Pages

Tuesday 5 June 2012

రామాయణం @ కధ -79


పూర్వకాలంలో ఒక చెట్టు మీద రెండు పావురాలు ఉండేవి. అవి ఒక ఆడ పావురము, ఒక మగ పావురము. ఒకనాటి సాయంకాలం ఒక బోయవాడు అటుగా వెళ్ళిపోతూ ఆనందంతో రమిస్తున్న రెండు పావురములను చూశాడు. అప్పుడాయన బాణం పెట్టి ఆడ పావురాన్ని కొట్టాడు. బాణం దెబ్బకి కిందపడిన ఆడ పావురాన్ని అక్కడే కాల్చుకొని తిని వెళ్ళిపోయాడు. ఆడ పావురం చనిపోయిందని ఆ మగ పావురం చాలా బాధ పడింది. కొంతకాలానికి ఆ బోయవాడు విశేషమైన వర్షం పడుతుండగా వేటకని వచ్చి, ఏమి కనపడకపోయేసరికి ఒక చెట్టు కింద ఉండిపోయాడు. తరువాత ఆ అరణ్యంలో నడుస్తూ నీరసం చేత కళ్ళు తిరిగి, పూర్వం తాను ఏ ఆడ పావురాన్ని చంపి తిన్నాడో ఆ చెట్టు కింద పడిపోయాడు. అప్పుడా మగ పావురం ఆ బోయవాడిని చూసి గబగబా వెళ్ళి నాలుగు ఎండు పుల్లలని తీసుకొచ్చి, ఎక్కడి నుంచో అగ్నిని తీసుకువచ్చి నిప్పు పెట్టింది. అప్పుడా వేడికి ఈ బోయవాడు పైకి లేచి స్వస్తతని పొందాడు. ఆకలితో ఉన్న ఆ బోయవాడి ఆకలి తీర్చడం కోసం ఆ మగ పావురం అగ్నిలో పడిపోయి ప్రాణం వదిలేసింది. తన భార్యని చంపిన బోయవాడు తన చెట్టు దెగ్గరికి వచ్చి పడిపోతె, ఒక మగ పావురం ఆతిధ్యం ఇచ్చి, తన చెట్టు కింద పడిపోవడమే శరణాగతి అని భావించి తన ప్రాణములు ఇచ్చి ఆ బోయవాడిని రక్షించింది. నేను మనుష్యుడిలా పుట్టి, క్షత్రియ వంశ సంజాతుడనై, దశరథుడి కొడుకునై, నన్ను శరణాగతి చేసినవాడి గుణదోషములను ఎంచి, నీకు శరణాగతి ఇవ్వను అంటె నేను రాజుని అవుతాన? క్షత్రియుడని అవుతాన? ఈ భూలోకంలొ ఉన్న సమస్త భూతములలో ఏదన్నా సరె నన్ను శరణాగతి చేస్తే, వాళ్ళ యోగక్షేమాలు నేను వహిస్తాను. శరణాగతి చేసినవాడు బలహీనుడై, శరణు ఇవ్వవలసినవాడు బలవంతుడై ఉండి కూడా శరణు ఇవ్వకపోతె, వాడు చూస్తుండగా శరణాగతి చేసినవాడు మరణిస్తే, మరణించినవాడు రక్షించనివాడి యొక్క పుణ్యాన్ని అంతా తీసుకొని ఊర్ధలోకాలకి వెళ్ళిపోతాడు. రక్షించనివాడి కీర్తి ప్రతిష్టతలు నశించిపోతాయి. అందుచేత నేను విభీషణుడికి శరణు ఇస్తున్నాను, ఆయనని తీసుకురండి " అన్నాడు.



అప్పుడు సుగ్రీవుడు అన్నాడు " రామ! నీకు తప్ప ఇలా మాట్లాడడం ఎవరికి చేతనవుతుంది. నీ ప్రాజ్ఞతకి మరొక్కసారి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను " అన్నాడు.





రాముడి మాటలకు సంతోషించిన విభీషణుడు ఆయన దెగ్గరికి వచ్చాడు. ఆయన భూమి మీదకి దిగుతూనే ' ఇది రాముడు నిలబడిన భూమి ' అని, ఆ భూమికి నమస్కరించి అన్నాడు " రామచంద్ర! నేను రావణుడి తమ్ముడిని, నన్ను విభీషణుడు అంటారు. నేను లంకా పట్టణాన్ని విడిచిపెట్టి నీ దెగ్గరికి వచ్చేశాను. నా ఐశ్వర్యాన్ని, భార్యని, బిడ్డలని వదిలేసి నువ్వే నా సర్వస్వం అని నమ్మి వచ్చేశాను. నా శిరస్సుని నీ పాదాలకి తగల్చి శరణాగతి చేస్తున్నాను. నా యోగక్షేమములను నువ్వే వహించాలి " అన్నాడు.

