చి " ఎంత మాటన్నావు లక్ష్మణా, సీతమ్మని ఇంద్రజిత్ సంహరిస్తే రావణుడు ఊరుకుంటాడనుకున్నావ? ఎంతోమంది చెప్పినా సీతమ్మని విడిచిపెట్టనివాడు ఇంద్రజిత్ సీతమ్మని చంపితే ఊరుకుంటాడ. ఆ ఇంద్రజిత్ మహా మాయావి, మీరు అంతలోనే వాడి మాయ మరిచిపోయారు. వాడు మాయా సీతని సంహరించి తీసుకుపోయాడు. వాడు ఇప్పుడు ఏం చేస్తుంటాడో తెలుసా. పెద్ద ఊడలు దిగిపోయిన మర్రి చెట్టు ఒకటి ఉంది, దాని చుట్టూ చాలా చీకటిగా ఉంటుంది. వాడు అక్కడికి వెళ్ళి నికుంభిలా హోమం చేస్తాడు. అక్కడ వాడు నికుంభిలా దేవతని ఉద్దేశించి హోమాన్ని పూర్తి చేసి, వాడి గుర్రాల మీద, ఆయుధముల మీద ఆ అక్షతలని చల్లుకొని యుద్ధ రంగంలోకి వస్తే దేవేంద్రుడు కూడా వాడితో యుద్ధం చెయ్యలేడు. సీతమ్మ చనిపోయింది అనుకుని మీరు ఇక్కడ ఏడుస్తున్నారు, కాని వాడు అక్కడ హోమం చేస్తుంటాడు. రామ! నన్ను అనుగ్రహించు, నాతో లక్ష్మణుడిని తీసుకెళ్ళి ఆ హోమం పూర్తవకుండానే వాడిని సంహరిస్తాను " అన్నాడు.

అప్పుడు రాముడు లక్ష్మణుడిని ఆశీర్వదించి, హనుమ మొదలైన వీరుల్ని సాయంగా పంపారు. 

విభీషణుడు లక్ష్మణుడిని ఇంద్రజిత్ హోమం చేసుకునే చోటుకి తీసుకెళ్ళాడు. వాళ్ళు అక్కడికి వెళ్ళేసరికి ఇంద్రజిత్ ఆ హోమం చెయ్యడం కోసం సిధ్దపడుతున్నాడు. తన హోమాన్ని ఎవరూ పాడుచెయ్యకుండా చుట్టూ సైన్యాన్ని కాపు పెట్టాడు. 

అప్పుడు విభీషణుడు " లక్ష్మణా! నువ్వు ఒకపక్క నుంచి సైన్యాన్ని బాణాలతో కొట్టి కాకావికలం చెయ్యి, అప్పుడు ఇంద్రజిత్ కనపడతాడు. అదే సమయంలో హనుమ వెళ్ళి రాక్షస సైన్యాన్ని తుదముట్టించెయ్యాలి. అంతమంది అక్కడ పడిపోతుంటే వాడు అక్కడ కూర్చుని హోమం చెయ్యలేడు. కాబట్టి రథం ఎక్కి వస్తాడు, అప్పుడు నువ్వు వాడిని కొట్టాలి " అన్నాడు.


వెంటనే లక్ష్మణుడు బాణ ప్రయోగం చేశాడు. అప్పుడా సైన్యం పక్కకి తప్పుకుంది, వాళ్ళు పక్కకి తప్పుకోగానే ఆ మర్రి చెట్టు కనపడింది. వెంటనే హనుమంతుడు అరవీరభయంకరుడై ఆ రాక్షసులని మర్దించేశాడు. హనుమ ప్రతాపం ముందు ఆ రాక్షస సైన్యం నిలబడలేక పెద్ద హాహాకారాలు చేశారు. ఆ హాహాకారాలు విన్న ఇంద్రజిత్ హోమాన్ని ఆపి ' ముందు హనుమంతుడిని సంహరించి, అప్పుడు హోమం చేస్తాను ' అని అనుకొని రథం ఎక్కాడు. అప్పుడాయన ఒక బ్రహ్మాండమైన అస్త్రాన్ని హనుమంతుడి మీద ప్రయోగిద్దామని ఆ అస్త్రాన్ని అభిమంత్రిస్తుండగా లక్ష్మణుడు ధనుష్టంకారం చేశాడు. ఆ టంకారానికి ఇంద్రజిత్ లక్ష్మణుడి వైపు చూశాడు.


