Pages

Sunday 12 August 2012

రామాయణం @ కధ -94


రావణుడు మరణించగానే ఆకాశంలో దేవదుందుభిలు మ్రోగాయి. వెంటనే సుగ్రీవుడు, లక్ష్మణుడు, అంగదుడు, ఋషభుడు, వేగదర్శి, నీలుడు, సుషేణుడు, గందమాధనుడు, మైందుడు, జాంబవంతుడు, కొన్ని కోట్ల వానరములు అందరూ పరమానందంతో రాముడి దెగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు. అందరూ రాముడి పాదాల మీద పడిపోయి, ఆనందంతో పూజలు చేసి, " రామ రామ " అంటూ ఆయన ఒళ్ళు ముట్టుకుని పరవశించిపోయారు. హనుమంతుడు ఆనందంతో నాట్యం చేశాడు. 


రావణుడు రథం మీద నుంచి కింద పడిపోయేసరికి అక్కడున్న రాక్షసులు పరుగులు తీశారు. వానరాలన్నీ కనపడ్డ రాక్షసుడిని వెంట తరిమి సంహరించారు. 

ఆకాశంలో దేవతలందరూ పొంగిపోయి రాముడిని పొగిడారు .
రావణుడు ఆ రణభూమిలో నిహతుడై పడిపోగానే విభీషణుడు ఏడుస్తూ ఆయన దెగ్గరికి పరిగెత్తాడు. అప్పుడాయన అన్నాడు " అన్నయ్యా! ఆనాడే నేను నీకు చెప్పాను ' యుద్ధానికి వెళ్ళవద్దు, తప్పు చేసింది నువ్వు, నీ తప్పు నువ్వు దిద్దుకో ' అన్నాను. కాని నువ్వు నా మాట వినలేదు. ఆ వినకపోవడం వల్ల ఈనాడు ఎలా పడిపోయి ఉన్నావో చూశావ. ఆ రోజున దర్పంతో ప్రహస్తుడు, ఇంద్రజిత్, కుంభకర్ణుడు, అతిరధుడు, అతికాయుడు, నరాంతకుడు నా మాట వినలేదు. మా అన్నయ్య జీవించి ఉన్నంతకాలం ఎందరికో దానాలు చేశాడు, గొప్ప అగ్నిహోత్రాలు నిర్వహించాడు, మిత్రధర్మాన్ని నెరపి స్నేహితులకి కానుకలు ఇచ్చాడు, భూరి దానాలు చేశాడు, శత్రువుల గుండెల్లో నిద్రపోయాడు. ఇన్ని చేసినవాడు ఇవ్వాళ కేవలం కిందపడిపోయి, ఎందుకూ పనికిరానివాడిగా చేతులు భూమికి ఆన్చి, నోరు తెరిచి ఉండిపోయాడు. శాంతి పొందిన అగ్నిహోత్రంలా ఉన్నావాన్నయ్య " అని ఏడిచాడు.
  
అప్పుడు రాముడు " విభీషణ! నీ కొక మాట చెబుతాను. నీ అన్నయ్య యుద్ధం చెయ్యడానికి బెంగ పెట్టుకోలేదు, భయపడలేదు, ఉత్సాహంతో యుద్ధం చేసి పడిపోయాడు. ఒక వీరుడు ఎలా పడిపోవాలని కోరుకుంటాడో మీ అన్నయ్య కూడా అలానే పడిపోయాడు " అన్నాడు.

అప్పడు అంతఃపురం నుండి కొన్ని వేల అంతఃపుర కాంతలు పరిగెత్తుకుంటూ వచ్చి " రావణ! నువ్వు వెళ్ళిపోయావు, నీతో పాటు మా అయిదోతనము వెళ్ళిపోయింది, భోగము వెళ్ళిపోయింది. ఇంత గొప్పవాడివి ఒక మనుష్యుడి చేతిలో మరణించావు " అన్నారు.

