అప్పుడు సీతమ్మ " రామ! నన్ను చిన్నతనంలో పాణిగ్రహణం చేశావే, నా చెయ్యి పట్టుకున్నావే, చాలా కాలం కలిసి దాంపత్య జీవనం చేశామే, నేను ఎటువంటిదాననో నీకు తెలియదా, నేనంత చేతకాని స్త్రీలా నీకు కనపడుతున్నాన. నేను నిజంగా అటువంటి చారిత్రము ఉన్నదానిని అని నువ్వు అనుమానించిన వాడివైతే ఆనాడు హనుమని నాకోసం ఎందుకు పంపించావు. నేను రాక్షసుల మధ్యలో ఉన్నాను అని హనుమ నీకు చెబితే, మళ్ళి హనుమతోనే నేను నీ చారిత్రమును శంకిస్తున్నాను అని కబురు చేస్తే నేను ప్రాణాలు విడిచిపెట్టేదాన్ని. అలా చెయ్యకుండా నాకోసం ఎందుకు ప్రాణ సంకటాన్ని పొందావు, ఎందుకు సముద్రానికి సేతువు కట్టి, లంకకి వచ్చి, అంత యుద్ధం చేశావు. యుద్ధంలో జయాపజయములు విధి నిర్ణీతములు, నువ్వు గెలవచ్చు రావణుడు గెలవచ్చు. నాయందు నీకు ప్రేమ ఉంది కాబట్టి అంత ప్రాణ సంకటం తెచ్చుకున్నావు. కాని ఇవ్వాళ ఎందుకింత బేలగా మాట్లాడుతున్నావు. నేను స్త్రీని కాబట్టి ఎలా అయినా మాట్లాడచ్చు అనుకుంటున్నావా. నా భక్తి, నా సౌశీల్యం, నా నడువడి అన్నిటినీ వెనక్కి తోసేశావు. నేను బతికుంటే రాముడికి ఇల్లాలిగా బతుకుతాను, చచ్చిపోయినా రాముడికి ఇల్లాలిగానే చచ్చిపోతాను. ఒకసారి అపనింద పడ్డాక నాకీ జీవితంతో సంబంధం లేదు. లక్ష్మణా! చితి పేర్చు " అనింది.
అప్పుడు లక్ష్మణుడు రాముడి వంక కనుగుడ్లు మిటకరిస్తూ కోపంగా చూశాడు. రాముడు అంత కన్నా కోపంగా, ఎర్రటి కళ్ళతో లక్ష్మణుడి వంక చూసేసరికి లక్ష్మణుడు గబగబా వెళ్ళి చితిని పేర్చాడు.
అప్పుడు సీతమ్మ " నా మనస్సు రాముడి యందే ఉన్నదైతే, సర్వ కాలముల యందు రాముడిని ధ్యానము చేసిన దాననైతే, పృధ్వీ, ఆకాశము, అష్ట దిక్పాలకులు, అంతరాత్మ, అగ్ని సాక్షిగా ఉండి, ఒక్క క్షణం కూడా నా మనస్సు రాముడిని విడిచిపెట్టనిది నిజమే అయితే ఈ అగ్నిహోత్రుడు నన్ను రక్షించుగాక " అని చెప్పి అగ్నిలో దూకింది.
అలా సీతమ్మ అగ్నిలో దూకగానే బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు, దేవతలు మొదలైనవారందరూ అక్కడికి వచ్చారు. వాళ్ళకి నమస్కారం చేస్తున్న రాముడిని చూసి వాళ్ళు అన్నారు " అదేమిటయ్యా రామ అంత పని చేశావు. నువ్వు సాక్షాత్తుగా శ్రీ మహా విష్ణువువి. నువ్వు లోకములను సృష్టించ గలిగిన వాడివి, లయం చెయ్యగలిగినవాడివి, పరబ్రహ్మానివి. సీతమ్మని అగ్నిలో ప్రవేశించమని ఎలా చెప్పగలిగావయ్య " అన్నారు.