అప్పుడు లక్ష్మణుడు " దుర్మార్గుడా, హనుమతో యుద్ధం ఎందుకు, నీతో యుద్ధం చెయ్యడానికి నేను వచ్చాను. పౌరుషం ఉంటె నాతో యుద్ధం చెయ్యి " అన్నాడు.

అప్పుడు ఇంద్రజిత్ " ఇంతకముందు నిన్ను రెండు మూడుసార్లు కొట్టాను, అయినా బుద్ధి లేకుండా మళ్ళి వచ్చావు. చూడు నీకు ఎటువంటి యుద్ధం చూపిస్తానో ఇవ్వాళ " అని ఇద్దరూ యుద్ధం మొదలుపెట్టారు.

లక్ష్మణుడి పక్కన ఉన్న విభీషణుడిని ఇంద్రజిత్ చూసి అన్నాడు " నువ్వు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగావు, నువ్వు స్వయానా నా తండ్రికి తమ్ముడివి, నాకు పినతండ్రివి. నీ కొడుకు వరసైన నన్ను చంపడానికి ఇవ్వాళ శత్రువులతో చేతులు కలిపావే నీకు ఇలా చెయ్యడానికి సిగ్గుగా లేదా. శత్రువులతో చేతులు కలిపి తనవారిని చంపినవాడు చివరికి ఆ శత్రువుల చేతులలోనే చనిపోతాడు " అన్నాడు.

విభీషణుడు అన్నాడు " నీ తండ్రి యందు, నీ యందు పాపం ఉంది కనుక నేను మిమ్మల్ని విడిచి ధర్మాత్ముడైన రాముడి పక్కకి వచ్చాను " అన్నాడు.

అప్పుడు ఇంద్రజిత్ కి లక్ష్మణుడికి ఘోరమైన యుధం జెరిగింది. ఇద్దరూ ఒకరిని ఒకరు బాణాలతో కొట్టుకున్నారు. లక్ష్మణుడు వేసిన బాణాలకి ఇంద్రజిత్ యొక్క ధనుస్సు ముక్కలయి పోయింది. తరువాత ఇంద్రజిత్ బాణాలతో లక్ష్మణుడి కవచాన్ని పగలగొట్టాడు. ఇద్దరూ సింహాలలా యుద్ధం చేశారు. విభీషణుడు ఆ రాక్షసుల మీద బాణాలని వేసి వాళ్ళని సంహరించాడు. 

ఇంద్రజిత్ కి లక్ష్మణుడికి 3 రోజుల పాటు భయంకరమైన యుద్ధం జెరిగింది. ఆఖరికి ఇంద్రజిత్ యొక్క సారధిని లక్ష్మణుడు కొట్టాడు. అప్పుడా ఇంద్రజిత్ ఒక చేతితో సారధ్యం చేస్తూ లక్ష్మణుడితో యుద్ధం చేశాడు. అప్పుడు నలుగురు వానర వీరులు ఆ రథం యొక్క గుర్రాలని కిందకి లాగేసి ఆ రథాన్ని నాశనం చేశారు

లక్ష్మణుడు ఎన్ని అస్త్రాలని వేసినా ఇంద్రజిత్ సంహరింపబడక పోయేసరికి విభీషణుడు అన్నాడు " ఆ ఇంద్రజిత్ పౌరుషం పెరిగిపోతుంది. ఏదో ఒకటి చేసి ఆ ఇంద్రజిత్ ని సంహరించు " అన్నాడు. 

ధర్మాత్మా సత్య సంధశ్చ రామో దాశరథిర్యది
పౌరుషే చా అప్రతిద్వంద్వః తదైనం జహి రావణిమ్





అప్పుడు లక్ష్మణుడు రెండు కోరలు కలిగిన సర్పంలాంటి ఒక బాణాన్ని తీసి, వింటినారికి తొడిగి " మా అన్న రాముడు ధర్మాత్ముడైతే, సత్యసంధుడైతే, దశరథుడి కొడుకే అయితే, పౌరుషం ఉన్నవాడే అయితే నా ఎదురుగా నిలబడిన ప్రతిద్వంది అయిన ఇంద్రజిత్ నిగ్రహింపబడుగాక " అని బాణ ప్రయోగం చేశాడు. ఆ బాణం వెళ్ళి ఇంద్రజిత్ కంఠానికి తగలగానే ఆయన శిరస్సు శరీరం నుండి విడిపోయి కింద పడిపోయింది. ఇంద్రజిత్ మరణించాడు.

