Pages

Wednesday, 22 August 2012

రామాయణం @ కధ -99


మరునాడు ఉదయం రాముడు బయలుదేరబోయే ముందు భారద్వాజుడు అన్నాడు " నీ ధర్మానుష్టానికి నాకు ప్రీతి కలిగింది రామ. నీ కొక వరం ఇస్తాను, ఏదన్నా కోరుకో " అన్నాడు.



అప్పుడు రాముడు " వానరములు ఎక్కడ ఉంటాయో అక్కడ ఫల సంవృద్ధి ఉండాలని నేను కోరాను. ఇప్పుడు ఇక్కడి నుంచి 3 యోజనముల దూరం వరకూ అయోధ్యకి ప్రయాణిస్తాము. ఆ మార్గంలో కూడా చెట్లన్నీ ఫల పుష్పభరితములై, తేనెపట్లతో తేనెలు కారుతూ ఉండాలి " అని అడిగాడు. 



తరువాత భారద్వాజుడి దెగ్గర సెలవు తీసుకొని పెద్ద కోలాహలంతో నందిగ్రామానికి రాముడు చేరుకున్నాడు. 



అప్పుడు భరతుడు తన సైనికులతో " రాముడు వచ్చేస్తున్నాడు, అయోధ్యలో ఉన్న తల్లులని తీసుకురండి, రథాలని తీసుకురండి, పెద్దవాళ్ళని తీసుకురండి, అందరినీ అయోధ్యకి రమ్మనండి. అంతటా పసుపు నీరు, గంధపు నీరు జల్లించండి. దివ్యమైన ధూపములు వెయ్యండి. అందరమూ కలిసి రాముడిని నందిగ్రామం నుంచి అయోధ్యకి పట్టాభిషేకానికి తీసుకువెళదాము " అని భరతుడు ఆజ్ఞాపించాడు.



రాముడు వచ్చేస్తున్నాడన్న విషయం తెలుసుకున్న అయోధ్య వాసులు పరుగు పరుగున నందిగ్రామానికి వచ్చారు. 



రాముడు పుష్పక విమానం నుంచి కిందకి దిగగానే భరతుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి అన్నగారి పాదాలకి పాదుకలు తొడిగాడు. ఇది చూసి సుగ్రీవ విభీషణులు కన్నుల నీళ్ళు కారాయి. వెంటనే భరతుడు సుగ్రీవుడిని కౌగలించుకొని " ఇంతకముందు మేము నలుగురము, ఇవ్వాల్టి నుంచి మనం అయిదుగురము అన్నదమ్ములము సుగ్రీవ " అన్నాడు. తరువాత అక్కడున్న గంధమాదుడిని, మైందుడిని మొదలైనవారిని భరతుడికి పరిచయం చేశారు. అప్పుడు భరతుడు ఆ వానరాలని ' మీరు మా అన్నయ్యకి సహాయం చేశారు, మీరు ఎంత మంచివారు ' అని అందరినీ కౌగలించుకున్నాడు. 



పుష్పకం నుంచి కిందకి దిగిన వానరకాంతలు వాళ్ళ ప్రేమలని, వాళ్ళ అలంకారాలని చూసి ఆశ్చర్యపోయారు. అప్పుడు అక్కడికి వచ్చిన కౌసల్య, కైకేయ, సుమిత్రలు అన్నారు " ఈ వానర కాంతలందరికి మేమే తలస్నానాలు చేయిస్తాము " అని, వాళ్ళందరికీ తలస్నానం చేయించారు. 



తరువాత రాముడు ఆ పుష్పక విమానాన్ని " కుబేరుడి దెగ్గరికి వెళ్ళిపో " అని ఆజ్ఞాపించాడు. అప్పుడా ఆ పుష్పకం కుబేరుడి దెగ్గరికి వెళ్ళిపోయింది.



అప్పుడు భరతుడు శిరస్సున అంజలి ఘటించి రాముడితో " మా అమ్మ అయిన కైకేయి ఆనాడు రెండు వరాలు అడిగింది. ఇక్ష్వాకు వంశంలో పెద్దవాడిగా పుట్టి, రాజ్యం పొందడానికి సమస్త అర్హతలు కలిగి ఉన్న నువ్వు, తండ్రిని సత్యము నందు నిలబెట్టడం కోసం రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయావు. నీ పాదుకలని న్యాసంగా ఇచ్చి నన్ను రాజ్యం చెయ్యమన్నావు. నువ్వు నాకు రాజ్యాన్ని ఎలా ఇచ్చావో, అలా ఆ రాజ్యాన్ని తీసుకొచ్చి నీ పాదాల దెగ్గర పెట్టేస్తున్నాను. నీకు ఉన్నదానిని నాకు ఇచ్చి, నేను దానిని అనుభవిస్తుంటే చూసి నువ్వు మురిసిపోయావు, అందుకని ఇవ్వాళ నేను దానిని నీకు ఇచ్చేస్తున్నాను " అన్నాడు.



భరతుడి మాటలకి సంతోషించిన రాముడు తిరిగి రాజ్యాన్ని స్వీకరించడానికి అంగీకరించాడు. 



శత్రుఘ్నుడు అక్కడికి వచ్చి " అన్నయ్య! క్షుర కర్మ చేసేవారిని తీసుకొచ్చాను, నీ జుట్టు జటలు పట్టేసింది కదా అందుకని క్షుర కర్మ చేయించుకో " అన్నాడు. 



అప్పుడు రాముడు " నేను తండ్రి మాట నిలబెట్టడం కోసమని నా అంత నేనుగా అరణ్యవాసానికి వెళ్ళాను. కాని, తండ్రి ఆజ్ఞాపించక పోయినా, నాయందున్న ప్రేమ చేత స్వచ్ఛందంగా తనంత తాను దీక్ష స్వీకరించి, నా పాదుకలని తీసుకెళ్ళి సింహాసనంలో పెట్టి ,14 సంవత్సరములు రాజ్యమునందు మమకారము లేకుండా పరిపాలించిన భరతుడు ముందు దీక్ష విరమించి స్నానం చేస్తే తప్ప నేను దీక్షని విరమించను " అన్నాడు.



భరతుడు, శత్రుఘ్నుడు, సుగ్రీవుడు, విభీషణుడు క్షుర కర్మ చేయించుకుని మంగళస్నానం చేశాక రాముడు క్షుర కర్మ చేయించుకుని మంగళ స్నానం చేశాడు. తరువాత రాముడు అందమైన పట్టుపుట్టములను ధరించి, మంచి అంగరాగములను పూసుకొని, దివ్యాభరణములను ధరించి బయటకి వచ్చాడు.



తన కొడుకు ఇన్నాళ్ళకి తిరిగొచ్చాడని పొంగిపోయిన కౌసల్యా దేవి సీతమ్మకి అభ్యంగన స్నానం చేయించి, మంచి పట్టుపుట్టం కట్టి చక్కగా అలంకరించింది. కౌసల్య, సుమిత్ర, కైకేయల చేత అలంకరింపబడ్డ వానర కాంతలు 9000 ఏనుగుల్ని ఎక్కారు. దశరథుడు ఎక్కే శత్రుంజయం అనే ఏనుగుని తీసుకొచ్చి దానిమీద సుగ్రీవుడిని ఎక్కించారు. వానరులందరూ కూడా సంతోషంగా అయోధ్యకి బయలుదేరారు. సూర్యమండల సన్నిభమైన రథాన్ని రాముడు ఎక్కాడు, ఆ రథం యొక్క పగ్గములను భరతుడు పట్టుకొని నడిపించాడు. లక్ష్మణుడు నూరు తీగలు కలిగిన తెల్లటి గొడుగుని పట్టాడు. ఒక పక్క శత్రుఘ్నుడు మరొక పక్క విభీషణుడు వింద్యామర వేస్తున్నారు. అలా రథంలో అయోధ్యకి వెళుతున్న రాముడు కనపడ్డ వాళ్ళందరినీ పలకరించుకుంటూ వెళ్ళాడు. 



ప్రతి ఇంటి మీద పతాకాలు ఎగురవేశారు, అన్ని ఇళ్ళ ముందు రంగవల్లులు వేశారు, సంతోషపడిపోతూ, నాట్యం చేస్తూ అందరూ వెళుతున్నారు. ఆ వెళ్ళేటప్పుడు ముందుగా మంగళ వాయిద్యాలు నడిచాయి, ఆ వెనకాల వేద పండితులు నడిచారు, తరువాత పెద్దలు, వాళ్ళ వెనకాల కన్నె పిల్లలు, కొంతమంది స్త్రీలు పిండివంటలు పట్టుకుని నడిచారు. మార్గమధ్యంలో గంధపు నీరు జల్లుకుంటూ వెళ్ళారు. ఆ తరువాత సువాసినులు అయిన స్త్రీలు చేతులలో పువ్వులు, పసుపు, కుంకుమ పట్టుకుని వెళ్ళారు. వశిష్ఠుడు, జాబాలి, కాశ్యపుడు, గౌతముడు మొదలైన ఋషులందరూ వచ్చారు. అలా అందరూ కలిసి అయోధ్యకి చేరుకున్నారు. ఆ రాత్రికి అయోధ్యలో గడిపాక మరునాడు రాముడి పట్టాభిషేకానికి 4 సముద్ర జలాలు500 నదుల జలాలని వానరాలు తీసుకొచ్చాయి. ఇంద్రుడు నూరు బంగారు పూసలు కలిగిన మాలని రాముడికి బహూకరించాడు. 





వానరాలు తీసుకోచ్చిన ఆ జాలలని రాముడి మీద పోసి ఆయనకి పట్టాభిషేకం చేశారు. కిరీటాన్ని తీసుకొచ్చి రాముడి శిరస్సున అలంకారం చేశారు. ఆ సమయంలో రాముడు కొన్ని కోట్ల బంగారు నాణాలు, లక్షల ఆవులు, వేల ఎద్దులు దానం చేశాడు. 



అప్పుడు రాముడు లక్ష్మణుడితో " లక్ష్మణా! యువరాజ పట్టాభిషేకం చేసుకో " అన్నాడు.