రాముడు విభీషణుడిని తన పక్కన కూర్చోపెట్టుకొని లంకలో ఉన్న రాక్షసుల బలాబలాల గురించి అడిగాడు. అప్పుడు విభీషణుడు రావణుడి గురించి, కుంభకర్ణుడి గురించి, ఇంద్రజిత్ గురించి మరియు ఆ లంక ఎంత శత్రు దుర్భేద్యమో కూడా చెప్పాడు. అప్పుడు రాముడన్నాడు " విభీషణ బెంగపెట్టుకోకు, రావణుడిని బంధువులతో, సైన్యంతో సహా సంహరిస్తాను. నీకు లంకని దానం చేస్తాను. నిన్ను లంకకి రాజుగా పట్టాభిషేకం చేస్తాను. రావణుడు హతమయ్యేవరకు నువ్వు ఆగక్కరలేదు, ఇప్పుడే నిన్ను లంకకి రాజుగా చేసేస్తాను " అన్నాడు.

అప్పుడు విభీషణుడు " మీకు శరణాగతి చేశాను కనుక మీరు ఏమాట చెబితే ఆ మాట వింటాను. రావణుడి మీద యుద్ధం చెయ్యమంటె యుద్ధం చేస్తాను. మీకు ఎప్పుడన్నా సలహా కావలసి వచ్చి నన్ను అడిగితే నేను చెప్పగలిగిన సలహా చెబుతాను " అన్నాడు.

మళ్ళి రాముడు అన్నాడు " లక్ష్మణా! వెంటనే వెళ్ళి సముద్ర జలాలని తీసుకురా. ఈయనకి అభిషేకం చేసి లంకా రాజ్యానికి రాజుగా ప్రకటిస్తాను " అని విభీషణుడికి పట్టాభిషేకం చేశాడు. 

ఆ తరువాత రావణుడు శార్దూలుడనే గూఢచారిని రాముడి దెగ్గరికి పంపించాడు. ఆ శార్దూలుడు అక్కడ ఉన్న వానర బలాన్ని అంతటినీ చూసి రావణుడి దెగ్గరికి వెళ్ళి " అది వానర సైన్యమా? సముద్రం పక్కన నిలబడ్డ మరో సముద్రంలా ఉందయ్యా. నువ్వు ఆ వానర బలాన్ని గెలవలేవు, అక్కడున్న వీరులు సామాన్యులు కారు, నా మాట విని సీతమ్మని రాముడికి అప్పగించు " అన్నాడు.

" నేను మాత్రం సీతని ఇవ్వను " అని, సుకుడు అనేవాడిని పిలిచి " నువ్వు పక్షి రూపంలో సుగ్రీవుడి దెగ్గరికి వెళ్ళి నేను చెప్పానని ఒక మాట చెప్పు. ' నువ్వు వానరుడివి, నేను రాక్షసుడిని. నేను అపహరించింది నరకాంతని, మధ్యలో నీకు నాకు కలహం ఎందుకు? మీరు ఈ సముద్రాన్ని దాటి రాలేరు. ఒకవేళ దాటాలని ప్రయత్నించినా నా చేతిలో మీరు చనిపోతారు. ఒక మానవకాంత కోసం వానరులు ఎందుకు మరణించడం? నా మాట విని మీరు వెళ్ళిపొండి ' అని సోదరుడైన సుగ్రీవుడితో చెప్పి, నేను ఆయన కుశలమడిగానని చెప్పు " అని సుకుడిని పంపించాడు. 

ఆ సుకుడు పక్షి వేషంలో వచ్చి ఆకాశంలో నిలబడి, సుగ్రీవుడిని ఉద్దేశించి రావణుడు చెప్పిన మాటలని చెప్పాడు. ఇదంతా విన్న సుగ్రీవుడు అన్నాడు " దుర్మార్గుడు, దురాత్ముడు అయిన రావణుడు నిజంగా అంత శక్తి కలిగినవాడైతే, రామలక్ష్మణులు లేని సమయంలో సీతమ్మని ఎందుకు అపహరించాడు. రాముడి కోదండ విద్యా పాండిత్యము ముందు రావణుడు నిలబడలేడు. వాడి స్నేహము, వాడి సందేశము నాకు అక్కరలేదు " అన్నాడు. 

