Pages

Monday 13 August 2012

రామాయణం @ కధ -95



అప్పుడు రాముడు " విభీషణుడికి సింహాసనం మీద అభిషేకం జెరిగితే చూడాలని ఉంది లక్ష్మణా. సముద్రానికి వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చి విభీషణుడికి పట్టాభిషేకం చెయ్యండి " అన్నాడు. 


విభీషణుడికి అభిషేకం చేశాక రాముడు హనుమంతుడిని పిలిచి " ఇవ్వాళ విభీషణుడు అభిషేకం జెరిగి లంకకి రాజయ్యాడు కనుక ఆయన అనుమతి తీసుకొని లంకలోకి వెళ్ళి సీత దర్శనం చెయ్యి. నేను సుగ్రీవుడి సాయంతో, విభీషణుడి సాయంతో రావణుడిని సంహరించి లంకా పట్టణాన్ని స్వాధీనం చేసుకొని క్షేమంగా ఉన్నానని చెప్పు. విభీషణుడికి పట్టాభిషేకం అయిపోయిందని చెప్పు. అందుకని ఇవ్వాళ సీత నా మిత్రుడైన విభీషణుడి ఇంట్లో ఉంది కనుక బెంగపడవలసిన అవసరం లేదని చెప్పు " అన్నాడు.

హనుమంతుడు సీతమ్మ దెగ్గరికి వెళ్ళగా, సీతమ్మ హనుమంతుడిని చూసి తల తిప్పుకొని ఏదో ధ్యానం చేసుకుంటుంది. మళ్ళి ఓ సారి హనుమంతుడి వంక చూసి " హనుమ! నువ్వు కదా " అనింది.

అప్పుడు హనుమంతుడు " సీతమ్మ! రాముడు సుగ్రీవుడిని, విభీషణుడిని తన పక్కన పెట్టుకుని, వాళ్ళ యొక్క సహాయంతో రావణుడిని సంహరించి లంకని తనదిగా చేసుకున్నాడు. ఇవ్వాళ విభీషణుడిని లంకా రాజ్యానికి రాజుగా చేశారు. ఇప్పుడు నువ్వు రాముడి మిత్రుడైన విభీషణుడి ప్రమదావనంలో ఉన్నావు, అందుచేత నువ్వు బెంగపడవలసిన పరిస్థితి లేదు. నీ శోకాన్ని విడిచిపెట్టు " అన్నాడు.

అప్పుడు సీతమ్మ " ఎంత మంచి  మాట చెప్పావయ్య హనుమ " అని చెప్పి ఒక్క నిమిషం అలా ఉండిపోయింది.

అప్పుడు హనుమంతుడు " అదేమిటమ్మ ఏమి మాట్లాడావు " అన్నాడు.


సీతమ్మ " 10 నెలల నుంచి ఈ మాట ఎప్పుడు వింటాన అని తపస్సు చేశాను కదా హనుమ. నువ్వు నిజంగా వచ్చి ఈ మాట చెప్పేటప్పటికి నా నోటి వెంట మాటరాలేదు. నువ్వు చెప్పిన మాటకి నేను చాలా ఆనందాన్ని పొందాను. కాబట్టి నేను నీకు ఏదో ఒక బహుమతి ఇవ్వాలి, కాని నేను ఆలోచన చేస్తే, నేను నీకు ఏమి ఇవ్వగలను. ఎంత బంగారం ఇచ్చినా, రత్నాలు ఇచ్చినా, మూడు లోకములని ఇచ్చినా సరిపోదు. ఇవ్వాళ నీకు ఇవ్వడానికి నా దెగ్గర ఏమిలేదు హనుమ. నువ్వు మధురాతి మధురంగా మాట్లాడతావు, నీకు అష్టాంగ యోగంతొ కూడిన బుద్ధి ఉంది, వీర్యము, పరాక్రమము, తేజస్సు ఉంది. నిన్ను చూసి పొంగిపోతున్నానయ్య " అనింది.

అప్పుడు హనుమంతుడు " అమ్మ! నువ్వు నా గురించి ఇన్ని మాటలు చెప్పి, నాకు ఇవ్వడానికి నీ దెగ్గర గొప్ప వస్తువు లేదన్నావు కదా. నేనొక వరం అడుగుతాను ఇస్తావ తల్లి " అని, " ఇంతకముందు వచ్చినప్పుడు శింశుపా వృక్షం మీద కూర్చుని చూశానమ్మా, ఈ రాక్షస స్త్రీలందరూ నీ గురించి ఎన్ని మాటలు మాట్లాడారు. నువ్వు బ్రతికుండగా నిన్ను వాటాలు వేసుకున్నారు. ' నిన్ను అనుమతించాను హనుమ ' అని ఒక్కమాట అను, నేను వాళ్ళని గోళ్ళతో గిల్లేస్తాను, మోకాళ్ళతో గుద్దేస్తాను, కొంతమందికి పళ్ళు పీకేస్తాను, కొంతమంది జుట్టు పీకేస్తాను, కొంతమందిని గుద్దేస్తాను " అన్నాడు.

