Pages

Monday 11 June 2012

రామాయణం @ కధ -83


రామ! రావణుడు నన్ను అపహరించాక దండకారణ్యం అంతా వెతికావు, హనుమని పంపించావు, నాకోసం సముద్రానికి సేతువుని కట్టి, దాటి వచ్చావు, చివరికి యుద్ధంలో ఇంద్రజిత్ మాయ వల్ల మరణించావు, ఎంత ఆశ్చర్యం రామ, నీకు బ్రహ్మాస్త్రం తెలుసు, బ్రహ్మశిరోనామకాస్త్రం తెలుసు, వారుణాస్త్రం తెలుసు, ఆగ్నేయాస్త్రం తెలుసు, ఇన్ని అస్త్రములు తెలిసిన నిన్ను ఒకడు కేవలం మాయతో కనపడకుండా కొట్టిన బాణములకు శరీరం వదిలేశావు. నువ్వు మరణించావన్న వార్త విని కౌసల్యాదులు బతుకుతార, అయోధ్య అయోధ్యలా ఉంటుందా. నువ్వు ఇన్ని కష్టాలు పడడానికి, అర్ధాంతరంగా శరీరం విడిచెయ్యడానికి నన్ను పెళ్ళి చేసుకున్నావ. నువ్వు నన్ను చేసుకోకపోతేనె బాగుండేదేమో " అని సీతమ్మ ఏడుస్తుంటే పుష్పకంలో ఉన్న త్రిజట చూడలేకపోయింది. అప్పుడు త్రిజట " ఏడవకు సీతమ్మ. రామలక్ష్మణులు మరణించలేదు, వాళ్ళిద్దరూ సజీవంగా ఉన్నారు. నేను నిన్ను ఓదార్చడానికి ఈ మాటలు చెబుతున్నానని అనుకుంటున్నావ, కాని నేను నీకు రామలక్ష్మణులు బతికున్నారని చెప్పడానికి ఒక బలవత్తరమైన కారణాన్ని చెబుతాను. భర్త మరణించిన స్త్రీ కాని ఈ పుష్పక విమానం ఎక్కితే ఇది పైకి ఎగరదు, నువ్వు పుష్పకంలోకి ఎక్కగా ఇది ఆకాశంలో నిలబడిందంటే, నువ్వు సౌభాగ్యవతిగా ఉన్నావు అని అర్ధం. యోధుడైనవాడు నిజంగా శరీరాన్ని విడిచిపెడితే సైన్యాలు ఇలా నిలబడవు, ఎవరి మానాన వాళ్ళు పారిపోతుంటారు. రామలక్ష్మణుల ముఖాల్లో కాంతి ఏ మాత్రం తగ్గలేదు. కొద్దిసేపు మూర్చపోయారు అంతే. కొద్దికాలంలో రావణుడి పది తలలు పడిపోయి ఇదే పుష్పకంలో రాముడితో కలిసి నువ్వు అయోధ్యకి వెళ్ళిపోతావు. ఏ రాక్షస స్త్రీకి నామీద లేని ప్రేమ నీ ఒక్కదానికే నా మీద ఎందుకు అంటావేమో, నిన్ను ఇక్కడికి తీసుకొచ్చినప్పటినుంచి నీ ప్రవర్తన చూస్తున్నాను. నీ ప్రవర్తన చేత, నీకు భర్త అంటె ఉన్న ప్రేమ చేత, నాకు నువ్వంటే విపరీతమైన ప్రేమ ఏర్పడింది. అందుకని నీకెప్పుడూ మంచి చెయ్యాలనే చూస్తుంటాను. అమ్మ! ఇంతకముందెన్నడూ నేను అబద్ధాలు చెప్పలేదు, ఇక ముందు కూడా ఎన్నడూ అబద్ధాలు చెప్పను. రామలక్ష్మణులు జీవించి ఉన్నారని నేను చెప్పినది పరమ సత్యం, నువ్వు బెంగ పెట్టుకోకు తల్లీ " అని చెప్పింది.


తరువాత ఆ పుష్పక విమానాన్ని అశోకవనానికి తీసుకెళ్ళి దింపేశారు. 

