Pages

Wednesday 13 June 2012

రామాయణం @ కధ -84


ధూమ్రాక్షుడు తన యొక్క బాణములతో వానరులని కొట్టి వాళ్ళ శరీరాలని చీల్చేస్తున్నాడు. అప్పుడు హనుమంతుడు ఒక పెద్ద శిలని పెకలించి పరుగు పరుగున వచ్చి దానిని ధూమ్రాక్షుడి మీదకి విసిరాడు. హనుమ వేసిన శిలని గమనించిన ధూమ్రాక్షుడు ఆ రథం నుంచి బయటకి దూకేశాడు. ఆ రథం తుత్తునియలు అయిపోయింది. తరువాత ఆ ధూమ్రాక్షుడు కొన్ని బాణములతో హనుమంతుడిని కొట్టాడు. వెంటనే హనుమంతుడు ఒక పర్వత శిఖరాన్ని పీకి ఆ ధూమ్రాక్షుడి మీద వేశాడు. నజ్జునజ్జయిపోయి ఆ ధూమ్రాక్షుడు మరణించాడు.



తరువాత రావణుడు వజ్రదంష్ట్రుడు అనే రాక్షసుడిని యుద్ధానికి పంపాడు. అప్పుడాయన సైన్యంతో కలిసి దక్షిణ ద్వారం గుండా బయటకి వచ్చాడు. ఆ వజ్రదంష్ట్రుడు బయటకి రాగానే అరణ్యంలో ఉన్న నక్కలు అరిచాయి, అన్ని మృగాలు ఏడిచాయి. ఆ వజ్రదంష్ట్రుడు ఒకేసారి 7-8 బాణములని ప్రయోగించేవాడు. అన్ని వైపులకి బాణములని ప్రయోగం చేసి వానరములని కొట్టాడు. ఇక వీడిని ఉపేక్షించకూడదని అంగదుడు భావించి, ఒక పెద్ద వృక్షాన్ని పట్టుకొచ్చి వజ్రదంష్ట్రుడిని కొట్టబోయాడు.కాని ఆ వృక్షాన్ని తన బాణముల చేత వజ్రదంష్ట్రుడు నరికేశాడు. తరువాత అంగదుడు ఒక పెద్ద పర్వతాన్ని పట్టుకొచ్చి దానిని విసిరేశాడు. ఆ దెబ్బకి వజ్రదంష్ట్రుడి రథం ముక్కలయిపోయింది. మళ్ళి అంగదుడు ఒక పర్వత శిఖరాన్ని పట్టుకొచ్చి విసిరేసరికి దాని కిందపడి వజ్రదంష్ట్రుడు మరణించాడు


ఈసారి రావణుడు అకంపనుడు అనే రాక్షసుడిని పంపాడు. ఆ అకంపనుడు యుద్ధానికి వస్తుండగా ఆయన ఎడమ కన్ను అదిరింది, అకారణంగా వాడి కంఠం బొంగురు పోయింది, పక్షులు, మృగాలు ఆయన చుట్టూ తిరుగుతూ దీనంగా ఏడుస్తున్నాయి, ఎత్తుపల్లాలు లేని మార్గంలో వెళుతున్న గుర్రాలు తొట్రుపడి మోకాళ్ళ మీద కిందపడి పైకి లేచాయి. ఈ అకంపనుడు కూడా పశ్చిమ ద్వారం గుండానే బయటకి వెళ్ళాడు. ఆయన కొంతసేపు భయంకరమైన యుద్ధం చేసి వానరాలని కొట్టాడు. తరువాత హనుమంతుడు ఆయన మీదకి ఒక పర్వతాన్ని విసరగా దానిని ముక్కలు చేశాడు. తరువాత హనుమంతుడు వేసిన ఒక పెద్ద చెట్టుని 14 బాణములతో కొట్టి బద్దలుచేశాడు. ఆ తరువాత హనుమంతుడు ఇంకొక పెద్ద చెట్టుని పట్టుకుని పరిగెత్తుకుంటూ వస్తూ దారిలో ఉన్న రాక్షసులని కొట్టుకుంటూ, ఏనుగుల్ని ఎడమ చేతితో విసిరేస్తూ మహా రౌద్రరూపంతో ఆ చెట్టును పట్టుకెళ్ళి అకంపనుడిని కొట్టాడు. ఆ దెబ్బకి వాడు పచ్చడై చనిపోయాడు.    