ఈలోగా అక్కడున్న వానరాలు గూఢచారిని విడిచిపెట్టకూడదని చెప్పి, అందరూ పైకి ఎగిరి ఆయన రెక్కలు విరిచేస్తున్నారు. అప్పుడా సుకుడు ' రామ రామ ' అని ఏడిస్తే, రాముడు వెంటనే ఆ వానరాలని శాంతింప చేసి సుకుడుని విడిపించాడు. కాని వానరములు సుకుడిని బందీగా పట్టుకుని ఉంచాయి. 

ఏమిచేస్తే ఈ సముద్రం మనకి దారి ఇస్తుంది అని విభీషణుడిని అడుగగా, ఆయన అన్నాడు " రాముడు శరణాగతి చేస్తే సముద్రం దారి ఇస్తుంది " అన్నాడు. 



చందనము మొదలైన వాటి చేత ఒకనాడు అలదబడినటువంటి బాహువు, కోట్ల గోవులని దానము చేసిన బాహువు, మణులతో కూడిన కేయూరములు మొదలైనవాటితో  అలంకరింపబడ్డ బాహువు, అనేకమంది స్త్రీలచేత స్ప్రుసింపబడ్డ బాహువు, ఒకనాడు సీతమ్మ తలగడగా వాడుకున్న బాహువుని ఈనాడు తనకి తలగడగా చేసుకొని రాముడు సముద్రానికి శరణాగతి చేసి సముద్రపు ఒడ్డున పడుకున్నాడు. మూడు రాత్రులు గడిచిపోయినప్పటికి సముద్రుడు రాకపోవడం వల్ల రాముడికి ఆగ్రహం వచ్చి లక్ష్మణుడితో అన్నాడు " పౌరుషం ఉన్నవాడు తన పౌరుషాన్ని ప్రకటించకుండా మంచితనాన్ని ప్రకటిస్తే చేతకానివాడిగా చూస్తుంది ఈ ప్రపంచం. ఈ సాగరం దారి ఇవ్వకపోతె నేను వెళ్ళలేను అనుకుంటుంది. బ్రహ్మాస్త్రం చేత ఈ సాగరాన్ని ఎండించేస్తాను. ఇందులో ఉన్న తిమింగలాలని, మొసళ్ళని, పాములని, రాక్షసులని నిగ్రహిస్తాను. ఒక్క ప్రాణి బతకకుండా చేసేస్తాను. ఈ బ్రహ్మాస్త్రం విడిచిపెట్టిన తరువాత ఇక్కడ నీరు ఉత్తర క్షణం ఆవిరయిపోయి ధూళి ఎగురుతుంది. అప్పుడు వానరులందరూ భూమి మీద నడుచుకుంటూ లంకని చేరుకుంటారు " అని చెప్పి, కోదండాన్ని తీసి బ్రహ్మాస్త్రాన్ని అనుసంధానం చేశాడు. 



అలా చేసేటప్పటికి పర్వతాలన్ని కదిలిపోయాయి, వ్యాకులంగా గాలి వీచింది, అగ్నిహోత్రపు మంటలు సూర్యుడి నుండి కిందపడ్డాయి, ప్రాణులన్నీ దీనంగా ఘోష పెట్టాయి, 2 యోజనముల దూరం సముద్రము వెనక్కి వెళ్ళిపోయింది. ఆ సమయంలో సముద్రుడు లోపలినుంచి బయటకి వచ్చాడు. 