అప్పుడు లక్ష్మణుడు " అన్నయ్య! నాకన్నా పెద్దవాడు భరతుడు ఉన్నాడు. నాకు రాజ్యం వద్దు, భరతుడికి ఇవ్వు " అన్నాడు.



తరువాత యువరాజ పట్టాభిషేకం భరతుడికి జెరిగింది.




సుగ్రీవుడు, విభీషణుడు, అంగదుడు మొదలైన వానర వీరులందరికీ బహుమతులు ఇచ్చారు. హనుమంతుడికి తెల్లటి వస్త్రముల ద్వయం, హారాలు ఇచ్చారు. 



ఆ సమయంలో, సీతమ్మ తన మెడలో ఉన్న ఒక హారాన్ని తీసి చేతిలో పట్టుకుంది. అప్పుడు రాముడు సీత వంక చూసి " ఈ హారాన్ని ఎవరికి ఇస్తావో తెలుసా. పౌరుషము, బుద్ధి, విక్రమము, తేజస్సు, వీర్యము, పట్టుదల, పాండిత్యము ఎవడిలో ఉన్నాయో, అటువంటివాడికి ఈ హారాన్ని కానుకగా ఇవ్వు, అన్నిటినీ మించి వాడు నీ అయిదోతనానికి కారణం అయ్యి ఉండాలి " అన్నాడు.



అప్పుడు సీతమ్మ ఆ హారాన్ని హనుమంతుడికి ఇచ్చింది. అప్పుడాయన ఆ హారాన్ని కన్నులకు అద్దుకొని మెడలో వేసుకున్నాడు. 



ఎప్పుడైతే ధర్మాత్ముడైన రాముడు సింహాసనం మీద కూర్చున్నాడో, అప్పుడు ఎవరినోట విన్నా' రాముడు, రాముడు ' తప్ప, వేరొక మాట వినపడలేదు. రాముడు రాజ్యం చేస్తుండగా దొంగల భయం లేదు, శత్రువుల భయం లేదు, నెలకి మూడు వానలు పడుతుండేవి, భూమి సస్యశ్యామలంగా పంటలని ఇచ్చింది, చెట్లన్నీ ఫలపుష్పములతో నిండిపోయి ఉండేవి, చాతుర్వర్ణ ప్రజలు తమ తమ ధర్మములయందు అనురక్తులై ఉన్నారు, చిన్నవాళ్ళు మరణిస్తే పెద్దవాళ్ళు ప్రేతకార్యం చెయ్యడం రామ రాజ్యంలో లేదు. ఆ రాముడి పరిపాలనలో అందరూ సంతోషంగా ఉండేవారు. 

                                      యుద్ధ కాండ  సమాప్తం 

Saturday, 18 August 2012

రామాయణం @ కధ -98



అప్పుడు దేవేంద్రుడు " రామ! ఒకసారి మేము వచ్చి దర్శనం ఇస్తే, ఆ దర్శనం వృధా కాకూడదు. అందుకని ఏదన్నా ఒక వరం కోరుకో " అన్నాడు.

రాముడన్నాడు " నాకోసమని తమ యొక్క కొడుకులని, భార్యలని విడిచిపెట్టి ఎన్నో కోట్ల వానరములు, భల్లూకములు, కొండముచ్చులు యుద్ధానికి వచ్చాయి. అలా వచ్చిన వాటిలో కొన్ని మిగిలాయి, మిగిలిన వాటిలో కొన్నిటికి చేతులు తెగిపోయాయి, కొన్నిటికి కాళ్ళు తెగిపోయాయి, కొన్ని ఇంకా యుద్ధభూమిలో రక్తం ఓడుతూ పడున్నాయి, కొన్ని యమ సదనమునకు వెళ్ళిపోయాయి. మీరు నిజంగా నాయందు ప్రీతి చెందినవారైతే, యమ సదనమునకు వెళ్ళిన వానరములన్నీ బతకాలి, యుద్ధభూమిలో కాళ్ళు తెగిపోయి, చేతులు తెగిపోయి పడిపోయిన కోతులు, కొండముచ్చులు, భల్లూకాలు మళ్ళి జవసత్వములతో పైకి లేవాలి. అవన్నీ యుద్ధానికి వచ్చేటప్పుడు ఎంత బలంతో ఉన్నాయో ఇప్పుడు మళ్ళి అంతే బలంతో ఉండాలి. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళినా అక్కడ చెట్లకి ఫలాలు ఫలించాలి, పువ్వులు పుయ్యాలి, అక్కడ సమృద్ధిగా తేనె ఉండాలి, వాళ్ళు తాగడానికి ఎప్పుడూ మంచి నీరు ప్రవహిస్తూ ఉండాలి " అన్నాడు.

ఇంద్రుడు " తప్పకుండా నీకు ఈ వరాన్ని కటాక్షిస్తున్నాను " అన్నాడు.

వెంటనే యుద్ధ భూమిలో పడి ఉన్నవారు లేచి వచ్చారు, యమ సదనానికి వెళ్ళినవారు తిరిగి వచ్చేశారు. వానరులందరూ పరమ సంతోషాన్ని పొందారు. 

ఆరోజు రాత్రి అక్కడ విశ్రమించారు, మరునాడు ఉదయం రాముడు విభీషణుడిని పిలిచి " నేను తొందరగా అయోధ్య చేరుకోవాలని అనుకుంటున్నాను. ఇక్కడి నుంచి కాలి నడకన వెళితే చాలా సమయం పడుతుంది కనుక తొందరగా వెళ్ళడానికి ఏదన్నా ప్రయాణ సాధనం ఏర్పాటు అవుతుందా " అన్నాడు.


విభీషణుడు " మన దెగ్గర పుష్పక విమానం ఉంది, ఉత్తర క్షణంలో మీరు అయోధ్యకి చేరిపోతారు. ఇన్ని కష్టాలు పడ్డారు కదా, సీతమ్మ లభించింది కదా, సీతమ్మ అభ్యంగన స్నానం ఆచరించి, పట్టు పుట్టం కట్టుకుని, నగలు అలంకరించుకుంది కదా, మీరు కూడా తలస్నానం చేసి, పట్టు పుట్టాలు కట్టుకుని, ఆభరణములను దాల్చి, నా దెగ్గర బహుమతులు అందుకొని మీరు బయలుదేరితే నేను ప్రీతి పొందుతాను " అన్నాడు.

అప్పుడు రాముడు " నా తమ్ముడైన భరతుడు అక్కడ జటలు పెంచుకొని, మట్టి పట్టిన వస్త్రం కట్టుకొని, నా పాదుకలని సింహాసనం మీద పెట్టి, నన్ను చూడాలని శోకిస్తు రాజ్యం చేస్తున్నాడు. ఆ భరతుడు స్నానం చెయ్యక ముందు నేను స్నానం చెయ్యనా. భరతుడు పట్టు పుట్టం కట్టుకోక ముందు నేను కట్టుకోన. భరతుడు ఆభరణాలు పెట్టుకోక ముందు నేను పెట్టుకోన. నాకు తొందరగా భరతుడిని చూడాలని ఉంది " అన్నాడు.

విభీషణుడు వెంటనే పుష్పక విమానాన్ని ఏర్పాటు చేశాడు, రాముడు ఆ విమానాన్ని అధిరోహించాక " మీరందరూ నాకోసం చాలా కష్టపడ్డారు, ఇక మీరు విశ్రాంతి తీసుకోండి. నేను బయలుదేరతాను......." అని చెబుతుండగా, అక్కడున్న వాళ్ళందరూ అన్నారు " మిమ్మల్ని విడిచిపెట్టి మేము ఉండలేము, మేము మీతో అయోధ్యకి వచ్చేస్తాము. మేము అక్కడ ఎక్కువ రోజులుండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టము, మిమ్మల్ని కన్న కౌసల్యని ఒకసారి చూడాలని ఉంది, మీరు పట్టాభిషిక్తులై సింహాసనం మీద కూర్చుంటె చూడాలని ఉంది రామ " అన్నారు.

విశాల హృదయుడైన రాముడు సరె అనేసరికి అక్కడున్న వాళ్ళందరూ ఆ పుష్పక విమానంలోకి గబగబా ఎక్కేశారు. తరువాత ఆ విమానం ఆకాశంలోకి ఎగిరిపోయింది. అప్పుడు రాముడు సీతమ్మకి ఆ పుష్పక విమానం నుండి కిందకి చూపిస్తూ " సీత చూశావ, ఇదే నేను రావణుడిని పడగొట్టిన ప్రదేశం. అదిగో అది కుంభకర్ణుడు పడిపోయిన ప్రదేశం, అది నరాంతకుడు పడిపోయిన ప్రదేశం, ఇది హనుమ విరూపాక్షుడిని పడగొట్టిన ప్రదేశం. ఆ సముద్రంలో ఉన్న సేతువుని మేము వానరములతో కలిసి నిర్మించాము. ఇక్కడే మేమందరమూ కూర్చుని ఈ సముద్రాన్ని ఎలా దాటడం అని అనుకున్నాము. ఇదే కిష్కింద, ఇక్కడి నుంచే వానరులు అన్ని దిక్కులకి నీ జాడ కనిపెట్టడానికి బయలుదేరారు " అని చెప్తుంటే సుగ్రీవుడు గబగబా వచ్చి " రామ! మనం కిష్కింద మీద నుంచే వెళుతున్నాము కదా, నా భార్యలు తార, రుమ చూస్తుంటారు, వాళ్ళని కూడా ఎక్కించుకుందాము " అన్నాడు.

అప్పుడా పుష్పకాన్ని కిందకి దింపారు. సుగ్రీవుడు వెంటనే వెళ్ళి తార, రుమ లకి విషయాన్ని చెప్పి రమ్మన్నాడు. అప్పుడు తార మిగిలిన ఆడవారి దెగ్గరికి వెళ్ళి " రండి, రండి, సుగ్రీవుడు జయాన్ని సాధించి రామ పట్టాభిషేకానికి వెళుతున్నారు. మంచి మంచి బట్టలు, ఆభరణాలు వేసుకుని అందరూ వచ్చెయ్యండి " అనింది. అప్పుడు వాళ్ళు మానవ కాంతలగా కామరూపాలని పొంది, పట్టుపుట్టాలు, ఆభరణములు వేసుకుని, పుష్పక విమానానికి ప్రదక్షిణం చేసేసి, లోపలికి ఎక్కి " సీతమ్మ ఎక్కడ? సీతమ్మ ఎక్కడ? " అని అడిగారు.   