అప్పుడు రావణుడు తన సర్వసైన్యాధికారి అయిన ప్రహస్తుడిని పిలిచి " ప్రహస్త! యుద్ధం చాలా తీవ్రంగా ఉంది. ఇప్పుడు నేను వెళ్ళాలి, కుంభకర్ణుడు వెళ్ళాలి, నికుంబుడు వెళ్ళాలి లేకపోతె తత్తుల్యమైన పరాక్రమము ఉన్న నువ్వు వెళ్ళాలి. వెళ్ళిన వాడు తిరిగి రావడం లేదు, ఇప్పుడు కాని నువ్వు వెళితే యుద్ధం చేద్దాము. మనం యుద్ధం చెయ్యలేము అని నువ్వు అంటె యుద్ధం ఆపేద్దాము " అన్నాడు.

అప్పుడు ప్రహస్తుడు " మీరు ఈ మాట ఇంతకముందు ఒకసారి సభలో అడిగారు. అప్పుడు కొంతమంది' సీతమ్మని ఇచ్చెయ్యండి ' అన్నారు. మీరు అప్పుడే ఇవ్వలేదు, ఇప్పుడు యుద్ధం ఆపడమేమిటండి. యజ్ఞంలో వేసిన దర్భలా వెళ్ళి పడిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు నన్ను వెళ్ళమనా మీ ఉద్దేశం " అన్నాడు.

అప్పుడు రావణుడు " ప్రహస్త! నీ కంఠం గట్టిది, నువ్వు యుద్ధానికి వెళ్ళి గట్టిగా అరువు. వానరులకి యుద్ధం చెయ్యడం రాదు, వాళ్ళు చపలబుద్ధులు. నువ్వు గట్టిగా అరిస్తే అన్ని వానరాలు పారిపోతాయి. అప్పుడు యుద్ధ భూమిలో ఒక్క రామలక్ష్మణులు తప్ప ఎవరూ ఉండరు, అప్పుడు నువ్వు వాళ్ళని సునాయాసంగా కొట్టేయ్యచ్చు " అన్నాడు.

అప్పుడా ప్రహస్తుడు రావణుడికి ప్రదక్షిణ చేసి, రథానికి ప్రదక్షిణ చేసి కొన్ని లక్షల సైన్యంతో యుద్ధానికి వెళ్ళాడు. ఈయనకి కూడా అనేకమైన అపశకునాలు కనపడ్డాయి. ఈయన కూడా మిగతా వాళ్ళలాగానే వాటిని లెక్కచెయ్యకుండా తూర్పు ద్వారం గుండా ముందుకెళ్ళాడు.

అప్పుడు ప్రహస్తుడికి నీలుడికి యుద్ధం జెరిగింది. ప్రహస్తుడు చాలా గొప్ప యుద్ధం చేసి ఎందరో వానరాలని చంపాడు. ప్రహస్తుడు నీలుడి మీద బాణాలని ప్రయోగిస్తే, ఆబోతు మీద వర్షం పడితే అది ఎంత సంతోషంగా ఉంటుందో, నీలుడు కూడా ఆ బాణాలు పడుతుంటే అంత సంతోషంగా ఉన్నాడు. నీలుడు ఒక చెట్టుని పెకలించి ప్రహస్తుడి రథాన్ని కొట్టాడు, అప్పుడా రథం పడిపోయింది. తరువాత ఆయన ఒక పెద్ద సాల వృక్షంతొ ప్రహస్తుడి గుర్రాలని కొట్టాడు. ఆ తరువాత ఒక శిలని తీసుకొచ్చి ప్రహస్తుడి మీద పడేశాడు. దాంతో ఆ ప్రహస్తుడు కూడా మరణించాడు. 

