Pages

Wednesday 15 August 2012

రామాయణం @ కధ -96


అప్పుడా భల్లూకం ' అపకారం చేసినవాడే అయినా, వాడు నా ఇంటికి వచ్చాడు కాబట్టి, అపకారికి కూడా ప్రయత్నపూర్వకంగా అపకారము చెయ్యకూడదు కాబట్టి నేను ఆ వేటగాడిని తొయ్యను ' అని ఒక భల్లూకం చెప్పింది. నేను మనుష్య స్త్రీగా పుట్టి, క్షత్రియ కాంతనై, రాముడికి ఇల్లాలినై ఆ రాక్షస స్త్రీలని చంపిస్తే నేను ఉత్తమ కులాంగనను అవుతాన. చెడ్డగా ఎవడున్నాడో, ఎవడు పాడయిపోయాడో వాడి మీద దయ ఉండాలి. ఈ రాక్షస స్త్రీలు చెయ్యకూడని పనులు చేశారు, వీళ్ళ మీద కదా నేను దయతో ఉండాలి. వీళ్ళందరికి నా రక్ష " అనింది. 


" అమ్మ! ఈ మాట చెప్పడం నీకే చెల్లింది తల్లి " అని సీతమ్మతో అని, అక్కడి నుంచి బయలుదేరి రాముడి దెగ్గరికి వెళ్ళి " రామ! సీతమ్మ నీ దర్శనం చెయ్యాలని అనుకుంటోంది " అని రాముడితో చెప్పాడు.

హనుమంతుడు చెప్పిన మాట విన్న రాముడు కొంచెంసేపు ఆలోచించాడు, ఆ సమయంలో ఆయన కళ్ళల్లో నీళ్ళు నిండాయి. చాలా శోకం పొందినవాడిలా అయ్యి, ఒకసారి భుమివంక చూసి, తన పక్కన ఉన్న విభీషణుడిని పిలిచి " విభీషణ! నువ్వు లోపలికి వెళ్ళి, సీతకి నేను చెప్పానని చెప్పి తలస్నానం చేయించి, పట్టు వస్త్రం కట్టించి, అన్ని అలంకారములు చేసి నా దెగ్గరికి ప్రవేశపెట్టు " అన్నాడు.

రాముడి మాటలు విన్న విభీషణుడు ఆశ్చయపోయి సీతమ్మ దెగ్గరికి వెళ్ళి " సీతమ్మ! నువ్వు తల స్నానం చేసి, పట్టుబట్ట కట్టుకొని, ఒంటినిండా అలంకారాలు చేసుకుని వస్తే రాముడు నిన్ను చూడాలని అనుకుంటున్నాడు " అన్నాడు.

సీతమ్మ అనింది " నేను ఎలా ఉన్నానో అలానే వచ్చి రామదర్శనం చేసుకోవాలని నా మనస్సు కోరుకుంటోంది " అనింది.

విభీషణుడు అన్నాడు " అమ్మా! అది రామ ఆజ్ఞ. ప్రభువు ఎలా చెప్పాడో అలా చెయ్యడం మంచిది. అంతఃపుర కాంతలు నీకు తలస్నానం చేయిస్తారు, నువ్వు దివ్యాంగరాదములను అలదుకొని, మంచి భూషణములను వేసుకొని, రాముడికి దర్శనం ఇవ్వమ్మా " అన్నాడు.

సీతమ్మ స్నానం చేసి అలంకరించుకున్నాక పరదాలు కట్టిన ఒక పల్లకి ఎక్కించి రాముడి దెగ్గరికి తీసుకు వెళ్ళారు. అప్పుడు రాముడి ముఖంలో సంతోషం, దైన్యం, కోపం కనపడ్డాయి. 

అప్పుడు రాముడు " మీరు ఆవిడని పల్లకిలో ఎందుకు తీసుకొస్తున్నారు. దిగి నడిచి రమ్మనండి " అన్నాడు.

అలా నడిచి వస్తున్న సీతమ్మని చూడడం కోసమని అక్కడున్న వానరాలు ఒకరిని ఒకరు తోసుకుంటున్నారు (ఆ వానరాలు అప్పటిదాకా సీతమ్మని చూడలేదు). అప్పుడు సుగ్రీవుడు కొంతమందిని ఆజ్ఞాపించి ఆ వానరాలని వెనక్కి తొయ్యమన్నాడు.

రాముడన్నాడు " ఈ సీత కోసం వాళ్ళు తమ ప్రాణాలని ఫణంగా పెట్టి యుద్ధం చేశారు. ఇప్పుడావిడ నడిచొస్తుంటే వాళ్ళని కొట్టి దూరంగా తోసేస్తార. వాళ్ళందరూ సీతని చూడవలసిందే. ఎవరైనా ప్రియ బంధువులు వియోగం పొందినప్పుడు, రాజ్యంలో క్షోభం ఏర్పడినప్పుడు, యజ్ఞం జెరుగుతున్నప్పుడు, యుద్ధం జెరుగుతున్నప్పుడు అంతఃపుర కాంతలు బయటకి రావచ్చు. ఇవ్వాళ నేను యుద్ధభూమిలో ఉన్నాను, కనుక భర్త దర్శనానికి సీత అలా రావచ్చు. నా పక్కన ఉండగా సీతని చూడడంలో దోషంలేదు " అన్నాడు.  