Thursday 21 June 2012

రామాయణం @ కధ -89


ఇంద్రజిత్ బాణములు ప్రయోగించకముందే విభీషణుడు యుద్ధ భూమి నుంచి పారిపోయాడు. హనుమంతుడికి ఉన్న వరం వలన ఆయనని ఏ అస్త్రము బంధించలేదు. ఆ విభీషణుడు హనుమంతుడు కలుసుకొని " అసలు మన సైన్యంలో ఉన్న పెద్ద పెద్ద వీరులు ప్రాణాలతో ఉన్నారా, ప్రాణాలు విదిచిపెట్టేశార? " అని ఒక కాగడా పట్టుకొని ఆ యుద్ధ భూమిలో వెతికారు.( ఇంద్రజిత్ అందరినీ కనురెప్పలు కూడా తెరవడానికి వీలులేకుండా బాణాలతో కొట్టాడు) 


అలా వెతుకుతుండగా వాళ్ళకి జాంబవంతుడు కనిపించాడు, అప్పుడు విభీషణుడు " జాంబవంత! నీకు స్పృహ ఉందా, మేము మాట్లాడుతుంది నీకు అర్ధం అవుతుందా " అని అడిగాడు.

అప్పుడు జాంబవంతుడు మెల్లగా కనురెప్పలు పైకి ఎత్తి అన్నాడు " నాయనా, నీ కంఠం చేత గుర్తుపట్టానయ్య, నువ్వు విభీషణుడివి కదా. హనుమంతుడు ప్రాణాలతో ఉన్నాడా? " అని అడిగాడు. 

విభీషణుడు అన్నాడు " నువ్వు పెద్దవాడివి, వానర యోధులకందరికి కూడా నువ్వు తాతవంటి వాడివి. అటువంటి నువ్వు  రామలక్ష్మణులు బతికి ఉన్నారా అని అడగకుండా హనుమంతుడు జీవించి ఉన్నాడా అని ఎందుకు అడిగారు " అన్నాడు.

అప్పుడు జాంబవంతుడు అన్నాడు " మొత్తం వానర సైన్యం అంతా మరణించని, హనుమంతుడు ఒక్కడు బతికుంటే మళ్ళి వీళ్ళందరూ బతుకుతారు. మొత్తం వానర సైన్యం బతికి ఉండని, హనుమంతుడు ఒక్కడు చనిపోతే అందరూ చనిపోయినట్టే. హనుమ శక్తి ఏమిటో నాకు తెలుసు, హనుమ ఉన్నాడా? " అని అడిగాడు.

వెంటనే హనుమంతుడు జాంబవంతుడి పాదాలు పట్టుకొని " తాత! హనుమ నీకు నమస్కరించుచున్నాడు " అన్నాడు.

అప్పుడు జాంబవంతుడు " అందరినీ  రక్షించగలిగిన వాడివి నువ్వే. ఆలస్యం చెయ్యకుండా ఉత్తర క్షణం బయలుదేరి హిమాలయ పర్వతాలకి వెళ్ళు. అక్కడ కైలాశ పర్వతం పక్కన ఓషది పర్వతం ఒకటి ఉంది. దానిమీద ఉండే మృతసంజీవని (దీని వాసన చూస్తే చనిపోయిన వాళ్ళు బతుకుతారు) ,విశల్యకరణి (దీని వాసన చూస్తే, శరీరంలో బాణపు ములుకులు గుచ్చుకుని ఉంటె అవి కింద పడిపోతాయి), సంధానకరణి (దీని వాసన చూస్తే విరిగిపోయిన ఎముకలు అతుక్కుంటాయి), సౌవర్ణకరణి (దీని వాసన చూస్తే, ముర్చపోయిన వాళ్ళకి తెలివి వస్తుంది) అనే నాలుగు ఓషదులని తీసుకురా " అన్నాడు.

జాంబవంతుడు ఈ మాట చెప్పగానే హనుమంతుడు ఒక పర్వతాన్ని ఎక్కి, మెరుపు వెళ్లినట్టు ఆ పర్వతాన్ని తొక్కేసి ఆకాశంలోకి వెళ్ళిపోయాడు. హనుమంతుడు తీవ్రమైన వేగంతో హిమాలయ పర్వతాలని చేరుకొని, ఓషది పర్వతం ఎక్కడుందని చూస్తుండగా ఆ హిమాలయాల మీద ఆయనకి బ్రహ్మగారి ఇల్లు కనపడింది, అక్కడే పరమ శివుడు తన ధనుస్సుని పెట్టే ఒక పెద్ద అరుగు కనపడింది. అక్కడే హయగ్రీవుడిని ఆరాధన చేసే ప్రదేశం కనపడింది, సూర్య భగవానుడి కింకరులు ఉండే ప్రదేశం కనపడింది, అక్కడే ఇంద్రుడు ఉండే గృహం, కుబేరుడు ఉండే గృహం కనపడింది, అక్కడే సూర్య భగవానుడిని విశ్వకర్మ చెక్కిన వేదిక కనపడింది. 

