Pages

Sunday 18 March 2012

రామాయణం @ కధ -15


అందరూ ఇలా సంతోషంగా ఉన్న సమయంలో, కుబ్జ(గూని) అయిన మంథర (పుట్టినప్పటినుంచి కైకేయకి దాసి ) చంద్రబింబంలా అందంగా ఉన్న రాజప్రాసాదం పైకి ఎక్కింది. ఆనందంగా ఉన్న ఆ దేశ ప్రజలని చూసిన మంథర భరించలేకపోయింది. అప్పుడే అటుగా వెళుతున్న కౌసల్య యొక్క దాసిని చూసిన మంథర ఆమెతో " ఎప్పుడూ ఒకరికి పెట్టని ఆ కౌసల్య, ఈనాడు ఇలా గొప్ప గొప్ప దానాలు చేస్తుంది ఏంటి " అని అడిగింది. అప్పుడా కౌసల్య దాసి " కౌసల్యాదేవి కుమారుడైన రాముడికి పట్టాభిషేకం జెరగబోతోంది, అందుకని కోసల దేశ ప్రజలు ఉత్సవాలు చేసుకుంటున్నారు చూశావా " అనింది. వెంటనే మంథర కైకేయి దెగ్గరకి వెళ్ళింది. 

ఒక చక్కని హంసతూలికాతల్పం మీద విశ్రాంతి తీసుకుంటున్న కైకేయితో మంథర ఇలా చెప్పడం ప్రారంభించింది.............

అక్షయ్యం సుమహద్దేవి ప్రవృత్తం ద్వద్వినాశనం |
రామం దశరథో రాజా యౌవరాజ్యే భిషేక్ష్యతి ||

" నీకు నాశనం ప్రారంభమయ్యింది కైకా, రాముడికి యువరాజ పట్టాభిషేకం జెరుగుతోంది. పిచ్చిదానా చూశావా, కొద్ది కాలంలో కౌసల్య రాజమాత అవుతుంది. నీ భర్త బహు చతురుడు, ద్రోహి. వృద్ధాప్యంలొ ఉన్నవాడు యవ్వనంలో ఉన్న నిన్ను కట్టుకుని, తనకి కావలసిన భోగాలని నీవద్ద అనుభవిస్తూ, ఏమి తెలియనివాడిలా, తేనె పూసిన కత్తిలా ప్రవర్తిస్తూ, నీకు పెద్ద మహోపకారం చెయ్యడానికి సిద్ధపడుతున్నాడు. నీ కుమారుడైన భరతుడు ఉండగా, భరతుడికి పట్టాభిషేకం చెయ్యడం మాని కౌసల్య కుమారుడైన రాముడికి పట్టాభిషేకం చెయ్యడానికి నిర్ణయించాడు. గమనించావ కైకా " అని అనింది మంథర. ఈ మాటలు విన్న కైక ఇలా అనింది......

" అయ్యో, అలా అంటావేంటి మంథర. నాకు సంబంధించినంతవరకు రాముడికి  భరతుడికి తేడా లేదు, నాకు ఇద్దరూ సమానమే. అందువల్ల నువ్వు చెప్పిన ఈ వార్త విని నేను పొంగిపోతున్నాను. రాముడు కౌసల్యని ఎలా సేవిస్తాడో, మమ్మల్ని కూడా అలానే సేవిస్తాడు. రాముడు కౌసల్యని తల్లిగా మిగిలిన వారిని పినతల్లులుగా ఎన్నడూ చూడలేదు. అటువంటి రాముడికి పట్టాభిషేకం జెరుగుతుందంటే అంతకంటే గొప్ప విషయం ఏమి ఉంటుంది, ఎంత గొప్ప శుభవార్తని తెచ్చావు నువ్వు. ఈ బహుమానం తీసుకో " అని ఒక బహుమతిని ఇచ్చింది.

కైకేయి ఇచ్చిన ఆ బహుమానాన్ని మంథర తీసుకోకుండా విసిరేసి ఇలా అనింది.........

" మూర్ఖురాలా! నేను చెప్పింది నీకు అర్ధం అవ్వడంలేదు, అందుచేత నువ్వు పాముని కౌగలించుకొని పడుకోడానికి సిద్ధపడుతున్నావు. దశరథుడు నీకు ఇష్టమైన పనులే చేస్తాడని అనుకుంటున్నావు. నీకు జెరుగుతున్న అన్యాయాన్ని నువ్వు ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు. రాముడితో పాటు పట్టాభిషేకానికి యోగ్యత ఉన్నవాడు భరతుడొక్కడే. అందుకే రాముడికి భరతుడంటే భయం. అందుకే యువరాజ పట్టాభిషేకం భరతుడు లేకుండా చూసి రాముడు చేసుకుంటున్నాడు." అనింది.

"చేసుకోని, అందులో తప్పేముంది, రాముడు పరిపాలన చేసిన తరువాత భరతుడు పరిపాలిస్తాడు " అని కైకేయ అనింది.