ఆ సమయంలోనే అక్కడికి మేలి ముసుగు తీసేసి పరిగెత్తుకుంటూ రావణుడి పట్టమహిషి అయిన మండోదరి వచ్చి, రావణుడిని కౌగలించుకొని " ఇవ్వాళ నేను మేలి ముసుగు లేకుండా పరిగెత్తుకొచ్చానని కోపం తెచ్చుకోకు. నువ్వు దేవతలందరినీ ఓడించావు, ఎందరినో తరిమికొట్టావు, దుర్భేద్యమైన కాంచన లంకని నిర్మించవు, 10 తలలతో 20 చేతులతో ప్రకాశించావు, గొప్ప తపస్సు చేసి చివరికి ఒక మనుష్యుడి చేతిలో మరణించావు. ఆ రోజు హనుమంతుడు ఈ సముద్రాన్ని దాటి ' నీ పది తలకాయలు ఇప్పుడే గిల్లేస్తాను, కాని రాముడు నిన్ను చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు కనుక వదిలేస్తున్నాను ' అని, లంకని కాల్చి వెళ్ళిపోయాడు. ఒక్కడే అలా వచ్చి లంకని నాశనం చేసి వెళ్ళిపోతే నీ మనస్సులో శంక కలగలేదు. నీ జీవితానికి ప్రమాదం వస్తుందని నువ్వు ఆలోచించలేదు. కోతులంటే చపల బుద్ధికి పెట్టింది పేరు, అలాంటి కొన్ని కోట్ల కోతుల్ని రాముడు వెంట పెట్టుకుని సముద్రానికి సేతువు కట్టించి దాటి వచ్చాడు, నీకు అప్పుడైనా అనుమానం రాలేదా. ఒక మనుష్యుడైన రాముడి చేతిలో చనిపోయావ " అని పక్కకి తిరిగి రాముడిని చూసింది. 

రాముడిని చూడగానే మండోదరి అనింది " ఈయన మనుష్యుడు కాదు, సనాతనమైన పరమాత్మ. నిన్ను నిగ్రహించడానికి వచ్చిన శ్రీ మహావిష్ణువు. దేవతలందరి నీ వానర రూపాలు ధరింప చేసి, వాళ్ళని వెంట బెట్టుకుని, శంఖ చక్ర గదా పద్మములను పట్టుకున్న శ్రీ మహావిష్ణువు వచ్చాడు. రాముడిని ఇన్ని సార్లు చూసినా నీకు వచ్చింది విష్ణువు అని ఎందుకు అర్ధం కాలేదు రావణా!. నువ్వు రాముడి చేత సంహరింపబడ్డావని లోకం అనుకుంటుంది, నువ్వు ఎందువల్ల చనిపోయావో నాకు తెలుసు. ఒకప్పుడు నువ్వు తపస్సు చెయ్యాలనుకొని నీ ఇంద్రియాలని బలవంతంగా తొక్కి పెట్టావు. అప్పుడు నీ ఇంద్రియాలు నీ మీద పగబట్టాయి. అందుకని నిన్ను చంపింది రాముడు కాదు, నీ ఇంద్రియాలే నిన్ను చంపాయి. 


ఒక్కసారి కామం పుట్టింది అనడానికి నీ విషయంలో ఆస్కారం లేదు. మహా సౌందర్యరాసులైన భార్యలు నీకు కొన్ని వేల మంది ఉన్నారు, వారితో నువ్వు ఎవరితో క్రీడించినా నీ కామము అదుపులో ఉంటుంది. ఎక్కడో అరణ్యంలో ఉన్న సీతమ్మ యందు కామం పుట్టి ఆవిడని నువ్వు అనుభవించడం కాదు, నువ్వు, నీ రాజ్యము, నీ వారు భ్రష్టమవ్వడం కోసం నీకు ఆ కోరిక పుట్టింది. దుర్మతి! నీకు సీతమ్మ ఎవరో అర్ధం కాలేదు, ఆవిడ రోహిణి కన్నా, అరుంధతి కన్నా గొప్పది. తన భర్తని అనుగమించి వచ్చిన ఇల్లాలిని ఒంటరిగా ఉన్నప్పుడు ఎత్తుకొచ్చావు, ఆ తల్లి తేజస్సు నిన్ను కాల్చింది. నీకు ఎన్నోసార్లు చెప్పాను, ఆ తల్లిని తేవడం వల్ల నువ్వు పొందే సుఖం ఏమి లేదు, నాశనం అయిపోతావని చెప్పాను. నువ్వు చేసుకున్న పూర్వ పుణ్యముల వల్ల కాంచన లంకని అనుభవించావు, ఎన్నో సుఖాలు పొందావు, కాని సీతమ్మని తీసుకొచ్చి ఇంట్లో పెట్టడం వల్ల ఆ పాపాన్ని అనుభవించాల్సి వచ్చి ఈనాడు పడిపోయావు. విభీషణుడు పుణ్యాలు చేశాడు, సీతమ్మ ఎవరో తెలుసుకున్నాడు, ఆ పుణ్య ఫలం ఇవ్వాళ విభీషణుడికి అనుభవంలోకి వచ్చింది, బతికిపోయాడు.