తరువాత ఆయన ఆ ఓషది పర్వతం కోసం వెతికాడు. 

ఓషది పర్వతంలోని ఓషదులు తమని ఎవరో తీసుకుపోడానికి వస్తున్నారని, అవి తమ ప్రకాశాన్ని తగ్గించేసి లోపలికి అణిగిపోయాయి.


ఆ  ఓషదులను చూసిన హనుమంతుడు " ఆ  ఓషదులని నాకు కనపడకుండా దాస్తార, రామ కార్యానికి సాయం చెయ్యరా " అని ఆ పర్వత శిఖరాన్ని పీకి, చేతితో పట్టుకొని వాయు వేగంతో ఆ శిఖరాన్ని తీసుకొచ్చి యుద్ధ భూమిలో పెట్టాడు.


వాల్మీకి రామాయణం లో ఇలా ఉండగా మన అందరికి తెలిసిన కధ ప్రకారం చూస్తే ఇంద్రజిత్ లక్ష్మనుడిని ఒకడినే కొట్టేసి వెళ్ళిపోవటం హనుమంతుడు సంజీవని తెసుకోచి లక్ష్మణుడికి ముర్చాను తెరచుట అని మనకు తెలుసు .ఇప్పుడు మనం కధ  ప్రకారం చేపుకుండం.



అలా పెట్టేసరికి వాటి వాసనలు పీల్చిన ఇన్ని కోట్ల వానరాలు పైకి లేచిపోయాయి, రామలక్ష్మణులు పైకి లేచారు. 

అప్పుడు హనుమంతుడు ఆ పర్వతాన్ని తీసుకెళ్ళి ఆ హిమాలయ పర్వతాల దెగ్గర పెట్టి వచ్చేశాడు. 

అప్పుడు సుగ్రీవుడు అన్నాడు " మనన్ని బ్రహ్మాస్త్ర బంధనం చేసి వెళ్ళిన ఇంద్రజిత్ కి బుద్ధి రావాలి. అందుకని మీరందరూ ఒకసారి ఎగిరి లంకలోకి దూరిపోండి, కాగడాలు పట్టుకొని లంకనంతా కాల్చెయ్యండి " అన్నాడు.

సుగ్రీవుడు అలా అనంగానే ఇన్ని కోట్ల వానరాలు లంక యొక్క అంతఃపురాల మీద పడిపోయి రావణ అంతఃపురంతో సహా అన్ని ఇళ్ళని అగ్నికి ఆహుతి చేశారు. ఆ ఇళ్ళల్లో ఉన్న రకరకాల వస్త్రాలు, బంగారు పాత్రలు, ముత్యాలు, రత్నాలు మొదలైనవన్నీ కాలిపోయాయి. బాలురు, వృద్ధులు మినహాయించి లంకలో ఉన్న మిగిలిన మూలబలంలోని రాక్షసులు చాలామంది కాలిపోయారు. ఇదేసమయంలో రామచంద్రమూర్తి క్రుద్ధుడై ధనుష్టంకారం చేశాడు. ఒకపక్క ధనుష్టంకారం, ఒకపక్క వానర ఘోష, ఒకపక్క రాక్షసుల అరుపులు, ఒకపక్క రామ బాణ పరంపర వచ్చి లంకా పట్టణ ప్రాసాదముల మీద పడిపోతుంది. ఎక్కడా చూసినా అరుపులతో పరిస్థితి ఘోరంగా ఉంది.   


అప్పుడు రావణుడు కుంభకర్ణుడి కుమారులైన కుంభుడునికుంభుడిని యుద్ధానికి పంపాడు. వాళ్ళతో పాటు ప్రజంఘుడుమకరాక్షుడు అనే తన కుమారుడిని యుద్ధానికి పంపాడు. 

అప్పుడు సుగ్రీవుడు కుంభుడిని, హనుమంతుడు నికుంభుడిని, అంగదుడు ప్రజంఘుడిని, రాముడు మకరాక్షుడిని సంహరించారు. 