అప్పుడు రాముడు " మీరందరూ నేను చాలా గొప్పవాడిని అని అంటున్నారు, నేను పరబ్రహ్మాన్ని అంటున్నారు, కాని నేను అలా అనుకోవడం లేదు. నేను దశరథ మహారాజు యొక్క కుమారుడిని, రాముడిని, నరుడిని అని అనుకుంటున్నాను. నేను యదార్ధముగా ఎవరినో మీరు చెప్పండి " అన్నాడు.
అప్పుడు బ్రహ్మ " సృష్టికి ముందు ఉన్నవాడివి నువ్వు, స్థితికారుడివి నువ్వు, లయకారుడివి నువ్వు, వరాహమూర్తివి నువ్వు, భూమిని ఉద్ధరించినవాడివి నువ్వు, ఆరోగ్యం నువ్వు, కోపం నువ్వు, రాత్రి నువ్వు, నీ రోమకూపాల్లో దేవతలు ఉంటారు, సమస్తము నీయందే ఉంది, అంత్యము నందు ఉండిపోయేవాడివి నువ్వు, నువ్వు కన్ను ముస్తే రాత్రి, కన్ను తెరిస్తే పగలు " అని రాముడిని స్తోత్రం చేశారు.
తరువాత అగ్నిహోత్రంలో నుంచి అగ్నిదేవుడు తన తొడ మీద సీతమ్మని కూర్చోపెట్టుకుని బంగారు సింహాసనం మీద పైకి వచ్చాడు. అప్పుడాయన " రామ! ఈవిడ మహాపునీత. గొప్ప పుణ్యచారిత్రము ఉన్నది, ఈ తల్లి కంటితో కూడా దోషం చెయ్యలేదు. ఈవిడ పాతివ్రత్యం వల్లే రాక్షస సంహారం జెరిగింది. ఈ తల్లి మనస్సుతో కాని, వాక్కుతో కాని పాపం చెయ్యలేదు. నేను సమస్త జీవుల యొక్క కర్మలని చూస్తుంటాను, ఈ తల్లియందు కించిత్ దోషం లేదు. రామ! సర్వకాల సర్వావస్తల యందు నీ నామం చెప్పుకుని, నీ పాదముల యందు మనస్సు పెట్టుకున్న తల్లి ఈ సీతమ్మ. నువ్వు ఇంకొక మాట చెబితే నేను అంగీకరించను. ఈమెని నువ్వు స్వీకరించు " అన్నాడు.
అప్పుడు రాముడు " మీరందరూ చెప్పవలసిన అవసరం లేదు, సర్వకాలముల యందు ఈమె మనస్సు నా దెగ్గెర ఉందని నాకు తెలుసు. సముద్రం చెలియలి కట్టని దాటనట్టు, అగ్నిని చేత పట్ట లేనట్టు, సీతని రావణుడు తాకలేడన్న విషయం నాకు తెలుసు. కాని ఈ విషయం రేపు లోకమంతటికి తెలియాలి. చేత కానివాడు రాముడని లోకం అనకూడదు. సీత చారిత్రము ఏమిటో లోకానికి చెప్పాలని భర్తగా నేను అనుకున్నాను " అన్నాడు.
అప్పుడు రాముడు సీతమ్మ భుజం మీద చెయ్యివేసి ఆమెని దెగ్గరికి తీసుకున్నాడు. ఈ దృశ్యాన్ని చూసిన వానరులందరూ ఆనందంతో పొంగిపోయారు.