ప్రహస్తుడు మరణించాడన్న వార్త విన్న రావణుడు ఉద్విగ్నతని పొంది, తన సైన్యం అంతటినీ పిలిచి " ఇప్పుడు నేనే యుద్ధానికి వెళుతున్నాను. నేను బయటకి వెళ్ళాక వానరాలు లోపలికి రావచ్చు, అందుకని మీరందరూ జాగ్రత్త వహించి కోట శిఖరముల మీద నిలబడండి " అని చెప్పి రథం ఎక్కి, సైన్యాన్ని తీసుకొని యుద్దానికి వెళ్ళాడు. 



రాముడంతటివాడు కూడా యుద్ధ భూమిలోకి వస్తున్న రావణుడిని చూసి ' మిట్ట మధ్యానం వేళ సూర్యుడిని చూస్తే స్పష్టంగా కనపడకుండా ఆయన తేజస్సు చేత కళ్ళు అదిరినట్టు, ఈయనని చూస్తే కూడా కళ్ళు అదురుతున్నాయి. ఎవరీ వస్తున్నవాడు ' అని ఆశ్చర్యపోయి, వస్తున్నవాడు ఎవరని విభీషణుడిని అడిగాడు. 

విభీషణుడు అన్నాడు " రామ! ఆ ఏనుగు మీద వస్తున్నవాడు అకంపనుడు( ఇందాక చనిపోయినవాడు కూడా అకంపనుడే, కాని వీడు ఇంకొక అకంపనుడు), వాడిది సామాన్యమైన యుద్ధం కాదు, వాడిని కనీసం పర్వత శిఖరాలతో కొట్టాలి, లేకపోతె వాడికి ఇష్టం ఉండదు. ఆయన పక్కన రథంలో వస్తున్నవాడు ఇంద్రజిత్. వాడి రథం యజ్ఞాగ్నిలో నుంచి బయటకి వస్తుంది, సింహములు పూన్చిన రథం మీద వస్తాడు. ఈ పక్కన, మహేంద్ర పర్వతం, వింధ్య పర్వతం ఎంత శరీరాలతో ఉంటాయో, ఎంత ధైర్యంతో ఉంటాయో, అంతటి ధైర్యము, శరీరము ఉన్న అతికాయుడు వస్తున్నాడు. పర్వత శిఖరం కదిలొస్తోందా అన్నట్టుగా ఉన్న ఆ ఏనుగు మీద వస్తున్నవాడు మహోదరుడు. అక్కడ ఒక గుర్రము ఎక్కి పాశము పట్టుకొని వస్తున్నవాడు పిశాచుడు, వాడు అరవీరభయంకరుడు. అటుపక్క వృషభం ఎక్కి చేతిలో శూలం పట్టుకొని వస్తున్నవాడు త్రిశిరస్కుడు, వాడు మహా ఘోరమైన యుద్ధం చేస్తాడు. అటుపక్క తన ధ్వజానికి సర్పాన్ని గుర్తుగా పెట్టుకొని, ధనుస్సు పట్టుకొని వస్తున్నవాడు కుంభుడు. అలాగే పర్వతాలని గులకరాళ్ళగా విసరగల బాహుపరాక్రమము కలిగినవాడు ఆ పక్కన వస్తున్నాడు, వాడి పేరు నరాంతకుడు. భోజనం చెయ్యడం అందరికీ ఎంత సంతోషమో, యుద్ధం చెయ్యడం అంత సంతోషంగా ఉండేవాడు నికుంభుడు

అదుగో అక్కడ పది తలకాయలతో, ఇరవై చేతులతో, కిరీటాలు వేసుకొని, కుండలాలు తొడుక్కొని, బ్రహ్మాండమైన పర్వతం వంటి భీమకాయం కలిగినవాడు, మహేంద్రుడు, యముడు, దేవతలు మొదలైనవారిని యుద్ధరంగంలో పరుగులు తీయించినవాడు, అందరినీ శాసించగలిగినవాడు, ఎవడి పేరు చెబితే లోకాలు ఏడుస్తాయో అటువంటి రావణుడు ఆ ఏనుగు మీద వస్తున్నాడు. 