రావణా! సీత నాకన్నా గొప్ప కులంలో పుట్టిందా, నాకన్నా గొప్ప రూపవతా,  నాకన్నా గొప్ప దాక్షిణ్యం ఉన్నదా, సీత నాకన్నా ఎందులో గొప్పది? కాని నీ దురదృష్టం, నాకన్నా సీత నీకు గొప్పదిలా కనపడింది. నా తండ్రి దానవ రాజైన మయుడు, నా భర్త లోకములను గెలిచిన రావణుడు, నా కుమారుడు ఇంద్రుడిని జయించిన మేఘనాధుడు, నేనున్నది కాంచన లంకలో అని అహంకరించాను, కాని ఇది నిలబడలేదు, అబద్ధమయిపోయింది. ఇవ్వాళ నాకు కొడుకు లేడు, భర్త లేడు, రాజ్యం లేదు, బంధువులు లేరు, నీకు తలకొరివి పెట్టడానికి ఒక్క కొడుకూ లేడు. నువ్వు మహాపాతకం చెయ్యడం వల్ల 10 రోజులలో నా పరిస్తితి ఇలా అయిపోయింది. మహా పతివ్రత అయిన స్త్రీ ఏ ఇంటికన్నా వచ్చి కన్నీరు పెడితే, ఆ కన్నీరు కిందపడితే, ఆ ఇల్లు నాశనమయిపోతుంది " అని బాధపడింది. ( ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, పతివ్రత అయిన వేరొకడి భార్య నేను చేసిన పని వల్ల ఏడవడం కాదు, నా భార్య నేను చేసిన పని వల్ల ఏడిచినా, ఆ పాపం వల్ల నేను నశించిపోతాను)

అప్పుడు రాముడు " ఆవిడ చాలా శోకించింది, ఆవిడని లోపలికి తీసుకువెళ్ళండి. రావణుడి కొడుకు లందరూ చనిపోయారు కనుక, ఈ శరీరానికి చెయ్యవలసిన కార్యాన్ని విభీషణ నువ్వు చెయ్యి " అన్నాడు.


అప్పుడు విభీషణుడు " రామ! మీరు ఏమైనా చెప్పండి, వీడు బతికున్నంత కాలం వీడి జీవితంలో ధర్మం అన్న మాటే లేదు, బతికున్నంత కాలం పర స్త్రీల వెంట తిరిగాడు, ఇటువంటి వాడికి అంచేష్టి సంస్కారం ఏమిటి? ఆ శరీరాన్ని అలా వదిలేద్దాము " అన్నాడు.

అప్పుడు రాముడు " విభీషణ! అవతలివాడు ఏ శరీరంతో ఇన్ని పాపాలు చేశాడో ఆ పాపాలన్నీ ఆ శరీరంతోనె వెళ్ళిపోయాయి. అందుకని ఇంక వైరం పెట్టుకోకూడదు. ఆ శరీరానికి సంస్కారం చెయ్యకపోతే వాడు ఉత్తమ గతులకి వెళ్ళడు. ఒకవేళ నువ్వు ' చెయ్యను ' అంటె, నువ్వు నాకు స్నేహితుడివి కదా, స్నేహితుడి అన్నయ్య నాకూ అన్నయ్యే కదా, నువ్వు చెయ్యకపోతే ఆయనని అన్నగారిగా భావించి నేను సంస్కారం చేస్తాను " అన్నాడు.

అప్పుడు విభీషణుడు రావణుడికి అంచేష్టి సంస్కారం చేశాడు. ఆ తరువాత ఆకాశంలో ఉన్న దేవతలందరూ మెల్లగా ఒకరి తరువాత ఒకరు వెళ్ళిపోయారు. 

No comments:

Post a Comment