ఈ వార్త విన్న రావణుడు విశేషమైన శోకాన్ని పొంది, మళ్ళి ఇంద్రజిత్ ని పిలిచి యుద్ధానికి వెళ్ళమన్నాడు. 

ఆ ఇంద్రజిత్ మళ్ళి అదృశ్యమయిపోయి బాణ పరంపరతో వానరాలని కొట్టడం మొదలుపెట్టాడు.    

అప్పుడు లక్ష్మణుడు రాముడితో " అన్నయ్య! వీడు ఎన్నోసార్లు యుద్ధానికి వస్తున్నాడు. నువ్వు నాకు అనుమతిని ఇవ్వు, సమస్త రాక్షసజాతి నశించిపోవాలని సంకల్పించి, అభిమంత్రించి బ్రహ్మాస్త్రాన్ని విడిచిపెట్టేస్తాను " అన్నాడు.

రాముడన్నాడు " పారిపోతున్నవాడిని, ప్రమత్తుడై ఉన్నవాడిని, కనపడకుండా మాయా యుద్ధం చేస్తున్నవాడిని, వెన్ను చూపి పారిపోతున్నవాడిని, శరణాగతి చేసినవాడిని కొట్టకూడదు. పైగా బ్రహ్మాస్త్రం వేస్తే సమస్త భూమండలం క్షోభిస్తుంది. అందుకని ఒక్కడిని సంహరించడం కోసం అలాంటి అస్త్ర ప్రయోగం చెయ్యకూడదు. మనం అదును చూసి, వాడు ఎటువైపు తిరుగుతున్నాడో, బాణాలు ఎటువైపు నుండి వస్తున్నాయో చాలా నిశితంగా పరిశీలించు. ఇవ్వాళ వాడు ఎక్కడో అక్కడ దొరకకపోడు, అప్పుడు తీవ్రమైన వేగం కలిగిన బాణములతో ఇంద్రజిత్ ని కొట్టి భూమి మీద పడేస్తాను. లక్ష్మణా! ఇది నా ప్రతిజ్ఞ " అన్నాడు.

రాముడి మాటలను విన్న ఇంద్రజిత్ అనుకున్నాడు ' ఈ రామలక్ష్మణులు నన్ను కనిపెట్టి కొట్టడానికి సిద్ధపడుతున్నారు. కాబట్టి నేను ఏదో ఒక మోసం చేసి, రామలక్ష్మణుల దృష్టిని నా నుంచి మరల్చాలి ' అనుకుని ఆలోచించాడు. అప్పుడాయన వెంటనే సీతమ్మని మాయ చేత సృష్టించి తన రథంలొ కుర్చోపెట్టాడు. 



ఆయనకి ఎదురుగా హనుమంతుడు ఒక పర్వతాన్ని పట్టుకొని వస్తున్నాడు. అప్పుడా ఇంద్రజిత్ తన రథంలో ఉన్న మాయా సీత చెంపల మీద ఎడాపెడా కొట్టాడు. వాడు అలా కొడుతుంటే ఆవిడ ' హా రామ, హా రామ ' అని ఏడుస్తోంది. అలా ఏడుస్తున్న సీతమ్మని చూసిన హనుమంతుడు తట్టుకోలేక ఆ పర్వతాన్ని కిందపడేసి, ఏడుస్తూ " దుర్మార్గుడా, ఆమె మహా పతివ్రత, రామ కాంత. సీతమ్మని అలా కొడతావ, నాశనమయిపోతావురా నువ్వు, నేను, సుగ్రీవుడు నిన్ను విడిచిపెట్టము, నీ శిరస్సు గిల్లేస్తాను. సీతమ్మని వదులు " అని హనుమంతుడు బాధతో ఏడుస్తూ అరిచాడు. 

అప్పుడు ఇంద్రజిత్ అన్నాడు " ఆమె స్త్రీ కావచ్చు, ఇంకొకరు కావచ్చు. కాని మాకు దుఃఖాన్ని కల్పించింది కాబట్టి ఈమెని మాత్రం నేను విడిచిపెట్టను " అని చెప్పి ఒక ఖడ్గాన్ని తీసుకొని ఆమె శరీరాన్ని చీరేశాడు. అప్పుడా మాయా సీత మరణించి ఆ రథంలో పడిపోయింది. తరువాత ఇంద్రజిత్ ఆ రథంతో వెళ్ళిపోయాడు.