అప్పుడు హనుమంతుడు " రామ! ఎవరి కోసం మనం ఇంత కష్టపడి యుద్ధం చేశామో, ఆ సీతమ్మ మీ దెగ్గరికి వచ్చింది " అన్నాడు.

అప్పుడు సీతమ్మ రాముడి దెగ్గరికి వచ్చి, తన భర్త తన పట్ల ఆనందంగా లేకపోవడం వల్ల ఏడుస్తూ, ఆ ముసుగులో నుంచి " ఆర్యపుత్రా " అని, అలా నిలబడిపోయింది.

అప్పుడు రాముడు " శత్రువుని జయించాను, నిన్ను పొందాను. ఏ దైవము యొక్క అనుగ్రహము లేకపోవడము చేత, ఏ దైవము యొక్క శాసనము చేత నువ్వు అపహరింపబడ్డావో దానిని పురుష ప్రయత్నం చేత దిద్దాను. రావణుడిని సంహరించి నిన్ను తెచ్చుకున్నాను. అపారమైన పౌరుషము, పరాక్రమము ఉన్నవాడికి ఏదన్నా అపవాదు వస్తే, వాడు తన ప్రయత్నంతో ఆ అపవాదుని తుడిచి పెట్టుకోకపోతే, వాడు చేత కాని వాడు అని ప్రపంచం అంటుంది. అందుకని నా ప్రయత్నంతో వచ్చిన అపవాదుని తుడిచిపెట్టడానికి, రాముడి భార్యని రావణుడు అపహరిస్తే, రావణుడిని రాముడు ఏమి చెయ్యలేదు అని అనకుండా ఉండడం కోసం రావణుడిని సంహరించాను. 100 యోజనముల సముద్రాన్ని దాటి  లంకా పట్టణాన్ని చేరి, హనుమ చేసిన ఈ లంకా భీభత్సం అంతా నేటితో సార్ధక్యాన్ని పొందింది. నేను ఇదంతా కష్టపడి చేసింది నా పేరు ప్రఖ్యాతులు నిలబెట్టుకోడానికి. ఇక్ష్వాకు వంశంలో జన్మించాను కాబట్టి, రాముడు చేతకాని వాడు అన్న అపవాదు నా మీద పడకూడదు కాబట్టి ఇదంతా చేశాను. రాముడు సీతని తిరిగి తెచ్చుకోలేకపోయాడు అన్న కళంకం మా వంశంలో ఉండిపోకూడదు, అందుకని నిన్ను గెలిచి తెచ్చుకున్నాను. 

సీత! ఇవ్వాళ నీ చారిత్రము శంకింపబడింది. నువ్వు చాలాకాలం రాక్షసుని గృహంలో ఉన్నావు. నువ్వు అలా ఉన్న కారణం చేత నిన్ను చూస్తున్నప్పుడు నాకు ఎలా ఉందో తెలుసా, కంటియందు జబ్బు ఉన్నవాడు దీపాన్ని ఎలా చూడలేడో, అలా నేను నీ వంక చూడలేకపోతున్నాను. నీకు తెలుసు నాకు తెలుసు, నువ్వు అపార సౌందర్యరాశివి, నిన్ను చూసినవాడు చపలచిత్తుడైతే వెంటనే నీ యందు మనస్సు పెట్టుకుంటాడు. పరమ చపలచిత్తుడైన రావణుడు నిన్ను చూడకూడని చూపు చూశాడు, బలవంతంగా నీ జుట్టు పట్టి ఈడ్చాడు, తన తొడ మీద కుర్చోపెట్టుకున్నాడు, గుండెల మీద వేసుకున్నాడు, అశోకవనంలో పెట్టాడు, 10 నెలలు నిన్ను చూశాడు. నువ్వూ మహా అందగత్తెవి, వయస్సులో ఉన్నదానివి. అటువంటి నువ్వు ఖచ్చితమైన నడువడితో ఉన్నావని నేను ఎలా నమ్మను. అందుకని ఇప్పుడు నీ ఇష్టం, నీకు ఎవరు నచ్చితే వాళ్ళతో వెళ్ళిపో. లక్ష్మణుడితో కాని, భరతుడితో కాని, విభీషణుడితో కాని, సుగ్రీవుడితో కాని నువ్వు వెళ్ళిపోవచ్చు, వీళ్ళు కాదు ఈ పది దిక్కులలో నీకు ఎవరు నచ్చినా వాళ్ళతో వెళ్ళిపోవచ్చు. నేను నీకు అనుమతి ఇస్తున్నాను, నువ్వు వెళ్ళిపోవచ్చు. నీతో నాకు మాత్రం ఏవిధమైన అవసరం లేదు " అన్నాడు.

No comments:

Post a Comment