అప్పుడు మంథర " పిచ్చిదానా! నీకు అర్ధం కావడం లేదు, ఒకసారి రాముడికి దశరథ మహారాజు యువరాజ పట్టాభిషేకం చేశాక, ఇక జన్మలో భరతుడు రాజు కాలేడు. రాముడు కొన్ని వేల సంవత్సరాలు రాజ్యపాలన చేస్తాడు, తదనంతరం రాముడి పుత్రులు పరిపాలిస్తారు. నీ కొడుకు ఒక్కనాటికి రాజు కాలేడు. కాని ఒక మాట గుర్తుపెట్టుకో, సుమిత్రకి ఉన్న ఇద్దరు కుమారులలో ఒకడైన లక్ష్మణుడు సర్వకాలములయందు రాముడితోనే ఉంటాడు. అందుకనే రాముడు లక్ష్మణుడిని తన దెగ్గర ఉంచుకున్నాడు, కాని శత్రుఘ్నుడు భరతుడితో ఉంటాడు కనుక శత్రుఘ్నుడిని తన దెగ్గర ఉంచుకోలేదు. ఒక పెద్ద చెట్టుని నరకాలంటే, ముందు ఆ చెట్టు చుట్టూ ఉన్న పొదలని తీసేయ్యాలి, అప్పుడే ఆ చెట్టుని నరకగలము. అలాగే భరతుడిని తీసేయ్యాలంటే భరతుడితో ఉంటున్న శత్రుఘ్నుడిని కూడా తీసెయ్యాలి. అందుకని అవసరం ఉన్నా లేకున్నా శత్రుఘ్నుడిని భరతుడితో పంపించి ఇద్దరినీ లేకుండా చేశాడు రాముడు. అకస్మాత్తుగా యువరాజ పట్టాభిషేకాన్ని తన తండ్రికి చెప్పి ప్రకటించాడు. ఇలాంటి విషయాల్లో రాముడు చాలా తెలివైన వాడు. ప్రజలందరి మద్దత్తు కూడబెట్టుకున్నాడు. వాళ్ళందరితో రాముడు రాజు కావాలని ఆమోదం పొందాడు. భరతుడు ఇక్కడే ఉంటె రోజూ తన తండ్రికి సేవ చేసేవాడు, అప్పుడు దశరథుడికి భరతుడి మీద ప్రేమ పెరిగేది. అలా జెరగకుండా ఉండడానికే భరతుడిని రాజ్యం నుంచి పంపించేసాడు రాముడు. రాముడు రోజూ పితృసేవ, పితృసేవ అని దశరథుడి చుట్టూ తిరిగి పట్టాభిషేకం పొందుతున్నాడు. రాముడికి లక్ష్మణుడితో సమస్యలు ఉండవు, కావున భరతుడిని అయోధ్యకి రాకముందే మట్టుపెట్టేస్తాడు. అందుకని కైకా నా మాట విని నీ కొడుకుని అయోధ్యకి రానివ్వమాకు. అటునుంచి అటు అరణ్యాలకి పారిపొమ్మని చెప్పు. ఒకసారి రాముడికి పట్టాభిషేకం అయితే ప్రజలకి ఆయన మీద ఉన్న నమ్మకం ఇంకా పెరుగుతుంది. ఇంక రాజ్యంలో తనకి శత్రువర్గం అనేది లేకుండా చేసుకుంటాడు.

ప్రాప్తాం సుమహతీం ప్రీతిం ప్రతీతాం తాం హతద్విషం |
ఉపస్థాస్యసి కౌసల్యాం దాసీవత్త్వం కృతాఞ్జలిః ||

ఇన్నాళ్ళు అందగత్తెనన్న అహంకారంతో, భర్తని కొంగుకి ముడేసుకున్నానన్న అతిశయంతో కౌసల్యతో ప్రవర్తించావు. ఇప్పుడు కౌసల్య నీకు పాఠం చెప్పడం ప్రారంభిస్తుంది. కౌసల్య రాజమాత అవుతుంది, నువ్వేమో అడవులు పట్టి పారిపోయిన వాడికి తల్లివి. అప్పుడు నువ్వు దశరథుడికి భార్యగా కాదు కౌసల్యకి దాసిగా బతకాలి. అన్నంకోసం రోజూ కౌసల్య దెగ్గరికి వెళ్ళి వంగి దండం పెట్టాలి " అని మంథర కైకేయతో అనింది.

మంథర చెప్పిన ఈ మాటలు విన్న కైకేయ మనసులో దురాలోచన ప్రవేశించింది. ఆమె వెంటనే మంథరతో......" నేనూ నా కొడుకు ఈ ఉపద్రవం నుంచి బయటపడాలంటే ఏమి చెయ్యమంటావు " అని అడిగింది. అప్పుడు మంథర ఏమి చెప్పిందంటే..................