అప్పుడు రాముడు రావణుడిని చూసి " ఏమి తేజస్సు, ఏమి కాంతి, ఏమి స్వరూపం, ఏమి పరాక్రమం, మిట్ట మధ్యానం సూర్యుడిలా ప్రకాశిస్తున్నాడు. ఇప్పటివరకూ నేను దేవతలలో కాని, యక్షులలో కాని, గంధర్వులలో కాని ఇంత తేజస్సు కలిగినవాడిని చూడలేదు. కాని ఇన్నాళ్ళకి రావణుడిని చూసే అదృష్టం కలిగింది, ఇక వీడు తిరిగి ఇంటికి వెళ్ళడు. ఎవరితో యుద్ధం చెయ్యాలని చూస్తున్నానో అటువంటివాడు ఇవ్వాళ యుద్ధ భూమిలోకి వచ్చాడు " అని సంతోషంగా ధనుస్సుని చేతితో పట్టుకొని టంకారం చేశాడు. 



రావణుడిని చూడగానే సుగ్రీవుడు ఒక పెద్ద పర్వత శిఖరాన్ని పెకలించి గబగబా వెళ్ళి రావణుడి మీద పడేశాడు. తన మీదకి వస్తున్న ఆ పర్వత శిఖరాన్ని రావణుడు అర్థచంద్రాకార బాణాలతో తుత్తునియలు చేసి, బంగారు కొనలు కలిగిన బాణాలతో సుగ్రీవుడి గుండెల్లో కొట్టాడు. ఆ దెబ్బకి భూమిలో నుంచి జలం పైకొచ్చినట్టు సుగ్రీవుడి గుండెల్లోనుంచి రక్తం పైకి వచ్చింది. అంతటి సుగ్రీవుడు కూడా గట్టిగా అరుస్తూ కిందపడి మూర్చపోయాడు. తదనంతరం గవాక్షుడు, గవయుడు, సుషేణుడు, ఋషభుడు, నలుడు మొదలైన వానర వీరులందరి మీద 46, 8, 12 బాణములను ఏకాకాలమునందు విడిచిపెట్టి వాళ్ళ మర్మస్థానముల మీద కొట్టాడు. వాళ్ళందరూ కింద పడిపోయారు. 

వానర వీరులందరినీ రావణుడు కొట్టేస్తున్నాడని హనుమంతుడు గబగబా వచ్చి రావణుడి రథం ముందు నిలబడి కుడి చెయ్యి బిగించి " రావణా! నీకు బ్రహ్మగారి వరాలు ఉన్నాయని మిడిసిపడ్డావు, సీతమ్మని అపహరించావు, నా పిడికిలి గుద్దు చేత నీలోని జీవాత్మని పైకి పంపించేస్తాను రా " అన్నాడు.

అప్పుడు రావణుడు " నువ్వంత మొనగాడివైతే అది చాలా గొప్ప విషయమే, నన్ను గుద్దు చూస్తాను " అన్నాడు.

హనుమంతుడు తన పిడికిలిని బిగించి రావణుడి శిరస్సు మీద ఒక గుద్దు గుద్దాడు. ఆ దెబ్బకి రావణుడు స్పృహ తప్పినట్టయ్యి అటు ఇటూ తూలి " ఆహా! ఏమి గుద్దు గుద్దావురా, చేస్తే నీలాంటి వాడితో యుద్ధం చెయ్యాలి " అన్నాడు.

అప్పుడు హనుమంతుడు " ఛి దురాత్ముడా, ఇన్నాళ్ళకి నా పిడికిలి పోటు మీద నాకు అసహ్యం వేసింది. దీనితో గుద్దాక నువ్వు బతికి ఉన్నావు, ఎంత ఆశ్చర్యం. నేను ఇంక నిన్ను కొట్టను, నువ్వు నా వక్షస్థలం మీద గుద్దు, నా శక్తి ఏమిటో నువ్వు చూద్దువు కాని. అప్పుడు నేను నిన్ను మళ్ళి తిరిగి గుద్దుతాను " అన్నాడు. 

