Pages

Thursday, 9 August 2012

రామాయణం @ కధ -93


అగస్త్యుడు అన్నాడు " ఈ ఆదిత్య హృదయాన్ని చదువు, నువ్వు నీ సర్వ శత్రువులని జయిస్తావు, నీ శత్రువులని దునుమాడేస్తావు, నీ కోరికలన్నీ సిద్ధిస్తాయి. రావణుడు నీ చేతిలో నిహతుడు  అవుతాడు " అన్నాడు. 


రాముడు ఆ ఆదిత్య హృదయాన్ని మూడు సార్లు చదివాక అగస్త్యుడు వెళ్ళిపోయాడు. 



ఆ తరువాత రావణుడు నల్లటి గుర్రాలు కట్టి ఉన్న తన రథం మీద యుద్ద భూమికి తీవ్రమైన వేగంతో వచ్చాడు. 

అప్పుడు రాముడు " మాతలి! ప్రతిద్వంది వస్తున్నాడు. చాలా జాగ్రత్తగా ఉండు, ఎంత మాత్రం పొరబడకు. రథాన్ని కుడి చేతి వైపుకి తీసుకువెళ్ళు. నేను నీకు చెప్పాను అని మరోలా అనుకోకు, నువ్వు ఇంద్రుడికి సారధ్యం చేస్తున్నవాడివి, నీకు అన్నీ తెలుసు. కాని నీ మనస్సునందు ధైర్యం ఉండడం కోసమని ఈ మాట చెప్పాను. వేరొకలా భావించకు " అన్నాడు.

ఆ యుద్ధ భూమిలో ఒకరికి ఎదురుగా ఒకరి రథాలని నిలబెట్టారు. ఆకాశంలో దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, ఋషులు, మహర్షులు, బ్రహ్మర్షులు అందరూ నిలబడి " రాముడు ఈ యుద్ధంలో గెలవాలి, రావణ సంహారం చెయ్యాలి " అని స్వస్తి వాచకం చేస్తున్నారు. 


రావణుడు యుద్ధ భూమిలోకి వచ్చి నిలబడుతున్న సమయంలో ఆకాశం నుండి రక్త వర్షం కురిసింది, అదే సమయంలో మండలాకారంలో గాలులు తిరిగాయి, ఆకాశంలో గ్రద్దలు తిరుగుతూ వచ్చి ఆయన ధ్వజం మీద వాలాయి, నిష్కారణంగా అక్కడున్న భూమి కదిలింది, ఆకాశంలో మేఘాలు లేకుండానే రాక్షస సైన్యం వైపు పిడుగులు పడ్డాయి, ఆకాశం నుండి ఒక తోకచుక్క రావణుడి రథం మీద పడింది, రాక్షసులు తమ ఆయుధములను ప్రయోగిద్దామని చేతులు పైకి ఎత్తుతుంటే ఎవరో వచ్చి పట్టుకున్నట్టు చేతులు ఆగిపోయాయి, లంకా పట్టణం అంతా కాలిపోతున్నట్టు ఎర్రటి కాంతిని పొందింది, ఇళ్ళల్లో ఉన్న గోరువంకల మీద రాబందులు వచ్చి దాడి చేశాయి, సూర్యమండలం నుంచి ఎర్రటి, తెల్లటి, పసుపు, ఆకుపచ్చ రంగులతో కూడిన కిరణాలు రావణుడి మీద పడ్డాయి, నిష్కారణంగా గుర్రాలు ఏడిచాయి, నక్కలు పెద్ద పెద్ద కూతలు కూశాయి, క్రూరమైన మృగాలు రావణుడి ముఖాన్ని చూస్తూ పెద్దగా అరిచాయి.


రామ-రావణ యుద్ధం ప్రారంభం అవ్వగానే అప్పటిదాకా కొట్టుకున్న వానరులు, రాక్షసులు ఒకరి పక్కన ఒకరు నిలబడి అలా చూస్తుండిపోయారు. రాముడు, రావణుడు ప్రయోగించిన బాణాలకి ఆకాశం అంతా చీకటి అయిపోయి, ఆకాశంలో గుద్దుకుంటున్న బాణముల మెరుపులే కనపడుతున్నాయి. అప్పుడు రావణుడు కొన్ని బాణములని రాముడి రథం యొక్క ధ్వజం మీదకి ప్రయోగించాడు. ఆ రథం యొక్క శక్తి చేత రావణుడు వేసిన బాణములు నిర్వీర్యం అయిపోయాయి. తరువాత రాముడు వేసిన బాణములకి రావణుడి ధ్వజం విరిగిపోయి నేలమీద పడిపోయింది. ఆ తరువాత రావణుడు బాణములతో రాముడి రథాన్ని లాగుతున్న గుర్రాలని కొట్టాడు. కాని ఆ గుర్రాలు రావణుడి బాణాలు తగిలినా కనీసం కదలను కూడా కదలలేదు. రావణుడు వేస్తున్న మాయతో కూడిన బాణముల నుంచి కొన్ని వేల రోకళ్ళు, పర్వతములు, వృక్షాలు, రోళ్ళు, చిత్ర విచిత్రమైనవన్నీ పుట్టి రాముడి రథం మీద పడిపోతున్నాయి. రావణుడి అన్ని బాణములకు సమాధానంగా రాముడు బాణ ప్రయోగం చేసి రావణుడి సారధిని, గుర్రాలని, ధ్వజాన్ని కొట్టాడు. 


వాళ్ళిద్దరూ చేస్తున్న యుద్ధానికి సముద్రాలన్నీ క్షోభించాయి, నదులు గట్లు దాటి ప్రవహించాయి, భూమి అంతా కదిలిపోయింది, సూర్యమండలం అంతా ధూమముతో ఆవహించబడి ఉంది, బ్రహ్మాండములో ఉన్న సర్వ భూతములు కలత చెందాయి.

