Pages

Saturday 18 August 2012

రామాయణం @ కధ -98



అప్పుడు దేవేంద్రుడు " రామ! ఒకసారి మేము వచ్చి దర్శనం ఇస్తే, ఆ దర్శనం వృధా కాకూడదు. అందుకని ఏదన్నా ఒక వరం కోరుకో " అన్నాడు.

రాముడన్నాడు " నాకోసమని తమ యొక్క కొడుకులని, భార్యలని విడిచిపెట్టి ఎన్నో కోట్ల వానరములు, భల్లూకములు, కొండముచ్చులు యుద్ధానికి వచ్చాయి. అలా వచ్చిన వాటిలో కొన్ని మిగిలాయి, మిగిలిన వాటిలో కొన్నిటికి చేతులు తెగిపోయాయి, కొన్నిటికి కాళ్ళు తెగిపోయాయి, కొన్ని ఇంకా యుద్ధభూమిలో రక్తం ఓడుతూ పడున్నాయి, కొన్ని యమ సదనమునకు వెళ్ళిపోయాయి. మీరు నిజంగా నాయందు ప్రీతి చెందినవారైతే, యమ సదనమునకు వెళ్ళిన వానరములన్నీ బతకాలి, యుద్ధభూమిలో కాళ్ళు తెగిపోయి, చేతులు తెగిపోయి పడిపోయిన కోతులు, కొండముచ్చులు, భల్లూకాలు మళ్ళి జవసత్వములతో పైకి లేవాలి. అవన్నీ యుద్ధానికి వచ్చేటప్పుడు ఎంత బలంతో ఉన్నాయో ఇప్పుడు మళ్ళి అంతే బలంతో ఉండాలి. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళినా అక్కడ చెట్లకి ఫలాలు ఫలించాలి, పువ్వులు పుయ్యాలి, అక్కడ సమృద్ధిగా తేనె ఉండాలి, వాళ్ళు తాగడానికి ఎప్పుడూ మంచి నీరు ప్రవహిస్తూ ఉండాలి " అన్నాడు.

ఇంద్రుడు " తప్పకుండా నీకు ఈ వరాన్ని కటాక్షిస్తున్నాను " అన్నాడు.

వెంటనే యుద్ధ భూమిలో పడి ఉన్నవారు లేచి వచ్చారు, యమ సదనానికి వెళ్ళినవారు తిరిగి వచ్చేశారు. వానరులందరూ పరమ సంతోషాన్ని పొందారు. 

ఆరోజు రాత్రి అక్కడ విశ్రమించారు, మరునాడు ఉదయం రాముడు విభీషణుడిని పిలిచి " నేను తొందరగా అయోధ్య చేరుకోవాలని అనుకుంటున్నాను. ఇక్కడి నుంచి కాలి నడకన వెళితే చాలా సమయం పడుతుంది కనుక తొందరగా వెళ్ళడానికి ఏదన్నా ప్రయాణ సాధనం ఏర్పాటు అవుతుందా " అన్నాడు.


విభీషణుడు " మన దెగ్గర పుష్పక విమానం ఉంది, ఉత్తర క్షణంలో మీరు అయోధ్యకి చేరిపోతారు. ఇన్ని కష్టాలు పడ్డారు కదా, సీతమ్మ లభించింది కదా, సీతమ్మ అభ్యంగన స్నానం ఆచరించి, పట్టు పుట్టం కట్టుకుని, నగలు అలంకరించుకుంది కదా, మీరు కూడా తలస్నానం చేసి, పట్టు పుట్టాలు కట్టుకుని, ఆభరణములను దాల్చి, నా దెగ్గర బహుమతులు అందుకొని మీరు బయలుదేరితే నేను ప్రీతి పొందుతాను " అన్నాడు.