ఆ సముద్రంలో పుట్టిన అనేకమైన బంగారములు, రత్నములతో కూడిన ఒక పెద్ద హారాన్ని సముద్రుడు వేసుకొని ఉన్నాడు. శ్రీ మహావిష్ణువు ధరించే కౌస్తుభానికి తోడపుట్టిన ఒక మణిని మెడలో వేసుకొని ఉన్నాడు. పైకి కిందకి వెళుతున్న తరంగ సద్రుస్యమైన వస్త్రాన్ని ధరించి ఉన్నాడు. గంగ, సిందు మొదలైన నదులన్నీ స్త్రీల స్వరూపాన్ని పొంది ఆయన వెనుక వస్తున్నాయి. అలా పైకి లేచిన సముద్రుడు రాముడికి నమస్కరించి " భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశములు అనే పంచ భూతములు ఉన్నాయి. వీటన్నిటికి ఒక స్వభావం ఉంటుంది, ఆ స్వభావాన్ని ఈ పంచ భూతములు అతిక్రమించలేవు. సముద్రం అంటె అగాధంగా ఉండాలి, లోతుగా ఉండాలి, అందులోకి దిగినవాడికి ఆధారం చిక్కకూడదు, సముద్రంలో ఏదన్నా పడితే మునిగిపోవాలి, వ్యాకులితమైన తరంగాలతో ఒడ్డుని కొడుతూ ఉండాలి. ఇలా ఉండకపోతే దానిని సముద్రము అనరు. అందుకని ఈ సముద్రాన్ని ఎండింప చెయ్యడం, సముద్రంలో నుంచి దారి ఇవ్వడం నాకు వీలుపడే విషయం కాదు. నువ్వు అభిమంత్రించిన బ్రహ్మాస్త్రాన్ని నా మీదకి వెయ్యకు. నీ దెగ్గర ఉన్న వానరములలో విశ్వకర్మ కుమారుడైన నలుడు ఉన్నాడు. విశ్వకర్మ గొప్ప గొప్ప కట్టడములను నిర్మిస్తూ ఉంటాడు, అటువంటివాడి తేజస్సు కనుక ఈ నలుడికి సేతువు నిర్మాణం తెలుసు. మీరు నా మీద సేతువుని నిర్మించుకోండి. అందుకని వానరులు తెచ్చి పడేసిన చెట్లు, బండలు మొదలైనవి అటూ ఇటూ చిమ్మకుండా నా తరంగముల చేత తేలేటట్టు చేస్తాను. నాలొ ఉన్న ఏ క్రూర మృగము వల్ల వారధిని దాటేటప్పుడు వానరములకి ఎటువంటి భీతి లేకుండా నేను కాపాడతాను. సేతు నిర్మాణం వెంటనే ప్రారంభించండి. ద్రుమకుల్యము అని ఉత్తర తీరంలో ఉంది. అక్కడుండే జలాలని ఆభీరులుదాస్యులు అనే వారు తాగేస్తుంటారు. సముద్రాన్ని క్షోభింప చేస్తుంటారు. అందుకని నువ్వు ఈ బ్రహ్మాస్త్రాన్ని ఇక్కడి నుంచి అక్కడికి ప్రయోగించు " అన్నాడు.

అపడు రాముడు బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించగా అది ఉత్తర దిక్కుకి వెళ్ళి ఆభీరులు, దాస్యులు మీద పడింది. ఆ దెబ్బకి అక్కడున్నవారందరూ మరణించారు. ఈ బాణం భూమిలోకి   వెళ్ళి భూమిని పెకలించగా అందులో నుంచి గంగ పుట్టింది. " అక్కడ మందాకినీ జలాలలాంటి తియ్యటి జలాలు ప్రవహిస్తాయి, అక్కడ గో సంపద పెరుగుతుంది, రోగాలు ఉండవు, మనుష్యులు ప్రశాంతంగా ఉంటారు, అక్కడ విశేషంగా తేనె, చెట్లు, పళ్ళు, పెరుగు, నెయ్యి మొదలైనవి లభిస్తాయి. ఆ ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది " అని రాముడు బ్రహ్మాస్త్రం గుచ్చుకున్న ప్రాంతానికి వరం ఇచ్చాడు. 



వెంటనే నలుడు పరిగెత్తుకొచ్చి సేతు నిర్మాణం ప్రరంభిస్తానన్నాడు. అప్పుడు అక్కడున్న వానరులందరూ సంతోషపడిపోయి పర్వతాలు, కొండలు ఎక్కి పెద్ద పెద్ద శిలలు మోసుకొచ్చి సముద్రంలో పడేస్తున్నారు. ఆ సమయంలో ఎవరినోట విన్నా ' సీతారామ ప్రభువుకి జై ' అంటూ, ఉత్సాహంగా రకరకాల చెట్లని తీసుకొచ్చి సముద్రంలో పడేశారు. మొదటి రోజున  14 యోజనముల సేతువుని నిర్మించారు,


రెండు రోజు 20 యోజనములు  ,మూడు రోజు 21 యోజనములు , నాలుగు రోజు 22 యోజనములు ,అయిదు రోజు 23 యోజనములు   సేతువుని నిర్మించేసారు. మొత్తం అయిదు రోజులలో 100 యోజనముల సేతువు నిర్మాణం అయిపోయింది.

No comments:

Post a Comment