గగనం గగనాకారం సాగరం సాగరోపమం
రామ రావణయోర్యుద్ధం రామరావణయోరివ


ఆ భయంకరమైన యుద్ధాన్ని వర్ణిస్తూ వాల్మీకి మహర్షి " ఆకాశానికి ఆకాశమే పోలిక, సముద్రానికి సముద్రమే పోలిక, రామ-రావణ యుద్ధానికి రామ-రావణ యుద్ధమే పోలిక " అన్నారు.  



అప్పుడు రాముడు విషంతో కూడిన సర్పం వంటి బాణమును తీసి, వింటినారికి సధించి, రావణుడి కంఠానికి గురిచూసి విడిచిపెట్టాడు. ఆ బాణం తగలగానే రావణుడి ఒక శిరస్సు తెగిపోయి భూమి మీద పడిపోయింది. ఆ శిరస్సు అలా పడిపోగానే మళ్ళి ఒక కొత్త శిరస్సు మొలకెత్తింది. మళ్ళి బాణం పెట్టి ఇంకొక శిరస్సుని రాముడు కొట్టాడు, అది కూడా మొదటి దానిలాగానే కిందపడిపోయింది, కాని మళ్ళి కొత్త శిరస్సు పుట్టింది. అలా రాముడు మొత్తం 100 సార్లు రావణుడి సిరస్సులని కొట్టాడు.    



అప్పుడు రాముడు అనుకున్నాడు ' ఈ బాణంతో మారీచుడిని, ఖరుడిని, దూషణుడిని, వాలిని సంహరించాను. ఈ బాణానికి ఎదురులేదు, ఈ బాణంతో ఇప్పటికి నూరు తలకాయలు భూమి మీద పడేశాను. కాని ఈ బాణం రావణుడి చంపలేక పోతుంది ' అని అనుకున్నాడు.

వాళ్ళిద్దరి మధ్య ఆ యుద్ధం 7 రాత్రులు7 పగళ్ళు, ఒక్క క్షణం కూడా విరామం లేకుండా జెరిగింది. ఆకాశం అంతా దేవతలు, ఋషులు మొదలైన వాళ్ళతో నిండిపోయింది. 

అప్పుడు మాతలి " రామ! 7 రాత్రులు 7 పగళ్ళ నుంచి యుద్ధం చేస్తున్నావు. దేవతలందరూ రావణుడి శిరస్సు పడిపోయే ముహూర్తాన్ని నిర్ణయించిన సమయం ఆసన్నమయిపోయింది. అగస్త్యడు ఇచ్చిన దివ్యమైన అస్త్రం నీ యొక్క బాణతుణీరంలో ఉంది, దానిని బయటకి తీసి అభిమంత్రించి విడిచిపెట్టు " అన్నాడు.

అప్పుడు రాముడు ఆ అస్త్రాన్ని బయటకి తీస్తుంటే, అది పుట్టలోనుంచి బయటకి వస్తున్న బ్రహ్మాండమైన సర్పంలా ఉంది. లోకాలని రక్షించమని ఆ అస్త్రాన్ని బ్రహ్మగారు దేవేంద్రుడికి ఇచ్చారు. ఆ అస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెట్టగానే అది వాయు వేగంతో వెళ్ళిపోతుంది, దానికున్న బంగారు ములుకులో అగ్ని, సూర్యుడు ఉంటారు, దాని శరీరం బ్రహ్మమయం అయ్యి ఉంటుంది, సుర్యుడి వంటి తేజస్సుతో ఉంటుంది, ధూమంతో నిండిపోయిన కాలాగ్నిలా ఉంటుంది. ఆ బాణం ఇంతక ముందు ఎన్నో పర్వతాలని చీల్చుకుంటూ, ద్వారాలని బద్దలుకొడుతూ, పరిఘలని విరుచుకుంటూ, ఎందరో రాక్షసుల గుండెల్ని బేధించుకుంటూ వెళ్ళింది. దాని ఒంటి మీద కొంచెం రక్తం, కొవ్వు ఉంటాయి. ఆ బాణం ఇంతక ముందు ఎక్కడెక్కడ ప్రయోగింపబడిందో అక్కడ వెంటనే డేగలు, గ్రద్దలు, రాబందులు, నక్కలు, క్రూరమృగాల గుంపులుగా వచ్చి చనిపోయిన శత్రువుల మాంసాన్ని తినేవి. 


రాముడు ఆ బాణాన్ని చేతితో పట్టుకుని దానిమీద వేదప్రోక్తంగా బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించాడు. ఆయనలా బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించేసరికి భూమి అంతా కంపించింది. అప్పుడాయన ఆ బాణాన్ని వింటినారికి తగిలించి, చెవి వరకూ లాగి, పరమాత్మని స్తోత్రం చేస్తూ, శత్రువు నిగ్రహింపబడాలని కోరుకుంటూ విడిచిపెట్టాడు. ఆ బాణం ఒక్క క్షణంలో భయంకరమైన ధ్వనిని చేస్తూ, లోకాలన్నిటినీ క్షోభింప చేస్తూ, ఇంతకాలం ఏ రావణుడు లోకములన్నిటినీ పీడించాడొ, ఆ రావణుడి గుండెల్ని బద్దలు చేస్తూ ఆయన వక్షస్థలం నుండి దూసుకు వెళ్ళింది. 

రావణుడి చేతిలో ఉన్న ధనుస్సు, ఆయుధములు కింద పడిపోయాయి, ప్రాణాలు విడిచిపెట్టేసి ఆ శరీరంతో కింద పడిపోయాడు. 

రావణాసురుడు మరణించాడు

No comments:

Post a Comment