" ఆవిడే సీతమ్మ " అని చూపిస్తే అందరూ వెళ్ళి ఆమెకి నమస్కరించారు. అప్పుడు సీతమ్మ వాళ్ళందరినీ సంతోషంగా కౌగలించుకొని, పలకరించింది. 

మళ్ళి రాముడన్నాడు " సీత! అదే ఋష్యమూక పర్వతం, అక్కడే నేను సుగ్రీవుడు కలుసుకున్నాము. అది శబరి యొక్క ఆశ్రమం. అక్కడున్న చిక్కటి వనంలోనే కబంధుడిని చంపాను. చూశావ సీత, అది మనం ఉన్న పంచవటి ఆశ్రమం, ఇక్కడే రావణుడు నిన్ను అపహరించాడు " అని రాముడు చెబుతుంటే సీతమ్మ గబుక్కున రాముడి చెయ్యి పట్టుకుంది.

కొంతముందుకి వెళ్ళాక " అదే అగస్త్య మహర్షి ఆశ్రమం, ఇక్కడే అగస్త్యడు నాకు రావణ సంహారం కోసం అస్త్రాన్ని ఇచ్చాడు. అక్కడ కనపడుతున్నది సుతీక్షణుడి ఆశ్రమం. అక్కడ కనపడుతున్నది చిత్రకూట పర్వతం, ఇక్కడే మనం తిరుగుతూ ఉండేవాళ్ళము " అన్నాడు.

అలా ఆ పుష్పకం కొంత ముందుకి వెళ్ళాక వాళ్ళకి భారద్వాజ మహర్షి యొక్క ఆశ్రమం కనపడింది. అప్పుడు ఆ పుష్పకాన్ని అక్కడ దింపి, భారద్వాజుడికి నమస్కరించారు. అప్పుడు భారద్వాజుడు " రామ! నేను నా తపఃశక్తితో అన్ని కాలములయందు నీ గురించి తెలుసుకుంటున్నాను. నువ్వు రావణ సంహారం చెయ్యడం కూడా నాకు తెలుసు. ఇవ్వాళ ఒక్క రాత్రి నా దెగ్గర ఉండి, విశ్రాంతి తీసుకొని, నా ఆతిధ్యం తీసుకొని బయలుదేరు " అన్నాడు.


అప్పుడు రాముడు హనుమంతుడిని పిలిచి " హనుమ! నువ్వు ఇక్కడినుంచి బయలుదేరి వెళ్ళి, గంగానది ఒడ్డున శృంగిభేరపురంలో గుహుడు ఉంటాడు, అతను నాకు మిక్కిలి స్నేహితుడు. ఆ గుహుడికి నా క్షేమ సమాచారం చెప్పి, పట్టాభిషేకానికి రమ్మని చెప్పు. తరువాత అక్కడి నుంచి బయలుదేరి అయోధ్యలో అందరూ కుశలంగా ఉన్నారా అని కనుక్కొని నందిగ్రామానికి వెళ్ళి, నేను తిరిగొస్తున్నాను అని భరతుడికి చెప్పి, ఆయన ముఖకవళికలు గమనించు. భరతుడి ముఖంలో ఏదన్నా కొంచెం బెంగ నీకు కనపడితే వెంటనే వెనక్కి వచ్చెయ్యి. ఇంక నేను అయోధ్యకి రాను, భరతుడు అయోధ్యని పాలిస్తాడు. ఈ విషయాన్ని నువ్వు జాగ్రత్తగ కనిపెట్టి తిరిగిరా " అన్నాడు.

వెంటనే హనుమంతుడు అక్కడినుంచి బయలుదేరి గుహుడిని కలుసుకొని, ఆయనని పలకరించి, రాముడు చెప్పిన విషయాన్ని చెప్పాడు. తరువాత అక్కడినుంచి బయలుదేరి వెళ్ళి భరతుడిని కలుసుకొని, రాముడు పడిన కష్టాలు, సీతాపహరణం, రావణ వధ మొదలైన విషయాలని వర్ణించి చెప్పాడు. హనుమంతుడి మాటలు విన్న భరతుడు చాలా సంతోషించాడు. 

Thursday, 16 August 2012

రామాయణం @ కధ -97


అప్పుడు సీతమ్మ " రామ! నన్ను చిన్నతనంలో పాణిగ్రహణం చేశావే, నా చెయ్యి పట్టుకున్నావే, చాలా కాలం కలిసి దాంపత్య జీవనం చేశామే, నేను ఎటువంటిదాననో నీకు తెలియదా, నేనంత చేతకాని స్త్రీలా నీకు కనపడుతున్నాన. నేను నిజంగా అటువంటి చారిత్రము ఉన్నదానిని అని నువ్వు అనుమానించిన వాడివైతే ఆనాడు హనుమని నాకోసం ఎందుకు పంపించావు. నేను రాక్షసుల మధ్యలో ఉన్నాను అని హనుమ నీకు చెబితే, మళ్ళి హనుమతోనే నేను నీ చారిత్రమును శంకిస్తున్నాను అని కబురు చేస్తే నేను ప్రాణాలు విడిచిపెట్టేదాన్ని. అలా చెయ్యకుండా నాకోసం ఎందుకు ప్రాణ సంకటాన్ని పొందావు, ఎందుకు సముద్రానికి సేతువు కట్టి, లంకకి వచ్చి, అంత యుద్ధం చేశావు. యుద్ధంలో జయాపజయములు విధి నిర్ణీతములు, నువ్వు గెలవచ్చు రావణుడు గెలవచ్చు. నాయందు నీకు ప్రేమ ఉంది కాబట్టి అంత ప్రాణ సంకటం తెచ్చుకున్నావు. కాని ఇవ్వాళ ఎందుకింత బేలగా మాట్లాడుతున్నావు. నేను స్త్రీని కాబట్టి ఎలా అయినా మాట్లాడచ్చు అనుకుంటున్నావా. నా భక్తి, నా సౌశీల్యం, నా నడువడి అన్నిటినీ వెనక్కి తోసేశావు. నేను బతికుంటే రాముడికి ఇల్లాలిగా బతుకుతాను, చచ్చిపోయినా రాముడికి ఇల్లాలిగానే చచ్చిపోతాను. ఒకసారి అపనింద పడ్డాక నాకీ జీవితంతో సంబంధం లేదు. లక్ష్మణా! చితి పేర్చు " అనింది.


అప్పుడు లక్ష్మణుడు రాముడి వంక కనుగుడ్లు మిటకరిస్తూ కోపంగా చూశాడు. రాముడు అంత కన్నా కోపంగా, ఎర్రటి కళ్ళతో లక్ష్మణుడి వంక చూసేసరికి లక్ష్మణుడు గబగబా వెళ్ళి చితిని పేర్చాడు

అప్పుడు సీతమ్మ " నా మనస్సు రాముడి యందే ఉన్నదైతే, సర్వ కాలముల యందు రాముడిని ధ్యానము చేసిన దాననైతే, పృధ్వీ, ఆకాశము, అష్ట దిక్పాలకులు, అంతరాత్మ, అగ్ని సాక్షిగా ఉండి, ఒక్క క్షణం కూడా నా మనస్సు రాముడిని విడిచిపెట్టనిది నిజమే అయితే ఈ అగ్నిహోత్రుడు నన్ను రక్షించుగాక " అని చెప్పి అగ్నిలో దూకింది.


అలా సీతమ్మ అగ్నిలో దూకగానే బ్రహ్మశివుడుఇంద్రుడు, దేవతలు మొదలైనవారందరూ అక్కడికి వచ్చారు. వాళ్ళకి నమస్కారం చేస్తున్న రాముడిని చూసి వాళ్ళు అన్నారు " అదేమిటయ్యా రామ అంత పని చేశావు. నువ్వు సాక్షాత్తుగా శ్రీ మహా విష్ణువువి. నువ్వు లోకములను సృష్టించ గలిగిన వాడివి, లయం చెయ్యగలిగినవాడివి, పరబ్రహ్మానివి. సీతమ్మని అగ్నిలో ప్రవేశించమని ఎలా చెప్పగలిగావయ్య " అన్నారు.

అప్పుడు రాముడు " మీరందరూ నేను చాలా గొప్పవాడిని అని అంటున్నారు, నేను పరబ్రహ్మాన్ని అంటున్నారు, కాని నేను అలా అనుకోవడం లేదు. నేను దశరథ మహారాజు యొక్క కుమారుడిని, రాముడిని, నరుడిని అని అనుకుంటున్నాను. నేను యదార్ధముగా ఎవరినో మీరు చెప్పండి " అన్నాడు.

అప్పుడు బ్రహ్మ " సృష్టికి ముందు ఉన్నవాడివి నువ్వు, స్థితికారుడివి నువ్వు, లయకారుడివి నువ్వు, వరాహమూర్తివి నువ్వు, భూమిని ఉద్ధరించినవాడివి నువ్వు, ఆరోగ్యం నువ్వు, కోపం నువ్వు, రాత్రి నువ్వు, నీ రోమకూపాల్లో దేవతలు ఉంటారు, సమస్తము నీయందే ఉంది, అంత్యము నందు ఉండిపోయేవాడివి నువ్వు, నువ్వు కన్ను ముస్తే రాత్రి, కన్ను తెరిస్తే పగలు " అని రాముడిని స్తోత్రం చేశారు.