తండ్రిని చూడగానే లక్ష్మణుడితో కలిసి రాముడు నమస్కారం చేశాడు. అప్పుడు దశరథుడు రాముడిని ఒకసారి ఆనందంతో గట్టిగా కౌగలించుకొని తన తొడ మీద కూర్చోబెట్టుకుని " రామ! నేను స్వర్గలోకంలో విహరించానురా, ఇంద్ర లోకంలో తిరిగానురా, కాని నువ్వు లేకపోతె అది కూడా నాకు పెద్ద సుఖంగా అనిపించలేదురా. ఆనాడు నీకు పట్టాభిషేకాన్ని చేద్దాము అనుకోవడం, నేను ఎంతో ఆనందాన్ని పొందడం, రాత్రి కైక దెగ్గరికి వెళ్ళడం, కైక వరాలు కోరడం, నీ పట్టాభిషేకం భగ్నం అవ్వడం, ఆనాడు నేను ఏడ్చి ఏడ్చి నా శరీరాన్ని వదిలిపెట్టడం నాకు ఇంకా జ్ఞాపకం ఉన్నాయి. నేను ఇప్పుడు తెలుసుకున్నదేంటంటే, ఆ పట్టాభిషేకం భగ్నం అవ్వడానికి కారణం దేవతలు. రావణ సంహారం జెరగాలి కనుక దేవతలు ఆనాడు నీ పట్టాభిషేకాన్ని భగ్నం చేశారు " అన్నాడు.
అప్పుడు రాముడు " ఆనాడు మీరు భావనా వ్యగ్రతని పొంది, నా పట్టాభిషేకం భగ్నం అవ్వడానికి కైకమ్మ కారణం అనుకొని ' ఇప్పుడే నేను నిన్ను విడిచి పెట్టేస్తున్నాను, నువ్వు నా భార్యవి కావు, నీ కుమారుడు భరతుడు నాకు కొడుకు కాదు ' అన్నారు. ఆ మాటని మీరు ఉపసంహారం చెయ్యండి, నేను సంతోషిస్తాను " అన్నాడు.
అప్పుడు దశరథుడు " నువ్వు కోరుకున్నటు తప్పకుండా జెరుగుతుంది " అన్నాడు. తరువాత ఆయన లక్ష్మణుడితో " నాయన లక్ష్మణా! నువ్వురా ప్రాజ్ఞుడవి అంటె. చక్కగా అన్నయ్య సేవ చేశావు, ఇలాగె సర్వకాలముల యందు అన్నయ్యని, వదినని సేవిస్తూ నీ జన్మ చరితార్ధం చేసుకో " అన్నాడు.
అప్పుడు దశరథుడు రామలక్ష్మణుల వెనకాల తనకి నమస్కారం చేస్తూ నిలబడ్డ సీతమ్మని దెగ్గరికి పిలిచి " అమ్మా సీతమ్మ! నీ మనస్సుకి కష్టం కలిగిందా. ' సీత! నీతో నాకు ప్రయోజనం లేదు, నిన్ను విడిచిపెట్టేస్తున్నాను, నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళు ' అని మావాడు అన్నాడు కదా, అలా అన్నాడని నువ్వు బాధపడ్డావ. ఇవ్వాళ నేను ఊర్ధలోకవాసినమ్మా, తప్పు మాట చెబితే కిందకి పడిపోతాను, నీకొక నిజం చెప్పనా, రాముడికి నీమీద ఎప్పుడూ అటువంటి అభిప్రాయం లేదు. ఆ మాట ఎందుకన్నాడో తెలుసా, నిన్ను వేరొకరు ఎప్పుడూ వేలెత్తి చూపించకూడదని మావాడి తాపత్రయం.
కూతురా! నువ్వు ఇవ్వాళ చేసిన పతి సేవ వల్ల జెరిగిన గొప్పతనం ఏమిటో తెలుసా, ఇతఃపూర్వం పతివ్రతలై భర్తని సేవించిన వాళ్ళందరి చరిత్రలను పక్కన పెట్టి, పతివ్రత అంటె సీతమ్మ అని నిన్ను చూపిస్తున్నారు. నీలాంటి కోడలు నా వంశానికి రావడం నా అదృష్టం. నీకు నేను ఇంక చెప్పడానికి ఏమిలేదమ్మ, నీకు అన్నీ తెలుసు, కాని మామగారిగా ఒక్క మాట చెబుతాను. అమ్మా! భర్త మాత్రమే దైవము అని తెలుసుకో " అన్నాడు.
తరువాత దశరథుడు విమానంలో ఊర్ధలోకాలకి వెళ్ళిపోయాడు.
No comments:
Post a Comment