అప్పుడు సీతమ్మ " హనుమ! వాళ్ళు దాసీజనం, ప్రభువు ఎలా చెయ్యమంటే వాళ్ళు అలా చేస్తారు. దోషం వాళ్ళది కాదు, దోషం ప్రభువుది. ఏ దోషం వాళ్ళ యందు ఉందని వాళ్ళని చంపేస్తావు. నీ ప్రభువు చెబితే నువ్వు చేసినట్టు, వాళ్ళ ప్రభువు చెప్పినట్టు వాళ్ళు చేశారు. ప్రభుభక్తి విషయంలో నువ్వు ఎటువంటివాడివో వాళ్ళు కూడా అటువంటి వాళ్ళే. గతంలో నేను చేసిన పాపం ఏదో ఉంది, ఆ పాపానికి ఫలితంగా ఇన్ని కష్టాలు పడ్డాను. 

పూర్వకాలంలో ఒక వేటగాడు అడవిలో వెళ్ళిపోతుంటే ఒక పెద్ద పులి అతనిని తరుముకొచ్చింది. అప్పుడా వేటగాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక చెట్టు ఎక్కాడు. తీరా చెట్టు మీదకి ఎక్కి చూస్తే అక్కడ ఒక భల్లూకం పడుకొని ఉంది. ఆ వేటగాడు పైకి వెళితే భల్లూకం తినేస్తుంది, కిందకి వెళితే పులి తినేస్తుంది.   

ఈ స్థితిలో పులి భల్లూకంతో ' వాడు నరుడు, మనిద్దరమూ క్రూర జంతువులము, మనిద్దరిది ఒక జాతి, వాడిది ఒక జాతి, కనుక వాడిని కిందకి తోసేయ్యి ' అనింది.

అప్పుడా భల్లూకం ' వాడు తెలిసో తెలియకో ఆర్తితో పరుగు పరుగున నేనున్న చెట్టు ఎక్కాడు, అందుకని వాడు నన్ను శరణాగతి చేసినట్టు. వాడు నాకు అతిథి. కనుక నేను వాడిని తొయ్యను, నేను వాడికి ఆతిధ్యం ఇస్తున్నాను ' అనింది.

ఆ పెద్ద పులి అలా చెట్టు కిందనే ఉంది. కొంతసేపయ్యాక భల్లూకం వేటగాడితో ' నాకూ పెద్ద పులి చేత ప్రమాదమే. నాకు నిద్రొస్తోంది, నిద్రొస్తే జారి కింద పడిపోతాను. అందుకని నేను నీ ఒడిలో తల పెట్టుకుని పడుకుంటాను, కొంచెం పడి పోకుండా చూడు ' అనింది. అప్పుడా వేటగాడు ' తప్పకుండా పడుకో ' అన్నాడు.

ఆ భల్లూకం పడుకున్నాక పెద్ద పులి అనింది ' దానికి నిద్రలేచాక ఆకలి వేస్తుంది. అది సహజంగా క్రూర జంతువు కనుక నిన్ను చంపేసి తింటుంది. అందుకని ఇదే అదును, నువ్వు ఆ భల్లూకాన్ని కిందకి తోసేయ్యి. అప్పుడు నేను ఆ భల్లూకాన్ని తిని వెళ్ళిపోతాను, తరువాత నువ్వు కూడా వెళ్ళిపోవచ్చు ' అనింది.

ఈ మాట వినగానే ఆ వేటగాడు నిద్రపోతున్న భల్లూకాన్ని కిందకి తోసేశాడు. ఆ భల్లూకం కిందకి పడిపోతూ పడిపోతూ ఒక చెట్టుకొమ్మని పట్టుకొని పైకి ఎక్కింది. అప్పుడా పులి ' చూశావ, నిద్రపోతున్న నిన్ను వాడు కిందకి తోసేశాడు, ఎప్పటికైనా మనిషి మనిషే మనం మనమే. అందుకని వాడిని కిందకి తోసేయ్యి ' అనింది.

No comments:

Post a Comment