తరువాత అగ్నిహోత్రంలో నుంచి అగ్నిదేవుడు తన తొడ మీద సీతమ్మని కూర్చోపెట్టుకుని బంగారు సింహాసనం మీద పైకి వచ్చాడు. అప్పుడాయన " రామ! ఈవిడ మహాపునీత. గొప్ప పుణ్యచారిత్రము ఉన్నది, ఈ తల్లి కంటితో కూడా దోషం చెయ్యలేదు. ఈవిడ పాతివ్రత్యం వల్లే రాక్షస సంహారం జెరిగింది. ఈ తల్లి మనస్సుతో కాని, వాక్కుతో కాని పాపం చెయ్యలేదు. నేను సమస్త జీవుల యొక్క కర్మలని చూస్తుంటాను, ఈ తల్లియందు కించిత్ దోషం లేదు. రామ! సర్వకాల సర్వావస్తల యందు నీ నామం చెప్పుకుని, నీ పాదముల యందు మనస్సు పెట్టుకున్న తల్లి ఈ సీతమ్మ. నువ్వు ఇంకొక మాట చెబితే నేను అంగీకరించను. ఈమెని నువ్వు స్వీకరించు " అన్నాడు.

అప్పుడు రాముడు " మీరందరూ చెప్పవలసిన అవసరం లేదు, సర్వకాలముల యందు ఈమె మనస్సు నా దెగ్గెర ఉందని నాకు తెలుసు. సముద్రం చెలియలి కట్టని దాటనట్టు, అగ్నిని చేత పట్ట లేనట్టు, సీతని రావణుడు తాకలేడన్న విషయం నాకు తెలుసు. కాని ఈ విషయం రేపు లోకమంతటికి తెలియాలి. చేత కానివాడు రాముడని లోకం అనకూడదు. సీత చారిత్రము ఏమిటో లోకానికి చెప్పాలని భర్తగా నేను అనుకున్నాను " అన్నాడు.

అప్పుడు రాముడు సీతమ్మ భుజం మీద చెయ్యివేసి ఆమెని దెగ్గరికి తీసుకున్నాడు. ఈ దృశ్యాన్ని చూసిన వానరులందరూ ఆనందంతో పొంగిపోయారు.

దేవతలందరితో పాటుగా అక్కడికి వచ్చిన శివుడు అన్నాడు " నాయన రామ! నీ తమ్ముడైన భరతుడు అయోధ్యలో దీనంగా ఉన్నాడు, ఆయనని ఓదార్చు. నీ తల్లి అయిన కౌసల్యని ఊరడించు. కైకేయి, సుమిత్రలకి నమస్కరించు. లక్ష్మణుడిని ఊరడించు. ఇక్ష్వాకు వంశీయులు ఇంతకాలం నుంచి పరంపరాగతంగా పరిపాలిస్తున్న రాజ్యాన్ని నువ్వు పరిపాలించి, నీవారిని సంతోషపెట్టు. ఏ వంశంలో నువ్వు జన్మించావో ఆ వంశాన్ని పెంచు. యాగాలు చెయ్యి, బ్రాహ్మణులకు భూరి దానాలు చేసి పరమ సంతృప్తిని పొందు. తదనంతరం స్వర్గానికి చేరుకుందువు గాని. అదిగో, ఆ విమానంలో మీ తండ్రిగారైన దశరథ మహారాజు ఉన్నారు, వెళ్ళి చూడు " అన్నాడు.

తండ్రిని చూడగానే లక్ష్మణుడితో కలిసి రాముడు నమస్కారం చేశాడు. అప్పుడు దశరథుడు రాముడిని ఒకసారి ఆనందంతో గట్టిగా కౌగలించుకొని తన తొడ మీద కూర్చోబెట్టుకుని " రామ! నేను స్వర్గలోకంలో విహరించానురా, ఇంద్ర లోకంలో తిరిగానురా, కాని నువ్వు లేకపోతె అది కూడా నాకు పెద్ద సుఖంగా అనిపించలేదురా. ఆనాడు నీకు పట్టాభిషేకాన్ని చేద్దాము అనుకోవడం, నేను ఎంతో ఆనందాన్ని పొందడం, రాత్రి కైక దెగ్గరికి వెళ్ళడం, కైక వరాలు కోరడం, నీ పట్టాభిషేకం భగ్నం అవ్వడం, ఆనాడు నేను ఏడ్చి ఏడ్చి నా శరీరాన్ని వదిలిపెట్టడం నాకు ఇంకా జ్ఞాపకం ఉన్నాయి. నేను ఇప్పుడు తెలుసుకున్నదేంటంటే, ఆ పట్టాభిషేకం భగ్నం అవ్వడానికి కారణం దేవతలు. రావణ సంహారం జెరగాలి కనుక దేవతలు ఆనాడు నీ పట్టాభిషేకాన్ని భగ్నం చేశారు " అన్నాడు.

అప్పుడు రాముడు " ఆనాడు మీరు భావనా వ్యగ్రతని పొంది, నా పట్టాభిషేకం భగ్నం అవ్వడానికి కైకమ్మ కారణం అనుకొని ' ఇప్పుడే నేను నిన్ను విడిచి పెట్టేస్తున్నాను, నువ్వు నా భార్యవి కావు, నీ కుమారుడు భరతుడు నాకు కొడుకు కాదు ' అన్నారు. ఆ మాటని మీరు ఉపసంహారం చెయ్యండి, నేను సంతోషిస్తాను " అన్నాడు.

అప్పుడు దశరథుడు " నువ్వు కోరుకున్నటు తప్పకుండా జెరుగుతుంది " అన్నాడు. తరువాత ఆయన లక్ష్మణుడితో " నాయన లక్ష్మణా! నువ్వురా ప్రాజ్ఞుడవి అంటె. చక్కగా అన్నయ్య సేవ చేశావు, ఇలాగె సర్వకాలముల యందు అన్నయ్యని, వదినని సేవిస్తూ నీ జన్మ చరితార్ధం చేసుకో " అన్నాడు.

అప్పుడు దశరథుడు రామలక్ష్మణుల వెనకాల తనకి నమస్కారం చేస్తూ నిలబడ్డ సీతమ్మని దెగ్గరికి పిలిచి " అమ్మా సీతమ్మ! నీ మనస్సుకి కష్టం కలిగిందా. ' సీత! నీతో నాకు ప్రయోజనం లేదు, నిన్ను విడిచిపెట్టేస్తున్నాను, నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళు ' అని మావాడు అన్నాడు కదా, అలా అన్నాడని నువ్వు బాధపడ్డావ. ఇవ్వాళ నేను ఊర్ధలోకవాసినమ్మా, తప్పు మాట చెబితే కిందకి పడిపోతాను, నీకొక నిజం చెప్పనా, రాముడికి నీమీద ఎప్పుడూ అటువంటి అభిప్రాయం లేదు. ఆ మాట ఎందుకన్నాడో తెలుసా, నిన్ను వేరొకరు ఎప్పుడూ వేలెత్తి చూపించకూడదని మావాడి తాపత్రయం. 

కూతురా! నువ్వు ఇవ్వాళ చేసిన పతి సేవ వల్ల జెరిగిన గొప్పతనం ఏమిటో తెలుసా, ఇతఃపూర్వం పతివ్రతలై భర్తని సేవించిన వాళ్ళందరి చరిత్రలను పక్కన పెట్టి, పతివ్రత అంటె సీతమ్మ అని నిన్ను చూపిస్తున్నారు. నీలాంటి కోడలు నా వంశానికి రావడం నా అదృష్టం. నీకు నేను ఇంక చెప్పడానికి ఏమిలేదమ్మ, నీకు అన్నీ తెలుసు, కాని మామగారిగా ఒక్క మాట చెబుతాను. అమ్మా! భర్త మాత్రమే దైవము అని తెలుసుకో " అన్నాడు.

తరువాత దశరథుడు విమానంలో ఊర్ధలోకాలకి వెళ్ళిపోయాడు. 

Wednesday, 15 August 2012

రామాయణం @ కధ -96


అప్పుడా భల్లూకం ' అపకారం చేసినవాడే అయినా, వాడు నా ఇంటికి వచ్చాడు కాబట్టి, అపకారికి కూడా ప్రయత్నపూర్వకంగా అపకారము చెయ్యకూడదు కాబట్టి నేను ఆ వేటగాడిని తొయ్యను ' అని ఒక భల్లూకం చెప్పింది. నేను మనుష్య స్త్రీగా పుట్టి, క్షత్రియ కాంతనై, రాముడికి ఇల్లాలినై ఆ రాక్షస స్త్రీలని చంపిస్తే నేను ఉత్తమ కులాంగనను అవుతాన. చెడ్డగా ఎవడున్నాడో, ఎవడు పాడయిపోయాడో వాడి మీద దయ ఉండాలి. ఈ రాక్షస స్త్రీలు చెయ్యకూడని పనులు చేశారు, వీళ్ళ మీద కదా నేను దయతో ఉండాలి. వీళ్ళందరికి నా రక్ష " అనింది. 


" అమ్మ! ఈ మాట చెప్పడం నీకే చెల్లింది తల్లి " అని సీతమ్మతో అని, అక్కడి నుంచి బయలుదేరి రాముడి దెగ్గరికి వెళ్ళి " రామ! సీతమ్మ నీ దర్శనం చెయ్యాలని అనుకుంటోంది " అని రాముడితో చెప్పాడు.

హనుమంతుడు చెప్పిన మాట విన్న రాముడు కొంచెంసేపు ఆలోచించాడు, ఆ సమయంలో ఆయన కళ్ళల్లో నీళ్ళు నిండాయి. చాలా శోకం పొందినవాడిలా అయ్యి, ఒకసారి భుమివంక చూసి, తన పక్కన ఉన్న విభీషణుడిని పిలిచి " విభీషణ! నువ్వు లోపలికి వెళ్ళి, సీతకి నేను చెప్పానని చెప్పి తలస్నానం చేయించి, పట్టు వస్త్రం కట్టించి, అన్ని అలంకారములు చేసి నా దెగ్గరికి ప్రవేశపెట్టు " అన్నాడు.