అద్య రామమితః క్షిప్రం వనం ప్రస్థాపయామ్యహం | యౌవరాజ్యే చ భరతం క్షిప్రమేవాభిషేచయే ||


దాశరద మహారాజు వారికీ సహాయం చేసి నందుకు కను నీకు రెండు వరాలు కోరుకో మానరు కదా నీవు అప్పుడు కోరుకోలేదు ఎప్పుడు ఆ వారలు అడుగు " ఏ రాముడు తన గుణములు చేత, పితృవాక్య పరిపాలన చేత, తండ్రిని సేవించడం చేత రాజ్యాన్ని పొందుతున్నాడో, ఆ రాముడిని పధ్నాలుగు సంవత్సరాలు జటలు కట్టుకొని, నారచీరలు కట్టుకొని దండకారణ్యానికి పంపాలి. నీ కొడుకుకి అదే ముహూర్తానికి పట్టాభిషేకం చేయించాలి. రాముడు పధ్నాలుగు సంవత్సరాలు అరణ్యాలకి వెళ్ళడం వల్ల నీ కొడుకు సింహాసనం మీద కూర్చొని ప్రజలందరిలోను మంచి మద్దత్తు సంపాదిస్తాడు. నీ కొడుకు ప్రజల గుండెల్లో బాగా పాతుకుపోతాడు. తరువాత రాముడు తిరిగొచ్చినా తనకి ఎదురుతిరగకుండా తప్పిస్తాడు. కాబట్టి రాముడిని పధ్నాలుగు సంవత్సరాలు అరణ్యాలకి పంపడం, నీ కొడుక్కి పట్టాభిషేకం చేయడం, ఈ రెండు వారాలని అడుగు " అని చెప్పింది.

ఈ మాటలు విన్న కైకేయ పరమ సంతోషంతో " ఓ మంథరా! నువ్వు గూనితో ఒంగి, తలూపుతూ మాట్లాడుతుంటే గాలికి కదులుతున్న తామర పువ్వులా ఉన్నావే. భరతుడికి పట్టాభిషేకం అవ్వగానే నీ గూనికి బంగారు తొడుగు చేస్తాను, బంగారపు బొట్టు చేయిస్తాను, రాజుల బుర్రల్లో ఎన్ని ఆలోచనలు, తంత్రాలు ఉంటాయో అవన్నీ నీ గూనిలో ఉన్నాయి " అనింది. అప్పుడా మంథర..............నాతో మాట్లాడడం కాదమ్మా, నువ్వు పెట్టుకున్న ఆభరణాలు, కట్టుకున్న పట్టుచీర అవతల పారేసి, ఒక ముతక వస్త్రం కట్టుకొని కోపగృహంలో నేల మీద పడుకో, అప్పుడు దశరథుడు వచ్చి నీకు వజ్రాలు, ముత్యాలు, రత్నాలు ఇస్తానంటాడు. ఆయన మాటలకి నువ్వు లొంగిపోకు, మంకుపట్టు పట్టి రెండు వరాలు ఇస్తావా చస్తావ అని నిలదియ్యి అని అనింది. అయితే కోపగృహం నుంచి ఆనందంతో వస్తున్న కైకేయనో, లేకపోతే నా శవాన్నో చూస్తావు నువ్వు అని ఆ కైకేయ అలంకారాలన్నీ తీసేసి లోపలికి వెళ్ళి పడుకుంది.


అటుపక్క దశరథుడు పట్టాభిషేకానికి చెయ్యవలసిన పనులని పురమాయిస్తూ తనకి అత్యంత ప్రియమైన కైకేయకి స్వయంగా తానె ఈ శుభవార్త చెప్పాలని కైకేయ మందిరానికి వచ్చాడు. ఎప్పుడూ నెమళ్ళు, హంసలు, సంగీత ధ్వనులు, పాటలు పాడేవాళ్ళు, హంసతూలికాతల్పాలు, ముత్యాలతో కట్టిన పరదాలతో రమణీయంగా ఉండే ఆ మందిరంలొ కైకేయ ఎక్కడా కనపడలేదు.  కైకేయ కనపడకపోయేసరికి అక్కడున్న దాసిని అడుగగా, కైకమ్మ ఎందుకనో  కోపగృహంలో నేలమీద పడి ఉందన్నారు ఆ దాసీలు. దశరథుడు గబగబా ఆ కోపగృహం వైపు వెళ్ళాడు. అక్కడికి వెళ్లేసరికి కైకేయ నేలమీద పడిఉండడం చూసి తట్టుకోలేకపోయాడు. అప్పుడు దశరథుడు కైకేయతో ఇలా అన్నాడు..........

"కైకేయ, నీకు ఎమన్నా వ్యాధి వచ్చిందా, అనారోగ్యంతో ఉన్నావా, మన రాజ్యంలో ఎందరో గొప్ప గొప్ప వైద్యులు ఉన్నారు, వాళ్ళందరిని పిలిపిస్తాను, నువ్వు అలా పడిఉంటె నా హృదయం చాలా తల్లడిల్లిపోతుంది, నీ మనస్సులో ఏదన్నా కోరిక ఉంటె చెప్పు, తప్పక తీరుస్తాను. 

No comments:

Post a Comment