అప్పుడు రాముడు " నా తమ్ముడైన భరతుడు అక్కడ జటలు పెంచుకొని, మట్టి పట్టిన వస్త్రం కట్టుకొని, నా పాదుకలని సింహాసనం మీద పెట్టి, నన్ను చూడాలని శోకిస్తు రాజ్యం చేస్తున్నాడు. ఆ భరతుడు స్నానం చెయ్యక ముందు నేను స్నానం చెయ్యనా. భరతుడు పట్టు పుట్టం కట్టుకోక ముందు నేను కట్టుకోన. భరతుడు ఆభరణాలు పెట్టుకోక ముందు నేను పెట్టుకోన. నాకు తొందరగా భరతుడిని చూడాలని ఉంది " అన్నాడు.

విభీషణుడు వెంటనే పుష్పక విమానాన్ని ఏర్పాటు చేశాడు, రాముడు ఆ విమానాన్ని అధిరోహించాక " మీరందరూ నాకోసం చాలా కష్టపడ్డారు, ఇక మీరు విశ్రాంతి తీసుకోండి. నేను బయలుదేరతాను......." అని చెబుతుండగా, అక్కడున్న వాళ్ళందరూ అన్నారు " మిమ్మల్ని విడిచిపెట్టి మేము ఉండలేము, మేము మీతో అయోధ్యకి వచ్చేస్తాము. మేము అక్కడ ఎక్కువ రోజులుండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టము, మిమ్మల్ని కన్న కౌసల్యని ఒకసారి చూడాలని ఉంది, మీరు పట్టాభిషిక్తులై సింహాసనం మీద కూర్చుంటె చూడాలని ఉంది రామ " అన్నారు.

విశాల హృదయుడైన రాముడు సరె అనేసరికి అక్కడున్న వాళ్ళందరూ ఆ పుష్పక విమానంలోకి గబగబా ఎక్కేశారు. తరువాత ఆ విమానం ఆకాశంలోకి ఎగిరిపోయింది. అప్పుడు రాముడు సీతమ్మకి ఆ పుష్పక విమానం నుండి కిందకి చూపిస్తూ " సీత చూశావ, ఇదే నేను రావణుడిని పడగొట్టిన ప్రదేశం. అదిగో అది కుంభకర్ణుడు పడిపోయిన ప్రదేశం, అది నరాంతకుడు పడిపోయిన ప్రదేశం, ఇది హనుమ విరూపాక్షుడిని పడగొట్టిన ప్రదేశం. ఆ సముద్రంలో ఉన్న సేతువుని మేము వానరములతో కలిసి నిర్మించాము. ఇక్కడే మేమందరమూ కూర్చుని ఈ సముద్రాన్ని ఎలా దాటడం అని అనుకున్నాము. ఇదే కిష్కింద, ఇక్కడి నుంచే వానరులు అన్ని దిక్కులకి నీ జాడ కనిపెట్టడానికి బయలుదేరారు " అని చెప్తుంటే సుగ్రీవుడు గబగబా వచ్చి " రామ! మనం కిష్కింద మీద నుంచే వెళుతున్నాము కదా, నా భార్యలు తార, రుమ చూస్తుంటారు, వాళ్ళని కూడా ఎక్కించుకుందాము " అన్నాడు.

అప్పుడా పుష్పకాన్ని కిందకి దింపారు. సుగ్రీవుడు వెంటనే వెళ్ళి తార, రుమ లకి విషయాన్ని చెప్పి రమ్మన్నాడు. అప్పుడు తార మిగిలిన ఆడవారి దెగ్గరికి వెళ్ళి " రండి, రండి, సుగ్రీవుడు జయాన్ని సాధించి రామ పట్టాభిషేకానికి వెళుతున్నారు. మంచి మంచి బట్టలు, ఆభరణాలు వేసుకుని అందరూ వచ్చెయ్యండి " అనింది. అప్పుడు వాళ్ళు మానవ కాంతలగా కామరూపాలని పొంది, పట్టుపుట్టాలు, ఆభరణములు వేసుకుని, పుష్పక విమానానికి ప్రదక్షిణం చేసేసి, లోపలికి ఎక్కి " సీతమ్మ ఎక్కడ? సీతమ్మ ఎక్కడ? " అని అడిగారు.   