రాముడి మాటలు విన్న విభీషణుడు ఆశ్చయపోయి సీతమ్మ దెగ్గరికి వెళ్ళి " సీతమ్మ! నువ్వు తల స్నానం చేసి, పట్టుబట్ట కట్టుకొని, ఒంటినిండా అలంకారాలు చేసుకుని వస్తే రాముడు నిన్ను చూడాలని అనుకుంటున్నాడు " అన్నాడు.

సీతమ్మ అనింది " నేను ఎలా ఉన్నానో అలానే వచ్చి రామదర్శనం చేసుకోవాలని నా మనస్సు కోరుకుంటోంది " అనింది.

విభీషణుడు అన్నాడు " అమ్మా! అది రామ ఆజ్ఞ. ప్రభువు ఎలా చెప్పాడో అలా చెయ్యడం మంచిది. అంతఃపుర కాంతలు నీకు తలస్నానం చేయిస్తారు, నువ్వు దివ్యాంగరాదములను అలదుకొని, మంచి భూషణములను వేసుకొని, రాముడికి దర్శనం ఇవ్వమ్మా " అన్నాడు.

సీతమ్మ స్నానం చేసి అలంకరించుకున్నాక పరదాలు కట్టిన ఒక పల్లకి ఎక్కించి రాముడి దెగ్గరికి తీసుకు వెళ్ళారు. అప్పుడు రాముడి ముఖంలో సంతోషం, దైన్యం, కోపం కనపడ్డాయి. 

అప్పుడు రాముడు " మీరు ఆవిడని పల్లకిలో ఎందుకు తీసుకొస్తున్నారు. దిగి నడిచి రమ్మనండి " అన్నాడు.

అలా నడిచి వస్తున్న సీతమ్మని చూడడం కోసమని అక్కడున్న వానరాలు ఒకరిని ఒకరు తోసుకుంటున్నారు (ఆ వానరాలు అప్పటిదాకా సీతమ్మని చూడలేదు). అప్పుడు సుగ్రీవుడు కొంతమందిని ఆజ్ఞాపించి ఆ వానరాలని వెనక్కి తొయ్యమన్నాడు.

రాముడన్నాడు " ఈ సీత కోసం వాళ్ళు తమ ప్రాణాలని ఫణంగా పెట్టి యుద్ధం చేశారు. ఇప్పుడావిడ నడిచొస్తుంటే వాళ్ళని కొట్టి దూరంగా తోసేస్తార. వాళ్ళందరూ సీతని చూడవలసిందే. ఎవరైనా ప్రియ బంధువులు వియోగం పొందినప్పుడు, రాజ్యంలో క్షోభం ఏర్పడినప్పుడు, యజ్ఞం జెరుగుతున్నప్పుడు, యుద్ధం జెరుగుతున్నప్పుడు అంతఃపుర కాంతలు బయటకి రావచ్చు. ఇవ్వాళ నేను యుద్ధభూమిలో ఉన్నాను, కనుక భర్త దర్శనానికి సీత అలా రావచ్చు. నా పక్కన ఉండగా సీతని చూడడంలో దోషంలేదు " అన్నాడు.  

అప్పుడు హనుమంతుడు " రామ! ఎవరి కోసం మనం ఇంత కష్టపడి యుద్ధం చేశామో, ఆ సీతమ్మ మీ దెగ్గరికి వచ్చింది " అన్నాడు.

అప్పుడు సీతమ్మ రాముడి దెగ్గరికి వచ్చి, తన భర్త తన పట్ల ఆనందంగా లేకపోవడం వల్ల ఏడుస్తూ, ఆ ముసుగులో నుంచి " ఆర్యపుత్రా " అని, అలా నిలబడిపోయింది.

అప్పుడు రాముడు " శత్రువుని జయించాను, నిన్ను పొందాను. ఏ దైవము యొక్క అనుగ్రహము లేకపోవడము చేత, ఏ దైవము యొక్క శాసనము చేత నువ్వు అపహరింపబడ్డావో దానిని పురుష ప్రయత్నం చేత దిద్దాను. రావణుడిని సంహరించి నిన్ను తెచ్చుకున్నాను. అపారమైన పౌరుషము, పరాక్రమము ఉన్నవాడికి ఏదన్నా అపవాదు వస్తే, వాడు తన ప్రయత్నంతో ఆ అపవాదుని తుడిచి పెట్టుకోకపోతే, వాడు చేత కాని వాడు అని ప్రపంచం అంటుంది. అందుకని నా ప్రయత్నంతో వచ్చిన అపవాదుని తుడిచిపెట్టడానికి, రాముడి భార్యని రావణుడు అపహరిస్తే, రావణుడిని రాముడు ఏమి చెయ్యలేదు అని అనకుండా ఉండడం కోసం రావణుడిని సంహరించాను. 100 యోజనముల సముద్రాన్ని దాటి  లంకా పట్టణాన్ని చేరి, హనుమ చేసిన ఈ లంకా భీభత్సం అంతా నేటితో సార్ధక్యాన్ని పొందింది. నేను ఇదంతా కష్టపడి చేసింది నా పేరు ప్రఖ్యాతులు నిలబెట్టుకోడానికి. ఇక్ష్వాకు వంశంలో జన్మించాను కాబట్టి, రాముడు చేతకాని వాడు అన్న అపవాదు నా మీద పడకూడదు కాబట్టి ఇదంతా చేశాను. రాముడు సీతని తిరిగి తెచ్చుకోలేకపోయాడు అన్న కళంకం మా వంశంలో ఉండిపోకూడదు, అందుకని నిన్ను గెలిచి తెచ్చుకున్నాను. 

సీత! ఇవ్వాళ నీ చారిత్రము శంకింపబడింది. నువ్వు చాలాకాలం రాక్షసుని గృహంలో ఉన్నావు. నువ్వు అలా ఉన్న కారణం చేత నిన్ను చూస్తున్నప్పుడు నాకు ఎలా ఉందో తెలుసా, కంటియందు జబ్బు ఉన్నవాడు దీపాన్ని ఎలా చూడలేడో, అలా నేను నీ వంక చూడలేకపోతున్నాను. నీకు తెలుసు నాకు తెలుసు, నువ్వు అపార సౌందర్యరాశివి, నిన్ను చూసినవాడు చపలచిత్తుడైతే వెంటనే నీ యందు మనస్సు పెట్టుకుంటాడు. పరమ చపలచిత్తుడైన రావణుడు నిన్ను చూడకూడని చూపు చూశాడు, బలవంతంగా నీ జుట్టు పట్టి ఈడ్చాడు, తన తొడ మీద కుర్చోపెట్టుకున్నాడు, గుండెల మీద వేసుకున్నాడు, అశోకవనంలో పెట్టాడు, 10 నెలలు నిన్ను చూశాడు. నువ్వూ మహా అందగత్తెవి, వయస్సులో ఉన్నదానివి. అటువంటి నువ్వు ఖచ్చితమైన నడువడితో ఉన్నావని నేను ఎలా నమ్మను. అందుకని ఇప్పుడు నీ ఇష్టం, నీకు ఎవరు నచ్చితే వాళ్ళతో వెళ్ళిపో. లక్ష్మణుడితో కాని, భరతుడితో కాని, విభీషణుడితో కాని, సుగ్రీవుడితో కాని నువ్వు వెళ్ళిపోవచ్చు, వీళ్ళు కాదు ఈ పది దిక్కులలో నీకు ఎవరు నచ్చినా వాళ్ళతో వెళ్ళిపోవచ్చు. నేను నీకు అనుమతి ఇస్తున్నాను, నువ్వు వెళ్ళిపోవచ్చు. నీతో నాకు మాత్రం ఏవిధమైన అవసరం లేదు " అన్నాడు.

Monday, 13 August 2012

రామాయణం @ కధ -95



అప్పుడు రాముడు " విభీషణుడికి సింహాసనం మీద అభిషేకం జెరిగితే చూడాలని ఉంది లక్ష్మణా. సముద్రానికి వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చి విభీషణుడికి పట్టాభిషేకం చెయ్యండి " అన్నాడు. 


విభీషణుడికి అభిషేకం చేశాక రాముడు హనుమంతుడిని పిలిచి " ఇవ్వాళ విభీషణుడు అభిషేకం జెరిగి లంకకి రాజయ్యాడు కనుక ఆయన అనుమతి తీసుకొని లంకలోకి వెళ్ళి సీత దర్శనం చెయ్యి. నేను సుగ్రీవుడి సాయంతో, విభీషణుడి సాయంతో రావణుడిని సంహరించి లంకా పట్టణాన్ని స్వాధీనం చేసుకొని క్షేమంగా ఉన్నానని చెప్పు. విభీషణుడికి పట్టాభిషేకం అయిపోయిందని చెప్పు. అందుకని ఇవ్వాళ సీత నా మిత్రుడైన విభీషణుడి ఇంట్లో ఉంది కనుక బెంగపడవలసిన అవసరం లేదని చెప్పు " అన్నాడు.

హనుమంతుడు సీతమ్మ దెగ్గరికి వెళ్ళగా, సీతమ్మ హనుమంతుడిని చూసి తల తిప్పుకొని ఏదో ధ్యానం చేసుకుంటుంది. మళ్ళి ఓ సారి హనుమంతుడి వంక చూసి " హనుమ! నువ్వు కదా " అనింది.

అప్పుడు హనుమంతుడు " సీతమ్మ! రాముడు సుగ్రీవుడిని, విభీషణుడిని తన పక్కన పెట్టుకుని, వాళ్ళ యొక్క సహాయంతో రావణుడిని సంహరించి లంకని తనదిగా చేసుకున్నాడు. ఇవ్వాళ విభీషణుడిని లంకా రాజ్యానికి రాజుగా చేశారు. ఇప్పుడు నువ్వు రాముడి మిత్రుడైన విభీషణుడి ప్రమదావనంలో ఉన్నావు, అందుచేత నువ్వు బెంగపడవలసిన పరిస్థితి లేదు. నీ శోకాన్ని విడిచిపెట్టు " అన్నాడు.

అప్పుడు సీతమ్మ " ఎంత మంచి  మాట చెప్పావయ్య హనుమ " అని చెప్పి ఒక్క నిమిషం అలా ఉండిపోయింది.