అప్పుడు రావణుడు తన కుడి చేతిని బిగించి హనుమ యొక్క వక్షస్థలం మీద ఒక గుద్దు గుద్దాడు. ఆ దెబ్బకి హనుమంతుడు గిరగిరా తిరిగి నెత్తురు కక్కుతూ నేల మీద పడిపోయాడు. 

అప్పుడు సర్వసైన్యాధికారి అయిన నీలుడు చీమ అంత రూపాన్ని పొంది రావణుడిని బాగా విసిగించాడు. రావణుడి బాణాల మధ్య నుండి తప్పించుకుంటూ వెళ్ళి ఆయన కిరీటం మీదకి దూకి, అక్కడినుంచి కిందకి దూకి ఆయన చెవులు కొరికాడు, తరువాత ఆయన బుగ్గలు కొరికాడు, తరువాత ఆయన లాల్చిలో దూరాడు. అటు ఇటూ పాకుతూ నానా అల్లరి పెట్టాడు. అప్పుడు రావణుడు అగ్నేయాస్త్రాన్ని నీలుడి మీదకి అభిమంత్రించి వదిలాడు, అప్పుడా అస్త్రం మంటలు కక్కుతూ నీలుడి మీద పడిపోయింది. అదృష్టవశాత్తు నీలుడు అగ్ని యొక్క అంశకి జన్మించినవాడు కనుక ఆ మంటలని తట్టుకోగలిగాడు, కాని స్పృహ కోల్పోయి నెత్తురు కక్కుతూ నేల మీద పడిపోయాడు.     

ఇక రావణుడిని ఉపేక్షించకూడదని అనుకొని రాముడు ముందుకి వెళుతుండగా, లక్ష్మణుడు రాముడి పాదాలు పట్టుకొని " అన్నయ్య! నువ్వు వెళ్ళకూడదు. ఇటువంటి వాడితో యుద్ధం చెయ్యడానికి నువ్వు వెళితే మేమంతా ఎందుకు. నేను వెళతాను, నన్ను ఆశీర్వదించు " అన్నాడు.

అప్పుడు రాముడు " నాయనా! వచ్చినవాడు సామాన్యుడు కాదు. వాడు వేసిన బాణాలని నిగ్రహిస్తూ, నీ బాణములతో వాడి మర్మస్థానములయందు గురి చూసి కొడుతూ రావణుడిని నొప్పించు. లోపల మంత్రాలని మననం చేసుకుంటూ వెళ్ళు " అని చెప్పాడు.

" దుష్టాత్ముడవై మా వదినని అపహరించావు, ఇప్పుడు యుద్ధ భూమిలో కనపడ్డావు కనుక నువ్వు ఇక ఇంటికి వెళ్ళే సమస్య లేదు " అని చెప్పి లక్ష్మణుడు రావణుడి మీద బాణములను ప్రయోగించాడు. లక్ష్మణుడు వేసిన బాణములను రావణుడు దారిలోనే సంహారం చేసి తాను కొన్ని బాణములను ప్రయోగించాడు. రావణుడు వేసిన బాణములను లక్ష్మణుడు నిగ్రహించాడు. ఇక లక్ష్మణుడిని ఉపేక్షించకూడదని రావణుడు భావించి బ్రహ్మగారు ఇచ్చిన శక్తి(ఈ అస్తం ఎవరిమీదన్నా ప్రయోగిస్తే ఇంక వాళ్ళు మరణించవలసిందే) అనే భయంకరమైన ఆయుధాన్ని అభిమంత్రించి ఆయన మీద వేశాడు. లక్ష్మణుడు దాని మీదకి వేసిన అనేకమైన బాణములను కూడా అది నిగ్రహించుకుంటూ వచ్చి ఆయన వక్షస్థలం మీద పడింది. అప్పుడు లక్ష్మణుడు ' నేను విష్ణు అంశ ' అని స్మరించాడు. అయినా ఆ బాణము యొక్క దెబ్బకి లక్ష్మణుడు స్పృహ కోల్పోయి నేల మీద పడిపోయాడు. 

No comments:

Post a Comment