" ఆవిడే సీతమ్మ " అని చూపిస్తే అందరూ వెళ్ళి ఆమెకి నమస్కరించారు. అప్పుడు సీతమ్మ వాళ్ళందరినీ సంతోషంగా కౌగలించుకొని, పలకరించింది. 

మళ్ళి రాముడన్నాడు " సీత! అదే ఋష్యమూక పర్వతం, అక్కడే నేను సుగ్రీవుడు కలుసుకున్నాము. అది శబరి యొక్క ఆశ్రమం. అక్కడున్న చిక్కటి వనంలోనే కబంధుడిని చంపాను. చూశావ సీత, అది మనం ఉన్న పంచవటి ఆశ్రమం, ఇక్కడే రావణుడు నిన్ను అపహరించాడు " అని రాముడు చెబుతుంటే సీతమ్మ గబుక్కున రాముడి చెయ్యి పట్టుకుంది.

కొంతముందుకి వెళ్ళాక " అదే అగస్త్య మహర్షి ఆశ్రమం, ఇక్కడే అగస్త్యడు నాకు రావణ సంహారం కోసం అస్త్రాన్ని ఇచ్చాడు. అక్కడ కనపడుతున్నది సుతీక్షణుడి ఆశ్రమం. అక్కడ కనపడుతున్నది చిత్రకూట పర్వతం, ఇక్కడే మనం తిరుగుతూ ఉండేవాళ్ళము " అన్నాడు.

అలా ఆ పుష్పకం కొంత ముందుకి వెళ్ళాక వాళ్ళకి భారద్వాజ మహర్షి యొక్క ఆశ్రమం కనపడింది. అప్పుడు ఆ పుష్పకాన్ని అక్కడ దింపి, భారద్వాజుడికి నమస్కరించారు. అప్పుడు భారద్వాజుడు " రామ! నేను నా తపఃశక్తితో అన్ని కాలములయందు నీ గురించి తెలుసుకుంటున్నాను. నువ్వు రావణ సంహారం చెయ్యడం కూడా నాకు తెలుసు. ఇవ్వాళ ఒక్క రాత్రి నా దెగ్గర ఉండి, విశ్రాంతి తీసుకొని, నా ఆతిధ్యం తీసుకొని బయలుదేరు " అన్నాడు.


అప్పుడు రాముడు హనుమంతుడిని పిలిచి " హనుమ! నువ్వు ఇక్కడినుంచి బయలుదేరి వెళ్ళి, గంగానది ఒడ్డున శృంగిభేరపురంలో గుహుడు ఉంటాడు, అతను నాకు మిక్కిలి స్నేహితుడు. ఆ గుహుడికి నా క్షేమ సమాచారం చెప్పి, పట్టాభిషేకానికి రమ్మని చెప్పు. తరువాత అక్కడి నుంచి బయలుదేరి అయోధ్యలో అందరూ కుశలంగా ఉన్నారా అని కనుక్కొని నందిగ్రామానికి వెళ్ళి, నేను తిరిగొస్తున్నాను అని భరతుడికి చెప్పి, ఆయన ముఖకవళికలు గమనించు. భరతుడి ముఖంలో ఏదన్నా కొంచెం బెంగ నీకు కనపడితే వెంటనే వెనక్కి వచ్చెయ్యి. ఇంక నేను అయోధ్యకి రాను, భరతుడు అయోధ్యని పాలిస్తాడు. ఈ విషయాన్ని నువ్వు జాగ్రత్తగ కనిపెట్టి తిరిగిరా " అన్నాడు.

వెంటనే హనుమంతుడు అక్కడినుంచి బయలుదేరి గుహుడిని కలుసుకొని, ఆయనని పలకరించి, రాముడు చెప్పిన విషయాన్ని చెప్పాడు. తరువాత అక్కడినుంచి బయలుదేరి వెళ్ళి భరతుడిని కలుసుకొని, రాముడు పడిన కష్టాలు, సీతాపహరణం, రావణ వధ మొదలైన విషయాలని వర్ణించి చెప్పాడు. హనుమంతుడి మాటలు విన్న భరతుడు చాలా సంతోషించాడు. 

No comments:

Post a Comment