అప్పుడు హనుమంతుడు " అదేమిటమ్మ ఏమి మాట్లాడావు " అన్నాడు.


సీతమ్మ " 10 నెలల నుంచి ఈ మాట ఎప్పుడు వింటాన అని తపస్సు చేశాను కదా హనుమ. నువ్వు నిజంగా వచ్చి ఈ మాట చెప్పేటప్పటికి నా నోటి వెంట మాటరాలేదు. నువ్వు చెప్పిన మాటకి నేను చాలా ఆనందాన్ని పొందాను. కాబట్టి నేను నీకు ఏదో ఒక బహుమతి ఇవ్వాలి, కాని నేను ఆలోచన చేస్తే, నేను నీకు ఏమి ఇవ్వగలను. ఎంత బంగారం ఇచ్చినా, రత్నాలు ఇచ్చినా, మూడు లోకములని ఇచ్చినా సరిపోదు. ఇవ్వాళ నీకు ఇవ్వడానికి నా దెగ్గర ఏమిలేదు హనుమ. నువ్వు మధురాతి మధురంగా మాట్లాడతావు, నీకు అష్టాంగ యోగంతొ కూడిన బుద్ధి ఉంది, వీర్యము, పరాక్రమము, తేజస్సు ఉంది. నిన్ను చూసి పొంగిపోతున్నానయ్య " అనింది.

అప్పుడు హనుమంతుడు " అమ్మ! నువ్వు నా గురించి ఇన్ని మాటలు చెప్పి, నాకు ఇవ్వడానికి నీ దెగ్గర గొప్ప వస్తువు లేదన్నావు కదా. నేనొక వరం అడుగుతాను ఇస్తావ తల్లి " అని, " ఇంతకముందు వచ్చినప్పుడు శింశుపా వృక్షం మీద కూర్చుని చూశానమ్మా, ఈ రాక్షస స్త్రీలందరూ నీ గురించి ఎన్ని మాటలు మాట్లాడారు. నువ్వు బ్రతికుండగా నిన్ను వాటాలు వేసుకున్నారు. ' నిన్ను అనుమతించాను హనుమ ' అని ఒక్కమాట అను, నేను వాళ్ళని గోళ్ళతో గిల్లేస్తాను, మోకాళ్ళతో గుద్దేస్తాను, కొంతమందికి పళ్ళు పీకేస్తాను, కొంతమంది జుట్టు పీకేస్తాను, కొంతమందిని గుద్దేస్తాను " అన్నాడు.

అప్పుడు సీతమ్మ " హనుమ! వాళ్ళు దాసీజనం, ప్రభువు ఎలా చెయ్యమంటే వాళ్ళు అలా చేస్తారు. దోషం వాళ్ళది కాదు, దోషం ప్రభువుది. ఏ దోషం వాళ్ళ యందు ఉందని వాళ్ళని చంపేస్తావు. నీ ప్రభువు చెబితే నువ్వు చేసినట్టు, వాళ్ళ ప్రభువు చెప్పినట్టు వాళ్ళు చేశారు. ప్రభుభక్తి విషయంలో నువ్వు ఎటువంటివాడివో వాళ్ళు కూడా అటువంటి వాళ్ళే. గతంలో నేను చేసిన పాపం ఏదో ఉంది, ఆ పాపానికి ఫలితంగా ఇన్ని కష్టాలు పడ్డాను. 

పూర్వకాలంలో ఒక వేటగాడు అడవిలో వెళ్ళిపోతుంటే ఒక పెద్ద పులి అతనిని తరుముకొచ్చింది. అప్పుడా వేటగాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక చెట్టు ఎక్కాడు. తీరా చెట్టు మీదకి ఎక్కి చూస్తే అక్కడ ఒక భల్లూకం పడుకొని ఉంది. ఆ వేటగాడు పైకి వెళితే భల్లూకం తినేస్తుంది, కిందకి వెళితే పులి తినేస్తుంది.   

ఈ స్థితిలో పులి భల్లూకంతో ' వాడు నరుడు, మనిద్దరమూ క్రూర జంతువులము, మనిద్దరిది ఒక జాతి, వాడిది ఒక జాతి, కనుక వాడిని కిందకి తోసేయ్యి ' అనింది.

అప్పుడా భల్లూకం ' వాడు తెలిసో తెలియకో ఆర్తితో పరుగు పరుగున నేనున్న చెట్టు ఎక్కాడు, అందుకని వాడు నన్ను శరణాగతి చేసినట్టు. వాడు నాకు అతిథి. కనుక నేను వాడిని తొయ్యను, నేను వాడికి ఆతిధ్యం ఇస్తున్నాను ' అనింది.

ఆ పెద్ద పులి అలా చెట్టు కిందనే ఉంది. కొంతసేపయ్యాక భల్లూకం వేటగాడితో ' నాకూ పెద్ద పులి చేత ప్రమాదమే. నాకు నిద్రొస్తోంది, నిద్రొస్తే జారి కింద పడిపోతాను. అందుకని నేను నీ ఒడిలో తల పెట్టుకుని పడుకుంటాను, కొంచెం పడి పోకుండా చూడు ' అనింది. అప్పుడా వేటగాడు ' తప్పకుండా పడుకో ' అన్నాడు.

ఆ భల్లూకం పడుకున్నాక పెద్ద పులి అనింది ' దానికి నిద్రలేచాక ఆకలి వేస్తుంది. అది సహజంగా క్రూర జంతువు కనుక నిన్ను చంపేసి తింటుంది. అందుకని ఇదే అదును, నువ్వు ఆ భల్లూకాన్ని కిందకి తోసేయ్యి. అప్పుడు నేను ఆ భల్లూకాన్ని తిని వెళ్ళిపోతాను, తరువాత నువ్వు కూడా వెళ్ళిపోవచ్చు ' అనింది.

ఈ మాట వినగానే ఆ వేటగాడు నిద్రపోతున్న భల్లూకాన్ని కిందకి తోసేశాడు. ఆ భల్లూకం కిందకి పడిపోతూ పడిపోతూ ఒక చెట్టుకొమ్మని పట్టుకొని పైకి ఎక్కింది. అప్పుడా పులి ' చూశావ, నిద్రపోతున్న నిన్ను వాడు కిందకి తోసేశాడు, ఎప్పటికైనా మనిషి మనిషే మనం మనమే. అందుకని వాడిని కిందకి తోసేయ్యి ' అనింది.

Sunday, 12 August 2012

రామాయణం @ కధ -94


రావణుడు మరణించగానే ఆకాశంలో దేవదుందుభిలు మ్రోగాయి. వెంటనే సుగ్రీవుడు, లక్ష్మణుడు, అంగదుడు, ఋషభుడు, వేగదర్శి, నీలుడు, సుషేణుడు, గందమాధనుడు, మైందుడు, జాంబవంతుడు, కొన్ని కోట్ల వానరములు అందరూ పరమానందంతో రాముడి దెగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు. అందరూ రాముడి పాదాల మీద పడిపోయి, ఆనందంతో పూజలు చేసి, " రామ రామ " అంటూ ఆయన ఒళ్ళు ముట్టుకుని పరవశించిపోయారు. హనుమంతుడు ఆనందంతో నాట్యం చేశాడు. 


రావణుడు రథం మీద నుంచి కింద పడిపోయేసరికి అక్కడున్న రాక్షసులు పరుగులు తీశారు. వానరాలన్నీ కనపడ్డ రాక్షసుడిని వెంట తరిమి సంహరించారు. 

ఆకాశంలో దేవతలందరూ పొంగిపోయి రాముడిని పొగిడారు .
రావణుడు ఆ రణభూమిలో నిహతుడై పడిపోగానే విభీషణుడు ఏడుస్తూ ఆయన దెగ్గరికి పరిగెత్తాడు. అప్పుడాయన అన్నాడు " అన్నయ్యా! ఆనాడే నేను నీకు చెప్పాను ' యుద్ధానికి వెళ్ళవద్దు, తప్పు చేసింది నువ్వు, నీ తప్పు నువ్వు దిద్దుకో ' అన్నాను. కాని నువ్వు నా మాట వినలేదు. ఆ వినకపోవడం వల్ల ఈనాడు ఎలా పడిపోయి ఉన్నావో చూశావ. ఆ రోజున దర్పంతో ప్రహస్తుడు, ఇంద్రజిత్, కుంభకర్ణుడు, అతిరధుడు, అతికాయుడు, నరాంతకుడు నా మాట వినలేదు. మా అన్నయ్య జీవించి ఉన్నంతకాలం ఎందరికో దానాలు చేశాడు, గొప్ప అగ్నిహోత్రాలు నిర్వహించాడు, మిత్రధర్మాన్ని నెరపి స్నేహితులకి కానుకలు ఇచ్చాడు, భూరి దానాలు చేశాడు, శత్రువుల గుండెల్లో నిద్రపోయాడు. ఇన్ని చేసినవాడు ఇవ్వాళ కేవలం కిందపడిపోయి, ఎందుకూ పనికిరానివాడిగా చేతులు భూమికి ఆన్చి, నోరు తెరిచి ఉండిపోయాడు. శాంతి పొందిన అగ్నిహోత్రంలా ఉన్నావాన్నయ్య " అని ఏడిచాడు.
  
అప్పుడు రాముడు " విభీషణ! నీ కొక మాట చెబుతాను. నీ అన్నయ్య యుద్ధం చెయ్యడానికి బెంగ పెట్టుకోలేదు, భయపడలేదు, ఉత్సాహంతో యుద్ధం చేసి పడిపోయాడు. ఒక వీరుడు ఎలా పడిపోవాలని కోరుకుంటాడో మీ అన్నయ్య కూడా అలానే పడిపోయాడు " అన్నాడు.

అప్పడు అంతఃపురం నుండి కొన్ని వేల అంతఃపుర కాంతలు పరిగెత్తుకుంటూ వచ్చి " రావణ! నువ్వు వెళ్ళిపోయావు, నీతో పాటు మా అయిదోతనము వెళ్ళిపోయింది, భోగము వెళ్ళిపోయింది. ఇంత గొప్పవాడివి ఒక మనుష్యుడి చేతిలో మరణించావు " అన్నారు.