ఇంతలో రాముడు మెల్లగా తేరుకుని ఎదురుగా మూర్చపోయి పడి ఉన్న లక్ష్మణుడిని చూసి " ఒకవేళ లక్ష్మణుడి ప్రాణములు దక్కకపోతే, నేనొక్కడినే బతికితే, సీత నాకు దక్కినా ఆ బ్రతుకు నాకెందుకు. ఎ లోకంలోనైనా వెతికితే సీత లాంటి భార్య దొరకచ్చు, కాని లక్ష్మణుడి లాంటి తమ్ముడు దొరకడు. కార్తవీర్యార్జునుడు( ఈయన ఒకసారి రావణుడిని ఓడించి చెరసాలలో బంధించాడు. ఈయనకి 1000 చేతులు ఉండేవి) ఒకేసారి 500 బాణములను ప్రయోగం చేసేవాడు, అంతకన్నా ఎక్కువ బాణములను ప్రయోగం చెయ్యగలిగే శక్తి లక్ష్మణుడికి ఉంది. నాకోసమని యుద్ధానికి వచ్చి లక్ష్మణుడు ఇలా పడిపోతే నాకు ఇంక సీత ఎందుకు. నాకు ఈ జీవితం అక్కరలేదు " అని రాముడు బాధపడ్డాడు. 



అప్పుడాయన సుగ్రీవుడిని పిలిచి " సుగ్రీవ! ఇప్పటివరకూ నువ్వు నాకు చేసిన ఉపకారం చాలు, లక్ష్మణుడిని ఇలా చూస్తూ నేను బ్రతకను. నేను శరీరాన్ని వదిలేస్తాను. ఇది తెలిశాక రావణుడు నిన్ను విడిచిపెట్టడు, అందుకని నువ్వు నీ సైన్యాన్ని తీసుకొని సేతువు దాటి వెనక్కి వెళ్ళిపో. జాంబవంత, హనుమ, అంగద, మీరందరూ నాకు మహోపకారం చేశారు, మీరందరూ వెళ్ళిపొండి. నేను ఒక్క విషయానికే సిగ్గుపడుతున్నాను, విభీషణుడికి లంకా రాజ్యం ఇస్తానని ప్రతిజ్ఞ చేశాను, ఇప్పుడది అసత్య వాక్కు అయ్యింది. అసత్య వాక్యం నా నోటి నుండి దొర్లిందని నేను బాధపడుతున్నాను " అన్నాడు.

అప్పుడు సుగ్రీవుడు " విభీషణ! నువ్వు వానరాలని తీసుకొని కిష్కిందకి వెళ్ళు, నేను రావణుడిని సంహరించి సీతమ్మని తీసుకొస్తాను. సుషేణ! వీళ్ళు మూర్చపోయి ఉన్నారు, ఇంకా వీళ్ళ ప్రాణములు పోలేదు, తొందరగా వీళ్ళని కిష్కిందకి తీసుకుపో " అన్నాడు. 

అప్పుడు సుషేణుడు " పూర్వకాలంలో దేవతలకి రాక్షసులకి గొప్ప యుద్ధం జెరిగింది. ఆ యుద్ధంలో రాక్షసులు దేవతలని విశేషమైన అస్త్రాలతో బాధించారు. ఎందరో దేవతలు ప్రాణాలు విడిచిపెడుతుంటే, శరీరాలు దెబ్బతింటుంటే దేవగురువైన బృహస్పతి విశల్యకరణిసంజీవకరణిసంధానకరణి అనే ఓషధులు కలిగిన మొక్కలని రసం పిండి వాసన చూపిస్తే ఆ దేవతలందరూ మళ్ళి జీవించారు. ప్రస్తుతం అవి పాల సముద్రంలో ఉండే రెండు పర్వత శిఖరాల మీద ఉన్నాయి. మనదెగ్గర ఉన్న వానర సైన్యంలో హనుమ, సంపాతి, ఋషభుడు, నీలుడు మొదలగు వారు మాత్రమే వెళ్ళి ఆ  ఓషధులని గుర్తుపట్టగలరు. వాటిని తీసుకొచ్చి రాముడికి, లక్ష్మణుడికి వాసన చూపిస్తే వారు జీవించే అవకాసం ఉంటుంది " అన్నాడు. 



సుషేణుడు చెప్పిన ప్రకారం వెళదామని వారు అనుకుంటుండగా అక్కడ ఒక గొప్ప నాదం వినపడింది. ఎక్కడిదీ ఈ ధ్వని అని అందరూ ఆ సముద్రం వైపున చూడగా, బ్రహ్మాండమైన కాంతితో, రెక్కలు అల్లారుస్తూ ఒక మహా స్వరూపం వస్తుంది. అది వస్తున్నప్పుడు దాని కాంతి చేత, వేగం చేత సముద్రపు ఒడ్డున ఉన్న కొన్ని వేల వృక్షములు నేలన పడిపోయాయి. కాంతివంతమైన స్వరూపంతో గరుగ్మంతుడు వచ్చి అక్కడ నిలబడ్డాడు. ఆయనని చూడగానే అందరూ ఆశ్చర్యపోయి నమస్కారం చేశారు. అప్పటివరకూ రామలక్ష్మణులని గట్టిగా పట్టుకుని ఉన్న నాగములు గరుగ్మంతుడు వచ్చి అక్కడ వాలగానే వాళ్ళని విడిచిపెట్టేసి పారిపోయాయి. నాగములు విడిచిపెట్టగానే రామలక్ష్మణులు స్వస్థత పొంది పైకి లేచారు. అప్పుడు గరుగ్మంతుడు వాళ్ళిద్దరిని దెగ్గరికి తీసుకొని గట్టిగా ఆలింగనం చేసుకొని వాళ్ళిద్దరి ముఖాలని తన చేతులతో తడిమాడు. గరుగ్మంతుడు అలా కౌగాలించుకోగానే, ఇంతకముందు రాముడికి ఎంత బలం ఉండేదో, ఎటువంటి పరాక్రమము ఉండేదో, ఎటువంటి బుద్ధి ఉండేదో, ఎటువంటి తేజస్సు ఉండేదో వాటికి రెండింతలు పొందాడు. వాళ్ళ ఒంటి మీద ఉన్న గాయములన్నీ మానిపోయాయి. 