ఆ సమయంలోనే అక్కడికి మేలి ముసుగు తీసేసి పరిగెత్తుకుంటూ రావణుడి పట్టమహిషి అయిన మండోదరి వచ్చి, రావణుడిని కౌగలించుకొని " ఇవ్వాళ నేను మేలి ముసుగు లేకుండా పరిగెత్తుకొచ్చానని కోపం తెచ్చుకోకు. నువ్వు దేవతలందరినీ ఓడించావు, ఎందరినో తరిమికొట్టావు, దుర్భేద్యమైన కాంచన లంకని నిర్మించవు, 10 తలలతో 20 చేతులతో ప్రకాశించావు, గొప్ప తపస్సు చేసి చివరికి ఒక మనుష్యుడి చేతిలో మరణించావు. ఆ రోజు హనుమంతుడు ఈ సముద్రాన్ని దాటి ' నీ పది తలకాయలు ఇప్పుడే గిల్లేస్తాను, కాని రాముడు నిన్ను చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు కనుక వదిలేస్తున్నాను ' అని, లంకని కాల్చి వెళ్ళిపోయాడు. ఒక్కడే అలా వచ్చి లంకని నాశనం చేసి వెళ్ళిపోతే నీ మనస్సులో శంక కలగలేదు. నీ జీవితానికి ప్రమాదం వస్తుందని నువ్వు ఆలోచించలేదు. కోతులంటే చపల బుద్ధికి పెట్టింది పేరు, అలాంటి కొన్ని కోట్ల కోతుల్ని రాముడు వెంట పెట్టుకుని సముద్రానికి సేతువు కట్టించి దాటి వచ్చాడు, నీకు అప్పుడైనా అనుమానం రాలేదా. ఒక మనుష్యుడైన రాముడి చేతిలో చనిపోయావ " అని పక్కకి తిరిగి రాముడిని చూసింది. 

రాముడిని చూడగానే మండోదరి అనింది " ఈయన మనుష్యుడు కాదు, సనాతనమైన పరమాత్మ. నిన్ను నిగ్రహించడానికి వచ్చిన శ్రీ మహావిష్ణువు. దేవతలందరి నీ వానర రూపాలు ధరింప చేసి, వాళ్ళని వెంట బెట్టుకుని, శంఖ చక్ర గదా పద్మములను పట్టుకున్న శ్రీ మహావిష్ణువు వచ్చాడు. రాముడిని ఇన్ని సార్లు చూసినా నీకు వచ్చింది విష్ణువు అని ఎందుకు అర్ధం కాలేదు రావణా!. నువ్వు రాముడి చేత సంహరింపబడ్డావని లోకం అనుకుంటుంది, నువ్వు ఎందువల్ల చనిపోయావో నాకు తెలుసు. ఒకప్పుడు నువ్వు తపస్సు చెయ్యాలనుకొని నీ ఇంద్రియాలని బలవంతంగా తొక్కి పెట్టావు. అప్పుడు నీ ఇంద్రియాలు నీ మీద పగబట్టాయి. అందుకని నిన్ను చంపింది రాముడు కాదు, నీ ఇంద్రియాలే నిన్ను చంపాయి. 


ఒక్కసారి కామం పుట్టింది అనడానికి నీ విషయంలో ఆస్కారం లేదు. మహా సౌందర్యరాసులైన భార్యలు నీకు కొన్ని వేల మంది ఉన్నారు, వారితో నువ్వు ఎవరితో క్రీడించినా నీ కామము అదుపులో ఉంటుంది. ఎక్కడో అరణ్యంలో ఉన్న సీతమ్మ యందు కామం పుట్టి ఆవిడని నువ్వు అనుభవించడం కాదు, నువ్వు, నీ రాజ్యము, నీ వారు భ్రష్టమవ్వడం కోసం నీకు ఆ కోరిక పుట్టింది. దుర్మతి! నీకు సీతమ్మ ఎవరో అర్ధం కాలేదు, ఆవిడ రోహిణి కన్నా, అరుంధతి కన్నా గొప్పది. తన భర్తని అనుగమించి వచ్చిన ఇల్లాలిని ఒంటరిగా ఉన్నప్పుడు ఎత్తుకొచ్చావు, ఆ తల్లి తేజస్సు నిన్ను కాల్చింది. నీకు ఎన్నోసార్లు చెప్పాను, ఆ తల్లిని తేవడం వల్ల నువ్వు పొందే సుఖం ఏమి లేదు, నాశనం అయిపోతావని చెప్పాను. నువ్వు చేసుకున్న పూర్వ పుణ్యముల వల్ల కాంచన లంకని అనుభవించావు, ఎన్నో సుఖాలు పొందావు, కాని సీతమ్మని తీసుకొచ్చి ఇంట్లో పెట్టడం వల్ల ఆ పాపాన్ని అనుభవించాల్సి వచ్చి ఈనాడు పడిపోయావు. విభీషణుడు పుణ్యాలు చేశాడు, సీతమ్మ ఎవరో తెలుసుకున్నాడు, ఆ పుణ్య ఫలం ఇవ్వాళ విభీషణుడికి అనుభవంలోకి వచ్చింది, బతికిపోయాడు.

రావణా! సీత నాకన్నా గొప్ప కులంలో పుట్టిందా, నాకన్నా గొప్ప రూపవతా,  నాకన్నా గొప్ప దాక్షిణ్యం ఉన్నదా, సీత నాకన్నా ఎందులో గొప్పది? కాని నీ దురదృష్టం, నాకన్నా సీత నీకు గొప్పదిలా కనపడింది. నా తండ్రి దానవ రాజైన మయుడు, నా భర్త లోకములను గెలిచిన రావణుడు, నా కుమారుడు ఇంద్రుడిని జయించిన మేఘనాధుడు, నేనున్నది కాంచన లంకలో అని అహంకరించాను, కాని ఇది నిలబడలేదు, అబద్ధమయిపోయింది. ఇవ్వాళ నాకు కొడుకు లేడు, భర్త లేడు, రాజ్యం లేదు, బంధువులు లేరు, నీకు తలకొరివి పెట్టడానికి ఒక్క కొడుకూ లేడు. నువ్వు మహాపాతకం చెయ్యడం వల్ల 10 రోజులలో నా పరిస్తితి ఇలా అయిపోయింది. మహా పతివ్రత అయిన స్త్రీ ఏ ఇంటికన్నా వచ్చి కన్నీరు పెడితే, ఆ కన్నీరు కిందపడితే, ఆ ఇల్లు నాశనమయిపోతుంది " అని బాధపడింది. ( ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, పతివ్రత అయిన వేరొకడి భార్య నేను చేసిన పని వల్ల ఏడవడం కాదు, నా భార్య నేను చేసిన పని వల్ల ఏడిచినా, ఆ పాపం వల్ల నేను నశించిపోతాను)

అప్పుడు రాముడు " ఆవిడ చాలా శోకించింది, ఆవిడని లోపలికి తీసుకువెళ్ళండి. రావణుడి కొడుకు లందరూ చనిపోయారు కనుక, ఈ శరీరానికి చెయ్యవలసిన కార్యాన్ని విభీషణ నువ్వు చెయ్యి " అన్నాడు.


అప్పుడు విభీషణుడు " రామ! మీరు ఏమైనా చెప్పండి, వీడు బతికున్నంత కాలం వీడి జీవితంలో ధర్మం అన్న మాటే లేదు, బతికున్నంత కాలం పర స్త్రీల వెంట తిరిగాడు, ఇటువంటి వాడికి అంచేష్టి సంస్కారం ఏమిటి? ఆ శరీరాన్ని అలా వదిలేద్దాము " అన్నాడు.

అప్పుడు రాముడు " విభీషణ! అవతలివాడు ఏ శరీరంతో ఇన్ని పాపాలు చేశాడో ఆ పాపాలన్నీ ఆ శరీరంతోనె వెళ్ళిపోయాయి. అందుకని ఇంక వైరం పెట్టుకోకూడదు. ఆ శరీరానికి సంస్కారం చెయ్యకపోతే వాడు ఉత్తమ గతులకి వెళ్ళడు. ఒకవేళ నువ్వు ' చెయ్యను ' అంటె, నువ్వు నాకు స్నేహితుడివి కదా, స్నేహితుడి అన్నయ్య నాకూ అన్నయ్యే కదా, నువ్వు చెయ్యకపోతే ఆయనని అన్నగారిగా భావించి నేను సంస్కారం చేస్తాను " అన్నాడు.

అప్పుడు విభీషణుడు రావణుడికి అంచేష్టి సంస్కారం చేశాడు. ఆ తరువాత ఆకాశంలో ఉన్న దేవతలందరూ మెల్లగా ఒకరి తరువాత ఒకరు వెళ్ళిపోయారు. 

Thursday, 9 August 2012

రామాయణం @ కధ -93


అగస్త్యుడు అన్నాడు " ఈ ఆదిత్య హృదయాన్ని చదువు, నువ్వు నీ సర్వ శత్రువులని జయిస్తావు, నీ శత్రువులని దునుమాడేస్తావు, నీ కోరికలన్నీ సిద్ధిస్తాయి. రావణుడు నీ చేతిలో నిహతుడు  అవుతాడు " అన్నాడు. 


రాముడు ఆ ఆదిత్య హృదయాన్ని మూడు సార్లు చదివాక అగస్త్యుడు వెళ్ళిపోయాడు. 



ఆ తరువాత రావణుడు నల్లటి గుర్రాలు కట్టి ఉన్న తన రథం మీద యుద్ద భూమికి తీవ్రమైన వేగంతో వచ్చాడు. 

అప్పుడు రాముడు " మాతలి! ప్రతిద్వంది వస్తున్నాడు. చాలా జాగ్రత్తగా ఉండు, ఎంత మాత్రం పొరబడకు. రథాన్ని కుడి చేతి వైపుకి తీసుకువెళ్ళు. నేను నీకు చెప్పాను అని మరోలా అనుకోకు, నువ్వు ఇంద్రుడికి సారధ్యం చేస్తున్నవాడివి, నీకు అన్నీ తెలుసు. కాని నీ మనస్సునందు ధైర్యం ఉండడం కోసమని ఈ మాట చెప్పాను. వేరొకలా భావించకు " అన్నాడు.

ఆ యుద్ధ భూమిలో ఒకరికి ఎదురుగా ఒకరి రథాలని నిలబెట్టారు. ఆకాశంలో దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, ఋషులు, మహర్షులు, బ్రహ్మర్షులు అందరూ నిలబడి " రాముడు ఈ యుద్ధంలో గెలవాలి, రావణ సంహారం చెయ్యాలి " అని స్వస్తి వాచకం చేస్తున్నారు. 


రావణుడు యుద్ధ భూమిలోకి వచ్చి నిలబడుతున్న సమయంలో ఆకాశం నుండి రక్త వర్షం కురిసింది, అదే సమయంలో మండలాకారంలో గాలులు తిరిగాయి, ఆకాశంలో గ్రద్దలు తిరుగుతూ వచ్చి ఆయన ధ్వజం మీద వాలాయి, నిష్కారణంగా అక్కడున్న భూమి కదిలింది, ఆకాశంలో మేఘాలు లేకుండానే రాక్షస సైన్యం వైపు పిడుగులు పడ్డాయి, ఆకాశం నుండి ఒక తోకచుక్క రావణుడి రథం మీద పడింది, రాక్షసులు తమ ఆయుధములను ప్రయోగిద్దామని చేతులు పైకి ఎత్తుతుంటే ఎవరో వచ్చి పట్టుకున్నట్టు చేతులు ఆగిపోయాయి, లంకా పట్టణం అంతా కాలిపోతున్నట్టు ఎర్రటి కాంతిని పొందింది, ఇళ్ళల్లో ఉన్న గోరువంకల మీద రాబందులు వచ్చి దాడి చేశాయి, సూర్యమండలం నుంచి ఎర్రటి, తెల్లటి, పసుపు, ఆకుపచ్చ రంగులతో కూడిన కిరణాలు రావణుడి మీద పడ్డాయి, నిష్కారణంగా గుర్రాలు ఏడిచాయి, నక్కలు పెద్ద పెద్ద కూతలు కూశాయి, క్రూరమైన మృగాలు రావణుడి ముఖాన్ని చూస్తూ పెద్దగా అరిచాయి.


రామ-రావణ యుద్ధం ప్రారంభం అవ్వగానే అప్పటిదాకా కొట్టుకున్న వానరులు, రాక్షసులు ఒకరి పక్కన ఒకరు నిలబడి అలా చూస్తుండిపోయారు. రాముడు, రావణుడు ప్రయోగించిన బాణాలకి ఆకాశం అంతా చీకటి అయిపోయి, ఆకాశంలో గుద్దుకుంటున్న బాణముల మెరుపులే కనపడుతున్నాయి. అప్పుడు రావణుడు కొన్ని బాణములని రాముడి రథం యొక్క ధ్వజం మీదకి ప్రయోగించాడు. ఆ రథం యొక్క శక్తి చేత రావణుడు వేసిన బాణములు నిర్వీర్యం అయిపోయాయి. తరువాత రాముడు వేసిన బాణములకి రావణుడి ధ్వజం విరిగిపోయి నేలమీద పడిపోయింది. ఆ తరువాత రావణుడు బాణములతో రాముడి రథాన్ని లాగుతున్న గుర్రాలని కొట్టాడు. కాని ఆ గుర్రాలు రావణుడి బాణాలు తగిలినా కనీసం కదలను కూడా కదలలేదు. రావణుడు వేస్తున్న మాయతో కూడిన బాణముల నుంచి కొన్ని వేల రోకళ్ళు, పర్వతములు, వృక్షాలు, రోళ్ళు, చిత్ర విచిత్రమైనవన్నీ పుట్టి రాముడి రథం మీద పడిపోతున్నాయి. రావణుడి అన్ని బాణములకు సమాధానంగా రాముడు బాణ ప్రయోగం చేసి రావణుడి సారధిని, గుర్రాలని, ధ్వజాన్ని కొట్టాడు. 


వాళ్ళిద్దరూ చేస్తున్న యుద్ధానికి సముద్రాలన్నీ క్షోభించాయి, నదులు గట్లు దాటి ప్రవహించాయి, భూమి అంతా కదిలిపోయింది, సూర్యమండలం అంతా ధూమముతో ఆవహించబడి ఉంది, బ్రహ్మాండములో ఉన్న సర్వ భూతములు కలత చెందాయి.

గగనం గగనాకారం సాగరం సాగరోపమం
రామ రావణయోర్యుద్ధం రామరావణయోరివ


ఆ భయంకరమైన యుద్ధాన్ని వర్ణిస్తూ వాల్మీకి మహర్షి " ఆకాశానికి ఆకాశమే పోలిక, సముద్రానికి సముద్రమే పోలిక, రామ-రావణ యుద్ధానికి రామ-రావణ యుద్ధమే పోలిక " అన్నారు.  



అప్పుడు రాముడు విషంతో కూడిన సర్పం వంటి బాణమును తీసి, వింటినారికి సధించి, రావణుడి కంఠానికి గురిచూసి విడిచిపెట్టాడు. ఆ బాణం తగలగానే రావణుడి ఒక శిరస్సు తెగిపోయి భూమి మీద పడిపోయింది. ఆ శిరస్సు అలా పడిపోగానే మళ్ళి ఒక కొత్త శిరస్సు మొలకెత్తింది. మళ్ళి బాణం పెట్టి ఇంకొక శిరస్సుని రాముడు కొట్టాడు, అది కూడా మొదటి దానిలాగానే కిందపడిపోయింది, కాని మళ్ళి కొత్త శిరస్సు పుట్టింది. అలా రాముడు మొత్తం 100 సార్లు రావణుడి సిరస్సులని కొట్టాడు.    



అప్పుడు రాముడు అనుకున్నాడు ' ఈ బాణంతో మారీచుడిని, ఖరుడిని, దూషణుడిని, వాలిని సంహరించాను. ఈ బాణానికి ఎదురులేదు, ఈ బాణంతో ఇప్పటికి నూరు తలకాయలు భూమి మీద పడేశాను. కాని ఈ బాణం రావణుడి చంపలేక పోతుంది ' అని అనుకున్నాడు.

వాళ్ళిద్దరి మధ్య ఆ యుద్ధం 7 రాత్రులు7 పగళ్ళు, ఒక్క క్షణం కూడా విరామం లేకుండా జెరిగింది. ఆకాశం అంతా దేవతలు, ఋషులు మొదలైన వాళ్ళతో నిండిపోయింది. 

అప్పుడు మాతలి " రామ! 7 రాత్రులు 7 పగళ్ళ నుంచి యుద్ధం చేస్తున్నావు. దేవతలందరూ రావణుడి శిరస్సు పడిపోయే ముహూర్తాన్ని నిర్ణయించిన సమయం ఆసన్నమయిపోయింది. అగస్త్యడు ఇచ్చిన దివ్యమైన అస్త్రం నీ యొక్క బాణతుణీరంలో ఉంది, దానిని బయటకి తీసి అభిమంత్రించి విడిచిపెట్టు " అన్నాడు.

అప్పుడు రాముడు ఆ అస్త్రాన్ని బయటకి తీస్తుంటే, అది పుట్టలోనుంచి బయటకి వస్తున్న బ్రహ్మాండమైన సర్పంలా ఉంది. లోకాలని రక్షించమని ఆ అస్త్రాన్ని బ్రహ్మగారు దేవేంద్రుడికి ఇచ్చారు. ఆ అస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెట్టగానే అది వాయు వేగంతో వెళ్ళిపోతుంది, దానికున్న బంగారు ములుకులో అగ్ని, సూర్యుడు ఉంటారు, దాని శరీరం బ్రహ్మమయం అయ్యి ఉంటుంది, సుర్యుడి వంటి తేజస్సుతో ఉంటుంది, ధూమంతో నిండిపోయిన కాలాగ్నిలా ఉంటుంది. ఆ బాణం ఇంతక ముందు ఎన్నో పర్వతాలని చీల్చుకుంటూ, ద్వారాలని బద్దలుకొడుతూ, పరిఘలని విరుచుకుంటూ, ఎందరో రాక్షసుల గుండెల్ని బేధించుకుంటూ వెళ్ళింది. దాని ఒంటి మీద కొంచెం రక్తం, కొవ్వు ఉంటాయి. ఆ బాణం ఇంతక ముందు ఎక్కడెక్కడ ప్రయోగింపబడిందో అక్కడ వెంటనే డేగలు, గ్రద్దలు, రాబందులు, నక్కలు, క్రూరమృగాల గుంపులుగా వచ్చి చనిపోయిన శత్రువుల మాంసాన్ని తినేవి. 


రాముడు ఆ బాణాన్ని చేతితో పట్టుకుని దానిమీద వేదప్రోక్తంగా బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించాడు. ఆయనలా బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించేసరికి భూమి అంతా కంపించింది. అప్పుడాయన ఆ బాణాన్ని వింటినారికి తగిలించి, చెవి వరకూ లాగి, పరమాత్మని స్తోత్రం చేస్తూ, శత్రువు నిగ్రహింపబడాలని కోరుకుంటూ విడిచిపెట్టాడు. ఆ బాణం ఒక్క క్షణంలో భయంకరమైన ధ్వనిని చేస్తూ, లోకాలన్నిటినీ క్షోభింప చేస్తూ, ఇంతకాలం ఏ రావణుడు లోకములన్నిటినీ పీడించాడొ, ఆ రావణుడి గుండెల్ని బద్దలు చేస్తూ ఆయన వక్షస్థలం నుండి దూసుకు వెళ్ళింది. 

రావణుడి చేతిలో ఉన్న ధనుస్సు, ఆయుధములు కింద పడిపోయాయి, ప్రాణాలు విడిచిపెట్టేసి ఆ శరీరంతో కింద పడిపోయాడు. 

రావణాసురుడు మరణించాడు