అప్పుడు గరుగ్మంతుడు " నాయనా రామ! ఇకమీద నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. కద్రువ యొక్క సంతానమైన భయంకరమైన కోరలున్న పాములని తన మాయ చేత ఇంద్రజిత్ బాణములుగా మార్చుకున్నాడు. ఈ నాగపాశం నుండి దేవేంద్రుడు కూడా విడిపించుకోలేడు. యక్ష, గంధర్వ, కిన్నెరులు అందరూ కలిసి ఇక్కడికి వచ్చినా ఈ నాగపాశములను విడదీయలేరు. ఇది కేవలం నన్ను చూసి మాత్రమే విడివడుతుంది " అన్నాడు.

అప్పుడు రాముడు " మీరు ఎవరు? " అని అడిగాడు.

గరుగ్మంతుడు అన్నాడు " నేను గరుగ్మంతుడిని, నేను ఎందుకు వచ్చాను అని ఇప్పుడు అడక్కు. నీకు నాకు ఒక గొప్ప స్నేహం ఉంది. నీకు నాకు ఉన్న అనుబంధమేమిటో యుద్ధం అయ్యాక చెబుతాను. ఇప్పుడు చెప్పడం కుదరదు, నువ్వు నన్ను అడగనూ కూడదు. కొద్దికాలంలోనే ఈ లంకలో వృద్ధులు, బాలురు తప్ప ఓపికున్న రాక్షసుడు ఎవ్వడూ ఉండకుండా నువ్వు కొట్టేసి సీతమ్మని పొందుతావు. మరి నేను బయలుదేరడానికి నాకు అనుమతిని కటాక్షించు రామ " అన్నాడు.

రాముడు " చాలా సంతోషం, మీరు వెళ్ళండి " అన్నాడు.

గరుగ్మంతుడు ఎలా వచ్చాడో అలా తన బంగారు రెక్కలను ఊపుకుంటూ సముద్రం మీద నుంచి వెళ్ళిపోయాడు. 

రెట్టింపు ఉత్స్సహంతో, బలంతో ఉన్న రామలక్ష్మణులని చూడగానే అక్కడున్న వానరులందరూ ఆనందంతో భేరీలు మ్రోగించారు, కుప్పిగంతులు వేశారు, పాటలు పాడారు, పెద్ద పెద్ద కేకలు వేశారు. లోపల సంతోషంగా కూర్చుని ఉన్న రావణుడికి ఈ కేకలు వినపడి " ఏమి జెరిగిందో చూడండి " అన్నాడు. అప్పుడు అక్కడున్న రాక్షసులు ప్రాసాదం మీదకి ఎక్కి చూసేసరికి, రెండు ఏనుగులు స్నానం చేసి వచ్చి నిలబడితే ఎలా ఉంటుందో అలా రామ లక్ష్మణులిద్దరు నిలబడి ఉన్నారు. వాళ్ళు వెంటనే చూసిన విషయాన్ని రావణుడికి చెప్పారు. ఆ మాటలు విన్న రావణుడు మొదట ఆశ్చర్యాన్ని పొంది తరువాత ఆగ్రహంతో ఊగిపోయాడు. 

అప్పుడు రావణుడు ధూమ్రాక్షుడు అనే రాక్షసుడిని పిలిచి " నువ్వు వెంటనే వెళ్ళి రాముడిని, లక్ష్మణుడిని, సుగ్రీవుడిని సంహరించి తిరిగిరా, నీకన్నా బంధువు నాకు లేడు. నువ్వు అపారమైన శౌర్యం ఉన్నవాడివి, నీకు కావలసినంత సైన్యాన్ని తీసుకుని వెళ్ళు " అన్నాడు.'

No comments:

Post a Comment